Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గెలుపు పిలుపు వినిపిస్తుంది-1

[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి ‘గెలుపు పిలుపు వినిపిస్తుంది’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]

నా వీపుపై విమానం, గట్టిగా మోత మోగించిన తరువాత (ఏదో బాగుందని వాడాను గానీ, వీపు ఫ్రాక్చర్ అయిందంటే ఏం బాగుంటుంది?), నా ఎడమచెయ్యి టైట్ అయిపోయింది. దానిక్కారణం, ఆంగ్లంలో ‘ఫ్రోజెన్ షోల్డర్,’ అంటే అచ్చతెలుగులో ‘గడ్డకట్టుకున్న భుజం’ అన్నమాట. ఈ మాట, నేననుభవిస్తున్న వ్యథలా చాలా అసహ్యంగా ఉంది.

అది చాలదన్నట్టు, నొప్పిని తగ్గించేందుకు వాడే ఈ మందుల పుణ్యమా అని నీరసం ఎక్కువైపోయింది. కడుపు మండిపోతోంది, ఎసిడిటీ వల్ల. నడకలో ధైర్యానికి బదులు బెరుకు చోటుచేసుకుంది. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లల్లా అడుగులో అడుగేసుకుని నడుస్తున్నాను, ఏడడుగులు నడవాల్సిన వయసులో!

ఇదే సమయంలో నాకు బండినీ, డ్రైవరునూ పంపాల్సిన ట్రావెల్స్ వాళ్ళు డ్రైవరులతో గొడవ పెట్టుకున్నట్టున్నారు. నాకు వాడుకగా వచ్చే అతను, “మాకూ-మాకూ పొరపొచ్చాలు వచ్చాయి. ఈ ఓనర్తో పనిచేయలేను. ఏమీ అనుకోకండమ్మా! మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, అంతకన్నా మంచి మనిషి. నన్ను డ్రైవరుగా ఏనాడూ చూడలేదు. మనిషిగా గౌరవించారు. మీకు పర్సనల్‌గా ఏమైనా బండి కావలిస్తే చెప్పండి. మార్కెట్ రేటు కన్నా తక్కువకు మీకు కడతాను,” అన్నాడు బాధగా.

ఆఫీసేతర పనులకు నేను ఆఫీసు బండి వాడననీ, ఆటోలో వెళ్తాననీ అతనికి తెలుసు. అందుకే మరో ఆప్షన్ ఇవ్వడానికి చెప్పాడని అనుకుంటా! “తప్పకుండా తరుణ్! కానీ డ్రైవింగ్ మీకు బ్రతుకుతెరువు. ఇలాంటి మొహమాటాలు పెట్టుకుంటే నష్టం రాదూ? మార్కెట్ రేట్లకే బండి పెట్టేటట్టయితే పిలుస్తాను,” అని చెప్పి, లోపలికి వెళ్ళి ఫ్రిజ్లో ఉన్న కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చి, అతనికి ఇచ్చాను.

అతనేదో మంచివాడు కనుక అలా అన్నాడు గానీ, అవకాశం దొరికింది కదా అని సిగ్గులేకుండా డిస్కౌంట్ అడిగే కుసంస్కారం నాకు లేదు. క్యాబ్ అంటే ఎప్పుడైనా ఆటో కన్నా ఎక్కువ చెల్లించాలి కదా! ఇప్పుడిన్ని కష్టాలలో ఎంత డబ్బు ఖర్చవుతుందో తెలియక గిలగిలలాడిపోతుంటే, కరువులో అధికమాసంలా నాకు ఈ టాక్సీ ఛార్జీలొక్కటే తక్కువ!

ఎంత తక్కువ హైట్ ఉన్న కార్ అయినా డ్రైవరు సాయం లేకుండా నా అంతట నేను కార్ ఎక్కలేను, దిగలేను. అందుకని కార్లో కూర్చుని నన్ను డోర్ వేయమనే డ్రైవరు నాకు సరిపోడు. నా ఎడమ భుజాన్ని, మోచేతినీ కదలకుండా పట్టుకుని, అలాగని గట్టిగా నొక్కకుండా సాయం చేయాలి. వాళ్ళ ఓనర్‌తో నా కష్టం గురించి చెప్పి, నాకు మనిషి సాయం కావాలన్న విషయం అతనికి గుర్తు చేయమన్నాను.

ఆ తరువాత చూసుకోవాలి, రోజుకో డ్రైవరు చొప్పున అందరూ నా ఎడమ చేతిని రఫ్ఫాడేశారు. అరచేతిని పట్టుకుని బయటికి లాగేవారు ఒకరైతే, తన చేయినిచ్చి పట్టుకోమనేవారు మరొకరు. ఇలా తలకొక విధంగా నా చేతిని రాచిరంపాన పెట్టేస్తే, నా భుజం నుండి చెయ్యి ఊడిపోతుందేమో అని భయపడ్డాను. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. బహుశః నా జాతకం బొత్తిగా బాగులేదేమో! లేకపోతే నా కర్మ కాలుతూ ఉండచ్చు కూడా!

***

విశాఖలో ఈమధ్య ఎండాకాలం ఎక్కువ రోజులుంటోంది. కారణం, ‘క్లీన్ అండ్ గ్రీన్’ నుండి ‘కాంక్రీట్ జంగిల్’ గా మారిపోవడమేనేమో! ఇదివరలో తుఫాను వస్తే జనాలు భయపడే వారట. అమ్మ చెప్పింది. కానీ ఇప్పుడు.. ఊహూఁ! వాన కురిస్తే చాలు, పండుగ రోజల్లే జనాలు బీచ్ రోడ్డు వద్దకు వెళ్ళిపోయి, అక్కడ ఉండే గోడమీద కూర్చుని, ఏనుగు రంగులో ఉండే ఆకాశానికి, ఆ రంగుని ప్రతిబింబించే సముద్రానికీ తెగ వీడియోలు తీసేస్తున్నారు. వాళ్ళంతా కుర్రకారు గనుక ఆ పని చేయగలుగుతున్నారు. నేను కూడా కుర్రకారో, బస్సో అయినా బాధ్యతలున్నాయి గనుక ఆ పనులు చేయలేను.

అటువంటి ఒకానొక రోజున నేను ఆఫీసుకు వెళ్తే, అక్కడి లిఫ్ట్ బబ్బుందని తెలిసింది. కొత్త లిఫ్ట్ పెట్టి ఏడాది కూడా కాలేదు కదా! వారంటీలో పనిచేయకపోతే లిఫ్ట్ తయారు చేసిన కంపెనీ వాళ్ళు జరిమానా కట్టాలి కదా! మరి ఎలా, అనుకుని, ముందు వ్యవస్థ తిన్నగా నడుస్తోందో లేదో చూద్దామనుకుని, లిఫ్ట్ బయట పేర్కొనబడిన కాంటాక్ట్ నెంబర్‌కు ఫోన్ చేయబోయాను.

రోజూ ఆ నెంబర్లు అందరూ చూస్తారు గానీ, ఎవరూ పట్టించుకోరు. ఆ ముందురోజు వరకూ నేనూ అంతే! నెంబర్ ఫోన్లో ఎక్కించి ‘కాల్’ బటన్ నొక్కేముందు ఎవరికి ఆ కాల్ కనెక్ట్ అవుతుందో చూశాను; చూసి ఖంగు తిన్నాను. అసలు వీళ్ళకు బుద్ధుందా, అని తిట్టుకున్నాను – అక్కడ ఇవ్వబడినది కస్టమర్ కేర్ నెంబర్. మరి తిట్టుకోనూ?

లిఫ్ట్ కొన్నది ఆఫీసు అయితే, ఏ అధికారి పోస్టు పేరిట దాన్ని కొన్నారో, ఎవరి అధికారిక నెంబర్ ఫిర్యాదులకు నమోదు చేయబడిందో, ఆఫీసుకు ఉద్యోగరీత్యా వచ్చిపోయే నాబోటివాళ్ళకు ఏం తెలుస్తుంది? మొత్తానికి అంతర్గత వ్యవహారాల ఆఫీసర్‌కు ఫోన్ చేశాను.

లిఫ్ట్ అంతా బాగానే ఉందనీ, క్రిందటి రాత్రి కురిసిన వానవల్ల దానిలో నీళ్ళు చేరుకున్నాయనీ, జనాలకి షాక్ కొట్టకుండా ముందస్తు జాగ్రత్తగా దాన్ని స్విచ్ఆఫ్ చేశారనీ చెప్పారాయన. లిఫ్ట్ లోపలికి నీళ్ళు రావడమేమిటి? సీలింగ్ లీక్ అయ్యిందేమోనన్న అనుమానాన్ని వెలిబుచ్చాను. కాదన్నారు ఆయన. లిఫ్ట్ వద్దకు చేరుకోవడానికి వేసిన ర్యాంప్ తాలూకు వాలు సరిగా లేదట. నీళ్ళు రోడ్డువైపు పారకుండా, లిఫ్ట్ లోపలకి పారేటట్టు వాలు ఏర్పాటు చేశారట. ఉమ్మడిగొడ్డు పుచ్చి, చచ్చినట్టు, లిఫ్ట్ మన సొంత ఇంట్లో లేదు గనుక వాలు ఎటో కూడా పట్టించుకోలేదు ఈ జనాలు!

పైగా, ఇంతోటి ఈ తికమక లిఫ్ట్‌కు ఒక పెద్ద హడావుడి చేశారు వీళ్ళు. జంధ్యాలగారి భాషలో చెప్పాలంటే, ‘వాలెరుగని కుంకకు ప్రారంభోత్సవమూ, రిబ్బన్ కటింగూ, ప్రెస్ మీటూ ఏలనో!’ అని అనవచ్చేమో! వాళ్ళెటువంటి కుంకలో గాని, ప్రజాధనాన్ని మాత్రం దర్జాగా దుర్వినియోగించేశారు!

‘నీరు లిఫ్ట్‌ను ఎరుగు-లిఫ్ట్ స్విచ్ఆఫ్‌ను ఎరుగు’ అనే కొత్త సామెత రూపుదిద్దుకుంటుందేమో! ఈ పరిస్థితి చూసి, మనుషుల సంగతి దేవుడెరుగు, ఒకే రోజు మరో షాక్కు గురయ్యాను నేను! సాధారణంగా సాంకేతిక నిపుణులు బలిష్ఠంగా ఉంటారు. తాము మెట్లెక్కి పైకి వెళ్ళగలరు కదా అని వసతుల ఏర్పాటులో ఇలా డిస్కౌంట్ ఇచ్చేస్తే ఎలా? అవసరం ఉన్నవాళ్ళు ఇబ్బంది పడరూ!

ఆ ఇబ్బందికి మనుష్య రూపమిచ్చినట్టు వీల్ చెయిర్‌లో ఒక అబ్బాయి నా ఎదురుగుండా ఉన్నాడు. మూడవ ఫ్లోర్‌లో ఆధార్ కార్డుల కేంద్రం ఉంది – అక్కడ పనుందట. అతణ్ణి చూసి కాలం ఆగిపోయినట్టు అనిపించింది నాకు. ఆ ప్రభుత్వాఫీసులో లిఫ్ట్ ఉందా, లేదా అనేది కనుక్కుని ఉంటాడా అబ్బాయి. ఉన్న ఆ లిఫ్ట్ వాననీరు చేరుకోవడం వలన పనిచేయదేమో అన్న విచిత్ర ఊహ అతనికేమిటి, ఎవరికీ కూడా రాదు కదా!

నేను వెళ్ళాల్సింది కూడా అదే ఫ్లోర్ కని, ఆధార్ ఆఫీసు వాళ్ళతో అతని విషయం చెప్పి, ఎవరినైనా పంపిస్తాననీ చెప్పి, కాళ్ళీడ్చుకుంటూ, మధ్య మధ్య ఆగుతూ, రొప్పుతూ ఆఫీసు చేరుకున్నాను, అదీ మా ఆఫీసు బాయ్ చేతిని గట్టిగా పట్టుకుని. మధ్యలో మంచినీళ్ళు తాగాలనిపించినా, వీల్ చెయిర్‌లోని ఆ అబ్బాయిని గుర్తుకు తెచ్చుకుని, ఆగకుండా వచ్చేశాను.

నా ఛాంబర్ చేరుకున్నాక కూడా, ఆధార్ ఆఫీసులోని ఆఫీసర్‌కు ఫోన్ చేసి, వీల్ చెయిర్‌లోని ఆ అబ్బాయి సంగతి చెప్పి, అతనికి ఒక పని ఉందనీ, క్రిందికి వెళ్ళి మద్దతివ్వమనీ, అతను కోరే సేవ కోసం క్రిందికి వెళ్ళడానికి అదనపు రుసుము చెల్లించాల్సి వస్తే, నేనిస్తాననీ చెప్పి, బ్యాగ్ తెరిచి, పెయిన్ కిల్లర్ వేసుకుని, అప్పుడు మంచినీళ్ళు గడగడా తాగాను.

***

ఒకరోజు అలవాటు ప్రకారం జీతంలో కొంతభాగం తెచ్చుకోవడానికి ఏటీయం దగ్గరకు వెళ్ళాను. ఇదివరకు చకచకా నేను ఎక్కిన ఆ మెట్లు ఇప్పుడు మోకాలిపర్వతపు మెట్లలా అనిపించాయి. పోనీ, రెయిలింగ్ ఉంటే పట్టుకుని ఎక్కుదామని అనుకున్నాను. అక్కడ ఉంది, కానీ, పక్కనే పెద్ద పూలకుండీలు, వాటిలో బ్రహ్మజెముడు, అలసంద, క్రోటన్స్ వగైరాలున్నాయి. అంటే, పూలకుండీల్లో పూలు లేవన్నమాట!

అందం చర్మమంత మందంగానే ఉంటుందని ఆంగ్లనానుడి. ఈ బాహ్యసౌందర్యం కోసం వీళ్ళు జనాలను ఎలా ఇబ్బంది పెడుతున్నారో, అని బాధపడ్డాను. నేను ఆజానుబాహువును కాను కాబట్టి నాకు రెయిలింగ్ అందలేదు. ఎవరి సహాయం తీసుకుందామా అని చుట్టూ కలయజూశాను. ఎవరికి వారు హడవుడిలో ఉన్నవారే! ఎవరిని మాత్రం డిస్టర్బ్ చేయడం బాగుంటుంది? నన్ను దొంగనుకునే ఆస్కారం ఉంది కదూ!

మూలగా నిలబడి, వచ్చేపోయేవారిని పరిశీలనగా చూస్తూ, తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డ్ కనిపించాడు.

“సెక్యూరిటీ అన్నా!” అని అతణ్ణి ఓ రెండుసార్లు పిలుస్తేగాని అతనికి వినపడలేదు. అక్కడ అంత హడావుడిగా ఉంది మరి! అతను రాగానే, “కాస్త ఈ మెట్లు ఎక్కేందుకు నా చెయ్యి పట్టుకుంటారా?” అని అడిగాను.

అభిమానంతో, “మేడమ్, మీకు సహాయం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అయినా, మరొకరి సహాయం లేకుండా ఎక్కి దిగేందుకు, అదుగో, ఆ ర్యాంప్ను ఏర్పాటు చేశారు ఈ బ్యాంక్ వాళ్ళు,” ఒకపక్క నాకు సాయం చేస్తూనే, మరోచేత్తో ర్యాంప్‌ను చూపించాడు అన్న.

“థాంక్స్ అన్నా! వచ్చేటప్పుడు అలాగే వస్తా!” అని లోపలికి వెళ్ళాను.

వచ్చేటప్పుడు ర్యాంప్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ రెండు వైపులా రెయిలింగ్ ఉంది. ఓహో, వీళ్ళకు కొంచెం రూల్స్ తెలుసునే, అనుకునేలోగా దాన్ని తేరిపారజూశాను. అవును, అది ఇరుకుగా ఉంది. అంటే, వీల్ చెయిర్‌లో ఉండే మనుషులు ఎలా వాడుతారు? పైగా, అది చాలా నిటారుగా ఉంది. అంటే, అది దివ్యాంగులకు ఏం ఉపయోగపడుతుంది?

ప్రభుత్వం ఆదేశాల మేరకు ముప్ఫై డిగ్రీలకన్నా వాలుండకూడదు. మనం చిన్నప్పుడు త్రికోణాన్ని గీసేటప్పుడు ప్రొట్రాక్టర్ (కోణమానిని) అనే పరికరాన్ని వాడాము కదా! అందులో అతిపిన్న కోణమైన ముప్ఫై డిగ్రీలు ఎంత తక్కువ వాలుతో ఉంటుంది? అంటే చాలా చిన్నవాలు ఏర్పాటు చేయాలన్నమాట! మరిక్కడలా లేదు మరి!

ఒకప్పుడు, మా అమ్మ చిన్నప్పుడు, వాళ్ళ బాబాయి ఏదో పనుందని చెప్పి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసే ఒక లెక్చరర్ గారిని కలవడానికి వెళ్దామని, వాళ్ళింటికి మా అమ్మను కూడా తీసుకుని వెళ్ళారట. అప్పుడు ఆటో అబ్బాయితో ‘పిఠాపురం క్వార్టర్స్’ అని చిన్నతాత చెప్పారట. అందుకని, వాళ్ళని అతను యూనివర్సిటీ హైస్కూల్ దగ్గర దింపి, వెళ్ళిపోయాడట.

అక్కడ ఆ స్నేహితుడి పేరు, ఇతర వివరాలూ చెప్తే, అక్కడుండేవి ఆఫీసు వాళ్ళ క్వార్టర్స్ అనీ, పాఠాలు చెప్పే వాళ్ళ ఇళ్ళు ఇంకా డౌన్లో ఉన్నాయనీ, వాటిని ‘బీచ్ క్వార్టర్స్’ అంటారనీ చెప్పారట. ఆ డౌన్‌లో నడుస్తూంటే, మా అమ్మ భయపడిపోయి, నడవనని మొండికేసిందట. అప్పుడు చిన్నతాత ఆమెను ఎత్తుకుని, అడుగులో అడుగేసుకుంటూ ఆ డౌన్ దిగారట! అదెలా ఉంటుందో నేను చూడలేదు గానీ, ఈ నిటారు ర్యాంప్‌ను చూస్తే, ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన ఆ విషయం గుర్తుకు వచ్చింది. కానీ మా అమ్మ చిన్నప్పుడు వాలు గురించి ఇలాంటి అవగాహన ఉంటుంది అనుకోవడం సమంజసం కాదు కదా!

ఏది ఏమైనా సరే, నేను ఈ మధ్యనే దెబ్బ తగుల్చుకున్న దాన్ని కాబట్టి, నన్ను నేను దివ్యాంగురాలిని అనుకోను కాబట్టి, ప్రయత్నిద్దామని నిర్ణయించుకున్నాను. నేను ఒక అడుగు వేస్తే, నా ప్రమేయం లేకుండా రెండు మూడు అడుగులు పడడం మొదలెట్టాయి. అంటే నాలో ఉన్న గురుత్వాకర్షణ కేంద్రాన్ని నేను స్థిరంగా ఉంచలేకపోయానన్న మాట!

అయినా సరే, నా ఇష్టదైవాన్ని తలుచుకుంటూ, ముందుకే అడుగేశాను. తీరా చివరికంటా వచ్చేసరికి నేను షాక్ తిన్నాను. అక్కడ ల్యాండింగ్ లేదు. ఎవరైనా ముందడుగు వేసుకుంటూ పోతే, తిన్నగా తెరచి ఉన్న కుళ్ళు కాలువలో పడతారన్నమాట! అదీ మనవాళ్ళ పనితనం. ఉఫ్.

పోనీ, ఆ సెక్యూరిటీ అన్నను పిలుద్దామంటే, అతను నా కనుచూపు మేరలో లేడు. వెనుదిరుగలేక, వెనక్కు నడుచుకు వచ్చాను. వచ్చాననే కంటే నడవలేక చచ్చాననేది వాస్తవం. ఈమాటు దిగే ప్రయత్నం చేయకుండా, లోపలికి వెళ్ళి బ్రాంచి మేనేజర్‌ను కలుద్దామనుకున్నాను. ఆరోజు జోనల్ ఆఫీసులో ఏదో మీటింగ్ ఉందని వెళ్ళాడట. బ్యాంకింగ్ పని పూర్తి అయ్యాక అకౌంటు తనిఖీ చేయడానికే వస్తాడట. అతని ఫోన్ నెంబర్ తీసుకుని, బయటకు వచ్చి, మళ్ళీ సెక్యూరిటీ అన్నను సాయం చేయమని కోరాను.

అతను చేయి అందిస్తూనే, “ర్యాంప్ గురించి మరచిపోయారా మేడమ్?” అని అడిగాడు.

“లేదు. మీ వాళ్ళెవరైనా ఆ ర్యాంప్ అసలు ఎలా కట్టబడిందో చూశారా అసలు?” అని చెప్పి, అతణ్ణి నాతో రమ్మని, అదెలా కుళ్ళుకాలువలోనికి దారి తీస్తోందో చూపించాను.

“అన్నా, దీనిలో మీ ప్రమేయమేమీ లేదని నాకు తెలుసు. కానీ, ఇదిలా ఉన్నంత కాలమూ దీని గురించి ఎవరితోనూ దయచేసి చెప్పకండి,” అని ప్రాధేయపడి, తిరిగివచ్చాను.

(ఇంకా ఉంది)

Exit mobile version