Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దొంగ.. పోలీస్.. మధ్యలో ఉత్తేజ్

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘దొంగ.. పోలీస్.. మధ్యలో ఉత్తేజ్’. రచన ఆసూరి హనుమత్ సూరి.]

‘భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి.. డుకృణ్ కరణే..!’

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి గాత్రంలో శ్రావ్యంగా శంకరులవారి గానం వినబడుతోంది..లీలగా..

కారు సమీపిస్తున్న కొద్దీ పాట గట్టిగా వినిపించ నారంభించింది..!

ఎదురుగా దారికి అడ్డంగా ఓ నల్లటి కారు.. రైట్ ఇండికేటర్ వేసి ఉంది.. భజగోవిందం పాట అందులోంచి వస్తున్నట్టు గమనించాడు ఉత్తేజ్. సడన్‌గా తన కారు బ్రేక్ వేసాడు. కారు దిగి చూసి షాక్ అయ్యాడు. రోడ్డుకి పక్కనే ఉన్న చెట్టుకి గుద్దుకుని కారు ఆగిపోయిందని తెలుసుకున్నాడు. కారులో తానొక్కడే ప్రయాణిస్తున్నాడు. వెళ్లి చూద్దామా వద్దా అని అనుకుంటూనే అప్రయత్నంగా కారు వైపుకు గబా గబా వెళ్ళాడు. కార్ ఆడియో లోంచి వస్తోంది భజగోవిందం పాట.

బాగా దగ్గరికి వెళ్లేసరికి ఆ దృశ్యం భయానకంగా ఉంది. డ్రైవర్ సీట్లో ఉన్నతను స్టీరింగ్ క్రింద నలిగిపోయి ఇరుక్కుని ఉన్నాడు. ఒక చెయ్యి విండో లోంచి బయటికి వేళ్ళాడుతూ ఉంది. చేతి చూపుడు వేలినుండీ కారిన రక్తంతో నేల తడిసి ముద్దయి ఉంది.

ఉత్తేజ్ కొంచెం సేపు షాక్ లోనే ఉన్నాడు. ఏం జరిగిందో ఆలోచిస్తుంటే చెమటలు పట్టేసాయి. ఒక్క క్షణం రోడ్డు మీదే కూర్చుండి పోయాడు. అంతలోనే తేరుకుని తన కారు దగ్గరికి వెళ్లి నీళ్ల బాటిల్ తీసుకుని నీళ్లు తాగి బాటిల్ తీసుకుని ప్రమాదం జరిగిన కారు దగ్గరికి వెళ్ళాడు. డ్రైవర్ సీట్ పక్కనయితే ఎవరూ లేరు. వెనక ఎవరయినా ఉన్నారేమో నని తొంగి చూసాడు. వెనక ఓ ఆడ మనిషి ఉంది. తలకి రక్తం కారుతోంది. ఓ పక్కగా వాలి ఉంది. ఎందుకైనా మంచిదని కర్చీఫ్ ని చేతికి చుట్టుకుని వెనుక డోర్ ని తెరిచే ప్రయత్నం చేసాడు.

ఆశ్చర్యంగా డోర్ లాక్ అయిలేదు. అంటే ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల క్రితమే వీళ్ళు కారు దిగి ఉండాలి. డోర్స్ లాక్ అయ్యేలోపే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది.

వెనక ఉన్న ఆమె ప్రాణాలతోనే ఉన్నట్టు అనిపిస్తోంది. తనదగ్గరున్న బాటిల్ లోని నీళ్లు ఆమె ముఖం పై చల్లాడు. కొద్దిగా స్పృహలోకి వచ్చినట్టు కదిలింది. నాడి పట్టుకుని చూసాడు. మామూలుగానే కొట్టుకుంటోంది. ఎవరైనా సాయం చేస్తారేమో నని అటూ ఇటూ చూసాడు. తెల్లవారు ఝాము దాదాపు నాలుగు గంటలు. ఎవరూ అటుగా రాలేదు. తనే ఆమెని ఎత్తుకుని తన కారులో వెనక సీట్లో పడుకో బెట్టాడు. ముందుసీట్లో ఉన్నతను ప్రాణాలతో ఉన్నట్టు అనిపించడం లేదు. ఈమెనయితే ముందు కాపాడదామనిపించింది. చేసేదేం లేక కారు స్టార్ట్ చేసాడు.

ఆమె మూలుగులతో కారులో భయంకర వాతావరణం. ధైర్యం చాలడం లేదు. అయినా అరవైలో వెళ్తున్నాడు. అనంతపురం ఇంకా 76 కిలోమీటర్లు ఉంది. ‘ఈ స్పీడ్ లో వెళ్తే ఇంకా గంట పైగా పట్టేట్టుంది. ఈమె అంత దాకా ప్రాణాలతో ఉంటుందా? అనవసరంగా ఇదంతా నెత్తిన వేసుకున్నానా? ఏదో నా దారిన నేను పొతే ఈపాటికి అనంతపురం చేరి ఉండొచ్చు’ అనుకుంటూ భయం భయంగానే డ్రైవ్ చేస్తున్నాడు ఉత్తేజ్.

***

“డాడీ మాకోసం ఏం తెస్తావ్ బెంగుళూరు నుండీ. బొమ్మ బ్యాటరీ కారు తెస్తావా?” అని కూతురు అడుగుతుంటే..

“తప్పకుండా తెస్తా రా.. మరి తమ్ముడికేం తేను?” అని అడిగితే “వాడికెందుకు డాడీ నా కార్లోనే వెనక కూర్చోపెట్టి తిప్పుతాగా!” అన్న కూతురి మాటలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి? పాపం పిల్లలు ఎంత ఆశ గా ఎదురు చూస్తుంటారు! ఇప్పుడు వాళ్లకేం చెప్పాలి? అయిదు దాటిందంటే సరిత ఫోన్ చేస్తుంది, ఎంతదాకా వచ్చారని. ఏం చెప్పాలి? హాస్పిటల్‍లో ఉన్నానని చెప్పాలా లేక పోలీస్ స్టేషన్‍లో ఉన్నా అని చెప్పాలా? సతమతమవుతున్నాడు.

ఇంతలోనే ఫోన్ మోగింది. అయితే తనది కాదు. వెనకాల ఉన్న ఆమె దగ్గర చేతికి ఉన్న పౌచ్ లోంచి వస్తోంది రింగ్. వెంటనే కార్ ఆపాడు. ఇంతలోనే ఫోన్ కట్ అయ్యింది. ఆమె భుజానికి తగిలించుకుని ఉన్న పౌచ్ ఓపెన్ చేసి చూసాడు. మొబైల్ లాక్ అయి ఉంది. కాల్ ఎవరు చేశారో తెలీదు. కాల్ లిఫ్ట్ చేసి ఉంటే బావుండేది. మొబైల్ తీసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఈసారి కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యాలని.

ఇంత లోనే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఈ సారి తనది. భార్య సరిత ఫోన్ చేసింది. ఇప్పుడు లిఫ్ట్ చెయ్యాలా వద్దా అన్న మీమాంస. లిఫ్ట్ చేస్తే ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? చెప్తే అనవసరంగా టెన్షన్ పడుతుంది. లిఫ్ట్ చెయ్యక పొతే అదో టెన్షన్. ఏమయ్యిందో అని. ఇలా అనుకుంటూనే లిఫ్ట్ చేసాడు.

“దగ్గర్లోనే ఉన్నా అనంతపురం ఎంటరవగానే కాల్ చేస్తా. పెట్టెయ్” అన్నాడే గానీ ఎప్పుడూ తాను ఇలా చెయ్యలేదు. కాల్ మాట్లాడుతూనే ఇంటిదాకా వస్తాడు డ్రైవ్ చేసుకుంటూ. ఇప్పుడయినా సరితకి టెన్షన్ తప్పేట్లు లేదు.

***

ఇలా అనుకుంటుండగానే అనంతపురం వచ్చేసింది. ముందుగా పోలీసులకి ఇన్‍ఫాం చేద్దాం అనుకున్నాడు. ముందు ఈవిడని గవర్నమెంటు హాస్పిటల్‌కి తీసుకెళ్తే మిగిలినవన్నీ మళ్ళి చూసుకోవచ్చు అనుకుంటూ హాస్పిటల్‌కి వెళ్ళాడు. అక్కడి పోలీస్ స్టేషన్ లోనే చెప్తే సరి అనుకుంటూ కారు ఆపి ఎమర్జెన్సీ వార్డ్ లోపలికి వెళ్ళాడు. ఎవరో ఎదురుగా రక్తమోడుతున్న మనిషిని స్ట్రెచర్ పై తీసుకెళ్తున్నారు. వెనక ఇద్దరు పోలీసులు వెళ్తున్నారు. స్ట్రెచర్ తన వైపుకు వస్తోంది. తన దాకా వచ్చాక చూసాడు. షాక్..

ఇంతకు ముందు కార్లో చనిపోయాడనుకున్న వ్యక్తే.. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ముందు పోలీసులు. ఏం చేయాలో పాలు పోలేదు. ఇదేదో తన తలకి చుట్టుకునేలా ఉంది. ‘ఏదయితే అదయింది’ అనుకుంటూ అక్కడున్న పోలీసులతోనే చెప్పేసాడు. తాను ఒకావిడని ఆక్సిడెంట్ అయిన కార్లో నుంచీ తెచ్చానని, ఆమె స్పృహ కోల్పోయి ఉందని.

పోలీసులు.. “హమ్మయ్య! గొప్ప పని చేశావ్! పద నీ కారు దగ్గరికి” అంటూ, స్ట్రెచర్‌ని తీసుకు రమ్మని నర్సులకి పురమాయించి ఉత్తేజ్‍ని కారు దగ్గరికి తీసుకెళ్లారు.

***

పోలీసులు తమకు అవసరమయిన సమాచారాన్ని నమోదు చేసుకుని, ఉత్తేజ్ దగ్గర కొన్ని పత్రాలమీద సంతకాలు తీసుకుని మళ్ళీ పిలిచినప్పుడు స్టేషన్‍కి రమ్మని చెప్పి పంపించేశారు.

‘హమ్మయ్య, గండం గట్టెక్కింది. తాను అనుకున్నంత సమస్యలయితే రాలేద’ని ఊపిరి పీల్చుకుని ఇంటికెళ్ళాడు ఉత్తేజ్.

ఏం ఇంత ఆలస్యమైందని అడిగిన సరితకి టైర్ పంక్చర్ అయిందని అబద్ధం చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు.

***

ఆ రోజు తన కూతురు పుట్టిన రోజు. బెంగుళూరు నుండీ తెచ్చిన కారును బహూకరించి పుట్టిన రోజును జరుపుకోవాలని ప్లాన్ చేసుకుని సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉన్నాడు. స్నానం చేసి కూతుర్ని స్కూల్ దగ్గర దింపి ఇంటికి రావాలని బయలుదేరాడు ఉత్తేజ్.

ఇంత లోనే ఫోన్. ఎవరా అని తీసి చూస్తే పోలీస్ స్టేషన్ టు టౌన్ అని ట్రూ కాలర్‌లో కనపడింది. భయం భయం గానే ఫోన్ తీసాడు. అవతల్నుండీ ఎస్సై. ఒకసారి పోలీస్ స్టేషన్‌కి రావాలని చెప్పాడు.

మళ్ళీ ఏం ప్రమాదం ముంచుకొస్తుందో.. అనుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు ఉత్తేజ్.

ఎదురుగా ఎస్సై, కానిస్టేబులు ఎదురు చూస్తున్నారు.

“నమస్తే సార్” అంటూ భయం భయంగా నిలబడ్డాడు ఉత్తేజ్.

“మీరు ఆ రోజు కార్ లోనే వదిలేసి వెళ్లిన అతను మీకు పరిచయమా?” అడిగాడు ఎస్సై.

“లేదండీ! ఆయన ఎవరో నాకు తెలీదు. అలాగే నేను హాస్పిటల్‌కి తీసుకొచ్చిన ఆవిడా నాకు తెలీదు” అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు ఉత్తేజ్.

“అడిగిందానికి సమాధానం చెప్పండి. అయినా మీరు ఆక్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులకు ఎందుకు ఫోన్ చెయ్యలేదు?” అడిగాడు ఎస్సై.

“ఏమో సార్. ఎవరికీ ఫోన్ చెయ్యాలో ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు భజగోవిందం పాట వింటున్న నా మనసు చాలా కూల్ గా ఉంది. తీరా దగ్గరికి వచ్చ్చాక చూస్తే ఇలా ఓ కారు చెట్టుకి గుద్దుకుని కనపడింది. డ్రైవింగ్ సీట్‌లో ఉన్నతను మామూలుగా పడి ఉంటే కాస్త ఏమైనా మైండ్ పని చేసేదేమో సార్. అతను చనిపోయినట్టు అనిపించేటప్పటికి నాకు చాలా భయం వేసింది. వెనుక ఉన్నావిడని చూసి పాపం అనిపించి ఆవిడనయినా బతికిద్దామని తీసుకొచ్చాను సార్. ఇంతకు మించి నాకేమీ తెలీదు.” భయం భయంగా చెప్పాడు ఉత్తేజ్.

“ఇప్పుడు చెప్తా వినండి..” అంటూ చెప్పనారంభించాడు ఎస్సై.

“మీరు ఆ రోజు ఆక్సిడెంట్‌కి గురయిన కారుని మేము వెంబడిస్తున్నాం. ఆ కార్లో ఉన్నతను మాకు ఫోన్ చేసి చెప్పాడు. తాను ఓ పెళ్ళికి వెళ్లి ఫామిలీకి సంబంధించిన నగల్ని తీసుకుని బెంగళూరు నుండీ వస్తున్నాడట.. వాళ్ళావిడ, పిల్లలు ఇంకో రెండు రోజులు బంధువుల దగ్గర ఉండి వస్తామని చెప్పడంతో. పెళ్లి దగ్గర ఒకావిడ “పెళ్ళికి వచ్చాను. ఈ రాత్రి నేనొక్కదాన్నే ఎలా వెళ్లాలో భయం భయంగా ఉందండీ.. ఈ నగలు అన్నీ వేసుకుని” అని వాళ్ళావిడతో అంటే, “ఎందుకు.. ఆ దార్లోనే మా ఆయన వెళ్తున్నారు. మిమ్మల్ని పెనుకొండలో దింపేసి మా ఆయన అనంతపురం వెళ్తారు.. మా ఆయనకిచ్చి పంపిస్తున్నా మా నగలన్నీ.. మీకేం భయం లేదు. మీ నగలు కూడా తీసి విడిగా కవర్‌లో పెట్టి మా ఆయన కివ్వండి. పెనుకొండలో మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి మీ నగల్ని మీకు అప్పచెప్తారు” అని ఆవిడని వాళ్ళాయనతో పాటు కారు ఎక్కించి పంపింది.”

“అయ్యో పాపం.. అలా జరిగిందా.. అందుకే ఆవిడ మెడలో ఒక్క నగ కూడా లేదు. ఇంతకీ మీరు ఆ కారుని ఎందుకు వెంబడిస్తున్నట్టు సార్?” అడిగాడు ఉత్తేజ్ ఎస్సైని.

“ఎందుకంటే.. సగం దూరం వెళ్ళాక మాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసినాయన భయం భయంగా అర్జెంటుగా రమ్మని చెప్పాడు. మా నగలన్నీ చోరీకి గురయ్యాయని. ముందు కార్‌లో వెళ్తున్నా అని కార్ నెంబర్ కూడా చెప్పాడు.”

“అయ్యో పాపం ఆవిడ అంటూనే ఉందికదా సార్ పాపం నగలన్నీ వేసుకుని రాత్రి ఎలా వెళ్లడం అని. ఆయన తోడు ఉన్నాడనే కదా బయలుదేరింది. ఇద్దరివీ పోయాయా అయితే. ఇంతకీ దొంగ దొరికాడా లేదా సార్?”

“చెప్తా వినండి. అతను మాకు ఫోన్ చేసి తన కారును వెంబడించమని ఎందుకు చెప్పాడో తెలుసా?”

“అవును నిజమే సార్. అతను మీరొచ్చేదాకా ఆగొచ్చుకదా. లేదా తనే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా ?” ఏదో తనే పాయింట్ కనుక్కున్నట్టు అడిగాడు ఉత్తేజ్.

“కదా! అతను ఇంకో విషయం చెప్పాడు. తను ఒకర్ని తలమీద బాది వెళ్తున్నాడట. అర్జెంటుగా రమ్మని చెప్పాడు.”

“ఓహో, దొంగ వీళ్ళని కొట్టి, దోచుకుని వెళ్తుంటే పట్టుకోబోయి బాది ఉంటాడు. తప్పించుకుని పోయాడేమో వాడు. అందుకే అతను దొంగని వెంబడిస్తూ ఉంటాడు. మీకు ఫోన్ చేసి మిమ్మల్నీ రమ్మని ఫోన్ చేసి ఉంటాడు. అంతేనా సార్?” అంతా అర్థమైపోయినట్టు చెప్పాడు ఉత్తేజ్.

“చూడండి ఉత్తేజ్ గారూ.. మీకు ఇంత వివరంగా విషయం చెప్పడానికి పిలిపించారనుకున్నారా పోలీసులు? మాకు వేరే పనేం లేదా?” సీరియస్‌గా అడిగాడు ఎస్సై.

“ఇంతకీ మీకేం కావాలో అడగండి సార్. చెప్పి వెళ్ళిపోతాను. మా అమ్మాయి పుట్టినరోజు ఈరోజే. త్వరగా ఇంటికెళ్ళాలి. కేకు తేవాలి. మా పాప వచ్చేలోగా!” అమాయకంగా చెప్పాడు ఉత్తేజ్.

“కానిస్టేబులూ.. ఈయన గారికి ఆ బహుమానం పట్రా.. పుట్టిన రోజట పాపం.. వాళ్ళ పాపది” ఎస్సై అంటున్నాడో లేదో ఓ కవరు పట్టుకొచ్చాడు కానిస్టేబులు.

విషయం అర్థం కాక బుర్ర గోక్కున్నాడు ఉత్తేజ్. ఆ కవర్‌లో ఏముందో.. మళ్ళీ ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనుకుంటూ లేచి నుంచున్నాడు ఉత్తేజ్.

“కూర్చోండి సార్. మీకు మా పోలీసు వారు ఇస్తున్న బహుమానం సార్ ఇది. తీసుకోండి. పుట్టిన రోజుని ఘనంగా జరుపుకోండి.” అంటూ కవర్ ఇచ్చాడు ఎస్సై.

ఏ అరెస్ట్ వారెంటో అనుకుంటూ.. కవర్ తెరిచి చూసాడు.

ఈసారి మళ్ళీ షాక్.. కవర్లో యాభై వేలు. అన్నీ ఐదు వందల నోట్లే.

“సార్ జోక్ చెయ్యకండి సార్. నాకేం తెలీదు. ఈ దొంగతనంతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నన్నొదిలేయండి సార్. మీకు దండం పెడతా” బతిమాలుతున్నాడు ఉత్తేజ్.

“ఉత్తేజ్ గారూ మీకింకా అర్థం కాలేదా.. మీరు ఆ దొంగని పట్టించారు. అందుకే మీకు ఈ బహుమానం.” అన్నాడు ఎస్సై.

“ఊరుకోండి సార్ మీరు, మీ జోకులు. నేనేంటి దొంగని పట్టియ్యడమేంటి?” అమాయకంగా అడిగాడు ఉత్తేజ్.

“ఉత్తేజ్ గారూ.. ఇక లాభం లేదు.. మీకు విషయం చెప్పాల్సిందే. ఆ రోజు ఆయన ఫోన్ చేసి తన కారును వెంబడించమని ఎందుకు చెప్పాడనుకున్నారు? తను ఒకర్ని బాదానని ఎందుకు చెప్పాడనుకున్నారు? ఆయనతో కారులో ఎక్కిన ఆవిడ్ని ఆయనే బాదాడు.”

“ఓహో ఆయనే దొంగన్న మాట. అందుకే ఆవిడ నగలు కూడా దోచుకుందామని ప్లాన్ వేశాడన్నమాట.” అందుకున్నాడు ఉత్తేజ్.

“పిచ్చివాడా.. అతడే బాది అతడే ఎందుకు పోలీసులకి ఫోన్ చేస్తాడు. అతను బాదిన ఆవిడే ఒక గజదొంగ. వాళ్ళది ఒక గ్యాంగ్. ఆవిడ మళ్ళీ ఎక్కడ లేచి తనను చంపేస్తుందో అని మమ్మల్ని రమ్మన్నాడు. మేము వచ్చేలోపలే గాబరాలో చెట్టుకి గుద్దుకుని ఈ ఆక్సిడెంట్.

మీరు ఎంతో ధైర్యంగా ఆవిడ్ని భుజానికి వేసుకుని, మీ కార్లో ఎక్కించి హాస్పిటల్‌కి తీసుకు వచ్చి మాకు గొప్ప సాయం చేశారు. ఆ రోజు మీరు చనిపోయాడనుకున్న అతను బతికి విషయం అంతా మాకు చెప్పాడు. పైగా మీరు ఆవిడ పౌచ్‌ని కూడా జాగ్రత్త గా తీసుకొచ్చి అప్పగించారు. నగలన్నీ భద్రంగా ఉన్నాయ్. సో మీకు డబల్ బొనాంజా కింద యాభై వేలు బహుమానంగా ఇస్తున్నాం, పోలీసుల తరపు నుండి. తీసుకోండి. ఒక ఫోటో దిగుదాం రండి.” అన్నాడు ఎస్సై.

“సో మీరు వెంబడిస్తున్నారు కనకే అతనూ బతికి బయట పడ్డాడు.. మీ వల్ల. అయినా మీరు అతన్ని వెంబడిస్తుంటే మీరు నా కన్నా ముందుండాలి కదా. నేను మీకన్నా స్పీడ్‌గా వెళ్తున్నానా ఏంటి?” అమాయకంగా అడిగాడు ఉత్తేజ్.

“మా జీపు పంక్చర్ అయి టైర్ మార్చుకుంటుంటే మీరు మమ్మల్ని క్రాస్ చేసి వెళ్లడం చూసాం. మీరే ఇలా హీరో అయిపోతారనుకోలేదండి ఉత్తేజ్ గారు!” చెప్పాడు కానిస్టేబులు.

“ఏదేమైతేనేం కథ సుఖాంతం.. నగలూ దక్కాయి. దొంగా దొరికింది. మీరు హీరో అయిపోయారు!” అభినందిస్తూ అన్నాడు ఎస్సై.

“అవునూ ఆ దొంగావిడ ఎలా వుంది. పాపం తలకి దెబ్బ తగిలింది. నేను ఆక్సిడెంట్ అనుకున్నా… తలా మీద బాదిన దెబ్బన్న మాట!”

“వుంది వుంది. మా హాస్పిటల్ లోనే వుంది. మిమ్మల్ని చూడాలంటోంది. పాపం మీరే కదా రక్షించింది. అందుకే మీకు ఏదో బహుమానం కూడా ఇవ్వాలంటోంది.” ఎస్సై అన్నాడు.. తమాషాగా.

అందరూ గొల్లున నవ్వారు.

ఉత్తేజ్ మాత్రం తను డ్రైవ్ చేసేటప్పుడు ఆ ఆడ దొంగ కాల్ లిఫ్ట్ చేసి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటున్నాడు.

Exit mobile version