[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ఈ చిన్ని హృదయంలో..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అమ్మ చెప్పిన
మంచి మాటలు గుర్తుంటాయి!
నాన్న బోధించిన జీవన సత్యాలు
సదా తోడై ఉంటూ
బతుకు బాటకి
వెలుగుల కిరణాలై
నడిపిస్తుంటాయి!
నల్లని బోర్డుపై గురువులు
లిఖించిన అక్షరాల
సమాహారాల విజ్ఞానాలు
విరామాలే ఎరుగక
ఒకటి వెంట ఒకటిగా
సాగుతున్న పీరియడ్లు మొత్తంగా
మాస్టారులు తెలియజేసిన
జ్ఞానామృతమయమైన పాఠ్యాంశాలు
మా అభ్యున్నతికి
మార్గదర్శకాలై
ప్రేరణాభరితమవుతుంటాయి!
చిన్ని అపజయం ఎదురైనా
వెన్ను తట్టి రేపటి ఘన విజయం
నీదేనంటూ నమ్మకంగా పలుకుతూ
ఆత్మీయతకు మారు పేరై నిలిచే
స్నేహితుల హితవచనాలు
ఆనందకారకాలై
ధీమాగా ముందుకు సాగేలా
ఉత్సాహాన్నిస్తాయి!
తోబుట్టువులు తోడుగా ఉంటూ
ఆపదే రాకుండా అడ్డుగోడగా నిలుస్తూ
ముందుకు నడిపిస్తుంటే..
పెదవులపై విజయదరహాసాలు
చిగురిస్తుంటే విజయాలు
అలవోకగా లభిస్తుంటే..
విజయ తీరాల వెంట
నడుస్తున్నామంటే
నిచ్చెనగా నిలిచి సహకరిస్తున్న
మనవారి చలువే కదా!
ఈ చిన్ని హృదయంలో
నా వాళ్ల స్థానం ప్రత్యేకం!
నన్ను నడిపే చైతన్యమూర్తులకు
అభివందనం!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
