Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఫ్యూచర్

[శ్రీ ఎనుగంటి వేణుగోపాల్ రచించిన ‘ఫ్యూచర్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో ₹ 2,000/- బహుమతి గెల్చుకున్న కథ.]

రాత్రి 2.34.అవుతోంది.

హైదరాబాద్‌లోని కొంపల్లిలో ‘డి లైట్ ఫార్చ్యూన్’ అపార్ట్ మెంట్ అది. గ్రౌండ్ ఫ్లోర్. రూమ్ నెంబర్ 2.

అక్కడ ఆ గదిలో ఏర్పాటు చేయబడిన అత్యంత ఆధునిక ‘న్యూరో-ల్యాబ్ 6’ లో అన్ని స్క్రీన్లు ఒక్కసారిగా కాంతివంతంగా వెలిగాయి.

డాక్టర్ విపుల్ చంద్ర మూసుకు పోయిన కళ్ళని నెమ్మదిగా ఓపెన్ చేశాడు. అతని ముందు ఒకే ఒక లైన్ ఫ్లాష్‌లా మెరుస్తోంది.

“ఫ్యూచర్ #1087 ఫెయిల్డ్”

అతను లోలోపల విరక్తిగా నవ్వుకున్నాడు.

“ఇది వెయ్యి ఎనభై ఏడవసారి.. ఇంకా అదే ఫలితం?” అందుకే అప్రయత్నంగా నవ్వొచ్చింది అతనికి.

విపుల్ చంద్ర చేసే పని ఏంటంటే..

ఏఐ సహకారంతో మనిషి జీవితాన్ని ముందుగానే సిమ్యులేట్ (భవిష్యత్తును అంచనా వేయడం) చేసి, ఆ వ్యక్తి జీవితంలో జరగబోయే ప్రమాదాలను నివారించడం.

భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందుగానే లెక్కలు, డేటా వేసి ఏ.ఐ. ద్వారా ఊహించి చూపడం.

అంటే గత డేటా, ప్రస్తుత పరిస్థితులు మొదలైనవి పరిగణలోకి తీసుకుంటారు. వాటిని కంప్యూటర్‌లో ప్రాసెస్ చేస్తారు.

తర్వాత ‘ఇలా జరిగే అవకాశం ఉంది’ అని చూపిస్తారు.

‘క్రోనోసిమ్’ ఇది ఒక ప్రత్యేకమైన ఏ.ఐ.సిస్టమ్.

ఒక మనిషి జీవితాన్ని వేల భవిష్యత్తులుగా విభజించి చూపిస్తుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ఫలితం వస్తుందో ముందే చెబుతుంది.

అంటే –

ఒక పని పూర్తి చేస్తే ఎలా ఉంటుంది! పూర్తి చేయకపోతే ఎలా ఉంటుంది! ముందుగానే ఊహించి విశ్లేషిస్తూ తెలియపరచడం.

అలా డాక్టర్ విపుల్ చంద్ర ఈరోజు పరీక్షిస్తున్నది ఒక ప్రత్యేక వ్యక్తిని.

సబ్జెక్ట్: ఏ_22. అతడి వయసు16.

ఊరు: జగిత్యాల.

అలాగే విపుల్ స్క్రీన్‌పై తర్వాతి నెంబర్ అయిన మరొక సిమ్యులేషన్‌ని ఓపెన్ చేశాడు.

ఫ్యూచర్ #1088.

ఒక చిన్న అబ్బాయి ఆగకుండా, పక్కలకు చూడకుండా బురద చిమ్ముతున్న రోడ్డు మీద పరుగెత్తుతున్నాడు. వర్షం నేల జారుతోంది.

ఆ కుర్రాడి చేతిలో ఒక లేఖ.

అనూహ్యంగా ఒక లారీ క్రాష్. వెంటనే స్క్రీన్ బ్లాక్ అయింది. విపుల్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.

అతని ప్రయోగపరంగా మళ్ళీ అదే రిపీట్ అవుతోంది. అతను మరోసారి డేటా పరిశీలనగా చూసాడు. అసలెక్కడ తప్పు జరుగుతోంది?

అతని మస్తిష్కం ఆలోచిస్తోంది.

ఒక చిన్న నిర్ణయంలో మార్పు జరిగితే..?

ఆ అబ్బాయి ఆ రోజు బయటికి వెళ్లకపోతే..?

అన్నీ మారిపోతాయి. ఫ్లాష్‌లా ఒక ఆలోచన తళుక్కుమంది అతడి మేధోపరమైన బుర్రలో.

‘యస్!’ అనుకుంటూ అలర్ట్ అయ్యాడు ఉత్సుకతతో.

ఆలస్యం చేయకుండా విపుల్ అత్యంత వేగంగా ఒక మెసేజ్ టైప్ చేశాడు.. ఇంగ్లీషులో..

‘డు నాట్ స్టెప్ అవుట్ సైడ్ టుమారో’

విశేషమేంటంటే అతని మెసేజ్‌ని సిస్టమ్‌కి పంపడానికి ముందే.. కరాఖండిగా సిస్టమ్ రెడ్ అలర్ట్ ఇచ్చిందిలా..

“సిమ్యులేటెడ్ విషయాల్లో నీవు భాగం అవ్వడానికి వీల్లేదు” అని.

ఆ డాక్టర్ కంగారు పడ్డాడు.

“అలా అయితే నేను నిస్సహాయంగా చూస్తూ ఉండాలా?” గొణుక్కున్నాడు తనలో తనే.

‘తప్పదు. ఒక రిస్క్ తీసుకోవాలి’ అని నిర్ణయం తీసుకున్నాడు.

***

మరుసటి రోజు. ఎప్పటిలానే తిరిగి అతను స్క్రీన్ ముందు కూర్చున్నాడు.

ఫ్యూచర్ #1089 స్టార్ట్ అయింది.

అదే అబ్బాయి. అదే వర్షం. కానీ ఈసారి అతను బయటికి రాలేదు. లారీ ఖాళీ రోడ్డుపై వెళ్లిపోయింది.

విపుల్ ఆనందంతో కుర్చీలోంచి దిగ్గున లేచాడు.

ఆర్కిమెడిస్ సూత్రాన్ని ప్రపంచానికి అందించిన ఆర్కిమెడిస్ లాగా ‘యురేకా!’ (కనుగొన్నాను) అని అరిచాడు.. ల్యాబ్ దద్దరిల్లేలా.

సౌండ్ ప్రూఫ్ కాబట్టి సరిపోయింది.

“మనం భవిష్యత్తును మార్చగలం!”

ఒక సరికొత్త థియరీ అతని గుండెలో పాతుకు పోయింది.

అనుకోకుండా అప్పుడే కంప్యూటర్ స్క్రీన్‌పై కొత్త లైన్ వెలిగింది. చురుగ్గా చూశాడు అటువైపు.

“రియాలిటీ సింకింగ్!” అని ఉందా మ్యాటర్.

విపుల్ గుండె బలంగా కొట్టుకుంది.

“ఇది ఊహ కదా..నిజం కాదు..” మళ్లీ కొత్త అక్షరాలతో స్క్రీన్ నెమ్మదిగా మారింది.

సబ్జెక్టు: ఏ_17.

స్టేటస్: విపుల్.

విపుల్ షాక్ అయ్యాడు. అంటే.. త.. త.. తనే!!

అతని చేతులు షేక్ అయ్యాయి. ఎందుకో అతను వెనక్కి తిరిగి చూసాడు. ల్యాబ్ అంతా ఖాళీగా నిర్మానుష్యంగా ఉంది.

నలువైపులా తల తిప్పాడు. అక్కడ ఆ ల్యాబ్‌లో ఉన్న అన్ని స్క్రీన్లు ఒకే మెసేజ్ చూపిస్తున్నాయి.

నీ ఫ్యూచర్ #1090.

కంప్యూటర్ పక్కనున్న అతని ఫోన్ బీప్ చేసింది.

అందులో ఒక మెసేజ్.

“రేపు బయటకు వెళ్లొద్దు” అని.

విపుల్ కదలక మెదలక నిశ్శబ్దంగా కూర్చుండి పోయాడు కాసేపు. అతను హఠాత్తుగా ఇప్పుడు తెలుసుకున్నాడు.

తను ఎప్పటి నుంచో తన జీవితాన్నే సిమ్యులేట్ చేస్తున్నాడు. అది గుర్తించడానికి ఇన్ని రోజులు పట్టింది.

మరుసటి రోజు ఉదయం. తలుపు దగ్గర నిలబడ్డ విపుల్ ఆలోచనలో పడ్డాడు. అతడిని ఒక సంశయం వెంటాడుతోంది.

“బయటికి వెళ్లకపోతే నేను బ్రతుకుతానా.. లేక ఈ సిమ్యులేషన్ నుండి ఎప్పటికీ బయటకు రాలేనా?”

తలుపు నెమ్మదిగా తెరుచుకుంది.

ఏదో మెసేజ్ డెలివరీ చేయడానికి అక్కడ స్క్రీన్ సమాయత్తమవుతోంది..

(అయిపోయింది)

Exit mobile version