[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘ఎత్తులు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఎత్తులతో ఎత్తులకెదగాలనే
తుచ్ఛ తృషకు మితి లేదు!
దినాలు బంగరు దీనారాలను పొదగాలనే
దురాశలకు పరిమితి లేదు!
అవధి లేని
ఆశల జంజాటాల ఒత్తిడి,
వ్యవధి లేని
విధుల నిర్వహణల ఉరవడి..!
తన సంక్లిష్ట తంతువుల వలలో
తానే బంధింపడే సాలియలా
స్వయంకృత సమస్యల వలయం
తననే బిగించేలా సాగుతున్న
నవీన కాల నరుని నడవడి!
ఎత్తులకెదిగేందుకు
తహతహలాడే వారికిప్పుడు
ఆర్థిక అభివృధ్ధే ముఖ్యం!
శారీరిక సౌఖ్యమే ముఖ్యం!
మదినిండా మాయ లౌక్యం!
హేయ లౌల్యం!
వీరికి బంధాలన్నీ
కాకి బంగరు అలంకరణాలు!
వాడి వర్జింపదగిన ఉపకరణాలు!
ఎత్తులకు ఎదిగే చాతుర్యంతో పాటు
ఎత్తులను నిలుపుకునే
చాకచక్యమూ ప్రధానం!
ఉన్నత దశ నుండి
ధరకు కూలే పరిస్థితి
అతి దారుణంగా ఉంటుందనే
ఆలోచనా రాహిత్యం అవిజ్ఞానం!
ఉత్థానానికి ప్రశంసలు అల్పం!
పతనానికి నిందలు అనేకం!
నింగిని తాకేలా
ఎదిగినా, ఎగిరినా
పుడమిని మరువ కూడదని
చెట్టు ప్రకటిస్తుంది!
పిట్ట ప్రవచిస్తుంది!
పిచ్చి గాలికి రేగి
భువన విహారం చేసి
కడకు భూమిపై పడే
ధూళి వంటి కీర్తికి
ఎగతాళి అగచాట్లు తప్పవు!
ఎత్తి పొడుపుల పోట్లు తప్పవు!
జనుల జయ జయ ధ్వానాల పల్లకీలో
తారా పథానికి చేరి
నిలుకడగా నిలిచే ఖ్యాతి
ధృవ తారా జ్యోతి!
విజ్ఞాన కౌశల్యంతో పాటు
మనిషి సౌశీల్యమూ వర్ధిల్లడం శ్రేష్ఠం!
మానవత్వాన్ని మంటగలిపిన
డొల్ల మనిషి
నింగిలో సంచరిస్తూ నిక్కడం నికృష్టం!
ఉన్నత శిఖరాలను అందుకోవాలనే ఆశయం అభినందనీయం!
ఉచ్చస్థానంలో ఉంటూ
క్రింది వారిని కించబరచడం
అమానవీయం!
దివికి చేరలేక,
భువికి దిగలేక
త్రిశంకు స్వర్గంలో చిక్కి చింతించే
మధ్య తరగతి మనో వ్యథలు కోకొల్లలు!
పై స్థాయిని పొందేందుకు,
వృద్ధిని స్థిరపరచుకునేందుకూ
కాని కార్యాలను చేస్తూ
కాపురుషులుగా మారే
లోకులకుండవు
నీతి నియమాల ఎల్లలు!
నేలబారు బ్రతుకుకే అంకితమై
దుర్గతులను వహిస్తూ,
ఆశల చితులను హమేషా దహిస్తూ
స్వప్న దేవత కరావలంబనతో
అప్పుడప్పుడూ స్వేచ్ఛగా
ఆనందాంబర వీధుల్లో విహరిస్తూ
మేల్కొన్న వెంటనే
కష్టాల కటికి నేలపై తేలే
అధోజగజ్జనుల కలలన్నీ కల్లలు!
మేటి ఎత్తుల పొత్తులు
ఎల్లరికీ ప్రాప్తించాలి!
సమస్త మానవ సంఘం
శుభాలతో దీప్తించాలి!
