Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము

కన్నడంలో కె. ఉషా రై రచించిన ‘అళిసి హోద మమతెయ పుటగళు’ అనే కథని అనువదించి తెలుగులో అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.

“అమ్మా, ఇంతకు పూర్వం మీ ఇంటి ప్రక్కనే ఉండేవారు కదా. వాళ్ల పెద్దబ్బాయి పాపం చనిపోయాడట,” వంట మనిషి చేరవేసిన వార్త నన్ను కృంగదీసి విస్మయానికి గురి చేసింది.

“ఎవరే? అమెరికాలో వున్నవాడా?” నా స్వరం నాకే తెలియకుండా లోలోతుల నుండి వచ్చింది.

“ఉండాలి. అమ్మగారూ. అక్కడ చాలా మంది గుమిగూడి వున్నారు. వాళ్లింట్లోని ముసలామె చనిపోయుండొచ్చనుకున్నా నేను. ఆమె మీ కన్నా పెద్దది కదా! వాళ్లింటి పనిమనిషిని అడిగితే, ఆ ముసలమ్మ కాదు, ఆమె కొడుకు” అని చెప్పింది. “ఆయమ్మకు ఇంకో కొడుకున్నదీ నాకు తెలీదు.”

ఈ సంగతి తెల్సింతర్వాత నా కడుపులో దేవినట్టయ్యింది. చావడానికి సిద్ధంగా వుండే ముసలివాళ్లు జీవించి వుండగా, మధ్య వయసు పిల్లల్ని ఇలా లేకుండా చేయటం… ఆ విధి పైన విపరీతమైన కోపమొచ్చింది నాకు.

ఈ జీవనం చాలయ్యా, అని డీలాపడి కూర్చున ముసలివాళ్లని వదిలేసి, జీవితంలో పై మెట్లని ఎక్కిపోతున్న పిల్లల్ని ఇలా… హఠాత్తుగా ఎత్తుకొని పోవటం… ఇది ఎల్లాంటి న్యాయం?

ఎన్నో ఏళ్లుగా ఇరుగు పొరుగు వాళ్లుగా వుండటం చేత, మా కళ్ళెదుట పెరిగిన అబ్బాయి… చిన్నప్పట్నుంచీ చూసా వాణ్ణి. ఇప్పుడు వాడికి ఎక్కువుంటే నలభై ఐదేళ్లు. మా పెద్దవాడి వయసు వాడు. చనిపోయే వయసా ఇది. బిషప్ కాటన్ స్కూల్లో 12వ తరగతి ముగియగానే అమెరికాకి వెళ్లాడు. చాలా ముందుండే వాడు చదువులో. తన కొడుకు తెలివితేటల్ని తెగ మెచ్చుకుంటూ వుండే తల్లి.

అమెరికాలోని ఓ యూనివర్సిటీలో సీటు దొరికి, అక్కడికి వెళుతున్నాడంటే కన్నవాళ్ల సంబరమే సంబరం. తమ కొడుకులాంటి బుద్ధిమంతుడు ఇంకొకడు లేడనేంతటి గర్వం వారిది. స్వాభావికమే ఇది ఎవరికైనా. మూడు దశాబ్దాల క్రితం, విద్య కోసం స్వదేశాన్ని విడిచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా వుండేది. ఇటీవల ఈ పదునైదేళ్లలో, అందరి ఇళ్ల నుంచి, ఆడ, మగ అనే తేడా లేక ఒక్కరైనా అలా వెళుతున్నారు. కొందరి ఇళ్లల్లో నైతే, ఇద్దరే వున్నా, ఆ ఇద్దరూ విదేశాలకు వెళుతున్నారు చదువు నిమిత్తం. తమ ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్‌లు సంపాదించుకొని కష్టపడి డిగ్రీలను సంపాదించుకుంటున్నారు. భారతీయులు బుద్ధిమంతులు అనే కీర్తి సంపాదించుకుంటున్నారు. కొందరక్కడే సెటిల్ అయిపోతున్నారు. అయితే ఇది ఇంకో విధంగా బ్రెయిన్ డ్రైన్ లాగా అయిపోతున్నది గదా అనే ఓ విమర్శ కూడా వుంది.

పుట్టిన గడ్డపై మమకారాన్ని తెంపుకోలేని వారు, కన్నవారిని మరువలేని వారు, ఏడాది కొకసారైనా వచ్చి తమ ఆశ తీర్చుకోని తిరిగి వెళ్లిపోతున్నారు.

ఆ అబ్బాయి కిరణ్, అలానే అమెరికాకి పోయినవాడు. మన దేశానికి తిరిగి వచ్చింది ఆరేళ్ల తర్వాత. తన గ్రాడ్యుయేషన్ ముగించుకొని చేతిలో డిగ్రీ పుచ్చుకొని ఆమెరికాకి వెళ్లేటప్పుడు నూనూగు మీసాల పద్దెనిమిదేళ్ల వాడు. ఆరేళ్ల తర్వాత ఓ సుందర నవయువకుడు లాగా వచ్చాడు. ఆ ఆరేళ్లలో వాడి రంగు రూపులే మారిపోయి వుణ్ణింది. ద్రిష్టి తగిలేలా వుండేవాడు. అందరి ఆడపిల్లల కళ్లన్నీ వాడి మీదనే వుండేవి. అచ్చం అమెరికన్ లాగానే తయారయ్యాడు. వచ్చేటప్పుడు ఎపాయింట్‍మెంట్ ఆర్డర్‌ని చేతిలో పెట్టుకునే వచ్చాడు. అక్కడే ఓ కంపెనీలో జాబ్ దొరికింది. తమ కుమారుని గూర్చి ఎంత చెప్పినా తనివి తీరలేదు కన్నవాళ్లకి. కంటే ఇల్లాంటి కొడుకునే కనాలి అని చూచేవాళ్లకి ఆశ పుట్టించే తీరున వుండేవాడు. వాడి కులపు ఆడపిల్లలు వాణ్ణి చేసుకోవడానికని క్యూ కట్టి వుండేవాళ్లు. వాళ్లల్లో ఒకళ్లని వీడు వరించటమే ఆలస్యం. ఎవర్నో ఒకర్ని చేసుకొని అమెరికాకు పోరా అని అమ్మానాన్నా ఎంత చెప్పినా వాడు ఒప్పుకోలేదు.

ఓ నెలరోజులున్నాడు. అంతే తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. తాను సాధించిన దాన్ని నెమరువేసుకుంటూ వుండేలోగానే అమ్మనాన్నను విడిచి వెళ్లిపోయాడు.

వాడి తోబుట్టువులు వాడి వలె బుద్ధిమంతులు కాకపోయారు. తమ్ముడు డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయాడు. చెల్లెలు డిగ్రీ పాస్ చేసి ఓ బ్యాంక్‌లో ఉద్యోగం సంపాదించింది. ఇక్కడున్న ఈ కొడుకును చూచి కన్నవాళ్లు “ఓరేయ్ ఓ పర్సెంట్ బుద్ధి నీకూ వున్నట్లయింతే నీవూ వాడిలాగే అమెరికాకి వెళ్లిపోయి వుండేవాడివి కదరా” అని అనేవాళ్లు. “ఔనౌను. వాడిని అమెరికాకి పంపించడానికి మీరు చేసిన అప్పులు ఇంకా మిగిలే వున్నాయి. నేనూ వాడిలాగే వెళ్ళివుంటే ఈ ఇంటిని అమ్మేయాల్సి వచ్చేది – ఉండటానికి ఈ ఇల్లైనా వుంది – లేకుంటే ఇదీ వుండేది కాదు. ఇప్పుడు ఈ ఇంట్లో నేను మీ దగ్గరే ఉన్నాను. ఎవరైనా ఒకరుండాలి కదా మీ తోటి” అనేవాడు రెండో కొడుకు.

వాడన్నది నూటి నూరుపాళ్లు నిజం. వృద్ధాప్యంలో వీడే వారికి ఊతకర్ర. ఆ కూతురు ఇక ఎంత కాలం ఈ ఇంట్లో వుండగలదు? ఈ విషయం తెలిసి వచ్చేది చాలా ఆలస్యంగానే.

అప్పుడప్పుడు వచ్చిపోతున్న కిరణ్, అక్కడే ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అంతా అయ్యాక తెలియజేశాడు కన్నవాళ్లకి. అప్పుడు వాళ్లు పొందిన నిరాశను నే చూశా. ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు, కొడుకిలా మారిపోవటం చూచి, చాలా ఆవేదనకు గురి అయ్యారు. కూలిపోయాయి వాళ్లు కట్టుకున్న ఆశాసౌధాలన్నీ.

వివాహమైన ఒకటిన్నర సంవత్సరాల తర్వాత భార్యాభర్తలిద్దరూ బిడ్డనెత్తుకొని వచ్చారు. వచ్చిన వాళ్లు హోటల్‌లో విడిది చేశారు. ఇంటికే రాకపోయారు. భారతదేశపు ముఖలక్షణాల తోటి, అమెరికా శరీరరంగుతోటి పిల్లవాడు. తమ ఎడద లోతుల్లోనే తమ బాధను అదిమి పెట్టుకొని, తెచ్చిపెట్టుకున్న సంతోషం తోటి మనుమనితో కొన్ని రోజులు కాలం గడిపారు. ఇది వరకు లాంటి కొడుకుగా లేడు కిరణ్. వారి మధ్య సంబంధంలో ఏదో శూన్యత.

అంతే అదే ఆఖరిసారిగా వాడు భారతదేశానికి రావటం.

కన్నవాళ్లు ఓసారి అమెరికాకి పోయివచ్చారు. అయితే అక్కడ జరిగిన దేమిటో తెలియదు. కన్నవాళ్లు కొడుకుకి దూరమయ్యారు. ఇద్దరి మధ్యా సంపూర్ణంగా బంధం తెగిపోయింది. కన్నవాళ్ల వ్యథ కన్నవాళ్లకి మాత్రమే తెలుస్తుంది. వాడి గురించి ఇతరులతో మాట్లాడటమే నిల్పివేశారు. వాడంటే తమకున్న గర్వాన్ని మమకారాన్ని అన్నింటినీ మర్చిపోయారు. రానురాను కొడుకు మీద తమకుండిన అన్ని రకాల జ్ఞాపకాల పుటలలోని అక్షరాలన్నీ చెదరిపోయాయి తమకు తెలియకుండానే.

ఎవరు ఏమైనా కాలచక్రం మాత్రం గిర్రున తిరిగి పోతుంటుంది. ఇక్కడున్న కొడుక్కి, తమకు తెల్సిన వారింట పిల్లనే ఎంపిక చేసి పెళ్లి చేశారు. ఈ రెండో అబ్బాయి వద్దనే వుండటం వారికి కొంచం ఊరట అనిపించింది. వాడికొక బిడ్డ కూడాను. కూతురుకి వివాహమై ఆమె తన భర్త ఇంటికి వెళ్లిపోయింది. చూచి గర్వపడదామనే కొడుకు దూరమైనప్పుడు, దగ్గరున్న సామాన్యమైన కొడుకే ప్రీతికరమయ్యాడు.

చదువు… కన్నవారి నుంచి దూరం చేసే ఈ చదువుల వలన ప్రయోజనం ఏమిటి? ఈ చిన్నవాడు, వాడికదే చదకపోయిందీ మంచిదే అయ్యిందని మౌనంగా ఓ రాజీకి వచ్చేశారు.

చూస్తూండగానే వాళ్లు ముసలవాళ్లయిపోయారు. మేమూ ముసలి వాళ్లమైపోయాం. కారణాలంతరాల వల్ల మేము ఆ యింటిని వదలి ఓ అద్దె ఇంటికి వచ్చేశాం. ఆ కారణంగా వాళ్ల తోటి ఎక్కువగా సంపర్కం లేకపోయింది.

నా మనసిలాగ పరిపరి విధాలుగా – ఆనాటి సంగతులని నెమరు వేసుకుంటూ వుండగా, నా కొడుకు వచ్చి చిన్నబుచ్చుకుని “అమ్మా కిరణ్ అమెరికాలో… చనిపోయాడట” అన్నాడు.

“ఔన్రా. తెలిసింది. జయమ్మ చెప్పింది. నీ కెలా తెల్సింది? ఎలా పోయాడట?”

“నాకూ ఇప్పుడే తెల్సింది. నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. వాడు, కిరణ్ బిషప్ కాటన్ స్కూల్లో క్లాస్‌మేట్స్‌ట… కార్ యాక్సిడెంట్లో…”

ఎంతటి ఘోరం, మా కళ్లెదుట పెరిగి పెద్దవాడైన మధ్య వయసు పిల్లవాడు. మాకే ఇంతటి దఃఖాన్ని కలిగిస్తూంటే ఆ కన్నవాళ్ల స్థితి ఎలా వుండాలి. ఆ రోజంతా వాడి గురించే నా ఆలోచనలన్నీ.

మధ్యాహ్నం తిరిగి వచ్చాక మా అబ్బాయి అన్నాడు, “అమ్మా నేను వాళ్లింటికి వెళ్లా, కిరణ్ తమ్ముడు చెప్పాడు… కార్ యాక్సిడెంట్… వాడు డ్రైవ్ చేస్తున్న స్పీడ్‌కి ఆన్ ది స్పాట్ ప్రాణం పోయిందని. ఎవరైనా అమెరికాకి వెళుతున్నారా, లేదంటే బాడీని ఇక్కడికే తీసుకొస్తున్నారా అని అడిగితే వాళ్లిచ్చిన సమాదానంతో నే షాక్ అమ్మా. ఎవరూ అక్కడికి వెళ్లరట. బాడీని కూడా ఇక్కడికి తీసుకురారట. వాటికి రెండు పెళ్ళిళ్లు అయినా రెండూ డైవర్సేనట. ఇద్దరు పిల్లలున్నా ఎవళ్లూ వీడి వద్ద లేరట.”

“ఎవరూ లేక ఆ బాడీని ఏం చేస్తారట. వాడి అమ్మా నాన్నలు ఎలా దీన్ని….”

“అమ్మా! నేను వాళ్ల ఇంట్లోకి వెళ్లలేదు. ఆ తండ్రిని ఓదార్చే నాథుడే లేడు. తల్లి ఎలాగో కంట్రోల్‌లో వుంది. ఏం చేసేది? వాడు మా నుంచి దూరమై ఎన్నో ఏండ్లు గడిచిపోయింది. అక్కడ దూరపు బంధువు ఒకాయన వున్నాడు. ఆయన వెళ్లి బాడీని హాండ్ ఓవర్ చేసుకుని, వాళ్లే లాస్ట్ రైట్స్ కూడా ముగించేస్తారట.” అన్నాడు ఆ కిరణ్ తమ్ముడు. అది వినగానే నాకు కడుపులో దేవినట్టయింది. అమ్మా నాన్నలు వుండీ, తమ్ముడూ చెల్లెలూ వుండి అనాథలాగా – ఇది ఎంతటి దుర్విధి! ఎక్కవ మాడ్లాటలేక అక్కణ్ణుంచి వచ్చేశా. నేను దీన్ని జీర్నించుకోలేకపోతున్నా.”

“ఔను, ఔట్ ఆఫ్ సైట్, ఔట్ ఆఫ్ మైండ్” – అనేది నిజమే అయివుండాలి. కన్నవాళ్లతో కన్న కొడుకు బంధాలే తెగిపోయాయి.

‘పేగు బంధాన్ని తెంపివేసుకోవటం అంత సులభమా!’ఎవరూ పోకపోవటం, బాడీని ఇక్కడికి తీసుకురాకపోవటం అనే విషయాన్ని నా కొడుకు ఒప్పుకోలేకపోయాడు. తొమ్మిది నెలలు మోసి, పెంచి పెద్ద చేసి ప్రీతి అనురాగాలు పంచి పెట్టి, వాడి ఔన్నత్యాన్ని చూచి గర్వపడిన మనసు అంత త్వరగా దూరమవుతుందా? ఎలా? మృతదేహాన్ని సహితం చూడకపోవటమనేది ఎలా సాధ్యం? అని నాలోనే అనుకున్న మాటల్ని విన్నట్లుగా మా వాడు “బహుశా వారికి వీసా వుందో లేదో మమ్మీ” అన్నాడు. “ఇల్లాంటి సందర్భాల్లో ఎమర్జెన్సీ వీసా దొరుకుతుందట, కన్నవాళ్లు వెళ్ళటానికి వృద్ధాప్యం అడ్డు వస్తే తమ్ముడైనా పోయి వుండవచ్చుకదా. అక్కడ చనిపోయిన వాళ్ల బాడీని ఇక్కడికి ఎంతో మంది తీసుకు వస్తున్నారుగా. కొద్ది రోజుల క్రితం ఇక్కణ్ణుంచే డెప్యూటేషన్ మీద పోయిన వాడు మిస్సోరీ నదిలో మునిగి చనిపోతే, వాడి బాడీని ఇక్కడికి తెచ్చారు కదా!”

పోయి వుండొచ్చు – అయితే పోలేదు, మృతదేహాన్ని తేలేదు. కారణం? వారికే తెలియాలి. అన్నింటినీ తెంచుకున్నాక సంబంధాలకు వెల వుండదేమో. కలియుగం!

ఇంటర్‌నెట్‌లో, కిరణ్ పేరును మా వాడు సర్చ్ చేసినపుడు లభించిన సమాచారం తెలియగానే నా వేదన ఇంకానూ ఎక్కువయ్యింది. డిగ్రీలెన్నో చేసిన కిరణ్, చాలా మంచి ఉద్యోగంలో వున్నవాడు, స్వంతంగా బిజనెస్ ప్రారంభించాడు. బిజినెస్ కాన్ఫరెన్స్‌లో వాడు మాట్లాడుతుండే భాగాలు యూట్యూబ్‌లో గోచరించాయి. తన మాటల చేత వినేవాళ్లని మోడీ చేసే వాణ్ని చూచి నా కళ్లు ఆర్ద్రమయ్యాయి. ఇల్లాంటి కొడుకు కీర్తిని కళ్లారా చూచే భాగ్యం ఆ కన్నవాళ్లకి లేకపోయందే! వాడితో రాజీపడలేక ఎందుకిలా దూరం చేసుకున్నారు? బిజెనెస్ మ్యానేజ్‌మెంట్ గుఱించి అంత లోతుగా మాట్లాడగలిగన శక్తి వున్న బుద్ధిమంతుడైన కొడుకుకు అమ్మానాన్నల ప్రేమను మ్యానేజ్ చేయాలనేదే వాడికి అర్థం కాకపోయిందా. కన్నవాళ్లనెలా దూరం చేసుకోగలిగాడు?

సంబంధాల పునాదులు ఇంత దుర్భలంగా వుంటాయా. ఈ ప్రేమ, అనురాగం, వాత్సల్యం, మన వాళ్లనే భావం… అన్నీ…. బూటకమేనా. ఏ కారణం చేతనైనా మనం కొంచం విచలితమైతే, సంబంధాలన్నీ కుంగిపోతాయి. సంబంధాలను నిలుపుకోవాలనే తాపత్రయం అందరికీ ఉన్నప్పుడు మాత్రమే అవి బలపడుతాయి. వాటిని కూడగట్టటం ఒకరి చేతనే అయ్యే పని కాదు. కన్నవాళ్ల – పిల్లల సంబంధాలే విడిపోతున్నప్పుడు – వేరే సంబంధాలు ఎలా కట్టుబడి ఉంటాయి.

జీవనాన్నే పణంగా పెట్టి, పెంచి పెద్ద చేసి, వారి చదువుకు తమ శక్తికి మంచి ఖర్చు చేసి విదేశాలకు పంపించింది పేగు బంధాన్ని తెంపడానికేనా! విదేశీ వ్యామోహపు వాతావరణంలో కన్నవారి ప్రేమ కొట్టుకుపోతుందా. అందరూ వుండి, అనాథలాగా వేరే దేశపు మట్టిలో కలిసిపోయే బుద్ధిమంతులైన పిల్లలు అవసరమా.

జవాబులేని ప్రశ్నలు!

అయితే అందరూ ఇలాగే వుండరనే దాన్ని ఒప్పుకున్నా – కన్నవాళ్లకి పిల్లలు, పిల్లలకి కన్నవాళ్లు దూరమై పోతున్నారనేది నిర్వివాదాంశం. దానికి మనమే సాక్షీభూతులమవుతున్నాం.

బ్రైయిన్ డ్రైయిన్‌తో పాటు ఎంతో మంది కన్నవాళ్లు తమ పిల్లల్ని పోగొట్టుకుంటున్నారా!

మనుషుల మనసులు అంత శూన్యమవుతున్నాయి.

ఎందువల్ల.

‘ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకీ బంధము’ – అనే జవాబు లేని ప్రశ్నలు ఉదయించి భయాన్ని కలుగుజేస్తున్నాయి.

కన్నడ మూలం: కె. ఉషా రై

అనువాదం: కల్లూరు జానకిరామరావు

Exit mobile version