[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘ఫ్రీ బస్ ప్రయాణం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
చింటూ గంతులు వేస్తూ ఆనందంగా బడికి వచ్చాడు. రోజూలా యూనిఫాంలో కాకుండా గళ్ళ చొక్కా, నీలం నిక్కరు వేసుకున్నాడు. వాడికి ఎనిమిదేళ్ళు, మూడవ తరగతి చదువుతున్నాడు. అప్పటికి స్కూల్లో రెండు పిరియడ్లు అయి ఇంటర్వెల్ కొట్టారు. పిల్లలంతా వరండాలో ఆడుకుంటున్నారు.
‘మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల’ అని బోర్డున్న రెండు గదుల బిల్డింగ్ అది. అందులో ఒక్కడే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. చింటూ రావటం చూసి ఒక కుర్రాడు “ఇవాళ నువ్వు బడికి రాలేదు కదరా! మళ్ళీ వచ్చావే!” అని అడిగాడు. “నేను ఊరు వెళుతున్నాను” కళ్ళల్లో నుంచీ నక్షత్రాలు మెరుస్తున్నట్లు సంబరంగా అన్నాడు చింటూ. “ఒరేయ్ చింటూ! నువ్వు వచ్చేటప్పుడు నాకు విజిల్ కొనుక్కురారా! ఆకుపచ్చది. మొన్న నువ్వు కొనుక్కున్నావే! అలాంటిది” అన్నాడు ఒక కుర్రాడు.
“సరే!” అన్నాడు చింటూ. “చింటూకే నయంరా! ఎంచక్కా వాళ్ళ నాన్న ఎప్పుడూ ఏదో ఒక ఊరు తిప్పుతూ ఉంటాడు. మన నాన్నలూ ఉన్నారు. ఎప్పుడూ చదువుకోమని చావకొడుతూ ఉంటారు” నిస్పృహగా అన్నాడు మరొక కుర్రాడు. చింటూ గర్వంగా చూసి లోపల గదిలోకి వెళ్ళాడు. అక్కడ మాస్టారు రిజిష్టర్ లో ఏదో రాసుకుంటూ ఉన్నాడు. “సార్! నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళుతున్నాను” అన్నాడు సంబరంగా.
“ఏం? పండక్కి రమ్మని పిలిచారా!” అడిగారు మాష్టారు రాయటం ఆపి, తలెత్తి చూస్తూ.
“కాదు. మా అమ్మ మా నాన్నతో పోట్లాడి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందిగా! బ్రతిమిలాడి తీసుకురావటానికి వెళుతున్నాడు” అన్నాడు చింటూ. మాస్టారు ఒక్కక్షణం జాలిగా చూసి, మాట్లాడకుండా మళ్ళీ తల వంచుకుని రాసుకోసాగారు.
చింటూ మళ్ళీ గంతులు వేస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. “ఎక్కడికి వెళ్లావు రా! టైం అవుతూంటే.. త్వరగా పద!” శివయ్య తొందర చేశాడు. చేత్తో చిన్న సంచి పట్టుకుని ఇంటికి తాళం వేసి ఇద్దరూ బయటకు వచ్చారు. నాలుగడుగులు వేసిన తర్వాత ఆటో కనబడితే ఎక్కి, బస్టాండుకి వచ్చారు. చింటూకి ఉత్సాహంగా ఏదో మాట్లాడాలని ఉంది. కానీ తండ్రి ఏదో ఆలోచిస్తూ అన్యమనస్కంగా కూర్చుంటే ఎలా మాట్లాడాలో తెలియటం లేదు.
ఇంతలో బస్ వచ్చింది. బస్ ఆగగానే బయట నిలబడిన వాళ్ళు కిటికీలో నుంచీ బ్యాగ్‌లు, కర్చీప్‌లు వేసి సీట్లు ఆపుకుంటున్నారు. బస్ నిండా జనం, దిగేవాళ్ళు దిగుతూంటే, కింద నిలబడిన వాళ్ళు తోసుకుంటూ ఎక్కబోతున్నారు. జనంలో ఎక్కువమంది ఆడవాళ్లే ఉన్నారు. ఉచిత బస్‌లు వేసిన దగ్గర నుంచీ జనం ఇంకా ఎక్కువయ్యారు.
“కాస్త ఆగండమ్మా! దిగేవాళ్ళని దిగనివ్వండి ముందు” కండక్టర్ అరిచాడు. శివయ్య చింటూ చేయి పట్టుకుని ఒక పక్కగా నిలబడ్డాడు. జనం దిగుతూ ఉండగానే మరోపక్క నుంచీ ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. ఖాళీ దొరికి లోపలికి ఎక్కేసరికి సీట్లు అన్నీ నిండిపోయాయి. ఇంకా చాలామంది నిలబడి ఉన్నారు.
బస్ మళ్ళీ స్టార్ట్ అయింది. “చిల్లర తీసుకుని రెడీగా పెట్టుకోండి” టిక్కట్లు కొట్టటం మొదలు పెడుతూ కండక్టర్ అరిచాడు. ఆడవాళ్ళు ఆధార్ కార్డులు పట్టుకుని కూర్చున్నారు. చింటూ గొర్రెల మంద మధ్యలో కుందేలు పిల్లలా జనం కాళ్ళ మధ్య చిక్కుకుపోయాడు. బిత్తర చూపులు చూస్తున్న వాడిని పక్క సీటులో కూర్చున్న ఒకామె “ఇలా రా బాబూ! ఇక్కడ కూర్చో!” అని దగ్గరకు పిలిచి పక్కన కుర్చోబెట్టుకుంది.
“ఇంకా ఎక్కడ కుర్చోబెడతావమ్మా! ఇరుగ్గా ఉంటేనూ..” పక్కన ఆమె గొణిగింది. “కొంచెం సర్దుకోమ్మా! చిన్నపిల్లాడు” అంటూ చింటూని దగ్గరకు తీసుకుంది. ఆమెలో ఏదో మానవత్వపు స్పర్శ. చింటూ మాట్లాడకుండా ఆమెను ఆనుకుని కూర్చున్నాడు.
మగవాళ్ళు అందరూ డబ్బిచ్చి టిక్కెట్లు తీసుకున్నారు. ఆడవాళ్ళు ఫ్రీ టిక్కెట్ తీసుకున్నారు. డబ్బిచ్చిన వాళ్ళు నిలబడి ఉన్నారు, ఫ్రీగా ప్రయాణం చేసేవాళ్ళు అందరూ కుర్చుని ఉన్నారు. శివయ్య ఆడవాళ్ళకి తగలకుండా పక్కకు ఒదిగి నిలబడ్డాడు.
బస్ బయలు దేరిన పది నిమిషాలకు కాలేజీ స్టూడెంట్లు నలుగురైదుగురు ఎక్కారు. “డోర్ దగ్గర నిలబడకండి, లోపలికి రండి” అన్నాడు కండక్టర్ వాళ్ళని ఉద్దేశించి. అటు వాళ్ళూ ఆ మాటలు వినిపించుకోలేదు, ఇటు పక్కన ఉన్నవాళ్ళూ జరిగి చోటు ఇవ్వలేదు. కండక్టర్ అరుపులు అరణ్యరోదన అయింది. రెండుసార్లు చెప్పి చిరాకుపడి ఊరుకున్నాడు. వాళ్ళతో పెట్టుకుంటే టైం అయిపోతుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేలోగా యస్.ఆర్. క్లోజ్ చేయాలి అనుకుంటూ టిక్కెట్లు ఇవ్వసాగాడు.
కొంతదూరంలో రోడ్డు మార్జిన్‌లో జనం గుంపుగా నిలబడటం చూసి డ్రైవర్ బస్ స్లో చేశాడు డ్రైవర్. “ప్రసాద్! ఆపద్దు, పోనీయ్, ఇప్పటికే కెపాసిటీ మించి ఎక్కారు” అన్నాడు కండక్టర్. బస్ ఆపబోయిన వాడల్లా మళ్ళీ రైజ్ చేశాడు డ్రైవర్. బస్ వెనక నుంచీ ఎవరో దబదబ బాదారు. పది అడుగులు వేసిన తర్వాత కూడా దబదబ శబ్దం వినిపిస్తూంటే డ్రైవర్ తప్పనిసరై ఆపాడు.
నడివయసు ఆమె ఒకామె గభాలున ఎక్కి, “ఇందాకటి నుంచీ ఆపమని అరుస్తుంటే ఆపవేందయ్యా!” అన్నది కోపంగా.
“అక్కడ స్టాప్ లేదమ్మా!” అన్నాడు కండక్టర్. ఆమె ఆ మాటలు వినిపించుకోలేదు. “చెయ్యెత్తినప్పుడు ఆపాల! మా పిల్లోడికి చెప్పానంటే ఊరుకోను కూడా ఊరుకోడు. ఎమ్మెల్యే కాడికి ఎళ్లి కూకుంటాడు” అన్నది బెదిరిస్తున్నట్లుగా.
“ఓయబ్బో! మాంచి తెలివిగల దానివే! నువ్వు కూకో ముందు, అడ్డం నిలబడకుండా” వెక్కిరింతగా అన్నాడు కండక్టర్.
“ఏదీ! ఆధార్ కార్డు” కండక్టర్ టిక్కెట్లు కొడుతూ అడిగాడు ఆడవాళ్ళని. కొంతమంది చూపిస్తున్నారు. చదువుకున్నవాళ్ళు ఎక్కువ మాట్లాడకుండా టికెట్ తీసుకుంటున్నారు. ఒకామె “మర్చిపోయి వచ్చానయ్యా! ఈసారి వచ్చినప్పుడు తెస్తాను” అన్నది.
“అలా కుదరదు. ఆధార్ కార్డ్ చూపించు. లేదా టికెట్ కి డబ్బు ఇవ్వు” అన్నాడు.
“ఎందుకు కుదరదు? మొన్న ఒకరోజు ఇచ్చారుగా!” అన్నది.
కండక్టర్ “కుదరదమ్మా!” అన్నాడు అసహనంగా.
“ఏం? బోణీ బేరం అనా!” అన్నది. చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వారు.
“డబ్బిచ్చి టికెట్ తీసుకో, లేదా దిగి వెళ్ళిపో!” చిరాకుగా అన్నాడు.
“డబ్బు లేదయ్యా! బాబ్బాబు..” బ్రతిమిలాడింది. కండక్టర్ బస్ ఆపమన్నట్లు బెల్ కొట్టాడు.
పక్కనే నిలబడి ఇదంతా చూస్తూన్న ఒకతను “పోనీలెండి! పెద్దావిడ, మధ్యలో దింపితే ఎలా! నేనిస్తాను, ఆమెకు కూడా టికెట్ ఇవ్వండి” అన్నాడు. చదువు, సంస్కారం ఉన్నట్లు కనబడుతున్న అతని వంక ఒక్కక్షణం చూసి, ఇద్దరికీ టికెట్లు ఇచ్చాడు కండక్టర్. “మా నాయనే! నూరేళ్ళు చల్లగా ఉండు” అన్నది ముసలమ్మ అతని వంక చూస్తూ. చింటూ ఇదంతా సినిమా షూటింగ్ చూస్తున్నట్లు కళ్ళు పెద్దవిచేసి ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు.
ఇంతలో ఒకరు దిగి వెళ్ళిపోయారు. సీటు ఖాళీ అవగానే పక్కనే నిలబడి ఉన్న అతను కూర్చున్నాడు. “ఆడోళ్ళ మధ్య కుర్చుంటావే! లే!” అన్నది ఒకామె. “ఆయన కూర్చుంటే నీదేం పోయింది. కూర్చోనీ!” మరొకామె అందుకుంది. ఆమె ముఖంలో మంచి, మర్యాద కనిపిస్తున్నాయి. “ఏందయ్యా, కూర్చునేది ఇంతమంది ఆడోళ్ళలో!” చిరాకుగా అన్నది ఇందాకటి ఆమె. లేవమని ఆమె, ఫర్వాలేదు కూర్చోమని ఈమె, ఇద్దరూ కాసేపు వాదులాడుకున్నారు. “వీళ్ళతో గొడవ నాకెందుకు?” అనుకుని అతను లేచి నిలబడ్డాడు. అప్పుడు శాంతించింది ఆమె.
ఇదంతా చూస్తూ కూర్చున్న వెనక వరస ఆడవాళ్ళ లో ఒకామె “వెనకటి రోజులే నయం వదినా! కుటుంబ యజమానిగా మగవాడు ఉన్నప్పుడే బాగుంది. అందరూ కట్టుబాట్లతో, క్రమశిక్షణతో ఉండేవాళ్ళు” అన్నది.
“అవును. మా నాన్న పాత సినిమాల్లో గుమ్మడి లాగా గంభీరంగా కుర్చుని ఉంటే ఎదురుగా నిలబడి మాట్లాడాలంటే హడలి పోయేవాళ్ళం. ఇప్పుడు వెధవ ఆడ పెత్తనాలు వచ్చాయి. ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది” పక్కనే కూర్చున్న ఆమె బంధువు వంత పాడింది.
“అదేమిటి ఆంటీ! స్త్రీ శక్తిని అంత తక్కువగా అంచనా వేస్తారు? ఈ రోజుల్లో స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంటే..” వీళ్ళ సంభాషణ అర్థం కాక, నిలబడి ఉన్న ఒక కాలేజీ అమ్మాయి అన్నది.
“గాడిద గుడ్డు” అని నిర్లక్ష్యంగా ఊరుకుంది ఆమె.
దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. జాగ్రత్త కోసం కండక్టర్ చేసే హెచ్చరికలు ఎవరూ పట్టించుకోవటం లేదు. చిల్లర కోసం తగాదా ఆడుతున్నారు కొందరు. “ఎంతమందికి ఇచ్చేదయ్యా! చిల్లర రెడీగా పెట్టుకోమన్నానుగా!” అన్నాడు కండక్టర్. “నీకేం? చెబుతావు. పదిమంది దగ్గర తీసుకునేవాడివి నీ దగ్గర లేకపోతే మా దగ్గరేం ఉంటుంది?” రూల్స్ మాట్లాడుతున్నారు జనం.
టిక్కెట్లు ఇవ్వటం అయిపోయిన తర్వాత కూర్చోవటానికి వస్తే అక్కడ కండక్టర్ సీట్లో ఎవరో కుర్చుని ఉన్నారు. “లేచి నిలబడు” అన్నాడు. “ఎందుకు లేవాలి? నేను ముందొచ్చాను” అన్నది.
“అది కండక్టర్ సీటమ్మా!” విసుగ్గా అన్నాడు. అయినా ఆమె బిర్ర బిగుసుకుని కూర్చుంది. చుట్టుపక్కల మగవాళ్ళు అందరూ చెప్పిన తర్వాత తిట్టుకుంటూ లేచింది. ఉస్సురని నిట్టూరుస్తూ కూర్చున్నాడు కండక్టర్.
కొంచెం సేపటి తర్వాత శివయ్య దిగాల్సిన స్టేజ్ వచ్చింది. చింటూ చేయి పట్టుకుని డోర్ దగ్గరకు రాబోయాడు. “కొంచెం పక్కకు తప్పుకోమ్మా! దిగాలి” అన్నాడు మెట్ల వైపుకి వస్తూ.
“యాడ దిగుతావయ్యా, ఇంత ఒత్తిడిలో..” ఒక లావాటి ఆమె అన్నది.
“యాడ దిగుతావు అంటే..? మీ ఇంటికి తీసుకుపోతావా!.. పక్కకు తప్పుకుని దారివ్వవమ్మా!” అరిచాడు కండక్టర్.
ఆ మాటతో ఆమె నోరు మూతబడింది గానీ, ఉన్నచోటు నుంచీ కదలలేదు. శివయ్య చింటూ చెయ్యి పట్టుకుని అతికష్టం మీద తోసుకుంటూ కిందకు దిగుతూ “ఒక్క అడుగు కూడా కదలరు” అన్నాడు.
“అవును. కదలరు” కండక్టర్ కూడా అని “రైట్ రైట్..” అంటూ బెల్ కొట్టాడు. కిందకి దిగి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు చింటూ. తాగినవాడిలా గోతుల్లో నుంచీ తూలుకుంటూ వెళుతున్న బస్ వంక చూస్తూ ‘హమ్మయ్య! బస్సెళ్లిపోయింది’ అనుకున్నాడు చింటూ.
“ఇంకెప్పుడూ మనం బస్ ఎక్కొద్దు నాన్నా! కారులో వెళదాం” అన్నాడు తండ్రితో. శివయ్య నిర్వేదంగా నవ్వుకుని “సరే!” అన్నాడు అడుగులు ముందుకు వేస్తూ.
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.
