[గంగానది బంగాళాఖాతంలో సంగమించే చోటు – గంగాసాగరం- దర్శించి, ఆ అనుభూతులను పంచుకుంటున్నారు డా. మజ్జి భారతి.]
ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని, దక్షిణ ఇరవై నాలుగు పరగణాల జిల్లాలోని, కాక్‌ద్వీప్ లోని ఒక గ్రామం. ఇక్కడే గంగానది, బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అరవైవేల మంది సగర పుత్రులకు స్వర్గప్రాప్తి లభించిన ప్రదేశం కూడా ఇదే. కలకత్తాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుందిది.
ఇక్ష్వాకు వంశస్తుడైన సగర మహారాజు అశ్వమేధ యాగం చేసి, అశ్వ సంరక్షణ కోసం తన అరవైవేల మంది కుమారులను పంపిస్తాడు. ఇంద్రుడు మాయ చేత ఆ అశ్వాన్ని దొంగిలించి, కపిలముని ఆశ్రమంలో కట్టగా, మహర్షే అశ్వాన్ని దొంగిలించాడని భావించిన సగర కుమారులు, అతని తపస్సుకు భంగం కలిగించగా, కోపించిన ఋషి తన దృక్కులతో వారిని బూడిదగా మారుస్తాడు.
వారి సోదరుడైన అసమంజుడు, వచ్చి విషయాన్ని తెలుసుకుని, కపిల మహర్షిని మన్నించమని కోరగా, గంగానది వారి బూడిదలపై ప్రవహిస్తే, వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని అనుగ్రహిస్తాడు. దాంతో అసమంజుడు గంగ కోసం తపస్సు చేసినా ఫలించక పోవడంతో, తర్వాత అతని కుమారుడు అంశుమంతుడు, తపస్సు చేసినా కార్యాన్ని సాధించ లేకపోవడంతో, అంశుమంతుని కుమారుడు భగీరథుడు, ఘోర తపస్సు చేసి గంగను మెప్పించి, ఆమెను భరించడానికి శివుని మెప్పించి, గంగను భువికి తీసుకువస్తాడు. సగర కుమారుల బూడిదపై గంగా జలాలు ప్రవహించగా వారికి స్వర్గ ప్రాప్తి కలిగిందని, తర్వాత గంగానది సాగరంలో కలిసిందని పురాణ కథనం.
సాగరంలా ఉండడంచే దీనిని గంగాసాగరమని పిలుస్తారు. దీని ఒడ్డునే కపిలముని ఆశ్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున గంగాసాగర్ మేళా జరుగుతుంది. కుంభమేళా తర్వాత జరిగే అతిపెద్ద మేళా ఇదే. లక్షలాదిమంది జనులు, సాధువులు, అఘోరాలు ఈ మేళాకు వస్తారు. ఇక్కడ పవిత్ర స్నానం ఆచరిస్తే, ఉత్తమ గతులు సిద్ధిస్తాయని విశ్వాసం. మకర సంక్రాంతి రోజున, ఇసుక వేస్తే రాలనంత జనంతో తీరం కిటకిటలాడిపోతుంది.
కలకత్తా నుండి ఉదయం 7: 30 కు క్యాబ్‌లో బయలుదేరి, త్రోవలో డైమండ్ హార్బరును దాటుకుని, 10 గంటలకు హార్వుడ్ జెట్టి పాయింటుకు చేరుకున్నాం. డైమండ్ హార్బర్ నుండి జెట్టి పాయింటుకు వెళ్లే త్రోవకి ఇరువైపులా, పచ్చని చెట్లు ఉండడంతో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగింది. కారు పార్కింగ్ ప్లేస్ నుండి, జెట్టి పాయింటుకు కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఆటోలు కూడా దొరుకుతాయి. జెట్టి పాయింట్ నుండి ఫెర్రీ మీద గంట ప్రయాణం చేసాక, కచుబేరియా జెట్టి పాయింటుకు చేరుకున్నాం. మేము వెళ్లిన సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో, ఫెర్రీలో కూర్చోవడానికి స్థలం కూడా లేదు. చుట్టూ నీలి జలాలు. ఫెర్రీ చుట్టూ సీగల్ పక్షులు. మనం వేసే ఆహారాన్ని ఎగరేసుకుపోతూ. వీటన్నిటినీ చూస్తుంటే గంట ప్రయాణం ఇట్టే గడిచిపోయింది.
జెట్టీ నుంచి కనబడే దృశ్యం
ఫెర్రీ దిగి కొంత దూరం నడిచాక, అక్కడ వెహికిల్స్ ఉంటాయి. అక్కడ నుండి 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గంగాసాగర్ వస్తుంది. మేము టాక్సీ బుక్ చేసుకున్నాం. షేర్ ఆటోలు, బస్సులు కూడా దొరుకుతాయి. రోడ్లు బాగా ఉండటం, చెట్లు ఉండడంతో జర్నీ హ్యాపీగా సాగింది. మధ్యలో రుద్రనగర్ అనే టౌన్ వస్తుంది. గంగాసాగర్ గ్రామంలో, మనం స్టే చెయ్యడానికి ఆశ్రమాలు, కాటేజీలున్నాయి. టాక్సీ దిగాక, గంగానదీ తీరానికి ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది. త్రోవకి ఇరువైపులా షాపులుంటాయి. గంగాసాగర్ నీళ్లు పట్టుకుని, ఇంటికి తీసుకు వెళ్లేందుకు, ప్లాస్టిక్ క్యాన్లను అమ్ముతున్నారు. అలాగే గవ్వలతో చేసిన చాలా వస్తువులను, పూజా సామాగ్రిని అమ్ముతున్నారు. ఆటో దిగి కొద్ది దూరం నడిస్తే, తీరానికి చేరుకుంటాం. ఇక్కడ ఇసుక చాలా మెత్తగా ఉంది. అక్కడ గంగా స్నానం చేసుకుని సంకల్పం చెప్పుకున్నాం. మనతో గంగా పూజకు సంకల్పం చెప్పించడానికి, పితృకర్మలు చేయించడానికి పురోహితులు అందుబాటులో ఉంటారు.
కపిలముని ఆశ్రమం
తర్వాత, ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కపిలముని ఆశ్రమాన్ని.. ఆశ్రమం అంటాం కాని, మూడు శిఖరాలతో ఆలయంలా ఉంటుంది. అందులో కపిలముని విగ్రహం, కుడివైపు గంగమ్మ తల్లి, ఎడమవైపు సగర మహారాజుల విగ్రహాలుంటాయి. విగ్రహాలు సింధూర వర్ణంలో ఉంటాయి. కపిలమునిని విష్ణు అంశగా చెప్తారు. అతని తలపై ఛత్రం పట్టినట్టుగా పడగ విప్పిన పాము ఉంటుంది. ఇంకా శివుడు, పార్వతి, రాధాకృష్ణుల, లక్ష్మీనారాయణుల ఉపాలయాలు కూడా ఉన్నాయి. వీరందరి దర్శనం చేసుకున్నాం. ఆలయం ముందున్న స్థలానికి టైల్సు వేయడంతో నీట్‌గా కనిపిస్తుంది. ఆశ్రమానికి కాస్త దూరంలో కుడివైపు కపిలముని సరోవరం ఉంటుంది. సరోవరం మధ్యలో గంగమ్మ తల్లి విగ్రహం చాలా అందంగా ఉంది. అక్కడనుండి ఆటోలో టాక్సీ పాయింటుకు, టాక్సీలో కచుబేరియా జెట్టి పాయింటుకు చేరుకున్నాం.
ఆశ్రమానికి వెళ్లే త్రోవలో షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. దాని ముందు, శివుడు, గంగమ్మ, భగీరధుల విగ్రహాలున్నాయి. గంగాసాగర్ ఊరిని కూడా విగ్రహాలతో సుందరీకరించారు.
మేము వెళ్లిన సమయంలో, ఫెర్రీ మధ్యాహ్నం రెండు నుండి సాయంకాలం ఐదున్నర వరకు క్లోజ్ చేస్తారని తెలిసింది. ఐదున్నర తర్వాత టికెట్ కౌంటర్ ఓపెన్ చేస్తే, టికెట్లు తీసుకున్నా, విపరీతమైన రద్దీ ఉండడంతో, మొదటి ఫెర్రీలో ఎక్కకుండా రెండవ ఫెర్రీ కోసం వెయిట్ చేసాం. ఇదే ఆఖరి ఫెర్రీ అవడం వలన, రద్దీ మరింత ఎక్కువగా ఉంది. ఎలాగైతేనే, ఆఖరికి ఎక్కగలిగాం. గాని ఫెర్రీలో ఇసుక వేస్తే రాలనంత జనం. కాలు కదపటానికి కూడా స్థలం లేదు. అందరి మనసుల్లో భయం. ఏ చిన్న పొరపాటు జరిగినా, ఈత వస్తే తప్పించి, ఎవరు బ్రతకరని. ఫెర్రీ కూడా చాలా నెమ్మదిగా వెళుతూ.. హార్వుడ్ జెట్టి పాయింటును ఎప్పుడు చేరుకుంటామా అని, మనసులోనే దేవుడిని ప్రార్థించుకుంటూ.. కదలకుండా నిలబడండి, అంటూ ఫెర్రీ సిబ్బంది హెచ్చరికలు.. ఈసారి రెండు గంటలు పట్టింది జెట్టి పాయింట్ చేరుకునేసరికి. బ్రతుకు జీవుడా అని క్రిందకు దిగాం అందరం.
మీలో ఎవరైనా గంగాసాగర్ సందర్శించాలనుకుంటే, ఆ సమయంలో ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని, తగిన విధంగా ప్లాన్ చేసుకోండి. లేకపోతే మాకు ఎదురైన అనుభవమే మీకు కూడా జరగవచ్చు.
రామాయణ కాలం నాటి కపిలముని ఆశ్రమమున్న స్థలాన్ని దర్శించుకుని, అరవైవేల మంది సగర పుత్రులకు మోక్ష ప్రాప్తినిచ్చిన, గంగమ్మ తల్లి సాగరునిలో సంగమించిన ప్రదేశాన్ని చూసి, ఈ జన్మకి ఈ అదృష్టాన్నిచ్చిన భగవంతునికి నమోవాక్కాలు అర్పించుకుంటూ, చైతన్య ప్రభు జన్మస్థలమైన మాయాపూర్‌కు ప్రయాణమయ్యాం.

