[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[స్నేహితురాలు నీలిమ ఇంటికి వెళ్ళి, తండ్రి ఉత్తరం రాశాడన్న సంతోషాన్ని ఆమెతో పంచుకుంటుంది జానూ. చాలా రోజుల తర్వాత నేరుగా మాట్లాడుకుంటారు. వాళ్ళ సంభాషణలో ఎన్నో విషయాలు దొర్లుతాయి. ఎంతో తృప్తితో ఇంటికి తిరిగివస్తుంది జానూ. ఆనంద్ కూతురికి ఉత్తరం రాసినందుకు మాలతి సంతోషిస్తుంది. ఆమెలో కొద్దిగా మార్పు చోటుచేసుకుంటుంది. జానూ పరీక్షలు బాగా రాస్తుంది. సెలవల్లో నాన్న దగ్గరకి హైదరాబాద్ వెళ్తున్నట్టు స్నేహితులకి చెప్తుంది. ప్రయాణం తేదీ దగ్గరకొస్తుంది. జానూకి ఒక సెల్ ఫోన్ కొనిస్తారు. తాను ఏ బండికి వచ్చేది, తన సెల్ నెంబర్ తండ్రికి ఉత్తరం ద్వారా తెలియజేస్తుంది జానూ. నిర్ధారిత తేదీన హైదరాబాదుకు రైల్లో బయల్దేరుతుంది జానూ. – ఇక చదవండి.]
అధ్యాయం 11
రేపే అక్క వచ్చేది అంటూ పిల్లలు సంతోషంగా గెంతులేస్తున్నారు. ఊర్మిళ వాళ్ళ వంక చిరునవ్వుతో చూస్తూంది. ఆనంద్‌కు కూడా ఎగ్జయిట్మెంట్ ఉంది. గుండెల నిండా ప్రేమ ఉంది. పురుష సహజ గంభీరత వల్ల బయటకు కన్పించవు.
జాహ్నవి కోసం స్వీట్స్ కొని పెట్టాలని ఉంది ఆనంద్‌కు.
కానీ ఆమెకు నచ్చే స్వీట్స్ ఏవో తెలియవు ఆ మాటే ఊర్మిళతో అన్నాడు. విస్తు పోయింది.
“కూతురికి లెటర్ వ్రాయమంటే వెనుకాడిన మనిషికి కూతురు వస్తుందనగానే ఇంత ప్రేమ ఎలా వచ్చిందబ్బా! ఈ మనిషిని అర్ధం చేసుకునే సైకాలజీ కోర్స్ ఏదయినా ఉంటే బాగుణ్ణు!” అని నవ్వుకుంది.
ఎన్నో రకాల స్వీట్స్ తెప్పించింది. ఇందులో ఏదో ఒకటి అయినా జానూకు ఫెవరెట్ ఉంటుంది అన్న ఆమె మాటలతో ఏకీభవించాడు.
కరాచీ బేకరి మెయిన్ బ్రాంచ్‌కు వెళ్ళి ఎన్నో వెరయిటీస్ ప్యాకింగ్ చేయించారు.
ఇవన్నీ తినగలమా! అని ఊర్మిళ ఆలోచించలేదు. పెట్టే హృదయం ఉంటే ఇష్టంగా తినే వాళ్ళు కనిపిస్తారు. మనకు ఎక్కసమయ్యే తినుబండారాల కోసం ఎందరి జిహ్వలు అర్రులు చాస్తాయో, తెలుసు ఆమెకు!
డ్రైవర్ ను తొందరగా రావాలి అని చెప్పి ఉంచాడు, ఆనంద్.
అత్యంత ఆత్మీయ బంధం కాలం గీచిన సరిహద్దులు చెరుపుకుని చేరువ కాబోతున్న శుభ తరుణం.. చేరువగా వచ్చేసింది.
***
జాహ్నవి గాలి చెవుల్లో దూరుతున్నా కిటికీలు దించలేదు.
ఉద్విగ్న భరితమైన ప్రయాణం చేస్తూ కూడా ఓవర్ ఎమోషనల్ అవలేదు.
తెలుసు.. రేపు తన జీవితంలో కలగన్న రోజు అని. భావం మధురంగా ఉంది. హృదయం ఆహ్లాదంగా ఉంది.
చేతిలో సెల్ ఫోన్ వంక చూసుకుంది.
ఒక నెంబర్‌తో నాన్న గొంతు వినవచ్చు..
ఉహు – ఎదుటి వాళ్ళు ఎంత స్వేచ్ఛ నిచ్చారో, అంతే తీసుకోవాలి.. నాన్న ఫోన్ చేయలేదు. తాను కూడా నెంబర్ దొరికింది కదా, అని ఫోన్ చేయడం ఎందుకు. అంతే కాదు.. నాన్న ఫోన్ చేయక పోవడంలో తన చుట్టూ ఉండేవారు కూడా ఒక కారణం కావొచ్చు. అమ్మా, తాతయ్య గార్ల ముందు ఎక్స్‌పోజ్ అవడం ఇష్టం లేక కావొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరని ట్రైన్ ఎక్కగానే తాను ఫోన్ చేయాలని లేదు జాహ్నవికి.
కొందరికి జీవితంలో సునాయసంగా లభించేవి, కొందరికి అందనే అందవు.
జీవితం చేసే మిరకిల్ అది.
ఆనంద్ కూడా జాహ్నవి ట్రైన్ ఎక్కాక ఫోన్ చేయాలి అనుకున్నాడు. కానీ ట్రైన్‌లో ఎమోషనల్ అయి ఏడ్చేస్తుందేమో! ‘వద్దు లే!’ అనుకున్నాడు. ఇన్నేళ్లకు ఇప్పుడు పలుకరించడం అంటే ఏదోలా ఉంది. అతను చేతిలో ఫోన్ పట్టుకొని ఏమో ఆలోచిస్తూంటే, ఊర్మిళనే ఫోన్ తీసుకొని కలిపింది.
“సిగ్నల్ లేదు” అంది ఆనంద్ వంక చూస్తూ.
ట్రైన్‌లో నిద్ర పట్టింది జాహ్నవికి.
ఉషోదయంతో జీవితంలో ‘నాన్న’ అనే కొత్త అధ్యాయం మొదలు కావడమే కదా!
***
హైదరాబాద్ వచ్చేసింది. ఇది నిజంగా నిజం.
ఎన్నడూ చూడని సిటీని ఆసక్తిగా గమనించింది.
గమ్యం వచ్చింది. ఇంక అడుగు వేయడమే!
బ్యాగ్ భుజాలకు తగిలించుకుని లేచి నిలబడింది.
ట్రైన్ దిగి చుట్టూ చూసింది. ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది.
వెతికే ఆమె కళ్ళు.. వెంటనే పోల్చుకున్నాయి
“నాన్నా!” అంది బిగ్గరగా.
ఆ పిలుపు ఆమె గుండె పంజరం తలుపులు తోసుకొని వచ్చినట్టు, స్వేచ్ఛగా పరిసరాల్లో ప్రతిధ్వనించింది.
కల గన్న పిలుపు.. కల నిజమయిన పిలుపు. ఇన్నేళ్ళు అణిచి పెట్టుకున్న పిలుపు.
ఫుల్ హ్యాండ్ షర్ట్ టక్ వేసుకొని, ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని ఆమె కోసమే చూస్తూన్న ఆనంద్, తక్షణం తల తిప్పి చూసాడు.
ఎదురుగా కూతురు –
వద్దు అన్నా గౌను కొన నోట్లో వేసుకొనే కూతురు – వల్లె వాటు వేసుకునేంత వయసుదై..
కన్న కూతురినే కొత్త వ్యక్తిలా కలుసుకుంటున్నాడు.
“జాన్వీ” అన్నాడు విచలిత కంఠంతో.
“డాడ్” కంఠంలో ఆనందాన్ని నొక్కి పెట్టే బరువు.
కొన్ని గొప్ప క్షణాలంతే.. నిశబ్దాన్ని మోసుకొని వెళతాయి. స్పందనకు మాటలే కరువు చేస్తాయి.
అతనికి కూతురిని స్పర్శించాలని ఉంది. జాహ్నవికి తండ్రి పై వాలిపోవాలి అని ఉంది.
కానీ –
జాహ్నవి సుడిగాలిలా తండ్రిని వాటేసుకోలేదు. ఆనంద్ ఆమెను ఆబగా. అక్కున చేర్చుకోలేదు. కాలం కప్పిన తెర దోబూచులాట అప్పటికప్పుడే తొలగి పోలేదు.
ఆమె చేతిలో బ్యాగ్ అందుకునేందుకు చేయి చాచాడు.
చేతిలో నుండి బ్యాగ్ ఆనంద్ అందుకుంటూంటే, తాను ఇన్నాళ్ళు మోసిన భారమేదో తొలగిపోతున్నట్టు ఉంది, జాహ్నవికి.
నాన్న కేరింగ్, భద్రత ఆ క్షణం నుండే అనుభూతం అవసాగింది.
జాహ్నవి అంత ఎమోషనల్ సందర్బం లోనూ ఓవర్ రియాక్ట్ అయి, అందరి అమ్మాయి ల్లాగా ఏడ్చేయక పోవడం గమనించాడు ఆనంద్.
‘యెస్, షి యిజ్ మై డాటర్’ అనుకున్నాడు.
ఇది ఆ స్టుపిడ్ పెంపకంలో వచ్చింది కాదు, తన జీన్స్‌తో వచ్చింది.
ఎనర్జిటిక్‌గా, చక చకా నడుస్తూన్న జాహ్నవి గర్వంగా ఉంది, ఆనంద్‌కు.
ఆమె హైట్ మరింత నచ్చింది.
కారు దగ్గర ఎండలో, గాలికి ఎగిరే ముంగురులను సవరించుకుంటూన్న, ఊర్మిళను చూపిస్తూ, “ఎవరో చెప్పుకో!” అన్నాడు.
జాహ్నవి “హాయ్” అంది.
ఆ అనడం లోని ఉదాసీనత ఆమెను ఓ క్షణం నిరుత్సాహ పరిచినా, తేలిగ్గా తీసుకుంది.
కుతూహలంగా, దొంగ చూపులు చూస్తున్న ఇద్దరు చిన్నారులను తమ్ముళ్ళు అంటూ వాళ్ళు సంతోషంగా పరిచయం చేస్తూంటే “హాయ్” అంటూ ఆనందంగా పలకరించింది.
“అయ్యో! ఇంత ఎండలో నా కోసం నిల్చున్నారా!” అంది.
ఆ మాటకు ఊర్మిళ మౌన అభినందనను ఇచ్చింది ఆమెకు.
తమ్ముళ్ళతో, నాన్నతో కబుర్లు చెప్తూ ముందు సీట్లో కూర్చున్న జాహ్నవి, వెనుక ఉన్న మనిషినే మర్చి పోయినట్టుగా ఉంది.
“యూ, సిల్లీ! కొత్త కదా, ఏమి మాట్లాడుతుంది”, అని ఊర్మిళను ఓదార్చింది మనసు.
కార్లో అప్పుడప్పుడు సంతోషంగా తల తిప్పి ఆనంద్ వంక చూస్తూంది జాహ్నవి. తండ్రిని కంటి నిండా చూసుకోవాలన్న ఆరాటమేమో! నాన్నని తన ఊహల్లో నాన్నని కంపేర్ చేసుకున్నది. స్వర్ణ చెప్పినట్టు తనకు నాన్న పోలికలే ఎక్కువనా? అనుకుంది. ఆమెలోని సంతోషానికి, ఉద్వేగానికి గట్టి పోటీ ఏర్పడినట్టు ముఖమే చెప్తోంది.
ఇల్లు సమీపించింది.
***
విశాలమైన గేట్ తెరుచుకుని లోపలికి ప్రవేశించింది కారు.
“ఎలా ఉంది మన ఇల్లు” అన్నాడు.
“మార్వలెస్‌గా ఉంది నాన్నా, అచ్చు మీ లాగే!” అంది.
ఆనంద్ నవ్వాడు.
ఆమెకు ఇల్లు ముఖ్యం కాదు. నాన్న ముఖ్యం. తనకు ఇన్నాళ్లు అందని నాన్న,- ఇప్పుడు కూతవేటు దూరంలో ఉన్నాడు. కాదు తను భుజం మీద తల వాల్చేంత చేరువలో ఉన్నాడు. ఆమె బ్యాగ్ ఆమెకు కేటాయించిన రూములో పెట్టి వెళ్ళాడు డ్రైవర్. సోఫాలో రిలాక్స్డ్‌గా వెనక్కి వాలి, ఆనంద్ జాహ్నవి వంక చూసి చేయి చాచాడు. ఆ ఆహ్వానం కోసమే ఎదురు చూస్తున్నట్టు జాహ్నవి వెంటనే తండ్రి ప్రక్కన సోఫాలో కూర్చుని భుజం పై తల వాల్చి, విశాలమైన అతని వక్షస్థలం పై చేయి వేసింది. ఆనంద్ మరో చేత్తో ఆమె తల నిమురుతున్నాడు. జాహ్నవి కంటి నుండి కన్నీటి బిందువులు అప్రయత్నంగా రాలి అతని చేయి పై పడ్డాయి.కొన్ని క్షణాల గాఢ నిశ్శబ్దం బరువెక్కిన ఆ గుండెల మధ్య.. ఇంతలో “మా నాన్న” అంటూ బుజ్జిగాడు వచ్చి నెట్టి వేసాడు. అప్పటి దాకా తండ్రి కూతుళ్ళ అనురాగ దృశ్యం చెమర్చిన కళ్ళతో చూస్తూ నిలబడిన ఊర్మిళ, “మన నాన్న అనాలి.” అంది వాడిని ఊరడిస్తూ. జాహ్నవి నవ్వుతూ ప్రేమగా చేతులు చాసింది. మరి కొద్ది సేపట్లో వాడికి అక్క ఫెవరేట్ అయిపొయింది.
“జానూ!వంట అయ్యే లోగా ఏదయినా తీసుకుంటావా!”
“వద్దు” అంది. ఆ మాట కటువుగా లేదు. అలా అని మెత్తగానూ లేదు. ఊర్మిళ జాహ్నవిని తీసుకొచ్చేందుకు వెళ్ళే ముందే సిద్ధం చేసిపెట్టుకున్న కూరగాయలతో త్వరత్వరగా వంట చేసింది.
కొని పెట్టిన స్వీట్స్ అన్నీ చక్కగా టేబుల్ పై అమర్చి పెట్టింది. వాటిని చూసి “అబ్బో! ఇన్ని స్వీట్సా!” అనేసింది జాహ్నవి పైనకే.
ఆనంద్ సమాధానం ఇచ్చాడు.
“నువ్వు వచ్చేవరకు ఇంట్లో నీ కిష్టమైన స్వీట్ ఏదయినా తెప్పించి ఉంచాలనిపించింది. కానీ ఏది ఇష్టమో తెలియదు ఎలా? అని అంటే, ఇదుగో మీ పిన్ని ఇన్ని స్వీట్స్ తెప్పించింది.” అన్నాడు. ఆ మాట వినగానే వాటి ల్లోని తీపి అంతా ఎగిరి పోయినట్టు అనిపించింది జాహ్నవికి.
“ఇప్పుడు నీకు ఇష్టమైన స్వీట్ ఏదో చెపితే నాన్న నీకు బైట్ ఇస్తారు” అంది ఊర్మిళ.
అప్పటికే ఆమె చేతిలో సెల్ఫోన్ పట్టుకొని సిద్ధంగా ఉంది.
ఆనంద్ ఆమె వంక చూస్తూ, “నాన్నకూ, కూతురికీ ఇష్టమైన స్వీట్ ఏది ఇందులో!” అన్నాడు తనే మళ్ళీ
“ఆ గెస్ మీ పిన్నికీ వదిలేద్దాం కానీ, నీ ఇష్టం ఏదో చెప్పురా!” తండ్రి తనని అలా సన్నిహితంగా సంబోధిస్తూ ఉంటే సంతోషంగా ఉంది జాహ్నవికి.
“ఏదయినా సరే!” అంది.
“చెప్పు బంగారు!” అన్నాడు.
తండ్రి మురిపానికి ఆమె తల ఒగ్గినట్టు , అక్కడున్న ఒక డిష్ వైపు చూపింది.
“మరొకటి కూడా చెప్పాలి” అన్నాడు. తండ్రి ప్రేమ తన్మయత్వంలో ఉంది జాహ్నవి. మరో డిష్ వంక చేయి చూపింది.
గులాబ్ జామున్ సగం చేసి ఆమె నోటికి అందించాడు. వీడియో నడుస్తోంది పిల్లలు కేక్ కటింగ్ గుర్తు చేసుకొని చప్పట్లు కొట్టి సంతోషం రెట్టింపు చేసారు.
జాహ్నవి ఆగమన శుభదినం అది. మధుర స్మృతులుగా వీడియోలో బంధిస్తున్నారు.
“నౌ ఛాయిస్ ఈజ్ యువర్స్” అంటూ ఊర్మిళ చేతి లోని సెల్ ఫోన్ తీసుకున్నాడు. “జానూ! ఇది ఒ.కే. కదా!” అంది. ఇందాక అవే చూపించి ఉండడం వల్ల “ఓ.కె.!” అంది క్లుప్తంగా. ఊర్మిళ ఏది అడిగినా సమాధానాలు క్లుప్తంగా ఉంటాయి జాహ్నవి నుండి. ఊర్మిళ రసగుల్లా చేతి లోకి తీసుకుని, ఒక చేయి ఆమె భుజాల చుట్టూ వేసి మరో చేత్తో స్వీట్ పెట్టింది. ఆ స్పర్శ జగుప్స కలిగించింది జాహ్నవికి. తల్లి స్థానం ఓన్ చేసుకుని అమ్మ శాంతి సౌఖ్యాలను దోచుకుందనే భావం – ఆడపిల్లగా ఆమెకు సహజమే కదా!
ఆ తర్వాత అంతా కలిసి భోజనం చేసారు.
పిల్లలకు అక్క తమకు చాలా క్లోజ్ అని అర్ధం అయ్యింది..
అంతా టేబుల్ చుట్టూ కూర్చొని అన్నం తింటూంటే అంతా కొత్తగా అనిపించింది జాహ్నవికి.
నాన్న ప్రక్కనే కూర్చుని తింటూన్నా సంతృప్తిలో ఎక్కడో చిన్న జీర, అమ్మ లేదు కదా!
***
జాహ్నవికి హైదరాబాద్ లో తొలి ఉషోదయం అయ్యింది. తన రూము నుండి వచ్చిన ఆమెను “జానూ! బ్రష్ చేసుకున్నావా! బోర్న్‌విటా ఓ.కె.నా!” అంది ఊర్మిళ.
కళ్ళెత్తి ఊర్మిళ వంక చూసింది జాహ్నవి. తన ప్రశ్నకు ‘చూపు’ సమాధానం కాదు, కదా! అనుకుంది.
“బోర్న్‌విటా, ఓ. కే.” అంది, పొడి పొడిగా.
ఇదే సమాధానం వెంటనే చెప్పవచ్చు కదా, అనిపించడం సహజం ఎవరికైనా! కానీ ఊర్మిళ పట్టించుకోలేదు.
అసలే జాహ్నవికి ‘సీరియస్ లుక్స్’ అని నిక్ నేమ్.
తమ్ముళ్ళు చిన్న వాళ్ళు, నాన్న నాన్ననే.
ఇంక మిగిలింది, పిన్ని..
కొత్తవాళ్ళను త్వరగా ఆక్సెప్ట్ చేయని తత్వం చిన్నప్పటి నుండే అలవరచుకుంది. ఇప్పుడు ఆ చూపుల్లో ఊర్మిళ చిక్కుకుంటూంది.
ఒకలాంటి పరిశీలన కలిగిన చూపులు.. పెద్ద కళ్ళెత్తి, సూటిగా గుచ్చుకునేలా చూస్తుంది.
వ్యూహత్మక మౌనం పాటిస్తూ, వెంటనే సమాధానం చెప్పదు.
ఏమిటో! జానూను ఇలా ఊహించలేదు, అనుకుంది ఊర్మిళ.
***
హైదరాబాద్ ఎండలు మరింత ముదరక ముందే, జాహ్నవికి సిటీ చూపాలని అనుకున్నారు. ఆ రోజు జూ పార్క్‌కు వెళ్ళే ప్రోగ్రామ్ డిసైడ్ అయ్యింది.
“నాకు బిర్లా మందిర్ చాలా చూడాలని ఉంది, నాన్నా!” అంది జాహ్నవి.
ఆదర్శ్ నగర్ లోని ఆ ఇంట్లో నార్త్ సైడ్ బెడ్ రూమ్స్ తలుపులు తెరిస్తే పాలరాతి గుడి కనిపిస్తూనే ఉంటుంది.
“ష్యూర్, నెక్స్ట్ అటే వెళ్దాం,” అన్నాడు ఆనంద్.
అప్పటి దాకా అక్క ఒళ్ళో కూర్చొని, జూకు వెళ్ళే సంబరంలో కబుర్లు చెప్పిన పిల్లలు అక్క తోనే డ్రెస్ వేయించుకుంటామని వచ్చారు.
వాళ్ళను శ్రద్ధగా తయారు చేసింది.
తమ్ముళ్ళ విషయంలో పిన్ని తనకు చాలా మార్కులే వేసుకుంటూందని జాహ్నవికి తెలియదు..
పిల్లలు అంటే అందరి అమ్మాయి ల్లాగే జాహ్నవికీ చాలా ఇష్టం.
అంతా తయారయి జూకు కదిలారు.
పింక్ వర్క్ శారీలో అద్వితీయంగా ఉన్న ఆమెను చూస్తూ, “అమ్మ ఎలా ఉందో!” అనిపించింది జాహ్నవికి.
ఎక్కడో చిన్న పించింగ్.
ఎంత అందంగా ఉంది. అందుకేనా, అమ్మ ప్లేస్ ‘ఓన్’ చేసుకుంది. అందానికి అంత పవర్ ఉందా!
‘తాను కూడా అక్కడ లేక, ఎంత బోర్ అవుతుందో, పాపం, అమ్మ’ అనుకుంది.
జాహ్నవి చూపుల్లో అర్థాలు పసిగట్టడం తెలియని ఊర్మిళ, “దిస్ ఈజ్ మై ఫెవరెట్ శారీ” అంది, కుచ్చిళ్ళు సవరించుకుంటూ.
జాహ్నవి వినీ, విననట్టు ఊరుకుంది.
జూ పార్క్ చాలా ఎంజాయ్ చేసింది. మైసూర్ జూ కంటే హైదరాబాద్ జూ చాలా పెద్దది అనుకుంది.
***
జాహ్నవి వచ్చి అప్పటికి నాలుగు రోజులయ్యింది.
ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయిది ఒకటే పద్ధతి. ఆనంద్ వెంటవెంటే తిరుగుతూ, ఏదో చెప్తూనే ఉంటుంది.
ఆ కబుర్లలో తననూ కలుపుకోవచ్చు కదా!
రహస్యాలేమి ఉండవు.
మరెందుకలా! తనను ఉడికించాలనా!
లేక ఇన్నాళ్ళు నాన్నకు దూరంగా ఉంది కదా, ఇలా నాన్నని స్వంతం చేసుకున్న ఫీలింగ్ కోసమేమో!
తనతో మాట్లాడే మాటల్లో పిన్నీ అన్న సంభోదన రాకుండా జాగ్రత్త పడుతుంది. తమ్ముళ్ళ విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటుంది.
ఊర్మిళ జాహ్నవిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూంది.
***
జాహ్నవి తనకి ‘సీరియస్ లుక్స్’ నిక్ నేమ్ ఉందని చెప్తూంటే, “పెద్ద కళ్ళు కదమ్మా! అలాగే కనిపిస్తాయి” అన్నాడు ఆనంద్.
తనని నాన్న సమర్థించడం జాహ్నవికి బాగుంది.
నాన్న చాలా చాలా నచ్చుతున్నారు జాహ్నవికి.
“నీకు నిక్ నేమ్ పెట్టేంత ఛాన్స్ వాళ్ళకెలా ఇచ్చావురా!” అన్నాడు ఆనంద్.
“ఇవ్వొద్దనే డాడ్! ఈ సీరియస్ లుక్స్‌తో అందర్నీఅంత దూరం పెట్టేస్తాను” అంది.
ఊర్మిళ ఆశ్చర్యంగా చూసింది.
“నిన్నెవ్వరు ఏమంటారు రా! జానూను అనే గట్స్ ఎవరికి ఉన్నాయి. నీకేమి తక్కువ!”
“నాన్న!” అంది.
ఆ మాట విని క్షణంలో సగం సేపు ఆనంద్ ముఖం మ్లానమైంది.
జాహ్నవి పరిణితి చెందిందా! పరిణితి చెందాననుకుని మాట్లాడుతుందా! అర్థం కాలేదు ఊర్మిళకు. షి ఈజ్ జస్ట్ ఫిఫ్టీనెండాఫ్ అనుకుంది.
కానీ జాహ్నవికి అర్థం అయ్యింది, ‘టంగ్ స్లిప్ అయ్యాను’ అనుకుంది.
“నిన్న లుంభిని పార్క్‌లో మ్యూజిక్ ఫౌంటెన్, ఐ ఫుల్లీ ఎంజాయిడ్ ఇట్, డాడ్!” అంది.
ఆలా టాపిక్ మార్చింది.
ఊర్మిళ డిషెస్ టేబుల్ మీదకు తెచ్చి పెట్టింది.
అంతా కలిసి భోజనం చేసారు.
***
ఆ రోజు తన గదిలో నుండి ఇవతలకు వచ్చిన జాహ్నవి, టేబుల్ మీద ఊర్మిళ ఇచ్చిన బోర్న్‌విటా చల్లారిపోతున్నా తాగకుండా వెక్కివెక్కి ఏడుస్తూ కూర్చుంది.
ఊర్మిళ ఆమె నుండి సమాధానం రాబట్ట లేకపోయింది.
గార్డెన్‌లో ఉన్న ఆనంద్, ఊర్మిళ చెప్పింది విని లోనికి వచ్చాడు.
“జానూ, ఏమైంది రా! వాట్ హేపెండ్ మై చైల్డ్!” అన్నాడు. సమాధానం లేదు.
“నాన్నను ఇక్కడ పెట్టుకుని, ఇంత మంచి పిన్నిని పెట్టుకుని, ఛ! ఛ! జాహ్నవి ఎప్పుడూ ఇలా చేయదు.”
ఆనంద్ బుజ్జగింపులకు తల ఎత్తింది జాహ్నవి.
“ఇవాళ అమ్మ బర్త్ డే కదా! మిస్సవుతున్నావా!” జాహ్నవి ఒక్క క్షణం ఏడవడం ఆపేసి చూసింది.
అటు నుంచి ఊర్మిళ కూడా షాక్ అవుతూ చూసింది.
కానీ ఏమీ మాట్లాడలేదు.
“నేను ఈ రోజు అయ్యాక బయల్దేరవలసింది. గుర్తుపెట్టుకోలేక పోయాను.”
“పర్లేదు, ఇప్పుడేమయ్యింది, అమ్మకు గిఫ్ట్ ఏదయినా కొని పంపుదాం.”
కూతుర్ని ఓదార్చే క్రమంలో పరిమితులు దాటాడు ఆనంద్.
తెల్లబోవడం ఊర్మిళ వంతయ్యింది.
నమ్మరాదే చెలి, మగవారినెపుడు నమ్మరాదే!
“అమ్మ తీసుకోదు,” అంది జాహ్నవి.
ఊర్మిళకు ఆమె నెంత ఓదార్చాలని ఉన్నా, తననంత దూరంలో ఉంచే ఆ చూపులకు వెనుకడుగు వేసింది.
జాహ్నవి నాలో నన్ను చూడట్లేదు, అనుకుంది.
“ఈవినింగ్ మళ్ళీ బిర్లా టెంపుల్‌కు వెళదాం,” అంది ఊర్మిళ.
“యెస్” అన్నాడు ఆనంద్. ఊర్మిళ వంక ప్రశంసగా చూసాడు. నిజమే, బయటకు వెళితే జాహ్నవి కాస్త రిలాక్స్ అవుతుంది.
ఊర్మిళ ఇంక ఊరుకోలేక పోయింది. తన చేత్తో జాహ్నవి కళ్ళు తుడిచింది. “పిల్లలూ, ఇక్కడికి వచ్చేయండి.. అక్కతో క్యారమ్స్ ఆడాలి,” అంది.
బోర్డ్ టేబుల్ పై అరేంజ్ చేసారు.
జాహ్నవి ఆనంద్ వంక చూసింది.
అతనికి చూసుకోవాల్సిన ఆఫీస్ పని ఉంది. కానీ, జాహ్నవి కోసం టైం అడ్జెస్ట్ చేసుకోవాలని, క్యారమ్స్ ముందు కూర్చున్నాడు.
***
నాన్న అమ్మ బర్త్ డే గుర్తు పెట్టు కోవడం, ఆ భావన కొత్త గా, స్వీట్ గా ఉంది జాహ్నవి కి.
రాత్రి తన రూమ్‌లో పడుకుని మాలతికి సెల్‌ఫోన్‌లో అదే చెప్పింది.
అప్పుడప్పుడు మైసూర్ ఫోన్ చేస్తుంది, కేవలం క్షేమ సమాచారాలు తెలుసుకుంటుంది.
ఎక్కువ ఇక్కడి మేటర్స్ లీక్ చేయదు. మాలతి రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయం.
ఏమాలోచించి, మనసు మీదకు తెచ్చుకుంటుందో అని బెంగ.
కానీ ఈ విషయం మాత్రం దాచలేక పోయింది.
***
ఆవేళ ఒకతను ఇంటికి వచ్చి బొబ్బట్ల ప్యాకెట్స్ ఇచ్చాడు. ఊర్మిళ ఎంతా అని అడక్కుండా, అతని చేతిలో డబ్బు పెట్టింది. ఆ వృద్ధుడు ఆమెకు చేతులు జోడించాడు.
ఈవినింగ్ బొబ్బట్లు, మురుకులు పిల్లలందరికి ప్లేట్స్‌లో పెడుతూంది, ఊర్మిళ.
జాహ్నవికి ఈ కొన్ని రోజుల్లో తండ్రి దగ్గర చనువు బాగా పెరిగింది. అతను అమ్మ బర్త్ డే డేట్ ఓపెన్‌గా అలా చెప్పడం, జాహ్నవిని మరో అడుగు ముందుకు కెళ్ళేలా చేసింది.
“నాన్నా! మీకు బొబ్బట్లు బాగా ఇష్టం కదూ!”
“యెస్, రా!”
“అమ్మ చాలా బాగా చేస్తుంది,” ఊర్మిళ అటు వెళ్ళింది చూసి అన్నది.
“కానీ, అమ్మ తినదు.”
“మీరు ఇష్టంగా అడిగి చేయమనే స్వీట్ అది ఒకటే అట.”
“యెస్, యెస్,” అన్నాడు ఆనంద్.
తన కోసం ఇష్టంగా బొబ్బట్లు చేసి పెట్టే మాలతి, ఆ జ్ఞాపకాలు వస్తాయని, వాటిని వదిలి వేయడం – ఆనంద్‌ని ఎక్కడో టచ్ చేసింది.
ఇటు కూతుర్ని బాధ పెట్టలేని బలహీనత.. ఊర్మిళ ముందు చీప్ అవుతానన్న సంశయం.. అంతే కానీ,
మాలతి కబుర్లు వినకూడదన్న నియమం అతని కేమీలేదు కదా!
అప్పుడో సారి, ఇప్పుడో సారి జాహ్నవి చెవిలో వేసిన సమాచారం ప్రకారం, మాలతి హ్యాపీగా లేదు అని ఆనంద్‌కు అర్థం అయ్యింది,
బయటకు వెళ్ళదు. నలుగురిలో కలవదు.
మరింత ఎమోషనల్‌గా మారి పోయింది.
బి. పి., గుండె దడ. ఎక్కువ ఆలోచించి ఎప్పుడూ ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటుంది.
పాపం! పూర్ మాలతి అనుకున్నాడు.
జాహ్నవి చిన్నగా ఉన్నప్పుడు రాధమ్మ సందర్భం వచ్చి చెప్పగా విన్నదే, ఆ బొబ్బట్ల ముచ్చట.
***
తన కష్టాలన్నీ తన ఆత్మీయుడైన నాన్నకు చెప్పుకుంది జాహ్నవి. “డాడ్, అక్కడ చాలా బోర్ డాడ్.. మీరు లేని ఇల్లు ఏదోలా అనిపిస్తుంది నాకు”.
“ఇక్కడే ఉండి పోరా!” అన్నాడు. “నెవర్ డాడ్! అక్కడ రెండు ప్రాణాలు నా పై ప్రాణం పెట్టుకొని ఉన్నాయి,” అంది.
ఆనంద్ ఆ మాటకు ఎందుకో అప్రయత్నంగా గంభీరంగా మారిపోయాడు. తనకూ, కూతురికి మధ్య పూడ్చ లేని అగాధం ఉందనిపించిందేమో!
***
జాహ్నవి అప్పుడప్పుడు ఆనంద్ ఆఫీస్ రూమ్ లోకి డైరెక్ట్‌గా వెళ్ళి కూచుంటుంది. బిజినెస్ గురించి తెలుసుకుంటుంది. స్టాఫ్ వర్క్ ఏమిటో చూస్తుంది. ఆనంద్ కు జాహ్నవి అలా అన్ని తెలుసుకోవడం సంతోషకరమైన విషయం.
ఆడపిల్లలు అంటే అలా ఉండాలి, అనుకుంటాడు.
ఆనంద్ రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళాడు.
“ఆఫీస్ వర్క్ ఏదైనా ఉంటే నాకు చెప్పి వెళ్ళండి, డాడ్!” అంది.
“ఆ పని తర్వాత కానీ నువ్వు ముందు పిల్లలతో, పిన్నితో ఎంజాయ్ చేయి” అంటూనే, ఆమెను నిరుత్సాహపరచకుండా కొంచెం ఈజీ వర్క్ ఇచ్చి, వివరించి చెప్పి ఫ్లయిట్ ఎక్కాడు, ఆనంద్. ఊర్మిళ డస్టింగ్ చేస్తూ, పైన సెల్ఫ్‌లో ఉన్న కొలాజ్ క్రిందకు తీసింది.
“జానూ, ఈ ఫోటో చూడు,” అంటూ పిలిచింది.
“అరె, నేను చిన్నగా ఉన్నది. ఇంట్లో కూడా సింగిల్ ఫోటో ఒకటి ఉన్నది. నన్ను మీరెలా ఎత్తుకున్నారు?”
“అప్పుడు నువ్వు బేబీ కేర్ సెంటర్‌లో ఉన్నావు. నేను అక్కడే చేసేదాన్ని. నిన్ను ఆరు నెలలు పెంచాను,” అంది.
‘ఓ! ఈమెతో ఎమోషనల్ బాండింగ్ కూడా ఉందా’, అనుకుంది.
ఏది ఉన్నా తనకు అనవసరం.
‘అమ్మ భయపడ్డట్టు నేను ఈమె ఫాన్ అయితే అమ్మ తట్టుకోలేదు. అవన్నీ విని నా మనసెలా ఉంటుందో!’ అనుకుంది. “ఓహ్, నైస్,” అంటూ వెళ్ళిపోయింది. తానాశించిన ఎక్స్‌ప్రెషన్స్ జాహ్నవి ముఖంలో కనబడక ఊర్మిళ మరోసారి నిరాశ చెందింది.
(ఇంకా ఉంది)
శారద పువ్వాడ (తడకమళ్ళ) గారి స్వగ్రామం మిర్యాలగూడలోని తడకమళ్ళ గ్రామం. హైస్కూల్ చదువు సూర్యాపేట లోను, కాలేజీ చదువు హైదరాబాద్, నాంపల్లి లోని వనిత కాలేజీలో సాగింది. ప్రముఖ వార పత్రికల్లో కథలు కొన్ని అచ్చయ్యాయి. ఎఫ్.బి.లో కొన్ని కథలు, వచన కవితలు వ్రాసారు. ‘ఎంత చేరువో అంత దూరము’ వీరి మొదటి నవల. ఈ నవలను ప్రచురిస్తున్న సంచిక వారికి, తన రచనలను ఆదరించిన ముఖ పుస్తక మిత్రులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు రచయిత్రి.