[మణి గారు రచించిన ‘ఈ క్షణం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఉందో, లేదో తెలియని రేపటి కోసం,
ఎన్ని ఆనందాలు కుదువ పెట్టాను!
ఎన్ని కన్నీళ్ళు దాచి పెట్టాను!
ఎన్ని క్షణాలు జార విడుచుకున్నాను!
నా ఉనికిని ప్రశ్నిస్తూ,
క్షణాలు జాలిగా కరిగిపోతున్నా
నాకు తెలియలేదు,
జీవన అద్భుత నాట్యం అంతా..
ఇక్కడే, ఇప్పుడే,
ఈ క్షణం లోనే, వుందని!!!
నా పేరు సూర్య మణి భూషణ్. స్వంత వూరు అమలాపురం. నేను స్టేట్ బేంక్ ఆఫ్ ఇండియాలో ఛీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం; కవితలు కథలు రాయడం నాకు అలవాటు. కానీ, వృత్తి రీత్యా, బిజీగా వుండడంతో.. నా రచనా వ్యాసంగం కొనసాగించడానికి సమయం దొరికేది కాదు.
రిటైర్ అయ్యాక, తీరిక దొరకడంతో, ఏదో ఒకటి రాస్తూ, ఇప్పుడు, నన్ను నేను పేంపర్ చేసుకుంటున్నాను.
ఈ మధ్య, వెబ్ మేగజైన్స్ వచ్చాక కథలు, కవితలు, మేగజైన్స్కి పంపడం సులభమయింది. నా కథలు, కవితలు వెలుగు చూడగలగడానికి అది ఒక కారణం. సంచిక టీమ్ కొత్త రచయితలని ప్రోత్సహించే విధంగా వుండడం వల్ల, నా కవితలు, కథలు సంచికకి పంపుతూ, సంచికకి దగ్గర అయ్యాను.
ఇంకా, గోతెలుగులో కూడా, కొన్ని కథలు చోటు చేసుకున్నాయి. ఆ విధంగా, నేనూ రచయితల జాబితాలో చేరాను.
