ప్రముఖ రచయిత శ్రీ పాణ్యం దత్తశర్మ వెలువరించిన మొదటి కథా సంపుటి ‘దత్త కథాలహరి’. ఇందులోని కథల్ని ఆసాంతం చదివాక, ఇది మొదటి కథా సంపుటి అంటే ఓ పట్టాన నమ్మకం కుదరదు. జీవితసారాన్ని ఆకళింపు చేసుకున్న ఓ గొప్ప సాహితీవేత్త తన అనుభవాల్ని, అనుభూతుల్ని, తాత్వికతను అక్షరాలలో పొదిగి, కథలుగా మలిచాడనిపిస్తుంది. అది నిజం కూడా. శ్రీ పాణ్యం దత్త శర్మది బహుముఖీన ప్రతిభ. వచన కవిత్వం, పద్య కవిత్వం, కథ, నవల, సాహిత్య విమర్శ, ఖండకావ్యం, ఆధ్యాత్మిక వ్యాసాలు. ..సాహిత్యంలోని అన్ని విభాగాల్లో ప్రతిభావంతంగా సృజన చేయగల వ్యక్తి. ఆధునిక తెలుగు సాహిత్యంతో పాటు ప్రబంధ సాహిత్యాన్ని, ఆంగ్ల సాహిత్యాన్ని కూడా ఔపోసన పట్టిన రచయిత. గొప్ప వక్త. అన్నిటికీ మించి సహృదయుడు, స్నేహశీలి, మృదుభాషి.
కథలంటేనే జీవన శకలాలు.. జీవిత దృశ్యాలు. ‘దత్త కథాలహరి’ లో కథలన్నీ రచయిత అనుభవాల్లోంచి, సామాజిక స్పృహలోంచి, తాత్విక దృక్పథంలోంచి, తను నమ్మిన ఆదర్శాల్లోంచి పుట్టుకొచ్చినవే. కథలు చాలామంది రాస్తారు. కానీ కొంతమంది మాత్రమే కథను అందంగా చెప్పగలరు. హృదయానికి హత్తుకునేలా చెప్పగలరు. కళ్ళు చెమ్మగిల్లేలా చెప్పగలరు. కళ్ళు తెరిపించేలా కూడా చెప్పగలరు. శ్రీపాణ్యం దత్తశర్మ నిస్సందేహంగా అటువంటి కథకులే.
ఈ రచయితకు కుటుంబ వ్యవస్థ అన్నా, కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమలూ, అనుబంధాలు, ఆత్మీయతలన్నా ఇష్టంతోపాటు అమితమైన గౌరవం అని ఈ కథలు చదివితే తెలుస్తుంది. ‘మా పెద్దక్కయ్య’ కథలో అక్కా తమ్ముళ్ళ మధ్య అనుబంధాన్ని ఎంత అందంగా చిత్రించాడో. స్వంత వ్యక్తిత్వంతో పాటు డెబ్బయ్ రెండు సంవత్సరాల వయసులో కూడా మనసుని యవ్వనంగా ఉంచుకుంటూ జీవచైతన్యంతో తొణికిస లాడే అక్క.. తన మనసుకు నచ్చినట్టు బతికినంత కాలం హాయిగా బతకాలని కోరుకునే అక్క.
“ముసలివాళ్ళు ఈసురోమంటూ, తమ చాదస్తంతో ఇంట్లో వాళ్ళను విసిగిస్తూ ‘వీళ్ళెప్పుడు హరీమంటార్రా!’ అని వాళ్ళు ఎదురుచూసేలా ఉండకూడదురోయ్. శరీరం సహకరించేంత వరకు ఇలా స్వతంత్రంగా, హ్యాపీగా ఉండటమే నాకిష్టం” అంటూ తమ్ముడికి తత్వబోధ చేసిన అక్క. అక్క పాత్ర ద్వారా రచయిత ఎంత గొప్ప జీవిత సత్యాన్ని వెల్లడించాడో కదా. ముసలివాళ్ళందరూ తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది.
భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా చిత్రించిన కథ ‘ఆత్మ సఖుడు.’ ఈ రచయిత కొన్ని వాక్యాల్ని హృదయంలోని తడిలో ముంచి రాస్తాడు. అవి చదువుతున్నప్పుడు పాఠకుడి కళ్ళు అనాయాసంగానే నీటిచెలమలౌతాయి.
క్యాన్సర్‌తో బాధపడ్తోన్న భార్య.. బెండకాయలు తరిగి కూర చేశాడు. టమేటాలతో చారు కాచాడు. జుట్టంతా వెనక్కు దువ్వి, నూనె రాసి, మూడు పాయలుగా జడ అల్లాడు. ఆ రోజు ఆమెకు టిఫిన్ పెట్టి ఆఫీసుకి వెళ్ళాడు. వెళ్ళిన గంటలోనే యింటికి వచ్చాడు. “నాకు వి.ఆర్. శాంక్షన్ అయింది. రేపట్నుంచి ఆఫీసు లేదు. నీతోనే ఉంటా హ్యాపీగా” అన్నాడు. వచ్చి ఆమె పక్కన కూచున్నాడు. ఆమె భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. “నీకంటే నాకు ఉద్యోగం ముఖ్యం కాదు నర్మదా” అన్నాడు ప్రేమగా.
ఎంతటి ఆర్ద్రమైన సంఘటనని సృజించాడో కదా రచయిత!
మరో కథలో.. వంశీకి వెన్నెముక దెబ్బతిన్నదని ఆపరేషన్ చేశారు. సంసార జీవితం ఇప్పట్లో సాధ్యపడదనీ, జాగ్రతగా ఉండాలని హెచ్చరించారు. ఒక రోజు అతని తలను తన ఒళ్ళో ఉంచుకుని జుట్టు సవరిస్తూ అతని భార్య నీల “మీరెందుకు బాధపడున్నారో నాకు తెలుసు. అయినా భార్యాభర్తల బంధానికి సెక్స్ మాత్రమే పరమావధి కాదు.. బి బ్రేవ్ మై డియర్. ఐయాం విత్ యు” అంది. వంశీకి ఎంతో నిశ్చింతగా అన్పించింది. ఆమె రెండు చేతులనూ తీసుకుని తన గుండెలమీద ఉంచుకున్నాడు. ఎందుకో అతనికి ఆమె తన తల్లిగా అన్పించింది.
పై కథ కూడా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన గాఢమైన అనుబంధాన్ని తెలిపే కథే. కథను గొప్ప కథగా మలిచే నైపుణ్యం ఈ రచయితలో మెండుగా ఉందనడానికి పై కథ ఓ ఉదాహరణ. ఈ కథ సరసమైన కథగా రాసినా, ఇందులో తన భర్తమీద నీలకున్న అవ్యాజమైన ప్రేమను చిత్రించడం ద్వారా దీన్నో గొప్ప కథగా తీర్చిదిద్దాడు. ‘ఎందుకో అతనికి ఆమె తన తల్లిగా అన్పించింది’ అంటూ కథను ముగించడంలోనే రచయిత సంస్కారం, హృదయౌన్నత్యం ప్రస్ఫుటమౌతున్నాయి.
ఈ రచయితకు స్త్రీ జాతి మీద అపారమైన గౌరవం.. సంసారజీవితంలో వాళ్ళు పడే కష్టాల్ని, కన్నీళ్ళను, అవమానాల్ని సహృదయంతో అర్థం చేసుకున్న వ్యక్తి. ఆడవాళ్ళ మీద మగవాళ్ళ దౌష్ట్యాల్ని, దుర్మార్గాల్ని, నిర్లక్ష్యాలను నిర్ద్వంద్వంగా ఖండించే వ్యక్తి.
ఓ కథలో ‘ఏ మతంలోనైనా ఆడదాని ఉసురు దీసే మొగోనికి శిచ్చ బడాల’ అంటుంది ఫాతింబీ. ఫాతింబీ నోటివెంట పలికింది రచయిత మనసులోని మాటే. రచయిత ఎవరి పక్షాన ఉన్నాడో, ఎవరి తరఫు న వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నాడో ఈ వాక్యం చదివితే స్పష్టంగా అర్థమౌతుంది.
‘అష్టావధానం’ కథ చదివితే ఈ రచయిత సగటు గృహిణి నిత్యజీవితంలో ఎదుర్కొనే అష్టావధానం లాంటి వూపిరి సలపని పనుల్ని ఎంత బాగా పరిశీలించాడో కదా అన్పిస్తుంది. తన కుటుంబం కోసం యంత్రంలా పనిచేసే ఆడవాళ్ళమీద రచయితకు సానుభూతి ఉంది. ఉదయం ఇంటిపనీ, వంటపనీ అత్యంత వేగంగా, చాకచక్యంగా, సమయస్పూర్తితో నిర్వహించే గృహిణులందరూ అష్టావధానులే అంటాడు రచయిత..
ఈ కథా సంపుటిలో ఆత్మాభిమానం గల ఓ ముస్లిం స్త్రీ కథ ఉంది. ముస్లింల జీవన విధానాన్ని, ముస్లిం భార్యాభర్తల మనోగతాల్ని నిశితంగా పరిశీలించి, బాగా అర్థం చేసుకుని రాస్తే తప్ప ఇలాంటి కథ రాయడం సాధ్యం కాదు. మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులివ్వడం నేరమని సుప్రీంకోర్టు ధృవీకరించిన విషయం టీవీ వార్తలో విన్న ఖాదర్ వలి “ఎవడి పెండ్లాన్ని వాడు నచ్చకపోతే ఇడిసిపెట్టనీకె సొతంత్రం ల్యాకపోతే ఇంకెందుకు? థూ దీనెమ్మ” అని తిట్టుకుంటాడు.
ఖాదర్ మూడుసార్లు తలాక్ చెప్పాక, అతని భార్య ఫాతింబీలో చెలరేగిన మానసిక వేదనని రచయిత ఎలా వర్ణించాడో చూడండి. ‘ఫాతింబీ మనసంతా శూన్యం ఆవరించినట్టయింది. భార్యను వదిలేయడం ఇంత సులభమా! ఎంత చేసింది తను! అతని సంపాదన కంతులు కట్టడానికి, తాగడానికే పోతే తన కూలి డబ్బుల్తోనే సంసారం గడుపుకొస్తుంది. ఏనాడూ ఒక మంచి బట్ట ఎరగదు. మంచి తిండెరుగదు. ఆమె కళ్ళనుండి అశ్రువులు కారుతున్నాయి’.
అతనిమీద కోర్టులో కేసు వేస్తుంది. అతన్ని జైలుకి పంపుతుంది. తను తన కూతురితో స్వతంత్రంగా బతకసాగింది. ఫాతింబీకి అంత ధైర్యం రావడానికి కారణం ఆమె ఆర్థికంగా భర్తమీద ఆధారపడకపోవడమే. స్త్రీలకు ఆర్థిక స్వావలంబన ఎంత ముఖ్యమో ఈ కథ చదివితే తెలుస్తుంది. ముఖ్యంగా ముస్లిం స్త్రీలకు.. నాలుగు పెళ్ళిళ్ళు చేసుకునే వెసులుబాటుంది కాబట్టి ముస్లిం మగవాడు ఎప్పుడు మరో నిఖా చేసుకుని రెండో భార్యను యింటికి తెస్తాడో తెలీని పరిస్థితి.. ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోతే అతనెన్ని వెధవ్వేషాలేసినా లొంగి ఉండాల్సిన దుస్థితి.. దీన్నుంచి ముస్లిం స్త్రీలను రక్షించేది ఆర్థిక స్వావలంబనే.
ఈ కథకుడి నిజాయతీ ఎన్నుకున్న వస్తువులోనూ, కథ చెప్పే తీరులోనూ అంతర్లీనంగా కన్పిస్తూనే ఉంటుంది. మన సంస్కృతీ సాంప్రదాయాలమీద గౌరవం ఉన్నా మూఢ నమ్మకాల్ని, దురాచారాల్ని ఖండించడంలో వెనకాడని బలమైన వ్యక్తిత్వం.. విధవల్ని చూడటం అమంగళకరం అని గుళ్ళో పురాణ ప్రవచనం చేస్తూ పంతులుగారు చెప్పడం అపర్ణకు నచ్చదు. ఆమె అత్తగారు కూడా పంతులుగారి మాటల్తో ఏకీభవిస్తుంది. అపర్ణకు చాలా ప్రియమైన మేనత్త భర్త చనిపోతే ఆమెను చూడటానికి వెళ్ళలేని పరిస్థితి. కారణం అత్తగారి మూఢ నమ్మకాలు. చివరికి అపర్ణ తన భర్త సహకారంతో మేనత్తను చూడటానికి వెళ్ళేటప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. ఈ కథలోని ముగింపు గుండెల్ని పిండేస్తుంది. పాఠకుడికి కూడా మూఢాచారాల మీద కోపం వస్తుంది. కథకుడు తన కథ ద్వారా విజయం సాధించాడనడానికి యింతకన్నా నిదర్శనం ఏం కావాలి? సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసిన కథ యిది.
ఇలాంటి మరో కథ ‘భోక్తలు.’ తద్దినాలు పెట్టడం కూడా వ్యాపారంలా మారటం చూసి, శాస్త్రాలకు విరుద్ధంగా తద్దిన భోజనాన్ని అన్నార్తులకు, అభాగ్యులకు పంచడంలో తృప్తిని పొందుతారు ఆ భార్యాభర్తలు . “శ్రద్ధగా చేసేదే శ్రాద్ధమన్నారు. బ్రాహ్మలు అని ఎక్కడా అనేదే. భోక్తలు అన్నారు. అంటే తినేవారు. ఆకలితో తినేవారన్నమాట. ఆ పేదవాళ్ళ కడుపు నింపినపుడు కలిగిన ఆనందం, శాస్తోక్తంగా మనం పెట్టిన తద్దినాల్లో కలిగిందా? ఎంత నిర్లక్ష్యం, ఎంత వృథా, ఎంత వ్యాపారం. అదంతా చూసి మన మనసులు ఎంత బాధపడ్డాయి. ఇప్పట్నుంచి మా తల్లిదండ్రుల తద్దినాలు ఇలాగే పెడదాం” అంటాడు భర్త.
ఎంత గొప్ప కథ ఇది! శ్రాద్ధానికి, భోక్తలకు ఎంత చక్కటి వ్యాఖ్యానం! తద్దినం రోజు ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్ళ కడుపు నింపడమే శాస్త్రార్థం అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? దమ్మున్న రచయిత మాత్రమే ఇటువంటి కథ రాయగలడు. శ్రాద్ధకర్మలు నిర్వహించడానికి తరతరాలుగా లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తుల్ని కాదనడంవల్ల వాళ్ళ కోపానికి గురయ్యే అవకాశం ఉందని తెలిసి కూడా ఇంత అద్భుతమైన కథని రాసిన రచయిత అందరి అభినందనలకు అర్హుడు. నిజంగా అందరూ ఈ ఆదర్శాన్ని పాటిస్తే తద్దినం రోజున కొంతమంది పేదవాళ్ళ కడుపులైనా నిండుతాయి కదా.
ఏ రచయితకైనా పరిశీలనా దృష్టి చాలా అవసరం. సమాజాన్ని పట్టి పీడిస్తోన్న రుగ్మతల్ని, మనుషుల మానసిక ఉద్వేగాలని, ఘర్షణ వాతావరణాన్ని కలిగిస్తున్న పరిస్థితుల్ని, ప్రాపంచిక సమస్యల్ని, ఆధునిక పోకడల్ని, వాటి వల్ల కలిగే అనర్థాలను సునిశిత దృష్టితో పరిశీలించి, అర్థం చేసుకుంటేనే మంచి సాహిత్యాన్ని సృష్టించగలడు. శ్రీ పాణ్యం దత్తశర్మగారిలో ఈ లక్షణం పుష్కలంగా ఉందనడానికి ఈ సంపుటిలోని కొన్ని కథలు తార్కాణంగా నిలుస్తాయి.
స్మార్ట్ ఫోన్‌కు అలవాటుపడిన చిన్నపిల్లలో ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యల్ని ఓ కథలో రాస్తే, మరో కథలో వేలం వెర్రిగా యింజనీరింగ్ డిగ్రీల కోసం పరుగెత్తుతున్న యువత చేస్తున్న తప్పేమిటో విశదపర్చారు.
“ల్యాకపోతే ఏందన్నా. మనోల్లకు ఇంజనీరింగు, మెడిసిను తప్ప ఇంగోటి తెలియదు.. ఆఖరికి వీండ్లెక్కువైపోయి ఉద్యోగాలు రాక రోడ్లమీద తిరుగుతాండారు. కాకపోతే పదివేలకు, పన్నెండు వేలకు గొడ్డుచాకిరీ చేస్తుండారు తప్ప అంతకంటే బాగా బతికేదానికి మార్గమాలోచించరు..
ఇంజనీరింగ్ సరిపోదని ఎంబియే చేసేటోల్లు శానామంది. లేదంటే యిండ్లూ వాకిండ్లు తనకా బెట్టి లోను దీసి యూఎస్‌కు బోయి ఎమ్మెస్ జేసేది ఫ్యాషనయింది. అక్కడ పెట్రోలు బంకుల్లోన, హోటళ్ళలోన కూలిపనులు చేసుకుని సదువుకుంటారు. హాయిగా అమ్మానాయినల దగ్గరుండి ఏదో ఒక పని జేస్కొని బతకడం ఏమంత కష్టం? నేనొకటే చెబుతున్నానన్నా. ఈ వైట్ కాలర్ జాబుల కోసరం ఎగబడ్డం మానెయ్యాల మనం. కాలర్ మాసి నల్లగయితేనే మన జీవితాలు సల్లగుంటాయి. గవర్నమెంటు ఉద్యోగాలు ఎంతమంది కొస్తాయి? అవి గూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అయిపాయ. ఉద్యోగమంటే ఉపాధి అని మనోల్లు ఎప్పుడు గ్రహించుకుంటారో అప్పుడు బాగుపడ్తారు” అంటుందో పాత్ర ‘నల్లకాలర్’ కథలో. శ్రమైక జీవన సౌందర్యాన్ని తెలియచెప్పే కథ యిది.
ఎంతటి చేదు నిజం! రచయిత కాలేజీలో లెక్చరర్‌గా పని చేశారు కాబట్టి ఎంతోమంది విద్యార్థుల జీవితాల్ని గమనించి రాసిన కథ. అందరూ వైట్ కాలర్ ఉద్యోగాలే చేస్తామని భీష్మించుకు కూచుంటే ఎక్కడ దొరుకుతాయి? ఈ కథ చివర్లో మున్రెడ్డి నోటి ద్వారా పలికించిన మాటలు చూడండి. “ఇంజనీర్లు, ఎంబీయేలు యాడబడితే ఆడుండారు. ఒక ఎలక్టీషియన్ దొరుకుతాండాడా, ఒక మెకానిక్ దొరుకుతాండాడా, ఒక ప్లంబర్ దొరుకుతాండాడా?” నిజమే కదూ. ఇటువంటి ఇబ్బంది మనలో చాలామందికి అనుభవమే. యువకులు కొంతమందైనా ఫాల్స్ ప్రిస్టేజీని వదిలేసి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ విలువను తెలుసుకుంటే ఎంత బావుంటుందో కదా.
ఓ కథలో “సమస్యను ప్రదర్శించడంలో ఉన్న ఉత్సాహం పరిష్కరించడంలో లేదా? నాయకుల్లో చిత్తశుద్ధి లేదు సరే, మీరు చేస్తున్నదేమిటి?” అని ఓ టీవీ ఛానెల్ వాళ్ళని ప్రశ్నిస్తాడు ఏకలవ్య. టీవీ ఛానెళ్ళ వాళ్ళు టీఆర్పీల కోసం చేసే దుశ్చర్యలకు ఒళ్ళు మండి రచయిత సంధించిన ప్రశ్న ఇది. ఇటువంటి కథలు ఈ రచయితకున్న సామాజిక స్పృహకు, నిబద్ధతకు తార్కాణాలు.
కథల్లో వంటల ప్రసక్తి వచ్చినపుడు వాటిని ఎలా వండాలో విపులంగా చెప్పిన తీరు చూస్తే శ్రీ పాణ్యం దత్తశర్మగారు పాకశాస్త్ర ప్రవీణులు కూడా అన్పిస్తుంది. ఓ ఉదాహరణ చూడండి.
గోధుమపిండి తడుపుకొని పెట్టుకుంది. బంగాళాదుంపలు మీడియం సైజులో తరిగి నీళ్ళలో వేసింది. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకుంది. పూరీలు వత్తుకుని సిద్ధంగా ఉంచుకుంది. ప్రెషర్ పాన్‌లో కుర్మాకు కావల్సినవన్నీ వేసి, పోపు వేసి మూత బిగించింది. కుక్కర్ వూడదీసి, ఉడికిన పప్పులో పాలకూర సన్నగా తరిగి, కారం చింతపండు ఉప్పు వేసి, కొంచెం నీరుపోసి పొయ్యిమీద పెట్టింది. (అష్టావధానం కథలో)
ఈ రచయిత స్వాప్నికుడు. సమాజం ఇలా కాకుండా ఇంకోలా ఉంటే ఎంత బావుంటుందో కదా అనుకుంటూ ఎలా ఉంటే బావుంటుందో కథలుగా రాసి తృప్తి పడే వ్యక్తి. భావుకుడు. ఆదర్శ సమాజాన్ని, ఆదర్శ ప్రభుత్వాన్ని స్వప్నిస్తూ రాసిన కథలు ఈ పుస్తకంలో రెండున్నాయి. ఓ కథలో ప్రజాకూటమి అనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అర్థం లేని సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయి. అయోధ్యలో రామజన్మభూమియా, బాబ్రీమసీదా అనే వివాదాన్ని పరిష్కరిస్తూ ఉచిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ని నిర్మించాలన్న నిర్ణయం జరిగింది. ప్రభుత్వ ప్రతినిధులకు జీతాలు మాత్రమే ఉంటాయి. వారి పదవీ కాలం రెండు సంవత్సరాలే.. ఇలా అనేక మార్పులు జరిగినట్టుగా రాసిన రచయిత ముగింపులో అది కల అని తేల్చేశాడు. నిజమైతే ఎంత బాగుంటుంది అని కూడా అనుకుంటాడు.
మంచి కథకు ఉండాల్సిన లక్షణాలు క్లుప్తత, అనుభూతి ఐక్యత, నిర్మాణ సౌష్టవం అంటారు వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారు. ఈ సంపుటిలోని కథల్లో ఈ మూడు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మంచి కథలు, ఉత్తమ కథల కోవలోకి వస్తాయి.
ఉదాహరణకు ‘సహదేవుడు’ కథ తీసుకుంటే ఇది ఐదు పేజీల చిన్న కథ. క్లుప్తతతో పాటు గాఢత నిండిన కథ. ఆర్థిక అవసరాల నిమిత్తం అమ్మేసిన కోడె దూడ సహదేవుడు, తిరిగి అతని వద్దకు వచ్చేస్తుంది. ఆ సందర్భంలో రచయిత రాసిన వాక్యాలు చదవండి. ‘కళ్ళనిండా నీళ్ళు నింపుకుని చూస్తున్నాడు సహదేవుడు. ఇదే మీ యింట్లో మనిషైతే వదిలేస్తావా? అని అడుగుతున్నట్టు ఉంది. ఒక్కసారిగా వాడి మెడను కరచుకుని బావురుమని ఏడ్చాను. పలుపుతాడు తెంచుకుని వచ్చిందేమో, మెడంతా ఎర్రగా కమిలిపోయి ఉంది. పెరట్లోకి తీసుకువెళ్ళి కట్టేశాను. ఒళ్ళంతా నిమిరాను. ఉద్వేగం, మార్గాయాసం తగ్గి నా వైపు ప్రశాంతంగా చూస్తున్నాడు. దాదాపు పదారు కిలోమీటర్లు పరుగెత్తి ఉంటాడు.’
ఇది చదువుతున్నప్పుడు పాఠకుడి కళ్ళముందు పలుపుతాడు తెంచుకుని, పదహారు కిలోమీటర్లు పరుగెత్తుకొచ్చిన సహదేవుడు కన్పిస్తాడు. వాడి కళ్ళలోనే కాదు పాఠకుడి కళ్ళనిండా కూడా నీళ్ళు నిండిపోతాయి. కథానాయకుడిలానే పాఠకుడు కూడా ఉద్వేగపూరితమైన అనుభూతికి లోనవుతాడు.
ఈ కథాసంపుటిలోని కొన్ని విశిష్టతల్ని గురించి రాయకపోతే సమీక్ష అసంపూర్తిగా ఉండిపోతుంది. వాటిలో మొదటిది: ఈ కథల్లోని కొన్ని పదాల్లో, వాక్యాల్లో, వర్ణనల్లో వొలికిన భాషా సౌందర్యం. రచయిత తెలుగులోనే కాకుండా సంస్కృతంలో కూడా పండితుడు కాబట్టి అలవోకగానే అతని భాషా వైదుష్యం కథల్లో వొదిగిపోయింది. ‘ఆ విషయం సత్యదూరం కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు’ అని రాస్తాడో చోట. ఆ విషయం నిజం కాబట్టి అని రాయవచ్చు. అక్కడ సత్యదూరం కాదు కాబట్టి అనే పదాలు వాడటం వల్ల ఆ వాక్యానికి సొబగులు అద్దినట్టయింది. ‘ఆమె శరీరం శరసంధానం చేసిన ధనువులా ఉంది’ అంటూ వర్ణిస్తాడు. పెదవులను వర్ణిస్తూ ‘ఆమె అధరములు తాంబూలారుణితో కించితార్ధములై మెరుస్తున్నాయి’ అంటాడు. భాష మీద పట్టుండటం వల్ల ఎక్కడ ఎటువంటి పదాలు వాడాలో తెలిసిఉండటం వల్ల వాక్యాలు సౌందర్యశోభితాలయ్యాయి.
రెండోది: కొన్ని కథలకు విలక్షణమైన, వినూత్నమైన శీర్షికలు పెట్టడం. ఉదాహరణకు: పరధర్మో భయావహః – నల్ల కాలర్ – సర్వత సమదర్శినః – జీవత్ తాతపాదుండు – నీలవంశీ మోహనం – పూర్వ సువాసినీ దర్శనం – జ్వలితుడు- దోషైక దృక్కు..
మూడోది: కొన్ని కథల్లో పండిన అద్భుతమైన శృంగార రసపోషణ.
“కాఫీ తాగిన తర్వాత ముద్దు పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో కదండి” అంటుంది వైదేహి ఓ కథలో.
‘భావ ప్రాప్తిని పొందుతూ వైదేహి “తల్లీ జగన్మాత అనుగ్రహించు” అని ప్రార్థించింది. ఆ అద్భుత స్థితిలో ఆమెకు మళ్ళీ దేవి దర్శనమయింది’ అంటాడు రచయిత. రససిద్ధి పొందిన వాళ్ళకే ఈ వాక్యం అర్థమౌతుంది. ఓషో భావప్రాప్తి గురించి చేసిన ప్రసంగాలు విన్నా దీని భావం బోధపడుంది.
‘ప్రథమ చుంబనమంత రుచ్యమైనది మరొకటి లేదు కదా’ అని రాస్తాడు మరో చోట.
ఉత్తమకథల సమాహారమైన తన మొదటి కథాసంపుటి ‘దత్త కథాలహరి’ని బహుమతిగా అందించి, సాహితీ వినీలాకాశాన్ని తేజోమయం చేసిన శ్రీ పాణ్యం దత్తశర్మ గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
***
రచన: పాణ్యం దత్తశర్మ
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పుటలు: 200
వెల: ₹ 125/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత 9550214912 నెంబరుకు ₹ 125/- Gpay చేస్తే, పుస్తకం రిజిస్టర్ పోస్టు ద్వారా పంపబడుతుంది.
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.