[తెలుగు సాహితీ వనం – శ్రీమతి గడ్డం కృష్ణకుమారి స్మారక మినీకథల పోటీలో మూడవ బహుమతి గెలుచుకున్న కథ.]
“గంగన్నా! ఏమిట్రా ఈ వానలు? క్రిందటి సంవత్సరం కూడా ఇలాంటి అకాల వర్షాలతో పండిన పంటలన్నీ నీళ్ళపాలయ్యాయి. పోయినేడు చేసిన అప్పులే తీర్చలేదు. వడ్డీలతో కలసి అప్పు భారం మోపెడయ్యింది. అయినా తిప్పలుపడి అప్పు పుట్టించుకుని మళ్ళీ ఖర్చుపెట్టాం. పంటలేవీ కలసి రావటంలేదు. రాబోయే కాలంలో తిండిగింజలకు కూడా ముఖంవాచేలా ఉంది మన రైతుల పరిస్థితి.
పైగా మన ఊరి ఏరు రూపంలో మరో దురదృష్టం కూడా మనల్ని వెంటపడి వేధిస్తోంది. దీనిపై వంతెన కట్టమని ఎంతమంది నాయకులకు చెప్పినా, ప్రభుత్వాలకు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవటంలేదు. ఎన్నికల సమయమొచ్చిందంటే మన ఓట్లకోసం కాళ్ళకు బలపాలు కట్టుకుని మరీ తిరుగుతారు. అంతే మళ్ళా ఎన్నికలప్పుడే వారి దర్శనమయ్యేది. ఈ మధ్యలో రైతులన్నా, వాళ్ళ సమస్యలన్నా ఆ నాయకులకు చీమకుట్టినట్లుగా కూడా ఉండటంలేదు. అలుసై పోతున్నాం కదరా!
ఈ ఏటి ఒడ్డునానుకుని ఆవలివైపున మన పొలాలుండటం, వర్షాలకి, వరదలకి ఈ ఏరు పొంగి మన పొలాలు మునిగిపోవటం జరుగుతోంది. మనమంతా పొలం పనులు చేసుకోవడానికి ఏరుదాటాలంటే ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సివస్తోంది. అదే ఈ ఏరుపై వంతెన కడితే కొంతలోకొంతగా మన పరిస్థితి మెరుగవుతుంది.
ఏటికేడాది మన ఒంట్లో ఓపిక ఉడిగిపోతోంది. మన తాతలు, తండ్రులు కూడా ఈ సమస్యతో పోరాడి ఏమీ సాధించలేక వెళ్ళిపోయారు. ఇప్పుడు మన పరిస్థితిలోనూ ఏ మార్పూ రాలేదు. కానీ ఏదో ఒకటి చేసి ఈ సమస్యనుండి బయిటపడాలిరా” అవేదన, ఆకోశం నిండిన గొంతుతో నాగన్న మాట్లాడుతున్నాడు.
అంతా విన్న గంగన్న “ఔనురా నాగన్నా! నీవు చెప్పింది అంతా బాగానే ఉంది. మనిద్దరం చిన్నప్పటి నుండి కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. మన పొలాలు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఊళ్ళో మన ఇళ్ళు కూడా అలాగే కట్టుకున్నాం. ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నీవు చెప్పిన సమస్యకి నేను ఓ పరిష్కారం ఆలోచించానురా. అందులో భాగంగా నీతో పాటు ఊరిప్రజల సాయంతో నేనో ప్రయత్నం చేద్దామనుకుంటున్నానురా” అన్నాడు.
“ఏం చేద్దామనుకుంటున్నావురా?” అంటూ ఆతృతతో అడిగాడు నాగన్న.
“ఈ ఏరుపై ఓ తీగల వంతెన కట్టాలనుకుంటున్నాను. అందుకు మనకు ఖర్చు, శ్రమ కూడా తక్కువగా అవుతాయి. ఇలా వర్షాలు పడుతున్నప్పుడు మనం త్వరగా మన పొలాలకు చేరుకుని ఏటి ముంపు నుండి మన పొలాలను కాపాడుకోవటానికి వీలుకలుగుతుంది” అన్నాడు గంగన్న.
“ఏమిటి గంగన్నా? ఈ ఏటిమీద వంతెన కడతావా? అదేమైనా అషామాషీ వ్యవహారమనుకుంటున్నావా? నీవల్ల అయ్యే పనేనా చెప్పు?. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎందరో ప్రభుత్వాధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ వంతెన కనీసం కాగితాలపైన అయినా ముందుకు కదలటంలేదు. నువ్వు చదువుకుందేమో వేలిముద్రల బడిలో. వంతెన కట్టాలంటే ఎన్ని ఆలోచనలు చేయాలి? డబ్బులెలా సర్దుబాటు చేస్తావు? మన దగ్గర లక్షలేమీ మూలగటంలేదు కదా! అంత డబ్బు ఖర్చుపెట్టి మనమెలా వంతెనను కట్టగలం?” అంటూ తన సందేహాలను వరసగా చెప్పుకొస్తున్నాడు నాగన్న.
గంగన్న మాత్రం ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో “ఒరే నాగన్నా! నాక్కొంచెం నమ్మకమివ్వు! కొండలు పిండి కొట్టేస్తాను. ఈ ఏరుపై వంతెనను నేను కట్టి చూపిస్తాను” అన్నాడు.
“ఏరా గంగన్నా! నిజంగానే ఈ మాటనంటున్నావా! వంతెన కట్టాలంటే సిమెంట్, కంకర, ఇసుక ఎంత ఖరీదైనవో నీకు నేను వేరుగా చెప్పాలా. మనదగ్గర అంత డబ్బు లేదని కూడా నీకు తెలుసు కదా. మరి ఈ వంతెన కట్టడమెలా సాధ్యమవుతుంది?” అన్నాడు నాగన్న.
గంగన్న నవ్వుతూ “మనం మామూలు వంతెన కట్టటంలేదురా. తీగలతో వంతెన నిర్మించుకుందాం” అన్నాడు. “తీగల వంతెనా? అది గట్టిగా ఉంటుందా?” అని సంశయం వెలిబుచ్చాడు నాగన్న.
“మనం నడవటానికి అనుకూలంగా ఉంటుందిరా. ప్రతిరోజు మనం పొలాల దగ్గరకు వెళ్ళటానికి ఎంతగా కష్టపడుతున్నామో నీకు స్వానుభవమేగా? ఆ బాధ ఈ వంతెన నిర్మించుకుంటే తీరిపోతుంది” అన్నాడు గంగన్న.
“నాకు ఇంకాస్త వివరంగా చెప్పు గంగన్నా” అన్నాడు నాగన్న.
“పాడయిపోయిన కరెంట్‌వైర్లు, కేబుల్‌వైర్లు, అల్యూమినియం తీగలను మోపులుగా చేసి వంతెన నిర్మించుకుందాం. ఈ వంతెనపై నుండి మనం పది, పదిహేను నిముషాలలో మన పొలాలకు చేరుకోవచ్చు. వానలు కురిసేవేళ త్వరగా పొలాల దగ్గరకు వెళ్ళి ఏటికి గండి పడకుండా చూసుకోవచ్చు. ఇలా ఈ వంతెన ద్వారా చాలా వెసులుబాటు వస్తుంది మనందరికి. నువ్వు కూడా మనవాళ్ళందరితో కలసి ఆలోచించరా. ప్రస్తుతానికి నా మదిలో వచ్చిన ఆలోచన ఇది. ఇంకెవరైనా మంచి సలహాలనిస్తే తీసుకుని ముందుకెడదాం. పదపద పొలంలో ఈ రోజు కలుపు తీయాలి” అంటూ గొడుగు తీసుకుని నాగన్నతో కలసి కదిలాడు గంగన్న.
రైతులందరినీ కలుపుకుని గట్టి తీగలను పోగుచేసుకుని, తీగలను బలంగా మెలికలు వేసి చాపలల్లిన విధంగా తయారుచేశాడు. ఏటికి ఇరువైపులా నాలుగు ఇనుప స్తంభాలను బలంగా పాతి, వాటికి కరంట్ స్థంభాలకు తీగలు బిగించినట్లుగా ఈ తీగల చాపను అమర్చాడు. అదే చాపలో కొంత భాగాన్ని ఏటవాలుగా చేసి పశువులను కట్టే గుంజలను ఇనుపస్తంభాలకి ఎదురుగా పాతి, వాటికి బిగించాడు. ఆ తీగలపై పలచగా ఉన్న చెక్కలను కట్టి నడవటానికి వీలుగా తయారుచేశాడు.
తన అమోఘమైన తెలివితేటలతో, ఆత్మవిశ్వాసంతో చూస్తూండగానే ఈ పనులన్నింటిని పూర్తిచేసి వంతెనను ఊరిప్రజలముందు సాక్షాత్కరింపజేసాడు ఎనభై సంవత్సరాల వయసు మీదపడుతున్న గంగన్న. అందరూ ఓ చక్కని అద్భుతాన్ని చూసినట్లుగా దాని వంక చూస్తూ, ‘అసాధ్యాన్ని సుసాధ్యం’గా మలచి, తమ సమస్యకు పరిష్కారం చూపించిన గంగన్నకి అభినందనలు తెలిపారు.
“ఒరే గంగన్నా! మన MLAగారిని పిలిపించి ఈ వంతెనను చూపిద్దామా?” అని ఉత్సాహంగా అన్నాడు నాగన్న.
“ఎందుకురా పెద్దవాళ్ళను పిలవటం? పేపరు వాళ్ళు వచ్చారుగా. వాళ్ళు పేపర్లో ఈ వార్తను వేస్తారు. ఆ వార్తను చూశాకైనా మన పెద్దలలో కదలిక వస్తుందేమో చూద్దాం?” అన్నాడు గంగన్న.
గంగన్న అనుభవాలనన్నింటిని రంగరించి నిర్మించిన ఆ తీగల వంతెన ఆ గ్రామ చరిత్రలో ఓ మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది.
ఉప్పలూరి మధుపత్ర శైలజగారు హైదరాబాద్ వాస్తవ్యులు. ఒక స్ఫూర్తి కలిగించే వార్త చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణాన్ని అవ్యక్త భావనను మనసులో దాచుకోలేక అక్షరాలతో సొబగులద్ది కవితగానో, కథగానో మార్చటం వారికి ఇష్టమైన పని. ఆ క్రమంలో ఇప్పటివరకు దాదాపుగా 300 కథలు, 100 కవితలు రాశారు. ‘మధుపత్రాలు’, ‘మధుమాలిక’, ‘మధువనం’, ‘మధుమంజీరాలు’ అనే కవితా, కథా సంపుటాలను ప్రచురించారు. తన రచనలకు బహుమతులనిస్తూ, ప్రచురిస్తున్న సాహితీ సంస్థలకు, పత్రికలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.
