లక్ష కథానికల పెట్టు శ్రీశ్రీ ఒక్క కథనిక!
శ్రీశ్రీ గురించి తెలుగు సాహిత్యంలో-పరిచయాలు, పరామర్శలు, పరిశీలనలు, పరిశోధనలు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, సమీక్షలు, విమర్శలు, ప్రత్యేక గ్రంథాలూ అనన్య సామాన్యమైన విస్తృతితో, విస్తారంగా-వెలువడినై. యువతరం, నవతరం, తరంతరం ప్రేరకుడు-శ్రీశ్రీ.
గడచిన ఏప్రిల్ 30, శ్రీశ్రీ 112జయంతి. ఉక్తులు-పునరుక్తులు, వ్యక్తిత్వం, వ్యత్యస్తం అన్నిటి గురించి ఎందరో రాశారు, రాస్తున్నారు. ఇలా శ్రీశ్రీ గురించి వెలువడిన సాహిత్యంలో తొంభై అయిదు శాతం ‘కవిత్వం’ కేంద్రకంగా సాగిన రచనలే.
కథానికా రచయితగా శ్రీశ్రీ చాలామంది కథానికా రచయితలకే తెలియదు. ఇదొక భౌతిక వాస్తవం. ‘చరమరాత్రి’, ‘ఒసే తువ్వాలు అందుకో’ ‘ఒక్కల’ వంటి చాలా మంచి కథలు సుమారు 30కి పైనే రాశారు శ్రీశ్రీ. అయితే, తన ప్రయోగవాంఛ, శబ్దశక్తి, శైలీవిశిష్టత, అసలు వస్తువులో నవత్వం, మానవత్వం, కవిత్వం దట్టించటం- ఇన్నింటి సమాహార రూపంగా-లక్ష కథానికల పెట్టుగా ఒక అతి చిన్న ‘మాస్టర్పీస్’ రాశాడు శ్రీశ్రీ. దాని పేరు ‘చావూ పుట్టుకా’! చదవండి. నిండా 21 లైన్ల కథానిక.
~ ~
అదో వూరు. ఆ వూళ్లో ఒక ఆసుపత్రి.. ఇదో వూరు. ఈ వూళ్లో ఒక పోలీసుస్టేషన్. ఆ వూళ్లో, ఈ వూర్లో ఆంధ్రదేశం అంతటా అది అర్ధరాత్రి!
ఆసుపత్రికి నొప్పులు పడుతున్న ఒక గర్భవతిని తీసుకువచ్చారు. ఆమె వయస్సు నలభై.
పోలీసు స్టేషన్ కు బేడీలు వేసిన ఒక కుర్రవాణ్ని తీసుకువచ్చారు. అతని వయస్సు ఇరవై.
గర్భిణి బాధపడుతోంది. ఏడుస్తోంది.
కుర్రాడు బాధపడుతున్నాడు. కాని, నవ్వుతున్నాడు. ఆసుపత్రిలో వైద్యులు ఆశాజనకంగా మాట్లాడుతున్నారు.. స్టేషన్లో పోలీసులు కారుకూతలు కూస్తున్నారు.
“నీకేం భయం లేదమ్మా! కేసు కొంచెం కఠినమైనదే. కాని ప్రమాదం ఏమీ లేదు.” “లంజ కొడకా! మావో పుస్తకాలు చదువుతావు? లోకాన్ని మరమత్తు చేస్తావూ? ముందు నిన్ను హజామత్తు చేస్తాం జాగ్రత్త!”
వైద్యులు శస్త్రచికిత్సకు ఉపక్రమించారు.
పోలీసులు కత్తులూ, కటార్లు నూరుతున్నారు.
రెండుచోట్లా హింసా ప్రయోగమే జరిగింది.
కానీ సూర్యోదయంలో
అక్కడ ఆసుపత్రిలో ఒక జననం!
ఇక్కడ తెల్లారగానే
పోలీసు స్టేషన్లో ఒక మరణం!
~ ~
ఒక కథానిక-ఆస్పత్రిలో ఒక గర్భిణి ఆపరేషన్ ద్వారా బిడ్డకి జన్మనివ్వటం. రెండవ కథానిక పోలీస్ స్టేషన్లో ఒక యువకుడు పోలీసుల ట్రీట్మెంట్ ద్వారా మరణించటం, రెండు చోట్లా ‘హింస’ జరిగింది. ఒకటి పుట్టుకకు కారణమైంది. మరొకటి చావుకి కారణమైంది. కథానికా వస్తు రూపగుణ వైశిష్ట్యానికి ఏకైక కథానికా గోపుర శిఖరంగా దీన్ని చూపితే చాలు!
ఎందువలన? అంటే, దీనిలో బేసి సంఖ్యలోని (1, 3, 5, 7 ఇలా..) పంక్తుల్ని మాత్రమే ఒకసారి చదువుకుంటే ఒక సముద్రమంత కథానిక వచ్చేస్తుంది. అప్పుడు సరిసంఖ్యలోని (2, 4, 6, 8.. ఇలా…) పంక్తుల్ని మాత్రమే చదువుకుంటే వేరే ఒక ఆకాశమంత కథానిక వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం కథానికని చదువుకుంటే అది ఒక పర్యావరణమంత కథానికగా గుండెని తడుతుంది. ఇదీ విశేషం. ఒక చావూ ఒక పుట్టుకా లేదా తిరగేసి చెబితే ‘ఒక పుట్టుక ఒక చావూ’ రెండూ పాఠకుడి వెన్ను నాడిని వణికిస్తాయి. అదీ విషయం! అదీ శ్రీశ్రీకి తెలిసిన నాడీ వైద్యం! శిల్ప నైపుణ్యం, శబ్ద ప్రయోగదక్షత!
ఈ కథనంలో వస్తువు, శైలీ శిల్పాలు అద్భుతమైన విన్యాసం, విన్నాణం మాత్రమే కాదు. క్లుప్తత ఉన్నది. నేపథ్యం ఉన్నది. సమాజం ఉన్నది. మౌలికంగా దానికి శాశ్వతమైన లక్షణం ఏమిటో అది ఉన్నది. సమాజపు ‘హోరు’ ఉన్నది. ఆ హోరు ఒక వాంఛనీయమైన ఆవశ్యకతను ధ్వని పూర్వకంగా ఆవిష్కరిస్తోంది. ఇదీ విశేషం.
కళాత్మక వాస్తవికతని కథలో ఎలా చూపవచ్చు అనే దానికి కూడా ఒక ఉదాహరణ ఈ చిన్న కథనం. అందుకనే ఇది తెలుగు కథా సాహిత్యంలో ఒక ‘ఏరిన ముత్యం’!
మధురాంతకం రాజారాం అంటారు “టార్చి లైటులా కాంతులు విరజిమ్మి సమాజ స్వరూపం సాక్షాత్కారానికి తోడ్పడితే అంతకు మించి కథానిక నుంచీ మనం ఆశించగలిగిందేమీ లేదు” అని. శ్రీశ్రీని కథానికా రచయితగా తలచుకున్నప్పుడల్లా ఈ ‘చావు పుట్టుక’ – మనసుని వెంటాడుతూ వుంటుంది. గుండెని పట్టేస్తూ వుంటుంది. బుర్ర తినేస్తూ వుంటుంది. శిల్పం గురించీ శైలి గురించీ చాలా మంది చాలా బోధల్ని వ్యక్తం చేస్తూంటారు. ఈ రెండు అంశాలపైనా సాధికారికమైన నమూనా పత్రంగా ఈ కథానికని పదం పదంగా, ‘హోల్ మొత్తంగా’ విశ్లేషించుకోవచ్చు. ప్రయోగాత్మని కథాత్మని చేస్తూ, ఆలోచనీయంగా సాగిన ఈ కథానికా తత్వంని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటమే శ్రీశ్రీ స్మృతికి వినయ నివాళి!
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.