[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘గంగా తీర విద్యా విహారం-3’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]
ఆ రోజు 18-08-2016, పౌర్ణమి. దయానంద ఆశ్రమంలో పౌర్ణమి, అమావాస్యల రోజుల్లో ఆచార్యులెవరూ వేదాంత పాఠాలు చెప్పరు. త్రయోదశి రోజున సంస్కృతం క్లాసు రద్దు చేస్తారు. త్రయోదశి తిథి రోజున పాణిని మహర్షి దేహ త్యాగం జరిగిన రోజు. ఇలాంటి సెంటిమెంట్లకు ఏమీ విలువ లేదని చెప్పే స్వామి ఒక్క తత్త్వ విదానంద ఒక్కరే! వారి క్లాసు మాత్రమే వుంది ఆ రోజు.
బ్రేక్‍పాస్ట్ దగ్గర అందరూ నిర్ణయించుకొన్నాము, స్వామీజీ క్లాసు తర్వాత గంగా తీర విహారం చెయ్యాలని. లంచ్ కూడా బయట చేద్దామనుకొన్నాము. నేను శివానంద ఆశ్రమం లోని స్వామి శ్రీ హంసానంద సరస్వతికి ఫోన్ చేసాను.
“స్వామీజీ! దయానంద ఆశ్రమం నుండి మా వేదాంత విద్యార్థులం యాభై మంది వస్తున్నాము. శివానంద ఆశ్రమం చూడటానికి అనుమతి కావాలి.” అంటూ.
హంసానంద సరస్వతి ఆంధ్రాకు చెందిన స్వామి. చాలా సార్లు మా శాంతి ఆశ్రమానికి వచ్చారు. అప్పటి పరిచయంతో ఫోన్ చేసాను. చాలా ఆనందపడ్డారు.
“తప్పకుండా రండి! చూడటానికి అనుమతే కాదు. మీ మధ్యాహ్నం భిక్ష కూడా ఇక్కడే! ఇది మా అదృష్టంగా భావించి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ విషయం మా సెక్రటరీ స్వామి పద్మనాభానందకు తెలియ చేసి తగిన ఏర్పాట్లు చేస్తాను. అయితే ఒక మనవి. మా భిక్ష టైమ్ 11-30కి మొదలవుతుంది. ఆ సమయానికి వచ్చేయండి. భోజనం చేసి, మా ఆశ్రమం చూసి ఇక్కడే విశ్రాంతి తీసుకొని సాయంత్రం రామ్ ఝూలా దాటి అవతలి ఆశ్రమాలు చూద్దురు గాని” అన్నారు. ఇది విన్న మా వాళ్లంతా ఎగిరి గంతేశారు!
సమయానికి స్వామీజీ క్లాసు మొదలైంది. అందరూ హాజరయ్యారు.
“శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్ పాదం శంకరం లోక శంకరమ్!”
ప్రార్థన శ్లోకాలు చెప్పి పాఠం మొదలెట్టారు.
శ్లో.
ఉత్ఖాతం నిధి శంకయా క్షితితలం ధ్మాతా గిరేర్ధాతవో,
నిస్తీరః సరితాంపతి, ర్నృపతయో యత్నేన సంతోషితాః!
మంత్రారాధన తత్పరేణ మనసా నీతాః శ్మశానే నిశాః
ప్రాప్తః కాణవ రాటకోऽపి న మయా తృష్ణే సకామా భవ!
భావం:
విలువైన ఖనిజాల కోసం నేను భూమిని తవ్వాను, రాళ్ళ నుండి లోహాలను కరిగించాను, నేను సముద్రాన్ని దాటాను. రాజుల అనుగ్రహాన్ని శ్రద్ధగా కోరాను, మంత్రాలు పూజలతో నా మనస్సును నిమగ్నం చేస్తూ రాత్రులు మండుతున్న ప్రదేశాలలో గడిపాను. కానీ.. విరిగిన గోరింటాకు కూడా నాకు లభించలేదు. కాబట్టి సంతృప్తి చెందు ఓ కోరికా!
వ్యాఖ్యానం:
కోరిక ఎప్పుడూ పరిపూర్ణం కాదు. తీర్చుకున్న కోరిక స్థానంలో అనేక కోరికలు పుడుతుంటాయి. కోరికలను మూడు రకాలుగా విశ్లేషించవచ్చు. 1. అవసరాలు 2. సుఖాలు 3. భోగాలు. ఇందులో అవసరాలు అందరికీ అవసరమే! మిగతా రెండూ దుఃఖములనే కలిగిస్తాయి. అన్ని కోరికలూ తీరినవారు ఈ జగత్తులో ఎవరూ వుండరు. అన్ని కోరికలూ తీరడమంటే అన్ని కోరికలనూ విడిచి పెట్టేయడమే! ఈ కోరికలు అనేక రకాలుగా ఉంటాయి. ఖర్చు పెట్టాలనే కోరిక ఒకరిదైతే, ప్రోగు చెయ్యాలనే కోరిక మరొకరిది. కొందరు ఖనిజ సంపద కోసం భూమిని తవ్వుతారు, రాళ్ళ నుండి లోహాలను కరిగిస్తారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక కొందరిది. ఏలే వారి ప్రాపకాన్ని పొంది దక్షిణలు పొందాలని కొందరు చూస్తారు. మంత్రాలు – వ్రతాలతో ఉపవాసాలు చేసి దేవుని అనుగ్రహం పొందాలని కొందరు ప్రయత్నిస్తారు. నిజానికి వారు ప్రేమించేది దేవుణ్ణి కాదు. వారి కోరికలనే వారు ప్రేమిస్తున్నామని గ్రహించరు. కొందరు క్షుద్ర పూజలు చేసి మహిమలు సంపాదించ దలచి స్మశానాల్లో రాత్రులు గడుపుతారు. ఇలా ఎన్ని చేసినా ఉపశమనం కలుగదు. పైన చెప్పిన అన్ని పనుల్లో ప్రయత్నించినా ఏ మాత్రం సంతృప్తి కలగలేదట భర్తృహరికి!
వ్యాఖ్యానం ముగించి ప్రశ్నలు జవాబులు కార్యక్రమం చేపట్టారు స్వామి.
“స్వామీజీ! జీవితం లోంచి సినిమా వచ్చిందా? లేక సినిమా లోంచే జీవితం వచ్చిందా?” సువర్ణ ప్రశ్న.
“జీవితాన్ని కుంచించి వేస్తే సినిమా, సినిమాను విస్తరిస్తే జీవితం అవుతుంది.” చెప్పారు స్వామి.
“అహం గురించి వివరించండి స్వామిజీ!” అడిగాను.
“అహం అనేది స్థిరం. అది విత్తనం! ఆ విత్తనం అనేకంగా విస్తరిస్తుంది. అహం కాలానికి – దేశానికి – నామరూపాలకు అతీతం! అహంలో ఎన్నిటిని విలీనం చేసినా చివరకు ‘అహం’ మాత్రమే మిగులుతుంది. ఈ అహం నుండే ఈ జగత్తు – అలాగే సంసారం ప్రకటిత మౌతున్నాయి” చెప్పారు స్వామి.
“అహం నుండి అంటే నా నుండి పుట్టిన ఈ జగత్తు సత్యమే కదా?” సచిత్ ప్రశ్న.
“నీ వరకూ సత్యమే కానీ ఇతరులకు అంటే మాకు అసత్యం, మిథ్య. ఎందుకంటే అది నీ జగత్తు. ఆ జగత్తు నీవు చూస్తుంటే వుంటుంది. చూడకపోతే ఉండదు. తాడు లో పాము చూసినవాడికి ఆ క్షణాన్న సత్యమే. తెలిసిన తర్వాత మిథ్యే! ఈ జగత్తు లోంచి మీరు రాలేదు. మీరు ఎక్కడికీ రారు – పోరు. కానీ.. నీ నుండి వచ్చింది ఈ జగత్తు, నీవు వద్దనుకుంటే పోతుంది!” చెప్పారు స్వామి.
“ఒక మనిషి ఒకసారి తల్లవుతుంది, ఒకసారి చెల్లి అవుతుంది, మరోసారి భార్య అవుతుంది, మరోసారి కూతురు లేదా కోడలవుతుంది. ఇన్ని వ్యత్యాసాలు ఉండాలా?” కత్రిన్ కుబ్బే ప్రశ్న
“అంతే కాదు. అదే మనిషి నడుస్తున్నప్పుడు ‘కాళ్ళు’ అవుతుంది. చూస్తున్నప్పుడు ‘కళ్ళు’, వింటున్నప్పుడు ‘చెవులు’, తింటున్నప్పుడు ‘నోరు’ అవుతుంది. ఏది సత్యమో తెలిసిన వెంటనే ఆ సత్యం ఏదీ మిగలదు. ఉన్నది ఒక్కటే ‘ఆత్మ’ అని తెలుస్తుంది. గది లోని చీకటిని కర్ర పట్టుకు తరమక్కరలేదు లైట్ వేస్తే అదే పోతుంది.” చెప్పారు స్వామీజీ.
“సంస్కృత భాగవతానికి, ఇతర ఇండియన్ భాషల్లోని భాగవతాలకు తేడా ఏమిటి?” జ్ఞానానంద ప్రశ్న.
“సంస్కృత భాగవతం జ్ఞాన ప్రధానం. ఇతరములు ద్వైత ప్రధానములు” చెప్పారు స్వామీజీ.
“నాకు కొన్ని రకాల నగలే ఎందుకు నచ్చుతాయి స్వామీజీ?” దిమిత్రి ప్రశ్న.
“వాటి తత్త్వం తెలియక! మీకు నచ్చిన నగల్లోనూ, నచ్చని నగల్లోనూ వున్నది బంగారమే అని తెలియక!” చెప్పారు స్వామీజీ.
“అక్షయ తృతీయ నాడు చేసే పూజ, నాగుల చవితి నాడు చేసే పూజలోనూ తేడా వుంటుందా?” సువర్ణ.
“అక్షయ తృతీయ నాడు పూజ చేసేది నగల పై ‘రాగం’తో. నాగులచవితి నాడు చేసే పూజ పాములపై ‘భయం’తో!” చెప్పారు స్వామీజీ.
“ఆత్మ, సత్యం ఒక్కటేనా?” యూలియా ప్రశ్న.
“అవును ఒక్కటే! మనకు కనిపించే నామ రూపాలు అన్నీ నశించేవే. ఆ నశించే వాటిని విడిచి పెట్టి నిత్యమైన సత్యాన్ని అంటే ఆత్మను తెలుసుకోవాలి.” చెప్పారు స్వామిజీ.
“ఆనందంగా ఉండటానికి నేను ఏమి చెయ్యాలి?” తపన్ రజూర్కర్ ప్రశ్న.
“ఆనందంగా ఉండటానికి చేయాల్సిన కర్మ ఏదీ లేదు. మీ ఆత్మ ఆనంద స్వరూపమని తెలుసుకోవాలి. తెలివి, తెలుసుకొనే వాడు ఒక్కటే!” చెప్పారు స్వామి.
“నేను ఒక్కడినే బ్రహ్మను, విష్ణువును, శివుణ్ణి కావాలంటే ఎలా?” డామియేన్ క్లర్క్ ప్రశ్న.
“ఈ జగత్తు ద్వందాల మయం. ఆ ద్వందాలలో నీవు జన్మిస్తావు. అప్పుడు నీవు బ్రహ్మవు! ఆ ద్వంద్వముల తోనే రోజంతా గడుపుతావు, అప్పడు నీవు విష్ణువువి. రాత్రి నిద్రిస్తావు, ఆ నిద్రలో ద్వంద్వాలు విలీనం అవుతాయి. అప్పుడు నీవు శివుడవు.”
“నాక్కావాల్సిన జ్ఞానం దేవుడు ఇస్తాడా?” మార్టిన్.
“దేవుడు కొలవడానికి (మెజర్మెంట్స్) సాధ్యం కానివాడు. జ్ఞానం-అజ్ఞానం కూడా మానసిక స్థితులు మాత్రమే! అప్పటికే మీ దగ్గర ఉన్న దానిని దేవుడు కూడా మీకు ఇవ్వలేడు.” చెప్పారు స్వామిజీ.
“ధ్యానం అంటే ఒక అలవాటా? జ్ఞాన అజ్ఞానాల మధ్య తేడా ఏమిటి?” అడిగాను.
“లోకంలో ధ్యానం పేరుతో చలామణి అయ్యేది మాత్రం అలవాటే! కొంతమంది శివుణ్ణి నమ్ముతారు, అది అలవాటు. మరికొంత మంది శివుణ్ణి నమ్మకూడదని కూడా నమ్ముతారు, అది కూడా అలవాటే! ఇక పోతే బుద్ధికి తెలిసిన సంగతులు జ్ఞానం, బుద్ధికి తెలియని సంగతులు అజ్ఞానం.” చెప్పారు స్వామీజీ.
“ఏ సమస్యలూ లేని యుగం వుంటుందా?” రవీంద్ర కౌల్.
“ఒక మహానుభావుడు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పును తెస్తే అది అతని యుగం! యుగ ధర్మం ఆ దేశాన్ని పాలించే రాజు మీద ఆధారపడి వుంటుంది. కొన్ని సమస్యలు ఉదాహరణకు ‘ఆకలి’ ఏ యుగం లోనైనా ఒకే విధంగా వుంటుంది.” చెప్పారు స్వామిజీ.
“ఆహుతులను స్వీకరించడానికి దేవతలు ఏ రూపంలో వస్తారు?” దిమిత్రి ప్రశ్న.
“దేవతలకు రూపం లేదు. అలాగే విగ్రహం కూడా ఉండదు. ఒక రూపం వుంటే ఒకే సమయంలో అనేక చోట్ల ఆహుతులు ఎలా స్వీకరించగలరు? ఉదయం అస్తమయాలు లేని సూర్యుడు ఒక దేవత. సూర్యుడు ఎక్కడికీ రాడు. ఉంటాడు!ప్రకాశిస్తుంటాడు, ఉండుట – ప్రకాశించుట ఒక్కటే అని తెలుసుకోండి!” స్వామిజీ.
“సత్యం అంటే ఏమిటి?” వాగ్దేవి ప్రశ్న.
“ధనం సంపాదించడానికి మందు, సంపాదించిన తర్వాత ఏమి మిగిలి ఉంటుందో అదే సత్యం – అదే ఆత్మ.” స్వామిజీ.
“ఆత్మ ఎలా, ఎక్కడ వుంటుంది?” అడిగింది సువర్ణ.
“ఆత్మా సతతం ప్రాప్తః!” చెప్పారు స్వామీజీ.
భోజనశాలలో టీ బెల్ కొట్టారు. స్వామీజీ మంగళ శ్లోకాలు చెప్పి క్లాసు ముగించారు. క్లాసు అప్పుడే పూర్తయినందుకు అందరూ బాధ పడ్డారు. అందరం భోజనశాలకు వచ్చాము.
***
గంగా తీరంలో బయలుదేరాము. స్వామి నారాయణ ఆశ్రమం ముందు త్వరలో ప్రారంభం కాబోయే పత్రీజీ క్యాంపు కోసం పందిర్లు వేస్తున్నారు. అక్కడి గంగా ప్రవాహాన్ని గమనిస్తూ గంగా రిసార్ట్స్ పూలతోట సమీపంలో కొచ్చాము. పరిమళ భరితంగా వున్నాయి పరిసరాలు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఒక పూల సజ్జతో చాలా ఆనందంగా వచ్చాడు. ఏవో శ్లోకాలు వల్లిస్తూ చాలా హుషారుగా పూలను సేకరిస్తున్నాడు. పారిజాత పుష్పాలు ఏరుకొని సజ్జలో వేసుకున్నాడు. సజ్జ చూసుకున్నాడు. సంతృప్తి కలగలేదు. ఎన్ని అలా ఏరినా సజ్జ నిండేటట్టు అనిపించలేదు. పక్కనే ఒక పూల మొక్క విరగ కాసేసింది. పూలు కూడా చాలా అందంగా పరిమళ భరితంగా వున్నాయి. ఒక కొమ్మ వంచి పట్టుకొని పూలను తృంచడం మొదలెట్టాడు. సజ్జ నిండుతున్న ఫీలింగ్ అతనిలో. ఆ మొక్క మాత్రం చాలా దిగులుగా ఉన్నట్టు అనిపించింది. నాకైతే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం గుర్తొచ్చింది. అప్పుడు జరిగింది విచిత్రం.
ఆ బ్రహ్మచారి మనసులో ఒక తుంటరి ఆలోచన. ‘నీవే భగవంతుడు అని గురువుగారు ఎన్నోసార్లు చెప్పారు. అలాంటి అప్పుడు ఈ పూలు భగవంతుడికి ఎందుకు సమర్పించాలి. నాకు నేనే సమర్పించు కోవచ్చు కదా?’ అని. వెంటనే ఒక కొమ్మనుండి అందమైన పువ్వును తృంచి, పరిమళాన్ని ఆస్వాదించడానికి ముక్కు దగ్గర పెట్టుకొని పీల్చాడు. ఆ పువ్వులోని ఒక చిన్న పురుగు ముక్కులోకి వెళ్లి గట్టిగా కుట్టింది. “అమ్మా!” అంటూ రెండో చేతిలోని సజ్జను విసిరి నేలను కొట్టాడు. క్రింద పడిపోయి గిలగిల కొట్టుకుంటున్నాడు. ఇదంతా గమనిస్తున్న వాచ్‌మాన్ పరుగెట్టుకుంటూ వచ్చి ఆ ముక్కులో గంగా జలం చిలకరించాడు. ఆ చిన్న పురుగు బయటికి వచ్చేసింది. చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాడు. అప్పుడు మాకందరికి అర్థమైనవి రెండు విషయాలు. ఒకటి భగవంతుడి మహిమ, రెండు సుఖ దుఃఖములు ఎలాంటి ద్వంద్వమో! ఒకటి ఎప్పుడు వెళుతుందా అని రెండోది ఎలా ఎదురు చూస్తుందో అని. అహంకారానికి తగిన శిక్ష అని! అందుకే ఓంకారాస్వామి ఆత్మకథలో రాశారు. పూలను మొక్కలనుండి కొయ్యరాదు. వాటికీ మన లాగే ప్రాణం వుంటుంది. పూలను మొక్కకే ఉంచి పూలతో సహా మొక్కను భగవంతునికి సమర్పించాలి అని రాశారు. ఆ సందర్భంలో గుర్తొచ్చాయి! అక్కడినుండి ముందుకు వెళ్ళాము. బాబా రాందేవ్ ప్రోగ్రామ్‌కి ఏర్పాట్లు స్పీడ్ అందుకున్నాయి. ఎడమ వైపు కైలాష్ ఘాట్‌లో నాలుగు ప్లాట్‌ఫామ్స్ మీద శవ దహనాలు జరుగుతున్నాయి. కాటికాపరి చాలా బిజీగా ఆనందంగా పాట పాడుకొంటూ కార్యక్రమం జరిపిస్తున్నాడు. అంత బిజీ లోనూ కూడా మా సచిత్‌ను గుర్తించి నమస్కారం చేసి మాట్లాడాడు. శవం తాలూకు వారు గట్టు మీద బెంచీలపై విచార వదనంతో వున్నారు. కాటికాపరి చాలా ఆనందంగా వున్నాడు. ఒకే ఘటన ఒకరికి ఖేదం! మరొకరికి మోదం!
కైలాష్ ఘాట్ నుండి జానకి ఝూలా చూసుకొంటూ ముందుకెళ్ళాము. ఒక ప్రక్క పూర్ణానంద విద్యా సంస్థలు. పిల్లల గోల వినిపిస్తుంది. మరో ప్రక్క గంగా ప్రవాహంలో ఓంకారం ధ్వనిస్తుంది. ప్రేమనగర్ ఆశ్రమాన్ని దాటి ముందుకెళ్ళగానే గంగలో కలుస్తున్న వాగు, దాని వంతెన దాటి వెళ్ళాము. ఓంకారానంద ఆశ్రమం, యోగా నేర్చుకుంటున్న బ్రహ్మచారులు కనిపించారు. అక్కడి గంగా తీరంలో కూర్చుని గంగా ప్రవాహాన్ని గమనించాలనుకునేవారికి విస్తృతమైన ఏర్పాట్లు చేసి వున్నాయి. అక్కడి నుండి గంగమ్మ ఆవలి తీరంలోనున్న ఆశ్రమాలు కనిపిస్తున్నాయి. వారి హారతి ఘాట్ దాటి రోడ్డు మీది కెళ్ళి శివానంద నగర్ లోకి ప్రవేశించాము. షాపులు చూడముచ్చటగా వున్నాయి. అందర్నీ ఆకర్షించింది శివానంద బుక్ స్టాల్. మావాళ్లందరు వారికి ఇష్టమైన పుస్తకాలు కొనుకున్నారు.
దానికి ఎదురుగా స్వామి చిదానంద సరస్వతి వారి అధిష్టానం. అక్కడే ప్రతీ సాయంత్రం స్వామీ హంసానంద సరస్వతి వారి ఆధ్వర్యంలో సత్సంగం, గంగా హారతి జరుగుతుంది. ఋషికేష్ వచ్చిన యాత్రికులను ఆకర్షించే అనేక వస్తువులు వున్న షాపులు అనేకం వున్నాయక్కడ! చమత్కారీ అంగూటి అమ్మే షాప్ ఉందక్కడ! ఆ ఉంగరం పెట్టుకోగానే ఏవో అద్భుతం జరిగిపోతుందని అమాయకులైన యాత్రికులు భ్రమలో పడతారు. అక్కడినుండి ముందుకెళితే రామ్ ఝూలా! దానికి ఎదురుగా వున్న మెట్లు ఎక్కి, రోడ్డు దాటితే ‘శివానంద ఆశ్రమం’. ఒక కొండ వాలులో నిర్మించబడింది. టెహరి గడ్వాల్ మహారాణి స్వామి శివానందకు ఇచ్చిన భూరి విరాళం ఆ కొండ! ఒక ఆశ్రమం యొక్క అవసరాలు, సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా తీర్చిదిద్దారు ఆశ్రమాన్ని. రాంప్ మీద నడిచి తిన్నగా వెళితే భోజనశాల. టైమ్ అయ్యింది బెల్ కొట్టారు.
మా కోసం అక్కడ స్వామి పద్మనాభానంద, ముకుందానంద సరస్వతి, హంసానంద సరస్వతి స్వాగతం పలికారు. మమ్మల్ని లోనికి తీసుకెళ్లి మాకు షడ్రుచులను వడ్డింప చేశారు. మా దయానంద ఆశ్రమ భోజనాన్ని మరపించే విధంగా వుంది భోజనం.
మా వాళ్లు అందరూ ముఖ్యంగా విదేశీ విద్యార్థులు చాలా ఆనందించారు. అనంతరం మాకు ఒక కొండ వాలులో వున్న కుటీర సముదాయాన్ని విశ్రాంతి నిమిత్తం కేటాయించారు. అక్కడికి రామ్ ఝూలా దాని క్రింద గంగా ప్రవాహం స్పష్టంగా కనిపిస్తుంది.
***
మూడు గంటలకు అందరం రామ్ ఝూలా ఎంట్రన్స్ దగ్గరకి వచ్చేసాము.
అక్కడ బెల్లం – గోధుమ పిండి కలిపి చేసిన ఉండలు అమ్ముతుంటే కొన్నాము. ఝూలా మధ్యలో కొచ్చాక ఆ ఉండలు గంగలోకి వేస్తుంటే పెద్దపెద్ద చేపలు నీటిలోంచి ఎగిరివచ్చి అందుకుంటున్న ఆ దృశ్యం చూడ ముచ్చటగా వుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రామ్ ఝూలా దాటి గంగమ్మ ఆవలి తీరానికి వచ్చాము. అక్కడ అన్నీ షాపులే. రెండు దారులుగా విడిపోయి వుంది. ఎడమ వైపు స్వర్గ ఆశ్రమం వైపు బయలు దేరాము అక్కడ కొన్ని దేవతలకు గుడులు, ఆయుర్వేదం షాపులు వున్నాయి. ఒకవైపు ‘టోపీవాలా రెస్టారెంట్’ వుంది.
విచిత్ర వేషంలో వున్న మనిషి స్వాగతం పలుకుతున్నాడు. మేమంతా అందులోకెళ్లి టీ త్రాగాము. బయటికివచ్చి కొంత ముందుకెళ్ళగానే సాధకులకు స్వర్గధామమైన ‘కాళీ కంభళీ వాలా’ స్థాపించిన ‘స్వర్గ ఆశ్రమం’ దర్శన మిచ్చింది. లోపలికివెల్లి కలయదిరిగాము. అక్కడే ఎంక్వయిరీ చేసి ఆంధ్రాకు చెందిన స్వామి ఓంకారులు వంద సంవత్సరాల క్రితం తపస్సు చేసుకున్న కుటీరాన్ని చూసాము. యాత్రికులకు, సాధకులకు, భిక్షకులకు నిరంతరంగా అన్నదానం చేసే స్వర్ణాశ్రమ అన్నక్షేత్రాన్ని చూసాము. వెనక్కి వచ్చి కుడి వైపు దారమ్మట బయలుదేరాము. అనేక షాపులు! గీతా భవన్ వారి మిఠాయి భండారులో కెళ్ళాము. ఎవరికి కావాల్సినవి వారు తీసు కొన్నారు. కొద్ది ముందు గీతాభవన్ వారి బుక్ షాపు, ప్రక్కనే వస్త్రాలయం వున్నాయి. వాటి వెనుక గీతా భవన్ ఆశ్రమం. చూసుకుంటూ ముందుకెళ్లిన మాముందు ‘పరమార్థ నికేతన్’ అనే స్వర్గధామం దర్శన మిచ్చింది.
వెయ్యి రూముల (అన్నీ ఏసీ) ఫైవ్ స్టార్ ఆశ్రమం, చూడముచ్చటైన తోటలు. లోపలికెళ్ళాము. అందర్నీ ఆశ్చర్య రిచింది అక్కడ ఒకటుంది. అదే ‘వరల్డ్ టాయిలెట్ కాలేజ్’. ఆ తోటలో చాలా సేపు విహరించి, చీకటిపడుతుండటంతో ఆ రోజును పరమార్థ నికేతన్ వారి గంగా హారతిలో పాల్గొవడంతో ముగించాలని నిర్ణయించుకొన్నాము.
* స్వస్తి *

