Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గెలుపెవరిది

[బాలబాలికల కోసం ‘గెలుపెవరిది’ అనే కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

అదొక అడవి. అడవి అంటే అనేక జంతువులు వుంటాయి కదా. వాటిల్లో లేళ్ళు కూడా వున్నాయి. మీకు తెలుసా? పిల్లల్లో అల్లరి పిల్లలు, బుధ్ధిమంతులు వున్నట్లే జంతువుల్లో కూడా రకరకాలు వుంటాయి. ఒకసారి రెండు లేడి పిల్లలు పరుగు పందెం వేసుకున్నాయి. అవి రెండూ కొంచెం అల్లరి లేళ్ళు. పిల్ల లేళ్ళు కదా. వాటికి చుట్టూ వున్న అడవి, దానిలో వుండే జంతువుల స్వభావాలు ఇంకా అంత తెలియవు. అన్ని జంతువులూ తమలాగే ఆడుతూ పాడుతూ వుంటాయనుకునే వయసు. అప్పటిదాకా లేళ్ళ గుంపులోనే వుంటూ, తల్లీ, తండ్రీ, ఇంకా గుంపు పెద్దల సంరక్షణలో వున్నాయి.

ఆ లేడి పిల్లల పేర్లు రాము, భీము అనుకోండి. అవి పరుగు పందెం వేసుకున్నాయన్నాను కదా. వాటికి పందెం అంటే ఒక నిర్ణీత స్ధలానికి ఎవరు ముందు చేరుకుంటారు వగైరా తెలియదు. పరుగులు తియ్యటమే తెలుసు. అందుకే ఎవరు ఎక్కువ వేగంతో ఎక్కువ దూరం పరిగెత్తుతారో వాళ్ళే గెలిచినట్లు అనుకున్నాయి.

పందెం మొదలయింది. రెండు లేళ్ళూ చాలా వేగంగా పరిగెత్తుతున్నాయి. ఎంత వేగంగా పరిగెత్తాయంటే వాటికి ఇంకో ధ్యాస లేదు, పరిగెత్తటం తప్పితే. అలా పరిగెత్తీ, పరిగెత్తీ చాలా దూరం వెళ్ళిపోయాయి. వాటి గుంపుకు దూరమయ్యాయి. ఎక్కువ దూరం పరిగెత్తటంవల్ల రెండు లేళ్ళకీ చాలా ఆయాసం వచ్చింది. ఒక చోటికెళ్ళేసరికి ఎదురుగా చిన్న నీటి గుంట కనబడింది. అది చూడగానే రెండు లేళ్ళకీ ఒకేసారి విపరీతమైన దాహం వేసింది. రెండూ ఒకేసారి ఆ నీళ్ళు తాగాలనుకున్నాయి.

కానీ ఆ నీటి గుంట చాలా చిన్నది. రాము, భీము రెండూ ఒకేసారి తలలు పెట్టి తాగేంత పెద్దదిగా లేదు. దానితో అక్కడ మళ్ళీ పోటీ మొదలయింది. ముందు నేను తాగుతానని రాము అంటే లేను నేను ముందు వచ్చాను, నేను ముందు చూశాను, అందుకని నేనే తాగుతానని భీము అన్నాడు. నేను చిన్నవాణ్ణి, నేను ముందు తాగి నీకూ నీళ్ళు అట్టి పెడతానని రాము అంటే, నేను పెద్దవాణ్ణి, పైగా ముందు వచ్చాను, కనుక నేనే తాగాలి, నువ్వు ఆగు అని భీము వాదనకి దిగాడు. అలా ఇద్దరూ పట్టు విడవకుండా, ఎవరూ నీళ్ళు తాగకుండా, విపరీతంగా పోట్లాడుకోవటం మొదలు పెట్టాయి.

మనుషులయినా అంతే కదా. ఆవేశం, కోపం వస్తే ఎంత గొప్పవారయినా ఆవేశంతో పెద్దగా అరిచి పోట్లాటకి దిగుతారు. కానీ దాని మూలంగా నష్టం ఎవరికి వాళ్ళకే. ప్రశాంతంగా వుండలేరు. ఆరోగ్యం పాడవుతుంది. ఆ పోట్లాటల ఆవేశం, ఆలోచనలు తర్వాత కూడా చాలా సేపు వుండి తమ పనులు సరిగా చేసుకోనివ్వవు. అందుకే ఎంత కోపం వచ్చినా దానిని తగ్గించుకుని నెమ్మదిగా మాట్లాడటం నేర్చుకోవాలి.

సరే. మళ్ళీ కథలోకి వెళ్తే, రాము, భీము అలా వదలకుండా పోట్లాడుకుంటూనే వుండటం అక్కడున్న చెట్టుమీదనుంచి రెండు గద్దలు చూశాయి. గద్దలు చనిపోయిన జంతువుల శరీరాలను పీక్కు తింటాయి. వాటి ఆహారం అది. రాము, భీము ఆపకుండా మాటలతోనే కాదు, ఒకదాని మీద ఇంకోటి దూకి బల ప్రదర్శన కూడా మొదలెట్టాయి. దాన్ని చూసి ఆ గద్దలు ఒక దానితో ఇంకోటి చెప్పుకున్నాయి, కొంచెం సేపు ఆగితే మనకి మంచి ఆహారం దొరుకుతుంది. ఈ రెండు లేళ్ళూ ఒకదానితో ఒకటి కొట్టుకుని చచ్చిపోతాయి. అప్పుడు మనం వీటిని కడుపునిండా తినచ్చు అని అవి ఈ లేళ్ళు ఇంకా ఎక్కువగా ఎప్పుడు పోట్లాట పెంచుతాయా, ఎప్పుడు వాటికి ఆహారం దొరుకుతుందా అని చూడసాగాయి.

భీము కొంచెం పెద్దది కదా. అది ఈ గద్దలని చూసింది. వాటి ఆలోచన కూడా పసికట్టింది. వెంటనే రాముతో పోట్లాడటం మానేసి, సరే రామూ, నువ్వు చిన్నవాడివిగనుక, బాగా అలసిపోయావు గనుక ముందు నువ్వే నీళ్ళు తాగు. కానీ నాకు కూడా కొన్ని మిగుల్చు అన్నది. రాము సంతోషంగా కొంచెం నీళ్ళు తాగి భీముతో, అన్నా, నువ్వు కూడా తాగు. ఇంకా వుంటే మళ్ళీ తాగుదాం అన్నది. అలా ఇద్దరూ రాజీ పడటంవల్ల ఇద్దరూ సంతోషంగా తిరిగి తమ గుంపును చేరుకున్నాయి. సమస్య చక్కగా పరిష్కారమయింది.

Exit mobile version