Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దీపావళి ముసురు

[డా. కోగంటి విజయ్ రచించిన ‘దీపావళి ముసురు’ అనే కవితని అందిస్తున్నాము.]

~
దీపావళికి నాన్న తెచ్చిన టపాసులన్నీ మా నలుగురు అన్నదమ్ములకీ
నాలుగు చేటల్లో సర్దేవాడు
మధ్యాహ్నం ఆరబెట్టినప్పుడు
ఉన్నట్టుండి పడిన జల్లుకి
దమ్ముకుని
కొన్ని కాలేవి కాదు
పేలేవీ కాదు
కొత్త బట్టలు వేసుకోకున్నా
వానని తిట్టుకుని విసుగేసిందాకా కాల్చి
తిరగని భూచక్రాల్ని,
కాలని చిచ్చుబుడ్లని మళ్ళీ మళ్ళీ కదిలించి
అమ్మ పెట్టిన లడ్డూ తిని
సంతోషంగా నిద్రపోయే వాళ్ళం

ఇపుడు నాన్నల మయ్యాం
ఎవరింట్లో వాళ్ళం దీపావళి జరుపుకుంటున్నాం.
కొత్త బట్టలకి లోటు లేదు
అయితే ఒక ముసురైతే పడుతోంది
అప్పుడప్పుడూ మనసులో
అకారణ ద్వేషాల గురించి
అందరాని బంధాల గురించి
మనుషులకి మనుషులు కాకుండా పోతున్నతనం గురించీ

పండగ రోజు పూర్తి కావస్తున్నా
పండగలా అనిపించడం లేదు
కొత్త కొత్త మిఠాయిలు తింటున్నా
అమ్మ చేసిన రవ్వలడ్డూలా అనిపించడం లేదు
నాన్న పంచినప్పుడు గుండెల్లో ఎగసిన
ఆనందపు జల్లులు
కనీసం ఏ నవ్వులోనూ తడుముకున్నా తెలియడం లేదు

దీపావళి శుభాకాంక్షలంటూ పంపుకున్న
సందేశాలలో వెతికినా తడి లేదు
గుండె పిండేసినట్లు లోలోపలి పొగ ఒకటి ఊపిరాడనీకుండా కమ్ముకొస్తోంది
మనసునిండా దట్టించినట్టు
మాటలు పొడిబారిన మా మధ్య
తెలియని మందుగుండేదో నిశ్శబ్దంగా
శకలాలు శకలాలుగా పేల్చివేస్తోంది
రవ్వలు రాలుస్తోంది
గుండె పొరపొరా కాలుతున్నట్లుంటోంది

మళ్ళీ అందరమూ చిన్నవాళ్ళమైతే బాగుండు
మా నాన్న మళ్ళీ చేయిపట్టుకు తాటాకు టపాకాయ కాల్పించితే బాగుండు
మా అమ్మ పెట్టిన చిన్న దీపాలు
చిన్ని మతాబాలై
మళ్ళీ మా గుండెలో వెలిగితే బాగుండు
మళ్ళీ మేం నలుగురం
దీపావళి గురించి మాట్లాడుకుంటూ పడుకునే
ఆ అన్నదమ్ములం అయినా బాగుండు!

Exit mobile version