[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘దేవుడి పోలికే!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
అతను పుట్టగానే తల్లీ తండ్రీ ఒక మాట అనుకుని, ఒప్పందానికి వచ్చి పెట్టిన పేరు, రంగనాయక శాంతమూర్తి.
అది వారి ఇంటికి దగ్గర్లో ఉన్న, వారికి ఇష్టదైవమైన రంగనాయక స్వామి మీది భక్తితో పెట్టిన పేరు.
కాకపోతే, ఆ దేవుడు, ‘శాంతాకారం..’, కాబట్టి శాంతమూర్తి కలిసింది ఆ నామధేయంలో, లేదా కలిపారు అనవచ్చు!
అదేమి వింతో గానీ, పెద్దయిన తరువాత ఆ దేవళంలోని దేవుడినే పోలిన కనుముక్కు తీరుతో అట్లాగే ఉన్నట్టే అనిపించేవాడు దైవదర్శనం చేసుకుని,ఇతన్ని చూసిన అందరికీ!
ఆయన లాగే ఈ రంగనాయకుడు కూడా పరమ శాంతమూర్తి!
అందరూ దేవుడి పోలికతో ఉన్న మనిషని ఒక్క పిసరు ఎక్కువ ఆదరం తోనే చూసేవారు ఇతన్ని!
దేవుడితో పోలికున్న వాడితో వ్యవహారం అంటే దేవుడితోనే అనుకునో, ఎటు పోయి ఎటొచ్చినా తమకే మంచిదనో మాత్రం తెలియదు!
కాకపోతే, ఆ దేవుడు నీలమోహన మూర్తి! ఈ జీవుడు మేల్మి పసిడి కాంతి-అంతే తేడా!
***
పసితనంలో కూడా ఆకలేస్తే ఏడ్చింది లేదు ఈ అపురూపప్పిల్లవాడు,తల్లికే ఆశ్చర్యం గొలిపేట్లు.
అట్లా తల్లినే చూస్తూ ఉండేవాడట, కళ్ళు ఆమె వెళ్ళిన దిశలో చక్రాల్లా తిప్పుతూ!
పనులు చకచకా కానిచ్చి వాత్సల్యం పొంగులు వారుతుండగా “అయ్యో చిట్టిప్రాణానికి ఎంత ఆకలైందో”, అని ఆ అమ్మే గ్రహించి పాలు పట్టేదట!
బళ్ళోనూ అదే తంతు!
అన్నింట్లో ఫస్టే,ఒక్కసారి చెపితే అర్థం చేసుకునే గ్రహణశక్తి!
టీచర్లందరికీ ఇష్టుడే, పిల్లలందరికీ స్నేహపాత్రుడే.
కానీ అబ్బాయి పెరుగుతున్న కొద్దీ ఇంటివారికే కాస్త దిగులుగా ఉండేది,ఇంత మెత్తటివాడు ఈ కరకు లోకంలో ఎట్లా నెట్టుకొస్తాడా అని!
ఆటల్లో కూడా తనకు రావాల్సిన క్రెడిట్ తప్పుగానో, పక్షపాతంతోనో వేరేవారికి ఇచ్చేస్తున్నా, పెద్దగా ఏమీ నిరసన చూపకుండా ఏమీ కానట్టే ఊరుకుండేవాడు.
అట్లాగని తెలియక కాదు, ఎవ్వరితో ఘర్షణ పడే రకం కాదు,అంతే.
అతని సహజ ప్రవృత్తి అది. నడవడి బహు మర్యాదకరం. అంతరంగం అతి సుకుమారం.
ఆ మనిషి మనసులో భావం పసిగట్టడం అంత తేలిక కాదని ఇంట్లో వాళ్ళకీ, స్నేహ బృందంలో అందరికీ బాగా తెలిసిన విషయమే!
***
ఈ మెత్తదనం మరీ ఎక్కువైపోయి, ఇంట్లోవాళ్ళు ఆపుకోలేక అష్టోత్తరాలు చదివిన సందర్భాలూ ఉన్నాయి.
ఒకసారి కాలేజీలో తన బీద ఫ్రెండుకి కాస్త టర్ము ఫీజు తక్కువ అయితే, తాను కట్టాల్సిన దాంట్లోంచి అతనికి సర్దాడు,తన ఫీజు కట్టడం ఆ రోజుకు మానేసి.
అతను తన ఫీజు కట్టేశాడు థాంక్సు చెప్పి!
శాంతమూర్తి ఇంటివారి దగ్గర ఏదో చెప్పి, మర్నాడు వెళ్ళి ఫీజు కట్టాడు డేటు దాటి పోయినందుకు లేటుఫీజుతో సహా!
కాలేజీలో తోటి వారు ఇతనికి పెట్టిన పేరు, DC అని. ‘డిఫరెంట్ సర్క్యూట్’ అని. అందరూ స్వంత లాభం చూసుకుంటే ఇతను వేరే వాళ్ళ గురించి మొదట ఆలోచిస్తాడని, ఈ బ్రెయిన్ వైరింగ్ అందరిలాంటిది కాదనీ, వారి బిరుదుకు అర్థం!
ఆ DC వెక్కిరింపనుకుంటే అదే, మెచ్చుకోలనుకుంటే కూడా అదే!
అవతలి మనిషి కృతజ్ఞతలు చెప్పినా పెద్దగా ఇష్టపడేవాడు కాదు, సాయం చేయకపోతే స్నేహం ఎందుకన్నది అతని వైఖరి!
లాభం పొందినవారు ఆశ్చర్యానందాలు కలసిన చూపు చూసి చక్కాపోయేవారు.
చదువు ఘట్టం అయ్యాక, ఒకసారి ఇంటర్వ్యూ కెళ్ళాడు, అన్ని అర్హతలూ ఉన్న వాళ్ళలో మొదటి వాడుగా!
అందరు అభ్యర్థులతో పాటు కూచున్నాడు,తనకు పిలుపు వచ్చినప్పుడు వెళ్ళడానికి సిద్ధమై!
తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు అభ్యర్థులంతా, ఆశతో పాటు ఒకింత అసహనంగా!
వడపోతల తరువాత చివరకు హాలులో ఇంకొక్క అభ్యర్థి మిగిలాడు, శాంతమూర్తితో పాటు.
పది నిమిషాలు టీ బ్రేక్ ఇచ్చారు.
మాటల్లో అతనికి తన కంటే ఉద్యోగావసరం ఎక్కువ అని గ్రహించాడు శాంతమూర్తి.
మొదట అతడినే పిలిచారు లోపలికి.
అతని తరువాత అభ్యర్థిని పిలవటానికి స్టాఫ్ వస్తే, హాలులో ఎవరూ లేరక్కడ!
అతనికి ఉద్యోగాన్ని త్యాగం చేసి వచ్చేశాడు శాంతమూర్తి, ఆ చివరి రౌండు అటెండు అవకుండానే!
ఉద్యోగం వస్తే చెప్పేవాడే కదా! ఉద్యోగం రాలేదేమోనని ఇంట్లోవాళ్ళూ ఏమీ అడగలేదు.
అతనూ ఏమీ చెప్పలేదు!
తరువాత రెణ్ణెల్లలోనే ఇతనికీ వేరే మంచి ఉద్యోగమే దొరికింది, అది వేరే విషయం!
కానీ తరువాత, ఎట్లాగో ఇంటివారికి తెలిసి, మరీ ఇంత శాంతం, జాలి, లోకంలో పనికి రావబ్బాయ్ అనే మాటలు ఘాటుగానే చెప్పారు!
వారు ఘాటుగా చెప్పుండచ్చు, ఈయన విన్నది మాత్రం పరమ శాంతంగానే!
విన్నాడు కానీ ఏమీ అమలుచేయడని ఇంట్లో వారికీ తెలిసిన విషయమే!
చెప్పటం తమ ధర్మం కాబట్టి చెప్పారనుకోవాలి, అంతే!
అట్లా ఉద్యోగం మొదలైన ఖరీదైనవి సైతం వదులుకొని వేరే వాళ్ళకి ఇప్పించటం, అతని గుణం!
వెంటనే ఇంకోటి సంపాదించుకోవటం, అతని తెలివి!
రెండూ గట్టివే అని ఇంటివారికి బాగా తెలుసు కూడా!
***
సైకిలూ, స్కూటరూ, కారూ ఎందులో వెళ్ళినా అవతలి వారికే ఇతనిచ్చే ప్రథమ అవకాశం, రోడ్డు మీద తనను దాటి పోవటానికి!
వారు బెల్లో, హారనో మోగిస్తే చాలు, తప్పుకొని దారి ఇవ్వటమే!
“మనకూ తొందరేగా”, అని తోడు వున్న అన్నో, తమ్ముడో, స్నేహితుడో విసుగ్గా అంటే, “పాపం వారికింకెంత తొందరో, లేకపోతే అట్లా బెల్లు మోగించి, హారన్లు నొక్కీ, దారి అడుగుతారా” అని ఇతని జవాబూ, ప్రశ్నా రెండూనూ, రికామీగా!
“జీవితంలో దేనికీ తొందర పడాల్సిన అవసరమే లేదు”, అనేది అతని సిద్ధాంతమేమో అనిపించక మానదు బయటివారికి, అతని వాలకం చూస్తే!
***
బస్సు రద్దీగా ఉన్నా అంతే, తరువాతి బస్సులో వెళ్దామని ఆగిపోవటమే!
“ఎందుకూ?” అని అడిగితే, “అసలే రద్దీగా ఉంది, వాళ్ళందరూ ఏమేమి ఒత్తిళ్ళలో వెళ్తున్నారో, పాపం! వాళ్ళని వెళ్ళనీ, తరువాతి బస్సులో వెళ్దాం” అని తాపీయైన జవాబు!
తోడుగా ఉన్నవారికి నవ్వూ వచ్చేది, చిరాకూ కలిగేది!
కానీ ఏమీ అనరు అతడిని, అతని శాంత స్వభావాన్ని చూసి! ఆ మంచితనం ముందు ఏమీ అనలేని అదో రకం వింత అశక్తత!
దీని మూలంగా, అంటే ఈ తాత్సారం మూలంగా, తాను తన కాలేజికో, ఆఫీసుకో ఆలస్యంగా వెళ్ళి, లెక్చరర్లతోనూ, తన పై వారితోనూ తిట్లు తిన్న సంఘటనలూ ఉన్నాయి అతని ఈ ప్ర‘శాంత’ జీవితంలో!
అవతలి వాళ్ళు మామూలువాళ్ళే కదా, కనుక తప్పకుండా ఉంటాయి చిరాకులూ, కోపాలూ!
ఉండకపోతేనే అసహజం కూడా!
కానీ క్రమంగా అతని ధోరణి అంతేనని తెలిసి, ఇంటి తరువాత ఎక్కువ సమయం గడిపే ఆఫీసులో కూడా, అందరూ అడ్జస్టైపోయినవారే!
ఇదో రకం శాల్తీ అని పట్టనట్టున్న వారూ లేకపోలేదు!
కొద్దో గొప్పో అతని లక్షణాల తావిని ఒకింత అలవర్చుకుని లాభపడ్డవారూ ఉన్నారు, కానీ సక్రృత్తు!
ఎవరు ఎట్లా ఉన్నా, మనవాడి వైనం మాత్రం అదే, సదా శాంతం, పరహితం!!
***
అట్లాగని బొత్తిగా కోపరహిత సన్యాసి అని కూడా అనలేం!
ఇంట్లో వారి తోటే చిన్నచిన్న పేచీలు పడి, మధ్యమధ్య మాటలు మానిన పర్వాలూ ఉన్నాయి.
అయినా అదీ మర్నాడు నిద్ర లేచేవరకే!
తానే వెళ్ళి వాళ్ళని పలకరించేస్తాడు! పలకరించటం అంటే ఒక చిరునవ్వు, అంతే!!
అదే అతను సంభాషించినంత! మాట్లాడటంలో పెద్ద పీనాసి, శాంతంలో మహా అమీరూ!
***
ఇంతటి సల్లక్షణుడూ ఈ ప్రస్తుత లోకంలోని జనం మధ్య ఆట్టే ఎక్కువ కాలం బతుకు సాగించటం కష్టం అనుకున్నాడేమో ఆ పై వాడు, 36 ఏళ్ళకే ఇతడిని హఠాత్తుగా తీసుకెళ్ళి పోయాడు.
అదీ ఇంకొకరికి సహాయం చేస్తున్న సందర్భంలోనే!
కోవిడ్ ముమ్మరంగా ఉన్న సమయంలో, స్నేహితుడెవరో ఆస్పత్రిలో ఉన్నాడని చూసి వస్తానని వెళ్ళాడు.
సాయంకాలం వరకు ఉండి బయలుదేరపోతుండగా, ఆ ఫ్రెండు తల్లి వచ్చి, “బాబూ ఒక సహాయం చేయగలవా” అని అడిగింది.
“చెప్పండమ్మా”, అన్నాడు శాంతమూర్తి.
“ఏంలేదు నాయనా, నేనా పెద్దదాన్ని ఓపిక లేదు. మా పెద్దవాడు పొద్దున్నే బస్సు కొచ్చేస్తాడు, ఈ రాత్రికి నువ్వు నీ స్నేహితుడు మధుకి తోడుగా ఉండగలరా”, అన్నది ఆమె అర్థిస్తున్నట్టు!
“అయ్యో అదెంత పని, తప్పకుండా ఉంటాను”, అని ఆమెకు తనే ఆటో బుక్ చేసి ఎక్కించాడు – ఆమె ఇంటికి వెళ్ళిపోయింది.
రాత్రంతా ఉండటంతో మర్నాడు ఇతనికీ అంటుకుంది ఆ మహమ్మారి. ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సి వచ్చింది.
ఆరవ రోజు ఆ స్నేహితుడు నెగెటివ్ వచ్చి, అబ్జర్వేషన్ తరువాత డిశ్చార్జ్ అయి రెండు రోజుల్లో వెళ్ళిపోయాడు ఇంటికి.
శాంతమూర్తికి మాత్రం అది ఒక రోజు కాస్త తగ్గి, ఇంకోరోజు విషమించీ, అతనితో దోబూచులాడి, తనతో పాటు తన లాగే మామూలు కంటికి కనిపించని లోకానికి పట్టుకెళ్ళి పోయిందీ, 14వ రోజు!
ఇంటి వాళ్ళు నిశ్చేష్టులయ్యారు, ఈ అశనిపాతానికి!
ఆ స్నేహితుడు మధు అన్నతను మరీ కుమిలిపోయాడు, “అయ్యో నా వల్లే వాడికి ఇది అంటుకుంది”, అని!
వాడు దైవీగుణాలున్నవాడూ, దేవుడి పోలిక ఉన్నవాడూ అని సంతోషించాం గానీ,ఈ కిటుకు కనిపెట్ట లేకపోయాం ఎప్పుడూ అనుకున్నారు ఆత్మీయులందరూ!
దేవుడికి ఇష్టమైన వాడిని, ఈ మనుషుల లోకంలో ఆట్టేకాలం ఉంచడు అన్న కిటుకు!
తన వాడిని తన దగ్గరికే తీసుకెళ్ళి పోయినట్టు!
ఎవరి ఆనందాలూ, శోకాలూ పట్టని ఆ దేవుడు మాత్రం యథాప్రకారం మౌనముద్రే వహించాడు!
“వాడు మీతో ఇంతకంటే ఉండలేడు, వాణ్ణీ మీరూ ఇంతకంటే ఎక్కువ కాలం భరించలేరు”, అని ఆయన ధీమా కాబోలు, తన నిర్ణయం పట్ల!
***
ఏది ఏమైనా, దేనికీ తొందరపడని శాంతభూషణుడు శాంతమూర్తి, ఈ విషయంలో ఇంత తొందరపడి, తోసుకుంటూ ముందుకెళ్ళి రద్దీగా ఉన్న బండిలోనే; సీటు లేకపోతే నుంచుని అయినా వెళ్ళిపోవాలని నిశ్చయించుకోవటం, ఆశ్చర్యం కంటే, ఆ దైవం చేసిన అన్యాయం గానే భావించారు అతన్ని తెలిసిన వారందరూ, భూమ్మీద!
పైన ఆ దైవం మదిలో ఏముందో, మానవమాత్రులం మనకు తెలిసే అవకాశమే లేదు!
ఏం చేస్తాం.., ప్చ్..!
