Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవనయానంలో వెలిగిన ‘దివిటీ’

[శ్రీ పానుగంటి శ్రీనివాస్ రెడ్డి గారి ‘దివిటీ’ కవితాసంపుటికి డా. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి రాసిన ముందుమాటని పుస్తక పరిచయంగా అందిస్తున్నాము.]

కవిత్వం.. ఒక చేతనం! ఒక స్వాంతనం!!

భిన్న దృష్టి కోణాలు కవి స్వంతమైనప్పుడు ప్రయోజనకరమైన కవిత్వం పుట్టుకు వస్తుంది! ఈ కవిత్వం విభిన్న స్వభావాల లేదా దృక్పథాల సమాహారమై సాహితీ యవనిక మీద తన దార్శనికతని ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలో

కదిలేదిగా – కదిలించేదిగా..

నిలిచేదిగా – నిలదీసేదిగా..,

పలికేదిగా – ప్రశ్నించేదిగా.. కవిత్వం తన ఉనికిని చాటుకుంటుంది. కవితా ప్రక్రియలో పద్యం గద్యం ఏదైనాప్పటికీ అది సమాజ హితమైనప్పుడు సృజనకు సార్థకత ఉంటుంది. ఈ నేపథ్యంలో పానుగంటి శ్రీనివాసరెడ్డి రచించిన దివిటీ కవితా సంపుటిని గమనిస్తే.. వచన కవిత్వం అనేకానేక అనుభూతుల సముచ్ఛయమై కనిపిస్తుంది.

 ఈ సంపుటిలో మొత్తం 80 కవితలు ఉన్నాయి.మానవాభ్యుదయాన్ని కోరుకుంటూ కవితా యాత్ర చేపట్టిన కవి.. సామాజిక అవగాహనతో, మానవ సంబంధాలపై మమకారతో , ప్రాపంచిక స్థితిగతుల పట్ల ఆలోచనతో, జీవితం పట్ల బాధ్యతతో కనిపిస్తున్నాడు. ప్రతి కవిత ఒక ఒక సందేశం వినిపించింది. అనేక సంఘర్షణల్ని కనపరిచింది. సమర్థన, సహృద్భావం, ఆర్ద్రత, ఆందోళన, ఆక్రోషం, అభినివేశం, జిజ్ఞాస, వివేకం, వివేచన, వంటి భావావేశాలు సాంద్రంగా వ్యక్తమవుతూ కవిత్వం చిక్కగా ప్రదర్శించబడింది..

భారతీయ సంస్కృతికి పట్టం

కవిలో మంచి సమయస్ఫూర్తి స్థితప్రజ్ఞత ఉన్నాయి.

సనాతన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయంలో: తల్లిదండ్రులకు తర్వాత గురువులకు దేవతా స్థానాన్ని ఇస్తారు. ఈ సంప్రదాయాన్ని కవి పాటించాడు. సంపుటిలో మొదటి కవిత తల్లి ప్రస్తావన చేసింది. రెండవ కవిత తండ్రి బరువు బాధ్యతల్ని మననం చేసుకుంది. మూడవ కవిత గురువును స్తుతించింది.

‘అమ్మ స్పర్శ’ శీర్షికతో ప్రకటించబడిన కవితలో పిల్లలపై తల్లి చూపించే ప్రేమను, ప్రదర్శించే కోపాన్ని, గుండెల నిండా మూటగట్టుకునే ఆత్మీయతను, కవి గుర్తుకు చేసుకున్నాడు.

“ఎలా మర్చిపోగలను అమ్మ పంచిన ప్రేమను
ఉద్యోగం కోసం ఊరిడిచి వెళ్ళినప్పుడు
అమ్మ కళ్ళలో ఆనందం..
ఏళ్లు గడిచినా ఇంటికి తిరిగిరాలేదని
అమ్మ మనసులో ఆవేదన..
గుండెల్లో గునపాలై గుచ్చుతున్నాయి నన్ను..
అమ్మపాదాలు తాకి అందుకోవాలి ఆశీర్వాదాలు
అమ్మ స్పర్శతో పొందాలి చిన్ననాటి అమ్మ ప్రేమను!”

అంటున్న కవిలో కొండంత ఆర్తి..అభిమానం.. కనిపించాయి. అమ్మను గుండెల్లో దాచుకున్న కవి ఈ కవితను తన స్వీయ అనుభవంగా రాసుకున్నప్పటికీ.. ఎందరో తల్లి బిడ్డలకు ఈ కవిత వర్తిస్తుంది.

‘నాన్న కలలు’ శీర్షికతో ఉన్న కవితలో కవి తన తండ్రి నిర్వర్తించిన బరువు బాధ్యతలను మనసు నిండుగా జ్ఞప్తికి చేసుకున్నాడు. పిల్లల జీవితాలకు తండ్రి ఒక దివిటీలా ఏ విధంగా వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడో ఈ కవిత స్పష్టం చేసింది. ఈ కవితను కవి తన అనుభవంగా రాసుకున్నప్పటికీ.. పిల్లల భవిష్యత్తుకై కష్టపడే ప్రతి తండ్రి తాపత్రయాన్ని ఈ కవిత ప్రదర్శించింది. ‘గురుదేవో భవ’ కవితలో విద్యార్థుల జీవితాలను విజయ మార్గాల వైపు నడిపించే గురువుల దార్శనికతను పేర్కొన్నది. సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతి ఒడిలో సేద తీరే వాడే గురువుగా పేర్కొంటూ గురువు మీది వాత్సల్యాన్ని కవి గొప్పగా ప్రకటించుకున్నాడు.

తల్లిదండ్రులు, గురువు, నమస్కృతి తరువాత వరుసగా ఉన్న కవితల్ని గమనిస్తే.. ఒక్కో కవిత ఒక్కో అర్థాన్ని పరమార్థాన్ని వివరించింది. కొన్ని కవితల్ని ఒక వర్గంగా పరిశీలించే ఆస్కారం కూడా కవి కల్పించాడు.

మేధో వలసలు వద్దు

‘మళ్ళీ రావాలి మీరు’ కవితలో విద్యాధికులు విదేశాల బాట పట్టడంపై కవి విచారించాడు. భారతీయ మేధస్సు విదేశీ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ఎంతో బాధపడ్డాడు. అందుకే మాతృదేశ ఆస్తిత్వం కోసం వెళ్లిన వాళ్లంతా తిరిగి రావాలని ఆశించాడు. అట్లాగే.. దేశీయ మేధస్సుని విదేశీ పురోగతి కోసం వినియోగించవద్దు అంటున్న కవి విదేశాల్లో చదువుకొనవచ్చు అనే అభిప్రాయాన్ని మాత్రం ‘కల నెరవేరింది’ కవితలో విదేశీ విద్యకు బాటలు వేసింది అంటూ వినిపించాడు

డబ్బుకు ఆశపడి విదేశాల వెంట వెళ్ళి.. మాతృదేశంలో కన్న వాళ్ళని అనాథలను చేయవద్దంటూ ‘వ్యామోహం’ కవితలో యువతను అడ్డుకుంటున్న కవిలో భారతీయత ఒక కవచంలా కనబడింది.

చదువు‘కొంటున్నాం’

కొనలేని వాడికి చదువు ఒక మిథ్య
సరస్వతి తల్లితో చేస్తున్న వ్యాపారం
లక్షలకొద్దీ దోచుకుంటున్న చోద్యం
పుట్టకముందే కాన్వెంట్ స్కూల్లో సీట్లు
కట్టలేని ఫీజులతో తల్లిదండ్రుల పాట్లు

అంటూ ‘మేడిపండు చదువు’ శీర్షికతో ఉన్న కవితలో నేటి విద్యా వ్యవస్థను కవి దుయ్యబట్టాడు. విద్య వ్యాపారం అయిపోయినందుకు, అంగట్లో సరుకైపోయినందుకు, ధర్మాగ్రహం వ్యక్తం చేశాడు.

సాహిత్యం సమాజం కోసం

‘అక్షర జ్యోతులు’ అంటూ రాసిన కవితలో అక్షరమే ఆయుధగా వెలువడే రచనలు నవ సమాజాన్ని ఏ విధంగా కాంక్షిస్తాయో చెప్పకువచ్చాడు. ప్రతి రచయిత అక్షర వెలుగులతో తమ కృషిని కొనసాగించాలని ఆశించాడు. ‘ఎప్పటికీ నీ తోడుంటాను’ కవితలో సిరా చుక్కలతో సమాజాన్ని ప్రశ్నిస్తుంటానని.. ప్రజల్లో చైతన్యం రగిలిస్తుంటానని.. శపథం చేశాడు.

‘కవిత్వమే మానవత్వం’ కవితలో సాహిత్యం వ్యాపారం కాకూడదని కవులు ఆదర్శంగా నిలవాలని కవి సూచించాడు. ప్రజల కోసం రాసే కవులు ప్రజల నాలుకలపై నిలబడిపోతారు. ఈ క్రమంలో అభ్యుదయాన్ని ఆశించి రాసిన మహాకవి శ్రీశ్రీని ‘జనం కోసం శ్రీశ్రీ’ కవితలో స్మరించుకున్నాడు కవి.

అట్లాగే ప్రపంచంలో వేలవేల భాషలు ఉన్నప్పటికీ భావం ఒక్కటే అని, అంతరంగం ఒకటే అని, ‘అక్షర సవ్వడులు’ కవిత ద్వారా చెప్పుకున్నాడు.

‘కాలం వెనక్కి వెళితే’ కవితలో కవి అభ్యుదయవాదిగా దర్శనమిస్తున్నాడు. కుల మతాలను బందిఖానాలోకి నెట్టేసి మనుషులుగా మాత్రమే జీవించండి అనే సందేశాన్ని ఇస్తున్నాడు.

గ్రామాలే పట్టుగొమ్మలు

గ్రామాలే దేశ పునాదులుగా మనం చెప్పుకుంటాం. ఇటువంటి గ్రామాల గురించి కూడా కవి స్పృశించాడు. ‘మా ఊరి ఆనవాళ్లు’, ‘గ్రామాలెక్కడ?’ కవితలు హృద్యంగా ఉన్నవి. పచ్చని పంటలతో తరువులతో నిండా జనాలతో కళకళలాడే పల్లెల్లో కాలక్రమంలో చోటు చేసుకునే మార్పుల్ని కవి ఏకరు పెట్టుకున్నాడు. బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టే ప్రజలను చూస్తూ బాధపడిపోయాడు. అభివృద్ధి పేరుతో కనుమరుగయిన ప్రకృతి అందాలను శిథిల జ్ఞాపకాలుగా తలుచుకుంటూ గుండె బరువుతో వాపోయాడు. ఈ కవితలు నేటి అన్ని గ్రామాల పరిస్థితుల్ని తలపోస్తున్నవి. ‘వెచ్చని కిరణాలు’ కవిత కూడా గ్రామాన్ని పెనవేసుకున్నదే. పట్టణ ప్రాంతాల్లో వేగవంతం అయిపోయిన జీవన పరిస్థితుల గందరగోళంలో, మనిషి మానసిక పరిస్థితి కూడా యాంత్రికమైపోకుండా, రేపటి తరాలను ఉల్లాసపరిచేందుకు అప్పుడప్పుడు గ్రామాలను పర్యటించాలని సూచించాడు. పిల్లల్లో గ్రామీణ పరిస్థితుల గురించి అవగాహన కలిగించాలని తపించాడు. ‘కళ్ళు తెరవాలి నేతలు’ కవిత్వంలో గ్రామాల అభివృద్ధి కోసం యువతరం ఆలోచించాలని, నాయకులు తోడ్పాటు అందివ్వాలని, గ్రామాలు రియల్టర్ల బారిన పడకుండా కాపాడుకోవాలని కాంక్షించాడు. ‘మంచి దుప్పట్లు’ కవిత్వం కూడా గ్రామ సౌభాగ్యాన్ని ఆశిస్తున్నదే. ‘బతుకమ్మలు’ కవిత గ్రామాభ్యుదయాన్ని కోరుకున్నది

వివిధ వ్యక్తులు – విభిన్న మనస్తత్వాలు

కవి లౌకికుడు. సమాజాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో, సమాజంలో గూడు కట్టుకున్న మంచి చెడుల్ని అంతే అర్థం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘సర్వగుణ సంపన్నులు’ కవితలో సమాజంలో మనుగడ సాగించే పరోపకారుల గురించి పేర్కొన్నాడు..అట్లాగే

‘పగటి వేషాలు’ కవితలో సమాజంలో ఉన్న అవినీతిపరులు గురించి నిర్భయంగా మాట్లాడాడు.

‘గొప్పల గర్వం’ కవితలో పొగరు అహంకారం అహంభావం వంటివి ఆత్మహత్య సదృశ్యమేనని అని కవి చెప్పుకొచ్చాడు. పురాణాల్లో దుర్యోధనుని, చరిత్రలో హిట్లర్ని,ఉదాహరణగా పేర్కొన్నాడు.

గుండె నిండిన ఆనందాలు

చిన్న చిన్న ఆనందాలను కూడా విప్పార్చి చూసిన కవి, ఆ ఆనంద సమయాలకు కూడా పట్టం కట్టాడు.. ‘ఎనలేని ఆనందం’ కవితలో పల్లెటూర్లకు వచ్చే బస్సుల్ని చూసి ఆనాటి సమాజంలో పిల్లలు పొందిన ఆనందాన్ని వ్యక్తీకరించాడు.

కుల వృత్తులు

వృత్తి పనిలో కష్టసుఖాల్ని, దుఃఖాల్ని, హృదయపూర్వకంగా అర్థం చేసుకున్న కవి ‘కన్నీటి రంగులు’ కవితలో నేత కార్మికుల కష్టాల్ని తెలియజెప్పాడు..

‘చెమట చుక్కలు’ కవితలో రైతు జీవితాన్ని రైతు పడే కష్టాన్ని చెప్పుకువస్తూ.. ఎంత కష్టపడినా రైతు జీవితం కష్టాల కడలి గానే ఉండటం గురించి వాపోయాడు. ‘దిక్కెవరు’ కవిత కూడా రైతు కష్టాన్ని తెలియజేపింది. దేశం కోసం ఆరుగాలం కష్టపడుతూ.. అప్పుల పాలవుతూ.. ఆత్మహత్య చేసుకుంటున్న రైతులకు దిక్కెవరు అని ప్రశ్నించింది.

సంఘర్షణలు – స్పందనలు

కవిలో కొన్నిచోట్ల శ్రేయోభిలాషి కనిపిస్తున్నాడు. మరికొన్నిచోట్ల సానుభూతిపరుడు కనిపిస్తున్నాడు. ఇంకొన్ని చోట్ల భావుకుడు కనిపిస్తున్నాడు ఈ నేపథ్యంలో ‘త్రినేత్రం’ కవిత ఆశ నిరాశల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న మనిషిని ఆశావాదం వైపు నడిపిస్తున్నది. ‘ఉలిదెబ్బలు’ కవిత మనిషి తన జీవితంలో ఎదుర్కునే అగ్ని పరీక్షల్ని తెలియజేస్తున్నది. ‘అలలా సాగిపో’, ‘మానవత్వం పరిమళిస్తే’, ‘ఎక్కడున్నావని’, ‘పారిపోకు’, ‘విక్రమార్కుడిలా’, ‘దరహాసం’, ‘గాలిలో దీపం’ కవితలు మనిషిలో నిక్షిప్తమై ఉన్న మానవీయ విలువలను.. స్నేహమాధుర్యాలను.. ఆత్మవిశ్వాసాన్ని.. తట్టి లేపుతున్నాయి.

‘ఆశా దీపం’ కవిత దేశంలో నెలకొన్న అత్యాచారాలు అమానుషాలు వంటి పరిస్థితుల్ని నిరసిస్తూ విశ్వశాంతిని కోరుకున్నది.

‘గొర్రె తోక బెత్తెడు’ కవిత అనేక ఆందోళనల్ని కనబరిచింది. ప్రజల కోసం కాకుండా పదవుల కోసం పోటీపడే నాయకులు, సన్మానాల కోసం ఏకపడే సాహితీవేత్తలు గురించి అసహనం వ్యక్తం చేసింది. రైతు జీవితం ఎప్పటికీ మారకపోవడం గురించి బాధపడింది. ‘కొడిగట్టిన దీపం’ కవితలో మధ్యతరగతి జీవితాలు ఎదుర్కొనే ఆటుపోట్లు చర్చించ బడ్డాయి. ‘నీకు నువ్వే మేలుకొలుపు’, ‘మేల్కొలుపు’ కవితలు మనిషిని నిద్రావస్థ నుండి తట్టి లేపి జాగ్రత్తగా చేస్తున్నవి. విద్యావంతులు సమాజంలో చైతన్యం నింపకపోతే ఆధునిక సమాజంలో ఆదిమానవులు జన్మిస్తారంటూ హెచ్చరిస్తున్నవి.

‘దీపావళి వెలుగులు’ కవితలో అనాథ బాలల కోసం.. వారి జీవితాల్లో వెలుగుల కోసం.. కవి తాపత్రయపడ్డాడు. ‘నిశిలో శశి’ ఒక అనుభూతి కవిత. హృదయ భావనల్ని రంగరించింది. ‘లైఫ్ ఈజ్ థ్రిల్’ కవిత భిన్నమైనది. జీవితంలో ఉన్న ఆనందాలను తడివి చూసింది.

దేశాభిమానమే ఆస్తిగా..

దేశాభిమానాన్ని, జాతీయ చైతన్యాన్ని సమాంతరంగా కలిగి ఉన్న కవి దేశ పరిస్థితుల గురించి కూడా నిర్భయంగా మాట్లాడుతున్నాడు

‘మతమౌడ్యం’ పేరుతో ఉన్న కవిత పరమత సహనాన్ని లౌకిక వాదాన్ని అన్ని మతాలకు వినిపిస్తున్నది. ‘భిన్నత్వంలో ఏకత్వం’ పేరుతో రాసిన కవిత దేశ ప్రజలందరూ సంఘటితమై శత్రుదేశాన్ని ఎదుర్కోవాలి అని పిలుపునిస్తున్నది.

‘ముక్తకంఠం’, ‘మట్టి బొమ్మ’, ‘మానవత్వ మొక్కటే..’ కవితలు దేశాభిమానాన్ని నేర్పిస్తున్నవి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాలే ఊపిరిగా జీవించిన వీరులని స్మరిస్తున్నవి. ‘శిథిలమైన మనసులు’ కవిత మతవిద్వేషాల పేరుతో ధ్వంసమైన ఆలయాలను ప్రస్తావించింది. ‘అందాల కాశ్మీరం’ కవిత సున్నితమైన కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. ‘రాజ్యాంగమే రక్షణ కవచం’ కవిత ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడింది. ‘కూడు పెట్టవు’ కవితలో మత వైశమ్యాలను కవి ఎండ కట్టాడు. మత చాందస పద్ధతులని నిరసించాడు.

ప్రాంతీయ అభిమానం

‘కల నెరవేరింది’ కవితలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో నెలకొన్న సామాజిక రాజకీయ మార్పుల్ని ప్రస్తావించాడు. తెలంగాణ రాష్ట్రం విడివడినప్పటికీ తెలుగుజాతి ఒకటిగా ఉండాలని కూడా ఆశించాడు.

స్త్రీల పక్షపాతిగా

‘అర్ధాయుష్షు’, ‘వివక్ష’ కవితలు ఒక విలాపం. ఇక్కడ కవి అన్యం పుణ్యం తెలియని బాలికలు కామాంధుల కోరలకు చిక్కడం గురించి కలవర పడిపోతూ.. “కాలం తీరకముందే నేలరాలిన పూవులు” అంటూ దుఃఖించాడు. అట్లాగే సమాజంలో స్త్రీల పట్ల సాంద్రంగా పేరుకొని ఉన్న తరతరాల అణిచివేతను నిరసించాడు.. స్త్రీ శక్తిని ప్రశంసించాడు. ‘ఆమెకేమైందో’ కవిత వేశ్యల జీవితాన్ని అవస్థల్ని చూసి జాలి పడింది. బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.. పడుపువృత్తితో బలికాకండి.. అనే సందేశాన్ని కూడా ఇచ్చింది.

‘వరకట్నం మాకొద్దు’ కవితలు కట్నాన్ని ఆశించే మగ పిల్లలకి వాతలు పెట్టాడు. కొనుక్కున్న మొగుడు.. అడుక్కునే బిచ్చగాడు అంటూ ఎత్తి చూపాడు.

హెచ్చుమీరిన సాంకేతికత

అభివృద్ధిలో భాగంగా పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యం మనిషికి ప్రమాదంగా పరిణమిస్తున్నదని ‘భస్మాసుర హస్తం’ కవితలో చెప్పాడు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రమాదాన్ని తెలియజేస్తున్నది. అట్లాగే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పుస్తక పఠనం తగ్గిపోయిన పరిస్థితిని ‘పుస్తక ప్రపంచం’ కవితలో కవి చర్చించాడు.

పర్యావరణ ప్రేమికుడు

కవి అక్షరాన్ని ప్రకృతిని సమాంతరంగా ప్రేమిస్తున్నాడు. ‘హరిత పత్రాలు మానస గాత్రాలు’ అనే కవితలో పచ్చని ప్రకృతి కోసం పరితపించాడు.

‘సుమగంధాలు’ విభిన్న కుసుమాల వైశిష్యాన్ని తెలియజేసింది. ‘క్షమయా ధరిత్రి’ కవితలో రోజు రోజుకి అభివృద్ధి పేరుతో నాశనం అయిపోతున్న ప్రకృతి గురించి ఎంత బాధ పడుతున్నాడో, ప్రకృతి వినాశనం జరిగితే మారణహోమం తప్పదని అంత గట్టిగా హెచ్చరిస్తున్నాడు కూడా.

జీవిత చదరంగం

‘నా పయనం’, ‘ఆఖరి మజిలీ’ కవితలు జీవిత ప్రయాణంలో మలుపుల్ని గతుకుల్ని ప్రస్తావించాయి. మనిషి జీవితంలో బాల్యం నుండి ముసలి తనం వరకు ఉండే వివిధ దశల్ని తెలియజేసాయి. ‘జీవితనాటకం’ కవితలో జీవితంలో ఇంటా బయట మనిషి ఎదుర్కొనే సంసార బాధలు ఈర్ష్య ద్వేషాలు వంటి పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ జీవితమంటే ఒక రాజకీయమే అని అర్థాన్ని ఇచ్చేశాడు కవి. ‘గానుగెద్దు జీవితం’ కవితలో ఉద్యోగస్తుల జీవితాల దాటుకోలేని కష్ట సుఖాలు కళ్లకు కట్టినట్టుగా చూపెట్టబడ్డాయి.

ప్రజాస్వామ్య పరిరక్షణలో

మెరుగైన సమాజం కోసం నోటు కోసం అమ్ముడుపోకుండా, అవినీతి నాయకులకు ఓటును ఆయుధంగా చేసుకొని తరిమికొట్టాలని ‘ఓటుతో సమాధానం’ కవితతో పిలుపు ఇచ్చాడు కవి. కానీ ఎంత మంది ఓటర్లు నోటుకు అమ్ముడుపోకుండా ఉన్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

‘చెదబట్టిన ప్రజాస్వామ్యం’ కవితలో దిగజారుతున్న ప్రజాస్వామిక విలువల గురించి, పెరిగిపోతున్న రౌడీయిజం గురించి, గూడు కట్టుకుపోతున్న నిరుద్యోగం గురించి మాట్లాడాడు.

సామాజిక బాధ్యతలో –

కవిగా సమాజ హితం గురించి కవి ఆలోచన చేస్తున్నాడు. సమాజంలో రుగ్మతలు తొలగిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.

‘న్యాయమా’ కవిత కళ్లకు గంతలు కట్టుకొని కూర్చున్న న్యాయదేవత సాక్షిగా సమాజంలో జరుగుతున్న అల్లకల్లోలాలను ప్రస్తావించింది.

‘హృదయ రంగులు’ కవిత ప్రకృతిని అందలి వర్ణాలను జీవితానికి అపాదించి చూపెట్టింది.

సంక్రాంతి పండుగను వర్ణించిన ‘సరదాల సంక్రాంతి’ కవితలో తెలుగింటి సంబరం కనిపించింది.

రైతు జీవితాన్ని స్పృశించిన ‘కృషీవలుణ్ణి’ కవితలో చెమట చుక్కల సవ్వడి వినిపించింది.

‘విశ్వ కళ్యాణం’ కవితలో అగ్ర రాజ్యాలు ఆధిపత్యం కోసం సృష్టిస్తున్న మారణ హోమం గురించి కవి వాపోయాడు. ప్రపంచ శాంతి కోసం పరితపించాడు.

‘నేల రాలిన చినుకు’ కవితలో సకల భావాల సమ్మిళితం అయినప్పటికీ విద్యా విజ్ఞానం దేశ ప్రగతికి మూల స్తంభంగా చెప్పబడింది.

‘ఎముకల గూడు’ కవితలో అనాథ బాలలు.. అత్యాచారాలు.. గురించి మాట్లాడుతూ మానవ మృగాల గురించి కవి కలవర పడిపోయాడు.

‘ఏమివ్వగలను?’ కవితలు తన జీవన సహచర్యం గురించి కవి చెప్పుకున్నాడు. స్వార్థం సంకుచిత మనస్తత్వాలను వదిలిపెడితేనే మనసులోని మలినాలు తొలగిపోతాయని ‘చిన్న మౌనం’ కవితలో చెప్పుకువచ్చాడు. డబ్బు చుట్టూ తిరుగుతున్న బంధాలు అనుబంధాల కంటే దరిద్రం మరొకటి లేదని ‘డబ్బు చుట్టే’ కవితలో అభిప్రాయపడ్డాడు. ‘ముళ్ళబాటలో మల్లెపొదలు’ కవిత ద్వారా మనిషిలో కలిగే పరివర్తన గురించి సంస్కరణ గురించి చెప్పకు వచ్చాడు. బూజు పట్టిన ఆలోచనలకు స్వస్తి పలకాలని సూచించాడు.

ముగింపు

ప్రపంచాన్ని లోతుగా అన్వేషిస్తూ.. మంచి చెడులను విడదీసి ప్రస్తావిస్తూ.. సమాజం నిండా నెలకొని ఉన్న రుగ్మతలు తొలగిపోవాలని అభిలాషిస్తూ.. లోక హితాన్ని ఆశించిన అన్ని కాలాల కవి పానుగంటి శ్రీనివాసరెడ్డి. వచనంలో తన భావాలను.. బాధలను.. ఆశలను.. ఆకాంక్షలను.. సూటిగా స్పష్టంగా ప్రకటించుకున్న కవి తన దివిటీతో ఈ లోకాన్ని వెలిగించాలని తాపత్రయపడుతున్నాడు. ఇది తొలి సంపుటి అయినప్పటికీ పరిపూర్ణంగా పరిపక్వతతో ఉన్నది. వారి జీవిత అనుభవాలు అవగాహనలు తన కవిత్వానికి సంపూర్ణతను అపాదించిపెట్టాయి అనుకోవచ్చు.

***

దివిటీ (కవిత్వం)
రచన: పానుగంటి శ్రీనివాస్ రెడ్డి
ప్రచురణ: శామ్ పబ్లికేషన్స్,
పేజీలు: 104
వెల: ₹ 100
ప్రతులకు:
పానుగంటి శ్రీనివాస్ రెడ్డి,
ఫ్లాట్ నెంబర్ 304,
లీగ్ ఫినాంజా అపార్ట్‌మెంట్,
గోపనపల్లి, క్యూ సిటీ,
హైదరాబాద్ 500046
ఫోన్: 9492650439

Exit mobile version