Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈ దేశానికి మనమేమివ్వాలి?-1

[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘ఈ దేశానికి మనమేమివ్వాలి?’ అనే నాటిక అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]

పాత్రలు:

ధృతి: 30 సం॥లు, కలెక్టర్

చంద్రదీప్: అంగన్‌వాడీ సూపర్‍వైజర్ – 45 సం॥లు

భానుమతి: చంద్రదీప్ భార్య – 40 సం॥లు

ప్రజ్ఞ: ధృతి స్నేహితురాలు – 30 సం॥లు

శౌర్య: సంఘసంస్కర్త, హీరో, 30 సం॥లు

సత్యం: విలేఖరి 30 సం॥లు

***

మైకులో మాట్లాడుతూ ఉంటుంది ధృతి.

“అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నన్నాహ్వానించి నా సమర్థతను గుర్తించి ఇలా ప్రభుత్వ అత్యున్నత అవార్డును నాకు అందివ్వటంతో నా జన్మ ధన్యమైంది. ఎందరినో స్ఫూర్తిగా తీసుకుని ఎదిగిన నేను – నేను మరెందరికో స్ఫూర్తి అని మీకందరూ చెబుతుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి. స్థాయిలో నిలబెట్టిన చంద్రదీప్  బాబాకీ, భానుమతి అమ్మకు ఎప్పటికీ ఋణపడే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.”

చప్పట్లతో ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనిస్తుంది.

***

చంద్ర: ఈ రోజు నా కెంతో సంతోషంగా ఉంది భానూ.

భాను: అవునండీ. నాకు కూడా!

చంద్ర: ఆ రోజు నువ్వు అలా ముందుకు రాకపోయి ఉంటే ధృతి ఏమయి పోయేదో?

భాను: అంతా భగవదేచ్ఛ. అంతా మనమే చేస్తున్నాం అనుకుంటాం కానీ వెనక ఉండి నడిపించేది ఆ పరమాత్ముడే.

చంద్ర: ఏమో భానూ! అదంతా నాకు తెలియదు. మన పిల్లలతో పిల్లలా చూసుకుందాం అని నువ్వు మనస్ఫూర్తిగా అన్నావు.

భాను: ఎంత పని అమ్మాయి అయితే మాత్రం వాళ్ళు అమ్మ మన దగ్గర నమ్మకంగా పని చేసేది.

చంద్ర: అవును. ఇంటి మనిషిగా ఆమెకు తాళాలు అన్నీ ఇచ్చేసేవాళ్ళం.

భాను: సొంత మనిషిలానే ప్రాణం పెట్టేది. అలాంటి మంచిదానికి త్రాగుబోతు వెధవ మొగుడవ్వడమే దాని దురదృష్టం.

చంద్ర: అవును.

భాను: అందుకే తొందరగా తీసుకెళ్ళి పోయాడు వాడిని. తప్పతాగి నడిరోడ్డు మీద తందనాలాడితే యాక్సిడెంట్ కాక మరేం జరుగుతుంది?

చంద్ర: మధ్యలో ఆమె కదా అన్యాయమయ్యింది?

భాను: అవునండీ. చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. కానీ ప్రశాంతంగా ఉంది. కొన్నాళ్ళైనా.

చంద్ర: అది కూడా ఎన్నాళ్ళో లేదుగా!

భాను: ఏం చేస్తాం? ఎవరు ఎలా వెళ్ళిపోవాలో పైనాయన ముందే రాసి పెట్టేసి ఉంటాడట.

చంద్ర: అంతేనేమో!

భాను: లేకపోతే ఎవడో లారీ డ్రైవర్ తాగేసి వచ్చి వీళ్ళ గుడిసెను గుద్దెయ్యటమేమిటి? ఆమె అక్కడిక్కడే ప్రాణాలు వదిలెయ్యటమేమిటి?

చంద్ర: విచిత్రంగా మన పిల్లలతో ఆడుకుంటూ ధృతి ఆ రాత్రి మన దగ్గర ఉండటం కూడా వింతే!

భాను: అందుకేగా ఆ పిల్ల బయటపడింది. ఈనాడు ఇంత ఎత్తుకు ఎదిగింది.

చంద్ర: ఆ విత్తుకు పేరు పెట్టి వటవృక్షంగా చేసింది నువ్వేగా.

భాను: మనం చేసిన ఉపకారం మనం ఎప్పుడూ చెప్పుకోకూడదండీ

చంద్ర: అదీ నిజమే భానూ.

భాను: ఎందరి కళ్ళు ధృతి మీద పడ్డాయో ఒక్కసారి దిష్టి తీసి వస్తాను.

చంద్ర: అలాగే. నీ అభిమానానికి అంతు ఉండదేమో!

భాను: మీరు భలేవారే! ప్రేమకు ఎప్పుడన్నా అంతం ఉంటుందా? అది ఎప్పుడూ అనంతమే.

చంద్ర: హఁ! హఁ ! హఁ! (నవ్వుతాడు.)

ధృతి: అమ్మా! నన్ను ఆశీర్వదించండి. ఈ అక్షింతలు తీసుకోండి.

చంద్ర, భాను: అభీష్ట సిద్ధిరస్తు.

భాను: నేనే నీ దగ్గరికి వస్తున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు.

ధృతి: అవునమ్మా. నా ప్రతి అడుగుకు ముందు అడుగు మీదే. అందుకే నేను ఇలా ఉన్నాను.

భాను: అంతా మాదే అనకు, అవకాశం మేమిచ్చాం. దానిని నువ్వు అందుకున్నావు. అంతే!

చంద్ర: ఏం తీసుకుంది? అన్నిటికీ అభిమానమే. మనింట్లో ఉండమంటే ఉందేమిటి?

ధృతి: ఎక్కడ ఉంటే ఏమిటి బాబా! అక్కడా మీ ఆశీస్సులేగా. అంగన్‌వాడీ నాకు మరో అమ్మ అయ్యింది.

చంద్ర: ప్రభుత్వ పథకాలు అన్నీ మీ లాంటి వారి కోసమే.

భాను: కాస్త కదిలిస్తే చాలు ఎక్కడికో వెళ్ళిపోతారు.

ధృతి: అలా అనకండి అమ్మా. బాబా నిజమేగా చెబుతున్నారు. మంచిని మంచి అని ఒప్పుకోవాలిగా.

చంద్ర: అలా చెప్పు ధృతి.

భాను (నవ్వుతూ): ఒకరికి ఒకరు వంత సరిపోయింది.

ధృతి: నిజమే కదమ్మా. బీదవారికి సరైన నీడ, ఆహారం పెద్ద లోటే కదా. దానిని భర్తీ చేస్తున్న అంగన్‌వాడీని మెచ్చుకోవటంలో ఏ మాత్రం తప్పు లేదు.

భాను: తెలిసిందేగా. మా ఇద్దరిదే ఒకటే మాట. అందుకేగా నువ్వు రెండేళ్ళు అక్కడే ఉన్నావు.

చంద్ర: అవును భానూ. పిల్లలని క్రమశిక్షణలో పెంచాలి. అతి గారాబం చేసి అడిగినదంతా ఇచ్చి చెడగొట్టకూడదు.

భాను: అవునవును. అదేగా మీరు పాటించేది.

ధృతి: నాకు బాగా గుర్తుంది బాబా. రోజూ అన్నీ వాళ్ళు బాగా పెడుతున్నారా అని నన్ను అడుగుతూ ఉండేవారు మీరు.

భాను: నిజం చెప్పే దానివా?

ధృతి: అవునమ్మా. గుడ్డు కూడా పెట్టే వాళ్ళు. నాకు బాగా గుర్తే.

చంద్ర: మేము వస్తున్నామని ఎలా తెలిసేదో ముందే తెలిసి పోయేది. అందుకే నిన్ను అడిగే వాడిని.

భాను: పథకాలు అమలు చేయటంలో నిబద్ధత చూపితేనేగా వాటి ఉపయోగం మరింత పెరిగేది.

చంద్ర: హమ్మయ్య! ఇన్నాళ్ళకు నా మాట ఒకటి ఒప్పుకున్నావ్.

భాను: పోండి. మీరు మరీనూ.

ధృతి, చంద్ర: నవ్వులు వినిపించాలి.

***

ప్రజ్ఞ: ధృతీ! నీ విజయం నా విజయంలా అనిపిస్తోందే.

ధృతి: అంతే! నిజమైన స్నేహితులకి అలానే అనిపిస్తుంది.

ప్రజ్ఞ: ఎవరెన్నిన్నా నా ప్రాణమున్నంత వరకూ నీ స్నేహాన్ని విడవను.

ధృతి: విడగొడితే విడిపోయే స్నేహమా మనది?

ప్రజ్ఞ: అవును. అయిదో తరగతి నుంచీ ఇప్పటి వరకూ కలిసే ఉన్నాం అంటే మాటలు కాదు.

ధృతి (పాటలా పాడుతుంది): కస్తూరి బా బాలికా విద్యాలయం కలిపింది ఇద్దరినీ.

ప్రజ్ఞ: అవును. హాస్టల్లో కూడా మనిద్దరమే.

ధృతి: బాబా, అమ్మ ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళంట్లో ఉండనన్నాను. కావల్సినంత వరకే ఎదుటి వారి సహాయాన్ని తీసుకోవాలనేది నా సిద్ధాంతం.

ప్రజ్ఞ: అంత చిన్న వయసులోనే అది నీకు ఎలా తెలిసింది?

ధృతి: ఏమో! కష్టాలతో పాటూ తెలివి కూడా వస్తుంది ఏమో? అయినా జ్ఞానానివి నువ్వు ప్రక్కనున్నావుగా, అందుకే అబ్బి ఉంటుంది.

ప్రజ్ఞ: అవునని నేనేం ఒప్పుకోనులే. ఎంతైనా నువ్వు అందరి లాంటివి దానివి కావే.

ధృతి: అబ్బో!

ప్రజ్ఞ: నువ్వు ప్రత్యేకమే!

ధృతి: ఆ స్కూల్లో మన బాల్యం అపురూపమే కదా.

ప్రజ్ఞ: అవునే. నీ స్నేహంతో అది మరింత పెరిగింది.

ధృతి: టీచర్లు కూడా ఎంత శ్రద్ధగా చెప్పేవారు. ఉచితం అనే భావన కూడా రానిచ్చేవారు కాదు.

ప్రజ్ఞ: వార్డెన్ కూడా మనిద్దరినీ బాగా చూసుకునే వారు.

ధృతి: అవును. అమ్మను మరిపించే వారు.

ప్రజ్ఞ: అంతా మన అదృష్టం.

ధృతి: ఆడపిల్లలమని ఎన్ని జాగ్రత్తలు చెప్పేవారో.

ప్రజ్ఞ: అవును. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయని, ముందుచూపు ఉండాలని అనేవారు.

ధృతి: చిన్న వయసు వాళ్ళమైనా మగవాళ్ళ బుద్ధులు, వారి చేష్టలు గురించి వివరించి మరీ జాగ్రత్తలు చెప్పేవారు.

ప్రజ్ఞ: అవే మనల్ని అప్రమత్తతలో ఉంచాయి.

ధృతి: అవునే. అడుగడుగునా కాపు కాసే మృగాలు మన ప్రక్కనే ఉండేవి. వాటిని అన్నిటినీ చాకచక్యంగా దాటుకునే వాళ్ళం.

ప్రజ్ఞ: అవును. ఒక్కోసారి మనం అరణ్యంలో ఉన్నామా అని కూడా అనిపించేది.

ధృతి: పోనీలే, ఎలాగోలా అన్నిటినీ అధిగమించాం.

హా! ఇద్దరి నవ్వులూ వినిపించాలి.

***

చంద్ర: భానూ! భానూ! రెడీ అయ్యావా?

భాను: ఆఁ! అయిపోయిందండీ. మీరు మరీ కంగారు పెట్టేస్తారు. ఇంకా అరగంట సమయం ఉంది.

చంద్ర: ఈ రోడ్లను, ట్రాఫిక్‌ని ఎవరు నమ్ముతారు భానూ? ఆలశ్యంగా వెళితే ధృతి చిన్నబచ్చుకుంటుంది.

భాను: మీరు అలా ఎలా వెళ్తారు. అందుకేగా మీతో రిబ్బన్ కటింగ్ చేయిస్తోంది.

చంద్ర: ఈ దేశం మాకేమిచ్చింది అని ఎందరో అనుకుంటుంటారు. మనం దేశానికి ఏమిస్తున్నాం అని ఆలోచించే ధృతి లాంటి వాళ్లు కొందరే ఉంటారు.

భాను: అవునండీ. నిజం చెప్పారు.

చంద్ర: ఒట్ఠి నిజం కాదు. నికార్సైన నిజం.

భాను: (నవ్వు)

చంద్ర: లేకపోతే తల్లి తండ్రులు లేని అనాథలను ఎంచుకొని వారికో భవనం, స్కూలు ఏర్పాటు చేయటం అంటే మాటలా?

భాను: అంతేనా? వాళ్ళతోనే తన ఉండాలనుకోవటం. అది చెప్పరేం?

చంద్ర: నువ్వు చెబుతావుగా.

భాను: మన పిల్లలను మనం పొగడకూడదంటారు. ధృతిని పొగడకుండా ఉండలేకపోతున్నాను.

చంద్ర: అవునే. ధృతి ఒక మట్టిలో మాణిక్యం.

భాను: నా ధృతి ‘వజ్రం’.

చంద్ర: అలాగే. ఒప్పుకుంటాను. ఎక్కడా ధృతిని తగ్గనివ్వవు.

భాను: అందుకేగా మన పిల్లలు మాకంటే నాకు ధృతినే ఇష్టం అని ఉడుక్కుంటూ ఉంటారు.

చంద్ర: నాకు కూడా అలానే అనిపిస్తుంది.

భాను: మీరు మాత్రం తక్కువ తిన్నారేమిటి? నాది కనిపిస్తుంది. మీది కనిపించదు.

చంద్ర: ఒప్పేసుకున్నాం. ఒప్పేసుకున్నాం.

భాను: కబుర్లేనా? కదులుతారా.

చంద్ర: పద: పద!

(ఫోన్ రింగవుతుంది)

భాను: ధృతి అయి ఉంటుంది. ఇంకా బయలుదేరలేదా అని అడగటానికి చేసి ఉంటుంది. చెప్పండి. బయలుదేరామని.

చంద్ర: ఆ! ధృతీ! వచ్చేస్తున్నాం!

ధృతి: అలాగే! బాబా! ఎదురు చూస్తుంటాను.

భాను: నేను వస్తున్నా!

ధృతి: నువ్వు రాకపోతే ఎలా అమ్మా! శివ పార్వతుల్లా మీ ఇద్దరూ ఎప్పుడూ నా జీవితంలో ఉండాలి.

***

ప్రజ్ఞ: ఏమిటి అదోలా ఉన్నావ్ ధృతీ ఈ రోజు?

ధృతి: ఏమోనే! ఈ రోజు అమ్మా, నాన్నా బాగా గుర్తు వస్తున్నారు.

ప్రజ్ఞ: అమ్మ, నాన్నలను ఎవరు మాత్రం మరిచిపోగలరు?

ధృతి: అవునే అనుక్షణం వాళ్ళు నన్ను పలకరిస్తూనే ఉంటారు.

ప్రజ్ఞ: నీ అదృష్టం కొద్దీ భానుమతి, చంద్రదీప్ ఆ స్థానాన్ని భర్తీ చేసారు.

ధృతి: అందుకే కదా ఆయనను అప్పా లాగా బాబా అని పిలుచుకుంటాను. నాకైతే ఆయనను మనసారా నాన్నగారూ అని పిలవాలని ఉంటుంది.

ప్రజ్ఞ: కన్నది మీ అమ్మ నాన్నే అయినా చెప్పుకోవాలంటే వీళ్ళేగా నీ తల్లి తండ్రులు.

ధృతి: అవునే. అమ్మా, నాన్న నాకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయారు.

ప్రజ్ఞ: వాళ్ళ ఋణం కూడా తీర్చుకున్నావుగా. మీ నాన్న తాగుడు వ్యసనం వల్ల చనిపోయాడని – శపథం పట్టి మన జిల్లాలో మద్యపాన నిషేధాన్ని అమలు చేసేట్లు చేసావు.

ధృతి: అది నా ఒక్కదాని గొప్పతనం కాదే. ఊళ్ళో వాళ్ళందరూ అర్థం చేసుకుని అవలంబించారు. అది వాళ్ళందరి కృషి ఫలితమే.

ప్రజ్ఞ: ఏమో బాబూ! నా లెక్కలో ఆ క్రెడిట్ అంతా నీదే.

ధృతి: ఏం కాదు. అందులో సగం ‘శౌర్య’కి దక్కాల్సిందే.

ప్రజ్ఞ (ఆశ్చర్యంగా) : శౌర్యానా?

ధృతి: అవునే. నీకూ తెలుసుగా. అందరికీ అవగాహన రావటానికి అతను ఎంతో కృషి చేసాడు. పాటలు రాసాడు. మంచి గాయకులతో పాడించి జనాల్లోకి వెళ్ళేట్లు చేశాడు.

ప్రజ్ఞ: అవును. నేనా విషయమే మరిచిపోయాను.

ధృతి: మనం సాయం చేసిన వాళ్ళు ఆ విషయం మరిచిపోయినా ఫరవాలేదు. మనకు గోరంత సాయం చేసిన వారినైనా మనం మరిచిపోకూడదే. అది నా సిద్ధాంతం.

ప్రజ్ఞ: అలాగే. ఒప్పుకుంటున్నాను తల్లీ. పొరపాటైంది. మళ్ళీ ఎప్పుడూ అనను.

ధృతి: ప్రజ్ఞా! నువ్వు నా చెల్లెలు వంటి దానిని. అందుకే నీకు మంచి, చెడు చెప్పాలనిపిస్తుంది. అక్క అయితే చెప్పదా?

ప్రజ్ఞ: భలే దానివే. నేనెప్పుడూ మనసులో అనుకుంటూ ఉంటాను. అనాథదైన నన్ను ఓ చెల్లిలా అక్కున చేర్చుకున్నావని.

ధృతి: మనం ఒకరికి ఒకరం ఉండగా అనాథలం ఎలా అవుతాం?

ప్రజ్ఞ: అవునే.

ధృతి: ఈ మాట భానుమతి అమ్మ విందంటే కర్ర పట్టుకొని నా వెనక పడుతుంది.

ప్రజ్ఞ: నిజమేనే! ఆవిడ నిన్ను ప్రేమగా చూస్తుందని వాళ్ళ పిల్లలే అసూయగా మాట్లాడుతూ ఉంటారట.

ధృతి: అవును. అమ్మ మాత్రం వాటిని పట్టించుకోదు.

ప్రజ్ఞ: అమ్మలంతా అంతే కదా!

***

శౌర్య: ధృతీ గారూ! నేను రావొచ్చా?

ధృతి: భలేవారే శౌర్యా, మీరు రావటానికి నా పర్మిషన్ కావాలా?

శౌర్య: తమరు మామూలు ఆడవారు కాదు. ఐ.ఏ.ఎస్ ఆఫీసర్.

ధృతి: కానీ మనం స్నేహితులం కదా!

శౌర్య: ఏదో మామూలు వాడిని. మీరు మమ్మల్ని స్నేహితుడు అనుకోవటమే మా అదృష్టం.

ధృతి: నువ్వో మంచి మనిషివి. సంఘ సంస్కర్తవి.

శౌర్య: అంత పెద్ద పెద్ద మాటలు వద్దండీ.

ధృతి: ఈ అండీలకు ఫుల్‍స్టాప్ ఎప్పుడు?

శౌర్య: అమ్మో! అది మాత్రం అడక్కండి. అప్పుడు అందరూ వీడికి టెక్కు ఎక్కువ, కలెక్టరమ్మనే ఏకవచనంతో పిలుస్తున్నాడని తలో మాట అంటారు.

ధృతి: అందరి గొడవ మనకెందుకు? నేను చెబుతున్నానుగా.

శౌర్య (నవ్వుతూ): అవుననుకోండి.

ధృతి: నీకు తెలుసుగా నాకు కుల, మత, పేద, గొప్ప తారతమ్యాలు ఉండవని.

శౌర్య: తెలుసు. కానీ కొన్ని సమాజ కట్టుబాట్లకు లోబడి ఉండాలిగా అందరిలో బ్రతుకుతున్నప్పుడు.

ధృతి: మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎదుటి వారు ఎవరూ తప్పు పట్టలేరు శౌర్యా.

శౌర్య: అంతా మీ అభిమానమే.

ధృతి: ప్రజలను త్రాగుడు నుంచి దూరం చెయ్యడానికి నిజం చెప్పాలంటే నా కంటే నువ్వే ఎక్కువ కష్టపడ్డావు.

శౌర్య: అది పౌరుడిగా నా కర్తవ్యం కూడా!

ధృతి: అలా ప్రతి మనిషి అనుకుంటే మన దేశం ఎప్పుడో బాగు పడిపోయేది.

శౌర్య(నవ్వుతూ): అంటే అందరూ శౌర్యలై పోవాలి అన్నమాట.

ధృతి: అన్న మాట కాదది, ఉన్న మాటే.

శౌర్య: పిల్లలకు కావల్సినవన్నీ అందుతున్నాయా? లేదంటే చెప్పండి. నేను చూసుకుంటాను.

ధృతి: ఏదైనా నేను చేయగలిగినంతే చేసేలా చూసుకుంటాను. తలకు మించిన భారాన్ని నేనెప్పుడూ ఎత్తుకోను.

శౌర్య: మీకది చిన్నది గానే అనిపిస్తుంది. కానీ మీరు చేసే పనులన్నీ అలాంటివే. పెద్దవే.

ధృతి: లేదు. లేదు. ఏదో నా మీద అభిమానంతో అలా అంటారు.

శౌర్య: ముసలి వయసులో ఇలాంటి బాధ్యతలు చేపడతారు అందరూ.

ధృతి: వయసుతో సంబంధం లేకుండా పండిపోయాను. బీదరికం ఎక్కువ పాఠాలు నేర్పుతుందేమో.

శౌర్య: అది మాత్రం వంద శాతం నిజం.

ధృతి: ఇప్పుడు మీ కార్యకలాపాలు ఏమిటి?

శౌర్య: ఏముంది? డబ్బులకి ఆశపడి ఓటును అమ్ముకోకండిరా అని హిత బోధ చేస్తున్నాను. ఎలక్షన్స్ వస్తున్నాయిగా.

ధృతి: అందరూ తెలిసి చేసే తప్పు అదే కదా.

శౌర్య: కానీ అది తప్పే కాదన్నట్లు మాట్లాడుతారు.

ధృతి: ఎవరు చేసేది వారికి ఒప్పుగానే కనిపిస్తుంది పాపం. మనం ఏమి చేయగలం?

శౌర్య: అలా వదిలేస్తే ఎలా? ప్రజలను మార్చాల్చిన బాధ్యత మనదే.

ధృతి: పోనీ నువ్వే నిలబడవచ్చుగా.

శౌర్య: అమ్మో! నాకు వద్దండీ! రాజకీయ నాయకులంటే స్వచ్ఛంగా ఉండాలని, న్యాయం కోసం పాటుపడాలని, ప్రజా సంక్షేమాన్నే కోరుకోవాలని ఇలా చాలా ఉన్నాయి నాకు.

ధృతి: మరింకేం. ప్రజలకు మంచి పరిపాలన అంటే చూపించు.

శౌర్య: అవి మాటలలో చెప్పేంత తేలిక కాదు. మనమంతా మనకు తెలియకుండానే ఊబి లాంటి బురదలో కూరుకుపోయాం.

ధృతి: కమలంలా వికసించమంటున్నా అందుకే.

శౌర్య: నాకంత ఆశ లేదు.

ధృతి: నీ కోసం కాదు.

శౌర్య: వద్దు. వద్దు. ఈ టాపిక్ వదిలెయ్యండి.

ధృతి: అందరూ ఇలా పారిపోతే సమాజాన్ని ప్రక్షాళన చేస్తే వారు ఎవరు?

శౌర్య: ఇంకెవరు? మీ లాంటి వారే.

ధృతి: మీ వంతు ఏమీ లేదా?

శౌర్య: సహకరణ మాత్రం మాదే.

ధృతి: ఎక్కడా తగ్గవు. దొరకవు.

శౌర్య: హఁ! హఁ! (నవ్వుతాడు)

ధృతి: మల్లె పూవులా భలే నవ్వుతావు స్వచ్ఛంగా శౌర్యా.

శౌర్య: సరే! నే వెళ్ళొస్తాను మాడమ్.

ధృతి: సరే.

***

చంద్ర: ఏమిటోయ్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?

భాను: అదేనండీ. మన పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయాయి.

చంద్ర: కదా. ఇంక దిగులెందుకు? ఇక పిల్లలను కని ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద కదా ఉంది.

భాను: ఊరుకుందురు. ఎప్పుడూ జోకులే.

చంద్ర: ఏదో నిన్ను కాస్త చల్లపరుద్దామని.

భాను: అది కాదండీ.

చంద్ర: చెప్పమనే కదా అడుగుతున్నాను.

భాను: ధృతికి కూడా పెళ్ళి చేస్తే బాగుంటుందని.

చంద్ర: ఎంతైనా ఆడదానిననిపించుకున్నావ్. నాకైతే ఆ ఆలోచనే రాలేదు.

భాను: అందుకేగా నేను గుర్తు చేస్తున్నది.

చంద్ర: తనకు మాత్రం ఎవరన్నారని? ఆ కార్యక్రమం కూడా మనమే చేసేద్దాం.

భాను: ధృతి ఉద్దేశం ఏమిటో కనుక్కోవాలిగా.

చంద్ర: అవునవును. ఏమిటో తనను చూస్తే నాకు మగపిల్లవాడిని చూసినట్లే అనిపిస్తుంది.

భాను: ఎందుకలా ?

చంద్ర: ఏమో! అందుకే తనకు పెళ్ళి చెయ్యాలన్న ఆలోచన కూడా రాలేదు.

భాను: అమ్మాయిలు కూడా అబ్బాయిల్లా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారనా?

చంద్ర: అది ఎప్పటి నుంచో సాధారణం అయిపోయింది.

భాను: మరి ఈ విషయం ఎలా కదుపుదాం?

చంద్ర: ఇందులో మొహమాటం ఏముంది? సూటిగా అడిగేద్దాం.

భాను: చూచాయగా ముందు తెలుసుకుంటే బాగుంటుందని.

చంద్ర: భలేదానివే. అవన్నీ నీ రోజుల్లో. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలను ఎంపిక చేసుకుంటున్నారు.

భాను: ఏమో! నాకయితే అలా అనిపించింది.

చంద్ర: అలా అలగకోయ్. నీ ఇష్టమొచ్చినట్లే చేద్దాం.

ధృతి: ఏమిటి? తలుపులు బార్లా తెరుచుకొని దొంగలకు ఆహ్వానం పలుకుతున్నారు.

చంద్ర: మా అమ్మాయి ఉందిగా పట్టుకోవటానికని ధైర్యం.

భాను: రామ్మా! ధృతి! రా! నీ గురించే మాట్లాడుకుంటున్నాం .

ధృతి: (నవ్వుతూ) నా గురించా?

భాను: నీకెలాంటి అబ్బాయిని చూడాలా అని.

ధృతి: (సిగ్గుపడుతూ) పో! అమ్మా!

చంద్ర: హోయ్ హోయ్! మన ధృతికి కూడా సిగ్గుపడటం వచ్చన్న మాట.

ధృతి: బాబా!

భాను: ఆయన మాటలకేం గానీ, నువ్వు చెప్పు.

ధృతి: ఏం చెప్పాలి?

భాను: ఎలాంటి వాడిని చేసుకుందామని?

ధృతి: ఇప్పటి దాకా దాని గురించి ఆలోచించిందే లేదు.

భాను: ఇప్పుడు ఆలోచించరా!

ధృతి: ఏమో అమ్మా నాన్నల కథ వింటే పెళ్ళి మీదే విరక్తి వస్తుంది.

భాను: మరి మమ్మల్ని చూస్తే!?

ధృతి: ముచ్చట వేస్తుంది.

భాను: మరింకెందుకు ఆలస్యం? ఏదైనా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగితేనే అందం, ఆనందం.

ధృతి: ఏమో అమ్మా! సమాజ సేవే ధ్యేయంగా గడిపేస్తున్న నాకు అసలు ఇలాంటి ఆలోచనే రాలేదు.

భాను: పోనీ ఇప్పుడు ఆలోచించు. నీలా ఐ.ఏ.యస్.నే చేసుకుంటావా? ఇప్పుడు కొలీగ్స్‌ని చేసుకోవటం మామూలు అయిపోయింది.

ధృతి: ఉహూఁ!

భాను: అంటే మనసులో ఎవరో ఉన్నారనా.

ధృతి: లేదమ్మా!

చంద్ర: తనకి కాస్త సమయం ఇవ్వు. ఇప్పుడే గదా చెప్పావు. నీకులా చూడగానే వచ్చేసానని, పెళ్ళి చేసుకుంటానని అందరూ చెప్పలేరుగా.

భాను: అబ్బ! మీరుందురూ! ఎప్పుడూ నా మీద జోకులే.

చంద్ర: నిజంగా నన్ను చూసి నువ్వు అలా అనలేదా?

భాను: అన్నాను.

చంద్ర: మరింకేం? ఏదో అబద్ధాన్ని నిజంగా చేసి చెప్పినంత బిల్డప్ ఇస్తున్నావ్?

ధృతి: బాగుంది. బాగుంది. ఆ కాలంలోనే మీకంత తెగింపా?

భాను: తెగింపా పాడా? బాగున్నారనిపించింది. చెప్పాను.

చంద్ర: మరి నేను అందగాడినే కదోయ్.

భాను: నేను మిమ్మల్ని చూడలేదు. మా మనసుని చూసాను.

ధృతి (చప్పట్లు చరుస్తూ): భలే గొప్పమాట చెప్పారమ్మా. అందరూ పెళ్ళి అనగానే ఆస్తులు, అంతస్తులతో చూస్తారు. ముందు చూడాల్సింది మనసుని అని.

చంద్ర: మీ ఇద్దరూ ఒక పార్టీ అయిపోయారు.

ధృతి: సరదాకి కూడా అలా అనవద్దు బాబా. మన ముగ్గురం ఒకటే పార్టీ.

భాను: ఇంతకీ దారి తప్పి ఇలా వచ్చావేం?

ధృతి: ఈ మధ్య రావటం లేదని దెప్పుతున్నారా అమ్మ! క్షణం ఖాళీ లేని పనులతో బిజీ బిజీ.

భాను: ఉద్యోగాలు అంటే ఇంతేనమ్మా.

ధృతి: అయినా అమ్మ, నాన్న ఎలా ఉన్నారో అని చూసి పోవడానికి పని గట్టుకొని వచ్చా. మీ బాధ్యత నాదే కదా!

చంద్ర: మాకేం మేము బాగున్నాం.

ధృతి: అమ్మా! మీరు చెప్పండమ్మా. నేను పెట్టిన డాక్టరు రెగ్యులర్‍గా వస్తున్నారా చెకప్ చెయ్యటానికి?

భాను: ఆఁ! ఆఁ! ఠంచనుగా వచ్చేసాడు తల్లీ. గడియారంలో గంటలా.

ధృతి: (ఫక్కున నవ్వేస్తుంది) అమ్మా! మీకు కథలు రాస్తే బాగుంటుంది.

భాను: ఇక నాకు అదొక్కటే తక్కువ.

ధృతి: మాటలు బాగా చెప్పే వాళ్ళంతా రచనలు చెయ్యగలరని నా ఉద్దేశం.

భాను: సరేలే. అవన్నీ ప్రక్కన పెట్టు. ఎవరివయినా ప్రేమించావా?

ధృతి: ఆఁ! ఎంత మందినో?

భాను: ఓ! నిజమా! లిస్టు ఇచ్చెయ్. మేము ఫైనల్ చేసేస్తాం.

ధృతి: నా లిస్టులో మీరూ, నాన్న, సమాజం ఉంటారు అంతే కానీ పెళ్ళికొడుకులు కాదు.

భాను (నీరసంగా): అలానా!?

ధృతి: (బాధగా) అమ్మా.

చంద్ర: ఏమిటో మీ అమ్మ పేరు చెబితే ఇప్పుడే తాళి కట్టించేసేట్లు ఉంది.

భాను: అలా ఎలా చేస్తాను? రంగ రంగ వైభవంగా చేస్తాను ధృతి పెళ్ళి.

ధృతి: అంతా మీ అభిమానం అమ్మా! రక్త సంబంధాల గురించి మాట్లాడే అందరికీ మన అనుబంధాలను చూపాలమ్మా.

భాను: మనం చివరి దాకా ఇలాగే ఉండాలి ధృతీ.

ధృతి: తప్పకుండానమ్మా!

***

ధృతి: ప్రజ్ఞా!

ప్రజ్ఞ: ఏమిటి ధృతీ?

ధృతి: నేనొకటి అడుగుతాను చెబుతావా?

ప్రజ్ఞ: అడుగు. నాకు తెలిసినదైతే తప్పక చెబుతాను.

ధృతి: శౌర్య ఎలాంటివాడు అంటావు?

ప్రజ్ఞ: మంచివాడిగానే అనిపిస్తాడు. ఏం ఎందుకలా?

ధృతి: అమ్మ వాళ్ళు పెళ్ళి చేస్తామంటున్నారు.

ప్రజ్ఞ: అయితే?

ధృతి: తనని చేసుకుంటే ఎలా ఉంటుందని?

ప్రజ్ఞ: నీ కింకా గొప్ప వాళ్ళే వస్తారుగా.

ధృతి: వాళ్ళు ఇంత మంచివాళ్ళని చెప్పలేంగా.

ప్రజ్ఞ: అతనికి ఎవరూ లేరు.

ధృతి: మనకు మాత్రం ఎవరున్నారు?

ప్రజ్ఞ: అతని ఉద్దేశం తెలుసుకున్నావా?

ధృతి: లేదు. నేనింకా చెప్పలేదు. అందుకే నిన్ను అడుగుతున్నా.

ప్రజ్ఞ: డబ్బు విషయం ప్రక్కకు పెడితే అతను అన్నింటా బుద్ధిమంతుడు నా దృష్టిలో.

ధృతి: మనకు డబ్బు ఉందిగా. అది అతని దగ్గర లేకపోయినా ఫరవాలేదు.

ప్రజ్ఞ: ఒప్పుకుంటాడా?

ధృతి: ఏమో! తనంతట తను మాత్రం బయటపడడు. అందుకే నువ్వు ఓకే అంటే శౌర్య దగ్గిర ఈ ప్రస్తావన తీసుకురావాలని.

ప్రజ్ఞ: మరింకేం. ప్రొసీడ్ అల్ ది బెస్ట్.

ధృతి: తన దగ్గర ఈ విషయం ఎలా ఎత్తాలి. సిగ్గుగా ఉంది.

ప్రజ్ఞ: పోనీ నేను అడగనా?

ధృతి: వద్దు. వద్దు. ఈ విషయం ఇంకొకళ్ళకు తెలిసినట్లు కూడా ఉండకూడదు.

ప్రజ్ఞ: మరి ఎలా?

ధృతి: సమయం చూసి నేనే చెబుతాలే.

ప్రజ్ఞ: ఒక రోజు ఇంటికి పిలుద్దాం.

ధృతి: రేపు చింటూ గాడి పుట్టిన రోజు ఉందిగా. కేక్ కట్ చేయిస్తాంగా. దానికి రమ్మని ఆహ్వానిద్దాం.

ప్రజ్ఞ: బాగుంది. అప్పుడు అడిగేసేయ్.

ధృతి: ప్రయత్నిస్తాను.

ప్రజ్ఞ: నిన్ను కాదనే వాడు ఎవడు ధృతి?

ధృతి: వ్యక్తిత్వం ఉన్నవారు ఎంత గొప్ప దాన్నయినా పూచిక పుల్లలా తీసిపారేస్తారు.

ప్రజ్ఞ: అంతేనంటావా?

ధృతి: అంతే! ఒక ప్రయత్నం చేద్దాం! నేనేం తనని గాఢంగా ప్రేమించెయ్య లేదు.

ప్రజ్ఞ: అవునులే.

ధృతి: నాకు సరి జోడి అనిపించింది. అంతే!

ప్రజ్ఞ: కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు అనే భగవంతుని మీద భారం వేద్దాం.

ధృతి: అంతే! అంతే!

(ఇంకా ఉంది)

Exit mobile version