ప్రింట్ మీడియా లోను, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ తనదైన ముద్ర వేసిన పాత్రికేయ సవ్యసాచి మంగు రాజగోపాలరావు (రాజగోపాల్) 10 జూలై, 1953 న విశాఖపట్నంలో జన్మించారు . శ్రీకాకుళంలో ప్రాథమిక విద్య అనంతరం విశాఖపట్నం, ఏ.వి.ఎన్. కళాశాలలో చేరి బీ.కాం. పట్టా పొందారు. చిన్నప్పటి నుంచీ తెలుగు భాషాసాహిత్యాలపట్లగల వల్లమాలిన అభిమానంతో హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడే కథారచనకు శ్రీకారం చుట్టారు. కళాశాల రోజులలోనే అప్పుడే ఆవిర్భవించిన ‘విశాఖసాహితి’ లో క్రియాశీలక సభ్యుడయ్యారు. ప్రముఖ రచయితలు అంగర వెంకట కృష్ణారావు, ఘండికోట బ్రహ్మాజీరావు, తర్వాత కాలంలో ప్రసిద్ధులైన ద్విభాష్యం రాజేశ్వరరావు, ఎస్.కాశీ విశ్వనాథం, నవులూరి వెంకటేశ్వరరావు లాంటి ఎందరో వర్ధమాన రచయితలు, ఈ వ్యాసకర్త కూడా, ఆ సంస్థలో అప్పట్లో సభ్యులుగా ఉండేవారు. ఆ సాహిత్యవాతావరణ ప్రభావంతో మరింత విస్తృతంగా కథలు, అప్పుడప్పుడు కవిత్వం వ్రాసారు. ఆ రచనలు ఆనాటి ప్రముఖ పత్రికలు ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రజ్యోతి’, ‘స్వాతి’, ‘తరుణ’, ‘వసుధ’, ‘అపరాధ పరిశోధన’ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
1975 లో హైదరాబాద్ నుండి వెలువడే ‘సినీ హెరాల్డ్’ వారపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరడం రాజగోపాల్ జీవనగమనంలో పెద్ద మలుపు. 1976 లో హైదరాబాద్, ‘ఈనాడు’లో చేరడంతో వారి మెయిన్ స్ట్రీమ్ పాత్రికేయ జీవితం ప్రారంభమైంది. ‘ఈనాడు’, ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రభూమి’, ‘ఆంధ్రజ్యోతి’, ‘సూర్యప్రభ’, ‘ఆదాబ్ హైదరాబాద్’ పత్రికలలో సబ్ ఎడిటర్ మొదలుకొని రిపోర్టర్, చీఫ్ సబ్ ఎడిటర్, న్యూస్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్, ఎడిటర్, చీఫ్ ఎడిటర్ హోదాలతో 2022 వరకు విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, విజయనగరాలలో 47 ఏళ్లపాటు వర్కింగ్ జర్నలిస్టుగా పాత్రికేయ జీవితం గడిపారు. ఆ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పవలసినది ‘ఆంధ్రభూమి’, విశాఖ ఎడిషన్ లో న్యూస్ ఎడిటర్ గా 1988లో పత్రికారంగంలోనే వినూత్న ప్రయోగమైన చిన్న పత్రికల ఆవిర్భావానికి అంకురార్పణ చేయడం. జిల్లా వార్తలన్నీ ఒకే చోట టాబ్లాయిడ్ సైజులో పెద్ద పత్రికతో పాటు విడిగా ‘ఆంధ్రభూమి అనుదిన అనుబంధం’ పేరుతో ఇవ్వడం ప్రారంభించారు. కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల వరకే పరిమితమైన ఈ ప్రయోగం అఖండ విజయాన్ని సాధించి, మిగతా పత్రికలకు ట్రెండ్ సెట్టర్ గా మారింది. అంతేకాదు. ‘ఆంధ్రభూమి’, విశాఖ ఎడిషన్ లో ఇలాంటి ప్రయోగాలు మరికొన్ని చేసారు.
అప్పటిదాకా కథలు, నవలల రచనలకు మాత్రమే పరిమితమైన ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తిని ఒప్పించి, ‘కృష్ణశబ్దం’, మనో వైజ్ఞానిక నిపుణుడు బి.వి.పట్టాభిరాం చేత ‘జగమే మాయ’ అనే వీక్లీ కాలమ్స్ వ్రాయించారు. చాలా కాలం ‘ఈనాడు’ లో ‘కథన కుతూహలం’ ప్రదర్శించి, తర్వాత అస్త్ర సన్యాసం చేసిన భమిడిపాటి రామ గోపాలం (భరాగో) చేత మళ్లీ కలం పట్టించి అదే శీర్షికని తిరిగి ప్రారంభింప చేసారు. మొదట కాళీపట్నం రామారావు, తర్వాత ముద్దంశెట్టి హనుమంతరావుల చేత ‘నేటి కథ’ శీర్షికని నిర్వహింపజేసారు. ఎందరో క్రొత్త కథకుల కలం పదును పెరగడానికి అది దోహద పడింది. ఆ విధంగా నాటి “ఆంధ్రభూమి”, విశాఖ ఎడిషన్ సాహితీ పరిమళాలు కూడా వెదజల్లుతూ పాఠకుల ఆదరణ చూరగొంది.
‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుబంధంలో రాజకీయ సంఘటనల ఆధారంగా నాయకులని వారి పేర్లతోనే సంబోధిస్తూ ‘సరదాకి’ శీర్షిక పేరిట రాజగోపాల్ సంధించిన వ్యంగ్యాస్త్రాలు పాఠకుల విశేషాదరణకు నోచుకున్నాయి.
‘ఆ వ్యాసాలు పుస్తకంగా వచ్చినప్పుడు బాపు ముఖ చిత్రం వేయడం, ముళ్లపూడి వెంకటరమణ ముందుమాట సంతరించడంతో జన్మ ధన్యమైంద’ని రాజగోపాల్ అంటారు. అలాగే హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరంలో కూడా ‘సరదాకి’ పుస్తకావిష్కరణ సభలు జరగడం, విశాఖపట్నం సభలో కాళీపట్నం రామారావు గారు ‘సరదాకి’ ఆవిష్కరించి, ఆ పుస్తకానికి తమ ‘కథానిలయం’లో చోటు కల్పిస్తానంటూ అడిగి రెండు ప్రతులు తీసుకోవడం తన జీవితంలో మర్చిపోలేని సంఘటనలుగా వారు భావిస్తారు.
ప్రింట్ మీడియాతో ఆగిపోకుండా అప్పుడప్పుడే వర్ధిల్లుతున్న ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రాజగోపాల్ అడుగుపెట్టారు. హెచ్. ఎం. టీ.వీ.లో అసోసియేటెడ్ ఎడిటర్ గా చేరి , ‘సరదాకి’, ‘తింగరి బుచ్చి’, ‘దిబ్బ రాజ్యం’ యానిమేటెడ్ వ్యంగ్య శీర్షికలు నిర్వహించారు.
తెలుగు విశ్వవిద్యాలయం వారు 2009 లో వారికి ఉత్తమ హాస్య రచయిత అవార్డు ప్రదానం చేసారు. ముగ్గురు ముఖ్యమంత్రుల చేత పాత్రికేయుడుగా సత్కారాలు పొందిన ఘనత రాజగోపాలరావు గారిది. అవే, శ్రీకాకుళం జిల్లా స్వర్ణోత్సవాల సందర్భంగా 2000 సంవత్సరంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల నుండి ఉత్తమ జర్నలిస్టు అవార్డు. 2016లో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుచే రవీంద్రభారతిలో సత్కారం. 2022లో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అందించిన వైఎస్సార్ జీవన సాఫల్య అవార్డు.
సార్ధక పాత్రికేయ జీవితానికి స్వస్తి పలికి రాజగోపాల్ ప్రస్తుతం స్వంత ఊరు విశాఖపట్నంలో స్థిరపడి, విశ్రాంత జీవనం గడుపుతున్నారు.