Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గతం గతః

[శ్రీ షేక్ అమీర్ బాషా రాసిన ‘గతం గతః’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“గుడ్ మార్నింగ్ అమరేంద్ర, ఎంతసేపయింది వచ్చి?” పార్కులో రాతి పలకపై కూర్చున్న మిత్రుని చూసి నవ్వుతూ అడిగాడు శేఖర్.

“వెరీ గుడ్ మార్నింగ్, నేను ఆరు గంటలకే వచ్చాను. ఐదు రౌండ్ల వాకింగ్ తరువాత ఇక్కడ చతికిల పడ్డాను. నువ్వు వెళ్లి రా” బదులిచ్చాడు అమరేంద్ర.

“ఈరోజు వాకింగ్‌కు వెళ్ళాలనే మూడ్ లేదు. కేవలం నిన్ను కలవాలని వచ్చాను. మనం కలిసి ఎనిమిది రోజులు అయింది. అన్నట్లు నీ తిరుపతి ప్రయాణం ఎలా సాగింది.”

“బాగానే జరిగింది శేఖర్. బెంగళూరు నుంచి మా అబ్బాయి కోడలు, చెన్నై నుంచి నా కూతురు అల్లుడు వచ్చారు. అందరం కలిసి రెండు రోజులు శ్రీవారి సన్నిధిలో గడిపాము. తర్వాత వాళ్లందరూ వెళ్లిపోయారు. నేను మీ చెల్లెలు శ్రీకాళహస్తికి వెళ్ళాము. నిన్న ఉదయం 11 గంటలకు ఇల్లు చేరాము. క్లుప్తంగా ఇది మా ప్రయాణం.”

“నిన్న సాయంత్రమే లడ్డు ప్రసాదాలు మాకు అందాయిలే.”

“శేఖర్ సాయంత్రం క్లబ్బుకి వెళదామా?”

“ఏరా మందు మీద గాలి మళ్లిందా?”

“అదేం కాదు, కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుందామని.”

“సర్లే, ఇక వెళదామా?”

“పద” అంటూ అమరేంద్ర కూడా లేచాడు.

అమరేంద్ర ,శేఖర్ ప్రాణ మిత్రులు. ఆరమరికలు, భేద భావాలు లేని 40 సంవత్సరాల స్నేహo వాళ్ళది. ఇద్దరూ ఓ ప్రభుత్వ రంగ సంస్థలో పని చేస్తూ పదవీ విరమణ చేసి ప్రశాంత జీవితం గడుపుతున్నారు. అమరేంద్ర మంచి రచయిత. పదవీ విరమణ తర్వాత ఓ ప్రముఖ దినపత్రికకు గౌరవ సంపాదకుడిలా పని చేశాడు. అంతేకాక ఇటు ప్రభుత్వంలోనూ, అటు సమాజంలోనూ లోను పలుకుబడి ఉన్న వ్యక్తి. ప్రతిరోజు ఉదయం ఇద్దరూ జూబ్లీ పార్క్ లో కలిసి వాకింగ్ వెళ్తారు. ఇరు కుటుంబాల వారు చాలా బాగా కలసి మెలసి ఉంటారు.

నిజాం క్లబ్ రోజ్ గార్డెన్స్ లో టేబుల్ వద్ద కూర్చున్నారు ఇద్దరు మిత్రులు. డ్రింక్స్ స్నాక్స్ టేబుల్ మీద అమర్చి వెళ్లాడు వెయిటర్.

డ్రింక్స్ కలుపుతూ అడిగాడు శేఖర్ “చెప్పరా ఏమిటి విషయాలు?”

“చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవు రా. కాకపోతే..” అంటూ సగంలోనే ఆపేశాడు అమరేంద్ర.

“కాకపోతే ఏమిటి ఏదన్నా కొత్త నవలకు ప్లాట్ ఆలోచిస్తున్నావా లేకపోతే మళ్లీ ఎక్కడికన్నా ప్రయాణమా?”

“అలాంటివేం కాదురా. ఓ కన్ఫెషన్ లాంటిది.”

“పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావ్. ఏంటో చెప్పు” ఆసక్తిగా అడిగాడు శేఖర్.

“నా జీవితంలో ఎవ్వరికీ తెలియని ఓ సీక్రెట్ చాప్టర్ ఉంది. దాన్ని గురించి నీకు చెప్పాలనిపిస్తుంది. నీకంటే ఆప్తుడు నాకు ఎవరున్నారు!”

గ్లాసులో విస్కీని ఒక్క గుక్క లో తాగి“నాకు తెలియని రహస్యమా! అదేంటో త్వరగా చెప్పు. నాకు టెన్షన్ పెరిగిపోద్ది.” ముందుకు వంగి అమరేంద్ర కళ్ళల్లో చూస్తూ అడిగాడు శేఖర్.

అమరేంద్ర కూడా గ్లాసు ఖాళీ చేసి ఓ గాఢమైన నిట్టూర్పు విడుస్తూ వెనక్కు వాలి “మొన్న కాళహస్తిలో రాజేశ్వరి కనిపించిందిరా. 45 ఏళ్ల తర్వాత.”

“రాజేశ్వరా! ఆవిడ ఎవరు? నీ మనోరంజనా!”

పేవలంగా నవ్వాడు అమరేంద్ర.

“నాకు తెలియకుండా నీ జీవితంలో..”

“నీకే కాదురా ఎవ్వరికి తెలియని నా జీవిత అధ్యాయం. నాకు సంధ్యతో పెళ్లయిన రెండేళ్ల తర్వాత నువ్వు పరిచయం అయ్యావు. నీకు తెలియకపోవడానికి ఇదో కారణం.”

“ఇప్పటికైనా నీ ప్రేమ కావ్యాన్ని వినాలని ఆత్రుతగా ఉంది రా, చెప్పు” రెండవ రౌండ్‌కు గ్లాసులు నింపుతూ అన్నాడు శేఖర్.

“కావ్యం కాదురా తొలిప్రేమ మిగిల్చిన కలత. శేఖర్! మనిషి పరిస్థితులతో రాజీ పడకపోతే మనుగడ ఉండదు, అలా అని మనసు కోరుకున్నది కోల్పోతే మనస్థాపం మిగులుతుంది.”

“మిత్ర శేఖరా, మీ రచనా పటిమను, తత్వాన్ని ఆపి విషయానికి రా”

కుర్చీలో వెనక్కి వాలుతూ చెప్పడం మొదలుపెట్టాడు అమరేంద్ర.

“నేను ఉద్యోగంలో చేరిన మూడు నెలల తర్వాత వారం రోజులు సెలవు పెట్టి ఊరికి వెళ్లాను. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి హోమ్ సిక్. రెండవది హిందీ భాషలో ‘రాష్ట్ర భాష విశారద’ పరీక్ష పాస్ అయితే ఇంక్రిమెంట్ వస్తుంది. ఈ పరీక్షలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహిస్తారు. నేను స్కూల్లో చదివేటప్పుడు ప్రాథమిక, మధ్యమిక పరీక్షలు పాసైనాను. వాటికి కావలసిన పుస్తకాలు, కోచింగు మా హిందీ మాస్టారు ఇచ్చారు. ఈ పరీక్షకు కూడా ఆయన సహాయం తీసుకోవాలనుకున్నాను. అనుకున్న ప్రకారం ఓ రోజు సాయంత్రం మాస్టారు ఇంటికి వెళ్లి విషయం చెప్పాను. ఆయన అప్లికేషన్ ఫారం ఫిలప్ చేయించి సంతకం తీసుకొని కొన్ని పుస్తకాలు ఇచ్చారు. పరీక్ష తేదీకి 5 రోజుల ముందు వస్తే చాలు అన్నారు. నేను పుస్తకాలు తీసుకొని బయటికి నడిచాను. గుమ్మం దాటి నాలుగడుగులు వేయగానే వెనకనుంచి ‘ఏవండీ’అనే శ్రావ్యమైన పిలుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. ఓ క్షణం నా గుండె లయ తప్పింది. అదే మొదటిసారి రాజేశ్వరిని చూడటం.

“ఏవండీ నాన్నగారు ఈ గైడ్ మీకు ఇవ్వడం మరచి పోయారట, ఇందులో ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయట”. అంటూ నవ్వుతూ ఓ పుస్తకాన్ని అందించింది. ఆమె కళ్ళు, నవ్వు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే రూపం ఆమెది. పుస్తకాన్ని అందుకొని “మీ పేరేంటి” అని అడిగాను.

“ముందు మీరు ఈ పుస్తకాలన్నీ చదివి మంచి మార్కులతో పాసై రండి. అప్పుడు చెప్తాను నా పేరు” అంటూ కొంటెగా నవ్వి వెనక్కు వెళ్ళిపోయింది. అలా జరిగింది మా మొదటి పరిచయం. మా గురువుగారికి 7మంది సంతానం. 6 మంది కూతుర్లు ఒక కొడుకు. కొడుకు సుధీర్ నాకు స్నేహితుడు కూడా. రాజేశ్వరి ఐదవ అమ్మాయి. ఆమె కంటే పెద్దవాళ్లు ఇద్దరూ పెళ్లి పెళ్లిళ్లు చేసుకొని హైదరాబాదులో కాపురం ఉంటున్నారు. అన్న సుధీర్ కూడా హైదరాబాదులోనే ఉన్నాడు. చివరి చెల్లెలు 10వ తరగతి చదువుతుంది. క్లుప్తంగా ఇది మా మాస్టారు సంతానం గురించి.

ఇంటికి వచ్చినా ఆమె రూపం నా మనసులోనే మెదులుతుంది. గురువుగారి కూతుర్ని ఆశపడడం తప్పేమో అనిపించింది. అయినా ఉండబట్ట లేకపోయాను. అదే రోజు సాయంత్రం వాళ్ల ఇంటి వైపు వెళ్లాను. ఆమె కనిపిస్తుందని ఊహించాను. నా ఊహ నిజమైనది. తను ఇంకో అమ్మాయి తో కలిసి ఇంటి బయటే కూర్చొని నవ్వుతూ మాట్లాడుతుంది. నేను కొంచెం దగ్గరగా వెళ్లి “హలో” అన్నాను.

ఆమె నా వైపు అదోలా చూసి “ఏవండీ, నాన్నగారిని కలవాలా”? అని అడిగింది.

“అబ్బే లేదండి”

“మరి నన్ను కలవాలా?”

అంతే విస్తు పోయాను. కొంచెం తడబడుతూ “మా ఫ్రెండ్‌ని చూడడానికి వెళుతున్నానండి మీరు కనిపిస్తే..”

“ఎక్కడ మీ ఫ్రెండ్ ఇల్లు?”

“శివాలయం పక్కనoడి.”

“ఓ అలాగా పదండి, మేము శివాలయం వరకు వస్తాం” అంటూ ఇద్దరూ నడిచారు.

దారిలో నా గురించి నేను పరిచయం చేసుకున్నాను.

శివాలయం చేరుకున్న తర్వాత తను అడిగింది “ఎక్కడండి మీ ఫ్రెండ్ ఇల్లు?”

ఏం చెప్పాలో తోచలేదు. “ఇక్కడే” అని నసిగాను.

“అబద్ధం చెప్పడం కూడా ఒక ఆర్ట్ అండి. అది మీకు లేదు. నిజం చెప్పండి మీరు నా కోసమే వచ్చారు కదా?”

నేను ఇక దాచలేకపోయాను.

“అవునండి. తొలిచూపులోనే మీరంటే నాకు ఇష్టం ఏర్పడింది. మళ్లీ మళ్లీ మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని అనిపిస్తుంది.”

“లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. చూద్దాం, మీ ప్రేమలో ఎంత బలం ఉందో. ఓకే, రేపు కలుద్దాం.”

“ఎక్కడండి?” ఆత్రంగా అడిగాను.

నవ్వుతూ ఇక్కడే అన్నట్లు సైగ చేసి వెళ్లిపోయింది.

నా ఆనందానికి అవధులు లేవు.

మరుసటి రోజు శివాలయం మెట్ల మీద కూర్చుని మనసు విప్పి మాట్లాడుకున్నాము. నా లీవ్ పీరియడ్ అయిపోవచ్చింది. ఓ 100 రూపాయలు ఖర్చుపెట్టి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని 15 రోజులు సిక్ లీవ్ పెట్టాను. ఈ 15 రోజులు ప్రతిరోజు కలుసుకునేవాళ్ళం. మా మనసులు ఒకటైనాయి. జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాము. మా పెళ్ళికి ఇరువైపులా ఒప్పుకోరని మేమే ఓ నిర్ణయానికి వచ్చాము. వారికి ఎవ్వరికి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ తీసుకొని తరువాత అందరికీ చెపుదామనుకున్నాము. ఇది సరైన నిర్ణయమో, తొందరపాటో తెలుసుకొనే స్థితిలో లేము మేము. కావలసిన ఏర్పాట్లు చేసుకొని, నేను డ్యూటీలో జాయిన్ కావాలని ఇంట్లో చెప్పి బయలుదేరాను. రాజేశ్వరి గుడికి వెళుతున్నానని చెప్పి బస్టాండ్‌కు వచ్చింది.

ముందుగా ఇద్దరూ కలిసి విజయవాడకు వెళ్ళాము. కనకదుర్గమ్మ గుడి ప్రాంగణంలో ఓ గది తీసుకొన్నాము. దుర్గమ్మను దర్శించుకొని జీవితమంతా కలసి ఉంటామని, ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిపోమని ఒకరికొకరు ప్రమాణాలు చేసుకున్నాము. ఆ పవిత్ర స్థలంలో కూర్చుని భవిష్య ప్రణాళికను రూపొందించుకున్నాము. నా సెలవు రోజులు నాలుగు ఉన్నాయి. స్నేహితుడి సహాయంతో వెంటనే ఓ ఇల్లు అద్దెకు తీసుకోవాలని తర్వాతి రోజు రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లి పెళ్లికి పేర్లు నమోదు చేసుకోవాలని అనుకున్నాము. పేర్లు నమోదు చేసుకున్న 30 రోజుల తరువాత చట్ట పరంగా పెళ్లి జరుగుతుంది.

విజయవాడ నుంచి హైదరాబాదుకు ట్రంకాల్ చేసి నా రూమ్మేట్‌తో మాట్లాడాను. విషయమంతా చెప్పి ఒక్క రోజులోనే ఎక్కడైనా ఇల్లు చూసి పెట్టమని అడిగాను. మరుసటి రోజు బయలుదేరి హైదరాబాదు వెళ్ళాము. మాకోసం నా మిత్రుడు ఇందిరా పార్క్ దగ్గరగా అద్దెకు ఓ ఇల్లు చూసి పెట్టాడు. రెండు నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. నేరుగా అక్కడికే వెళ్ళాము. ఆ రోజంతా ఇంటికి కావలసిన సామాన్లు కొనడంలో సరిపోయింది. మరుసటి రోజు రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లి పేర్లు నమోదు చేసుకున్నాము.

ఏదో సాధించామనే తృప్తి మరోవైపు ఇష్టమైన వ్యక్తి జీవిత భాగస్వామి అవుతుందన్న ఆనందం. నాలుగవ రోజు భోజనాల తర్వాత రాజేశ్వరి మెల్లగా చెప్పసాగింది.

“అమర్, ఈరోజు మధ్యాహ్నం ఇందిరా పార్కు పబ్లిక్ బూత్ నుంచి మా రెండవ అక్కతో మాట్లాడాను. మన విషయం అంతా చెప్పాను. తను మనకు పూర్తిగా సహకరిస్తుంది. మిమ్మల్ని తీసుకుని తన ఇంటికి రమ్మని చెప్పింది. అన్ని సవ్యంగా జరిగేలా చూస్తానని మాట ఇచ్చింది.”

“అలాగే రాజి, నీ మాట ఎప్పుడు కాదంటాను. మీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని అండగా ఉంటానంటే ఇంకేం కావాలి. ఆదివారం ఉదయం వాళ్ళ ఇంటికి వెళదాం.”

అనుకున్న విధంగా వాళ్ల చిన్నక్కకు ఫోను చేసి ఆదివారం ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ల పెద్దక్క కూడా అక్కడే ఉంది. నన్ను చాలా మర్యాదగా ఆహ్వానించారు. నా జాబ్ గురించి మా తల్లిదండ్రుల గురించి అడిగారు. చాలా బాగా మాట్లాడారు. భోజనాల అనంతరం వాళ్ల పెద్దక్క ఇలా చెప్పసాగింది.

“చూడు బాబు మీరిద్దరూ ఇష్టపడిన తర్వాత మేము చేసేది ఏముంది! ఆశీర్వదించడం తప్ప. కాకపోతే మాది ఒక కోరిక. సాంప్రదాయ ప్రకారం పదిమందిలో పెళ్లి జరిగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఓ పది రోజులపాటు అమ్మాయిని ఇక్కడే ఉంచు. రేపు మా తమ్ముడు కూడా వస్తున్నాడు. మాట్లాడుకుని అమ్మానాన్నని పిలిపించి నచ్చ చెబుతాం. దగ్గరలోనే ఓ మంచి ముహూర్తం చూసి ఇక్కడే ఏదన్నా ఆలయంలో పెళ్లి జరిపిస్తాం. ఇది నా హామీ. అంతవరకు మీరిద్దరూ వేరుగా ఉండండి. ఓ పది రోజుల తర్వాత ఆఫీస్ నెంబర్‌కి ఫోన్ చేస్తాను. అప్పుడు రండి.”

ఆమె మాటలు నాకు మంచిగానే అనిపించాయి. సరే అన్నాను. ఆరోజు సాయంత్రం మా ఇద్దరినీ ఏకాంతంగా మేడ పైగదిలో వదిలేశారు. రాత్రికి ఇంటికి వచ్చేసాను. ఎలాంటి టెన్షన్ లేకుండా మరుసటి రోజు నుంచి ఆఫీసుకు వెళ్లాను.

కొంచెం భారంగానే 10 రోజులు గడిచాయి. ఈ పది రోజుల్లో రాజేశ్వరి కూడా ఒక్కసారైనా ఫోన్ చేయలేదు. బహుశా వాళ్ల వాళ్లు వారించి ఉంటారేమోననిపించింది. అలా రెండు వారాలు గడిచాయి. నాలో అలజడి మొదలైంది. ఇక ఉండలేక పోయాను.

ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్లాను. లోపల చాలామంది ఉన్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. కాలింగ్ బెల్ నొక్కిన రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎదురుగా వాళ్ల అన్నయ్య సుధీర్. నన్ను చూడగానే పలకరిస్తూ “హలో అమర్, బావున్నావా?” అన్నాడు.

“బాగున్నాను సుధీర్, నువ్వు ఎప్పుడు వచ్చావు? రాజేశ్వరి ఎలా ఉంది?” అని తడబాటుగా అడిగాను.

“పద ఎక్కడన్నా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుదాం” అంటూ నన్ను ఇంట్లోకి రానివ్వకుండా నా స్కూటర్ వెనకే కూర్చున్నాడు. దగ్గర్లో ఉండే ఓ పార్కుకి తీసుకెళ్లి చెప్ప సాగాడు. దాని సారాంశం ఏమిటంటే- తల్లిదండ్రులు గాని బంధువులు గాని కులాంతర వివాహాలకు ససేమిరా ఒప్పుకోరు. పరిస్థితులు చేయి దాటి పోకుండా రాజేశ్వరిని ప్రాధేయపడి భయపెట్టి దగ్గర బంధువైన ప్రసాద్ అనే వ్యక్తితో శుక్రవారం రోజే బిర్లా మందిర్‌లో పెళ్లి చేశారట. నూతన దంపతులిద్దరూ బంధువర్గంతో ఇంట్లోనే ఉన్నారట. అందుకే లోపలికి పిలవలేదట.

నా గుండెలు పిండేసినట్లు అయింది. రెండు నిమిషాలు కళ్ళముందు ఏమీ కనిపించలేదు. నేనేమీ మాట్లాడలేకపోయాను. ఏడుపును కంట్రోల్ చేసుకుంటున్నాను. కళ్ళనిండా నీళ్లతో “ఒక్కసారి రాజేశ్వరిని చూడాలి”. అన్నాను.

“అమర్, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఒక స్నేహితుడిగా నీ పరిస్థితికి సానుభూతి చూపగలను. కానీ ఒక అన్నగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నీ కోరిక తీర్చలేను. క్షమించు. జీవితంలో మనం ఇంకెప్పుడూ కలుసుకోకూడదని కోరుకొంటాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఐ విష్ యు ఏ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్.” అని చెప్పేసి అక్కడ నుంచి వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు. తర్వాత దాదాపు నెల రోజులు నాలో నేను ఇమడలేక పోయాను. అద్దెకు తీసుకున్న ఇల్లు వదిలేసాను. ఇచ్చిన అడ్వాన్సు, సమకూర్చిన సామాన్లు ఇంటి యజమానికే ఇచ్చేశాను. యాంత్రికంగా ఆఫీసుకు వెళ్లడం, రూముకు రావడం జరిగేది. ‘టైం ఇస్ ద బెస్ట్ హీలర్’ అంటారు. తాను చేసిన గాయం మానటానికి కొంత సమయం పట్టింది. తర్వాత అన్ని మామూలుగానే జరిగాయి. ఇది నా గుప్త గతం. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత సంధ్యతో నా పెళ్లయింది. మా పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత నీ పరిచయ భాగ్యం కలిగింది.”

శేఖర్ ఒక పెద్ద నిట్టూర్పు విడచి“ఇన్నాళ్ల నీ ప్రేమ కథ నాకు చెప్ప లేదే! ”

“అవసరం రాలేదు, పైగా గతాన్ని మరచి పోయాను. కాకపోతే మొన్న కాళహస్తిలో రాజేశ్వరి కలిసింది. నన్ను గుర్తుపట్టిందో లేదో తెలియదు కానీ మాట్లాడింది, సంధ్యతో కూడా మాట్లాడింది. అప్పుడే నా గతం మళ్లీ గుర్తుకొచ్చింది.”

“అదెలా జరిగింది.”

“దైవ దర్శనం తర్వాత నేను, సంధ్య బయట మండపం మెట్ల మీద కూర్చున్నాము. ఆ ఆలయ స్థల పురాణం గురించి సంధ్యకు చెబుతూ ఉన్నాను. అంతలో “ఏవండీ, ప్రసాదం తీసుకోండి” అని విని ప్రక్కకు చూశాను. ఓ క్షణం నివ్వెరపోయాను. ఎదురుగా రాజేశ్వరి ఆకులో ప్రసాదం పెట్టి అందించింది. నోట మాట రాక ఆశ్చర్యంగా చూస్తూ ప్రసాదం అందుకున్నాను. సంధ్య కు కూడా ప్రసాదం అందించి తన ప్రక్కనే కూర్చున్నది. నిశితంగా ఓ నిమిషం పాటు ఆమెను చూశాను. వెంట్రుకలు అక్కడక్కడ నెరసి ఉన్నాయి, కొంచెం లావయింది. సంధ్య పక్కన కూర్చుని మాట్లాడ సాగింది.

“మీరు ఎక్కడనుంచి వచ్చారండి?”

“హైదరాబాద్ అండి” సంధ్య జవాబు.

“ఓ, నేను విజయవాడ నుంచి వచ్చానండి. మా అబ్బాయి హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు పరీక్ష పాస్ అయ్యాడండి. వచ్చే వారంలో ఇంటర్వ్యూ. దేవుని దర్శించుకుని బాబు పేర అర్చన చేయించి వెళుతున్నానండి.”

“అలాగా, తప్పక సెలెక్ట్ అవుతాడు లెండి” ముక్తసరిగా అంది సంధ్య. స్వతహాగా సంధ్య మితభాషి.

“ఏదో మీ ఆశీర్వాదం వల్ల ఆ ఉద్యోగం వస్తే చాలు. మా ఆయన కాలం చేసిన తర్వాత చాలా కష్టపడి పెంచాను వాడిని.”

“కష్టాలు కలకాలం ఉండవండి.” సంధ్య ఊరట.

“ఇంతకీ మీ పేరు!” రాజేశ్వరి ప్రశ్న.

“సంధ్య”

“సంధ్యగారు, మీరెప్పుడన్నా విజయవాడ వస్తే మా ఇంటికి రండి. నేను దగ్గరుండి కనకదుర్గమ్మ దర్శనం చేయిస్తాను. నా ఫోన్ నెంబర్ ఉంచండి.” అని బ్యాగ్‌లో నుంచి కాగితం పెన్ను తీసి నంబర్ రాసి సంధ్యకు ఇచ్చింది. సంధ్య ఆ కాగితాన్ని నా జేబులో ఉంచింది.

నా గుండెల్లో ఏదో ముల్లు గుచ్చుకున్న భావన.

సంధ్య నవ్వుతూ “వీలైతే వస్తాం అండి” అంది.

“మరి వెళ్ళొస్తాం సంధ్య గారు” అని నా వైపు చూడకుండానే వెళ్లిపోయింది. ఇదిరా జరిగింది”.

“సో యువర్ ఫీలింగ్ డిప్రెసిడ్, యామై రైట్?” నిట్టూర్పు విడుస్తూ అన్నాడు శేఖర్.

“అలాంటిదేం లేదురా, కాకపోతే ఒకసారి..”

మధ్యలోనే అందుకుంటూ అన్నాడు శేఖర్ “ఒకసారి వెళ్లి చూసి మాట్లాడాలని అనుకుంటున్నావా? మంచి ఆలోచనే! కాళహస్తిలో ఆమె నిన్ను గుర్తుపట్టలేదని అనుకోవద్దు. కచ్చితంగా గుర్తుపట్టింది. ప్రసాదం నెపంతో నిన్ను చూడాలని దగ్గరకు వచ్చి నీ భార్యతో మాట్లాడింది. అంతే కాదు విజయవాడ కనకదుర్గమ్మను ప్రస్తావించడంలో కూడా ఆంతర్యం గతాన్ని గుర్తు చేసుకోవడం, చేయడం కూడా. ఒకసారి వెళ్లి కలిసి మాట్లాడి రా. వీలైతే వాళ్ళ అబ్బాయి ఉద్యోగ విషయంలో పరపతి ఉపయోగించు. వాళ్లకు సహాయం చేసినట్లు ఉంటుంది, నీకూ తృప్తిగా ఉంటుంది.”

ఓ అర నిమిషం మౌనం తర్వాత అమరేంద్ర అనునయంగా చెప్పడం మొదలుపెట్టాడు

“వద్దురా అది ఎమోషనల్ ఎప్రోచ్ అవుతుంది. చూడు మిత్రమా, కొందరి జీవితాల్లో ఇలాంటి తీపి, చేదు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మాది అలాంటిదే. మరుపనేది దేవుడు ఇచ్చిన వరం. మా విషయంలోనూ అదే జరిగింది. మేమిద్దరూ జీవితంతో రాజీ పడి గతాన్ని మరచి లక్షణంగా జీవిస్తున్నాము. గతాన్ని తలుచుకోవడంలో తప్పు లేదు కానీ తవ్వుకోకూడదు. నిశ్చలంగా ఉండే నీళ్లల్లో రాయి విసరడం మంచిది కాదు. శేఖర్! ఒకటి గుర్తుంచుకో, పరపతి అనేది సమాజం మనకిచ్చే గౌరవం. హోదా కాదు. దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు. ఆవిడ సుఖంగానే ఉంది. ఆ తృప్తి చాలు. నీతో చెప్పుకున్న తర్వాత మనసుకు ఊరట కలిగింది. గతాన్ని గతంగానే ఉండని. ‘గతం గతః..’ అన్నారు. ఇక లే వెళదాము. మా ఇంట్లోనే భోంచేసి పోదువు గాని.”

ఇద్దరు మిత్రులు కారు వైపు నడిచారు.

Exit mobile version