Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గాంధీ – మరొకడు

[రమాకాంత్ రథ్ ఒడియాలో వ్రాసిన ‘గాంధీ ఓ అరజొణొకొ’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు డా. తుర్లపాటి రాజేశ్వరి.]

~
తుపాకి తూటాకు బలి అయ్యాక
గాంధీ మత్తునిద్రలోకి జారిపోయాడు
మెలకువ వచ్చాక తెలిసింది.
తననెవరో తుపాకితో కాల్చేశారు!
అవును.. అతడు..
అతడిని ముందెక్కడో చూశాడు
ఎక్కడా? సబర్మతిలో రాట్నం వడుకుతున్నప్పుడా?
ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలోనా?
తను వెళ్లాడు.. బంధించారు.. జైలులో ఉంచారు
లేదు.. లేదు కలకత్తా.. నవాఖలిలో
తిరుగుతున్న వేళ
అతడు కూడా తనతో పాటు ఉన్నాడా?
ఎక్కడ.. ఎక్కడ చూశాడు అతణ్ణి?
గాంధీ అతడికి దగ్గరగా వెళ్ళాడు
ఇన్నాళ్లు నాతో ఉన్నావ్
నేనేం చేశానని..
నన్ను తూటాతో కాల్చి చంపావ్?
అతడన్నాడు
మిమ్మల్ని చంపక ముందు
నన్ను నేను చంపేసుకున్నాను.
మీరు మరణించక ముందే నేను మరణించాను..
కాబట్టే
మిమ్మల్ని చంపగలిగాను
యవనిక జారింది కిందకి
తర్వాత
గాంధీ ముందు నడుస్తుంటే
ఆ మరొకడు ఆయన వెనకే.. అడుగులో అడుగేస్తూ..
ఇద్దరూ ఎక్కడికి వెళ్లి ఉంటారు?
ఏమిటీ.. ఆ రోజు
మనం చూసిందంతా నిజం కాదా?
వారికి అదే సత్యమా ?
మరి ఆ రోజు ప్రార్థనా సభకు?

ఒడియా మూలం: రమాకాంత్ రథ్
తెలుగు అనువాదం: డా. తుర్లపాటి రాజేశ్వరి

Exit mobile version