[డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి రాసిన ‘డింక్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
డింక్ (Dual income No Kids)
“అమ్మా! సుజాతా! ఒక్కసారి ఇటు రామ్మా!”
“…..”
“సుజాతా! సుజాతా!” నీరసంగా, నిస్సహాయంగా మళ్ళీ పిలిచింది అనూరాధ.
“అబ్బబ్బబ్బ– వస్తున్నా. ఎప్పుడూ పిలుస్తానే ఉంటావ్. ఇప్పుడేగా కాఫీ ఇచ్చి ఎల్లాను. నీ సుట్టూ తిరగలేక సస్తా ఉండాను. నువ్వు ఇచ్చే జీతానికి ఇంత చాకిరి సెయ్యలేక నా సావుకొచ్చినాది.” అంటూ అనూరాధ బెడ్ దగ్గరకు వచ్చిన సుజాత అక్కడి దృశ్యం చూసి మండిపడింది.
“వేడివేడి కాఫీ గ్లాసు పట్టుకోలేక పోయానమ్మా। చెయ్యి వణికింది. కాఫీ అంతా కింద ఒలికిపోయింది” – సంజాయిషీగా చెప్పింది అనూరాధ.
“రోజురోజుకీ చిన్న పిల్లవయిపోతా ఉండావ్” – అని విసుక్కుంటూ కాఫీ గ్లాసు తీసి అక్కడ శుభ్రం చేసి వెళ్ళిపోయింది సుజాత.
“సుజాతా! కొంచెం కాఫీ ఇవ్వమ్మా! మరీ వేడిగా వద్దు. కొంచెం చల్లార్చి ఇవ్వు.” అడిగింది దీనంగా అనూరాధ. కాఫీ గ్లాసు తెచ్చి బెడ్ పక్కన ఉన్న స్టూల్‌మీద విసురుగా పెట్టింది సుజాత.
“పిల్లా, జెల్లా లేరు. పలకరించే దిక్కు లేదు. సంపాదించిన సొమ్ములు అన్నీ ఏం చేసుకుంటాదో” – తనలో తాను మాట్లాడుకుంటూ వంటగదిలోకి వెళ్ళి పోయింది సుజాత.
అనూరాధ లేని ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా కాఫీ తాగసాగింది, తనకు ఎదురుగా కనపడేటట్లుగా పెట్టుకున్న తనకు ఇష్టమైన ఫోటోవైపు చూస్తూ. ఆది తన పెళ్ళినాటి ఫోటో. కళ్ళలో నీరునిండి మసకగా కనపడుతుంది. తనకు ప్రతిరోజూ ఆ ఫోటో చూసుకొనే అలవాటు. ఆనాటి ముచ్చట్లు గుర్తుచేసుకుంటూ నిట్టూరుస్తూ ఉంటుంది. అలా తనకు నచ్చిన, మధురజ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది అనూరాధ మనస్సు.
***
అనూరాధ, మాధవ్ ఇద్దరు బి.టెక్. లో ఎప్పుడూ ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లోనే ఉండేవారు. ఒక సెమిస్టర్లో మాధవ్‌కి ఫస్ట్ ర్యాంక్ వస్తే మరో సెమిస్టర్లో అనూరాధకు వచ్చేది. చదువులో వాళ్ళు చూపించే చురుకుదనమే వాళ్ళ మధ్య స్నేహానికి బీజం వేసింది. అది పెరిగి క్రమంగా ప్రేమగా అంకురించింది. ఇద్దరూ జీవితం పట్ల, కెరియర్ పట్ల ఒకే రకమైన అభిప్రాయాలు కలిగి ఉండటం వలన అనతికాలంలోనే పెళ్ళి పీటలు వాళ్ళను ఆహ్వానించాయి.
చదువులోనూ, అందంలోనూ, వ్యక్తిత్వంతోనూ మేడ్ఫర్ ఈచ్ అదర్‌గా ఉన్న ఆజంటను స్నేహితులందరు మనస్పూర్తిగా అభినందించారు. అనూరాధ తల్లిదండ్రులు పెళ్ళి వేడుకలు ఘనంగా జరిపించారు. ఇద్దరూ అమెరికాలో ఎమ్.ఎస్.లో అడ్మిషన్ సంపాదించుకొని వెళ్ళిపోయారు. ఎమ్. ఎస్. పూర్తి చేసుకొని మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఏ లోటూ లేకుండా సంతోషంగా జీవితంలో స్థిరపడ్డారు. ఆకర్షణీయమైన పేమెంట్, విలాసవంతమైన ఇల్లు – ఇతరులకు ఆసూయ కలిగించే విధంగా కాలం హాయిగా సాగిపోతుంది.
తన తల్లిదండ్రులను అమెరికా రమ్మని అనూరాధ అడగ్గా అడగ్గా భ్రమరాంబ, మల్లికార్జునరావు లిద్దరు కూతురి కాపురాన్ని చూసిపోవాలని అమెరికా వచ్చారు. అనూరాధ తల్లిదండ్రులను చూసి ఎంతో సంబరపడింది. అమ్మా నాన్న తాను నిర్మించుకున్న ఇంటికి వచ్చినందుకు చాలా థ్రిల్ అయింది.
భ్రమరాంబ కూతురి కాపురం, భార్యభర్తల అన్యోన్యత చూసి ముచ్చటపడింది. కాని మనసులో ఏదో తెలియని వెలితి ముల్లులా గుచ్చుకుంటుంది. పెళ్ళి అయి 6 సం॥రాలు అయినా ఇంతవరకు తన కూతురికి పిల్లలు కలగలేదనే చింత వారిని కలవరపెడుతుంది. ఎలాగైనా తను కూతురితో గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకుంది.
***
ఆరోజు ఆదివారం. ఆఫీస్ వర్క్ లేకపోవటం వలన ఉదయం పదిగంటలకు తీరికగా లేచి కిందికి వచ్చింది అనూరాధ. భ్రమరాంబ అప్పటికే స్నానం ముగించి ఇంటి వెనుక గార్డెన్లో కూర్చొని లలితా సహస్ర నామాలు చదువుకుంటుంది. తల్లిని పలకరించి కాఫీ కలిపి ఇచ్చి తను కూడ కాఫీ తీసుకొని తల్లి దగ్గర కూర్చుంది. అనూరాధికి చిన్నప్పటినుండి కాఫీ చాలా ఇష్టం. పైకి నురుగు తేరిన వేడి వేడి కాఫీ అస్వాదిస్తూ తాగటం అలవాటు.
“అనూ!” పిలిచింది భ్రమరాంబ అప్యాయంగా.
“ఏమ్మా! ఎలా ఉంది నీకిక్కడ? బాగా బోర్ కొడుతుందా?”
“అదేం లేదమ్మా! నీతో ఒకమాట మాట్లాడాలి . ఏమీ అనుకోవు కదా!”
“ఏంటమ్మా! ఎందుకు నా దగ్గర సందేహం. చెప్పమ్మా!” అంతే ఆప్యాయంగా బదులిచ్చింది అనూరాధ.
“అనూ మీ పెళ్ళి అయి 6 సంవత్సరాలు దాటింది. పిల్లల గురించి ఏమన్నా ఆలోచించారా? నేనూ, మీ నాన్న ఈ విషయంలో చాలా బాధపడుతున్నాం తల్లీ!”
“అదీ! అమ్మా! మేమిద్దరం అసలు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నాం.”
భ్రమరాంబ ఒక్కసారి షాకయింది.
“ఏమిటీ! ఏమంటున్నావ్?” కంగారుగా ప్రశ్నించింది భ్రమరాంబ.
“అవునమ్మా! పిల్లల్ని కనటం, పెంచటం, అదంతా చాలా బరువు, బాధ్యతలతో కూడుకున్న పని. ఇక జీవితం అంతా వాళ్ళకోసమే అన్నట్లు అయిపోతుంది. దేనిలోనూ ఫ్రీడమ్ ఉండదు. ముఖ్యంగా పిల్లల్ని కనటం- ఓహ్ – అది ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది.”
భ్రమరాంబకు నోట మాట రాలేదు. నాకూతురేనా? ఇలా మాట్లాడుతుందీ? గొంతు పెగల్చుకొని చెప్పింది.
“అది కాదు అనూ! నీ చెల్లెలు పావనికి అప్పుడే ఇద్దరు పిల్లలు. ఈమధ్య ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నారు. నీగురించి మేం చాలా ఆందోళన పడుతున్నాం తల్లీ! ఒక్కళ్ళని కను చాలు. నేను చూసుకుంటాను, నీకు ఇబ్బంది లేకుండా!” నచ్చచెప్పే ప్రయత్నం చేసింది భ్రమరాంబ.
“నాకేం చెప్పకమ్మా! మంచి పార్టనర్, సక్సెస్ఫుల్ కెరియర్ ఇవే నా ఆశయాలు. ఆ రెండిటినీ నేను పొందగలిగాను. అయినా ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతామో తెలియదు. పిల్లలు ఒక స్ట్రెస్ పాయింట్ (లైఫ్). 9 నెలలు – ప్రతినెల చెకప్‌లు, డెలివరీ నెలకు లక్షరూపాయల ఖర్చు. పుట్టినప్పటినుంచి వాళ్ళ సేవలు, వాళ్ళ చదువులు, వాళ్ళు–వాళ్ళు-వాళ్ళు. మాకంటూ లైఫ్ ఉండదు. ఇన్ని సం।।రాలు బ్రతికాం అని చెప్పుకోవటానికి గోడమీద ఫోటో మాత్రం ఉంటుంది. ఇక ఏ ఆశయాలూ నెరవేరవు. “
గడగడ తన మనసులో భావాలు తల్లి ఎదుట వెళ్ళగక్కింది. భ్రమరాంబకు దిక్కు తోచలేదు. చాలాసేపటి తరువాత నెమ్మదిగా అడిగింది. “మాధవ్ ఏమంటున్నాడు?”
“మేం పెళ్ళికి ముందే డిసైడ్ చేసుకున్నాం అమ్మా!”
“అసలు ఒక్కళ్ళు అయినా వారసులు లేకపోతే ఎలాగే అనూ!” భ్రమరాంబ వేదన వెలిబుచ్చింది.
“అమ్మా! మనకేమీ రాజ్యాలు లేవు. వారసులు లేరని బాధపడటానికి. నువ్వు ఎన్నయినా చెప్పు. మానిర్ణయం మారదు”. స్ఫుటంగా పలికింది అనురాధ.
భ్రమరాంబ శిలాప్రతిమలా అక్కడే కూర్చుండి పోయింది. చాలాసేపటి తరువాత భర్త పిలుపు విని నెమ్మదిగా లోపలికి వచ్చింది. అనూరాధకు ఎలా నచ్చచెప్పాలో అర్థం కాక తన భర్త దగ్గర ఆవేదన వెలిబుచ్చింది. అన్యమనస్కంగానే గడప సాగింది. మళ్ళీ ఆదివారం వచ్చింది. తల్లి ఇంకా దిగులుగానే ఉండటం గమనించిన అనూ అనునయంగా చెప్పింది.
“సారీ అమ్మా! నేను పిల్లల్ని కనలేను. ఒక మంచి పేరెంట్‌గా ఉండలేనప్పుడు పిల్లలు కావాలని అనుకోవటం ఎందుకు? వాళ్ళ మీద పెట్టే ఖర్చుతో ఓల్డ్ ఏజ్‌లో ఒక మనిషిని పెట్టుకుంటే హాపీగా గడిచిపోతుంది. అర్థం చేసుకోమ్మా!”
“పిల్లలు అంటే బాధ్యత కాదు అనూ! అది బంధం. అనుబంధం. ఆ బంధం లేక బాధపడేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. మాకు నువ్వు పుట్టిన తరువాతే జీవితం పరిపూర్ణం అయిందనిపించింది. ఒక్కమాట చెప్పనా? నువ్వు చదువుకొనే వయసులో నీకు ఏ బాధ్యతలూ లేవు. మరి ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చగలుగుతున్నావు. ఇంటిని చక్కదిద్దుకుంటున్నావు. అలాగే వయసుతో పాటు వచ్చే బంధాలను, బాధ్యతలను ఆహ్వానించటమే జీవితం తల్లీ! “
నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది భ్రమరాంబ. తన ప్రయత్నం సానుకూలం అవుతుందనే విశ్వాసం సన్నగిల్లుతుంది. అయినా ప్రయత్నం విడువలేదు.
ఇవేవీ వినిపించుకోక వాట్సప్ మెసేజ్‌లు చూసుకుంటూ ఉండిపోయింది అనూరాధ.
“ఇప్పుడు అలాగే అనిపిస్తుందే అనూ! ఒక పది, పదిహేను సంవత్సరాలు గడిచిన తరువాత జీవితంలో నిరాశ చోటు చేసుకుంటుంది. వింటున్నావా? ఇప్పుడు నేను, నాన్న నీ దగ్గరకు వస్తున్నాం. నీ మంచి చెడులు మేం చూసుకోగలుగుతున్నాం. నువ్వు కూడ మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నావు. మరి మీకు వృద్ధాప్యం మీదపడిన తరువాత ఎవరు మిమ్మల్ని పలకరిస్తారు? ఒక్కసారి ఆ దృష్టితో ఆలోచించవే అనూ! ఈ సంసారచక్రం ఇలా తిరుగుతూ ఉండాలి. అదే జీవితంరా!” అని అనూ జుట్టు చిక్కులు తీసి సరిచేస్తూ సానునయంగా చెప్పింది భ్రమరాంబ.
నిర్లక్ష్యంగా, నిరసనగా చూసింది అనూరాధ.
“ఇక ఈ విషయాన్ని ఇంతటితో ఆపెయ్యమ్మా! మేం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. పిల్లలు పుట్టకుండా పర్మినెంట్‌గా తీసుకోవలసిన స్టెప్స్ గురించి మాట్లాడుకుంటాం.” అక్కడినుండి లేచి వెళ్ళి పోయింది.
భ్రమరాంబకు కన్నీరు ఉబికి వస్తుంది. ఇక నా మాటే కాదు తండ్రి మాట కూడ లక్ష్యపెట్టదు అని అర్థం అయింది. ఇండియా టికెట్లు ప్రీపోన్ చేయించుకొని భారంగా భర్తతో కలసి తిరిగి వచ్చేసింది భ్రమరాంబ.
ఎప్పటికైనా తను కోరుకున్నట్లు తన కూతురు మారుతుందని, శుభవార్త చెప్తుందని ఎదురు చూస్తూనే ఉంది. కాలచక్రం తిరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు ఫోన్లో పలకరించటమే తప్ప తల్లిదండ్రులతో అనుబంధం పంచుకోలేకపోయింది. తల్లి మరణించినపుడూ, తండ్రి మరణించినప్పుడు మాత్రం ఇండియా వచ్చి వెంటనే తిరిగి వెళ్ళిపోయింది.
చూస్తూ ఉండగానే మూడు దశాబ్దాలు గడచిపోయాయి. అను, మాధవ్ ఇద్దరు నాలుగు చేతులా బాగా సంపాదించారు. శని, ఆదివారాలలో తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించేవారు. ఇద్దరిదీ ఒకటేమాట. ఒకటే బాటగా జీవనం సాగించారు.
జీవితం ఎప్పుడూ ఒకే రీతిలో సాగితే మానవజన్మకు అర్థం ఉండదు. అనూరాధ, మాధవ్‌లు ఇద్దరికి వయసు మళ్ళింది. 70 సం॥రాల వయసుకు చేరువవుతున్నారు. ఇంతకు పూర్వంలాగా అనుకున్నదే తడవుగా ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నారు. నవ్వుల గలగలలు, నడకల సందడులు ఒక్కొక్కటిగా మాయం అయిపోతున్నాయి. ఇద్దరి మనస్సులలోనూ తెలియని వెలితి. ఏదో పోగొట్టుకున్న భావన.
ఆరోజు అనుకోని ఘటన. మాధవ్ కార్డియాక్ అరెస్ట్‌తో నిద్రలోనే కన్నుమూసిన రోజు. అనూరాధకు అంతా శూన్యంగా మారిపోయింది. ఒక్కసారిగా అగాధంలోకి కూరుకుపోయినట్లు భావించింది. తనకున్న ఇద్దరు ముగ్గురు స్నేహితుల సహాయంతో ఎలాగో కార్యక్రమాలు పూర్తి చేయగలిగింది.
సంతోషంగా గడిపిన ఆ ఇంట్లో ఉండలేకపోయింది. ఇండియాలో ఉంటే తన చెల్లెలి కుటుంబంతోనైనా కొంత దగ్గరి సంబంధం ఏర్పడుతుందేమోననే ఆశతో అక్కడి వ్యవహారాలు సర్దుబాటు చేసికొని పుట్టిన గడ్డకు చేరుకుంది.
జీవితం తుఫానులో చిక్కుకున్న నావలా అయిపోయింది. ధైర్యం తెచ్చుకుంది. తల్లిదండ్రుల జ్ఞాపకంగా తనకు మిగిల్చిపోయిన ఇంటిని తనకు అనుకూలంగా మార్పులు చేసుకుంది. చెల్లెలు పావని ఆశించినంతగా తనను ఆదరించటం లేదని గుర్తించింది.
ఒంటరి ప్రయాణమే తనకు శరణ్యమని నిశ్చయించుకుంది. నెలజీతం ఇచ్చి సుజాతను తనకు తోడుగా పెట్టుకొని కాలం వెళ్ళదీయసాగింది. నెల జీతంతో పాటు సుజాత కూతురి పేరుమీద 5లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది.
కాలం ఎవ్వరికోసమూ ఆగదు. ఇప్పుడు ఒంట్లో ఓపిక లేదు. గోడమీద తగిలించుకున్న తన పెళ్ళినాటి ఫోటో చూసుకోవటమే ఇప్పుడు అనూ జీవితం.
అప్పుడు తను ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంది? ఎంత అందంగా ఉంది? తల్లిదండ్రులు మనసులో మెదిలారు. ఒకప్పుడు తల్లితో తను ఎంత పరుషంగా మాట్లాడింది? ఇంతకాలం బ్రతికి ఉన్నాం అని చెప్పుకోవటానికి గోడమీద ఫోటోలో మిగిలిపోతాం. పిల్లలు అంటే స్ట్రెస్ అన్నది.
అవును. ఇప్పుడు గోడమీద ఫోటో చూసుకోవటమే తనకు మిగిలింది. కాలం ఎంత గుణపాఠం నేర్పుతుందో? అయితే పాఠం నేర్చుకునే సరికి మన చేతిలోనుండి జీవితం జారిపోతుంది.
అద్భుతమైన సౌందర్యంతో, పచ్చదనంతో కళకళలాడినా ప్రకృతి ఒకనాటికి పండి రాలిపోక తప్పదు. పండుటాకులు రాలిపోతూ ఉంటే వాటిస్థానంలో కొత్త చిగుళ్ళు పుట్టి పెరుగుతూ ఉంటాయి. అదే ప్రకృతి పరిణామం.
