ఆరోజు కార్యక్రమాలు పూర్తి చేసుకుని యమధర్మరాజు తన భార్య ఊర్మిళతో పడక గదిలో శయనించి ‘నీ పేరు కామాక్షి అయితే నా పేరు విశాలాక్షి’ సీరియల్ చూస్తున్నాడు.
చిత్రగుప్తుడు నెమ్మదిగా తలుపు తట్టేడు.
అసహనంగా యమధర్మరాజు బయటకు వచ్చి “ఏమిటి సంగతి. వేళాపాళ లేదా” అని విసుకున్నాడు.
“మరేంలేదు ప్రభూ! కన్యాశుల్కం గిరీశంగారు మీతో ఏదో ఏకాంతంగా చర్చించాలటా”.
“నాతోనా” అని యమధర్మరాజు ఆశ్చర్యంగా అన్నాడు.
“ఇంద్రుడు, శచీదేవి, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమతో ఒక సినెమాని అన్ని ప్రముఖ భాషలలో తీస్తాడుట; మధురవాణితో చర్చిస్తుంటే విన్నాను.”
“ఇదేదో ఉత్సాహంగా ఉందే” అని “ఆదివారం ఊర్మిళ పుట్టింటికి వెళుతోంది. ఆదివారం నా ఏకాంత మందిరానికి తీసుకురా” అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు యమధర్మరాజు.
“హమ్మయ్య” అని నిట్టూర్చాడు చిత్రగుప్తుడు.
***
ఆరోజు ఆదివారం. ఏకాంతమందిరంలో యమధర్మరాజు ఒక సోఫాలాంటి ఆసనంపై కూర్చొని ఉన్నాడు. చిత్రగుప్తుడు, గిరీశం లోపలికి వచ్చి మర్యాదపూర్వకంగా నమస్కరించారు.
“రండి గిరీశంగారు” అని మర్యాదగా పలుకరించేడు యమధర్మరాజు. గిరీశంకి యమధర్మరాజుని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి.
“సెలవీయండి గిరిశంగారు” అని నెమ్మదిగా అన్నాడు యమధర్మరాజు.
“మీ సిఫారస్ కావాలి మహాప్రభో” అని అన్నాడు గిరీశం
“మాకు అర్థం కాలేదు, కొంచెం వివరించగలరా” అని అన్నాడు యమధర్మరాజు.
“అన్ని ప్రముఖ భాషలలో ఇంద్రుడు, శచీదేవి, రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ ప్రముఖ తారాగణంగా ఒక సినెమా తీద్దామనుకుంటున్నాను. మీరు నన్ను ఇంద్రుడు దగ్గరికి సిఫారస్ చేస్తూ పంపించాలి.” అని మొహమాటంగా చెప్పేడు గిరీశం.
“సినెమా పేరు” అని అడిగేడు యమధర్మరాజు.
గిరీశం కొంచెం భయపడుతూ ‘క్షణం క్షణం అన్వేషణ’ అని చెప్పేడు.
“ఇవి ఏవో పాత సినెమ పేరులుగా తోస్తున్నాయి” అని అన్నాడు యమధర్మరాజు.
చిత్రగుప్తుడు జోక్యం కలుగజేసుకుంటూ “ఇవి చిత్రసీమలో పరిపాటే మహాప్రభూ” అని గిరిశాన్ని సమర్థించేడు.
“కథ సారాంశం ఏమిటి” అని అడిగేడు యమధర్మరాజు.
“‘యమునా తీరమున సంధ్యా సమయమున లాహిరి లాహిరి లాహిరిలో’ అని ఇంద్రుడు శచీదేవి నౌకా విహారం చేస్తుంటే గౌతముడు ఆలిబాబా నలభై దొంగల సహయంతో ఇంద్రుడిని తాజ్‌మహల్‌లో శచీదేవిని ఆగ్రా ఫోర్ట్‌లో బంధిస్తాడు. ఆ ప్రక్కనే ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో ‘జలకాలాటలలో కల కల పాటలో’ అనే రీమిక్స్ పాటతో ఆనందిస్తున్న రంభ, మేనక, ఊర్వశి తిలోత్తమ వారిని విడిపించుకొని స్వామి భక్తి నిరూపించుకొవాలని ప్రతిజ్ఞ చేస్తారు. వారు నలుగురు ఒక యువ పోలీస్ ఆఫీసర్ జంట సహాయంతో ఎలా విడిపిస్తారన్నదే కథ” అని క్లుప్తంగా వివరించేడు గిరీశం.
“శచీదేవికి ఆలీబాబా కాపలా ఉంటాడు. ఆలీబాబా భార్య అమర ఇంద్రుడుకి కాపలా ఉంటుంది. అమర ఆలిబాబాని తలచుకుంటూ, ఇంద్రుడు శచీదేవిని తలచుకుంటూ ఒక కొత్త తరహ విరహ గీతాన్ని చిత్రీకరించాలని అనుకుంటున్నాను.” అని గిరీశం మరల చెప్పేడు.
“సంగీత దర్శకత్వం ఎవరు వహిస్తారు?” అని అడిగేడు యమధర్మరాజు.
“మధురవాణి సంగీత నృత్య దర్శకత్వం వహిస్తుంది మహాప్రభు” అన్నాడు గిరీశం
“బాగు బాగు” అని యమధర్మరాజు హర్షం వ్యక్తం చేసాడు.
‘నాదొక చిన్న కోరిక, మరోలా అనుకోనంటే చెపుతాను” అన్నాడు యమధర్మరాజు.
“సెలవీయండి, నా దగ్గర దాపరికం ఎందుకు!” అని అడిగేడు గిరీశం.
“నాకు ఒక వేషం ఇవ్వగలవా. నాకు సాయి పల్లవితో గాని, కీర్తి సురేష్‌తో గాని బాలు పాడిన ‘ఓ చిన్నదాన’ పాట రిమిక్స్ ఒక పాటని చిత్రీకరించాలి.” అని ముసి ముసి నవ్వు నవ్వేడు యమధర్మరాజు. గిరీశం గొంతులో పచ్చి వెలక్కాయి పడినట్టయింది.
“ఈ చిత్రానికి నిర్మాత ఎవరు?” అని అడిగేడు యమధర్మరాజు.
“రామచంద్రాపురం అగ్రహారంలో అతని భూములు అమ్మి లుభ్ధావధానులు; ఈ సినెమాని నిర్మాణం చేపడదామని అనుకుంటున్నారు ప్రభు!” అని చెప్పేడు గిరీశం.
“మహాప్రభు! ఈ చిత్రము ద్వారా గిరీశంగారు తన ప్రియ శిష్యుడు వెంకటేశం, అతని కూతురు గిరిజని నూతన జంటగా పరిచయం చేస్తున్నారు” అని చిత్రగుప్తుడు యమధర్మరాజు చెవిలో మెల్లగా గుసగుసలుగా చెప్పేడు.
“నీవు స్క్రిప్ట్ మొత్తం తయారుచేసి నాకు చూపించు. అది పూర్తిగా చదివి అప్పుడు నేను ఇంద్రుడుకి సిఫారస్ చేస్తూ నిన్ను స్వర్గలోకానికి పంపించే యేర్పాట్లు చేస్తాను.” అని యమధర్మరాజు హామీ ఇచ్చాడు.
‘బ్రతుకు జీవుడా’ అనుకుని బయటకు వచ్చాడు గిరీశం.
“నాదొక విన్నపము గిరీశం” అని చిత్రగుప్తుడు అడిగేడు.
“మీకు కూడా ఒక వేషం కావాలా!” అని గిరీశం అడిగేడు.
“నాకు ప్రొడక్షన్ మేనేజర్” అని చెప్పేడు చిత్రగుప్తుడు.
“అలాగే” అని గిరీశం హామీ ఇచ్చాడు.
తోటలో ఎవరూ లేని చోట చుట్ట కాలుస్తు ఆలోచిస్తున్నాడు గిరీశం. అంతలో పూటకూళ్లమ్మ వచ్చి “గిరిశం నన్ను నీవు చీపురుతో కొట్టిన్నందుకు క్షమిస్తానంటే ఒకటి అడుగుతాను” అంది.
“ఎంత మాట. నేను ఏమి గుర్తు పెట్టుకోను. అడుగు” అని మెల్లగా అన్నాడు. అతని కళ్లు పూటకూళ్లమ్మ పొడుగాటి జడ పైన పడ్డాయి.
“యమలోకం తిండి నీ వంటికి బాగానే పడినట్టుంది” అని అన్నాడు గిరీశం.
పూటకూళ్లమ్మ మురిసిపోయింది.
“నాకు నీ సినెమా షూటింగ్ సమయంలో కేటరింగ్ కాంట్రాక్ట్ ఇస్తావా!” అని మెల్లగా అడిగింది పూటకూళ్లమ్మ.
“తప్పకుండా. నువ్వు అడగడం నేను కాదనడమూనా?” అని అన్నాడు గిరీశం.
***
ఆరోజు రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ హొటల్ స్విమ్మింగ్ పూల్‌లో చిత్రీకరించదలచిన పాట రిహార్సల్ చేయిస్తున్నాడు గిరీశం.
రంభ తిలోత్తమకి మధురవాణి నేపథ్యం; మేనకకి బుచ్చమ్మ, ఊర్వశికి మీనాక్షి పాడుతున్నారు.
కరటకశాస్త్రి కీ-బోర్డ్, అతని శిష్యుడు మహేశం పాడ్స్ వాయిస్తున్నారు. గిరీశం విరచించిన ‘జలకాలాటలలో రంగు రంగుల బికినీలతో కల కల్ పాటలతో చెంగు చెంగున గెంతులతో’ పల్లవి పాడుతున్నారు.
ఎవరూ చూడకుండా రామప్పపంతులు తన అయిఫోన్‌తో గిరీశం స్క్రిప్ట్ నుండి కొన్ని ముఖ్యమైన పేజీలను ఫొటోలు తీసి మెల్లగా జారుకున్నాడు.
గిరీశం, మధురవాణి; వెంకటేశం, గిరిజపై చిత్రీకరించదలచిన యుగళగీతం: “జున్ను ముక్క జున్ను ముక్క నేను కొరికితే సిగ్గా; మగధీర మగధీర నేను కసిరితే అలుకా” రిహార్సల్ పూర్తి చేసి భోజనాని డైనింగ్ హాల్‌కి వెళ్లేరు.
భోజనం మానేసి రామప్పపంతులు; ఫేస్‌బుక్, ట్విట్టర్, ఈ మెయిల్ ద్వారా కొన్ని పత్రికలకి టి.వి. చానెల్స్‌కి రహస్యంగా ఈ సినెమా విశేషాలను చేరవేసాడు.
రామప్పపంతులు ‘లీక్’ చేసిన ఈ సినెమా విశేషాలు కొన్ని టివి చానెల్స్‌ని విపరీతంగా అకట్టుకున్నాయి.
వెను వెంటనే చర్చా కార్యక్రమం మొదలుపెట్టేరు.
ఆ చర్చా కార్యక్రమములో జ్యోతిష్యుడు అలమండ అప్పయ్య శాస్రి, ఆస్ట్రో సైకాలజిస్ట్ కోరుకొండ సతీష్, మహిళాసంఘ సభ్యురాలు అగనంపూడి రత్నకుమారి, హేతువాది చక్రవర్తి రామానుజచారి, మారుమూల గ్రామములో పూజారిగా ఉంటున్న స్వామి ఆనందభట్, వెనుకబడిన జాతుల ప్రతినిధి నాతవరం బుల్లయ్యగారు పాల్గొన్నారు.
అందరికన్న ముందు రత్నకుమారి గట్టిగా అరుస్తూ “గిరీశంగారికి ఇంకా ఆడవాళపై మోజు తగ్గినట్టు లేదు. అప్సరసలను బికినీలలో చూపిస్తే ఆడవాళ్లు మహిళ సంఘాలు సహించేది లేదు.” అంది.
హేతువాది రామానుజాచారి జోక్యం కలుగజేసుకుంటూ; “రత్నకుమారిగారు, మాజీ ముఖ్యమంత్రి జయలలితగారు 1960లలోనే ‘మనుషులు-మమతలు’ అనే చిత్రములో బికిని వేసుకున్న సంగతి మరచిపోవద్దు” అని సమర్థించేడు.
బుల్లయ్యగారు ఆక్రోశిస్తు “మా వెనుకబడిన జాతులవాళ్లని ‘దొంగలు’గా చూపిస్తున్నారు. ఇది రెండు మతాలకి మధ్య తగాదాలకి దారి తీస్తుంది” అని అన్నారు.
మళ్లీ చక్రవర్తి కలుగచేసుకుంటూ “బుల్లయ్యగారు, దొంగలు అన్ని దేశాలలో, అన్ని మతాలలో అన్ని కులాల్లో ఉన్నారు. ఈ దొంగల వేషం ఎవరు వేస్తున్నారు.”
“దొంగరాముడు చిత్రములో స్వర్గీయ నాగేశ్వరరావుగారే అభినయించేరు. అంచేత మీ అభియోగానికి అర్థం లేదు. మన కాశ్మీర్‌లో మన జవాన్లును నిజ జీవితములో చంపుతున్నది ఎవరు. ముంబాయి ప్రసిధ్ధ హోటల్‌లో మన వాళ్లని చంపింది ఎవరు! అని మనం ప్రశ్నించుకోవాలి మరి” అని చక్రవర్తి అతనిని ఖండిచేడు.
జ్యోతిష్యుడు అప్పయ్య శాస్త్రి కలగజేసుకుంటూ “నవగ్రహాలు వక్ర బుధ్ధితో చూసినప్పుడే ఇటువంటి ఆలోచనలు కలుగుతాయి” అని విమర్శించేడు.
దానికి వంతలు పాడుతూ ఆస్ట్రో సైకాలజిస్ట్ సతీష్ కూడ ఏవో ఉదాహరణలు చెప్పేడు.
“అయ్యా శాస్త్రిగారు, మీరు చెప్పే నవగ్రహాలు విజ్ఞానశాస్త్రం ప్రకారం ఎనిమిది. అందులో సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం. ఎక్కడో చెప్పుకుంటున్న యమలోకంలోకి ఈ గ్రహాలు వెళ్లి గిరీశంగారి మెదడులో ఈ ఆలోచనలు కలుగచేస్తాయి అంటే నవ్వు వస్తుంది ఎవరికైనా. ఇంతకీ గిరీశం ‘కన్యాశుల్కం’ నాటకంలో గురజాడ అప్పారావుగారు సృష్టించిన ఒక పాత్ర. పాత్రకి గ్రహాల ప్రభావం ఏమిటండీ బాబు” అని పగలబడి నవ్వాడు చక్రవర్తి.
“మన పురాణగాథలని వక్రీకరించి మన మతాన్ని కించపరుస్తున్నారు” అని పూజారి స్వామి ఆవేదన వ్యక్తం చేసారు.
“మన సనాతన ధర్మాన్ని ప్రక్కన పెట్టి దేవుని పేరిట కథలు కల్పితం చేసి నిరాక్షరాసులని కథలతో అజ్ఞానులని చేసినది ఈ మతవాదులు కాదా?” అని చక్రవర్తి ఎదురు సవాల్ వేసాడు.
“మాయాబజార్, దేవాంతకుడు, యమలీల, యమగోల, యముడికి మొగుడు వంటి ఎన్నో వినోదాత్మక చిత్రాలు ఎక్కడా ధర్మాన్ని కించపరచకుండా తీసారు. సినెమాని చూడకుండా ఇలా అభియోగాలు చేయడం మన ప్రాథమిక హక్కులకే అవమానం” అని చక్రవర్తి గట్టిగా అరిచినంత పని చేసాడు.
చర్చ వ్యక్తిగత ధూషణలకి దారి తీస్తోంది అని గ్రహించి “సినెమా విడుదలయ్యాక మిగతా విషయాలు చర్చించుకుందాం” అని యాంకర్ స్వర్ణలత అ చర్చని ముగించింది.
***
మర్నాడు కొందరు అవకాశవాదులు; నిరుద్యోగలకు డబ్బులిచ్చి “గిరీశం ప్లగారిజం, పేరడీ, అసభ్యత, అశ్లీలత డౌన్ డౌన్” అని ప్రచారం చేసారు. తము ఎక్కడ నష్టపొతామేమోనని కొందరు నిర్మాతలు గిరీశంగారి సినెమా దేశంలో విడుదల కాకుండా చూడలని ప్రతిపక్ష సభ్యులకు విరాళాలు ఇచ్చి శాసన సభలో సమస్య చేయమని ప్రాధేయపడ్డారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ రాష్ట్ర నగరాలకి కూడా ఈ ఉద్యమం ప్రాకింది. అన్ని ప్రముఖ రాష్ట్రాలలో ప్రభుత్వం అధికార పక్షాలు గిరీశంగారి చిత్రం బహిష్కరించడానికి నిరాకరించాయి. విపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాయి.
వెంకటేశం ప్రముఖ హీరో అయిపోతే తమ సుపుత్రుల కెరియర్ దెబ్బ తింటుందేమోనని కొందరు నిర్మాతలు హైకోర్ట్‌లో ‘ప్రజాప్రయోజన వ్యాజ్యం’ ధాఖలు చేసేరు. గిరీశం ‘మా’ సభ్యులకు వివరణ ఇవ్వలని ఏక తీర్మానం ప్రకటించేరు. జూనియర్ ఆర్టిస్ట్స్ ఎసోసియేషన్ ప్రతినిధులు; ‘స్వర్గం నుండి యమలోకం నుండి కళాకారులను తీసుకు వస్తే చిత్రనిర్మాణాన్ని అడ్డుకుంటామ’ని ప్రదర్శనలు నిర్వహించేరు.
కేంద్ర సమాచార ప్రసార మంత్రి స్పందిస్తూ “సినెమా పరిశీలన సెన్సార్ బోర్డ్ అధికారం. ఏవైనా మార్పులు చేర్పులు కావలసి వస్తే ‘ట్రిబ్యునల్స్’ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే అవి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుందీ మాకు సంబంధం లేదు” అని ప్రెస్ మీట్ పెట్టి స్పష్టం చేసింది. ‘ప్రజల కాలాన్ని, ధనాన్ని ఇలా వృథా చేయవద్ద’ని మందలిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యంని హైకోర్ట్ త్రోసిపుచ్చింది.
విక్రమార్కుడు సమాధానంతో భేతాళుడు ఎలా సంతృప్తి చెందలేదో అలాగే కొందరు ప్రజలు తమ డబ్బుతో, పలుకుబడితో విపక్ష నేతలతో కలసి లోక్‌సభలో చర్చకి అనుమతించాలని స్పీకర్‌ని కోరేరు. దీనికి ఏమాత్రం స్పీకర్ ఒప్పుకోలేదు. గందరగోళ వాతవరణంలో అధికారపక్ష సభ్యులు వాక్ ఔట్ చేసారు.
ఈ విషయాన్ని ప్రతావించిన విపక్ష సభులకి రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. గత్యంతరం లేక కొందరు చిత్రనిరాతల ఖర్చులతో కొందరు విపక్ష సభ్యులు కలసి మౌంట్ అబు లోని స్టెర్లింగ్ రిసార్ట్స్ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని నిర్ణయాలు చేసారు.
- పాల్ బుల్లయ్య, సలీం అక్బర్, సంపూర్ణ త్యాగి, అందరిమంచి కౌసల్యదేవి కమిటీ సభ్యులు కలసి యమలోకం వెళ్ళి – యమధర్మరాజు సమక్షంలో అందరికీ యోగ్యమైన ఒక స్క్రిఫ్త్ చిత్రగుప్తుడు స్వహస్తాలతో విరచిస్తాడు.
- ఈ సభ్యుల ఖర్చులు లుభ్ధావధానులు భరించాలి.
- వీరికి కావలసిన సదుపాయాలు యమధర్మరాజు, ఊర్మిళ స్వయంగా చూసుకోవాలి.
- ఇక్కడ కళాకారులకే అవకాశం ఇస్తానని గిరీశం ఒక హామీ పత్రం సుప్రీం కోర్ట్‌లో స్వహస్తాలతో సంతకం చేసి సమర్పించాలి.
ఈ ఏక పక్ష నిర్ణయాలకి వాళ్ళలో వాళ్లే చప్పట్లు కొట్టుకొన్నారు.
ఈ నిర్ణయాలను బుల్లయ్యగారు ఈమెయిల్ ద్వారా యమధర్మరాజుకి తెలియచేస్తారు. ఊర్మిళ నుండి మెసేజ్ అనుకొని అర్థరాత్రి తృళ్లిపడి లేచి బుల్లయ్య గారి ఈమెయిల్ చదువుకొని ‘తనకి మంచి సినెమా అవకాశం పోయింది’ అని విచారించేడు.
తెల్లవారింది. చిత్రగుప్తుడు రాగనే ఈమెయిల్ ప్రింట్ తీసి గిరీశంకి ఇమ్మని చెప్పేడు.
గిరిశం ప్రతిస్పందన ఎలా వుంటుందో అని ఊహించుకున్నాడు.
చిత్రగుప్తుడు రాక గమనించి; “ఏమిటి చిత్రగుప్తా అల్లా డల్‌గా ఉన్నారు” అని ప్రశ్నించేడు గిరీశం.
“యమధర్మరాజుగారు ఇది మీకు ఇమ్మన్నారు” అని కాగితం అందించేడు.
చదువుకున్న గిరీశం “ఇది తప్పకుండా రామప్పపంతులు పనే, ఏదో చేసి ఉంటాడు. డామిట్ కథ అడ్డం తిరిగింది” అని చుట్ట వెలిగించేడు.
***
మా స్వస్థలం విజయనగరం, గురజాడగారికి ఎంతో ఋణగ్రస్థులం. వారికి ఒక హృదయ కుసుమాంజలి. – రచయిత