[శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఏదీ కథ కాదు!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
శంకర్ విలాస్ లోని అతి మూలగా ఉన్న టేబిల్ అలవాటైపోయింది. ఆ బేరర్ కూడా ఎందుకో నన్ను చూడగానే దగ్గరకి వచ్చి కళ్లు మూసుకుని చిరునవ్వు నవ్వుతాడు. అలా ఎందుకు చేస్తాడో తెలియదు. వచ్చావా? మరి చెప్పు అన్నట్లుంటుంది. నిన్న రెండు ఇడ్లీ ఒక వడ అయితే ఈ వేళ ఓ ప్లెయిన్ దోస- అంతే కదా అన్నట్లుంటుంది అతని వాలకం.
“కళ్లు తెరు”, అన్నాను. తెరచి చిరునవ్వును కొద్దిగా విస్తరింప జేసాడు.
“మసాలా?”, అన్నాడు.
“కానీ”, అన్నాను. అలవాటుగా టేబిల్ మీద ఓ దెబ్బ వేసి ఈల వేసుకుంటూ వెళ్లిపోయాడు. ఓ పెద్ద బాగ్ సద్దుకుంటూ ఓ కుర్రాడు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. మొబైల్ చూసుకుంటున్నాడు.
“కథలు రెండు రకాలు..”, అతని మొబైల్లో ఎవరో దంచుకుంటున్నాడు, “..కథలు రెండు రకాలు. అర్థం కాని అబద్ధం కథగా ముస్తాబవుతుంది. అర్థమైన నిజం ఓ తరంగంలా తాకిన తరువాత ఒక్కసారిగా ఇదా కథ అనిపిస్తుంది. ఒక్కో ఆలోచన అనే అద్దంలో ఒక్కో అమ్మాయిలా ముస్తాబవుతుంది!”
నా మసాలా ప్లేటు వచ్చింది. కుర్రాడిని అడక్కుండానే బేరర్ వెళ్లిపోతుంటే ఆపాను.
“అక్కడ అడగవా?”
“ఈయన ఇక్కడ తినరండీ”
“మరి?”
“ఆర్డర్లు రెడీ అవుతున్నాయి”
“ఓ. పార్సల్ అన్న మాట!”
కుర్రాడు మొబైల్ ఆపి నన్ను చూసాడు.
“ఆర్డర్లు ఇందులో ఉంటాయి సార్. నేను పట్టుకు పోయి జనాలకు అందించాలి.”
“ఓ. అర్థమైంది. టిఫిన్ చేసి పట్టుకెళ్లవచ్చు కదా?”
“ఇంట్లో చేసి ఊరి మీద పడతాను సార్.”
“గుడ్. కథల గురించి వింటున్నావు?”
“ఏదో టైమ్ పాస్ సార్. రక రకాల మనుషులని చూస్తాను.”
“అవును. ఏదైనా టైమ్ పాస్‌కి చెప్పు.”
“ఊ.. ఆ మధ్య ఓ పెద్దాయన ఓ చిత్రమైన కేక్ ఆర్డర్ చేసాడు.”
“ఓ.”
“ఆయన కోసం కాదు. ఆయన మనుమడి కోసం.”
“ఒ.కే”
“నేను గేటు దగ్గర డెల్లివరీ చేస్తుండగా నన్ను సహాయం అడిగాడు. కాస్త ఆయన్ని మెట్లు ఎక్కించమన్నాడు. సరేనని ఎక్కించాను. లోపల ఓ చిన్న గదిలో పెట్టమన్నాడు. పెట్టాను. ఎవరిదైనా పుట్టిన రోజా సార్, అని అడిగాను. అవునన్నాడు. కానీ ఇక్కడ లేడన్నాడు. కేకు ముక్క ఒకటి కోసి నాకు అందిస్తూ వీడియో తియ్యమన్నాడు. తీసాను. దానిని ఓ నంబరుకి పంపమన్నాడు. పంపించాను. మరల ఆయన్ను కేకుతో సహా క్రిందకి తీసుకుని వచ్చాను. ఇంట్లో ఒక్కడే ఉన్నట్లున్నాడు. బైక్ స్టార్ట్ చేస్తూ మిర్రర్లో చూసాను. ఆ కేకును గోడ మీద పెట్టి వెళ్లిపోయాడు ఆయన!”
“పాపం! ఏమై ఉంటుంది?”
“ఏదైనా అనుకోవచ్చు. మాకంత టైమ్ ఎక్కడ?”
“కరెక్ట్.”
“ఈ మధ్య మరీ చిత్ర విచిత్రంగా ఉంటోంది సార్”
“ఎందుకలాగ?”
“మొన్న ఒకాయన ఆర్డర్ పెట్టాడు. గేటు దగ్గర బండీ ఆపాను.”
“వెరీ గుడ్.”
“నన్ను చూసి పెదవులు విరిచాడు.”
“అదేంటి? రుచి చూడకుండానే?”
“అసలు పాకెట్ తీసుకోలేదు.”
“ఎందుకని?”
“చిన్న హెల్ప్, అన్నాడు. నా వెనుక కిటికీ ఉంది కదూ? అన్నాడు. అవునుంది అన్నాను. అందులో ఎవరైనా కనబడుతున్నారా? అన్నాడు. అవును సార్. మేడమ్ అనుకుంటా అన్నాను. జాలిగా మొహం పెట్టాడు. పోట్లాట మొదలయి నాలుగు రోజులయింది. నిరాహార దీక్ష సాగుతోంది. నేను ముట్టుకున్నదేదీ తిననంటోంది. ఇలా సాగిపోతే ఆస్పత్రిలో చేర్చి సెలైన్ పెట్టాలి. అందుకని ఇలా పార్సల్ తెప్పించాను, అన్నాడు. నన్ను ఏమి చెయ్యమంటారు? అని అడిగాను. కావలిస్తే ఎక్కువ డబ్బులిస్తాను, అలా లోపలికి వచ్చి టేబిల్ మీద పెట్టు, అన్నాడు. డబ్బులక్కరలేదు కానీ అలాగే పెడతానని చెప్పి లోపలికి వెళ్లాను.”
“ఒ.కే, ఆవిడేమంది?”
“కిటికీ లోంచి అంతా గమనిస్తోంది. లోపలికెళ్లి టేబిల్ మీద పెట్టాను. ఎంతైంది? అడిగింది. సార్ ఇచ్చారు అన్నాను. ఎంతైంది, రెట్టించింది. మూడు వందల అరవై అన్నాను. రెండు రెండొందల నోట్లు తీసి ఇచ్చింది. చిల్లర ఉంచుకో, అంది. ఏమీ చెయ్య లేక ఇవతలికి వచ్చి ఆయనకివ్వబోయాను. కిటికీ లోంచి ఆయనకు ఆంగ్లంలో చెప్పింది-తీసుకోవటానికి వీల్లేదు!”
“మరేం చేసావు?”
“దగ్గరలో ఒక పెళ్లికి వెళ్లాల్సి ఉంది. ఓ వంద కలిపి కవర్లో పెట్టి గిఫ్ట్ ఇచ్చాను నా మిత్రునికి. వాడికి మంచి జరగాలని మనసారా కోరుకున్నాను!”
“శభాష్! నీకు పెళ్లి కాలేదు కదా?”
“వద్దు సార్. ఇలాగే హాయిగా ఉంది.”
“ఎవరికైనా ఐ లవ్ యు అని చెప్పావా?”
“చెప్పాను సార్.”
వెనక్కి వాలాను. బేరర్ వచ్చాడు. కళ్లు మూసుకుని మహర్షిలా చిరునవ్వు నవ్వాడు.
“కాసేపుండి కాఫీ”, అన్నాను. అలాగే అన్నట్లు అభయ హస్తం చూపించాడు.
ఎదురుగా ఉన్న కుర్రాడిని చూసి జర ఉండు అని చెప్పి వెళ్లిపోయాడు.
“ఐ లవ్ యు అని చెప్పావంటే అద్భుతం! అలా చెప్పగల్గిన వాడిదే జీవితం. అలా చెప్పలేని వాళ్లవన్నీ దిక్కుమాలిన కథలు. జీవితాలు కాదు.”
అతను వింతగా నవ్వాడు.
“నిజానికి నేని ఐ లవ్ యు అని చెప్పలేదు సార్.”
“మరి?”
“చెప్పించారు.”
“అదెలా?”
“ఓ ప్రేమికుడనుకుంటాను, ఓ అమ్మాయికి గిఫ్ట్ పంపించాడు.”
“ఓ “
“అది తీసుకుని వెళ్లి అమ్మాయికిచ్చాను.”
“బాగుందా?”
“మేము పాకెట్ లోపల చూడం సార్.”
“అది కాదయ్యా, అమ్మాయి బాగుందా?”
“బాగుండటమా? పిచ్చెక్కి వొళ్లంతా చక్కిలిగింతలు పుట్టేసాయి.”
“ఛా!”
“అవును. పాకెట్ తీసుకుని సిగ్గు పడుతూ నన్ను అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె శిలలోంచి ఊడిపడిందో లేక క్షణంలో నన్ను శిలగా మార్చిందో కొద్ది సేపు ఇద్దరికీ తెలియలేదనిపించింది.”
“వామ్మో!”
“లేదు సార్. నిజంగానే అద్భుతం. ప్రియుడు గుర్తుకొచ్చినప్పుడు ఆ ఊహలో కొద్ది సేపు ఆమె అలా విహరించేస్తోంది. మగాడి అందం మాటలలో ఆటలాడుతుంది. ఆడదాని అందం ఆలోచనలలో దాక్కుంటానంటూనే అలవోకగా కనిపిస్తుంది. ఏమి చెయ్యాలో తెలియక మేడమ్, పిన్.. అన్నాను. రెండు మూడు సార్లు అన్నాక హఠాత్తుగా ఈ లోకంలోకి వచ్చి ఏదో తడుముకుని పిన్ పెట్టుకునే ఉన్నాను అంది.”
మసాలా దోసలోని చివరి ముక్కలో కొద్దిగా మసాలా ఎక్కువైనట్లు గోచరించింది!
“ఛా!”
“మేడమ్, నంబర్ చెప్పండి అన్నాను. మొబైల్ చూసి నంబర్ చెప్పింది. నేను వెళ్లబోతుంటే ఆపింది.”
“అమ్మో!”
“చూడూ.. అంది. ఈ పార్సల్ నా బాయ్ ఫ్రెండ్ పంపాడు. వెరీ గుడ్ అన్నాను. ఒక్కసారి అతను అన్నట్లు, అతని గొంతులో ఐ లవ్ యు అనవా? ప్లీస్, అంది.”
అతని వెనుక కూర్చుని రవదోస ఆస్వాదిస్తున్న పెద్దాయన ఒక చెవి ఇటు పూర్తిగా పారేసాడు.
“అనేసావా?”
“ఎంత మాట సార్? నేనెక్కడో చదివాను..”
“చాలా చదివావు. రోడ్డు మీద ఉంటావు. నిజం, అబద్ధం, అనే చెరో కన్నూ కలిపితే ఏర్పడే దృష్టిని మనం వాస్తవం అంటాం.”
“కరెక్ట్.”
“ఇంతకీ ఏం చదివావు?”
“ఐ లవ్ యు అనేది సృష్టిలోనే ఆదిమంత్రం. అది సూటిగా చెప్పేది కాదు. ఆద్యంతం మరో ప్రాణిని ప్రాణంలా ప్రేమించి తనకు తాను ప్రాణం పోసుకునేందుకు, మరో జన్మ ఎత్తేందుకు ఆ ప్రేమింపబడ్డవారి చెవిలో బ్రహ్మోపదేశంలా రహస్యంలా చెప్పవలసిన మాట.”
“అలా చెప్పేసావా కొంప దీసి? అయ్యో!”
“నో నో.. ఎంత మాట సార్, నేను చెప్పనన్నాను. నేను మారీచుడిని కాను అని చెప్పాను. నిజానికి ఆతని పరిస్థితే ఉన్నది. బాణాల్లాంటి చూపులతో నన్ను గుచ్చి గుచ్చి చూసి వెంటాడింది, కాదు వేటాడింది. పంతం పద్మావతి లాగుంది. చివరికి ఏమీ చెయ్యలేక చిన్నగా ఇదిగో నేను కాదు, అతని తరఫున ఇదిగో, ఐ లవ్ యు అన్నాను.”
“శభాష్! తరించావు. ఆ తరువాత ఏం జరిగింది?”
కాఫీ వచ్చింది. అద్భుతమైన కవిత్వం విన్న వాడిలా బేరర్ తల అటూ ఇటూ ఊపాడు.
“బిల్”, అన్నాను. ఏ.ఎన్.ఆర్ లా తప్పదన్నట్లు నిట్టుర్చాడు.
“తరువాత ఏం జరగాలి సార్? గొప్ప అనుభవం జరిగింది.”
“చెప్పేయ్, నా వల్ల కావటం లేదు.”
“నా చెయ్యి పట్టుకుంది.”
“నో.”
“యస్. మళ్లీ చెప్పు అంది. అతనికి ఇలా చెప్పటం చేత కాదు, అంది.”
“అయ్య బాబోయ్, అదిరింది. ఎన్ని సార్లు చెప్పావు నాయనా?”
“ఇంకా నయం. పారిపోయాను.”
“ఊ.. ఈ కాఫీ అయిపోయే లోపల ఓ రెండు మూడు కథలు చెప్పు.”
“కథలు కావు సార్. ఇవేవీ కథలు కావు. తరచు ఓ ఇంటికి ఉదయాన్నే ఫుడ్ పాకెట్ ఇచ్చేవాడిని. పిట్ట గోడ వెనుక ఆ వృద్ధులిద్దరూ భార్యాభర్తలు – నా కోసం అలా నిలబడి ఉండేవారు. గూట్లో పిట్టల్లా ఎదురు చూసేవారు.”
“పాపం.”
“ఆ కాలనీ అంతా అంతే సార్. ఈ మధ్య ఆయన ఒక పాకెట్ ఆర్దర్ చేస్తున్నాడు.”
“అయ్యో.”
“అది తీసుకుని వెళ్లి గోడ మీద పెడతాను. ఆయన అటు వైపు వీల్ చెయిర్లో ఉంటాడు. అది వరకు నిలబడి ఉండే చోట వాళ్లావిడ అదివరకు నిలబడి ఉండే చోట ఓ క్షణం ఉంచుతాడు. లోలోపల అనుభవించే బాధను లోపలికెళ్లిపోయిన కళ్లల్లోంచి కొద్దిగా ఇవతలికి లాగి నా ముందర ఉంచుతాడు. నేను బై అని చెప్పి బాధగా వెళ్లిపోతాను.”
బేరర్ బిల్ పెట్టాడు. ఈ నాటికి మనిద్దరి మధ్య ఇంతే అన్నట్లు తల ఊపాడు. నోట్లు పెట్టి అతన్ని పంపేసాను. “ఊ.. భారీ కథతో ఈ రోజు ప్రారంభించమంటావు. అంతేనా?”
“లేదు సార్. కథలన్నీ ఒకెత్తు. అసలు ఇది నిజం కాదు అని తెలిసి కూడా జీవితాన్ని ఊరకే మోస్తున్నామనిపిస్తుంది.”
“కరెక్ట్.”
బేరర్ చిల్లర పెట్టి అతని పాకెట్ అతనికిచ్చేసాడు. ఇద్దరం లేచాం.
“చివరకు మిగిలేది చిల్లరే.”, అన్నాడు.
“కరెక్ట్. కానీ నిరాశ చెందకూడదు.”
“నో..”, బయటకు వచ్చాక అన్నాడు, “..అర్థం లేని ఈ బ్రతుకుకు అర్థం ఎలా పుట్టించాలి అన్నది మొన్ననే తెలుసుకున్నాను. మొన్న ఓ రోజు ఓ ఆర్డర్, ఓ లొకేషన్ వచ్చింది. ఏకంగా వంద పాకెట్లు అవి. అలా లొకేషన్ పెట్టుకుని వెళ్లిపోయాను. ఆ నంబరు ఈ మధ్య వీల్ చెయిర్ లోకి చేరినాయన నంబరు! తీరా చూస్తే ఆ లొకేషన్ అందరూ చేరే ఆఖరు మజిలీ. ఆ నంబరుకు కాల్ చేసాను. ఇంకెవరో ఎత్తారు. ఆ పాకెట్లన్నీ తీసుకున్నారు. థాంక్స్ చెప్పారు. ఆయనకు ఇష్టమైన ఐటమ్! ఆయన చివరి కోరిక మొబైల్ క్రింద కాగితం మీద వ్రాసి పెట్టి సునాయాసంగా వెళ్లిపోయాడు, అన్నారు.”
ఆ కుర్రాడు అలా చెప్పేసి తన బండి స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు..
ఏదీ కథ కాదు, అతను అన్న మాటలు మరల వినిపిస్తున్నాయి. నిజమే. చిన్నగా చెప్పుకుంటే పాపం, ఏది కథ కాదు?
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
