Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద్యం గెలుచుకున్న ‘తెల్ల కాగితం’..!!

[కొల్లూరి సోమ శంకర్ రచించిన ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ కథా సంపుటిలోని ‘తెల్ల కాగితం’ అనే కథని సమీక్షిస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

దిగువ మధ్యతరగతి కుటుంబాలు, వారి స్థితిగతులు, వారి జీవన శైలి ఎలా వుంటుందో నేను బాగా ఎరిగినవాడిని. అంతేకాదు స్వయంగా అనుభవించినవాడిని. చిన్నతనంలోని నా జ్ఞాపకాలను, ఇదే నేపథ్యంతో, ‘తెల్ల కాగితం’ అనే కథ రాసి నాకు గుర్తుచేశారు సాహితీమిత్రులు, కథా రచయిత, వ్యాసకర్త, సమీక్షకులు, మంచి అనువాదకులు శ్రీ కొల్లూరి సోమ శంకర్ గారు.

‘తెల్ల కాగితం’.. అనే ఈ చిన్న కథ ఈనాటిది కాదు, 2008 మార్చి నాటిది. ‘పొద్దు’ అనే వెబ్ పత్రిక కోసం రచయిత శ్రద్ధగా రాసిన కథ ఇది. ఇలాంటి జీవితాలు ఇంకా మన సమాజంలో ఎన్నో వున్నాయన్న విషయం ఒప్పుకోక తప్పదు.

ఈ కథ చదవగానే నాకు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నా పాక్షిక హైస్కూల్ జీవితం గుర్తుకు వచ్చింది. అంతమాత్రమే కాదు స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారి కథ ‘సెకెండ్ హ్యాండ్’ కూడా గుర్తుకు వచ్చింది. ఈ కథలన్నీ పేదరికం తోనే ముడిపడి వున్నాయి. చదువుకోడానికి టెక్స్ట్ బుక్స్ లేకపోవడం, రాసుకోవడానికి నోటుబుక్, పెన్సిల్ సైతం లేకపోవడం; అయినా చదువుకోవాలనే ఆరాటం, లేనితనంతో సంఘర్షణ, మానసికంగా, ఊహించని వ్యథలు ఆ బడిపిల్లల్లో.

‘తెల్ల కాగితం’.. అనే కథలో ఒక బడి పిల్లవాడి దీనగాథ రచయిత చక్కగా వివరించారు. ఒక తెల్ల కాగితం కొనలేని స్థితిలో తండ్రి, పాత పుస్తకాల వేటలో తల్లి, దొరకని లెక్కల పుస్తకం మాష్టారు దగ్గర తీసుకుని మొత్తం నోట్ బుక్‌లో తల్లి కాపీ చేసి ఇవ్వడం వంటి సంఘటనలు చదువరికి కన్నీళ్లు తెప్పిస్తాయి.

ఇక అసలు కథలోకి వస్తే, ఆ పిల్లవాడు కటిక పేదవాడు. ఒక పూట కూడా సరైన తిండిలేనివాడు. పాత పుస్తకాలతో ఏదోలా కాలం గడిపేస్తున్న తరుణంలో, ఒక రోజున తన తెలుగు మాస్టారు ఒక బాంబు పేల్చారు. అదేమిటంటే, త్వరలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, తనిఖీకి వస్తున్నారని, అనుకోని రీతిలో ఆయన వ్యాసం రాయమనొచ్చని, అందుచేత పిల్లలందరూ పుస్తకాలతో పాటు ఒక ఠావు తెల్లకాగితం తెచ్చుకోవాలని క్లాసులో ప్రకటన చేశారు. దీనితో కుర్రాడు అయోమయంలో పడ్డాడు. తన దగ్గర ఉన్నవన్నీ ఒక సైడ్ రాసేసిన కాగితాలే! అతి కష్టం మీద తండ్రికి చెప్పిచూసాడు. తెస్తానని ప్రతిరోజూ గడిపేస్తున్నాడు తండ్రి. చివరికి ఇష్టం లేకపోయినా తానూ పనిచేసే ఆఫీసు నుండి ఒక తెల్ల కాగితం తెచ్చి ఇస్తాడు తండ్రి.

తెల్ల కాగితం చేతికి వచ్చినా ఇక్కడ ఒక మలుపు తిరిగింది కథ! ఆ రోజు రానే వచ్చింది. తెలుగు మాస్టారు హడావిడిగా క్లాస్‌కి వచ్చి, పిల్లలందరూ తెల్లకాగితం తెచ్చుకున్నారో లేదో అని ప్రశ్నించారు. అందరూ తెచ్చుకున్నామని చెప్పారు మన హీరో కుర్రాడు తప్ప!

తెల్ల కాగితం తెచ్చుకొనేందుకు నాలుగు పీకి, పేపర్ ఎందుకు తేలేదో చెప్పమని అడిగారు.

నిజానికి తాను తెల్ల కాగితం తెచ్చుకున్నానని, కానీ తనకంటే దరిద్రం అనుభవిస్తున్న కుర్రాడు, తెల్ల కాగితం తెచ్చుకొనేందుకు ఏడుస్తుంటే, తన దగ్గర ఉన్న తెల్లకాగితం ఆ అబ్బాయికి ఇచ్చేశానని చెబుతాడు. ఇది విన్న తెలుగు మాస్టారు కొంచెం బాధపడతారు.

ఈలోగా, హెడ్మాస్టారు ఇన్‌స్పెక్టరుగారిని తీసుకుని క్లాసులోకి వస్తాడు. ఆయన వ్యాసం రాయమనడు గాని, ఒక తెలుగు పద్యం చెప్పమంటాడు. అప్పుడు మన హీరో కుర్రాడు లేచి వాళ్ళమ్మ ఎప్పుడో నేర్పిన ఆ పద్యం అనర్గళంగా చెప్పేస్తాడు. అది ఇన్‌స్పెక్టర్‍తో పాటు తెలుగు మాస్టారికి కూడా చాలా సంతోషం కలిగిస్తుంది. తర్వాత ఆ తెలుగు మాస్టారు మన హీరో కుర్రాడుకి రెండు తెల్లకాగితం పుస్తకాలు బహుమతిగా ఇస్తారు. కథ చదువుతున్నంత సేపు పాఠకుడికి చెప్పలేని బాధ కలుగుతుంది.

ఈ కథ చదవగానే ఎనిమిదవ తరగతిలో నాకు జరిగిన అవమానం గుర్తుకు వచ్చింది. సెకండ్ తెలుగు బదులు సంస్కృతం తీసుకున్న పదిమంది మగపిల్లలను, ఆడపిల్లలు వుండే ఏ-సెక్షన్‍లో వేశారు. అందులో నేనూ వున్నాను. డ్రాయింగ్ పిరియడ్ వచ్చింది.

హన్మంతరావు అనే డ్రాయింగ్ మాస్టారు ఉండేవారు. ఆయన ఎక్స్-సర్వీస్ మేన్. జిల్లాలో మొదటి వితంతు వివాహం చేసుకున్న వ్యక్తి, స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన క్లాసుకు వచ్చి, బోర్డు మీద బొమ్మ వేసి, అందరినీ తమ తమ డ్రాయింగ్ పుస్తకాల్లో గీయమన్నారు. అందరు డ్రాయింగ్ వేస్తున్నారు, నేను తప్ప. ఎందుకు వేయడం లేదని సైగ చేశారు. పెన్సిలు లేదని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను బెంచి ఎక్కించి చెంప చెళ్లుమనిపించారు. ఆడపిల్లలు ఘొల్లున నవ్వారు. ఆయన కొట్టిన దెబ్బ కంటే, ఆడపిల్లలు నవ్వినందుకు విపరీతమైన బాధ, సిగ్గు కలిగాయి.

ఈ ‘తెల్ల కాగితం’ అనే కథ, శ్రీ కొల్లూరి సోమ శంకర్ రచించిన ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ కథా సంపుటిలోని ఎనిమిదవ కథ, 67వ పేజీలో వుంది. కొల్లూరి కథలు సహజంగా ఉంటాయి, నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు గుర్తుచేస్తాయి. ఆయన రచన శైలి చదివించేలా ఆసక్తికరంగా ఉంటుంది.

మరి మీరూ ఈ కథా సంపుటిలోని కథలన్నీ చదివి చూడండి.

***

ఆహ్లాదపురం ఆరో వీధి (కథలు)
రచన: కొల్లూరి సోమ శంకర్
ప్రచురణ: పొదరిల్లు పబ్లికేషన్స్, సుళ్ళూరుపేట
పేజీలు: XIV + 128
వెల: ₹ 150/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్,
కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 9000413413
~
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/collections/translations/products/aahlaadapuram-aaro-veedhi

Exit mobile version