Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పాట ఆగింది.. స్వరం మిగిలింది

[ప్రముఖ గాయకుడు, నటుడు ‘కిషోర్ కుమార్’ గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు శ్రీ ఆచారం షణ్ముఖాచారి.]

“జీవితమంటే కొద్దిపాటి సుఖం, కొద్దిపాటి దుఃఖం.. కొంత ఎండ, కొంత నీడ. బ్రతుకులో దొరికినదాన్ని స్వంతం చేసుకోవాలే గాని, గెలుపు ఓటములను చూడవద్దు. ప్రతి క్షణం ఆస్వాదించేందుకు ప్రయత్నించు.. అది కష్టమైనా, సుఖమైనా” అంటూ అర్థం వచ్చేలా జీవనసత్యాన్ని “ఏ జీవన్ హై ఇస్ జీవన్ కా యహీ హై యహీ హై.. యహీ హై రంగ్ రూప్.. థోడే గమ్ హై థోడే ఖుషియా.. యహీ హై యహీ హై.. ఛావ్ ధూప్” అని ‘పియా కా ఘర్’ (1972) సినిమా కోసం ఆనంద్ బక్షి రాయగా, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ రిహార్సల్ లేకుండా కిషోర్ కుమార్‌తో ఒకే టేకులో పాడించి రికార్డు చేసి సూపర్ హిట్ చేసిన విషయం కొందరికి మాత్రమే తెలుసు. ఈరోజు అతడు మనముందు లేడు. కానీ అతడు మనకు అందించిన కొండంత గానామృతం ఒక తరగని సంపదలా పదిలంగా వుంది. అందుకే భారతీయ సంగీత ప్రపంచానికి అతడొక మార్గదర్శి. కిషోర్ మన మధ్య లేడని అనుకోగానే మనకు ఆయన ‘చల్తే చల్తే’ (1976) సినిమాలో పాడిన టైటిల్ పాట “చల్తే చల్తే మేరా ఏ గీత్ యాద్ రఖనా, కభీ అల్విదా నా కెహనా.. రోతే హస్తే బస్ యూహీ తుమ్ గున్ గునాతే రెహనా, కభీ అల్విదా నా కెహనా” తప్పకుండా గుర్తుకొస్తుంది. “వెళ్తూ వెళ్తూ  నా పాట గుర్తు పెట్టుకో. ఎన్నటికీ వీడుకోలు చెప్పకు. ఏడుస్తున్నా, నవ్వుతున్నా, ఇలాగే కూనిరాగాలు తీస్తూ వుండు. నా జ్ఞాపకాలలోకి వచ్చి ఇలాగే పాటలు పాడుతూనే వుండు” అంటూ అమిత్ ఖన్నా రాసిన పాట కిషోర్ జ్ఞాపకాలనుంచి మనల్ని దూరం చెయ్యలేదు. కిషోర్ కుమార్ కేవలం గాయకుడే కాదు, ఒక మంచి గేయ రచయిత, నటుడు, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు కూడా. కిషోర్ కుమార్ వంటి ప్రతిభావంతుని గుర్తుచేసుకుందాం..

తొలిరోజుల్లో కిషోర్ కుమార్..

పుట్టింది మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వాలోని ఒక బెంగాలీ కుటుంబంలో. కిషోర్ కుమార్ అసలు పేరు అబ్బాస్ కుమార్ గంగూలీ. తండ్రి కుంజాలాల్ గంగూలీ న్యాయవాది వృత్తిలో వుండేవారు. తల్లి గౌరీ దేవి సంపన్న బెంగాలీ సంపన్న కుటుంబరాలు. ఖాండ్వా లోని గోఖలే కుటుంబం కుంజాలాల్‌ని తమ వ్యక్తిగత లాయరుగా ఉండమని ఆహ్వానించడంతో వారి కుటుంబం బెంగాల్ వదలి మధ్యప్రదేశ్‌కు వెళ్ళింది. ప్రసిద్ధ క్యారక్టర్ నటుడు అశోక్ కుమార్ కిషోర్ కుమార్‌కు పెద్దన్నయ్య. తరవాత అనూప్ కుమార్ మరొక అన్న. కిషోర్ అందరికన్నా ఆఖరి సంతానం. ఆయనకు సతీదేవి అనే అక్క కూడా వుంది. కిషోర్ కుమార్‌కు, అన్న అశోక్ కుమార్‌కు మధ్య 18 సంవత్సరాల వ్యత్యాసం వుంది. కిషోర్ పిల్లవాడుగా ఉండగానే అశోక్ కుమార్ బాలీవుడ్‌లో మంచి హీరోగా స్థిరపడ్డారు. అశోక్ కుమార్ బొంబాయిలో వుండడం చేత వీరి కుటుంబం తరచూ అక్కడకు వెళుతూ వుండేది. కిషోర్ ఇండోర్ లోని క్రైస్తవ కళాశాల నుంచి పట్టా తీసుకున్నాడు. చదువు పూర్తయ్యాక తన పేరును ‘కిషోర్ కుమార్’ గా తనే మార్చుకొని అశోక్ కుమార్ నటించే బాంబే టాకీస్ స్టూడియోకి వెళ్తూ అప్పుడప్పుడు కోరస్ పాడుతూ వుండేవాడు. బాంబే టాకీస్ వారు నిర్మించిన ‘జిద్ది’ (1948) సినిమాలో దేవానంద్ హీరోగా నటించి నప్పుడు, సంగీత దర్శకుడు ఖేమ్ చంద్ ప్రకాష్ కిశోర్‌తో “మర్నే కి దువాయే క్యో మాంగూ, జీనేకి తమన్నా కౌన్ కరే” అనే పాటను పాడించాడు. అందులోనే “ఏ కౌన్ ఆయా రే.. కర్ కే యే సోలా సింగారే కౌన్ ఆయా” అనే యుగళ గీతాన్ని తొలిసారి లతా మంగేష్కర్‌తో కలిసి ఆలపించారు. దీనిని దేవానంద్, కామినీ కౌశల్ మీద చిత్రీకరించారు.

1949లో బొంబాయిలో స్థిరపడిన తరవాతగానీ కిషోర్ చలనచిత్ర జీవితాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. బాంబే టాకీస్ వారు 1951లో ఫణి మజుందార్ దర్శకత్వంలో ‘ఆందోళన్’ అనే సినిమా నిర్మిస్తూ అందులో కిషోర్‌ను హీరోగా పరిచయం చేశారు. అశోక్ కుమార్‌కు తమ్ముడు కిషోర్‌ని ఒక మంచి హీరోగా నిలబెట్టాలని వుండేది. కానీ కిషోర్ మాత్రం సింగర్‌గా స్థిరపడాలనే ధ్యేయంతో ఉండేవాడు. 1946-55 మధ్య కాలంలో కిషోర్ 22 సినిమాల్లో నటిస్తే వాటిలో 16 సినిమాలు ఫ్లాపులే. కిషోర్ గాయకునిగా మొగ్గు చూపడానికి ఇదొక కారణం. బిమల్ రాయ్ సొంత చిత్రం ‘నౌకరి’ (1954)లో కిషోర్ కుమార్ హీరోగా షీలా రమణి హీరోయిన్‌గా నటించారు. ఆ చిత్రానికి సలీల్ చౌదరి సంగీత దర్శకుడు. ఆ సినిమాలో కిషోర్ చేత పాడించేందుకు సలీల్ చౌదరి ముందు ఒప్పుకోలేదు. కనీస సంగీత పరిజ్ఞానం కిషోర్‌కు లేదనేదే సలీల్ చౌదరి అభియోగం. “అర్జి హమారీ ఏ మర్జి హమారీ” అనే సోలో పాటను సలీల్ చౌదరి అయిష్టంగానే కిషోర్ చేత పాడించాడు. ఆ పాట సలీల్ కు నచ్చడంతో హేమంత కుమార్ ఉషా మంగేష్కర్ తో పాడాల్సిన “చోటా సా ఘర్ హోగా” పాటను కూడా కిషోర్ తోనే పాడించారు. శంకర్ దాస్ గుప్త, శ్యామల్ మిత్రా తో కలిసి ఒక బృంద గీతాన్ని కూడా కిషోర్ ఈ సినిమాలో పాడారు. 1955-66 మధ్య కాలంలో కిషోర్ నటించిన లడ్కి, నౌకరి, బాప్ రే బాప్, పైసా హి పైసా, న్యూ ఢిల్లీ, నయా అందాజ్, భాయి భాయి, ఆషా, చల్తి కా నామ్ గాడి, దిల్ కా థగ్, చాచా జిందాబాద్, మన్ మౌజి, హాఫ్ టికెట్, మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే, గంగా కి లహరే, హమ్ సబ్ ఉస్తాద్ హై వంటి సినిమాలు విజయవంతం కావడంతో కిషోర్ కుమార్‌కు నటనపట్ల కూడా ఆసక్తి పెరిగింది. ‘పడోసన్’ సినిమాలో కిషోర్‌కు మంచి పేరొచ్చింది. మాలాసిన్హా, వైజయంతిమాల, నూతన్, మధుబాల, కుంకుం వంటి అగ్రశ్రేణి తారలతో అతడు హీరోగా నటించాడు. ‘హాఫ్ టికెట్’ సినిమాలో “ఆకే సీది లాగి దిల్ పే” అనే పాటను కిషోర్, లతాజీ లతో పాడించాలని సలీల్ చౌదరి ప్లాన్ చేశారు. ఈ పాటను ప్రాణ్ తో కలిసి తను ఆడవేషంలో వుండి పాడాల్సి వుండగా, లతా మంగేష్కర్ బొంబాయిలో లేకుండడంతో కిశోరే ఆడ, మగ గొంతుకతో ఈ పాటను పాడి సలీల్ చౌదరిని ఆశ్చర్యపరచాడు.

కిషోర్‌ను గాయకుడిగా మలిచిన సచిన్ దేవ్ బర్మన్ దా..

అన్న అశోక్ కుమార్ మొదటినుంచే కిషోర్‌కి హితబోధ చేస్తూ వచ్చారు. నేపథ్య గాయకుడిగా రాణించాలంటే తనదంటూ ఒక బాణీని ఏర్పరచుకోవాలి అనేది ఆ సలహా సారాంశం. బాంబే టాకీస్ వారు ‘మషాల్’ (1950) సినిమా నిర్మిస్తున్న రోజుల్లో సచిన్ దేవ్ బర్మన్ ఒకసారి అశోక్ కుమార్ ఇంటికి రావడం జరిగింది. కిషోర్ వేరే గదిలో సైగల్ పాడిన పాటను పాడుతూ వున్నాడు. బర్మన్ కిషోర్‌ని పిలిచి “బాగా పాడుతూ వున్నావు. కానీ సైగల్‌ను అనుకరిస్తున్నావు. ఇతర గాయకుల్ని అనుకరించి పాడేవాళ్ళు గొప్ప గాయకులు కాలేరు. నీ భవిష్యత్తు నీ చేతిలోనే వుంది” అని సలహా ఇచ్చి ప్రోత్సహించారు. దాంతో కిషోర్ బర్మన్‌దాకు ప్రియ శిష్యుడైపోయాడు. అతని వెంటే స్టూడియోలు తిరిగేవాడు. బర్మన్ కిషోర్‌కు పాటల మెళకువలు ఎన్నో నేర్పారు. కిషోర్ తన వాయిస్‌ని ఎంత బాగా మోల్డ్ చేసుకోగలడో బర్మన్ గ్రహించాడు. బర్మన్ దాదా పుణ్యమా అని దేవానంద్‌తో కిశోర్‌కు పరిచయమైంది. ఫిల్మిస్తాన్ నిర్మించిన ‘టాక్సీ డ్రైవర్’, ‘మునీంజీ’, ‘పేయింగ్ గెస్ట్’ సినిమాలకు, నవకేతన్ నిర్మించిన ‘బాజీ’, ‘ఫంతూష్’, ‘నౌ దో గ్యారా’ సినిమాలకు సచిన్ దేవ్ బర్మన్ సంగీత దర్శకుడు కావడంతో కిషోర్‌కు ఆ సినిమాల్లో పాటలు పాడే అవకాశం వచ్చింది. దాంతో గాయకుడిగా కిషోర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టాక్సీ డ్రైవర్ సినిమాలో కిషోర్ కుమార్ పాడిన “జీవన్ కే సఫర్ మే రాహీ” అనే థీమ్ సాంగ్‌కు లతాజీ కంటే కిషోర్ పాడిన పాటకే మార్కులు ఎక్కువ పడ్డాయి.

అప్పటికీ కొందరు సంగీత దర్శకులు కిషోర్‌కి శాస్త్రీయ సంగీతం రాదనే నెపంతో పెద్దగా అతన్ని ప్లేబాక్‌కు పిలిచేవారు కాదు. పైగా మహమ్మద్ రఫీ మంచి ఉచ్చదశలో ఉండడంతో కిషోర్‌ని నటననుండి దృష్టి మరల్చవద్దని అన్న అశోక్ కుమార్ సలహా ఇవ్వడంతో కిశోర్ ఒకప్రక్క వేషాలు వేస్తూనే ప్లేబాక్ పాడుతూ వచ్చాడు. కిషోర్ ప్రవేశించే నాటికే హేమాహేమీలైన తలత్ మెహమూద్, మహమ్మద్ రఫీ, మన్నాడే, ముఖేష్, మహంద్ర కపూర్ హిందీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఆ సమయంలో బాంబే టాకీస్ ద్వారా అశోక్ కుమార్ నిర్మించిన ‘జిద్దీ’ సినిమా విజయం కిషోర్‌కు లాభించింది. ఆ రోజుల్లో రాజ్‌కపూర్‌కు శంకర్-జైకిషన్ ద్వయం, దిలీప్ కుమార్‌కు నౌషాద్ ఆలి ఆస్థాన సంగీత దర్శకులు కావడంతో దేవానంద్ బర్మన్‌దాను ఎన్నుకున్నాడు. పరోక్షంగా అది కిషోర్‌కు లాభించింది. పైగా దేవానంద్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లు కావడంతో కిషోర్‌కు ప్రయోజనం చేకూరింది. ‘ఫంతూష్’ సినిమాలో “హై మేరె టోపీ పలట్ కే ఆ” అనే పాటకు స్వరాలు కూర్చింది సచిన్ దేవ్ కుమారుడు రాహుల్ దేవ్ బర్మన్. ఆ పాట హిట్టవడంతో కిషోర్ రాహుల్‌కి కూడా మంచి మిత్రుడైపోయాడు. దేవానంద్ ‘నౌ దో గ్యారా’ సినిమా ద్వారా తమ్ముడు విజయానంద్ (గోల్డీ) ని దర్శకుడుగా పరిచయం చేశాడు. గోల్దీకి మాత్రం దేవానంద్‌కు రఫీ చేత పాడిస్తే సినిమా బాగా ఆడుతుందని మనసులో వుండేది. కానీ దేవానంద్, బర్మన్ ఇద్దరూ కిషోర్ వైపే మొగ్గు చూపారు. అయితేనేం వారి అంచనాలను వృథా కానీలేదు కిషోర్. ‘ఆంఖోం మే క్యా జీ రుపెహలా బాదల్” అనే పాటను సిలోన్ రేడియోలో శ్రోతలు అదేపనిగా కోరేవారు. పడోసన్ (1968) చిత్రం ద్వారా పరిచయమైన సునీల్ దత్ ప్రోత్సాహంతో, అశోక్ కుమార్ ఇచ్చిన ధైర్యంతో కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ అందించిన ఆర్కెస్ట్రాతో షణ్ముఖానంద హల్లో కిశోర్ లెఖ్ఖలేనన్ని స్టేజి ప్రోగ్రాములిచ్చాడు. ఆ ప్రోగ్రాముల ద్వారా అటు ఖ్యాతిని, ఇటు డబ్బును మూటకట్టుకోగాలిగాడు. శక్తి సామంత పుణ్యమా అని త్వరలోనే రాజేష్ ఖన్నాకు ప్రీతిపాత్రమైన గాయకుడిగా ఎదిగాడు.

శాస్త్రీయ సంగీతం రాకుండా సంబాళించి..

కిషోర్ శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. అందుకే తన పరిమితులు తెలుసుకొని అందుకు తగ్గట్టుగానే నడుచుకునేవాడు. ‘పడోసన్’ చిత్రంలో “ఏక్ చతుర్ నార్” అనేది ఒక సంవాద గీతం. దానికి రాహుల్ దేవ్ బర్మన్ ఒక మంచి క్లాసికల్ ట్యూన్ సమకూర్చాడు. సినిమాలో మన్నాడే మహమూద్‌కు పాడితే, సునీల్ దత్‌కు కిషోర్ పాడాలి. అందులో మన్నాడే ఓడిపోవాలి. ఆ ట్యూన్‌ని మెహమూద్ కిషోర్ కు వినిపించాడు. కిషోర్ “అమ్మో ఈ క్లాసికాల్ ట్యూన్ పాడడం నావల్ల కాదు. నీకు కామెడీ పాట కావాలి అంతేకదా. నేను ట్యూన్ చేసి ఇస్తాను. రాహుల్ దేవ్ బర్మన్ కు నువ్వు నచ్చజెప్పు” అన్నాడు. తన అన్న అశోక్ కుమార్ నటించిన ‘ఝూలా’ లో “ఇక్ చతుర్ నార్” అనే పాట ఉంది. దాన్ని ఆధారం చేసుకొని ఒక ట్యూను అల్లాడు. ఆర్.డి. బర్మన్‌కి నచ్చజెప్పి దానికి ఆమోదముద్ర వేయించాడు. అంతవరకూ బాగానే వుంది. కానీ అసలు ఇబ్బంది ఇక్కడే మొదలైంది.. మన్నాడే రూపంలో! ఆయనేమో సంప్రదాయ సంగీతానికి విలువిచ్చే మనిషి. క్లాసికల్ సంగీతమంటే భక్తి ప్రపత్తులు మెండు. “నేను క్లాసికల్ పాడినా ఓడిపోవాలా. అది కూడా శాస్త్రీయ సంగీతంలో ఓనమాలు రాని కిషోర్ చేతిలోనా? నేను పాడను” అని తెగేసి చెప్పాడు. మెహమూద్ మన్నాడేని బ్రతిమిలాడాడు. సినిమా పాట కదా సీరియస్‌గా తీసుకోవద్దని నచ్చజెప్పాడు. అలా తెలివిగా గట్టెక్కాడు కిషోర్. ఆ పాట యెంత హిట్టయిందో చెప్పాల్సిన అవసరం లేదు.

కిశోర్ కుమార్ వ్యక్తిగత కార్యదర్శిని నిర్మాతగా పెట్టి కిషోర్ కొన్ని చిత్రాలు నిర్మించాడు. వాటిల్లో 1961 లో నిర్మించిన ‘ఝుమ్రూ’ సినిమాలో కిషోర్ హీరో, మధుబాల హీరోయిన్. సంగీతం సమకూర్చింది కిషోర్ కుమారే. సంగీతపరంగా ఈ చిత్రం గొప్పది. ముఖ్యంగా కిషోర్ గానం చేసిన “కోయి హమ్ దమ్ న రహా, కోయి సహారా న రహా”, “మత్ వాలే హమ్ మత్ వాలే తుమ్” పాటలు నేటికీ నిత్య నూతనాలే. ఇక ‘చల్తీ కా నామ్ గాడీ’ ఒక సంగీత హాస్యవల్లరి. అందులో సచిన్ దేవ్ బర్మన్ అందించిన సంగీతం న భూతో న భవిష్యతి. “ఎక్ లడ్కీ భీగీ భాగీ సీ” పాటలో మోటారు కారు పనిముట్లతో నేపథ్య సంగీతం సమకూర్చడం గొప్ప విశేషం. “బాబూ సమఝో ఇషారే”, “హాల్ కైసా హై జనాబ్ కా”, “మై సితారోం కా తారా” పాటలు వినని శ్రోతలు వుండరు. ఈ సినిమాలో నష్టం రావాలని, ఆ నష్టాన్ని ఇన్‌కంటాక్స్ లెఖ్ఖల్లో చూపాలనుకున్నాడు కిషోర్. కానీ ఆ సినిమా సూపర్ హిట్టై లాభాలను దూసిచ్చింది. ఇక ‘దూర్ గగన్‌కి ఛావ్ మే’ (1964), ‘దూర్ కా రాహీ’ (1971) సత్యజిత్ రే తీసిన విధంగా లాభాపేక్ష లేకుండా నిర్మించిన చిత్రాలు. కిషోర్ కుమార్ పాడిన వేలాది పాటల్లో వేటిని గురించి రాయకపోయినా అది తప్పిదమే అవుతుంది. ఒక ‘ఆరాధనా’, ఒక ‘కటీ పతంగ్’, ఒక ‘హాతీ మేరె సాథీ’, ఒక ‘అమర్ ప్రేమ్’, ఒక ‘గైడ్’, ఒక ‘జ్యూవెల్ థీఫ్’ ఇలా చెప్పుకుంటూ పొతే ఆ సినిమా పేర్లకు అంతేలేదు అన్నది నిత్య సత్యం.

ఛిద్రమైన వైవాహిక జీవితం..

కిషోర్ కుమార్‌కు మొత్తం నాలుగు పెళ్ళిళ్ళు. అతని సంసారిక జీవితం సాఫీగా సాగలేదనేందుకు ఇదే ఉదాహరణ. కిషోర్‌కి మొదట 1950లో బెంగాలీ గాయని, నటి రుమా గుహాతో వివాహమైంది. ఇద్దరూ ఎప్పుడూ పోట్లాడుకుంటూనే వుండేవారు. దాంతో వారి వివాహ జీవితం ఎనిమిది సంవత్సరాలకే మసకబారింది. రూమా భర్తను విడిచిపెట్టి కలకత్తా వెళ్ళిపోయింది.

‘చల్తీ కా నామ్ గాడీ’, ‘ఝుమ్రూ’, ‘హాఫ్ టికెట్’ సినిమాలలో కిషోర్ సరసన హీరోయిన్‌గా నటించిన మధుబాలను 1960లో కిషోర్ విచిత్రంగా రెండవ వివాహమాడాడు. అందుకు ఇస్లాం మతం స్వీకరించి కరీం అబ్దుల్ అని పేరు మార్చుకున్నాడు. అసలు మధుబాల, దిలీప్ కుమార్ ప్రేమించుకొనే రోజుల్లో వారిద్దరి మధ్య ప్రేమలేఖలు చేరవేసింది కిషోర్ కుమారే. అయితే ‘నయా దౌర్’ సినిమా నిర్మాణ సమయంలో హీరోయిన్‌గా వైజయంతిమాలను తీసుకోవడంతో దిలీప్‌తో మధుబాలకు వివాదం తలెత్తి ఇద్దరూ దూరమయ్యారు. అది కిషోర్ కుమార్‌కు లాభించింది. మధుబాలకు చిన్నతనంలోనే గుండెలో రంధ్రం  ఉండేది. అయితే దానికి వైద్యం అప్పట్లో లండన్‌లో కూడా లేదు. పైగా కిషోర్ ఆమె అనారోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. అయినా లండన్‌కు వెళ్ళారు. ప్రయోజనం లేకపోయింది. కిషోర్‌కు ఆమె మీద మోజు తగ్గింది. దాంతో మధుబాల పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆరోగ్యం క్షీణించి 1969లో చనిపోయింది. తరవాత 1976లో నటి యోగితా బాలిని కిషోర్ వివాహం చేసుకున్నాడు. ఆ వివాహబంధం కూడా రెండేళ్లకే విడిపోయింది. తరవాత యోగితా నటుడు మిథున్ చక్రవర్తిని వివాహమాడింది. 1980లో కిశోర్ కుమార్ నాలుగవ సారి నటి లీనా చందావర్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు కలిగారు. అమిత్ కుమార్ కూడా తండ్రిలాగే గాయకుడే. రెండవ వాడు సుమిత్ కుమార్. తల్లిదండ్రులు బ్రతికుండగానే కిషోర్ 13 అక్టోబర్ 1987 న కేవలం 58 ఏళ్ళకే తనువు చాలించడం బాధాకరం. అతని కళ్ళముందే భార్య మధుబాల మరణించింది. ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు కిషోర్ వయసు కేవలం 40 ఏళ్ళే.

మరిన్ని విశేషాలు..

కిషోర్ కుమార్ డబ్బు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేవాడు. ఒకసారి ఢిల్లీలో ఒక స్టేజ్ షో నిర్వాహకులు వేదిక ఎక్కే ముందు డబ్బు ఇస్తానని చెప్పి చేతులెత్తేశారు. కిశోర్ మైకు పుచ్చుకొని “పైసే లావో, జల్దీ లావో” అంటూ పాడడం మొదలెట్టాడు. జనానికి సంగతి అర్థమై గొడవచేయడంతో నిర్వాహకులు కిషోర్‌కి డబ్బులిచ్చి సర్దిజెప్పారు. సంగీత విభావరి సజావుగా సాగింది.

నిజజీవితంలో అన్నదమ్ములైన ముగ్గురు అశోక్ కుమార్, అనూప్ కుమార్, కిషోర్ కుమార్ వెండితెర మీద ‘చల్తి కా నామ్ గాడీ’ (1958), ‘బందీ’ (1957), ‘చల్తి కా నామ్ జిందగీ’ (1982) అనే మూడు హాస్యభరిత సినిమాలలో కలిసి నటించడం ఒక అపూర్వ సంఘటన.

కిషోర్ డబ్బు వసూలు చెయ్యడంలో దిట్ట. ఆర్.సి. తల్వార్ అనే నిర్మాత కిషోర్‌తో ‘మేమ్ సాబ్’ అనే సినిమా తీసి, కిషోర్‌కు ఎనిమిదివేలు బాకీపడ్డాడు. ఎన్నిసార్లు అడిగినా తల్వార్ డబ్బు ఇవ్వలేదు. ఒకరోజు ఉదయాన్నే కిషోర్ అతని ఇంటివద్దకు వెళ్లి, రోడ్డుమీద నిలబడి, “అరె ఓ తల్వార్ దేదే మేరే ఆఠ్ హజార్” అంటూ అరవడం మొదలెట్టాడు. జనం పోగయ్యారు. తల్వార్‌కు తలతీసినట్లింది. ఆ మొండిఘటానికి అలా బుద్ది చెప్పి డబ్బు వసూలు చేశాడు కిషోర్.

కిషోర్ నిర్మాతలను, దర్శకులను లెఖ్ఖ చేసేవాడు కాదు. ఒక దర్శకుడు కిషోర్ మీద షూటింగులో తను చెప్పినట్లు చెయ్యకుండా మాట వినడంలేదని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు తీర్పునిస్తూ, దర్శకుడు చెప్పినట్లు వినాలి అని కిషోర్‌కు ఆదేశాలు ఇచ్చింది. కిషోర్ “సరే” అన్నాడు. ఒకసారి కారు డ్రైవ్ చేసే సన్నివేశ చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు ‘కట్’ చెప్పలేదు. కిషోర్ ఆ కారు నడుపుకుంటూ బొంబాయి నుంచి ఖండాలా దాకా వెళ్ళిపోయాడు. వెంబడించిన దర్శకునికి “మీరు కట్ చెప్పలేదు కాబట్టి మీ మాట వినాలిగా” అంటూ కొంటె సమాధానమిచ్చాడు.

పిసినారిగా పేరు తెచ్చుకున్న కిషోర్ ఎన్నో గుప్త దానాలు చేశాడు. ఆ విషయం బయటకు తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన మరణానంతరం ఈ విషయాలు బయటపడ్డాయి. అలా గుప్తదానం అందుకున్న వారిలో తనను తొలి దశలో ప్రోత్సహించిన అరుణ్ కుమార్ ముఖర్జీ కుటుంబం ఒకటి. చిన్నతనంలోనే ఆతడు మరణించడంతో కిషోర్ ఆ కుటుంబానికి ప్రతి నెలా డబ్బు పంపేవాడు. అరుణ్ కుమార్ భార్య ఈ విషయం కిషోర్ మరణానంతరం చెప్పకపోయి వుంటే, అలాంటి గుప్తదానాలు బయటకొచ్చేవి కావు.

ముక్తాయింపు

కిషోర్ కుమార్ ఇక లేడు అనుకునప్పుడల్లా మనకు గుర్తుకొచ్చేపాట “ఖిలతే హై గుల్ యహాఁ ఖిల్ కే బిఖర్నే కో, మిల్ తే హై దిల్ యహాఁ, మిల్ కే బిఛడ్ నే కో”. పూలు పూస్తాయి.. పూసేది అవి చెదిరిపోవడానికే. హృదయాలు కలుస్తాయి. అవి కలిశాక విడిపోవడానికే. కిషోర్ నిజజీవితంలో ఇది ‘నిఝం’గా నిజం కదూ!..

Exit mobile version