Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎండుటాకు గుండె చప్పుడు

[మణి గారు రచించిన ‘ఎండుటాకు గుండె చప్పుడు’ అనే రచనని పాఠకులకి అందిస్తున్నాము.]

“అమ్మా!.. నేనమ్మా, నీ ఆకుని!.. నేను రంగు మారాను.. ఎందుకు?
ఎండిపోతున్నాను, ఏమిటమ్మా?..
ఋతువులు, మారుతున్నాయి. రాత్రులు, పగళ్ళని తినేస్తున్నాయి. అందుకా?..
నా ఈనెలు, బయటకి వచ్చి, ఎలా కనిపిస్తున్నాయో, చూడమ్మా! ఇన్నాళ్ళు ఇవి నాలో వున్నట్లే తెలియలేదు!
ఇవేనా నీ జీవ జలాలని నాలోకి ప్రవహింప చేసి, నాకే తెలియకుండా నన్ను ఇన్నాళ్ళు పోషించింది?.. అంతా కొత్తగా వుంది అమ్మా!
చిగురు మొగ్గనై, మొలిచినపుడు నా బుగ్గలు నొక్కి, ఎన్ని చిలుకలు ముద్దు పెట్టుకున్నాయి?!
ఒళ్ళంతా నూనూగుతో, మెరుస్తూంటే కళ్ళు తిప్పుకోలేక, పిల్లగాలి నన్ను వదిలి వేళ్ళేదేకాదు!!
వసంతం వచ్చిందని అడవిలో ఉత్సవాలు.. ఇప్పటికీ మర్చిపోలేను! ఎక్కడ చూసినా చిగురు పచ్చని ఆకులు, రంగురంగుల పూలు, పిల్లగాలులు, సువాసనలు..!!!
పచ్చగా ఎంతో అందంగా వుండేదాన్ని!..
నా ఒంటినుంచి వచ్చే సన్నని సువాసనలు అడవి అంతా వ్యాపించేవి!
గ్రీష్మంలో సూర్యకిరణాలు నా మీద పడి రంగులు దిద్దుకునేవి!!..
ఎంత మృదువుగా వుండేది నా చర్మం!..
వర్షంలో చినుకులు నా మీద పడి ముత్యాల్లా మెరిసేవి!..
శరదృతువులో, చంద్రుడు వెన్నలని, నాపై ఆరేసుకుని, మురిసి పోయేవాడు!..
హేమంతం, నన్ను మంచుతో తడిపి ముద్ద చేసేది!
తొలిపొద్దు కిరణాలు, నన్ను కమ్ముకున్న, మంచునంతా కరిగించి, రకరకాల, నగలు చేసి, నన్ను అలంకరించే నాతో ఆడుకునేవి!!!..
కానీ, ఇప్పుడు ఏమిటి.. ఇలా ఎండి పోయాను?..రంగు మారాను?..
ఎప్పుడూ ఆటలు పాటలే! ఎంత అల్లరి చేసేదాన్ని!..
ఊసులతో అడవి అంతా నింపేసేదాన్ని!
ఋతువులు మారుతుంటే, ప్రౌఢత్వం నింపుకొని, చిరుగాలితో నేను చేసిన గానానికి, నర్తనలకి, నువ్వు, గర్వంగా, నా కేసి చూస్తూ మురిసిపోవడం నాకు ఇంకా గుర్తు వుంది!..
అడవంతా నిండిన నిశ్శబ్దాన్ని, ఛేధిస్తూ, నా గానం అడవంతా, ప్రతిధ్వనించేది!
అందరినీ మైమరిపించేది!!..
పక్షి కూనలని జోకొట్టి నిద్ర పుచ్చేది!!!..
అప్పుడప్పుడు పక్షులు, వాటి రెక్కల చప్పుళ్ళతో, నాతో కోరస్ పాడేవి!!!..
గాలి, వాయిద్యం వాయించేది!..
అప్పుడు, ఎందుకో, ఏ భయమూ, వుండేది కాదు! ఇప్పుడు, ఎందుకు భయం వేస్తోంది??..
నేను ‘ఎందుకు రంగు, పోగొట్టుకున్నాను?’, అన్నా, ‘నేను ఎందుకు ఏండిపోతున్నాను?’, అన్నా, శిశిరం వచ్చిందంటావు!..
శిశిరమా ఇది?..
శిశిరం ఎందుకు వస్తుందమ్మా? వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్, హేమంత, ఋతువులు తెలియకుండనే వెళ్ళిపోయాయి.
వాటి తాలూకు, ఎన్నో అనుభూతులు..ఇంకా ఎన్నో జ్ఞాపకాలు..!!!!
చిగిరించి, పెరిగి పెద్దయి, ప్రౌఢత్వం తెచ్చుకుని, పూలు అలంకరించుకుని, పిందెలతో, కాయలతో, పళ్ళతో, అన్ని సంబరాలు, జరుపుకుంటూనే వున్నాను!!..
శిశిరమూ తెలియదు! ఎప్పుడు వచ్చిందీ తెలియదు!..
నా రంగు మారుతూంటే, నువ్వు చెప్తే, తెలిసింది శిశిరం, వచ్చిందని!
చర్మం ఎండిపోతూంటే, నువ్వు చెపితే తెలిసింది శిశిరం అని!!!..
రంగు మారాను అంటే, ‘ఈ రంగుల్లో కూడా బాగున్నావు’, అంటావు.
నాలాంటి ఆకులు, నేల రాలి, పుడమి తల్లికి, అలంకారం అవుతాయి అని, అంతా అంటున్నారు? నిజమా?
ఆ అలంకారం, పుడమి అందాన్ని మరింత ఎక్కువ చేస్థుందట?!..
ఆ అందాన్ని చూడడానికి ఆకాశం కాస్త కిందకి, వంగుతుందట.. అవునా అమ్మా?
నేనూ, నేల రాలుతానా అమ్మా?..
నిన్నూ నన్నూ, కలిపిన, ఈ చిన్న కాడ, బొడ్డు తాడు లాగా, నిన్ను గట్టిగా పట్టుకుని వుండేది!!..
దాని, పట్టు బిగువు, ఇప్పుడు, అందుకేనా, సడలింది??..
రోజు రోజుకీ, అది కూడా, ఎండిపోతోందేమిటమ్మా??..
అది, ఎండి ఎండి, పగిలితే? నేను కిందకి, రాలి పడిపోతానా???..
ఏ చిన్న గాలి తాకినా, పక్షులు రెక్కల శబ్దం చేసినా, ఎక్కడ ఏ కదలికలు అయినా, ఏ శబ్దాలు వచ్చినా, భయం వేస్తోంది, ఈ బొడ్డు తాడు కాస్త, పగిలి, తెగుతుందేమో అని!!!
పడిపోతానా అమ్మా? ఎక్కడకి పడిపోతాను? ఎంత లోతుకి?…
భయం వేస్తుందా? ఏడుస్తానా?..
ఎవరయినా వుంటారా నాతోకూడా?..
నాకు తెలుస్తుందా?..
రాలిన నన్ను, పుడమి తల్లి, తన లోనికి లాక్కుని మళ్ళీ, నన్ను, చిగురు మొగ్గలా అందిస్తుందా నీకు, అమ్మా?..
గడిచిన ఋతువులు, గుర్తుకు వుంటాయా అమ్మా?..
ఎప్పుడూ రాని ప్రశ్నలు?.. ఎప్పుడూ లేని భయం!..
భయం ఎందుకు?.. సమాధానం తెలియకా?..
ఎండిన నేను, నేల చేరే లోపు, ఫెళఫెళమంటూ పగిలి ముక్కలవుతే?!,
పెద్ద గాలి, నన్ను ముక్కలు చేసి, విసిరి వేస్తే?!.. ఎగర గొడితే?!..
గట్టిగా పట్టుకో, అమ్మా! నన్ను పడనివ్వకు!!..
నాకు, సమాధానాలు చెప్పి, నా భయం పోగొట్టు!!!..
నాకు, నువ్వు, ఈ అడవి తప్ప, ఏమీ తెలియదు!!..
తెలియని, ప్రపంచం లోకి, ఎందుకమ్మా నన్ను, వదలి వేద్దాం అనుకుంటున్నావు???..”
అడుగుతూనే వుంది, ఎండిపోయిన ఆకు, తను వున్న కొమ్మని! ఎప్పుడు దాని కాడ, కొమ్మ నుంచి వేరయిందో గమనించనే లేదు!
కిందకి పడసాగింది!..
కిందకి.. కిందకి.. దానికి తెలుస్తోంది. మనసులోంచి, అస్పష్టమయిన ప్రశ్నలు!
“ఎక్కడ, ఎప్పుడు అంతం??..
కళ్ళు తిరుగుతున్నాయి?…
గుండె, ఏమిటి, వేగంగా కొట్టుకుంటోంది?.ఒళ్ళంతా కంపిస్తోంది??..”
“అమ్మా!..” అంటూ, ఒక కేక వేసి, కళ్ళు మూసుకుంది, భయంగా.
“అటూ, ఇటూ, ఎగరగొడుతోంది, అది గాలి స్పర్శ..?.. అవునేమో! అలానే, తెలుస్తోంది!..
ఎంత లోతు? ఇంకా,.. ఎంత లోతు..కిందకి.. పడుతూనే వున్నాను. ఇంకా, ఎంత సేపు?.., రెపరెపలాడుతున్నాను?..
‘ఠప్!’ అనే శబ్దం?.. నేల మీద పడ్డానా?!.. ‘ఫెళ్!’ ఫెళ్!!!’మంటూ మరో శబ్దం? పగిలి ముక్కలయ్యానా?..”

“భయపడకు! నాలోంచే, ఈ ప్రపంచం లోకి వచ్చావు. మళ్ళీ, నన్ను చేరుకున్నావు.”
మృదువుగా, వినిపిస్తున్న మాటలు, ఎవరివి?. పుడమివా?

“నును వెచ్చని స్పర్శ, నన్ను చుట్టేస్తోందేమిటి?.. నన్ను లయం చేసుకుంటోందా???..”
వేగంగా, కొట్టుకుంటూ, చప్పుడు చేస్తున్న, ఆ ఎండుటాకు గుండె, ఒక్కసారి నిశ్శబ్దమయింది.

Exit mobile version