[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘గంగా తీర విద్యా విహారం-5’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]
స్వామి పరమార్ధానంద క్యాంపు పూర్తయ్యింది. తమిళనాడు నుండి, విదేశాల నుండి వచ్చిన సాధకులు తిరిగి వెళ్లిపోయారు. ఆశ్రమం ఖాళీగా అయి బోసిపోయింది. మాకు వైరాగ్య శతకం చెప్పే స్వామి తత్త్వవిదానంద సైలోస్బర్గ్ వెళ్లారు. మరో నాలుగు నెలల వరకూ రారు.
ఆ రోజు లంచ్‌కు ముందు రెండు క్లాసులు జరిగాయి. ఒకటి సద్విద్యానంద మాతాజీ భగవద్గీత; రెండు హైటెక్ స్వామి తత్త్వబోధ. గీత క్లాసుకు అందరూ హాజరయ్యారు.
హైటెక్ స్వామి క్లాసుకు విదేశీ విద్యార్థులు ఎవరూ హాజరు కాలేదు. అసలు సిసలైన వేదాంత క్లాసు బ్రహ్మ విద్యానంద ‘సాధన చతుష్టయం’ రెండు గంటల నుండి మూడు వరకూ వుంది.
లంచ్ బెల్ కొట్టారు. అందరం ముని వాటిక నుండి భోజనశాలకు బయలుదేరాము. ఆశ్రమ ఆఫీస్ సమీపంలో అశోక్ గౌడ్ టాక్సీ ఆగింది. అందులోనించి ఒక జపాన్ స్త్రీ దిగింది. ఇది గమనించిన మా స్టూడెంట్ జున్ ఇషోబె పరుగెట్టుకుంటూ వెళ్ళింది. నేనూ, మా సువర్ణా, యూలియాలు డైనింగ్ హాల్లో మేము ఎప్పుడూ కూర్చునే సీట్లలో కూర్చున్నాము. జున్ కోసం ఎదురు సూస్తుండగా, ఇంతకు క్రితం టాక్సీ లోంచి దిగిన జపాన్ ఆమెను వెంటబెట్టుకొని వచ్చి, తన సీట్లో ఆమెను కూర్చుండబెట్టి, మంగల్ చేత మరో కుర్చీ తెప్పించుకుని తను కూర్చుంటూ.. “షీ ఈస్ మేడం మేధా మిచిక, అవర్ సంస్కృత టీచర్” అంటూ మాకు పరిచయం చేసింది.
భగవద్గీత 15వ అధ్యాయం చాంటింగ్ స్పీకర్లో మొదలైంది. మంగల్ మా ప్లేట్స్‌లో వడ్డించాడు. గీత చాంటింగ్ పూర్తయ్యాక భోజనం మొదలెట్టాము. భోజనం తర్వాత మిచికా మేడంను ఆమెకు కేటాయించిన ఏసీ కుటీరం దగ్గర విడిచిపెట్టి మేము మా ముని వాటికకు బయలుదేరాక చెప్పింది జున్.
“మేడం మిచికా జపాన్‌లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఉండగా, ఇండియా వెకేషన్ టూర్లో వచ్చి ఋషికేశ్ స్వామి దయానంద ఆశ్రమం రావడం జరిగింది. పూజ్య స్వామి దయానందుల ప్రవచనం విని ప్రభావితమై, స్వామీజీనే తన గురువుగా భావించి, నిర్ణయించుకొని ఇండియా లోనే ఉండిపోయింది. స్వామీజీ దగ్గరే సంస్కృతము, వేదాంత శాస్త్రం చదువుకొని, చాలా తక్కువ కాలంలోనే వాటిలో ప్రావీణ్యం పొంది, ఆర్ష విద్యా పీఠం లోనే టీచర్‌గా స్థిరపడిపోయింది. ఆరు నెలలు ఋషికేశ్ లోనూ, ఆరు నెలలు ఆర్ష విద్యా గురుకులం ‘అనైకట్టి’ లోనూ సంస్కృతం బోధిస్తుంది. ఆమె రాసి ప్రచురించిన గ్రంథాలలో 1) దేవనాగరి 1&2; 2.) Enjoyable Sanskrit 1,2, & 3; 3.) అష్టాధ్యాయి సూత్రపాఠ; 4) ధాతు పాఠ; 5) ధాతు కోశ – మొదలగు పుస్తకాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి.” అంటూ వివరించింది జున్.
ఇలాంటి మేధావి మేడం దగ్గర సంస్కృతం చదువుకొనే భాగ్యం కలిగినందుకు అందరూ సంతోషించాము. మరో ఆనందకరమైన బాంబ్ పేల్చింది జున్. “ఆఫీస్‌లో జనరల్ మేనేజర్ గుణానంద రాయల్, ఆశ్రమ ప్రెసిడెంట్ శ్రీ శుద్ధానంద సరస్వతి మాట్లాడుకొంటుంటే విన్నాను. మరో అద్భుతం సాయంత్రం జరగబోతుంది.” అంది.
“ఏమిటది?” నేనూ సువర్ణ, యూలియా అడిగాం ఆత్రుతగా.
“సాయంత్రం వరకూ సస్పెన్స్!” అంది జున్ ఊరిస్తూ!
***
మధ్యాహ్నం రెండు గంటలకు స్వామి బ్రహ్మవిద్యానంద క్లాసు మొదలైంది. గోనె సంచిడు రిఫరెన్స్ గ్రంధాలు కూడా తెచ్చుకున్నారు. డయాస్ మీద వరుసగా సర్ది మధ్యలో కూర్చున్నారు. స్వామీజీని అందరూ నడిచే గ్రంథాలయం అంటారు. నాకు అనిపించింది స్వామీజీ కూర్చున్నా గ్రంథాలయమే అని! అక్కడ సర్దిన గ్రంథాల్లో బెల్లంకొండ రామరాయ కవి వివరణ గ్రంథాలే ఎక్కువ వున్నాయి. మమ్మలనందరిని పరిచయం చేసుకున్నారు.
ప్రసంగం మొదలెట్టారు.
“రేపటినుండి సీరియస్‌గా పాఠాలు చెప్పుకుందాం! ఈ రోజు సరదాగా గడుపుదాము. మీకు ఒక తమాషా కథ చెపుతాను. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకు మేము గొప్ప అంటే మేము గొప్ప అనే వివాదం ఏర్పడింది. మన పురాణాల్లో ఎప్పుడూ ఇదే గొడవ. ఇలాంటి గొడవలు లేకుండా పురాణాలు వుండవు. వీరిద్దరికీ లోకువయినవాడు బ్రహ్మ. తేల్చమనీ బ్రహ్మకు అల్టిమేటం ఇచ్చారు. బుర్ర గోక్కున్నాడు బ్రహ్మ. శివుని దగ్గరకు పరుగెట్టాడు. అప్పుడు గోక్కోడానికి రెండు బుర్రలైనాయి. అలాంటి సమయంలో వారికి గుర్తొచ్చేది నారదుడు. తల్చుకోగానే ‘నారాయణా!’ అంటూ విచ్చేసాడు. సమస్య అతని సలహాకోసం ఉంచారు.
‘ఏముంది? బ్రహ్మ సమస్యను సృష్టిస్తాడు. చివరికి ఆ సమస్యను నీవు లయం చేస్తావు. సృష్టికి లయంకు మధ్యలో నిర్వహించేది ఆ నారాయణుడేగా? సమస్య పరిష్కారం అతనికే అప్పజెప్పండి.’ అన్నాడు నారదుడు. బ్రహ్మకు, శివునికీ కూడా ఆ సలహా నచ్చింది. అలాగే చేశారు.
బుర్ర గోక్కునే పని విష్ణువుదైంది!
గోక్కుంటున్న బుర్రలో ఒక మెరుపులాంటి ఆలోచన!
విష్ణుపురిలో ఒక హాలు దేవతలకు మరో హాలు రాక్షసులకు కేటాయించబడింది. వారికి వీరు – వీరికి వారు కనిపించరు. వారినీ వీరినీ కుడి చేయి చాపి ఉంచమని ఆదేశించాడు. అలా చాచిన చేతిలో ఒక్కొక లడ్డు ఉంచే ఏర్పాటు చేసాడు. అప్పుడు చెప్పాడు.
‘చాచిన చెయ్యి ముడవకుండా ఆ లడ్డు తినండి. ఎవరు తింటే వాళ్ళు గొప్పవారు’ అని.
మతిపోయింది అందరకూ, చూస్తున్న బ్రహ్మకూ, శివునికీ కూడా మోచేయి ముడవకుండా లడ్డు వున్న కుడి హస్తం నోటి దగ్గరకు ఎలా వస్తుందో తెలియలేదు. వారూ వీరూ కూడా రకరకాల విన్యాసాలు చేశారు. కానీ చేతిని మడవకుండా అరచేతిలో వున్న లడ్డును ఎలా తినాలో తెలియలేదు. విష్ణువు ఏదో ట్రిక్ చేస్తాడు అనే నమ్మకంతో బ్రహ్మ, శివుడు ఆశగా చూస్తున్నారు. గంట గడిచింది. ఏమీ ప్రోగ్రెస్ లేదు.
అప్పుడు విష్ణువు బేల మొహాలతో వున్న దేవతల హాలు దగ్గరకు వచ్చాడు శ్రీలక్ష్మీ సమేతంగా. లక్ష్మీదేవి చేతి వేళ్లకు ‘తమలపాకు’ చిలకలు వున్నాయి. లక్ష్మీ చాచిన తమలపాకు చిలుకలు వున్న చేతివేళ్లను సుతారంగా విష్ణువు నోటి దగ్గరకు తీసుకు రాగా అంతే సుతారంగా తన నోటితో వాటిని స్వీకరించాడు. అప్పుడొక తెలుగు సినీ పాట వినిపించింది – ‘పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్/మురగ బెట్టుకొన్న పాలు విరుగునన్నాడోయ్’.
ఈ సన్నివేశం చూసిన ఒక దేవతకు మెదడులో మెరుపు మెరిసింది. లడ్డు వున్న తన చేతిని తన సమీపంలో వున్న దేవత నోటికి అందించాడు, ఆ దేవత దానిని ఆస్వాదించాడు. ఆ విధంగా అందరూ తమ తమ చేతిలోని లడ్డులను ఎదుటి వారికి అందించారు. ఆ విధంగా దేవతల చేతుల్లో వున్న లడ్డులు అన్నీ అయిపోయాయి. రాక్షసుల చేతుల్లో అలాగే ఉండిపోయి ఓడిపోయారు. దేవతలే తెలివైన గొప్పవారని ఫలితం ప్రకటించబడింది. రాక్షసులు ఓటమిని అంగీకరించి వారి స్వస్థలానికి వెళ్లిపోయారు.
‘అమ్మయ్య!’ అనుకున్నారు బ్రహ్మ, శివుడు.
వెల్! మా భారతీయ పురాణాలన్నీ ఇలా కట్టుకథల తోనే నిండి ఉంటాయి. భాగవత పురాణం, విష్ణు పురాణాలు ప్రాచీనమైనవి. మిగతావన్నీ ఆర్వాచీనమే. ఒక పురాణాన్ని వ్యతిరేకించడానికి మరో పురాణం పుట్టింది. అన్నీ వ్యాసుడి పేరు మీదే చలామణి అవుతాయి. కొత్త కొత్త పురాణాలు ఇంకా పుట్టబడుతునే వున్నాయి. వాటి సంగతి అలా వదిలేద్దాము! మీరంతా వేదాంత విద్య అభ్యసించడానికి వచ్చారు. సన్యాసం మీ లక్ష్యం కారాదు. సన్యాసం అనేది వన్ టైమ్ డెసిషన్! సంసారం లోనైనా ఉండవచ్చు. కానీ సంసారిగా ఉండరాదు. శ్రీ రామకృష్ణులు జీవిత సంసారంలోనే వున్నారు! అన్నీ గమనించండి!
ఓకే! ఇప్పుడు ప్రశ్నలు – సమాధానాల కార్యక్రమం. ఎవరైనా ఏ ప్రశ్న అయినా అడగవచ్చు. నేను జవాబు చెపుతాను. అలాగే నేనూ అడుగుతాను మీరు చెప్పండి!
నా మొదటి ప్రశ్న.. తండ్రికి కొడుకు పుడతాడా? కొడుక్కి తండ్రి పుడతాడా?” అడిగారు స్వామీజీ.
“తండ్రికే కొడుకు పుడతాడు” చెప్పాడు డామియేన్.
“ఈ సమాధానంతో ఏకీభవించేవారు చేతులెత్తండి.” స్వామి
నాతో సహా అందరూ చేతులెత్తారు ఒక్క దిమిత్రి తప్ప.
“ఈ జవాబును ఎందుకు వ్యతిరేకిస్తున్నావో చెప్పు?” స్వామి.
దిమిత్రి లేచి నిలబడింది, అందరూ పిచ్చి దాన్ని చూస్తున్నట్టు చూసారు.
“స్వామీజీ! ఒక మనిషి జీవితంలో అనేక దశలుంటాయి. ఒకరికి కొడుకుగా, అన్నగా, మరిదిగా, భర్తగా, అల్లుడిగా ఉంటాడే గాని, తనకు పెళ్లి అయ్యి ఒక కొడుకు గాని, కూతురు గానీ పుట్టినప్పుడు మాత్రమే అతను ‘తండ్రి’ అని పిలవబడతాడు. అందుకే అన్నాను కొడుకు లేదా కూతురుకే తండ్రి పుడతాడని” చెప్పింది దిమిత్రి. చప్పట్లు కొట్టి అభినందించారు స్వామి.
“నీ వివరణతో ఏకీభవిస్తున్నాను. ఈ వివరణకు నీకున్న సోర్స్ ఏమిటి?” అడిగారు స్వామీజీ.
“స్టవరోస్ హడ్జి స్టిల్లీస్ అనే గ్రీకు నవలాకారుడు రాసిన ‘ఐ యామ్ యువర్ సన్’ అనే నవల కారణం.” చెప్పింది.
అందరూ అభినందించారు.
“ఇక నా రెండో ప్రశ్న ఇండియాలో ఒక అడ్వకేటుకు వుండాల్సిన లక్షణాలు ఏమిటి?” అడిగారు స్వామీజీ.
లా తెలిసి వుండాలని, చట్టాలు సెక్షన్స్ తెలిసివుండాలని రకరకాల జవాబులు చెప్పారు చాలామంది. స్వామీజీ ముఖ కవళికలను బట్టి ఏ సమాధానమూ నచ్చ లేదని తెలుస్తుంది.
అప్పుడు నేను లేచాను.
“స్వామీజీ! అడ్వకేటు కుండాల్చిన లక్షణాలు రెండు ఒకటి లా డిగ్రీ, రెండు లిటిగేషన్. అయితే.. లా డిగ్రీ ఉండి, చట్టాలు, సెక్షన్స్ బాగా తెలిసుంటే.. న్యాయశాఖకు సంబంధించిన అనేక కార్యాలయాల్లో ఉన్నతమైన ఉద్యోగానికి పనికి వస్తాడు. ప్లీడర్‌గా ప్రాక్టీస్ చెయ్యాలంటే మాత్రం లిటిగేషన్ తెలిసివుండాలి. స్వయంగా లిటిగెంట్ అయ్యివుండాలి. మనదేశంలో లా డిగ్రీలు అమ్మే కాలేజెస్ చాలా వున్నాయి. కానీ ఏ కాలేజీ లోనూ లిటిగేషన్ నేర్పరు. మన దేశపు కోర్టుల్లో తీర్పులు ఇవ్వబడవు. వాయిదాలు మాత్రమే ఇస్తారు. చాలా మంది అడ్వకేట్లకు ‘ఇగ్నోరెన్స్ ఈస్ నో ఎక్సక్యూజ్,. నో వన్ కెన్ కన్వె ఏ బెటర్ టైటిల్ ధేన్ హి హాస్’ అనే చిన్న చిన్న లా సూత్రాలు కూడా తెలియదు. వారికి తెలిసిందల్లా నల్లకోటు – మంచి గొంతు, కలుషితం అయిన మనసు. వాదులు – ప్రతివాదులు ఆర్థికంగా పతనమయ్యేవరకు కేసును ఎలా లాగించాలని, రెండు పార్టీల ప్లీడర్లు ఆ ఊళ్ళోని బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చుని తెగ మథనపడిపోతుంటారు. ఎవరైనా నిజాయితీపరుడైన ప్లీడర్ వుంటే ఆ వృత్తిలో రాణించడు. చెట్టుక్రింద ప్లీడర్ అవుతాడు.” వివరించాను
“మీ ఈ వివరణ కు ఏమైనా బేస్ వుందా?” అడిగారు.
“వుంది స్వామీజీ! మా సమీప బంధువు ఒకడు చాలా కష్టపడి, చదివి లా డిగ్రీ పాస్ అయ్యాడు. అడ్వకేట్‌గా రిజిస్టర్ అయ్యి వచ్చి చాలా ఉత్సాహంగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసాడు. చాలా తక్కువ కాలంలోనే తనలో తక్కువైన దాన్ని గ్రహించి మంచి కోచింగ్ తీసుకొని యు.పి.యస్.సి. పరీక్షలు రాసుకొని ఆల్ ఇండియా ఫస్ట్ రాంక్ సాధించి మంచి పొజిషన్లో జాయిన్ అయ్యి, మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకొని, బాగా సెటిల్ అయ్యాడు.
అలాగే మా దూరపు బంధువు ఒకడు, కేవలం లా డిగ్రీ తో పాటు తల్లి దండ్రుల నుండి వారసత్వంగా లిటిగేషన్ తీసుకొని, గొప్ప ప్లీడర్‌గా రాణిస్తున్నాడు. ఇదే నా వివరణ కు బేస్ స్వామీజీ!” వివరించాను
“నీ డిటైల్డ్ వివరణకు అభినందిస్తున్నాను.” అన్నారు.
“నా మూడో ప్రశ్న – వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ డెంటల్ స్టూడెంట్ అండ్ ఏ ప్రాక్టీసింగ్ డెంటిస్ట్?” అడిగారు స్వామి.
నేనే లేచి “చదువుకుంటున్న డెంటల్ స్టూడెంట్ తన చదువు మీద ప్రేమతో మన పళ్ళు పీకుతాడు. అదే ప్రాక్టీస్ చేస్తున్న డెంటల్ డాక్టర్ మన జేబు మీది ప్రేమతో మన పళ్ళు రాలగొడతాడు, జేబు కొల్లగొడతాడు” చెప్పాను.
స్వామితో సహా అందరూ గొల్లుమని నవ్వారు.
“ఇండియాలో దేవుడికి ఎందుకు అంతలా పూజ చేస్తారు?” అండ్రీయా బర్రెరియో ప్రశ్న.
“ఇండియా లోనే కాదు ప్రపంచం అంతా, ప్రజలు వారి వారి కోరికలను ప్రేమించే వారై వుంటారు. పైకి దేవుణ్ణి ప్రేమించేవారిగా కనిపిస్తారు. ఇండియాలో కొద్ది అతి ఎక్కువ!” చెప్పారు స్వామీజీ.
“కలలు మీరు ఇంగ్లీషులో కంటారా? సంస్కృతంలో కంటారా?” యూలియా సెంక్విచ్ ప్రశ్న.
“నేను తమిళంలో కంటాను. ఎందుకంటే నా మాతృభాష తమిళం కాబట్టి!” చెప్పారు స్వామీజీ.
“జీవితంలో దోషాలు ఏముంటాయి?” రవీంద్ర కౌల్ ప్రశ్న.
“జీవితంలో దోషాలు విదురనీతి ప్రకారం ఆరు. 1. నిద్ర 2. సోమరితనం 3. భయం 4. క్రోధం 5. ఆలస్యం 6. తప్పుడు నిర్ణయం.” చెప్పారు స్వామీజీ.
“మనిషి జీవితంలో విడిచి పెట్టాల్సింది ఎవరిని?” కత్రిన్ కుబ్బే ప్రశ్న.
“ఇది కూడా విదురనీతి ప్రకారమే! 1. పాఠం చెప్పని గురువు 2. మంత్రాలు రాని పురోహితుడు 3. ప్రజా సేవ చేయని నాయకుడు 4. ప్రతి విషయాన్ని వ్యతిరేకించే భార్య. 5. గ్రామంలోనే నివసిస్తాననే గోపాలుడు 6. గ్రామంలో నివసించని మంగలిని, విడిచిపెట్టాలి.’ చెప్పారు స్వామి.
“మరి మనిషి జీవితాంతం విడిచిపెట్టకూడనివి ఏమిటి?” సచిత్ ప్రశ్న.
“1. దానం 2. సత్యం 3. సరియైన సమయం 4. అసూయ రహిత స్థితి 5. క్షమ 6. ధృతి (నిలబెట్టే మానసికస్థితి)” చెప్పారు స్వామీజీ.
“మనిషికి కావాల్సిన సుఖాలు ఏమిటి?” తపన్ ప్రశ్న.
“మనిషికి జీవితంలో 1. నిలకడైన ఆదాయం 2. ఆరోగ్యం 3. ప్రేమ కలిగి దాన్ని ప్రకటించే భార్య 4. తనను ప్రేమించే కొడుకు 5. విద్య 6. ధనాన్ని ప్రోగు చేయు తెలివి, కావాల్సిన సుఖాలు” చెప్పారు స్వామీజీ.
“స్వామీజీ! సుఖాలు ఎన్ని రకాలుగా ఉంటాయి?” సచిత్.
“1. ఆరోగ్యం 2. అప్పులు లేక పోవుట 3. అనవసర ప్రయాణం (గృహస్థులు ఒక చోటే ఉండాలి. సన్యాసులు ప్రయాణం చేస్తూ ఉండాలి) 4. సత్సంగం 5. స్వతంత్రం 6. భయం లేని స్థితి.” చెప్పారు స్వామీజీ.
“మనిషి అంతరంగ శత్రువులు ఎవరు?” జ్ఞానానంద ప్రశ్న.
“1. కామం 2. క్రోధం 3. లోభం 4. మోహం (అజ్ఞానం) 5. మదం (పొగరు) 6. మాత్సర్యం (అసూయ)” స్వామి.
“స్వామీజీ! వేదం ఎంత కాలం చదువుకోవాలి?” సువర్ణ.
“వేదం వచ్చే వరకూ వల్లించాలి. వచ్చింతర్వాత చచ్చే వరకూ వల్లించాలి. రేపటి నుండి మనం చెప్పుకోబోయే ‘సాధన పంచకం’లో ఆ విషయం విస్తారంగా చర్చిద్దాము”.
స్వామీజీ సమాధానం అందర్నీ నవ్వించింది.
“మనిషి దూరం పెట్టాల్సినవి ఏమిటి?” యూలియా ప్రశ్న.
“1. భోగములు 2 పాచికలు 3. వేట 4. పరుష వాక్యం 5. కఠిన శిక్షలు 6. మద్యపానం 7. ధన దుర్వినియోగం” చెప్పారు స్వామీజీ.
“పెళ్ళికి వెళుతూ పిల్లిని తీసుకెళ్ళగూడదా?” మార్టిన్.
“పెళ్ళికి పిల్లి నైనా తీసుకెళ్లవచ్చు గానీ సన్యాసిని మాత్రం తీసుకెళ్ళకూడదు.” నవ్వుతూ చెప్పారు స్వామి.
“ఒకరిమీద మరొకరు ఆధారపడటమే జీవితమా?” అడిగాను చివరి ప్రశ్నగా!
“కాదు. కానీ.. వేశ్యలు విటుల మీదా, వైద్యులు రోగుల మీదా, పూజారులు దేవుళ్ళు భక్తుల మీద, కక్షిదారుల మీద ప్లీడర్లు + పోలీసులు మరియు గురువుల మీదా – ధనవంతులైన మూర్ఖుల మీదా ‘ఆశ్రమాలు’ ఆధారపడి నడుస్తుంది ఈ వ్యవస్థ!” చెప్పారు స్వామీజీ.
సమయం మధ్యాహ్నం మూడయ్యింది. టీ బెల్ కొట్టారు. మంగళ శ్లోకాలు చెప్పి క్లాసు ముగించారు స్వామీజీ.
క్లాసు నుండి బయటకు వచ్చేటప్పుడు చూస్తే బోర్డులో నోటీసు అంటించి వుంది. దాని ప్రకారం ఇప్పుడు 3.30 నుండి ‘తర్క సంగ్రహం’ క్లాస్ వుంది. అందరూ హాజరు కావాలని సూచన. క్రిందికి వచ్చి అందరం కాఫీ, టీ లు తాగుతుండగా ఆఫీస్ ముందు ఆగిన కారు నుండి ఒక తెల్లటి పంచ ధరించి, పిలకతో వున్న ఒకాయన దిగాడు. ఆశ్రమ ప్రెసిడెంట్ శుద్ధానంద సరస్వతి, వైస్ ప్రెసిడెంట్ సాక్షాత్ కృతానంద ఆఫీస్ బయటికి వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. అప్పుడంది జున్.
“మీకో సర్పైస్ చూపిస్తానన్నాను కదా? అది ఇదే! ఆ వచ్చినాయన పేరు డా. కె. రామ సుబ్రమణియన్, ముంబై ఐఐటీలో సంస్కృత ప్రొఫెసర్, మనకు ‘తర్క సంగ్రహం’ చెప్పడానికి ప్రత్యేకంగా ఆహ్వానింపబడ్డారు. ఇప్పుడు వారి క్లాసుకే మనం అటెండ్ కావాలి.” అంది.
అందరం క్లాసుకు హాజరయ్యాము. క్లాసు మొదలైంది.
‘నా పేరు కె. రామ సుబ్రమణియన్, ముంబై ఐఐటీ నుండి నెల రోజుల సెలవుపై వచ్చాను. రేపటినుండి మీకు అన్నంభట్ట విరచిత ‘తర్క సంగ్రహం’ పాఠం చెబుతాను” అంటూ ఆ పుస్తకాలు మాకు పంచిపెట్టారు.
“ఇప్పుడు మీరంతా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి” అన్నారు. మా అందరి పరిచయాలు అయ్యాక ‘తర్క సంగ్రహం’ గురించి ఇంట్రడక్షన్ పూర్తి చేసేటప్పటికి క్లాసు సమయం పూర్తి కావడంతో మంగళ శ్లోకాలు చెప్పి క్లాసు ముగించారు. క్లాసు బయటకు రాగానే మరో సరైస్ న్యూస్ చెప్పింది జున్ ఇషోబె.
“అందరూ నాతో రండి! గేటు బయటకు రాగానే మీకు కనిపిస్తుంది.” అంది.
“ఏమిటీ? స్వతంత్రానంద ఆశ్రమమా?” అంటూ వేళాకోళం ఆడాడు సచిత్.
“అవును. రేపటి నుండి అందులో జరగబోయే అద్భుత సత్సంగం గురించి ప్రకటన.” అంది జున్.
అందరూ బయటికి వచ్చి చూడగా ‘అద్భుతః’. “ప్రపంచ ప్రసిద్ధి పొందిన మూజీ బాబా సత్సంగం. రేపే ప్రారంభం” అంటూ అంటించి వున్న పోస్టర్ చూపించింది జున్.
‘అవును. నిజంగా అద్భుతమే!’ అనుకొంటూ గంగా తీర విహారానికి బయలుదేరాము!
*స్వస్తి *
