Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దేహం విడిచాడు

[శ్రీ రాజేష్ కుమార్ పొన్నాడ రాసిన “దేహం విడిచాడు” అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

నంద్ బ్యాంకులో తన పనిలో తలమునకలై ఉన్నాడు. ఒక బ్యాంక్ ఆఫీసర్‌గా మంచి పేరు తెచ్చుకుని రాణించడంతో బ్యాంక్ కస్టమర్లు ఎప్పుడూ అనంద్‌తోనే తమ పనులు చేయించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇంతలో ఆనంద్ సెల్‌ఫోన్ మ్రోగింది. అంత బిజీ పనిలో ఉండగా “ఎవరు ఫోన్ చేసారు ఇప్పుడు?” అని విసుక్కుంటూ ఫోన్ వంక చూసాడు. తన తల్లి ఫోన్ చేయడంతో “ఏం జరిగిందో?” అని ఆత్రుతతో కూడిన భయంతో ఫోన్ ఆన్సర్ చేయడానికి సెల్‌లో బటన్ నొక్కాడు. ఫోన్‌లో మాటలు విని కంగారుగా మేనేజర్ క్యాబిన్‌కు వెళ్ళాడు.

మేనేజర్‌తో తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి ఇంటికి బయలుదేరాడు. ఇంతలో అటెండర్ “ఏమైంది సార్? చాలా కంగారుగా ఉన్నారు?” అని అడిగాడు‌. దానికి ఆనంద్ “మా నాన్నకు ఊపిరి ఆడటం లేదట. మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసి అర్జంటుగా రమ్మంది. అందుకని ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడే మేనేజర్ గారి అనుమతి తీసుకున్నాను. మళ్ళీ కలుస్తాను” అని ఆదుర్దాగా ఇంటికి బయలుదేరాడు. ఆనంద్ తండ్రి పేరు మూర్తి. ఆయన ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసారు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులంతా మంచి స్థితిలో ఉన్నారు. మూర్తి ఉత్తమ ఉపాధ్యాయునిగా కూడా అవార్డు అందుకున్నాడు. అలాంటి మూర్తి, తన కొడుకైన ఆనంద్‌ను చాలా క్రమశిక్షణతో పెంచాడు. ఆనంద్ కూడా ఎంతో శ్రద్ధగా చదువుకుంటూ మంచి మార్కులతో పాసవుతుండేవాడు. అలా పట్టుదలతో చదువుకుని ఆనంద్ ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించాడు. చేరిన తక్కువ సమయంలోనే పని బాగా నేర్చుకుని ఉద్యోగంలో నిపుణత సాధించాడు. దాంతో ప్రొబేషనరీ ఆఫీసర్ నుంచి గ్రేడ్-1 ఆఫీసర్‌గా కన్ఫామ్ అయ్యాడు. ఆ తరువాత కాలంలో ఆ కేడర్ అసిస్టెంట్ మేనేజర్‌గా మారింది. మూర్తికి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి రావడంతో తరుచూ ఆసుపత్రికి వెళ్తుండేవాడు. ఆనంద్ దగ్గరుండి మరీ మూర్తికి అన్ని పరీక్షలు చేయించేవాడు. చివరిసారిగా చేసిన పరీక్షలలో వైద్యులు “ఏ క్షణాన ఏమైనా జరగవచ్చు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం” అని అన్నారు.

ఆనంద్ ఇంటికి చేరాడు. తల్లి పరమేశ్వరి ఆనంద్‌కు విషయం అంతా వివరించింది. భయపడుతూ తండ్రి దగ్గరకు వెళ్ళిన ఆనంద్ తనకు చేతనైన రీతిలో తండ్రిని ఓదార్చ ప్రయత్నించాడు. ఇక లాభం లేదనుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్దామని తల్లితో అన్నాడు. అందుకు ఆమె కూడా సమ్మతించింది. తల్లి సహాయంతో తండ్రిని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. ఆసుపత్రి సిబ్బంది మూర్తిని పరీక్షించి వెంటనే ఐసియులో చేర్చుకుని మాస్క్ సహాయంతో ఆక్సిజన్ అమర్చారు. మొట్టమొదటిసారిగా తండ్రిని ఆ స్థితిలో చూసిన ఆనంద్ కళ్ళ వెంబడి నీళ్ళు ధారలా కారసాగాయి. కొంత సేపటికి డాక్టర్ వచ్చి అనంద్‌తో “మీ నాన్నగారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రస్తుతానికి పరీక్షిస్తున్నాం. ఒక గంట సేపు అయితే కానీ ఏ విషయం చెప్పలేము” అని భుజం తట్టి వెళ్ళాడు. అది విన్న ఆనంద్ మనసు కీడు శంకించింది.

ప్రైవేటు ఆసుపత్రి కావడంతో వెంట వెంటనే మందులు తెమ్మని మళ్ళీ మళ్ళీ మందుల చీటీలు ఇవ్వడం ప్రారంభించారు. ఖర్చుకు వెనుకాడకుండా ఫార్మసీ నుంచి ఆనంద్ అన్ని మందులు తీసుకువచ్చి ఆసుపత్రి సిబ్బందికి ఇవ్వసాగాడు.

ఫోన్‌పే ద్వారా బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు ఖర్చు కాసాగాయి. అలా రెండు గంటలు గడిచాయి. డాక్టర్ ఎంతకీ ఏ విషయం చెప్పలేదు. ఆనంద్ బ్యాంకు ఖాతా పరిశీలిస్తే ఆ రెండు గంటల్లో పదిహేను వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. “పదిహేను వేల రూపాయల వైద్యం ఏమి చేసుంటారో” అని ఆలోచిస్తున్న ఆనంద్‌కు డాక్టర్ నుంచి కబురు వచ్చింది. వెంటనే వెళ్ళి డాక్టర్ గదిలో కూర్చున్నాడు. డాక్టర్ గాబరా పడుతున్న అనంద్‌తో “సార్! మీ నాన్నగారికి బతికే అవకాశాలు తక్కువ. ఆక్సిజన్ అందడం లేదు. కృత్రిమంగా ప్రయత్నిస్తున్నా కానీ శ్వాస తీసుకోలేకపోతున్నారు. తరువాతి ప్రయత్నం వెంటిలేటర్ మీద ఉంచడమే. కానీ అది కూడా వృథా ప్రయాసే. ఎందుకంటే ఈ రోజు రాత్రి గడవడమే కష్టం. మూడు పాళ్ళు ఇవాళే ప్రాణం పోవచ్చు. ఈ స్థితిలో మీరు ఇంటికి తీసుకెళ్ళి ఇంటి వాతావరణంలో ఉంచడమే మంచిది” అని చెప్పాడు. అది విన్న ఆనంద్ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తల్లికి విషయం అంతా వివరించి తండ్రిని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్ళాడు. తండ్రికి ఏ విషయం చెప్పలేదు. మూర్తి కూడా వేసుకోవాల్సిన మందులు వేసుకుని నిద్రకు ఉపక్రమించాడు. డాక్టర్ చెప్పిన వివరాలు ఆనంద్ మెదడులో తొలచసాగాయి. నిద్రపోతున్న తండ్రిని గమనించసాగాడు. అలా గంట గడిచింది. సమయం పది కావస్తోంది. ఆనంద్ తండ్రి చేయి పట్టుకొని ఒకసారి నాడి గమనించాడు. ఏమీ కొట్టుకోవడం లేదు. ఏదో అనుమానం వచ్చింది. పల్స్ ఆక్సీమీటర్‌తో పల్స్ చెక్ చేయడానికి మళ్ళీ ప్రయత్నించాడు. కానీ రీడింగ్ ఏమీ రాలేదు. భయంతో తల్లిని పిలిచాడు.

పరమేశ్వరి కూడా ముక్కు దగ్గర దూది పెట్టి చూసింది. కానీ దూది ఏమీ కదలలేదు. దాంతో అనుమానంతో ఇంటి ప్రక్కనే ఉన్న ఆర్.ఎమ్.పి. డాక్టర్‌కి ఫోన్ చేసి పిలిపించింది. అలా వచ్చిన డాక్టర్, మూర్తిని పరిశీలించి “సారీ! మేడమ్” అని బాధగా చెప్పాడు. తన భర్త ఇక లేడనే విషయం తెలుసుకున్న పరమేశ్వరి హతాశురాలైంది.

ఆనంద్‌కు ఏమి మాట్లాడాలో తెలియలేదు. వారిద్దరిని గమనించిన డాక్టర్ “మీ సొంత వాళ్ళని, స్నేహితులని చివరి చూపుకు పిలిపించుకోండి” అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో ఆనంద్ మూర్తి అన్నదమ్ములకు, స్నేహితులకు, మిగిలిన బంధువులకు వరుసగా ఫోన్లు చేసి విషయం చెప్పాడు. వారెవరూ మూర్తిని కడసారిగా చూసేందుకు రావడానికి తొందర పడలేదు. దూరాభారం కాకపోయినా “రేపు పొద్దున్నే వస్తాం” అని ముక్తసరిగా సమాధానం చెప్పారు. అప్పుడు ఆనంద్‌కు తన తండ్రి చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. “ఎవరు వచ్చినా రాకపోయినా తన మరణానంతరం తన పార్థివదేహాన్ని ఇరవై నాలుగు గంటల లోపు మెడికల్ కాలేజీకి డొనేట్ చేయమ”ని మూర్తి ఆనంద్ దగ్గర మాట తీసుకున్నాడు. వెంటనే తల్లికి ఆ విషయాన్ని గుర్తు చేసాడు ఆనంద్.

ఆ డొనేషన్‌కు సంబంధించిన కాగితాలు బీరువా నుంచి బయటకు తీసి చెక్ చేయసాగారు. మెడికల్ కాలేజీకి ఫోన్ చేసి విషయం చెప్పారు. “సంబంధిత అధికారులు ఈ సమయంలో లేరని రేపు పొద్దున్నే ఫోన్ చేయమ”ని మెడికల్ కాలేజీ వారు సమాధానం ఇచ్చారు. దాంతో ఆనంద్ మనసులో టెన్షన్ మొదలైంది. ఒక వైపు తండ్రి పోయిన బాధ, మరోవైపు తండ్రికి ఇచ్చిన మాట తీర్చగలనా లేదా అన్న అనుమానంతో సతమతమవసాగాడు. బాధపడుతున్న తల్లిని ఓదార్చసాగాడు. తండ్రి మృతదేహాన్ని తీక్షణంగా చూస్తున్న ఆనంద్‌కు తండ్రి గతం గుర్తుకు వచ్చింది.

***

మూర్తి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. దాంతో మేనమామ సహాయంతో, తల్లి తోడ్పాటుతో చదువు కొనసాగించాడు. పొద్దున పూట పేపర్‌బాయ్‌గా పని చేస్తూ, సాయంత్రం పూట రైస్ మిల్లులో పనిచేస్తూ నెలకు కొంత సంపాదిస్తూ కుటుంబానికి కూడా అండగా ఉండేవాడు. అలా కష్టపడి బి.ఎస్.సి. డిగ్రీ, ఆ తరువాత బీఈడీ చేసాడు. అలా డీఎస్సీ పరీక్ష అర్హత సాధించి గవర్నమెంట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం సంపాదించాడు. ఒక టీచర్‌గా ఎంతో ఇష్టపడి, కష్టపడి పనిచేసేవాడు. అన్నీ దానాలలోకి అన్నదానం గొప్పదని మూర్తి నమ్మకం. విద్యాదానాన్ని గ్రహించాలన్నా గ్రహీతకు శారీరకంగా తగు శక్తి కావాలని, అందుకే అన్నదానానికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలని అనేవాడు. తండ్రి లేని తనకు అండగా నిలిచిన మేనమామ కూతురు పరమేశ్వరిని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి అయిన కొన్నేళ్ళకు వారికి ఆనంద్ పుట్టాడు. మూర్తి తన సొంత ఖర్చులతో తన ఇంట్లోనే వయోజన విద్య కూడా మొదలు పెట్టాడు. అంటే చదువురాని పెద్దవాళ్ళకు, చదువు యొక్క ఆవశ్యకతను తెలిపి ఉచితంగా చదువు నేర్పించేవాడు. ప్రతి ఒక్క వ్యక్తికి చదవడం, రాయడం తప్పనిసరిగా తెలిసుండాలని, తమ సంతకం తామే స్వేచ్ఛగా చేసుకునే స్థాయికి అందరూ ఎదగాలని చెప్పేవాడు. తాను రైస్ మిల్లులో పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు పరిచయమైన రైతులకు, వారి పిల్లలకు, కూడా చదువు చెప్పేవాడు. తనతో పాటు పేపర్ వేసిన పేపర్‌బాయ్స్‌కు కూడా అన్ని విషయాలలో అండగా ఉండేవాడు. అలా మూర్తి తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. తనకు ఎంతో ఇష్టమైన సైన్స్ సబ్జెక్టులో ఉపాధ్యాయునిగా పనిచేసే మూర్తికి డాక్టర్ కావాలనే కోరిక ఎక్కువగా ఉండేది. కాని ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. బీఈడీ చదువు కోసం రామిరెడ్డి అనే ఉపాధ్యాయుడు మూర్తికి ధనసహాయం చేసాడు. ఆయన చేసిన ఉపకారం వల్లనే మూర్తి ఉద్యోగం సంపాదించిగలిగాడు. అందుకే “నెల నెలా నాకు పెన్షన్ వస్తోందంటే అందుకు కారణం రామిరెడ్డి మాష్టారే” అని అనంద్‌తో అంటూ ఉండేవాడు. ఆనంద్‌కు చిన్నతనంలో ఒక వ్యాధి వచ్చింది. దానికి సంబంధించిన నిపుణుడైన వైద్యుడు చెన్నైలో ఉన్నాడని తెలుసుకుని మూర్తి ఎంతో కష్టపడి తెలిసిన వారి సహాయంతో అనంద్‌ను చెన్నై తీసుకెళ్ళాడు. తన తాహతుకు మించి ఖర్చు చేసి ఆనంద్‌ను గండం నుంచి గట్టెక్కించాడు. చెన్నై నుంచి తిరుగు ప్రయాణంలో వర్షాల వలన రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని రైళ్ళు రద్దు అయ్యాయి. కొన్ని రైళ్ళు ఆలస్యంగా వచ్చేవి. మరి కొన్ని రైళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మూర్తి, ఆనంద్‌కు చెన్నై రైల్వే స్టేషన్లో సపర్యలు చేసాడు. తాను తినకుండా దొరికిన కొద్ది పాటి తిండి కొడుక్కి పెట్టాడు. అలా అతికష్టం మీద సొంత ఊరికి చేరారు. స్వతహాగా టీచర్ కావడంతో మూర్తి, ఆనంద్‌ను గైడ్ చేసేవాడు. తమకు అవసరం లేని పుస్తకాలను, అవసరమైన వారికి ఉచితంగా ఇచ్చేవారు.

***

గతం తాలూకు ఆలోచనల నుంచి బయటకు వచ్చిన ఆనంద్ “తండ్రి ఇక లేడు” అనే నిజాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ రాత్రంతా చనిపోయిన మూర్తి శవాన్ని పెట్టుకుని ఆనంద్, పరమేశ్వరి ఇద్దరూ జాగారం చేసారు. అలా తెల్లవారింది. సమయం ఉదయం ఏడు గంటలు. ఆనంద్ మెడికల్ కాలేజీకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అది విన్న అనాటమి ఇన్‌ఛార్జ్, మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చి మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో తీసుకెళ్తామని చెప్పాడు. దాంతో ఆనంద్ కాస్త స్తిమిత పడ్డాడు. రావాల్సిన బంధువులు ఇంకా ఎవరూ రాలేదు. మరో అయిదు గంటల్లో వచ్చే అంబులెన్స్ వాళ్ళకి డెడ్ బాడీ అప్పగించాలి. “ఎలారా దేవుడా?” అని ఆలోచించసాగాడు ఆనంద్. ఇంతలో మూర్తి పెద్ద తమ్ముడు సుబ్బారావు వచ్చాడు. చనిపోయిన అన్న శరీరానికి నమస్కరించాడు. “ఎలా జరిగింది? ఏమైంది?” అని వాకబు చేసాడు. ఆనంద్ సుబ్బారావుకి అన్ని విషయాలు వివరించాడు. ఇంతలో రెండవ తమ్ముడు ప్రభాకర్ వచ్చాడు. ప్రభాకర్‌కు సుబ్బారావు అన్ని విషయాలు వివరించాడు. అలా అలా ఊర్లోని పెద్దలు, తెలిసిన వారు అందరూ వచ్చి మూర్తిని కడసారి చూసి నమస్కరించసాగారు. ఇంతలో సుబ్బారావు అనంద్‌తో “రేయ్! పంతులుగారికి చెప్పావా?” అని ప్రశ్నించాడు. దానికి ఆనంద్ “బాబాయ్! మా నాన్న తను చనిపోయిన తరువాత తన మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయమన్నాడు. అందుకే మెడికల్ కాలేజీకి చెప్పాం. వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తారు” అని సమాధానమిచ్చాడు.

ఆ విషయం విన్న సుబ్బారావు “ఏమిట్రా నువ్వు అనేది? మీ నాన్నకు దహన సంస్కారాలు చేయవా? కర్మకాండలు జరిపించకపోతే మీ నాన్నకు నరక ప్రాప్తి కలుగుతుంది” అని ఆందోళనగా అన్నాడు.

“అది మా నాన్న కోరిక. కొడుకుగా నాకు తీర్చాల్సిన బాధ్యత ఉంది. చనిపోయిన తరువాత మనిషి కూడా ఒక వస్తువే అని నాన్న అభిప్రాయం” అని ఆనంద్ స్థిరంగా అన్నాడు.

దాంతో సుబ్బారావు” నాకు, మీ నాన్నకు మధ్య సరిగ్గా మాటలు లేకపోయినా వాడు నా అన్న. పిచ్చి వేషాలు వేసావంటే చెప్పుతో కొడతా” అని కోపంతో రగిలిపోయాడు.

ఆనంద్ మౌనం వహించాడు. వీరి సంభాషణ విన్న ప్రభాకర్ “మీ నాన్న నిజంగా ఇవ్వమన్నాడు అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? లేక డబ్బులు ఖర్చు అవుతాయని నువ్వేమైనా నాటకాలు ఆడుతున్నావా?”అని ప్రశ్నించాడు.

ఆనంద్ తన దగ్గర ఉన్న హాస్పిటల్ ఒప్పంద పత్రాన్ని ప్రభాకర్‌కు చూపించాడు. ఆ పత్రంలో మూర్తి స్వయంగా బాడీ డొనేషన్‌కు తన అంగీకారం తెలుపుతూ సంతకం చేసాడు. ప్రభాకర్ కోపంగా ఆనంద్‌ను చూస్తూ ఆ ఒప్పంద పత్రాన్ని విసిరికొట్టాడు. ఆనంద్ ఆ పత్రాన్ని తీసి దాచి పెట్టాడు. అలా మూర్తి చేసిన బాడీ డొనేషన్ గురించి వచ్చిన వారందరికీ తెలిసింది. చాలా తక్కువ మంది మెచ్చుకుంటే, ఎక్కువ మంది విమర్శించారు. ఆనంద్ మాత్రం ఎలాగైనా తండ్రి కోరిక తీర్చాలని బలంగా తనలో తాను నిర్ణయం తీసుకున్నాడు. ఇంతలో మెడికల్ కాలేజీ నుంచి ఆనంద్‌కు ఫోన్ చేసారు.

“నేను రాము సార్. మెడికల్ కాలేజీ నుంచి ఫోన్ చేస్తున్నాను. అంబులెన్స్ డ్రైవర్‌ను. మేము డెడ్‌బాడీ కోసం మీ ఇంటికి బయలుదేరుతున్నాం. మీ ఇంటి అడ్రస్ చెప్తారా?” అని అభ్యర్థించాడు. ఆనంద్ అడ్రస్ చెప్పి వాట్సప్‌లో లొకేషన్ షేర్ చేసాడు. ఇంతలో ఒక చర్చి పాస్టర్ వచ్చి ఆనంద్‌ను కలిసి ధైర్యం చెప్పాడు. చనిపోయిన మూర్తి శవం దగ్గరకు వెళ్ళి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాడు. అలా చేసిన అయిదు నిమిషాలకు ఆయన వీడ్కోలు తీసుకున్నాడు.

అది చూసిన ఒక పెద్దావిడ ఆనంద్‌తో “ఏమిటిరా ఇదంతా? చనిపోయిన నీ తండ్రి శుద్ధ బ్రాహ్మణుడు అనే విషయం మర్చిపోయావా?” అని నిలదీసింది.

ఆనంద్ “బామ్మా! మా నాన్న తన మతాన్ని గౌరవిస్తునే అన్నీ మతాలను గౌరవిస్తాడు. మంచి పనులు చేసేవారందరూ శుధ్ధులే. దానికి కులం, మతంతో సంబంధం లేదు. దేవుడు ఒక్కడే” అని ఆమెకు నమస్కరించాడు. సమయం తొమ్మిది కావస్తోంది. ఇంతలో ఒక పెద్దాయన వచ్చి “చూడు బాబు!, మీ నాన్నకు కర్మకాండలు చేయకుండా నువ్వు చేయబోయే ఈ శరీర దానం శాస్త్ర సమ్మతం కాదు” అని అన్నాడు. అది విన్న ఆనంద్ “శాస్త్రి గారు! మీరు అన్నదాని ప్రకారమే చెప్తాను. పురాణాల్లో కర్ణుడు పుట్టుకతో వచ్చిన కవచ, కుండలాలను దానం చేయలేదా? దధీచి మహర్షి తన వెన్నెముకను తృణప్రాయంగా త్యజించలేదా? శిబి చక్రవర్తి ఒక పావురాన్ని కాపాడటానికి తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇవ్వలేదా? మా నాన్న వాళ్ళంతటి గొప్పవాడు కాకపోయినా, ఆయన చెప్పినట్లే నేను చేస్తాను. అది నా బాధ్యత కూడా” అని అన్నాడు. దాంతో ఆ శాస్త్రి గారికి ఏం చెప్పాలో తెలియలేదు. “ఇలా అయితే మేము ఎవరమూ ఇక నుంచి మీ ఇంటికి రాము. మా ఇంటి శుభ, అశుభాలకు కూడా మిమ్మల్ని పిలవము. అది కూడా ఆలోచించుకోండి” అని అన్నారు ఒక బంధువు.

ఆనంద్ ఆలోచిస్తూ “మామయ్య! మా నాన్న బతికున్నప్పుడు ఒక్కరైనా ఆయన్ని చూడటానికి వచ్చారా? ఆయన వయసులో పెద్దవాడు. ఆరోగ్యం బాగోలేదని తెలిసినా కానీ, ఎవరూ రాలేదేం? బతికున్నప్పుడు పరామర్శించకుండా, చనిపోయిన తరువాత వచ్చి కార్చే మొసలి కన్నీటికి విలువ లేదు. మా నాన్నతో స్నేహంగా ఉంటూ పలకరించిన వాళ్ళే మా వాళ్ళు. మీరు మమ్మల్ని పిలవకపోయినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడైనా మీరు ఉంటారా? లేక వెళ్ళిపోతారా? అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నాన్న చనిపోయాడని చెప్పినా, ఇంటికి దగ్గరైనా, ఇంకా రాని దగ్గర బంధువులు చాలా మందే ఉన్నారు” అని అన్నాడు. అది విన్న ఆ మామయ్య ఏం మాట్లాడాలో తెలియక తల దించుకున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆనంద్‌ను పలకరించాడు.

ఆనంద్ “మీరు మా నాన్నను చూడటానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఆడిటర్ గారు” అని ఆ వ్యక్తితో చేయి కలిపాడు.

“అయ్యో! ఎంత మాట? మీరు చేయాలనుకున్న డెడ్ బాడీ డొనేషన్ ఎంతో గొప్ప పని. చాలా మంది దానిని వ్యతిరేకిస్తున్నారని, విమర్శిస్తున్నారని నాకు తెలిసింది. అలాంటి వారు ఏమన్నా మీరు పట్టించుకోకండి. మీ నాన్నగారు బతికున్నప్పుడు ఇచ్చిన సలహాతో నేను కూడా మరణానంతరం నా మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి చెందే విధంగా అగ్రిమెంట్ రాసాను. మీలాగే నా పిల్లలు కూడా దానికి సమ్మతించారు. మీరు కూడా మీ నాన్నగారి కోరిక తీర్చండి. మీరు ఎప్పటిలాగే, ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. మాకు ఎలాంటి పట్టింపులు, మైల లేవు. ఒకే కులం వాడిగా ఈ విషయం చెప్పట్లేదు. సాటి మనిషిగా మీ నాన్నగారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను” అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. అలా మూర్తి ఆశయానికి, ఆనంద్ నిర్ణయానికి మొట్టమొదటిసారి బహిరంగ సపోర్ట్ లభించింది. అలా కొంత సమయం గడిచింది. అందరిలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. సుబ్బారావు, ప్రభాకర్‌లు ఇద్దరూ ఏమైనా గొడవ చేస్తారేమో అని వచ్చినవారు గుసగుసలాడసాగారు. ఆనంద్ అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి ఎంతో వరకు వచ్చారో కనుక్కున్నాడు.

ఇంతలో పక్కింటి రామారావు వచ్చి, మూర్తి కాళ్ళకు నమస్కరించాడు. ఎలా మరణించాడో ఆనంద్‌ను ఆరా తీశాడు. మాటల మధ్యలో “నేను కూడా మీ నాన్నగారి దగ్గర ఫ్రీగా ట్యూషన్ చదువుకున్న విద్యార్థుల్లో ఒకడినే. ఇవాళ నేను కూడా ఒక టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానంటే అందుకు కారణం మూర్తి మాష్టారు గారే. మీ నాన్న సైన్స్ పాఠాలు చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా, అందరికీ అర్థం అయ్యేవిధంగా చెప్పేవారు. ఆయన నాకు ఆ రోజుల్లో చదువు కోసం డబ్బు సహాయం కూడా చేసారు. ఎందుకు మాష్టారు? అని అడిగితే నేను కూడా నీలాంటి స్థితి నుంచి ఈ స్థాయికి వచ్చిన వాడినే అని అనేవారు. మరణానంతరం అవయవ దానం మీద, శరీర దానంపై అందరికీ అవగాహన కల్పించేవారు. మీరు కూడా మీ నాన్నగారి నిర్ణయాన్ని అమలు పరచడం అభినందనీయం” అని ఆనంద్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

మూర్తి మరణం గురించి తెలుసుకున్న ఆనంద్ బాల్య స్నేహితుడు, పౌరోహిత్యం చేసే రవి హుటాహుటిన మూర్తి ఇంటికి వచ్చాడు.

ఆనంద్‌ను ఓదార్చాడు. రవి కూడా ఆనంద్‌తో కలిసి చదువుకునేవాడు. దాంతో మూర్తి, ఆనంద్‌తో పాటే రవికి కూడా చదువు చెప్పేవాడు. తరువాతి కాలంలో రవి తమ తాతతండ్రుల నుంచి నేర్చుకున్న పౌరోహిత్యం విద్యను వృత్తిగా ఎంచుకున్నాడు. దహనసంస్కారాలకి కావలసిన ఏర్పాట్లు చేయడానికి రవి ఫోన్ చేయడం ఆనంద్ గమనించాడు. దాంతో ఆనంద్ రవిని వారించి డెడ్‌బాడీ డొనేషన్ గురించి చెప్పాడు.

అది విని రవి ఆశ్చర్యంతో “చనిపోయింది మీ నాన్న మాత్రమే కాదు. మా మాష్టారు కూడా. ఆయనకు కర్మకాండలు చేయాల్సిన బాధ్యత, ఆయన్ను తండ్రిలా భావించే నా మీద కూడా ఉంది” అని అన్నాడు.

“మీ మాష్టారు గారి ఆఖరి కోరిక తీర్చవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది” అని అన్నాడు ఆనంద్.

రవి కంగారుగా “మరి సనాతన ధర్మం పాటించవా?” అని ప్రశ్నించాడు.

“పేదవారి ఆకలి తీర్చడం మానవ సేవ కాదా? ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం, అవసరార్థులకు చేతనైన సాయం చేయడం కూడా మానవుడి కనీస ధర్మమే. అది కూడా సనాతన ధర్మమే. మానవసేవే మాధవసేవ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా. అంటే తోటి మానవులకు, జంతువులకు సేవ చేయడం, ఉపయోగపడడం కూడా మాధవ సేవే. మానవుడు కూడా ఒక సంఘ జంతువే కదా. నా తండ్రి తన కర్మకాండల రోజున పేదవారికి, అవసరార్థులకు అన్నదానం చేయమన్నాడు. అందుకని కర్మకాండలు చేయాల్సిన రోజుల్లో వివిధ ఆశ్రమాల్లో, పేద విద్యార్థులు చదివే హాస్టల్లో అన్నదానం ఏర్పాటు చేయబోతున్నాను. మా నాన్న ఎంతో మంది బంధువుల, స్నేహితుల కర్మకాండల క్రతువుల్లో పాల్గొన్నాడు. వాళ్ళకు పాడె కట్టడానికి సహాయం చేసాడు. ఆ పాడె మోసాడు‌. వాళ్ళల్లో ఆయనకు తెలియని వారు కూడా ఉన్నారు. వాళ్ళు డెడ్‌బాడీ డొనేట్ చేయటం ఇష్టం లేదని చెప్పినా మా నాన్న బలవంతపెట్టలేదు. అంటే మా నాన్న నువ్వనే సనాతన ధర్మానికి వ్యతిరేకి కాదనే కదా అర్థం. అయినా నా తండ్రి దేహం విడిచాడు అంతే. ఒక ఉపాధ్యాయుడిగా తను చనిపోయిన తరువాత కూడా బ్రతికుండాలని, తన మృతదేహం విద్యార్థులకు ఉపయోగపడాలనే మంచి ఆశయంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎంతో మంది విద్యార్థులకు పరీక్ష ఫీజులు కట్టాడు. పాఠ్య పుస్తకాలు కొనిచ్చాడు. తనతో పాటు కలిసి పనిచేసిన ఉపాధ్యాయులతో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఒక నిధిని ఏర్పాటు చేశాడు. ఆ నిధికి సంబంధించి ఒక బ్యాంకు అకౌంట్ తెరిచారు. ఆ అకౌంట్‌లో గ్రూప్ సభ్యులు అందరూ తమకు తోచిన డబ్బు నెల నెలా జమ చేసేవారు. విరాళాలు సేకరించేవారు. ఆ డబ్బును పేద విద్యార్థుల చదువుకు ఉపయోగించేవారు. దాని వలన డబ్బు లేక బడి మానేసిన పిల్లలు తిరిగి బడికి వచ్చారు. మళ్ళీ చెప్తున్నా.మా నాన్న దేహం మాత్రమే విడిచాడు. జీవితంలో స్థిరపడ్డ ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటాడు” అని భావోద్వేగానికి గురయ్యాడు ఆనంద్.

“ఇలా అయితే మనిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని వెలి వేయాల్సి వస్తుంది” అని విసురుగా అన్నాడు రవి.

ఆనంద్ నెమ్మదిగా “నీ ఇష్టం మిత్రమా. నేను చేయబోయేది నీకు చెప్పాను” అని అన్నాడు.

“ఇక సెలవు” అంటూ కోపంగా వెళ్ళిపోయాడు రవి.

అలా కొంత సమయం గడిచింది. ఇంతలో ఒక అంబులెన్స్ వాహనం ఏ సౌండ్ లేకుండా వచ్చి మూర్తి ఇంటి ముందు ఆగింది. అందరూ ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా చూడసాగారు. ఆ అంబులెన్స్ నుంచి ఒక డాక్టర్‌తో పాటు ముగ్గురు వ్యక్తులు దిగారు. ఆనంద్ వారికి ఎదురు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు.

డాక్టర్‌ను మూర్తి మృతదేహాం వద్దకు తీసుకెళ్లాడు. మృతదేహాన్ని పరిశీలించిన డాక్టర్, “చివరి చూపు ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు” అని తన సిబ్బందికి స్ట్రెచర్ తెమ్మని పురమాయించాడు. దాంతో వచ్చిన వారు మూర్తి శవాన్ని ఆఖరు సారిగా చూసి ప్రదక్షిణాలు చేసి నమస్కరించారు.

దాంతో “వారసులు ఎవరో రండి” అంటూ డాక్టర్ స్ట్రెచర్‌కి ఉన్న నాలుగు ప్రక్కల్లో ఒక ప్రక్క పట్టుకున్నాడు. ఆ మాటలు విన్న ఆనంద్, “నేనే వారసుడిని” అని మోసే నలుగురిలో రెండవ వాడయ్యాడు. మూర్తి సోదరులు మోయడానికి ముందుకు రాలేదు. దాంతో డాక్టర్‌తో వచ్చిన ముగ్గురిలో ఇద్దరు ఆ స్ట్రెచర్‌ను మరో రెండు పక్కలా పట్టుకుని ముందుకు సాగారు.

“ఎంతో మందికి పాడె కట్టి, మోసి, అపర కర్మలు చేయించావు. అలాంటిది నీ పాడె ఎవరూ కట్టడం లేదే” అంటూ ఒక పెద్దావిడ కన్నీరు పెట్టుకుంది. ఆనంద్ అవేమీ పట్టించుకోలేదు. అలా ఆ నలుగురు కలిసి మూర్తి డెడ్‌బాడీని ఆంబులెన్స్‌లోకి ఎక్కించారు.

“ఈ డెడ్‌బాడీ డొనేషన్ వారసులైన మీకు మాత్రమే సమ్మతమా? మరణించిన మూర్తి గారి అన్నదమ్ములకు ఇష్టం లేదా ఆనంద్ గారు?” అని ఆసక్తిగా అడిగాడు ఆంబులెన్స్‌లో వచ్చిన డాక్టర్.

“మా నాన్నకు ఇద్దరు తమ్ముళ్ళు మాత్రమే ఉన్నారు. వారికే కాదు, మా బంధువులలో స్నేహితుల్లో, ఇరుగు పొరుగు వారిలో చాలా మందికి ఈ డెడ్‌బాడీ డొనేషన్ ఇష్టం లేదు. కానీ మా నాన్న బతికున్నప్పుడు లిఖితపూర్వకంగా రాసిన బాస ఇది. దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. ఆయన కోరిక తీరుస్తానని మాటిచ్చాను. ఆయన వారసుడిగా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు” అని దృఢంగా చెప్పాడు ఆనంద్.

అలా అన్న తరువాత ఆంబులెన్స్‌తో పాటు ఆనంద్ కూడా మెడికల్ కాలేజీకి వెళ్ళాడు. అక్కడ ఆనాటమి ల్యాబ్‌లో తండ్రి మృతదేహాన్ని అప్పగించాడు. ఇంతకుముందు అప్పగించిన డెడ్‌బాడీల ఆనవాళ్ళు ఆ ల్యాబ్‌లో ఉన్నాయి. కొన్ని అస్థిపంజరాలుగా మారాయి. జరగవలసిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయ్యాక అక్కడి ల్యాబ్ ఇన్‌ఛార్జ్‌తో “మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి” అని ఏడుస్తూ అన్నాడు ఆనంద్.

“మీరేమీ వర్రీ కావద్దు సార్. ఏ మృతదేహమైనా మాకు దైవంతో సమానం. మీరు చేసిన గొప్ప పనికి సంపూర్ణ న్యాయం చేస్తాం‌. చాలా హైజీనిక్‌గా మేము డెడ్‌బాడీని భద్రపరుస్తాం” అని ల్యాబ్ ఇన్‌ఛార్జ్‌ భరోసా ఇచ్చాడు.

“చివరిసారిగా మా నాన్నను ఒక్కసారి చూడవచ్చా?”

“ష్యూర్! తప్పకుండా”

ముఖంపై కప్పిన దుప్పటిని తీసి కడసారి తండ్రిని చూసాడు ఆనంద్. ‘జాగ్రత్త నాన్నా. వెళ్తున్నాను’ అని అనుకుని మరల దుప్పటిని కప్పి పాదాలకు నమస్కరించి హాస్పిటల్ డీన్ దగ్గరకు వెళ్ళాడు. ఆ డీన్ సంతకం చేసిన సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఆ సర్టిఫికెట్‌లో ‘మూర్తి గారి డెడ్‌బాడీని మెడిసిన్ చదువుతున్న విద్యార్థుల చదువు కోసం తీసుకున్నట్లు, అందుకు ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలియచేసిన’ట్టు రాసుంది.

ఆ సర్టిఫికెట్ చదివిన ఆనంద్ తండ్రి కోరిక తన చేతుల మీదుగా తీరినందుకు ఎంతో సంతృప్తి చెందాడు.

Exit mobile version