[డా. మధు చిత్తర్వు రచించిన ‘డాక్టర్ ఏ.ఐ.’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
డాక్టర్ అర్జున్ రావు హిమ్స్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి అడుగు పెట్టాడు. సీనియర్ ఫిజిషియన్, మూడు దశాబ్దాల పైన అనుభవంతో, తీక్షణమైన కళ్లు అతని కళ్ళజోడులోంచి పేషెంట్ వివరాలన్నీ క్షణాల్లో కంప్యూటర్లలాగా అర్థం చేసుకోగలవు. పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని, వ్యాధి నిర్ణయాన్ని క్షణాల్లో కంప్యూటర్ లాగా చేయగలిగిన అతని చేతులు మాత్రం మృదువైన స్పర్శతో రోగికి స్వాంతన ఇస్తాయి. అతని మాటలతోనే సగం జబ్బు తగ్గుతుందని ఆశాభావం కలుగుతుందని రోగులు అనుకుంటారు. రోగుల బంధువులతో ఎంత ప్రమాదకరమైన జబ్బు విషయమైనా, సీరియస్ పరిస్థితినైనా ప్రశాంతంగా చెప్పి వాస్తవాలను ఎదుర్కొనే మానసిక స్థైర్యం ఇవ్వగలడు అతను.
బెడ్ నంబర్ ఎనిమిది. మధ్య వయసు పేషెంట్ యాదగిరి సీరియస్‌గా ఉన్నాడు. సెప్టిక్ షాక్. బీపీ తక్కువగా 100/60 వుంది. పల్స్ 124, ఆక్సిజన్ సాచురేషన్ 89%, మధుమేహం, మద్యపానం దీర్ఘకాలం వుండటం వల్ల వచ్చే కాలేయం జబ్బు, కాకుండా న్యూమోనియా ఊపిరితిత్తుల వ్యాధితో మత్తుగా ఉన్నాడు. “వైటల్స్?” అని అడిగాడు అర్జున్ రావు. అతని చుట్టూ నలుగురు డాక్టర్లు ఉన్నారు. ఒక నర్సు ఉంది.
కార్డియక్, మానిటర్ల నీలపు వెలుగులు, బీప్ బీప్ మని ధ్వనులూ ఐసియీలోని నిశ్శబ్దాన్ని చీల్చుకుని లయబద్ధంగా వినిపిస్తున్నాయి.కొన్ని బెడ్స్ మీది నుంచి హఠాత్తుగా వినవచ్చే రోగుల మూల్గులు, అరుపులు మందులకు తగ్గని నొప్పుల వల్ల పేషెంట్ల అవస్థలను సూచిస్తున్నాయి.
ముగ్గురు డాక్టర్లలో ముందు ఒక డాక్టర్ మాట్లాడింది. “సెప్టిక్ షాక్. హైపోటెన్షన్. డ్రగ్ రెసిస్టెంట్ న్యూమోనియా. సర్! ఇతనికి బీపీ పెంచే నార్ఎడ్రినలిన్ ఇన్ఫ్యూజన్ అర్జెంట్‌గా ఇవ్వాలి. యాంటీ బయాటిక్స్ లెనిజలిడ్, మీరోపెనెమ్కి మార్చాలి.” అర్జున్ రావు ఉలిక్కిపడ్డాడు. “ఇంకా పల్స్ అందుతోంది. ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తే చాలు!”
“నో డాక్టర్! మానవ స్పర్శతో మీరు చేసే పరీక్షల్లో లోపాలు 30 పర్సెంట్ ఉంటాయి. మైక్రోసర్క్యులేషన్ విఫలం అవుతోంది. అతనికి అర్జెంటుగా నార్ఎడ్రినలిన్ డ్రిప్ ఇవ్వాలి. ముందుగానే.”
అర్జున్ ఇబ్బందిగా కదిలాడు. మిగిలిన యువ రెసిడెంట్ డాక్టర్లు కూడా ఆశ్చర్యంగా నోళ్ళు తెరిచి చూస్తున్నారు. (Aura) ఆరా. అది హొలోగ్రామ్. తనని రౌండ్స్‌లో ఫాలో అయ్యే కొత్త డాక్టర్. కృత్రిమ మేధ కల డాక్టర్. ఆగ్మెంటెడ్ యూనివర్సల్ రీజనింగ్ అసిస్టెంట్. క్షణాల్లో మానిటర్స్ లోని డేటాను విశ్లేషించి డయాగ్నోసిస్, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, చేయవలసిన ట్రీట్మెంట్ చెప్పుకుంటూ పోతుంది. దీనిని కొత్తగా హాస్పిటల్ యాజమాన్యం నియమించారు. ఒక నెల నుంచి డ్యూటీ చేస్తోంది. “ఓకే! ప్రెసర్స్ అయనోట్రోప్స్ మందులతో ఐ.వి డ్రిప్ స్టార్ట్ చేయండి! మీరోపెనిమ్ వన్ గ్రామ్ బి.ఐ.డి, లెనిజోలిడ్ 600 మిలిగ్రామ్ మొదలు పెట్టండి!”
డాక్టర్ ఆరాతో సహా అర్జున్ రావు ఇతర మానవ డాక్టర్లతో కలిసి తర్వాత బెడ్ వద్దకు చేరుకున్నాడు. కానీ అతని మనసులో అనిశ్చితి ఇబ్బంది కలుగుతూనే ఉన్నాయి.
నిశ్శబ్ద విప్లవం ఇంటెన్సివ్ కేర్‌లో జరిగిపోతోంది. ‘డాక్టర్ ఆరా. ఏఐ. క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. నన్ను మించిపోయింది. బహుశా నా అవసరమే ఉండదేమో ఇక ముందు!’
***
2034. గత దశాబ్దంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల హాస్పిటల్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. 20, 30 అంతస్తుల భవనాలలో కార్పొరేట్ ఆసుపత్రులు అన్ని చోట్లా వెలిశాయి. అదే సమయంలో మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయాలు కూడా విపరీతంగా పెరిగిపోయి రోగులకి, ఈ హాస్పిటల్స్‌కే వెళ్లే వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కూడా దొరికింది. చిన్న క్లినిక్‌లు మధ్యతరగతి వారికి సేవ చేసే చిన్న నర్సింగ్ హోమ్‌లు క్రమంగా అదృశ్యమైపోయాయి. చాలా మంది డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్స్ లోనే ఉద్యోగం చేసుకోవాల్సి వస్తోంది. ఈ హాస్పిటల్స్‌లో అద్భుతంగా వేగంగా కన్సల్టేషన్, ల్యాబ్ పరీక్షలు, వ్యాధి నిర్ణయం చికిత్స జరిగిపోతూ ఉంటాయి అంతర్జాతీయ ప్రమాణాలతో. ఇలాంటి వాటితో చిన్న క్లినిక్కులు పెట్టుకున్న మంచి స్పెషలిస్ట్ డాక్టర్లకి కూడా పోటీ పడలేక సరైన ఆదాయం రావడం కష్టమైపోయింది. అసలు మానవ డాక్టర్లు ఇదివరకు నడిపే చిన్న క్లినిక్‌లు, దవాఖానలు, రోబోట్ డాక్టర్లతో నడుపబడుతున్నాయి. అలాంటి సమయంలోనే డాక్టర్ అర్జున్ రావు ‘హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్’ HIMS లో ఇంటెన్సివ్ కేర్ మెడికల్ డాక్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. కనీసం ఇరవై సంవత్సరాల సర్వీస్ అవుతోంది. ఈ సమయంలో అతడికి ఎంతో అనుభవం కాకుండా పేరు కూడా వచ్చింది. అది అతని ప్రైవేట్ ప్రాక్టీస్‌లో కూడా ఉపయోగపడింది. కానీ వైద్య రంగంలో శరవేగంతో మార్పులు వస్తున్నాయి. HIMS యాజమాన్యం చేతులు మారుతోంది. విదేశీ వ్యక్తులు, ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఎవరెవరో హాస్పిటల్ కార్పొరేట్ అధిపతులవుతున్నారు. మార్కెటింగ్ వ్యూహాలు, టార్గెట్లు, బిజినెస్ మోడల్స్.. ఇలాంటి మాటలు వినవస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి అర్జున్ రావు ఉద్యోగం నడుస్తూనే ఉంది. కొత్తగా ఏఐ యంత్రాలు ఇంటెన్సివ్ కేర్‌లో ఏర్పరిచారు. రోగుల వివరాలన్నింటినీ విశ్లేషించి ఏఐ రోబో డాక్టర్లు రెండు డాక్టర్ అర్జున్ రావు వెనుక తిరుగుతూనే ఉన్నాయి.
అయస్కాంత పట్టాల మీద నిశ్శబ్దంగా తేలిపోతూ నడిచే రోబోటిక్ నర్సులు ఇంజక్షన్లు చేస్తున్నాయి. ముక్కులో పొట్టలో ట్యూబులు అమరుస్తున్నాయి. క్షణాల్లో ఆక్సిజన్ మాస్కులు అమర్చటం, అవసరమైతే వెంటిలేటర్ కనెక్ట్ చేయడం కోసం డాక్టర్‌ను పిలవడం చేస్తున్నాయి.. కొన్ని రోజులలో ఎండోట్రేకియల్ ఇంట్యుబేషన్ అంటే శ్వాస నాళంలో గొట్టం అమర్చడం కూడా చేసేస్తాయేమో! కానీ ఆ పరిస్థితి ఇంకా రాలేదు. అర్జున్ రావు బెడ్ నంబర్ రెండు దగ్గరికి రాగానే రోబోటిక్ డాక్టర్ ఆల్ఫా వన్ అన్నది “డాక్టర్ మీరు ఇస్తున్న యాంటీబయాటిక్ ఈ పేషెంట్ కి పనిచేయదు. కొత్త ప్రోటోకాల్ ప్రకారం టిగోసైక్లిన్కి మార్చితే 20 పర్సెంట్ ఎక్కువ బాగా పని చేసి జబ్బు తగ్గిస్తుంది”. అర్జున్ రావు అతని వెనక ఉన్న రెసిడెంట్ డాక్టర్లు గతుక్కుమన్నారు. ఒక రెసిడెంట్ అప్పుడే మొబైల్ టాబ్లెట్‌లో చూసి “కరెక్ట్” అన్నాడు. మళ్లీ రోబో డాక్టర్లు వేగంగా నిర్ణయాలు చెప్పడం జరిగిపోతోంది. బెడ్ నంబర్ 8 దగ్గర్నుంచి ఆల్ఫా 2 గంభీరంగా చెప్పింది “కార్డియాక్ మోనిటర్లో ఈసీజీలో ‘ఎక్టోపిక్స్’ ఎక్కువగా వస్తున్నాయి. పేషెంట్ ఫిబ్రిలేషన్ లోకి పోతున్నాడు. నేను డి.సి. షాక్ ఇస్తున్నాను.”
“ఆగు! కోడ్ రెడ్ చెప్పు!” అని చెప్పే లోపలే డి.సి షాక్ ఇవ్వడం పేషెంట్ సైనస్ రిథమ్ లోకి రావడం జరిగిపోయింది.
ఆల్ఫా వన్ అన్నది “మీరు అక్కడికి వెళ్లి, కోడ్ రెడ్‌లో కార్డియాలజిస్ట్‌ని పిలిచి వచ్చే లోపల రెండు నిమిషాలు సమయం పట్టేది. పేషెంట్ మరణించేవాడు. ఆల్ఫా టు కరెక్ట్ టైంకి కరెక్ట్ చికిత్స ఇచ్చింది.”.
అర్జున్ రావు మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు ఐసియూలో అతి వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇది కరెక్టే. ఇప్పుడు హడావిడిగా నర్సులు పరిగెత్తడం కోడ్ బ్లూ, కోడ్ రెడ్ అని స్పీకర్లో ప్రకటనలు రావటం, నిరంతరంగా మోగే మానిటర్ల ధ్వనులు, డాక్టర్లు ఆదుర్దాగా అరిచే అరుపులు ఆర్డర్స్, అన్నీ తగ్గిపోయాయి. చాలా వేగంగా నిర్ణయం తీసుకుని చికిత్స చేసే రోబోటిక్ డాక్టర్లు, ఆల్ఫా1, ఆల్ఫా2,.. మెత్తటి మోటర్స్ చప్పుడుతో మాగ్నటిక్ ట్రాక్ మీద సున్నితంగా ప్రయాణిస్తూ ప్రతి బెడ్ దగ్గరకు వెళ్లి మందులు ఇంజక్షన్లు ఇచ్చే యంత్ర నర్సులూ నిరంతరం పనిచేస్తూ తిరుగుతున్నాయి. అవి జీతం అడగవు. వాటికి నిద్ర రాదు. 24 గంటలూ పని చేయగలవు. మనిషి కంటే వేగంగా నిర్ణయం తీసుకోగలవు.
“ఈ పేషెంట్ కి ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోతోంది. ఇది రెస్పిరేటరీ ఫెయిల్యూర్ టైప్ టూ. సీపీఓడీ. ఇదికాక కార్డియాక్ ఇన్ఫార్క్షన్ వుంది. బ్లడ్ యూరియా పెరుగుతోంది. సోడియం తగ్గుతోంది. ఇతనికి కొద్ది క్షణాల్లో ఇంట్యుబేషన్ చేయాలి. ప్రిపేర్ ఫర్ ఇంట్యుబేషన్ అండ్ వెంటిలేషన్. కాల్ క్రిటికల్ కేర్ టీమ్. లేదా నేనే చేస్తాను.” నిశబ్దంగా గంభీరంగా అంది ఆల్ఫా వన్, బెడ్ నంబర్ 10 దగ్గర. పేషెంట్ ఆయాస పడుతున్నాడు. ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతోంది 81%కి. ఆ మాట నిజమే, కానీ కొంచెం ఆగి ఆక్సిజన్‌ను మాస్క్‌తో ఇచ్చి పరిస్థితి మెరుగ్గా చేయడానికి ప్రయత్నించవచ్చు గదా. ఇది కాక పేషెంట్ బంధువులకు ముందు చెప్పాలి. వారిని ఓదార్చాలి. ఖర్చులు ఎంతవుతాయో చెప్పి సమ్మతి తీసుకోవాలి. ఆలోచిస్తున్నాడు అర్జున్ రావు.
“కన్సెంట్ ఫారమ్, అటెండెంట్ వద్ద మీరు తీసుకోండి. టైమ్ లేదు!” అంటోంది ఆల్ఫా వన్. ఎక్కడ నుంచో క్రిటికల్ కేర్ టీం వచ్చి మత్తు మందు ఇంజెక్షన్లు ఇచ్చి, పేషెంట్ నోరు తెరిచి చక చకా ఇన్ట్యుబేషన్ చేసి రెండు నిమిషాల్లో వెంటిలేటర్ కనెక్ట్ చేసేసారు. అర్జున్ రావు ఐసీయూ బయటికి వెళ్లి పేషెంట్ల బంధువులకి పరిస్థితి చెప్పడం తప్ప వేరే గత్యంతరం లేదు. సన్నగా ఏడవసాగింది ఆమె. “మీ భర్తకి వెంటిలేటర్ అర్జెంట్‌గా పెట్టడం అవసరం అయింది. అతను క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఒక వేళ వద్దు అంటే దానికి బాధ్యత మీరే తీసుకోవాలి!” ఈ విధంగా చెప్పసాగాడు అర్జున్ రావు మృదువుగా. అయినా ఆదుర్దా బాధలో రోదనలు వినిపిస్తున్నాయి అతనికి. అతని మనసులో అనిపిస్తుంది ఈ పని ఆరా(Aura) చేయగలదా? అది నిర్వికారంగా మాట్లాడుతుంది.10 పర్సెంట్ 20 పర్సెంట్ అని డేటా చెబుతుంది. సహానుభూతి ఉండదు. ఉన్నా చూపదు. ఎందుకంటే అది ఉన్న విషయాలు ఉన్నట్లు సైన్స్ ప్రకారం చెప్పటానికి మాత్రమే, లీగల్ సమస్యలు రాకుండా చూడటానికి మాత్రమే ప్రోగ్రామ్ చేయబడింది.
“ఆరా (AURA) ఆగ్మెంటెడ్ యూనివర్సల్ క్రిటికల్ రీజనింగ్ అసిస్టెంట్. మీరు మీ హాస్పిటల్లో వాడితే 50% ఫలితాలు మెరుగవుతాయి.” అనే ప్రకటన రాసిన ఫ్లెక్సీలు హాస్పిటల్ ముందు కట్టారు. ఆరా (AURA) తయారు చేసిన మెడికల్ కంపెనీ తరఫున తయారు చేసిన మెడికల్ ఏఐ కంపెనీ తరఫున పెద్ద పార్టీ జరుగుతోంది. రెండు రోజుల పాటు ఉపన్యాసాలూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, సాయంత్రానికి పెద్ద బ్యాంక్వెట్. ఆశ్చర్యంగా ఈ బ్యాంక్వెట్‌లో హాస్పిటల్ యాజమాన్యం, అంటే సీ.ఈ.ఓ. పటేల్, చైర్మన్ మెహతా, కమిటీ మెంబర్లు విలియమ్స్, మనూభాయ్, వెంకట్‌రెడ్డి తదితరులంతా ఉన్నారు. 500 కోట్ల పైనే ఖర్చుతో 20 అంతస్తుల్లో నిర్మించిన భవనం (HIMS) హిమ్స్ అధునాతన ఏఐ వైద్య సదుపాయాలతో బ్రహ్మాండంగా నడుస్తోంది. అర్జున్ రావు తన మిత్రుడు డాక్టర్ శేషగిరి, డాక్టర్ లతా నాయుడు, డాక్టర్ మూర్తి లాంటి వారితో కలిసి హాజరయ్యాడు. వీళ్ళంతా తన తోటి సీనియర్ డాక్టర్లు, ఫిజిషియన్, సర్జన్ కార్డియాలజీ, క్రిటికల్ కేర్ నిపుణులు.
“మేనేజింగ్ కమిటీలో ఒక్కరే స్థానిక తెలుగువాడు ఉన్నాడు. యాజమాన్యం అంతా మారిపోయింది” అంది ఆశ్చర్యంగా లతా నాయుడు. ఆమె క్రిటికల్ కేర్ చీఫ్.
“అవును. హైదరాబాద్‌లో చాలా హాస్పిటల్స్‌లో కార్పొరేట్ యాజమాన్యం చేతులు, షేర్లు, మారి విపరీతంగా వృద్ధి చెందుతోంది. మనం కొంత మంది మాత్రమే మిగిలి ఉన్నాము ఇక్కడ పనిచేస్తూ. వాళ్ళు నలుగురూ ఒక టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రోబోట్ నర్సులు ప్లేట్లలో తినుబండారాలు పానీయాలు తీసుకువచ్చి యాంత్రిక స్వరాలతో “గుడ్ ఈవినింగ్” చెప్పి వెళ్ళిపోతున్నాయి. అవి తీసుకుంటూ మాట్లాడుకుంటున్నారు డాక్టర్లు. ఏఐ ఉపయోగాల గురించి రోబోటిక్ సర్జరీ ఆన్లైన్ రోబో డాక్టర్ల కన్సల్టేషన్ దీని వల్ల ఎంత ఆదాయం ఎక్కువ ఈ వరసగా ఉపన్యాసాలు చెప్పసాగారు కంపెనీ అధికారులు. అర్జున్ రావుకి కూడా ఒక విజ్ఞప్తి అందింది. ఇంటెన్సివ్ కేర్‌లో ఆరా సిస్టమ్‌లు బాగా పనిచేస్తున్నాయని ప్రశంసిస్తూ పవర్ పాయింట్ ఉపన్యాసం చెప్పాలి. అర్జున్ రావు దానికి నిరాకరించాడు. నా దగ్గర డేటా, ఇతర సమాచారం సరిగా లేదని సాకు చెబుతూ తప్పుకున్నాడు. డాక్టర్లు నర్సులు బాగా వేగంగా పనిచేసినప్పటికీ వాటికి సహానుభూతి లేదని ఇంకా మానవ డాక్టర్ పర్యవేక్షణ చికిత్స నిర్ణయాలు కావాలని అతని ఉద్దేశం. కానీ అది కార్పొరేట్ పాలసీలకు వ్యతిరేకం. అందుకని లౌక్యంగా తప్పుకున్నాడు. నెలకి 4,00,000 జీతం వచ్చే ఉద్యోగం! ఎవరి ఇంటిలో వ్యక్తిగత బాధ్యతలు వారికి ఉన్నాయి. ఈ ఉద్యోగం పోతే ఎలా?అనే భయం సీనియర్ డాక్టర్లు నలుగురులో అంతర్లీనంగా పట్టి బాధిస్తూనే ఉంది.
***
నెలలు గడిచిపోతున్నాయి. భయపడిన సమయం రానే వచ్చింది. విశాలమైన ఏసీ గది. పెద్ద గంధపు రంగు టేబుల్ ముందు నాలుగు కంప్యూటర్ మానిటర్లతో అతని వెనుక సీసీ కెమెరాలతో సహా సీ.ఈ.ఓ., చైర్మన్ మెహతా కూర్చొని ఉన్నాడు. ఎదురుగా డాక్టర్ అర్జున రావు, ఫిజీషియన్ డాక్టర్ లతా నాయుడు క్రిటికల్ కేర్ నిపుణురాలూ,కూర్చున్నారు.
మెహతా గంభీరంగా చెప్పసాగాడు.
“ఆరా (AURA) ఏఐ సిస్టమ్ వచ్చినాక ఇంటెన్సివ్ కేర్‌లో రోగులకి చికిత్స ప్రమాణాలు మెరుగయ్యాయి. మరణాల సంఖ్య 30% తగ్గింది. మన ఆదాయం 50% పెరిగింది. సుమారు 12 మంది డాక్టర్లు రాత్రి పగలు షిఫ్టులలో పనిచేసే వారు, డ్యూటీ డాక్టర్లు, 20 మంది నర్సులు ఆయాలు, వార్డుబాయ్‌లు చేసే పని రెండు ఆరా డాక్టర్లు మాత్రమే చేస్తున్నాయి. అందువల్ల చాలామందిని ఉద్యోగాల లోంచి విరమింపజేస్తున్నాము. మీరిద్దరు చాలా సీనియర్లు కాబట్టి మరికొంతకాలం మీరు ఆరాని పర్యవేక్షించే డాక్టర్లుగా ఉండవచ్చు. మీ జీతం మాత్రం మూడువంతులు తగ్గించడానికి మేనేజ్మెంట్ నిర్ణయించింది. మీరు ఇంత వరకు హిమ్స్ హాస్పిటల్స్ కి చేసిన సేవలకు ధన్యవాదాలు చెప్పడం కోసమే ఈ ఏర్పాటు.”
అర్జున్ రావు కాళ్ళకింది నేల కదిలినట్లయింది. డాక్టర్ లతా నాయుడు కోపంగా లేచి నిల్చుంది.
“ఇది పరోక్షంగా మాకు ఉద్వాసన చెప్పడమే గదా సర్. ఇంత సీనియారిటీ తర్వాత మా జీతాలు తగ్గించడం అంటే అవమానమే కదా. ఇంతకంటే డైరెక్ట్ గా రిజైన్ చేయమని అడిగితే బావుండేది కదా. నేను ఈ క్షణమే రిజైన్ చేస్తున్నాను.” ఆవిడ అర్జున్ రావు కేసి చూసింది. “మీరు మీకు తగిన నిర్ణయం తీసుకోవచ్చు! నేను మాత్రం వెళ్లిపోతున్నాను.” డాక్టర్ అర్జున్ రావుకి చాలా బాధ్యతలున్నాయి. ఇప్పుడు ఉద్యోగం పోతే ఎలా! పిల్లల చదువు సెటిల్మెంట్సు ఎలా! ప్రైవేట్ క్లినిక్ ప్రాక్టీస్ పెట్టుకున్నా ఇంత డబ్బు వస్తుందని అనుకోవడం అత్యాశ. అయినా కానీ నిబ్బరంగా లేచి నిల్చున్నాడు. “నా కెరీర్లో కనీసం ఎన్నో వందల మంది ప్రాణాలు కాపాడి ఉంటాను సర్. ఐసీయూలో ఎంతోమంది నేను క్రిటికల్ పరిస్థితి నుంచి రక్షించిన పేషెంట్లు ఇప్పటికీ వచ్చి నాకు కృతజ్ఞత తెలియజేసి గుర్తు చేస్తుంటారు. ప్రతి పండుగకు నాకు బెస్ట్ విషెస్ పంపిస్తూనే ఉంటారు. నేను చెప్పిన చికిత్సనే ఎంతో మంది వాడుతూ ఉంటారు. ‘ఆరా’ మంచిదే కానీ దానికి సహానుభూతి లేదు. త్వరగా చికిత్స చేయడమే కాదు, త్వరగా వ్యాధి నయం చేయడమే కాదు, మానవ డాక్టర్ పర్యవేక్షణ సానుభూతి ప్రోత్సాహం చనిపోయే పేషెంట్‌కు కూడా ఆశను ఇస్తాయి. కొన్ని పరిస్థితులలో జబ్బుని తగ్గిస్తాయి కూడా. ఆ సహానుభూతి, అంకిత భావం లేనప్పుడు మేము వృథా. యంత్రాలు చెప్పినట్లు మేము పనిచేయలేము. నేను కూడా రిజైన్ చేస్తున్నాను.”
***
చల్లని రిసెప్షన్ హాల్లో ఇప్పుడు డాక్టర్ అర్జున్ రావు, డాక్టర్ లతా నాయుడు కూర్చుని ఉన్నారు.
రాజీనామాలు అయిపోయాయి. ఇప్పుడు వారికి తెల్లకోటులు లేవు. మామూలు ప్యాంటు షర్టులో ఒక సాధారణ వ్యక్తి తాను అర్జున్‌రావు. ఒక సాధారణ స్త్రీ తను లత నాయుడు. ఇద్దరూ దీర్ఘాలోచనలో ఉన్నారు. నిశ్శబ్దంగా రోబోటిక్ నర్సు నడుచుకుంటూ వచ్చింది. ఏ భావమూ లేని కంఠస్వరంతో హాలులో వేచి చూస్తున్న వాళ్లను ఉద్దేశించి “మిస్ సుహాసినీ!” అని పిలిచింది. కర్చీఫ్‌తో పదేపదే కళ్లు తుడుచుకుంటూ కూర్చున్న ఒక యువతి సీట్ నుంచి లేచి వేగంగా “ఎస్ డాక్టర్” అని దాని దగ్గరికి వెళ్లి నిలబడింది.
“నేను డాక్టర్ ఆరా అసిస్టెంట్, సిస్టమ్ నంబర్ 212 ని మాట్లాడుతున్నాను. మీ తమ్ముడు బెడ్ నంబర్ ఎనిమిదిలో వెంటిలేటర్లో క్రిటికల్ బట్ స్టేబుల్‌గా ఉన్నాడు.30 శాతం అవకాశం కోలుకోవడానికి. 70 శాతం మరణం సంభవిస్తుంది. క్రిటికల్ బట్ స్టేబుల్.”
ఆమె అడిగింది “ఎలా మరి ఇప్పుడు డాక్టర్?”
ఆరా సిస్టమ్ రోబట్ మాట్లాడకుండా నడిచి వెళ్లిపోయింది.
“నేను గందరగోళంలో ఉన్నాను. నాకేమీ అర్థం కావడం లేదు.” ఆమె, సుహాసిని ఏడ్వసాగింది. తెల్లని బుగ్గలమీద కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. డాక్టర్ అర్జున్ రావు లేచి ఆమె దగ్గరికి వెళ్లి భుజం మీద చేసి “ఏడవకు అమ్మా, మీ తమ్ముడికి తప్పకుండా నయం అవుతుంది.” అన్నాడు మృదువుగా.
“మరి క్రిటికల్, బట్ స్టేబుల్.. అంటే?”
“డాక్టర్లు స్టేబుల్ అని చెప్తే, ఇంకా అతని పరిస్థితి సీరియస్ గానే ఉందని అర్థం. న్యూమోనియా, రెస్పిరేటరీ ఫెయిల్యూర్,సెప్టిక్ షాక్, వెంటిలేటర్ మీద చికిత్స ఇవన్నీ సీరియస్ పరిస్థితులే. యువకుడే కాబట్టి చాలా వరకు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఈ శాతాలు పూర్తిగా గణాంకాలే. అవి ఖచ్చితంగా నిజం అవుతాయని గ్యారంటీ ఏమీ లేదు. మనకి తెలియని శక్తేదో మనల్ని బతికిస్తుంది, అని నమ్ము. డోంట్ వర్రీ!” అంటూ సాంత్వన చెప్పాడు డాక్టర్ అర్జున్ రావు.
ఆమె, సుహాసిని, కళ్ళు తుడుచుకుంది. “ఓకే సార్!నాకర్థం అయ్యింది. ఇప్పుడు తేలికగా ఉంది. మనసులో దైవాన్ని ప్రార్థిస్తాను. తమ్ముడు తప్పకుండా బాగా కోలుకుంటాడు.”
వెయిటింగ్ హాల్లో వేచి చూస్తున్న పేషెంట్ల బంధువులకి ఒకొక్కరికీ ఆరా రోబోట్ వెళ్లి గణాంకాలు చెబుతోంది. దాని కంఠస్వరం యాంత్రికంగానూ, పదాలు ఒకే రకమైన మాడ్యులేషన్‌తో ఒక విషయం చెబుతూ ఉన్నట్లు ఉన్నాయి. అంతే కానీ ఏ భావమూ లేదు. కొందరు ఏడుస్తున్నారు. కొందరు థ్యాంక్స్ అంటున్నారు. కొందరి చేతిలో బిల్లు పెట్టి కట్టమంటోంది. దాని చేతిలో పీ.ఓ.ఏస్. అంటే అమ్మకాలు చెసే నంబర్ లు కొట్టే చిన్న యంత్రం ఉంది. దాంతో కొందరు డబ్బు చెల్లిస్తున్నారు.
అక్కడి ఏ.సి. చల్లదనంలో కూడా జీవన్మరణ సమస్యలూ, వ్యాపార విధానాలూ, కృత్రిమ మేధ విశ్వరూపమూ, ఇద్దరు డాక్టర్లకీ చెమటలు పట్టేట్లు చేసింది.
***
కొన్ని నెలల తర్వాత వాళ్ళందరూ ఒక మామూలు కాఫీ రెస్టారెంట్ లో సమావేశమయ్యారు. సీనియర్ డాక్టర్లు అర్జున్ రావు, లతా నాయుడు.. యువ డాక్టర్లు చందన, శార్వాణి, ఏ.ఐ స్పెషలిస్ట్ ఇంజనీర్లు వరుణ్, నర్సన్.
“మనకి కావాల్సింది సహానుభూతి గల కంప్యూటర్స్. ఎఐ అంటే కృత్రిమ మేధ అవసరం లేనేలేదని అనడం లేదు” అన్నాడు డాక్టర్ అర్జున్.
“అందుకే, ఈ ప్రాజెక్ట్ సర్! మానవత్వం కలిగిన కృత్రిమ మేధ. చిన్నబడ్జెట్‌తో మధ్యతరగతి హాస్పిటల్. అందరికీ అందుబాటులో ఉండే ధరలు.సేవ రోబోట్లతో కానీ నిర్ణయాలు మానవ డాక్టర్లు మాత్రమే చేస్తారు. గణాంకాలు శాతాలు కావు సానుభూతి, వివరణ, ఓదార్పు ఇవే మన లక్ష్యాలు.”
“‘సహాయ్ SAHAI’ అనే ఆకర్షణీయమైన పేరుతో స్పెషలైజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హాస్పిటల్ కేర్ ముందుగా 50 పడకలతో తయారు అవుతుంది. తర్వాత ఫలితాల బట్టి ఇంకా అభివృద్ధి చేద్దాం. ఒక చిన్న భవనం చాలు. తక్కువ బడ్జెట్లో కొందాం. కొంచెం బ్యాంకు లోను. కొంచెం మన డబ్బు.”
“మేము మెడికల్ రోబోట్లనీ డేటా అనాలసిస్‌ని సప్లై చేసే బాధ్యత తీసుకుంటాం.”
“గ్రామీణ ప్రాంతాల పేషెంట్లకి ప్రాముఖ్యతను ఇద్దాం. అక్కడ క్యాంపులు చేద్దాం. మరీ బీదవారికి ఉచిత చికిత్స ప్రకటిద్దాం.”
“కాని డబ్బు ఎలా?”
“తలొక ఇల్లు అమ్ముదాం. ఇంట్లో నగలు తాకట్టు పెడదాం. మనకి వున్న ఇళ్ళ స్థలాలు కూడా అమ్ముదాం. అందరం నిశ్చయించుకుంటే జరగని పనిలేదు. కొంత బ్యాంక్ లోన్ తీసుకుందాం. అతి త్వరలో సహానుభూతి నిండిన సహాయ్ హాస్పిటల్ మొదలుపెడదాం. దానికి ప్రేరణ డైరెక్టర్ సీనియర్ డాక్టర్ అర్జున్ రావు గారు.”
అలా వాళ్ళు ఆవేశంగా సంభాషించుకుంటూ నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలోని వైద్య చరిత్రలో మరొక కొత్త సహానుభూతి కల అధ్యాయానికి నాంది మొదలైంది. అర్ధరాత్రి అవుతోంది. “ఆలోచనల బ్లూ ప్రింట్లతో ఒక వారంలో మళ్ళీ కలుద్దాం” అన్నాడు డాక్టర్ అర్జున్ రావు. “చీకటి పడిపోతోంది. ఇక వెళ్లిపోదాం.” అన్నాడు డాక్టర్ అర్జున్ రావు.
“అర్ధరాత్రి అయినా, త్వరలోనే మరొక సూర్యోదయం అవుతుంది. మరో మంచి పనికి పునాది త్వరలోనే పడుతుంది. అదే మన ఆశ. బాధాతప్త రోగులకి మన వాగ్దానం” అన్నారు యువ ఎ.ఐ స్పెషలిస్టు.
“తథాస్తు! మన యుద్ధం పెద్ద గోలియత్ లాంటి రాక్షసి తోనే. కానీ మన విశ్వాసాలూ, విలువలే మన ఆయుధాలు. పదండి!” అన్నాడు అర్జున్ రావు.
***
ఒక సంవత్సరం తరువాత సోషల్ మీడియా అంతా డాక్టర్లు లేని హాస్పిటల్స్ వచ్చాయని పొగుడుతూ ప్రశంసిస్తోంది. “మీ సేవలు అవసరం లేదు. 92% రోబోట్లే డాక్టర్లు చేసే పనులు చేస్తున్నాయి” అని చాలామంది డాక్టర్లకు ఉద్యోగాలు తీసేశారు. ఇంటి దగ్గర ఇన్నాళ్లుగా డాక్టర్ అర్జున్ తెల్ల కోటు తీసేసి తన స్టెతస్కోప్ ని పురాతన చారిత్రక శిథిలం లాగా టేబుల్ మీద పడేశాడు. ఇరవై సంవత్సరాల తన అనుభవాలూ జ్ఞాపకాలతో, సానుభూతి దయ నిండిన ఏఐ సిస్టమ్స్ ఉన్న డాక్టర్స్‌ని నిర్మించడానికి ప్రణాళిక రాయడం మొదలు పెట్టాడు. డాక్టర్లు లేని ఆసుపత్రులు అని మిగిలిన ప్రైవేట్ యాజమాన్యాలు ప్రచారం చేసుకుంటూ ఉంటే, అర్జున్ రావు రూపొందించిన రోబోట్లు అల్గోరిథంలు చూడలేనివి చూడగలగవు. ఒక పేషెంట్ కళ్ళలోని భయం, ఆదుర్దా, ఆశని అర్థం చేసుకోగలవు. క్యాన్సర్ ఉంది అని చెప్పబోయే ముందు, బాధాకరమైన నిజం చెప్పేటప్పుడు మృదుత్వం, పేషెంట్ చెప్పేది కూడా శ్రద్ధగా వినటం, అతని శరీరాన్ని మాత్రమే యాంత్రికంగా స్కాన్ చేయడం కాదు అతని మనసుని కూడా అర్థం చేసుకొనే విధంగా కౌన్సెలింగ్ ఇవ్వడం ఇవన్నీ అవసరం. ఏఐ జబ్బు నయం చేసే మందులు టెస్టులూ చెప్పొచ్చు. ఒక డాక్టర్ని విశ్లేషణలో మించి పోవచ్చు. కానీ అది సేవా పూర్వక సానుభూతిని చూపలేదు.
‘సహాయ్’ ఏ.ఐ నిండిన యంత్రం కాదు. వ్యాధి నిర్ణయం చేసే కంప్యూటర్ డేటా కాదు. సానుభూతి నిండిన వైద్య సలహాలు ఇచ్చే డాక్టర్. రోబోట్ డాక్టర్ ఎప్పుడు వివరణ సున్నితంగా చేయాలో, ఎప్పుడు పేషెంట్ల బిపి పల్స్ ఆక్సిజన్ లాంటి వైటల్ స్టాటిస్టిక్స్ కాదు, వారి అంతర్గత భావాలు, మాటలు, మౌనం గూడా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎప్పుడు మానవ డాక్టర్‌కి చూపించి అభిప్రాయం తప్పకుండా తీసుకోవాలో నిర్ణయించ కలిగిన యంత్రంగా కృత్రిమ మేధ తయారు అవాలి! అవుతుంది! చికిత్సలో ఆశాభావం కూడా భాగం కావాలి!
మొదట వైద్య ప్రపంచం నవ్వింది. ఆ తర్వాత సమాజం సహాయ్ ఆసుపత్రుల వైపు తిరిగి నడవసాగింది. గ్రామాల్లో కూడా సహాయ్ వైద్య శాలలు మొదలైనాయి.
సహాయ్ మానవ డాక్టర్లని తొలగించలేదు. ఎంత వరకు పనిచేయాలో అంతవరకే చేసి మానవ డాక్టర్లు వెనుక దన్నుగా నిలబడింది. డాక్టర్లని ఏ విధమైన ఏఐ కూడా నిర్మూలించలేదు. అది వారిని తిరిగి పునరుజ్జీవనం చేసింది.
***
కొన్ని సంవత్సరాల తరువాత ఓ సాయంత్రం హిమ్స్ హాస్పిటల్ నుంచి మళ్ళీ డాక్టర్ అర్జున్ రావుకి ఆహ్వానం అందింది.
హిమ్స్, సహాయ్ రెండు సంస్థల విలీనం కోసం అడుగుతున్నారు! అర్జున్ యువ వైద్య విద్యార్థుల ముందు నిల్చుని ఆవేశంగా ఉపన్యసిస్తున్నాడు.
“సహాయ్ ఏఐ డాక్టర్ల ని ఎప్పటికీ తొలగించి వారి స్థానంలో రాలేదు. ఏ డాక్టర్ అయితే ఆధునిక విజ్ఞానం లేక బూజు పట్టి పోతారో, ఎవరు మానవత్వం కోల్పోతారో వారినే తొలగిస్తుంది. అందుకనే మనం ఆరా (AURA) సిస్టమ్‌కి సహానుభూతి నేర్పాలి. ఏఐ ఎవరికీ పోటీ కాదు, తోడుగా ఉంటుంది. మన ముందు కాదు, వెనక నుండి నడిపిస్తుంది తన విజ్ఞాన విశ్లేషణతో మన పని వేగంగా సులభంగా చేయడానికి సాయం చేస్తుంది. అంతే. అది ఎక్కువ కాదు, తక్కువా కాదు.”
ప్రపంచ వైద్య చరిత్రలో నవీన అధ్యాయం మరొకటి మొదలైంది.
తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత మధు చిత్తర్వు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన వీరు మెడికల్ థ్రిల్లర్లు రాయడం స్వాభావికం. “ఐ.సి.సి.యూ”, “బై బై పోలోనియా”, “ది ఎపిడమిక్”, “కుజుడి కోసం”, “నీలీ – ఆకుపచ్చ” వంటి నవలలు రచించారు.
