Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎద లోతుల్లో..

[చందకచర్ల రమేశ బాబు గారు అనువదించిన ‘ఎద లోతుల్లో..’ అనే కథని అందిస్తున్నాము. కన్నడ మూలం శ్రీమతి కె. వి. రాజలక్ష్మి.]

“హ్యాపీ బర్త్ డే పప్పా!” మొబైల్ గడియారం సరిగ్గా పన్నెండు గంటల ఒక్క నిమిషం చూపుతోంది. గణేశ్ నుండి ఇలాంటి ఒక మెసేజ్ వస్తుందని తెలుసు కాబట్టి ఇంకా నిద్రలోకి జారుకోలేదు. మామూలు రోజులకంటే ఎక్కువగా పని ఉన్నా, కొడుకు నుండి వచ్చే మెసేజ్ కోసం చాతక పక్షిలా వెయిట్ చేస్తున్నా. నలభై ఎనిమిమిది నిండి నలభై తొమ్మిదిలోకి అడుగు పెడుతున్నాను. ఇంకో నాలుగు నెలలు గడిస్తే కొడుకు ప్రొబెషన్ అవధి ముగిసి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. తరువాత పెళ్ళి విషయం ప్రస్తావించాలి. ఈ ఇంటికి వాడే వారసుదారుడు. ఇల్లు కట్టుకోవాలసిన లేదా కొనవలసిన అవసరం లేదు. ఒకటికి రెండు ఇళ్ళున్నాయి. వాడికి వచ్చే జీతంలో వాడూ, వాడి సంసారం గడపవచ్చు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివినినందుకు ఒకేసారి ఏ సిఫారసూ లేకుండా కుంభస్థలాన్నే కొట్టాడు. భార్య సంపాదించవలసిన అవసరంలేదు. కానీ తన కొడుకుకు మంచి మర్యాద, గౌరవం దొరికే సంబంధాన్నే తీసుకురావాలి. ఈ విషయంలో మాత్రం తనకు జరిగినట్లుగా జరగరాదు.

ఎందుకో మరచిపోవాలి.. కాదు, గుర్తుకే తెచ్చుకోకూడదు అని మనసుకు ఎన్ని కళ్ళాలు వేసినా మనసనే మర్కటం వినాలిగా? జన్మనిచ్చిన తల్లి ప్రేమ పొందకుండా పెరిగిన కొడుకును తలచుకుని ఒక్క క్షణం బాధ కలిగినా, మళ్ళీ సర్దుకుని “థ్యాంక్యూ మై సన్” అని బదులిచ్చి ఒత్తిగిల్లాను.

దేవుడి దయవల్ల నా కొడుకుకు నా పరిస్థితి రాకుండా ఉండనీ. ఫ్యాన్ తిరుగుతున్నా చిన్నగా చెమటలు పట్టాయి. మనసు ఎందుకో క్రుంగింది. ఎంత మోసం జరిగింది తనకు!

***

బిడ్దకు మూడు నెలలు కూడా నిండక మునుపే చారుశీల “మీతో కాపురం చేసే అర్హత నాకు లేదు. క్షమించండి” అంటూ పుట్టింటినుండే కబురు పంపింది. కడుపు రగిలిపోయింది. ఇంట్లో ఎవరికి చెప్పాలి? కాలేజిలో చదువుతున్న చెల్లెలికి చెప్పడం వ్యర్థం. పెళ్ళై పోయిన అన్నయ్యకు చెపితే.. వద్దు. వాడిది ముందునుండి జారుకునే స్వభావం. ఇక వదినదయితే సరేసరి. మాలో కనిపించే ఏ కొరతనైనా ఆసక్తితో విని ఊరంతా పంచిపెట్టి ఆనందపడే స్వభావం ఆమెది.. అదే ఆమె వైపు వారిదైతే వాటికి అతుకులు వేసి కాకి బంగారం పూయడాన్ని చూసిన అమ్మ కూడా కోడలితో ఎంతో అంతగా ఉండింది. స్నేహితురాలిగా ఉన్న అక్కతో అన్నాను. వెంటనే తను నాన్నకు చెప్పి, ఆయన మనసుకు బాధ కలిగించడంకంటే ఆమ్మతో ప్రస్తావించడమే మంచిదని, తను కూడా వస్తానని చెప్పి, సాయంత్రం గుడి ప్రోగ్రామ్ వేసింది. అమ్మను ఒప్పించి గుడికి బయలుదేరాం. “ఏదో గూడుపుఠాణి నడుస్తున్నట్టుగా ఉంది” అని అమ్మ సందేహ పడితే “అదేం లేదమ్మా! రాధక్క వస్తానంది. అందుకే వెళుతున్నాం అంతే.” అంటూ అనుమానం కలగకుండా మాట మార్చాను. మాకంటే ముందుగానే అక్క వచ్చి గుడి అరుగు మీద కూర్చుని వెయిట్ చేస్తోంది. మొక్కుబడిగా దేవుడికి దణ్ణం పెట్టి ప్రాకారం చుట్టుకుని అక్క కూర్చున్న వైపు వచ్చాము. దానికి అతుక్కుని ఉన్న హాల్లో ఏదో ప్రవచనం ప్రారంభమవుతోంది.

అక్క సూక్ష్మంగా అమ్మకు నా భార్య పంపిన కబురు అందజేసింది. “ఇదేంట్రా సంజీవా, ఇలాగయ్యింది..” అంటూ అమ్మ ముందుగా గాబరా పడిపోయింది. “పెళ్ళప్పుడు వాళ్ళే మనల్ని వెతుక్కుని వచ్చారు. మన కుటుంబం వాళ్ళకు బాగా పరిచయం అని ముందుకు వెళ్ళారు, జాతకాలు కూడా కలిశాయి అని చెప్పారు కదమ్మా మన సిద్ధాంతిగారు?” నేనేం మాట్లాడలేదు.

“అదేమైనా, ఒక బిడ్డ తల్లి అయినాక ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్టు? తనకు పెళ్ళి కాని తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అదీ మధ్యతరగతి వాళ్లం అని అయినా ఆలోచించకూడదా? రేపు మీ నాన్నగారు తల వంచుకుంటే బాగుంటుందా?” అమ్మ.

“ఏదో మనసులోని గందరగోళం ఉండచ్చు. ముఖాముఖి తేల్చుకోవడం మంచిది. ఎవరి మధ్యవర్తిత్వమూ మనకొద్దు. దేనికైనా వాళ్ళ ఇంటికి, ముందుగా చెప్పకుండా నేరుగా వెళ్ళాలి.” అక్క ధైర్యం నింపింది. “నాకేం చెయ్యాలో తోచడం లేదు. ఈ సంగతి తెలిస్తే మీ నాన్న గుండాగిపోతుందంతే. రాధా! నువ్వు వీడితో పాటు వెళ్ళి ఒక మంచి నిర్ణయానికి వస్తే మంచిది.” అమ్మ దుఃఖంతో అన్నప్పుడు “సరేనమ్మా! అవసరమనుకుంటే నేను వస్తాను. కానీ నా దృష్టిలో నువ్వూ, సంజూ వెళ్ళడం మంచిది.. దేనికీ నాకు ఫోన్ చెయ్యి. లేదా మెసేజ్ చెయ్యి.” అని ఓదార్చి తన ఇంటి వైపు బయలుదేరింది. తను పనిచేస్తున్న బ్యాంక్ మా ఇంటికి దగ్గరగా ఉండడం ఒక సౌకర్యంగానే ఉండింది. అర్జంట్ అనిపించినప్పుడు బ్యాంకునుండి నేరుగా ఇంటికి వచ్చేది.

నా మనసు నెమ్మది కోల్పోయింది. నాకు ఒకటే ఆలోచన. ఒకవేళ తనేమైనా ఒక విషమ నిర్ణయం తీసుకుంటే బిడ్డ గతి ఏమిటి? అని. మనసు గతి తప్పింది.

చారుశీల మెసేజ్‌కు బదులిచ్చే జోలికి పోలేదు. ఆమె మొబైల్ లోని నీలి గీతలు నేను చదివాననడానికి సాక్ష్యంగా ఉంటాయి. మరుసటి రోజు నేను, అమ్మ అత్తగారింటికి వెళ్ళినప్పుడు వేసిన తలుపుల వెనుక ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. కాలింగ్ బెల్ నొక్కకుండా రెండు నిమిషాలు వింటూ నిల్చున్నాము. ‘ఇష్టం లేదు మొర్రో అన్నా బలవంతం చేసి కట్టబెట్టారు. ఇప్పుడు చూడండి, ఏమయ్యిందో’ బావమరది, గౌతమ్ గొంతు పెంచుతున్నాడు. ‘ఇలా ఉంటే ఈ ఇంటికి పిల్లనెవరిస్తారు? నా జీవితం ఏం కావాలి? మీ అంతస్తు, గౌరవం అని చూసుకుని దాని జీవితం బలి చేశారు.’ మాటలు వినిపిస్తున్నాయి.

అప్పుడే నిర్ణయించాను, నా బిడ్దను నేనే పెంచాలని. కన్ను తెరవని పసికందుకు అప్పుడే ఇదెంత బాధ ఈ బిడ్డకు? కాలింగ్ బెల్ నొక్కాను. అమ్మ కళ్ళు తుడుచుకుంది.

మమ్మల్ని చూసి దిగ్భ్రాంతులయ్యారు.

“మీ అమ్మాయే కబురు పంపింది.” అంటూ నేనే మౌనాన్ని భంగం చేశాను.

మమ్మల్ని ఎదురించే ధైర్యం లేక అత్త, మామలు తలదించుకుని కూర్చున్నారు.

“బావా! మా వైపు నుండి తప్పయ్యింది.” గౌతం మెల్లగా అక్క పెళ్ళి నేపథ్యాన్ని విప్పాడు.

“అవును. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నా వల్ల మీకయిన ఇబ్బందికి నన్ను క్షమించండి. కానీ జీవితమంతా నన్ను నేను మోసం చేసుకుంటూ మీతో ఉండలేను. నేను అప్పుడే ఆలోచించాల్సింది. గట్టిగా నా నిర్ణయాన్ని చెప్పాల్సింది. అవేవీ కుదరలేదు. చివరికి ఈ బిడ్దను వద్దనుకోవడానికి కూడా మనసు రాలేదు. నా పాపానికి దానికెందుకు శిక్ష అనుకుని సహించాను.” తన గదినుండి బయటికి వచ్చి మా ఎదుట నిలుచుంది చారుశీల.

అక్కడితో నా భార్యగా ఆమె పాత్ర పూర్తిగా ముగిసింది.

తను తన లవర్‌తో పారిపోతుందేమో అనే భయం ఉండిందేమో? మొక్కు ఉంది అంటూ గుళ్ళో బాగా తెలిసినవాళ్ళు ఎదుట తాళి కట్టించారు అత్తారింటివారు. ఉండచ్చేమో అనుకున్నాను. అన్యమనస్కురాలిగానే హనీమూన్‌లో మాత్రం సహకరించింది. అప్పుడే గర్భం ధరించింది. రెండో నెల నుండే వాంతులు. అదే సాకుతో పుట్టింటికెళ్ళి నన్ను దూరంగా ఉంచింది.

“బిడ్డ?” అన్నాను.

రెండే నిమిషాల్లో నా చేతికి వచ్చింది. తల్లి బాధ్యతను కూడా మొయ్యాల్సిన అనివార్య పరిస్థితి కలిగింది నాకు!

“లీగల్ ఫార్మాలిటీస్‌లో సహకరించండి. నేను మిమ్మల్నేమీ అడగను.” అంటూ మాటలకు ముగింపు పలికింది.

‘కుఛ్ ఖోకర్ పానా హై..’ ఇదేం విపరీతమో! భార్య వదిలేసింది. బిడ్డ మా అమ్మ పాలైంది. అమ్మ వెక్కుతూనే ఉంది. ఇంట్లో ఎవరికీ ఇది అసలు మింగుడు పడలేదు. ఐదవనెలలో ఇంటి మట్టుకు ఉయ్యాల శాస్త్రం చేసి ‘గణేశ్’ అని నామకరణం చెయ్యడం కూడా అయ్యింది. రాధక్క నవ్వుతూనే ముందుకు వచ్చి ఆహ్వానితుల్నందర్నీ నిభాయించింది. అమ్మ గణేశ్‌కు కూడా అమ్మ అవ్వాల్సి రావడం నాకు చాలా దుఃఖం తెచ్చిపెట్టినా, నాకు వేరే దారి లేకుండా సహించాను. గణేశ్ వచ్చినాక అన్నయ్య, వదిన ఇల్లు వదలి వెళ్ళిపోయారు. “వెళ్తే వెళ్ళార్లే. నువ్వు చింతించవద్దు. ఎవ్వరి ముందు కూడా నువ్వు తల వంచద్దు.” అన్న నాన్న మాటలు జీవం పోశాయి. గణేశ్ కు మూడు సంవత్సరాలప్పుడు రాధక్క మొదటి కాన్పు. ఇంట్లో మళ్ళీ సంబరాలు. చెల్లెలు సుచరిత తన చదువు ముగించి ఇంట్లో ఉండడం అమ్మకు ఎంతో నెమ్మది. చెల్లికి తను చదివిన స్కూల్లోనే టీచర్‌గా ఉద్యోగం వచ్చేసరికి గణేశ్ స్కూలుకు వెళ్ళసాగాడు. వాడు చెల్లెలి స్కూల్లోనే జాయినవడం, వాడి చదువు బాధ్యత తనే తీసుకోవడం నాకు నెమ్మది కలిగించింది.

***

జ్ఞాపకాల అలలలో తేలిపోతూ అదెప్పుడు నిద్రలోకి జారిపోయానో మరి! మొబైల్ రింగ్ వినిపించినప్పుడే మెలకువ! కళ్ళు నులుముకుని చూశాను. రాధక్క! నేను హలో అనడానికి మునుపే “హ్యాపి బర్త్ డే రా సంజూ” అనింది. “థ్యాంక్సక్కా” అన్నాను.

“ఇంకా తెలవారినట్టు లేదు? ఈ రోజు సెలవు కూడా. లేచి ఏం చెయ్యాల్లే”

“భోజనానికి ఇక్కడికే వచ్చెయ్. సుచి స్కూలు ముగించుకుని రానీ. తనకు మెసేజ్ పెడతాను.” అన్నాను.

“సరే. అమ్మకు చెప్పు, పదకొండు గంటలకు వస్తాను.” అంటూ కాల్ కట్ చేసింది.

రాధక్క నాకంటే మూడు సంవత్సరాలు పెద్దది. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే తనే!

***

నేను లేచి పరుపు సర్ది, మొహం కడుక్కుని వంటిట్లోకి వెళ్ళాను. అమ్మ “ఇంత తొందరగా లేచావెందుకు? మరికొంచెం సేపు పడుకోవాల్సింది, రాత్రి కూడా లేటుగా పడుకుంటావు కదా” అంటూ ఆప్యాయత చూపుతూ “జన్మదిన శుభాకాంక్షలు” అంటూ వేడి కాఫి లోటా చేతిలో పెట్టింది. “థ్యాంక్యూ అమ్మా” అన్నాను. కన్నుల్లో బళుక్కున నీరు! “యు ఆర్ అ స్పెషల్ ఉమన్, యు ఆర్ మై మదర్” అన్న ప్రకటన పాటను ఇప్పటి సన్నివేశానికి అనుగుణంగా మార్చి పాడాను. “అదేం లేదు. ఊరుకో” అంది. తన కళ్ళల్లోనూ నీరు! “అమ్మ నువ్వు కాదనుంటే నేను గణేశ్ ఎక్కడికి వెళ్ళేవాళ్ళం చెప్పు. ఊహించలేం” అంటూ “కాఫీ రుచి అద్భుతం! అమ్మా నీ కాఫీకి సాటి లేదు” అంటూ జుర్రుకుంటూ తాగసాగాను. “ఎప్పుడు ఏం జరగాలో అది జరిగే జరుగుతుంది. ఇలా చేస్తే బాగుండేది, అలా జరగుంటే బాగుండేది అనేదంతా ఒట్టి నోటిమాట అంతే. తేన వినా తృణమపి న చలతి కదా? అంతా ఆయన ఇచ్ఛ. తలకు ఒక బొట్టు నూనె రాస్తాను. తలంటుకుని ఒక్కడుగు గుడికి వెళ్ళిరా” అంది.

“సరేనమ్మా! రాధక్క ఫోన్ చేసింది. భోజనానికి ఇక్కడికే రమ్మన్నాను. సుచికూ మెసేజ్ పెడతాను.”

“సుచి రాదేమోరా! వాళ వైపువాళ్ళ పెళ్ళికి మైసూరు వెళుతున్నాను అని చెప్పినట్టు గుర్తు.”

అమ్మ మెమరీ అద్భుతం!

అంతలో సుచి కాల్ – పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. నేను చెప్పింది విన్నాక “నాక్కూడా మీతో ఉండాలని ఆశ. కానీ రేపు మైసూరులో పెళ్ళి. ఈ రోజే బయలుదేరాలి. కేక్ ఉంచు. వచ్చి తింటాను.” అంది.

చిన్నప్పటినుండి దానికి కేక్ అంటే మహా ఇష్టం. బయట ఎప్పుడైనా కొన్నప్పుడు రుచి చూడ్డమే తప్ప ఇంట్లో పుట్టినరోజుకు పాయసంతోనే ముగింపు. ఇప్పుడు కేకు, చిప్స్ అని కానీ, అప్పుడంతా ఎక్కడ!

పేపర్ చదువుతూ కూర్చున్నా.

“ఈ ఆడపిల్లలకు పుట్టిల్లు ఉంది అంటే దానికి నువ్వే కారణం. కదరా సంజీవా?” అమ్మ అంది. నేను ఊరుకున్నాను.

“ఆ రోజు మీ నాన్నకు సలహా ఇచ్చింది నేనే. కొడుకుల్లో ఉత్త దుర్యోధనులే ఉండరు, అక్కడక్కడ ధర్మరాజులు కూడా ఉంటారు అని. ఇప్పుడు చూడు రాధ కానీ, సుచి కానీ అమ్మ ఇల్లు అని ఇక్కడికి ధారాళంగా రావచ్చు. అదే ఆ కిరాతకుడు ఉంటే వీలయ్యేదా? ఉత్త స్వార్థం నిండిన మనిషి.” అంటూ రాజీవన్నయ్య గురించి కోపం చూపింది. “వదిలెయ్యమ్మా! వాడి స్వభావమే అంత” అని నేను అన్నయ్యను వెనకేసుకుని వచ్చాను. “అందుకే నిన్ను ధర్మరాజుకు పోల్చింది. తమ్ముడికి ఒక విష్ చెయ్యవచ్చు కదా? పిల్లల్ని పెంచేటప్పుడు అందరూ బాగుండాలి అని ముద్దలు తినిపించి పెంచుతాము. కానీ అదెంత మారిపోతారో?”

“నీ భాషలోనే చెప్పాలంటే అదంతా ఒక ఋణం. అంతే. నేను, గణేశ్ నీకు ఎక్కువ బరువయ్యాము.”

“అదేం మాటల్రా? తరువుకు కాయ భారమా, తల్లికి పిల్ల భారమా” సమయానికి సరిగ్గా పాటల చరణాలు గుర్తు పెట్టుకుని చెప్పడంలో అమ్మకు సాటి లేరు – నేను నా చిన్నతనం నుండి గమనించిన విషయమది.

“వాక్ ముగించుకుని వచ్చేటప్పుడు గులాబ్ జాం ప్యాక్ తెచ్చెయ్. భోజనానికి గులాబ్ జాం, బజ్జీలు. ముక్కల పులుసు, కర్రీ చాలు కదా? మిగిలితే రాత్రిక్కూడా సరిపోతుంది. రాధ కూడా పట్టుకుపోవచ్చు.”

“కావలసినంత అయిందిలే..” అంటూ పేపర్ పడేసి ఒక కిలోమీటర్ దూరం ఉన్న చెరువు పార్క్‌కు వెళ్లడానికి బండి తీశాను.

***

వాకింగప్పుడు పరిచయస్థులు కనబడితే పళ్ళికిలించడమూ, లేదా నా మానాన నేను నడవడమూ జరుగుతోంది. ఆలోచనలు మాత్రం అక్కడికే..

అన్నయ్య రాజీవ్ నుండి ఒక్క కాల్ కాని, మెసేజ్ కాని లేవు. మేము అంత కానివాళ్లమయ్యామా? గణేశ్‌ను ఇంటికి తీసుకువచ్చాక అమ్మ, నాన్నల పైన కోపగించుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అసలు వాడి ఉద్దేశమేమో అర్థం కానే లేదు. సుచి పెళ్ళి కూడా తన బాధ్యతగా తీసుకుని చెయ్యలేదు.

చారుశీలతో వైవాహిక జీవితం విధివంతంగా ముగిసింది. తను తన లవర్‌ను పెళ్ళి చేసుకుని విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యింది. అక్కడ నుండి పంపిన డాలర్లు ఇక్కడి వాళ్ల కోపతాపలకు ఉపశమనం కలిగించింది. తమ్ముడు, చెల్లెలు పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా ఉన్నారు. ఆ సందర్భంలోనే గౌతమ్ తన అక్క కోరిన విధంగా నా కొడుకు కోసం కొన్న ఫ్లాటును కానుకగా ఇవ్వాలని రాధక్కను సంపర్కించాడు. నాకైతే అందులో కొంచెం కూడా ఆసక్తి ఉండలేదు.

అప్పుడు అక్కే బుద్ధి చెప్పింది. తన తోడుగా అమ్మ కూడా “బిడ్డ వద్దు అన్నంత మాత్రాన తను తల్లి కాకుండా పోతుందా? ఇక్కడ తన పెద్దవాళ్ళ తప్పు కూడా ఉంది. వాళ్ళను ఎదురించి నడవడానికి ధైర్యం చాలక ఏదో అయిపోయింది. తనకు కూడా ఎక్కడో ఎప్పుడో పశ్చాత్తాపం కలిగుండాలి. నీకు అక్కర్లేకపోతే బిడ్డ ఆమె కన్నపేగే కదా! భావనలు వేరు, వ్యవహారం వేరు. ఇక్కడ ఇది పూర్తి వ్యవహారం కూడా కాదు. తను కన్న బిడ్డకు ఆమె ఇస్తున్న ఒక కానుక. కొన్ని సార్లు మనం ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. నీకు అక్కర్లేదంటే పోనీ! గణేశ్‌కు ఉండనీ. వాడి హక్కును లాక్కునే అధికారం నీకులేదు. అది న్యాయమూ కాదు, ధర్మమూ కాదు. అది కూడా మనం అడక్కుండా తనుగా వచ్చింది. ఊరికే మొండితనం, డాంబికం మాని ఇంటికొచ్చిన మహాలక్ష్మిని కాదనకుండా ఆదరంగా ఆహ్వానించు” అన్నారు.

గణేశ్ మైనర్ కాబట్టి, ఆ ఫ్లాట్ నా పేరనే రిజిస్టర్ ఆయ్యింది. “సారి బావా” తనది కాని తప్పుకు అతడి పైనెందుకు కోపం? నవ్వుతూ మెల్లిగా గౌతమ్‌ను హత్తుకున్నాను.

ఇవన్నీజరిగిన కొద్ది రోజులకు రాజీవ్ అన్నయ్య వచ్చాడు. తను అప్పుల్లో మునిగానని, నడవడమే కష్టంగా ఉందని, ఇంటిలోభాగం కావాలని వెనకా ముందూ చూడకుండా అడగేసరికి నాన్న షాకయ్యారు. ఇల్లు స్వార్జితం – సగం జాగాలో సంపెంగ, మామిడి, పారిజాతం, మల్లె చెట్లు, ఒక చిన్నతులసికోట, నివాసానికి రెండు గదులు, ఒక హాలు, వరాండా, వంటిల్లు, నీళ్లగది, దానికంటుకుని శౌచాలయం. నలుగురు పిల్లలు, భార్యా భర్తలిద్దరికీ చాలు అని లెక్క. కాస్త చవగ్గా దొరికిన ఈ ఇంటిని నాన్న తన పొదుపు డబ్బులు, కొన్ని చేబదుళ్ళు,అమ్మ నగలు అమ్మగా వచ్చిన మొత్తాలతో కొన్నది. ఇంటి పెత్తనమంతా అమ్మదే. నాన్న ఖర్చులకని ఇచ్చే డబ్బుల్లో కొంత మిగిలించే తాకత్తున్న మనిషి. ఇంట్లో ఉన్న పాత కుట్టు మెషిన్‌తో పిల్లల లంగాలు, జాకెట్లు కుట్టి దర్జీకిచ్చే డబ్బులు మిగిలాయి అనే సంతోషంతో పాటు ఆడపిల్లలకు కూడా నేర్పింది. ఒక్కరోజైనా కడుపుకు తక్కువ చెయ్యనియ్యలేదు. రాజీవన్నయ్య ముందునుండి అమ్మ మాట వినేవాడు కాదు. వాడు చెయ్యాల్సిన పనులు కూడా నా పైనే పడేవి. ఇంటర్ పాసవడానికి తంటాలు పడి, ప్రైవేటు కంపెనీలో ఉద్యోగానికి చేరి, అక్కడ తనతోపాటే పని చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. రాధక్క పెళ్ళి వరకయినా ఆగొచ్చు కదా అని అమ్మ బాధపడేది. అక్కకేమో డిగ్రీ అవగానే బ్యాంకులో ఉద్యోగం దొరికింది. తన అదృష్టానికి మంచి ఇల్లు దొరికి పెళ్ళయ్యింది. దాంతరువాత నా పెళ్ళి, పెటాకులు. కాలం అన్నిటినీ మరచిపొయ్యేలా చేస్తుంది. సుచి పెళ్ళికి ముందే రాజీవన్నయ్య ఒక రాయి ఇలా వేశాడు. తేటనీరు చెల్లాచెదురయ్యింది.

“అదంతా వీలు కాదు. పెద్దవాడివి. చెల్లెళ్ళగురించి పట్టించుకోనే లేదు. మేమయితే ముందునుండే నీకు పడదు. నీ కష్టాలకు మేం బాధ్యులం కాము.” అంటూ నాన్న గొంతు పెంచారు. “ఇంకా కావాలసిన పనులు చాలా ఉన్నాయి. ఇల్లు భాగం చేసే ప్రశ్నే లేదు. నీకు కష్టంగా ఉంటే ఇక్కడికే వచ్చెయ్యి. అంతా కలిసి ఉన్నదాన్ని పంచుకుని తిందాం.” అన్నారు.

నాన్న అంత గట్టిగా చెప్పేసరికి మొహం మాడ్చుకుని బుసకొట్టుకుంటూనే బయటికి వెళ్ళాడు అన్నయ్య. ఆ రోజునుండి మమ్మల్ని చూస్తే మండిపడేవాడు.

ఎందుకో నాన్న గుర్తుకు వచ్చారు. ఆయనే ఉంటే కౌటుంబికంగానే కాదు, నేను నా వృత్తి జీవితంలో పైకి రావడం, గణేశ్ సివిల్స్ రాసి పాసయింది చూసి ఎంత సంతోషించేవారో! నిట్టూర్చాను.

అమ్మా, నాన్నల మధ్య ఏం మంత్రాంగం జరిగిందో తెలియదు. ఒక రోజు రాత్రి భోజనాల తరువాత “రేపు రాధను రమ్మను మాట్లాడాలి.” అన్నారు నాన్న. మరుసటి రోజు రాధక్క రాగానే నేరుగా విషయానికి వచ్చారు. పిల్లల కష్టాలకు ఆదుకోని ఆస్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత అంటూ మీ అన్నయ్య పేలుతున్నాడు. అలాగని దీన్ని అమ్మి ముక్కలవుతే మనం ఉండడం ఎలాగ? అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్న తాలూకు ఆఫీసుకెళ్ళి ఈ ఆస్తి విలువ తెలుసుకుని వచ్చాను. ముఫై లక్షలు.. నేను చెప్పింది అధికారకంగా ప్రకటించిన విలువ.” అన్నారు.

“అయితే?” రాధక్క ప్రశ్న.

“నలుగురు పిల్లలు, మేమిద్దరం. మొత్తం ఆరు భాగాలు చేద్దాం.”

“అమ్మేలా ఉంటే మార్కెట్ విలువ చూడాలి కదా! ఎక్కువ డబ్బులు వస్తాయి.” నా లెక్కలు.

“నిజమే. కానీ ఆస్తి ఇతరుల చేతికి వెళుతుంది.”

నాకైతే నాన్న ఇంగితం కొంచెం కూడా అర్థం కాలేదు.

అమ్మ కలగజేసుకుని అంది. “ఈ పొడుపుకథను నేను విప్పుతాను వినండి. ఇంటిని సంజీవుడి పేర చెయ్యడం. ఇందులో రాజీవుడి భాగం ఐదు లక్షలు, రాధ, సుచి భాగాల సొమ్ము అడ్జస్ట్ చెయ్యి మా ఇద్దరి గురించి ఆలోచించకు. మా ఇద్దరికీ నీ పైన నమ్మకమే సంజూ. మమ్మల్ని నువ్వు రోడ్డు మీదికి ఈడ్చవని భరోసా. అలాగే ఆడపిల్లలు కూడా ఇంటికి వచ్చి పోవచ్చు.” అద్దంలోని మిస్టరీ విడిపోయింది.

నేను ఒక్క క్షణం ఉక్కిరిబిక్కిరయినా అమ్మ మాటలు అర్థమయ్యాయి.

“సంజూ! నాది కూడా ప్రస్తుతం ఇవ్వనవసరం లేదు. ముందు రాజీవ్‌కు, సుచికి ఇచ్చెయ్యి. సుచికి అవసరం ఉంది. సైట్ కొనడానికి అప్పు కావాలని మా బ్యాంకుకు వచ్చింది.” రాధక్క నా బరువును మరి కొంచెం తగ్గించింది. ఒక నాలుగైదు రోజుల్లో ఇల్లు నా పేరిట వచ్చింది. రాజీవన్నయ్య, సుచి డబ్బులను ఇచ్చేశాను. ఆరు నెలల్లో రాధక్కకు కూడా ఇచ్చేశాను. సంవత్సరం అవధిలో అమ్మా నాన్నల పాలిటి డబ్బులను బ్యాంకులో వేశాను. తెలివి అంటే ఇదే కదా? ఇల్లూ మిగిలింది, ఎవరికివ్వవలసిన సొమ్ము వాళ్ళకందింది. నాన్న ముందు జాగ్రత్తగా అన్నిటినీ స్టాంపు పేపర్ పైన రాయించుకుని అందరి సంతకాలు తీసుకున్నారు. కానీ నాన్న మాత్రం మానసికంగా క్రుంగిపోతూ ఒక రాత్రి పడుకున్నాయన లేవనే లేదు.

అంతలోనే అమ్మ కాల్ చేసి “అన్నట్టు చెప్పడం మరచిపోయాను. కొబ్బరికాయ, తమలపాకులు తెచ్చెయ్యి.” అన్నప్పుడు “సరేనమ్మా” అంటూ గతంలోనుంచి బయటికి వచ్చాను.

***

పదకొండింటికల్లా రాధక్క వచ్చింది.

“అమ్మ ఏమైనా అన్నదా నీతో?” కాఫి గుటకేస్తూ అడిగింది.

“ఏమైనా అంటే?” నేను ఎదురు ప్రశ్న వేశాను.

“నీకో పెళ్ళి గురించి..”

“వద్దక్కా! అదొక చెడ్డ కల అని మరచిపొయ్యాను. ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటే వణుకు పుడుతుంది.”

“అలాక్కాదు. అమ్మకూ వయస్సు పైబడుతోంది. రేపు గణేశ్‌కు వేరే ఎక్కడికో పోస్టింగ్ వస్తుందనుకో! వాడి పెళ్ళి గురించి మనం దిగులు పడక్కర్లేదు. వాడు, మా అమ్మాయి పరస్పరం ఇష్టపడుతున్న సంగతి మనకు తెల్సిందే. అమ్మకు నీ గురించే దిగులు.”

“ఇందులో దిగులు పడాల్సిందేమీ లేదక్కా. ఎలాగో గడిచిపోతుంది.” నిర్లక్ష్యంగా జవాబిచ్చాను.

“అలాక్కాదు సంజూ! నీది కాని తప్పుకు నువ్వెందుకు చెప్పు శిక్ష అనుభవించడం? ఇన్ని సంవత్సరాలు దీని గురించి మౌనంగా ఉండి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. గణేశ్ పెద్దవాడయ్యాడు. వాడికిప్పుడు సవత్తల్లి, సవతి తమ్ముళ్ళు అనే భయం లేదు. అందరి మనసులు పక్వమయ్యాయి. కొత్త ఆగమనాన్ని ఆహ్వానించే హృదయ వైశాల్యం ఉంది.” అమ్మ మధ్యలో వచ్చింది.

“సాంగత్యానికి వయసెందుకు? అనేవారు, ఆడిపోసుకునేవారు మన కన్నీళ్ళు తుడవడానికి రారు. ఇన్ని సంవత్సరాలు అందరికీ ఒకే బాధ ఉండేది. ఎవరేమంటే ఎవరికి బాధ కలుగుతుందో అని అన్నీ దాచుకునే జీవితాన్ని గడిపాము. మీ నాన్న ఎంత బాధపడేవారు తెలుసా? జాతకం, వారి పుట్టు పూర్వోత్తరాలు అన్నీ విచారించి తామే చేసిన పెళ్ళి ఇలా పెటాకులయ్యాయి అన్నప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. పిల్లవాడి ముందు ఎంత గంభీరంగా ఉండేవారని.. సుచి కూడా అంతే. చాలా బాధపడేది.”

నేను మౌనంగా వింటున్నాను.

“ఈ వయసులో నాకెవరు పిల్లనిస్తారు?” నా మనసులోని మాట బయటికొచ్చింది. అక్కడితో చర్చ ముగిసిందని అనుకున్నాను.

భోజనాల తరువాత కొన్ని కబుర్లు. “దేనికీ నేను చెప్పినదాన్ని కొద్దిగా సీరియస్ గా తీసుకో” అంటూ వీపు తట్టి బయలుదేరింది రాధక్క.

***

రాత్రి అమ్మతో మొహమాట పడుతూనే అక్క చెప్పిన సంగతిని ప్రస్తావించాను.

“రాధ తన అత్తగారి తమ్ముడి కూతురి కథ చెప్పింది. ఆమెకూ నలభై రెండేళ్ళట. పెళ్ళై పదిహేను సంవత్సరాలు మొగుడితో కాపురం చేసింది. భర్త దాంపత్యానికి అనర్హుడట. అది పోనీ, గుణవంతుడా అంటే అదీ లేదు. అత్త మామలు మంచివాళ్ళట. ఎన్ని రోజులని ఉంటుంది చెప్పు? పోనీ ఈ వైపు పుట్టింటివాళ్ళైనా గట్టిగా ఉన్నారా అంటే ఆడపిల్లలని పెళ్ళి చేసి పంపడమే కష్టంగా ఉందంట. ఇక తిరిగి వస్తే? అందులోనూ అప్పటికే అమ్మా నాన్నలు కూడా తమ కొడుకు నీడన ఉన్నప్పుడు. ఈ గుణాకారాలు, భాగాహారల నడుమ పళ్ళు గిట్ట కరుచుకుని ఉన్న మనిషి ఎలాగో ఈ కపట నాటకం ఇక వద్దనిపించే బయటికి రావాలని నిర్ణయించేసుకుంది. చేతిలో ఉద్యోగం ఉంది. ఒంటరి స్త్రీ అని ఇల్లు దొరకక పోయినా ఇప్పటి పిజిలకు కొరతేం లేదు అనే ధైర్యం. పదిహేను రోజుల క్రితం విడాకులు మంజూరయ్యాయట. రాధవద్ద చాలా చనువు. కష్టసుఖాలు చెప్పుకుంటుంది. ఇప్పుడు పిజిలో ఉంది. రాధ అత్తగారే ఈ విషయానికి నాంది పాడుతూ, నీకు ఆమెని అడగవచ్చునా చూడు అని చెప్పిందిట.”

నేను మౌనంగా వింటున్నాను.

“ముందుగా నన్నడిగింది. నాక్కూడా అందులో తప్పేం కనిపించలేదు. ఆడవాళ్లంతా చెడ్డవాళ్ళు కారు, అలాగే మగవాళ్ళందరూ.. కదా! అందరూ పరిస్థితుల చేతుల్లో కీలుబొమ్మలం. మనమూ అంతే. ఆ అమ్మాయి కూడా తన జీవితంలో సుఖ పడలేదు. కన్నవాళ్ళు, సమాజం అనుకుంటూ బాధలన్నీ దిగమింగి ఇన్ని సంవత్సరాలు గడిపింది. మిగిలిన జీవితాన్నైనా తను సుఖంగా గడుపనీ అని ఆశపడేవాళ్ళున్నారనడానికి రాధ, ఆమె అత్తలే సాక్షులు. నీ విషయం ఆ అమ్మాయికి చెప్పారట. ముందుగా వెనుకంజ వేసినా వీళ్ళంతా నచ్చజెప్పేటప్పటికి ఒప్పుకుంది. మీ తమ్ముడైతే నాకు ధైర్యంగా ఉంటుంది. లేదా ఇంకోసారి రిస్క్ తీసుకోదలచుకోలేదు అని రాధ వద్ద అనిందట.”

రెండు కొప్పులు చేరితో కలహం అంటారు కానీ అమ్మ, రాధక్క, ఆమె అత్త వీళ్ళను చూస్తున్నప్పుడు ప్రపంచం అంత క్రూరమైనది కాదు అనిపించింది.

“కాదమ్మా! గణేశ్ పెళ్ళికి ఎదిగున్నప్పుడు నేనెలా పెళ్ళి చేసుకోను? సబబనిపించదు.”

“సంజీవా! ఆలోచించు. గణేశుడికి నిశ్చయం అయినది రాధ కూతురే. ఇప్పుడు నీ పెళ్ళికి ముందుకు వచ్చి నిలచింది రాధే. కాబట్టి ఎలాంటి ఇబ్బందికి తావు లేదు. వాడి పెళ్ళికి ముందుగా నీకొక జత దొరికెతే తనక్కూడా నెమ్మదేగా?”

“నీ జీవితపు సంధ్యలో నీకొక తోడు, అందులోనూ తెలిసిన పిల్ల, ఎందుకు కాకూడదు? ఒక తల్లిగా నువ్వు సుఖంగా ఉండాలని నా తాపత్రయం. నేనేదో బలవంతం చేశానని అనుకోవద్దు. బాగా ఆలోచించి. మొదటి ఆప్షన్ నువ్వు, నువ్వు వద్దంటే ఆ అమ్మాయి వేరే సంబంధం చూసుకోవడానికి తయారుగా ఉంది. అలాగని రాధే చెప్పింది.” అమ్మ చెప్పాల్సిందంతా చెప్పి ముగించింది.

“అప్పట్నుంచి అమ్మాయి, అమ్మాయి అంటున్నావు, ఆమెకేం పేరులేదా?” కుతూహలంగా అడిగాను.

“లేకేంటి? నువ్వే అడుగుతావేమోనని కాచుకున్నా. సంఘమిత్ర” అంటూ లేచింది. బంతి నా కోర్టులో ఉంది ఇప్పుడు.

***

రాత్రంతా దొర్లడమే జరిగింది. నిద్ర దగ్గరికి రావడం లేదు. మనకు తెలియకుండానే మన జీవితంలో అపరిచితులు పరిచయస్థులవుతారు. మళ్ళీ అపరిచితులుగ మారి దూరమవుతారు. వాళ్ళనుండి ఏదో ఒక అనుభవం లేదా పాఠం మనకు దొరకనే దొరుకుతుంది. ఇదంతా నుదుటి రాతలో ముందుగానే రాసి ఉంటుందేమో మరి! అందుకే తప్పదు. చారులత అనే చేదును శపించేదా? ముద్దులొకికే గణేశ్‌ను ఇచ్చినందుకు ఋణపడి ఉండాలా? తన పెద్ద వయసులోనూ అమ్మ తను కనని బిడ్డకు కన్నతల్లి ప్రేమనిచ్చి పెంచింది కూడా నుదుటి రాతే కదా? ఆస్తి అనే ఒకే కారణం వల్ల ఎన్ని కాపురాలు కూలిపోలేదు! అలాగని ఆస్తి లేనంత మాత్రాన సహోదరుల మధ్య ఐక్యత ఉంది అనే తర్కమూ సరికాదు. అమ్మ తన నలుగురు పిల్లలనూ సరైన మార్గంలోనే పెంచింది. కానీ రాజీవన్నయ్య మాత్రం ఎందుకు స్వార్థపరుడయ్యాడు? మేమంతా ఎంతో నిష్కపటమైన మనసులతో పిలిచినా దూరంగా వెళతాడు- వాడివల్ల మేమంతా బాధపడాలని రాసుందేమో! గతాన్ని తలచుకుని పశ్చాత్తాప పడడంవల్ల ఇప్పటి జీవితం పైన దాని దుష్పరిణామం కలగదా? చేయి జారిపోయినదాన్ని గురించి తలచుకుని కుంగిపోవడం వలన కలిగే లాభమేమిటి? అలా కుంగిపోవడం వల్ల విరిగింది మళ్ళీ అతుకుతుందా? కుదరదు. ఎవరైనా కానీ ఏ కారణం లేకుండా మనల్ని కలవరు. ఏదో ఒక ఉద్దేశం ఉండనే ఉంటుంది. అది మనకు సాధకమో బాధకమో మన ఖర్మ అంతే. చారుశీల నన్ను గట్టిగా అంగీకరించకుండా ఉండాల్సింది. కానీ గణేశ్ ఈ లోకానికి రావాలి కదా!

అలాగే వెంటనే నిర్గమించింది!

కలవడం – విడిపోవడం ఒకే నాణ్యపు రెండు ముఖాలనవచ్చేమో! దాని వెనకే మరో భేటి.. కాలచక్రంలో ఇది చాలా సహజం. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, మళ్ళీ పుట్టడం, ఆకాశంలో చంద్రుడు, తారల చిత్రాలు.. ఏదీ ఆగదు

అమ్మ తనుగా పెళ్ళి గురించి అడిగిందంటే చాలా ఆలొచించి ఉండాలి. పిల్లలు ఎదిగి వాళ్ళ వాళ్ళ గూళ్ళు చేరుకున్నాక ఒంటరితనం వేధించడం సహజం. అదేమో Empty Syndrome అంటారు కదా! గణేశ్ పెళ్ళై, వేరే ఊళ్ళో స్థిరపడితే అనే ఆలోచనా లేదా నేను ఇంకెన్నాళ్ళు ఒంటరిగా ఉండగలను, వయసు పైబడుతోంది అనే దిగులో మరి అమ్మకు! అలాంటప్పుడు నేను చాలా ఒంటరిగాణ్ణి కాకూడదు అనే మమత అమ్మక్కాకపోతే ఎవరికి వస్తుంది? ఆ విషయంలో అక్కక్కూడా అదెంత శ్రద్ధ నా విషయంలో! ఒత్తిగిల్లాను.

ఆ అమ్మాయి పేరు సంఘమిత్ర.. తను కావాలనుకుందా అలాంటి జీవితాన్ని? అయినా అదెంత సహనమో.. దానిక్కూడా ఒక సమర్థన! పుట్టిల్లు గట్టిగా లేకున్నా ధిక్కరించి బయటికొచ్చి జీవించగలను అనే ధైర్యంతో బయటికి రాకుండా ఎన్ని సామాజిక, ఆర్థిక, కౌటుంబిక అడ్డంకులు! ఇప్పుడు బయటికొచ్చేసింది!

అక్క కూడా నా గురించి చెప్పిందట. తను కూడా కన్విన్స్ అయింది అన్నాకనే నా వద్దకు ప్రస్తావన వచ్చింది.

వచ్చే కోడలు తెలియని అమ్మాయి కాదు, తను ఎవరికీ బదులు చెప్పాల్సిన పని లేదు అని అమ్మ గ్రహించింది. సంఘమిత్ర అక్కకు బంధువు. ఆమె నడవడికి అక్క గ్యారంటీ..

నా ఆలోచనా శైలికి నవ్వొచ్చింది. భగవంతుడి పైన బరువు మోపి ముందడుగు వెయ్యనా అనిపించింది. గోడ గడియారంలో పదకొండు గంటలు మొబైల్ తీస్తే అక్క వాట్సప్‌లో ఆన్‌లైన్ ఉన్నట్టు కనిపించింది.

“అక్కా ఇంకా మేలుకున్నావా?”

మెసేజ్ డెలివరి అయినట్టు నీలి గీతలు.

వెంటనే బదులిచ్చింది.

“రేపు సెలవు కదా. ఫ్రెండ్స్‌తో చాటింగ్.. నువ్వింకా పడుకోలేదా?”

“అమ్మ నువ్వు కలిసి నా నిద్ర ఎగరగొట్టారుగా?”

“మంచిది జరగాలని చెప్పాము. నిర్ణయం నీదే..”

నాలుగైదు సార్లు టైప్ చేసి చెరిపేసి, చివరికి “సంఘమిత్ర నంబర్ దొరుకుతుందా?” మెసేజ్ చేశాను.

నా మొహంలోని సిగ్గు, మొహమాటం అక్క అక్కడ్నుండే కనిపెట్టేసింది.

వెంటనే సంఘమిత్ర నంబర్ పంపింది.

“నీ నంబర్ తనకిస్తాను. ఒకరితో ఒకరు పరిచయం చేసుకోండి. Best wishes. నీ వెంట నేనున్నాను అని మరవద్దు.”

సంఘమిత్రతో మాట్లాడడానికి వేయి ఏనుగుల బలం దొరికినట్లయింది. తనకు ఫోన్ చేసి

“నమస్తే. నా పేరు సంజీవ్. రాధ తమ్ముణ్ణి. అక్క మీ నంబర్ ఇచ్చింది.” మెసేజ్ పంపాను.

నీలి గీత కనబడలేదు. ఆఫ్ చేసి పెట్టుకుందేమో! చెప్పుకోలేనంత కంగారు. మెసేజ్ చెయ్యకుండా ఉండాల్సింది. తొందర పడ్డానా?

ఐదు నిమిషాల తరువాత అటువైపు నుండి జవాబు వచ్చింది.

“నమస్తే. నేను సంఘమిత్ర. రాధక్క చెప్పారు..”

“మీకు అభ్యంతరం లేకపోతే కాల్ చెయ్యవచ్చా?”

“ఈ రూమ్‌లో ఇంకోరుంటారు. కొద్దిగా ఇబ్బందవుతుంది.”

అక్క చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. పిజిలో ఉంటోంది కదా!

“అలాగైతే రేపు మీటవుదామా? ఎలాగూ ఆదివారం.”

“ఎక్కడ?”

“మా ఇంటి వద్ద ఉన్న గుడి. రాధక్కకు తెలుసు. కావాలనుకుంటే తనను కూడా తీసుకురావచ్చు. అక్కకు నేనే విషయం తెలియజేస్తాను.”

“అలాగైతే సరే.”

“రేపు కలుద్దాం. పదకొండు గంటలకు. గుడ్ నైట్.”

తన వద్దనుండి కూడా గుడ్ నైట్ మెసేజ్ వచ్చింది. మనసులో అదేదో తెలియని పులకింత.

అక్కకూ సంగతి తెలియజేస్తే మంచిది అనుకుని మెసేజ్ చేశాను.

“మిత్రా అప్పుడే మెసేజ్ చేసింది. మొదటిసారి కాబట్టి నేను వస్తాను అన్నాను. చాలా సంతోషంగా ఉందిరా సంజూ! అమ్మకు తెలిస్తే దేవుడి ముందు నేతి దీపం పెడ్తాను అంటుంది చూడు.”

“దీనికి కారణం నువ్వే”

“ప్రశాంతంగా నిద్రపో. రేప్పొద్దున కలుద్దాం.”

అక్క మొబైల్లో చిరునవ్వు నవ్వినట్టనిపించింది.

“అంతులేనిది సముద్రపు లోతు అంతకన్న లోతు మనసు లోతు..” అనిపించింది. రేపటి గురించిన నిరీక్షణ ఆహ్లాదకరంగా అనిపించింది.

కన్నడ మూల రచయిత్రి: శ్రీమతి కె.వి.రాజలక్ష్మీ
తెలుగు అనువాద: చందకచర్ల రమేశ బాబు

Exit mobile version