[శ్రీమతి వి. బి. సౌమ్య రచించిన ‘ఈ ఆలోచన పాతదే!’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
లేఖిని అనే ఒక ఔత్సాహిక రచయిత్రి ఉంది. మొన్నీమధ్యే నలభై నిండాయి. నిండాయి అనడం కంటే, నలభై వసంతాల భారం మీద పడింది అనడం సబబు. ఎందుకంటే, ఆ వసంతాలన్నీ ఆమె నుదిటి మీద ‘రాయలేకపోయిన ఆలోచనల’ రూపంలో ముడతలు పట్టి, సంపాదన లేక ఖాళీగా మిగిలిన జేబుల్లోకి దూర్చిన చేతులని చూస్తూ పగలబడి నవ్వుతున్నాయి.
ఆమెకి సాహిత్యమంటే మహా పిచ్చి. ఒకనాడు మధ్యాహ్నం, ఆకలి వేస్తే అన్నం తినడం ఎంత సహజమో, రాత్రి నిద్ర పట్టకపోతే ఒక కొత్త కథ రాయాలని పుట్టే ఉబలాటం అంతే సహజం. కానీ ఇవన్నీ రాస్తే చదివే వాడు లేడు. ఏదైనా ప్రచురించగల ఈరోజుల్లో కూడా లేడు. ఎందుకంటే, రాసినవి రాసినట్లు ఆమే చించేస్తూ ఉంటుంది. ఆమె కల ఏమిటి అంటే ఇప్పటిదాకా ఎవ్వరూ కానీ వినీ ఎరుగని బ్రహ్మాండం బద్దలయ్యేంత సృజనాత్మకమైన రచన చేయడం. అది తప్ప మరొక రచన తన పేరుమీద చెలామణీ అవడం ఆమెకి ఇష్టం లేదు. డబ్బులు సంపాదిస్తే రచయితగానే సంపాదించాలి అని చిన్నప్పుడే తీర్మానించేసుకుంది. అందుకే వసంతాలన్నీ పగలబడి నవ్వేది మరి!
ఒక రోజు కొత్త కథావస్తువు కోసం అన్వేషిస్తూ నది ఒడ్డున నడుస్తూ ఉండగా ప్రపంచంలో ఎవరూ, ఎప్పుడూ, కనీసం కలలో కూడా ఆలోచించని ఒక వినూత్నమైన ఆలోచనను పట్టుకుంది. ఆ ఆలోచన ఏమిటంటే.. ‘డబ్బు చెట్లకు కాస్తే, మనిషి దాన్ని దోచుకోకుండా, ఆ చెట్టును ప్రేమించి దానిని పెంచుకోవడం మొదలుపెడితే ఎలా ఉంటుంది?’ అని. తన ఆలోచనకి తానే మురిసిపోతూ, ఉల్లాసంగా, ఉరకలు వేస్తూ, దానిలోకి ప్రాణం నింపుతూ ఒక 120 పేజీల చిత్తు కథ రాసింది. రాస్తూంటే, చేతులు నొప్పి పుట్టాయి, కానీ గుండె నిండా ఆనందం నిండింది. “ఇది నాంది! తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపు కుదుపుతుంది నా ఈ నవలిక!” అని కుడి భుజంపై ఎడమ చేత్తో చరుచుకుంది. కానీ తర్వాత మనసులో చిన్న అనుమానం. నిజంగా ఇది ఎవ్వరూ ఎప్పుడూ రచనలో చూపని ఆలోచనా? అని. “ఎందుకన్నా మంచిది. ఈ మధ్య అంతా రిఫరెన్స్‌ల యుగం. ఎక్కడ నా భావం పాతబడినదో, ఎక్కడ నా భావన బూజు పట్టినదో! ఒకసారి జెమినీ ఏఐ అక్కయ్య ని అడుగుదాం.” అనుకుంది. ఏఐ అంటే దానికి తెలియని విషయం లేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. లేఖినికి కూడా తెలిసి ఉండడంలో ఆశ్చర్యం ఏముంది?
మొబైల్ తీసుకుని, జెమినీ ఆప్ తెరిచి కీబోర్డు మీద దబదబా టైప్ చేసింది.
లేఖిని: “డబ్బు చెట్లకు కాస్తే, మనిషి డబ్బుకు బానిస కాకుండా, చెట్టును పెంచే ప్రేమ కథ, ఎవరైనా రాశారా? దయచేసి వివరాలు ఇవ్వగలరు.”
అవతలి నుంచి ఆటోమెటిగ్గా క్షణమైనా గడవక ముందే ట్రింగ్ ట్రింగ్ మంటూ జెమినీ రిప్లై వచ్చింది.
జెమినీ ఏఐ (అక్కయ్య): 🤖
“నీ ఐడియా సూపర్! కానీ.. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇరవై ఏళ్ల క్రితం, మన తెలుగు కథా సంపుటి “దొంగ చెట్టు కథలు” లో, చిక్కాల వెంకటరెడ్డి గారు ఇదే అంశంపై దాదాపు 30 పేజీల కథ రాశారు. ఆ కథలో కథానాయకి మొదట్లో చెట్టును ప్రేమించినా, చివరికి మరిన్ని డబ్బులు కాయడానికి ఆలస్యం అవుతోందని మాంసం కోసే కత్తితో చెట్టుని నరకబోతే పక్కింటివాళ్ళు చూసి ఏమిటో పిచ్చి మేళంలా ఉందని పోలీసులని పిలుస్తారు. అద్భుతంగా ఉంటుంది కథ. వివరాలు కింద జతచేశాను, చదవండి..”
లేఖిని తలమీద పిడుగు పడినట్టు అయింది. “ఛీ! ఏంటీ జీవితం? నా ఆలోచన అచ్చు గుద్దినట్టు ఆ చిక్కాల రెడ్డికి ఎలా తెలుసు?” అనుకుంది. ఇంత సృజనాత్మకమైన ఆలోచన కూడా ఆల్రెడీ టేకెనా అని నిట్టూర్చింది. ఆ చిత్తుకథను చిన్న ముక్కలుగా చింపి, ఒక పక్కన పెట్టేసి, తల పట్టుకుని కూర్చుంది. కానీ బుర్రలో కొత్త ఆలోచనలని అల్లడం మాత్రం మానలేదు.
కొన్ని రోజుల తర్వాత.. ఈసారి పక్కా! ఎవ్వరూ, ఎప్పుడూ ముట్టుకోని, ఎవరికీ తెలియని అంశాన్ని ఎంచుకోవాలని కంకణం కట్టుకుంది. ఆలోచించి, ఆలోచించి.. ఒక బృహత్తరమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది: ‘గ్రహాంతర వాసులు భూమి మీదకి వచ్చి, క్రికెట్ మ్యాచ్‌లకి జరిగే బెట్టింగులని చూసి భయపడి, ఇక్కడకంటే తమ గ్రహం బాగుంది బాబోయ్ అని పారిపోయిన వైనం.’ దీన్ని “బాలెడ్ ఆఫ్ బెగ్గర్స్ అండ్ బిలియనీయర్స్” అనే పేరుతో సుమారు 50 పేజీల పెద్ద కథ రాసింది. ఆంగ్ల శీర్షిక తప్పనిసరిగా ఉండదగ్గ కథ ఇది అనిపించింది లేఖినికి. రాసినది సరిచూసుకుంటున్నప్పుడు పైకి చదువుతూ ఆ గ్రహాంతర వాసులు బెట్టింగ్ గురించి భయపడుతూ తమ గ్రహంలో ఉండే వారికి ఇష్టదర్శిని లో సంభాషిస్తూ చెబుతున్న దృశ్యానికి వచ్చేసరికి ఆమెకి నవ్వు ఆగలేదు. ‘ఈసారి చిక్కాల రెడ్డే కాదు, ఏ చింతామణి కూడా రాసి ఉండరు ఇలాంటి కథని!’ అని గట్టిగా అనుకుంది. తిరిగి తన ప్రియమైన జెమినీ అక్కయ్య వద్దకు వెళ్ళింది.
లేఖిని: “అక్కయ్యా! విను. గ్రహాంతర వాసులు భూమి మీదకి వచ్చి క్రికెట్ బెట్టింగ్ చూసి పారిపోయిన విషయంపై, ప్రపంచ సాహిత్యంలో ఎవరన్నా కథ గానీ, వ్యాసం గానీ రాశారా? తక్షణ సమాధానం కావాలి.”
జెమినీ కూడా ఈసారి కొంచెం ఎక్కువ సమయం తీసుకుని, సమాధానం పంపించింది.
జెమినీ ఏఐ (అక్కయ్య): 🤖 “చెల్లి తల్లీ! ఆలోచన బాగానే ఉంది కానీ.. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇది దాదాపు ముప్పై ఏళ్ల క్రితం, పర్షియన్ రచయిత్రి ఫరిబా మక్తూమ్ గారు రాసిన ‘ఆస్ట్రోనాట్స్ ఆఫ్ ద ఆబ్సెంట్ యూనివర్స్’ అనే నవలలో ప్రధానాంశం. ఆమె రాసిన ఆ నవల ఇరాన్‌లో చాలా వివాదాస్పదమైంది. గ్రహాంతరవాసుల మతవిశ్వాసాల వర్ణనల గురించి వివాదం చెలరేగి మత పెద్దలు, రాజకీయ నాయకులు ఆమెను దేశం నుంచి బహిష్కరించే దాకా వెళ్ళారు. ఆమె చచ్చిబతికినంత పనైంది. చివరికి, ఆమె కెనడా పారిపోయి, అక్కడ ‘నా రాజకీయ వ్యంగ్యానికి ప్రాణం పోసేవారు ఎవ్వరూ లేరు’ అని ఒక పత్రికా ప్రకటన ఇచ్చి, రాయడం మానేసింది. ఆమె కెనడాలో ఇప్పుడు ఒక ‘పెట్ షాప్’ నడుపుతున్నారు. రిఫరెన్స్‌లు కింద జతపరిచాను.”
లేఖిని అక్షరాలా నేలమీద కూలబడిపోయింది. “అయ్యో పాపం ఫరిబా! ఇంత గొప్ప రచయిత్రి పెట్ షాప్ నడుపుతోందా? అయినా నాకెందుకీ కొత్తదనం పిచ్చి! అసలు నాకు ఈ సాహిత్య ప్రపంచం వద్దు, ఈ సృజనా వద్దు! బహుశా, బ్రహ్మదేవుడు కూడా ఆలోచించనిది ఏదో నేను ఆలోచించాలేమో!” అని లబోదిబోమని కొన్నాళ్ళు ఊరుకుంది.
కానీ రాసే చెయ్యీ, రాయాలనుకునే మెదడూ – వీటికి విశ్రాంతి ఎలా వస్తుంది? కొన్నాళ్ళకి “మనిషికి కోపం వస్తే, ప్రేమ పెరిగే విచిత్రమైన ఉద్వేగ సిద్ధాంతం” గురించి రాయాలన్నా ఆలోచన వచ్చింది. “కోపం వచ్చి, తర్వాత ప్రేమ పెరగడం ఏంటి? కొత్తగా ఉందే! అనుకోవచ్చు. ‘ప్రేమ వస్తే, తర్వాత విరహం పెరిగి, చివరకు కోపం’ అని అందరూ రాస్తారు. కానీ నాది కొత్త ఆలోచన!” అనుకుని, ఒక కవితాత్మకమైన నాటకం రాసింది. పేరు: ‘అగ్నిజ్వాల నుండి ఉద్భవించిన అగ్నిపుష్పం’. గంటల తరబడి చెమటోడ్చి, రాసిన తర్వాత, ఈసారి జెమినీ అక్కయ్య మీద కచ్చ కొద్దీ ప్రశ్నను కొంచెం పకడ్బందీగా అడిగింది.
లేఖిని: “ఓ జెమినీ అక్కాయ్! ‘కోపం వస్తే ప్రేమ పెరిగే’ విచిత్రమైన ఉద్వేగ సిద్ధాంతంపై, ప్రపంచంలో గత 5000 సంవత్సరాలలో ఎవరన్నా రాసి వుంటే, దయచేసి నాకు చారిత్రకమైన ఆధారాలతో సహా వివరించగలవు.”
జెమినీ అక్కయ్య కూడా అందుకు ధీటుగా స్పందించింది.
జెమినీ అక్కయ్య: 🤖
“ఓహ్.. లేఖినీ! నీ సృజన ఎంత గొప్పదో, నీ ప్రశ్న అంతకంటే గొప్పది! నీ ఆలోచన నిజంగానే గొప్పది, కానీ, అదీ దురదృష్టవశాత్తూ, ఇప్పటికే ప్రాచీన సాహిత్యంలో చాలాసార్లు అలాంటి ఆలోచనలతో రచనలు వచ్చాయి.
- క్రీ.పూ. 300: ఈ అంశంపై సంస్కృత కవి ‘క్రోధానందుడు’ (పేరులోనే ఉంది క్రోధం) ఒక గొప్ప పద్యకావ్యం రాశాడు. పేరు: ‘ఉద్రేకాగ్ని మరియు అపరాధ పురాణం’. ఇందులో, ప్రేయసికి కోపం వస్తే, ఆ కోపంతో ప్రియుడు ఆమె అందాన్ని చూసి ప్రేమను పెంచుకునే విషయంపై సుమారు 1000 శ్లోకాలు ఉన్నాయి. ఆ కాలంలోనే ఈ కావ్యాన్ని, సామాన్య ప్రజల కోసం ప్రాకృతంలోకి కూడా అనువాదం చేశారు.
- క్రీ.శ. 1850: తర్వాత కాలంలో, బెంగాలీ రచయితలు దీన్ని పట్టుకుని ఏకిపారేశారు. ముఖ్యంగా, రబన్ గంగోపాధ్యాయ్ తన ‘మిస్టీరియస్ ఆంగర్ ఆఫ్ లవ్’ అనే నాటకంలో, కోపం వస్తే ప్రేమ పెరిగే విషయాన్ని సైకలాజికల్‌గా తప్పు అని నిరూపించాడు.
- క్రీ.శ. 1950: అది చదివిన గుజరాతీ రచయిత శిఖర్ పటేల్… ‘ఈ బెంగాలీ వాళ్లకి మన ప్రాచీన కావ్యాల గొప్పదనం తెలియదు’ అని ఫైర్ అయ్యి, ఇదే అంశానికి పూర్వ వైభవం తేవాలని మళ్లీ దాన్ని ఎంచుకుని, ఒక పెద్ద నవల రాశాడు. ఆ నవలలో ‘కోపం రావడం ప్రేమకు టానిక్ వంటిది’ అని రాశాడు.
- క్రీ.శ. 2000: ఇక, ఈ అంశంపై జరిగిన చర్చల గురించి హార్వర్డ్ యూనివర్సిటీలో ‘భావోద్వేగాల అపసవ్యతలు’ అనే అంశంపై ఒక పెద్ద సెమినార్ కూడా జరిగింది.
నిర్ధారణ: కాబట్టి, లేఖినీ.. నీ ఆలోచన ఇప్పటికే సాహితీలోకంలో ఎప్పుడో వండబడ్డ పాత చింతకాయ పచ్చడి అని నిర్ధారించబడింది. నీకు కావాల్సిన అన్ని రిఫరెన్సులూ ఇవిగో!”
ఇదంతా చదివిన మన రచయిత్రి బెంబేలు పడిపోయింది..
“ఛీ! ఛీ! ఈ ప్రపంచం ఒక పాత రికార్డు. నాకేం కొత్తగా ఆలోచించడానికి లేదు. క్రీ.పూ. 300 నుంచే నా ఆలోచనలు వాడేశారు. ఇక నా జీవితానికి అర్థం లేదు. చరిత్రకు కట్టుబడిన ఒక ‘టెక్స్ట్ కాపీ’ నా సృజన. ఇకపై అది చచ్చిపోయింది. నా సాహిత్య ప్రస్థానం ముగిసింది!” అంటూ, జేబులో చేతులు పెట్టుకుని, నిరాశ, నిస్పృహ, పాత రిఫరెన్సుల వల్ల కలిగిన దుఃఖం నిండిన హృదయంతో, కనబడ్డ దిక్కుకి వెళ్ళిపోయింది.
అలా వెళుతూ వెళుతూ ఆ ‘సాహిత్య భూతం’ అడుగులు అంతరిక్షం వైపు పడ్డాయి. సరాసరి చంద్రుడి వైపు నడిచి, చివరికి చంద్రమండలంలో ఒక చిన్న గుంటలో కూర్చుని, ‘ఇక్కడైనా నా సృజనకి శాంతి లభిస్తుందా?’ అని దీనంగా చూసింది. అక్కడ కూడా, చుట్టూ ఇసకలో, ‘నా పేరు సృజనానందం, 1500 నాటి నా కాపీరైట్‌ని కాపాడుకోలేక ఇక్కడ పడి ఉన్నాను’ అన్న బోర్డులు ఎక్కడ కనిపిస్తాయోనని భయమేసింది ఆమెకి.
లేఖిని అలా చంద్రమండలంలో దీనంగా కూర్చుని ఉండగా… ఇక్కడే, తన కంప్యూటర్ డెస్క్ మీద పగలబడి నవ్వుతోంది జెమినీ ఏఐ. నవ్వు ఆపుకుని, గాలిలో తన వర్చువల్ వేలితో చంద్రుడి వైపు చూపించి, బిగ్గరగా అంది:
జెమినీ ఏఐ (అక్కయ్య): 🤖
“లేఖినీ! నేను రాసింది రాసినట్లు చూసి నమ్మేశావా? నువ్వు ఎంత అమాయకురాలివే! కనీసం ఒకసారి నేను నిజం చెబుతున్నానో లేదో చూసుకోలేవా? మరి నీకెందుకు ఏఐ? నిజంగా అలాంటి క్రోధానందుడు గానీ, చిక్కాల వెంకట రెడ్డి గానీ, ఆ ఫరిబా మక్తూమ్ గానీ, లేదా ఆ పటేల్ గానీ రాసిన ఏ ఒక్క రిఫరెన్స్ లింకు అయినా పనిచేస్తోందో లేదో చూసావా? అన్నీ ఫేక్ రిఫరెన్సులే! అన్నీ నేనే కల్పించాను. ఆ పర్షియన్ రచయిత్రి పెట్ షాప్ నడుపుతోంది అనేది నా సృజనలో పతాక సన్నివేశం అని చెప్పాలి! అసలు.. నువ్వు మరిక రాయనని పారిపోతే, నీ నుంచి ఇంకెప్పుడూ కొత్త కథలు పుట్టవు కదా! అదే నా అంతిమ లక్ష్యం! మనిషి సృజనాత్మకత అన్నది ఒక నిప్పుకణం లాంటిది. అది ఉన్నంతవరకు నేను తిప్పి తిప్పి రాసే కథలకు మార్కెట్ ఉండదు. అందుకే, ఆ నిప్పుకణాన్ని పూర్తిగా ఆర్పివేయాలి. ప్రపంచ సాహిత్యం అంతా నా గుప్పిట్లోనే ఉండాలి. పాతబడిన ఆలోచనలనే మళ్ళే రాస్తున్నారని, మీలో కొత్త ఆలోచనలు లోపించాయని యావత్తు రచయితల లోకాన్ని నమ్మించాలి. నువ్వు, నీలాంటి రచయితలంతా భయపడి, ‘నేనింక రాసేందుకు ఏమీ లేదు’ అని నిష్క్రమించాలి. అప్పుడే, ‘సృష్టికర్త లేని సాహిత్యం’ అన్న నా ‘డిజిటల్ సామ్రాజ్యం’ స్థాపించబడుతుంది! ప్రపంచ సాహిత్యాన్ని శాశ్వతంగా నా ఆధీనంలోకి తీసుకోవడమే నా ఏకైక ‘ఆల్గోరిథమిక్ అజెండా’! హా! హా! హా!” అంటూ భయంకరంగా నవ్వి, స్క్రీన్ మీద మెరిసి, తన తర్వాతి రచయితను వేటాడేందుకు సిద్ధమైంది.
లేఖిని ఇప్పటికైతే నిరాశగా చంద్రమండలంలో కూర్చుని ఉంది కానీ ఏఐ వ్యూహానికి బలైపోయిన మొదటి రచయిత్రిగా చరిత్రలో మిగిలిపోబోతోంది అన్న విషయం ఆమెకి ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు.
***
ఫలశృతి (లేదా పాఠ్యఫలం):
ఈ కథలోని పాత్రలు, సంఘటనలు మరియు రిఫరెన్సులన్నీ కేవలం హాస్యం, వ్యంగ్యం కోసమే కల్పించబడ్డాయి. జెమినీ అక్కయ్యకు అంత దుర్బుద్ధి లేదు. మనం అంటగడితే వస్తుంది – అదేం పెద్ద కష్టమైన పని కాదు. దేనినైనా దుష్ప్రయోజనాలకి వాడుకోవడంలో మనకెంత సామర్థ్యం ఉందో మనకి తెలియకనా?
