Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఏమో ఏమౌతుందో?

[2024 క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీమతి వారణాసి నాగలక్ష్మి రచించిన ‘ఏమో ఏమౌతుందో?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

క ఋతువు వస్తుంటే ఇంకో ఋతువు నిష్క్రమిస్తుంది
ఋతుచక్రం ఒకసారి తిరిగేసరికి ఉగాది మళ్లీ పలకరిస్తుంది
ఏడాదికొక కొత్త పేరుతో ఆగమించే ఆమె
అరవయ్యేళ్ళకి మళ్ళీ పసిపాపై ప్రభవిస్తుంది!

పండుగలెన్నున్నా
ఆమనిని ఆహ్వానించే పండుగ అపురూపమైనది.
కలిసి ఏకమయ్యే అరుదైన సన్నివేశం కోసం
తీపీ పులుపూ చేదూ వగరూ ఉప్పూ కారం
ఎక్కడెక్కడి నించో వచ్చి
నగరవిపణిలో నయగారాలు పోతాయి

ఇక్కడే మొలకెత్తి ఎదగాల్సిన హరితవనాల ఫలాలు
వలసపక్షుల్లా అవసరానికి ఎగిరొస్తుంటే
ఉల్లాసపు వెల్లువగా ఏటా అరుదెంచే ఉగాది
ఉదాశీనయై మరలిపోతుందేమో!

పరచిన పచ్చిక తివాచీపై
చల్లని నీడలు చల్లే తరుశాఖల కింద
పిల్లాపాపలతో వినోదిస్తూ, తిని తాగి విశ్రమిస్తూ
నేలలో కరగని సంయోజిత వ్యర్ధాలన్నిటినీ
చెయ్యి చాచి శుభ్రం చేసుకోలేని చెట్టుచేమలకే వదిలేసే
మనుషుల హృదయరాహిత్యాన్ని చూసి
ఉగాది ఉసూరుమంటుందేమో!

పచ్చిక మీదా పూలమొక్కల్లోనూ పారాడే సంథిత వ్యర్థాలు
మనిషి కుసంస్కారం సిద్ధం చేసిన శవపేటికలై దర్శనమిస్తుంటే –
అంతరించిపోతున్న ఆకుపచ్చకి అవసరం లేని ఆచ్ఛాదనలా
రంగురంగుల ప్లాస్టిక్ సంచులు!
అరకొరగా మిగిలిన ఉద్యానవనాల్లో
చెట్టుకొమ్మలకి భేతాళుడి శవాల్లా వేళ్లాడుతూ
విధ్వంసకేతనాలై నర్తిస్తుంటే – వెలుగురేఖల వెంట
వడివడిగా అరుదెంచే ఆ వన్నెలమ్మ
కుహూరవమై పలకరిస్తుందో? విస్తుపోయి విలపిస్తుందో?

ఇంటికి వెలుగై మమతకు నెలవైన మహిళారూపం
డిజిటల్ తెరల్లోంచి నాగుపాములా బుసలుకొడుతుంటే-
పసిమొగ్గల్ని చిదిమేసే పాశవికత
పట్టపగలే విలయతాండవం చేస్తుంటే –
ఆమె కలరవాలతో కరుణిస్తుందో లేక
కలవరపడి కన్నీరొలికిస్తుందో ?

అన్ని రుచులూ ఆరోగ్యానికి అవసరమైనవే అయినా
ఆహారంలో తీపి మితిమీరి, జీవితాల్లో చేదెక్కువైతే
మనుగడకి మంచిది కాదంటూ
షడ్రుచుల్నీ సమపాళ్లలో సర్దుకోమనీ,
ఆరోగ్యాన్ని హరించే అలవాట్లని
ఆమడ దూరంలో ఆపి ఉంచమనీ చెపుతూ
ఏడాదికోసారి ఏతెంచే ఉగాది
ఈసారి ఏమన్నా చెపుతుందో,
ఎందుకులే అని మిన్నకుంటుందో?

ఏమో… ఏమౌతుందో!
*

Exit mobile version