Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దర్శనం

“యద్భావం తద్భవతి. అదీకాక భగవంతుణ్ణి నమ్మి చేసే దర్శనం అనేది చిత్తాన్ని ఏకాగ్రం చెయ్యటానికి మంచి సాధన” అంటున్నారు జొన్నలగడ్డ సౌదామినిదర్శనం“కథలో.

కృష్ణుడు వెళ్ళటానికి అన్నీ సర్దుకున్నాడు. తినటానికి పెరుగన్నమూ, పులిహోరా మూటన కట్టుకుని, మంచి నీళ్ళు నింపిన తాబేటి బుర్రా, లేగదూడలని అదిలించే చేతి కర్రా సిద్ధంగా పెట్టుకున్నాడు. యశోదమ్మ వొచ్చి దిష్టి తగలకుండా ఉండేందుకు కాటుక చుక్క పెట్టి, నుదుటన కస్తూరి తిలకం దిద్ది, మెల్లిగా నెమలిపింఛం తలమీద సర్దింది. కాళ్ళకి గజ్జెలూ, చేతులకి కంకణాలూ పెట్టుకుని ఉన్న పిల్లవాడిని తల్లి యశోద దగ్గరకు తీసుకుని నుదుటన ముద్దుపెట్టి వొదలక పోతూ ఉంటే ” అమ్మా, పిల్లలందరూ వేచి చూస్తున్నారు” అని  కృష్ణుడు అన్నాడు. ఆయినా తల్లి ప్రేమ అనే మాతృత్వ భావనో, భువనైక సౌందర్య సాన్నిహిత్య మాధుర్య భావనో, తెలీదుకానీ యశోద పిల్లవాడిని వొదలకపోతూ ఉంటే కృష్ణుడే “మిగిలింది సాయంత్రం” అని తల్లి కౌగిలిని వొదిలించుకుని “వొస్తానమ్మా” అని బయలుదేరాడు. ఇంటి ముఖద్వారం నుండి బయటికి వొచ్చి కుడిపక్కకి ఇరవై అడుగులు వేసేప్పటికి నందుడి ఆవులకి ఏర్పరిచిన గోష్ఠం వొస్తే అందులోకి వెళ్ళి అక్కడ వేచి ఉన్న మిగతా పిల్లలందరితో కలిసి కృష్ణుడు ఆవులనీ, లేగదూడలనీ విప్పి తోలుతూ ఉంటే అవన్నీ సింహద్వారం నుంచి బయటికి వెళుతూ ఉంటే ముందర ఉండి వాటిని బలరాముడూ, తన మిత్రులూ భాండీరక వనం దారి పట్టించారు.

అన్నిటినీ తోలి నాలుగు అడుగులు వేసి సింహద్వారం దగ్గరికి వొచ్చాడు కృష్ణుడు. అక్కడ సింహద్వారం బయటే నిలబడి ఉన్న నారయ్యని చూసి నవ్వుతూ “బావున్నావా నారయ్య మావా” అంటూ దగ్గరికి వెళ్ళి పలకరించాడు. నారయ్య చిరునవ్వి తల ఊపాడు. కృష్ణుడు ” వొస్తా మామా, పనుంది” అంటూ వెళ్ళి పోయాడు. “నారయ్యా, కాసిని మజ్జిగ తాగి పోదువు గాని” అన్న యశోద మాటకి వొద్దని చేత్తో చెప్పి వెళ్లిపోయాడు నారయ్య.

నారయ్యది వ్రేపల్లెకి కోసెడు దూరంలో ఉన్న చిన్న పల్లె. చుట్టుపక్కల నాలుగు ఊళ్ళకి తనూ, తన అన్నయ్య భూమయ్యా కలిసి మంగళమైన మంగలి వృత్తిని నమ్మి జీవిస్తున్నారు. తల్లీతండ్రీ కొద్దిగా గోధనాన్నిచ్చి పోతే దాని సాయంతో, కుల వృత్తి సాయంతో అయిదుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి, నలుగురు మొగపిల్లల్ని పైకి తీసుకొచ్చిన మనిషి. రేపల్లె చుట్టుపక్కన ఉన్న పల్లెల్లో అన్ని శుభకార్యాలకీ నారయ్య సన్నాయి వాయిస్తుంటే భూమయ్య మద్దెల వాయించేవాడు.

అల్లాంటి నారయ్యని నాలుగేళ్ళ క్రితం కృష్ణుడు పుట్టంగానే జాతకర్మ రోజు సన్నాయి వాయించటానికి నందుడు పిలిపించాడు. అట్టాంటి అనేక కార్యక్రమాల్లో వాయించిన నారయ్య వెళ్ళి వాయించిన తరవాత, పిల్లవాడిని ఆశీర్వదించమని నందుడు పిలిస్తే అక్షింతలు తీసుకుని వెళ్ళిన నారయ్య చిన్న కృష్ణుణ్ణి మొదటిసారి చూశాడు. సమస్త సౌందర్య, సౌకుమార్య, సౌమంగళ్య సంక్షేపిత శారీరమూ, గంధఫలి తపోఫల శిఖరాయమాణ నాసికా, ప్రళయ వేళా సంభూత మహామీన నేత్ర సదృశ నేత్రాలూ, మహాపురుష లక్షణ లక్షిత దివ్య దేహమూ చూసి సమ్మోహితుడైపోయాడు. అప్పటినించీ ప్రతిరోజూ పనున్నా,లేకున్నా కోసెడు దూరమూనడిచి నంద గోకులంకి ఒక్క సారన్నా వొచ్చి పిల్లవాడిని చూడకుండా ఉండలేకపోయేవాడు.

ఎండొచ్చినా,వానొచ్చినా, వరదొచ్చినా, వంకొచ్చినా, నారయ్య రావాల్సిందే, పిల్లవాణ్ణి చూడాల్సిందే. మొదట “ఇదేంటి, పిల్లవాణ్ణి ఇట్లా వొచ్చి చూస్తున్నాడు నారప్ప” అనుకున్న నంద యశోదలు అలవాటై, వాకిట్లో నారప్పని చూడగానే పిల్లవాణ్ని గడప దాకా తీసుకొస్తే గడప అవతల నుంచుని చూసి వెళ్ళిపోయేవాడు. ఎత్తుకోమని ఎన్నిసార్లు ఇవ్వబోయినా దగ్గరికి కూడా వొచ్చేవాడు కాదు. కొద్దిగా పెద్దవాడైన తరవాత కృష్ణుడు నారయ్యని చూడగానే తనే “నారయ్య మామా” అంటూ దగ్గరకొచ్చినా ఉత్తినే చూసి వెళ్ళిపోయేవాడు గాని దగ్గరకు తీసేవాడు కాదు నారయ్య. నంద యశోదలకి ఇది చిత్రంగా తోచేది.

కృష్ణుడు పసివాడుగా ఉన్నప్పుడు నారయ్య తన పనులు తాను పూర్తి చేసుకుని ఏదో ఒక సమయంలో వొచ్చి చూసి వెళ్ళేవాడు. కొన్నాళ్ళు గడిచిన తరవాత నారయ్య భార్య సీతమ్మ ఒకసారి ఏకాంతంగా కూర్చోపెట్టి అడిగింది

“ఏమయ్యా, ఏమిటి రోజూ నందుడిగారి ఇంటికి వెళుతున్నావుట.”

“అవునే”

“దేనికి”

“వాళ్ళ పిల్లవాడిని చూడటానికి”

“వాళ్ళ పిల్లవాడిని చూడటానికి వాళ్ళున్నారు, మధ్యలో నువ్వెందుకు. నీ పిల్లల్ని నువ్వు చూసుకోవచ్చుగా? “

“వాడు అందరి పిల్లవాడు, అందమైన పిల్లవాడు”

“మనపిల్లలు అందంగాలేరా?”

“అదికాదే, వాణ్ణి చూస్తే మొన్న పంతులుగారు చెప్పింది గుర్తుకొస్తుందే”

“ఏంచెప్పాడు ఆయన.”

“అదే, యాజ్ఞవల్క్య మహర్షి తన భార్యతో ఓ మైత్రేయీ, ఈ ఆత్మని గురించి చూడు, విను, ఆలోచించు, ధ్యానించు అన్నాడని చెప్పాడు.”

“అయితే”

“ఈ పిల్లవాడే ఆ ఆత్మతత్త్వం అని అనిపిస్తుందే. వాణ్ణే ఎప్పుడూ చూడాలనిపిస్తోందే.”

“ఇట్లా వుంటే సంసారం ఏంగాను. పద ఆ పంతులుగారినే అడుగుదాం” అంది సీతమ్మ.

సాయంత్రం దంపతులిద్దరూ పంతులుగారి ఇంటికి వెళ్లారు. సీతమ్మ వాళ్ళువెళ్ళెటప్పటికి అక్కడ ఊరి పురోహితుడు భైరవ మూర్తి గారు ఆయన అక్క అయిన సీతారావమ్మ గారితో ఏదో వేదాంత చర్చ చేస్తున్నారు. కాసేపు వాళ్ళ వాదన నడిచింది. ఆప్పుడు సీతారావమ్మ గారు “ఆత్మావా అరే ద్రష్టవ్యో, శ్రోతవ్యో, మంతవ్యో నిదిధ్యాసితవ్యహ” అనే వాక్యం చదివి ఏదో చెప్పబోతూండగా నారయ్య “అమ్మా ఇప్పుడు చెప్పారే దాన్ని కాస్త అర్థం అయ్యేట్టు చెబుతారా” అన్నాడు. “ఓ మైత్రేయీ, ఆత్మని అనుభంలోకి తెచ్చుకో, ఆత్మని గురించి విను, ఆలోచించు, ఏకాగ్రతతో విచారణ చెయ్యి అని దాని అర్థం” అంది ఆవిడ.

“అమ్మా, నాకిదంతా ఎందుకు గానీ” అంటూ తమ మధ్య జరిగిన మాటలన్నీ వివరించి “అమ్మా, నాకు కృష్ణుడే మీరు చెప్పే ఆత్మతత్త్వం అనిపిస్తోంది. వాణ్ణి చూడటమూ, వాడినే చూస్తూ ఉండటమూ, నాకు సాధన అని అనిపిస్తోంది. ఏం చెయ్యమంటారు” అన్నాడు నారయ్య.

“దేహం ఆత్మ ఎలా అవుతుంది?” అంటున్న భైరవ మూర్తిని “నువ్వు ఆగు, నేను చెబుతాను” అని వారించి “నువ్వు అనుకుంటున్నది కూడా సత్యమే. నీ సాధన కొనసాగించు పరిపూర్ణంగా. నీ మనస్సుని ఏమాత్రం దారి తప్పనియ్యవద్దు. అయితే లౌకికం మర్చిపోకూడదు కాబట్టి పొద్దున ఒకసారీ, సాయంత్రం ఒకసారీ మాత్రమే నందుడి గారింటికి వెళ్ళాలి. అదీ ఒక విఘడియ మాత్రమే. మిగతా రోజంతా నీ పనులూ, భార్యా, పిల్లలూ” అన్నది సీతారావమ్మ గారు. నారయ్యా, సీతమ్మా ఇద్దరూ సంతోషించి దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయారు.

“అదేంటి అక్కయ్యా, అలాంటి శాస్త్రదూరమైన మాట చెప్పావు వాళ్ళకి.” అన్నాడు భైరవ మూర్తి. “శాస్త్రానికి దూరమూ లేదూ, దగ్గిరా లేదు. కొండ ఎక్కుతున్న వాడికి కనిపించే మలుపుల గురించే చెప్పాలిగాని శిఖరం గురించి కాదు. వాడు ఒక స్థిరభావంతో వొచ్చాడు. అదే భావం వాణ్ణి ముందుకు తీసుకెళ్ళుతుంది. అక్కడ నుంచి భగవంతుడి అనుగ్రహం ఎటు తీసుకెళుతుందో ఎవరికి తెలుసు. ఆ స్థిరత్వాన్ని మనం ఇప్పుడు భంగిస్తే మొదటికే మోసం వొస్తుంది. వాడి నమ్మకం వాడిది. యద్భావం తద్భవతి. అదీకాక భగవంతుణ్ణి నమ్మి చేసే దర్శనం అనేది చిత్తాన్ని ఏకాగ్రం చెయ్యటానికి మంచి సాధన” అన్నది సీతారావమ్మ గారు.

నారయ్యకి నందుడి గారింటికి పొద్దున్న వెళ్ళి పిల్లవాణ్ణి చూడటమూ, సింహద్వారం దగ్గర ఉన్న అరుగు మీద కాసేపు కూచుని అటునుంచి వెళ్ళి పనులు చేసుకోవటమూ మళ్ళీ సాయంత్రం పిల్లవాడిని చూసి ఇతర పనులు చేసి ఇల్లు జేరటమూ చేసేవాడు. ఇలా కొన్నేళ్ళు సంతోషంగా గడిచినయ్యి. సింహద్వారం దగ్గర ఉన్న అరుగుకి నారయ్య అరుగు అనే పేరు వాడుకలోకి వొచ్చింది.

కానీ కృష్ణుడు కొద్దిగా పెద్దవాడై ఆవులు మేపటానికి వెళ్ళటం మొదలెట్టేడప్పటికి చిక్కొచ్చి పడింది. కృష్ణుడు ఆవులు మేపటానికి తీసుకువెళ్ళే గోధూళి వేళలూ, నారయ్య, భూమయ్యలు నీలకంఠ మహాదేవ మందిరంలో సంగీతం వాయించే వేళలూ ఒక్కటి అయ్యాయి. కృష్ణుడు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం రావటం వల్ల ఇదివరకులాగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి చూడటానికిలేదు కృష్ణుణ్ణి. ఏమి చెయ్యాలో బోధపడలేదు నారయ్యకి. ఓరోజు భూమయ్య పొద్దున్నే నారయ్య ఇంటికి వొచ్చాడు. వొచ్చిన అన్నని కూర్చోబెట్టాడు నారయ్య. సీతమ్మని కూడా కూర్చోమన్నాడు భూమయ్య.

“నీలకంఠ మందిరం పని మనకి తరతరాలుగా వొస్తోంది తెలుసుగదా”

“…అవును”

“నాన్న ఎంత భక్తితో దేవుణ్ణి సేవించాడో నీకు తెలుసు. మరి ఇప్పుడు నువ్వు ఇలా మధ్యలో మానెయ్యటం ఏమిటి”

“….”

“మానేస్తే గుడి మాన్యంలో నీ హక్కు పోతుంది తెలుసా? మరి ఎలా బతుకుదామనీ?” అన్నాడు భూమయ్య.

సీతమ్మ కోపంగా “నువ్వు ఎట్లా బతుకు దామనీ, మాకు ఎట్లా తిండి పెడదామనీ” అంది.

కాసేపు మౌనంగా వుండి, “నాకు కృష్ణుణ్ణి చూడడమే ప్రధానం. అందుకని మందిరం పని వొదిలేస్తున్నాను అన్నా. ఆడ పిల్లలందరి పెళ్ళిళ్ళు అయినయ్యి. మొగపిల్లలకి రెక్కలు వొచ్చాయి. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. నేనూ, సీతమ్మా నాకున్న ఆవుల మీద, ఊరి వాళ్ళకి చేసే పని మీదా బతుకుతాం. మరీ అవసరమైతే నువ్వున్నావు కదా అన్నా” అని స్థిరంగా చెప్పాడు. ఇది ఊరంతా తెలిసింది.

మరుసటి రోజు నందుడు పిలిచి చెప్పినా నారయ్య వినలేదు. సింహద్వారం దగ్గర నారయ్య అరుగు పేరు స్థిరమైంది.

ఇంకొన్ని రోజులైంది. అక్రూరుడు వొచ్చి కృష్ణుణ్ణి మథురకి తీసుకు వెళితే అక్కడ కంసుణ్ణి సంహరించి రాజ్యం ఉగ్రసేనుడికి ఇచ్చాడు. కృష్ణుడికి ఒక దివ్య భవంతిని అందంగా అలంకరించి మరీ ఇచ్చాడు ఉగ్రసేనుడు. ఆ భవనంలో రాత్రి నిద్రపోయిన కృష్ణుడు పొద్దున ఏదో గొడవ జరిగిన శబ్దానికి లేచి ఏమిటా అని చూస్తే నారయ్య అక్కడి సైనికులతో గొడవపడుతున్నాడు.

కృష్ణుడు దగ్గరికి వెళ్ళి “నారయ్య మావా, బావున్నావా” అన్నాడు సైనికులు వెనక్కి తగ్గారు. “నువ్వేంటి మావా, ఇక్కడ” అంటూ నారయ్య ముఖం చూశాడు కృష్ణుడు. ఆ ముఖం దీనంగా, “నన్ను చెప్పాపెట్టకుండా వొదిలేసి వొస్తే నా పరిస్థితి ఏమిటి” అని కృష్ణుణ్ణి ఆక్రోశిస్తూ అడుగుతున్నట్టుగా ఉంది. “ఇంక నేనున్నాను మావా” అని నారయ్య చేతిలో చెయ్యి వేశాడు కృష్ణుడు. నారయ్య కంటి నుండి ఒక అశ్రుకణం రాలింది. కృష్ణుడి పిలుపున క్షణంలో వొచ్చిన సైన్యాధ్యక్షుడు నారయ్యని కృష్ణుడి అంతఃపుర ద్వార పర్యవేక్షణాధికారిగా నియమించాడు. పదినిమిషాల్లో ద్వారం దగ్గర పెద్ద బల్ల ఏర్పాటు చేశారు. నారయ్య తన అరుగు మీద తాను కూర్చున్నాడు. కాసేపాగిన తరవాత బయటికి వొచ్చిన కృష్ణుడు “బాగున్నావా నారయ్య మావా” అన్నాడు. నారయ్య తల ఊపాడు. “బయటికి వెళ్ళొస్తా మావా” అని కృష్ణుడు మధురా నగరంలోకి వెళ్ళాడు. మనం కంచికి వెళదాం.

Exit mobile version