20
హాస్టల్‌కి వచ్చాడే కాని సుధాకర్ మనస్సు నిలకడగా లేదు. సంధ్య అన్న మాటలు అతడ్ని కల్లోలపరిచాయి. మాటిమాటికి ఆ మాటలే స్పురణకి వస్తున్నాయి. మనం ఏ విషయాన్నీ ఉన్నది ఉన్నట్టు చూడలేము. మనమున్న తీరును బట్టి మాత్రమే వాటిని చూడగలుగుతాము. అలా కాకుండా మనం ముందు నిజాలను చూడగలగాలి. తరువాత వాటి గురించిన మన భావాలను చూడగలగాలి. రెంటినీ కలిసిన తరువాత కనిపించే దేదో చూడగలగాలి.
తను పది పన్నెండ్లు వయస్సు వరకూ సరిగానే ఉన్నాడు. తల్లి ప్రేమను పొందాడు. తండ్రి ప్రేమను పొందాడు. ఆ తరువాత ఒక్కసారి తనలో మార్పు, ఆ మార్పు పరిసరాల ప్రభావం అవచ్చు. పరిస్థితుల ప్రభావం అవచ్చు. వయస్సు ప్రభావం అవచ్చు. ఏదో అసంతృప్తి, ఏదో అలజడి. ఏదో వెలితి. తనకి తన తోటివారిలాగే ఉండాలన్న కోరిక. తన క్లాసుమేట్సులా అంత ఖరీదైన జీవితం కాకపోయినా, తృపికర జీవితం గడపాలనుకున్నాడు. టూర్లకి వెళ్ళాలనుకున్నాడు. పిక్నిక్‌లకి వెళ్ళాలనుకున్నాడు. మంచి బట్టలు ధరించాలనుకున్నాడు.
అయితే తను ఆశించిన ఆ జీవితం తనకి లభించలేదు. అడుగడుగునా ఆర్థిక ఇబ్బందుల్లో జీవితం తనకి విరక్తి కలిగించింది. అసహనం పెంచింది. దానికి ఫలితమే తల్లిదండ్రుల్ని ద్వేషించడం ఆరంభించాడు. అసహ్యించుకున్నాడు. వాళ్ళ మీద కసి పెంచుకున్నాడు. మనస్సుకి నొప్పించే మాటల్తో వాళ్లను బాధపెట్టాడు. వాళ్ళు బాధపడ్తూ ఉంటే పైశాచిక ఆనందాన్ని అనుభవించాడు. తను ఓ శాడిష్టులా తయారయ్యాడు.
తనకి మెడిసిన్‌లో ర్యాంకు వచ్చిన విషయం దాచి పెట్టాడు. ఈ విషయంలో ఇంట్లో గొడవ జరిగింది. తను ఇల్లు వదిలి వచ్చేసాడు. ఇల్లు వదిలి వెళ్ళిన తరువాత తనకి ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు. చటుక్కున సినీ హీరోయిన్ సౌందర్య గుర్తుకు వచ్చింది.
ఒకొక్క పర్యాయం మనం ఏం చేస్తున్నాము. మనం చేస్తున్న పని మంచిదా కాదా అని ఆలోచించే శక్తి మన నుండి దూరమవుతుంది.
సడన్‌గా సౌందర్య తన దగ్గరికి వచ్చి “అందరూ నా దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటే నీవు అలా నిలబడిపోయావే?” అని ప్రశ్నించింది. ఆవిడను చూడడం ఇది రెండవ పర్యాయం. ఇంటర్లో ఆవిడ చేతులమీదే బహుమతి అందుకున్నాడు. ఆవిడకి ఏం జవాబియ్యాలో తెలియక తను తడబడ్డాడు. చిరునవ్వు నవ్వుతూ ఆమె తన భుజం మీద చేయి వేసి ఆప్యాయతగా తట్టింది. ఆమె ఈ చర్యకి తను ఎంతో పొంగిపోయాడు.
అంతమంది ఆవిడ్ని చూడ్డానికి, ఆవిడ దగ్గర కరచాలనం తీసుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆవిడే స్వయంగా తన దగ్గరికి వచ్చి ఆప్యాయతగా తన భుజం మీద చేయి వేసి పలకరించడం తనకి ఎంతో గర్వ మనిపించిది. ఎవరికీ లభించని అదృష్టం నాకు అభించడం నిజంగా తనకు గర్వమే.
“నీ పేరేంటి? అడిగింది ఆవిడ. తను చెప్పాడు. తిరిగి ఆవిడ తన కుటుంబ విషయాలు అడిగింది. అవి కూడా చెప్పాడు. విన్న ఆమె ముఖంలో ఆనందం వెను వెంటనే విషాదం. ఆ తరువాత ఆవిడ సంబాళించుంకుంది. తన భావోద్వేగాల్ని బయటకు వ్యక్తం కానీయలేదు. ఆమె తన విజటింగ్ కార్డు తనకిస్తూ, “నీకు ఎప్పుడేనా నన్ను కలవాలనిపిస్తే తప్పకుండా రా. ఫోను నెంబరు కూడా ఇస్తున్నాను. ఫోను కూడా చేస్తూ ఉండు. నా సహకారం తప్పకుండా నీకుంటంది.” అంది ఆవిడ.
తన మెదడులో రకరకాల ఆలోచన్లు ఎవరినీ చూసినా స్పందించని తన మనస్సు ఈవిడిని చూడగానే ఎందుకు స్పందిస్తోంది? తనని చూడగానే ఆవిడ స్పందన కూడా అలాగే ఉంది. అయితే తన కుటుంబాన్ని అభిమానిస్తోంది. యోగక్షేమాలు అడుగుతోంది. కొందరికి ఒకళ్లకి మీద ద్వేషం మరొకరికి మీద అభిమానం. ఆవిడకి తన కుటుంబంతో అనుబంధం ఉన్నట్లు మాట్లాడింది. తన కుటుంబంతో ఆవిడకి ఉన్న సంబంధం ఏంటి..
ఇలాంటి రకరకాల ప్రశ్నలు తన మెదడులోకి వచ్చేవి. అయితే వాటికి సమాధానం దొరకటం లేదు. ఇప్పుడు తను ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. తన పరిస్థితిని వివరించాలి. తన చదువు విషయంలో ఆవిడ సలహా తీసుకోవాలనిపిస్తోంది. తల్లిదండ్రుల కన్నా నిన్న కాక మొన్న పరిచయం అయిన ఆవిడ ఆప్తురాలా అని అందరూ అనుకోవచ్చు. అయితే తనకి ఆవిడ ఆప్తురాలిగానే అగుపడుతోంది.
ఇదే విచిత్ర పరిస్థితి. ఇంటి వాళ్ళని తను ద్వేషిస్తున్నాడు. వాళ్ళ అస్తిత్వాన్ని ఉనికిని సహించలేక పోతున్నాడు. సౌందర్యని అభిమానిస్తున్నాడు. ఇంట్లో ఉండలేక తను ఇలా బయటకు వచ్చేసేడు. ఇలా ఆలోచిస్తున్న సుధాకర్ సౌందర్య ఇచ్చిన విజిటింగ్ కార్డును పట్టుకుని ఆవిడ దగ్గరకు బయలు దేరాడు. ఆలోచనా శక్తి లేకపోవడం వల్లనో, ఉడుకు రక్తం గల సుధాకర్ ఇలా ఇల్లు వదిలి వచ్చేసేడు కాని ఆ తరువాత అతనికి తను ఎంత తప్పు చేశాడో అని అనిపించింది. అయితే తిరిగి ఇంటికి వెళ్ళ లేని పరిస్థితి.
అస్తవ్యస్త పరిస్థితులోనూ ప్రమాదాలు ముంచుకొచ్చినప్పుడూ మనిషి చురుగా చైతన్యంలో ఉంటాడు. అందుకే జీవితంలో సమస్యలుండాలి. సవాళ్ళు కూడా ఉండాలి. అప్పుడే జీవితం మేలుకుంటుంది. చురుగ్గా తయారవుతుంది. మనల్ని బాధలు సమస్యలూ చుట్టిముట్టి నప్పుడే వాటి నుండి బయట పడడానికి ప్రయత్నిస్తాం.
తన పరిస్థితి అంతే. తనకి ఇప్పుడు జీవితంలో సమస్య ఎదురయింది. ఆ సమస్య తీరాలంటే ఆలంబన కావాలి. ఆ ఆలంబనే సౌందర్య అవచ్చు అనిపించింది. ఆవిడ నటించిన సినిమాలంటే తనకి మహాపిచ్చి. ఆవిడ తన అభిమాన నటి. హీరోలకి అభిమానులుంటారు. కాని హీరోయిన్లకి అభిమానులు తక్కువ అయితే తను మాత్రం ఆమె నటనని అభిమానిస్తున్నాడు.
ఆవిడ హీరోయిన్ పాత్రవేసినా, తల్లి పాత్రలు వేసినా పాత్రలో వొదిగి పోతుంది. ఆమె నటన సహజంగా వాస్తవికతకి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆవిడ్ని సహజనటి అనచ్చు. ఆవిడ అద్భుతంగా నటిస్తుంది. తను ఆవిడ నటించిన సినిమాల్సి తరుచుగా చూస్తూ ఉంటాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకి తెలిసి బాగా కోప్పడేవారు. ఇంట్లో ఎందుకో ఆవిడ సినీమాలంటు అంత ఎలర్జీ ఈ విషయం తనకి అంతుబట్టేది కాదు. ఆవిడ సినీమాలు చూశానంటే తనకి ఇంట్లో భోజనం కంటే పస్తులుండవల్సిందే అని తన తల్లి వార్నింగు ఇచ్చేది కూడా.
“ఒరే సుధా! ఆ సౌందర్య పోలిలికలు ఇంచు మించుగా నీ పోలికలతో కలుస్తాయి. ఏ జన్మ సంబంధమో! అందుకే ఆవిడ నటించిన సినీమాలు నీకు ఇష్టం” అని ఇద్దరు ముగ్గురు స్నేహితులు కూడా తనతో అన్నారు. ఇంట్లో తెలియకుండా తను ఆవిడ సినిమాలు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తనకి ఇంకా బాగా గుర్తు, తను ఇంటర్ సెకెండియర్ చదువుతున్నప్పుడు కాలేజీలో పాటల పోటీ నిర్వహించారు. ఆ పోటీలో తనకి సెకెండ్ ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్‌కి సౌందర్యను గెస్టుగా పిలిచారు. కాలేజి మేనేజిమెంటువాళ్ళు.
పేరున్న సినీనటి – గ్లామర్ హీరోయిన్ వస్తోందంటే ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రైజ్ ఆవిడ చేతుల ద్వారా అదుకో బోతున్నానన్న ఆనందం నన్ను నిలవనీయటం లేదు. ఒక వైపు గర్వం మరో వైపు సంతోషం. ప్రైజ్ అందుకోబోతున్న సమయంలో నన్ను చూడగానే ఎందుకో వింత మెరుపు తను ఆమె కళ్ళలో చూసాడు. తనకి కూడా అలాగే అనిపించింది. ఏదో తెలియని అవినాభావ సంబంధం తమిద్దరి మధ్య ఉందా అని తనకి అనిపిందించింది. వెళ్తున్న సమయంలో కూడా అందరూ ఆమె దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. తను దురంగా నిలబడి ఆమెనే తదేకంగా చూస్తున్నాడు.
21
విజిటింగ్ కార్డు పట్టుకుని వెళ్ళిన తను ఆమె దగ్గరకి ఎక్కువ కష్టపడకుండానే వెళ్ళాడు. తనని చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంది ఆవిడ.
“బాగున్నావా సుధా! ఇంట్లో వాళ్ళందరూ కులాసాగా ఉన్నారా” అని అడిగింది. నా మనస్సులో తిరిగి అనేక సందేహాలు, తన కుటుంబ సభ్యుల్లో ఆవిడికి పరిచయం లేదు. వాళ్ళను ఆవిడ ఎప్పుడూ చూడలేదు. అలాంటిది తన యోగక్షేమంతో పాటూ తన కుటుంబ సభ్యుల గురించి ఆవిడ అడుగుతుంది తన కుటుంబ సభ్యులు మత్రం అవిడని ద్వేషిస్తున్నారు. తన వాళ్ళు ఆవిడని ద్వేషిస్తూ వుంటే ఈవిడ మాత్రం వాళ్ళ గురించి అడుగుతుంది. ఏంటో ఈ సంబంధం?” ఇలా రకరకాల ఆలోచన్లు.
ఆవిడ మాటలకి తను మౌనం వహించాడు. తిరిగి ఆవిడ రెట్టించి అడిగింది.
“ఊ!!!” ముక్తసరిగా జవాబు ఇచ్చాడు.
“అలా ఉన్నావు. ఏంటి జరిగింది సుధా!” ఆవిడ అడిగింది.
అంత ఆప్యాయతగా ఆమె అడుగుతూ ఉంటే తనకి ఏదీ దాచాలనిపించలేదు. అన్ని వివరంగా వివరించాడు. మొదట్లో ఇంట్లో వాళ్ళని అభిమానించిన తను ఇప్పుడు వాళ్లను ఎందుకు విరోధిస్తున్నాడో తెలియజేసాడు తను ఆవిడకి.
సౌందర్య ఆలోచిస్తోంది. మొదట కొద్దిగా తన పోలికలు కలుస్తున్న ఈ అబ్బాయి ఎవరు? అని అనుకుంది. మాటలు కలిపి కుటంబ విషయాలు తెలుసుకుని విస్మితురాలైంది. వెను వెంటనే బాధపడింది. ఇంచుమించుగా ఇద్దరి జీవితానికి సామీప్యత ఉందనిపించింది.
తన జీవితం లాగే సుధాకర్ జీవితంలోని ఆర్ధిక ఇబ్బందులు. తీరని కోరికలు. ఇవే మనిషిని తిరుగుబాటు చేయిస్తాయి. తెగింపుకి గురిచేస్తాయి. అయితే ఇల్లు వదిలి వచ్చేస్తే నాశనం అయ్యేది ఈ అబ్బాయి జీవితమే. తను అనుభవ పూర్వకంగా చెప్తోంది. మంచి భవిష్యత్తు ఉన్న సుధాకర్ ఇలా చేయడం సౌందర్యకి నచ్చలేదు.
జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ప్రాణమున్న మర మనిషిలా తయారవ్వాలి. తన కోరికలు – ఉన్నత స్థాయికి చేరుకోడానికి తను అలా చేయవలిసి వచ్చింది. భ్రమలో బ్రతుకుతూ భ్రమతో జీవిస్తోంది.
సినీనటిగా సమాజంలో తనకి గుర్తింపు ఉంది. మంచి పేరుంది. డబ్బుంది. పలుకుబడి ఉంది. ఇవి ఉంటే సరిపోతుందా? వీటి అన్నిటితో పాటు గౌరవం ఉండాలి. దాన్నే తను పొందలేకపోయింది. తనని తన ఎదురుగా మునగ చెట్టు ఎక్కించి పొగిడిన వాళ్ళు తన వెనుక హేళన చేస్తారు. చులకనగా మాట్లాడుతారు. ఇలా తనకళ్ళెదుట వాళ్ళ ప్రవర్తన ఉండి ఉంటే తను సహించగలదా?
ఈ సినీ ప్రపంచం సాలెగూడు లాంటిది. దీన్లో చిక్కుకున్న వాళ్ళు బయట పడ్డం కష్టం. సాలెగూడులో చిక్కుకున్న కీటకము తన ప్రాణం పోగొట్టుకున్నట్టే చివరికి నిరాశ నిస్రవాలతో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది. ఉన్నతంగా ఎదిగిన వారూ ఉన్నారు. అదీ పలుకుబడి. అధికారం దర్పం ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ ప్రపంచంలో కూడా స్వార్థ రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఈ రంగుల ప్రపంచం అంతా రంగులమయం కాదు.
దాన్లో ఉన్న డొల్లతనం అనుభవం అయితేకాని తెలియదు. ఇక్కడ ఎక్కువ మంది సినీ నటీమణులు నీటి బుడగలు, వీళ్ళ జీవితాలు నీటి బుడగలు. ఎప్పుడు పేలిపోతాయో ఎప్పుడు అంతం అవుతాయో ఎవ్వరికీ తెలియదు. గాలి పగడల్లాంటి కొంత మంది సినీ పెద్దలు, మగవాళ్ళు తమ అవసరాలు కోసం నీటి బుడగలలాంటి హీరోయినన్ను వాడుకొని వీరి జీవితాల్లో ఆటలాడుకుని తెగిన గాలి పటంలా వీళ్ళని వదిలిపెట్టి ఎక్కడికో ఎగిరిపోతారు. నీటి బుడగ విచ్చిన్నమైనట్టు ఈ స్వార్థపరుల చేతుల్లో నలిగిపోయిన నటిమణుల జీవితం విచ్చిన్నమవవల్సిందే.
ఈనాడు తనకి పూర్వంలా కాకపోయినా కొద్దిగా పేరు ప్రతిష్ఠలున్నాయి. వైకుంఠపాళి ఆటలో చిన్న పాములనే ఆటంకాల్ని దాటుకుని విజయాలు అనే నిచ్చెల్ను ఎక్కుతూ పైకి వెళ్ళిన తరువాత పెద్దపాము నోట్లో పడి తిరిగి క్రిందకి దిగజారి పోయినట్టు ఈ సినీ ప్రపంచంలో పరిస్థిలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు.” ఇలా సాగిపోతున్నాయి సౌందర్య ఆలోచన్లు.
బాహ్య ప్రపంచంలోకి వచ్చిన సౌందర్య సుధాకర్ వైపు చూసింది. అతను చేసి పని తొందరపాటు చర్యగా తోచింది ఆమెకి. ఎలాగేనా నచ్చజెప్పి – అతని భావాలు మార్చి కుటుంబ సభ్యుల్లో కలపాలని అనుకుంది. అందుకే. “సుధా! నీవు నీ వాళ్ళను తప్పుగా అర్ధం చేసుకున్నావనిపిస్తోంది నాకు. పరిస్థితుల ప్రభావం వల్ల నీ వాళ్ళు నీ కోరికల్ని తీర్చి ఉండకపోవచ్చు. అంత మాత్రాన్న వారిని ద్వేషించి ఇలా ఇల్లు వదిలి వచ్చేయడం మంచి పద్దతి కాదనిపిస్తోంది” అని అంది.
ఆమె మాటలకి ఒక్కసారి అతనిలో కొంత అసహనం తొంగిచూసింది. అయితే ఆ భావం కనబడనీయకుండా జాగ్రత్త పడ్డాడు.
అతని మౌనం చూసి సౌందర్య “మన జీవితంలో మళ్ళీ మరుపురాని దశ బాల్యం. తండ్రి అండలో తల్లి మమకారం వాత్సల్యంలో బాల్యం మధురంగా గడిచిపోతుంది. ప్రతీ తండ్రి తన సంతానం కోసం ఎంతో శ్రమిస్తాడు. తను మాత్రం క్రొవ్వొత్తిలా మండి కరిగిపోతూ తన సంతానానికి మంచి జీవితమనే వెలుగు ప్రసాదించడానికి ప్రయత్నిస్తాడు. మరి అమ్మో! బిడ్డ తన కడుపులో పెరుగుతున్నప్పటి నుండి భుమ్మీద పడి పెరిగి పెద్దయ్యాక కూడా తన సంతానం కోసం తపిస్తుంది. వారి కోసం ఎటువంటి త్యాగానికేనా సిద్ధపడుతుంది.
తల్లిదండ్రుల వల్లనే పిల్లలకి అనుబంధాలు అర్థమయితే కుటుంబ వ్యవస్థలో పరస్పర ప్రేమలు స్థిరంగా నిలుస్తాయి. ముద్దు చేసి గోరు ముద్దులు తినిపించి తన ఆప్యాయతను తల్లి కనబరుస్తే, తండ్రి వినయ విదేయతలు, సంస్కారం నేర్పుతాడు తన సంతానానికి. మొదట్లో ఈ విషయాలు తెలియక – తెలిసినా అర్థం చేసుకోలేక జీవితంలో నేను గొప్ప తప్పు చేసి. ఇప్పుడు బాధపడ్తున్నాను. నేను చేసిన ఆ తప్పులాంటిది ఇప్పుడు నీవు రిపీటు చేయకూడదు” అంది.
అవిడ చేసిన తప్పు ఏంటో సుధకి తెలియదు కాని తన భావాల్ని అతను ఆమె ముందుచాడు.
“ఆంటీ! ఒక్క విషయం అందరి బాల్యాలూ ఆనందకరం కాదు. నా బాల్యాన్నే తీసుకొండి నాకన్న తల్లి నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే నన్ను వదిలి పెట్టి తన స్వార్థం తను చుసుకుంది. ఆవిడ ఎంత కఠినత్మురాలో? ఎంత స్వార్థపరురాలో చూడండి.”
అతని మాటలకి సౌందర్య ఒక్కసారి తృళ్ళిపడింది. ఆమె మనస్సు ఒక్కసారి విలవిల్లాడింది. ముఖం వివర్లమయింది. సంభాళించుకుని అతని మాటలు వింటోంది.
“నా కన్నతల్లి నన్ను వదిలి వెళ్తున్న సమయంలో తన రక్తం పంచుకుని పుట్టిన తన కొడుకు కూడా గుర్తుకు రాలేదు. అంత కఠినాత్మురాల్ని ఏంచేసినా పాపం ఉందా? నేను ఎప్పటికీ ఆమె చేసిన పనిని సమర్థించలేను. ఆమె తిరిగి జీవితంలో ఎదురయితే ఆవేశంలో నేను ఆమెను ఏంచేస్తానో నాకే తెలియదు అంత ఆవేశంగా ఆవేదనగా ఉంది.
అయితే ఒక్క విషయంలో నేను అదృష్టవంతుడ్ని. నన్ను పెంచిన తల్లి కన్న తల్లిని మరిపించి మాతృప్రేమను చవిచూపించింది. అంత అమృతమూర్తి మీద కూడా పరిస్థితులు ప్రభావంతో నాలో కసి కోపం పెరిగాయి. ఎందువలన? ఆర్థిక సమస్యలు అసంతృప్తి ఇవే దానికి కారణం.”
ఇంకా అతను ఏదో చెప్పబోయడు.
“సుధా! నా మనస్సు ఎందుకో బాగులేదు, కొద్దిగా నలతగా ఉంది. రేపు అన్ని విషయలూ మాట్లాడుకుందాం నీవు విశ్రాంతి తీసుకో” అని చకచకా అక్కడ నుండి వెళ్ళిపోయింది సౌందర్య, సుధాకర్ ఒక్కసారి విస్తుపోయాడు. క్షణం క్రితం వరకూ బాగున్న ఈవిడికి ఒక్క సారిగా ఏం జరిగిందబ్బా! అనుకున్నాడు.
అవతల సౌందర్య మనిషి కాలేకపోతోంది. మనస్సు కకావికలమయింది. కలతబారిన మనస్సుతో పక్క మీద దొర్లుతోంది. నిద్రరావటం లేదు మాటిమాటికీ సుధాకర్ మాటలే గుర్తుకు వస్తున్నాయి. సుధా మాటలు బట్టి తన వాళ్ళ మీద కన్న తల్లి మీద ఎంత ద్వేషం ఉండో అర్థమవుతోంది. తను ఎంత నచ్చజెపడానికి ప్రయత్నించినా వ్యర్థమే. కాలమే ఈ సమస్య పరిష్కరించాలి కాలంతో పాటే అతనిలో మార్పు వస్తుంది అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.