[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి ‘గెలుపు పిలుపు వినిపిస్తుంది’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]
[విశాఖలో ఉండే స్పందన అనే ప్రభుత్వాధికారిణి తన అనుభవాలను చెబుతూంటుంది. ఫ్రోజెన్ షోల్డర్ సమస్య వల్ల బ్యాక్ ఫ్రాక్చర్ అయి ఇబ్బంది పడుతుంది. మందుల వల్ల ఎసిడిటీ పెరిగి కడుపు మండుతూ ఉంటుంది. ఓ రోజు ఆమె ఒక ఆఫీసుకు వెళ్తుంది. అక్కడ లిఫ్ట్ పనిచేయదు. కంప్లైంట్ చేద్దామని చూస్తే, అక్కడ ఇచ్చిన నెంబర్ కస్టమర్ కేర్ వాళ్ళదని గ్రహించి, కాల్ చేసినా ఉపయోగం ఉండదని భావించి, అంతర్గత వ్యవహారాల ఆఫీసర్‌కి ఫోన్ చేసి కారణం కనుక్కుంటుంది. లిఫ్ట్ లోకి నీళ్ళు రావడం వల్ల, ముందు జాగ్రత్తగా దాన్ని స్విచ్ ఆఫ్ చేశారని చెప్తాడాయన. లిఫ్ట్ వద్దకు చేరుకోవడానికి వేసిన ర్యాంప్ తాలూకు వాలు సరిగా లేక, రాత్రి కురిసిన వానకి నీరు లిఫ్ట్ లోకి వచ్చేశాయట. అంతలో అక్కడ వీల్ చెయిర్లో ఉన్న ఓ అబ్బాయిని చూస్తుందామె. మూడో అంతస్తులో ఉన్న ఆధార్ కేంద్రంలో అతనికి పని ఉందట. తాను కూడా అదే అంతస్తుకి వెళ్తున్నానని, ఆఫీసు సిబ్బందితో అతని విషయం చెప్పి ఎవరినైనా క్రిందకి పంపిస్తానని చెప్పి, నెమ్మదిగా మెట్లెక్కి పైకి చేరుతుంది. చెప్పినట్టుగానే, ఆధార్ ఆఫీసులోని అధికారికి ఫోన్ చేసి, క్రింద ఉన్న అబ్బాయికి సాయం చేసేలా చేస్తుంది. ఓరోజు క్యాష్ తీసుకుందామని ఎటిఎంకి వెళ్తుంది. అక్కడ మెట్ల పక్కన ఉన్న రైలింగ్ పక్కనే పెద్ద పూలకుండీలు, వాటిలో బ్రహ్మజెముడు, అలసంద, క్రోటన్స్ వగైరాలు ఉండడంటే, రైలింగ్ పట్టుకోలేకపోతుంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ సాయంతో పైకి ఎక్కి లోపలికి వెళ్తుంది. అక్కడ ర్యాంప్ ఉందని సెక్యూరిటీ గార్డ్ ఆమెకు చెప్తాడు. వచ్చేటప్పుడు దాని మీద నుంచి వస్తానని అంటుంది. క్రిందకి వచ్చేటప్పుడు ర్యాంప్ వైపు వెళ్తుంది. అది చాలా ఇరుకుగా ఉంటుంది, వాలుగా కాకుండా నిటారుగా ఉంటుంది. వీల్ చెయిర్ ఎక్కలేదు. అంటే దివ్యాంగులకి ఉపయోగపడదని గ్రహిస్తుంది. మెల్లిగా క్రిందకి దిగుతుంది. కానీ అక్కడ ల్యాండింగ్ ఉండదు. ఆ స్థానంలో ఓ మురికి కాలవ ఉంటుంది. మళ్ళీ పైకెక్కి, మెట్ల మీద నుంచి దిగుతుంది. అది చూసిన సెక్యూరిటీ గార్డు ర్యాంప్ గురించి చెబితే, అందులోని లోపాలను వివరిస్తుంది. – ఇక చదవండి.]
మరి రెండునెలల తరువాత..
నేను అత్యంత బిజీగా ఉండే సమయంలో మా డ్రైవరు మరొక వ్యక్తిని తీసుకుని వచ్చి, నన్ను చూడాలని కోరాడన్న వార్తను మా సహాయకుడు తీసుకుని వచ్చాడు. ఏం పనో కనుక్కుని రమ్మన్నాను. నా బండి తాలూకు బిల్లుకు సంబంధించి ఏదో మాట్లాడాలట. నేను ఆశ్చర్యపోయాను.
నేను రోజుకు ఎన్ని కిలోమీటర్లు తిరిగానో లెక్క చూసుకుంటాను. ఎప్పటికప్పుడు డ్రైవరు దగ్గర ఉండే లాగ్‌బుక్‌ను ధ్రువీకరిస్తాను. మరి, ఈ కలవడం ఎందుకో కనుక్కోమందామని ఆలోచించి, అదే విషయం మా ప్యూన్ ఉరఫ్ సహాయకుడికి చెప్దామనుకున్నాను. మా అబ్బాయిని అటూ-ఇటూ తిప్పడం తప్ప ఈ రాయబారం వల్ల జరగబోయే మేలేమీలేదని గ్రహించాను. అయితే నాకు అప్పుడు ఖాళీ లేదే! మళ్ళీ నా ఎంగేజిమెంట్ బోర్డువైపు చూసి, సాయంత్రం అయిదున్నరకు ఖాళీ ఉందని గ్రహించి, ఆ విషయమే వారికి కబురంపాను.
ఈలోగా వేరే ఆఫీసుకు వెళ్ళవలసి వచ్చింది. డ్రైవరును విషయం అడిగాను. తనతోపాటు వచ్చినతను మా కార్ల కాంట్రాక్టర్ అట. ఎందుకు కలవాలనుకున్నాడో తెలియదన్నాడు. అసలు ఒక నిజాయితీపరురాలైన అధికారిణినైన నాతో, ఒక కాంట్రాక్టర్‌కు ఏం పనుంటుంది?
కొంపదీసి తన బిల్లును పెంచుకోవడానికి నన్ను కలవాలని అనుకుంటున్నాడా, ఏం? ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు కదా! ఎదుటివారిని కలిసేముందు వాళ్ళ గురించి కనుక్కోవాలి కదా! వృత్తిధర్మాన్ని పాటిస్తాను గనుక ఇచ్చిన అపాయింట్మెంట్లు రద్దు చేయను గాని, ఆ సాయంత్రం, అంతా బిజీ-బిజీగా ఉన్న రోజున ఓ అరగంట వృథా పోతుందంటే బాధగా ఉండదూ?
***
వెళ్ళిన పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా చిన్న తుంపర పడింది. నా ఆలోచనలు లిఫ్ట్ పైకి మళ్ళాయి. ఎంత వానపడితే లిఫ్ట్ పనిచేయకుండా ఆగిపోతుంది? నా పిచ్చిగానీ, నేనేమైనా వాతావరణ శాఖకు చెందినదాన్నా, ఇటువంటి పరిశోధనలు చేయడానికి? కనీసం విద్యుత్ ఇంజనీర్ని కూడా కాను. మళ్ళీ రెండు గంటలకోసం లిఫ్ట్‌లు ఆపొద్దని మనసులోనే సంపత్ వినాయకుణ్ణి ప్రార్థించుకున్నాను.
***
ఆఫీసు చేరగానే ముందు నేలకేసి చూశాను. ఎక్కడా చినుకులు పడ్డ దాఖలాలు లేవు. అంటే, ఇక్కడ వాన కురవలేదేమో, అనుకున్నాను. కురిసినా కూడా అభికరించినట్టు పడే వాన ఏం ఆనవాళ్ళు వదులుతుందని ఆలోచించి మనసులోనే చిరునవ్వు నవ్వుకున్నాను. అంతలో, నా పరధ్యానానికి మనసులో నన్నే కసురుకుని, లిఫ్ట్ పని చేస్తోందా అని కనుక్కున్నాను. హమ్మయ్య! దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉత్సాహంగా అడుగులు వేయసాగాను.
ర్యాంప్ మీద నా ముందు నడుస్తున్న ఆవిడ కాలు దేనికో కొట్టుకుని, తడబడి, ముందుకు పడబోయింది. నాకావిణ్ణి పట్టుకునే శక్తి లేకపోయినా, క్రింద పడకుండా ఆపడానికి ముందుకు వెళ్ళాను. ఈలోగా ఆవిడ కుడిపక్కన ఉండే రెయిలింగ్ మీదికి ఒరిగిపోయి, నిలదొక్కుకుంది. అసలు, ‘నిలదొక్కుకుంది,’ అన్నది సరైన మాట కాదు.
ఆవిడ క్రింద పడకుండా తనను కాపాడుకునే క్రమంలో మొహాన్ని రెయిలింగ్ మీద వాల్చి గగ్గోలు పెట్టింది. మొహానికి ఏమైనా దెబ్బ తగిలిందేమో అనుకున్నాను. త్వరగా వెళ్ళి కూడా ఆవిణ్ణి చేరలేకపోయాను. అయినా నే వెళ్ళేసరికి ఆవిడ మొహాన్ని ఎత్తి రెయిలింగ్ బయటికి కాండ్రించి ఉమ్మింది. ఆ భీకరదృశ్యం నుండి తలతిప్పుకునే క్రమంలో ఆవిడ తలెక్కడ వాలిందో గమనించాను.
నేననుకున్నట్టు ఆవిడ రెయిలింగ్ మీద కాకుండా, దాని మీద ఎవరో అరబెట్టిన, మట్టి కొట్టుకుపోయిన మాప్ మీద మొహం వాల్చింది. పాపం, ఆవిడ ఉమ్మదూ మరి! నడవడానికి ఇబ్బంది పడేవాళ్ళకోసం రెయిలింగ్ ఉందని చదువుకున్నవాళ్ళకే అవగాహన ఉండదు. మరి, అలాంటి దాని మీద నీళ్ళు ఓడిపోవడం కోసం మాప్‌ను ఆరేయకూడదని పెద్దగా చదువుకోని ఆ పనమ్మాయికేం తెలుస్తుంది?
నేను వెంటనే నా బ్యాగ్ లోంచి తడి టిష్యూ తీసి ఆవిణ్ణి మూతి తుడుచుకోమన్నాను. మరొకటిచ్చి మొహం తుడుచుకోమని చెప్పాను. ఆవిడ చేత మంచినీళ్ళు తాగించి, అసలేం జరిగిందో, అవిడెందుకు తడబడిందో చూశాను. ఆ ర్యాంప్‌పై అమర్చిన టైల్స్‌లో ఒకదాని బెల్లు కాస్త విరిగిపోయింది. సరిగ్గా వరుసగా టైల్స్‌ను అమర్చడం కూడా ఒక కూసు విద్యైపోయింది, ఈ రోజుల్లో!
అప్పుడు గుర్తొచ్చింది. కొన్నేళ్ళక్రితం గ్యాంగ్టాక్ వెళ్ళినప్పుడు అక్కడి పేవ్మెంట్స్ చూసి ముచ్చట వేసింది. తక్కువ ఎత్తుతో, సరైన చదునుతో ఎవరైనా సరే కళ్ళు మూసుకుని నడిచేటట్టు ఉన్నాయి. మధ్యలో కాలువ తాలూకు ఇన్స్పెక్షన్ ట్యాంక్లుంటే, అవి కూడా కాలు తగిలి పడిపోకుండా ఒకే లెవెల్లో ఉన్నాయి. పేవ్మెంట్ చివర చిన్న వాలుంది, ఇబ్బంది పడకుండా దిగడానికి. అమెరికాలో ఏ ఊళ్ళో అయినా ఇలాగే ఒకే స్థాయిలో అన్నీ ఉంచుతారట! మా చుట్టాలు చెప్తే విన్నాను.
అది ఏ సందర్భంలో వాళ్ళు చెప్పారో కూడా గుర్తుంది. మనదేశం వచ్చినప్పుడు వాళ్ళలో ఒకళ్ళు పేవ్మెంట్ మీద నడుస్తూ, దానిపై ఉన్న ఎగుడు-దిగుళ్ళు చూసుకోకుండా తడబడి, కాలు విరగ్గొట్టుకున్నారట. ఆ ఊళ్ళో ఎప్పుడు కొత్త పేవ్మెంట్లు వేసినా అలాగే, ఎగుడు-దిగుడుగానే వేస్తారట. అన్నీ సవ్యంగా ఉంటే, డబ్బులు ఖర్చుపెట్టే ఆస్కారం ఉండదుగా, అని ఆ ఊరి ప్రజలు తిట్టుకుంటూ ఉంటారట. అయినా, బలవంతులు, శక్తిమంతులు దాన్ని పట్టించుకోరట!
కొన్ని ఊళ్ళలో అయితే, ట్రాఫిక్ జామ్ని అధిగమించడానికి ద్విచక్రవాహన చోదకులు పేవ్మెంట్లపై బళ్ళను పోనిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఊళ్ళో నేను శిక్షణ పొందాను కూడా! ఇంతకీ అదేం ఊరో వెంటనే గుర్తురాలేదు. ఏ ఊరైతేనేం, ఎలా ఉంటేనేం, గ్యాంగ్టాక్ లాంటి నగరాలలో తప్పిస్తే, కాస్త అటూ-ఇటూగా మన దేశంలో పేవ్మెంట్లు బాటసారులకు ఉపయోగపడకుండా ఉంటాయి. మరి వీల్‌చెయిర్ వాడే వాళ్ళ దుర్గతి ఏమని చెప్పాలి?
***
ఇలా రోజుకొక ఇబ్బంది ఎదుర్కొంటున్న నాకు, నా టీనేజ్‌లో జరిగిన ఒక విషయం గుర్తొచ్చింది. ఇంచుమించు ఒక దశాబ్దం క్రితం జరిగిన ఉదంతం. అప్పట్లో న్యూస్పేపర్లలోనూ, మీడియాలోనూ ఈ విషయం తెగ ప్రస్తావింపబడేది. అందువలన ఒకరిని చూడడానికి ఒక చోటికి వెళ్దామని నిశ్చయించుకుని, మరుసటిరోజు సెలవు పెట్టాను.
అక్కడికి వెళ్దామంటే మొదలయ్యాయి నా ఇక్కట్లు. ఎడమ భుజం మొద్దుబారింది కదా! ఆటోలో వెళ్ళాలంటే, వైజాగ్‌లో అన్నీ షేర్ ఆటోల్లాంటివే! ఎత్తైన ఆ ఇరుకు మెట్లెక్కడం భలే ఇబ్బంది. ఎలాగూ క్యాబ్ తప్ప మరో దారి లేదు గనుక, ఎవరికో ఇచ్చే మొత్తాన్ని అతనికే ఇవ్వచ్చు గనుక, తరుణ్ క్యాబ్‌ని పిలిపించుకుని అక్కడికి వెళ్ళాను. ఇవ్వాల్సినదానికన్నా ఓ ఇరవై రూపాయలు తక్కువ ఇమ్మన్నాడతను. నేను ఒప్పుకోకుండా, పూర్తి రుసుము చెల్లించాను.
అక్కడ, పిల్లలకి బయటి ప్రపంచం దివ్యాంగులపై విసిరే అవమానాలని, తిట్టే తిట్లని, చూపే వెటకారాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తూ, బాధ కనబరచకుండా, గొంతుక పెంచకుండా, మొహంలో ఎటువంటి భావమూ చూపించకుండా ఎలా జవాబివ్వాలో సల్వార్ కమీజ్ వేసుకున్న ఒకావిడ సోదాహరణంగా వివరిస్తోంది.
ఆవిడ పాఠం చెప్పే తీరు, పిల్లలని ఆలోచింపజేసే తీరు చూసి నేను ఆవిడంటే ఫిదా అయిపోయాను. ఊహూఁ, ఇప్పుడు ఫిదా అవడమేమిటి? ఎప్పుడో అయిపోయాను. ఆమె దివ్యాంగుల కోసం కోర్టుకి వెళ్ళిన ఉదంతం, కేసు గెలిచినా కూడా, ‘బలా’నికి బలాన్ని చేకూర్చడానికి, చేస్తున్న పెద్దస్థాయి ప్రభుత్వోద్యోగాన్ని వదిలినది ఆవిడేనని అందరికీ తెలుసు కదా.. పేరు చేతన గారు! అప్పటినుండీ నేను ఆవిడ ఫ్యాన్నే, నో నో, ఏసీనే!
ఆవిడ తరగతి పూర్తయిపోయేవరకూ నేను అక్కడే మౌనంగా కూర్చుని, తన్మయత్వంతో విన్నాను. క్లాస్ పూర్తయిన తరువాత ఆమె నాకేసి ప్రశ్నార్థకంగా చూశారు.
ఆమె చేసిన సేవ గురించి న్యూస్ పేపర్లో చదివి, స్ఫూర్తి పొందానని చెప్పి, “నమస్తే మేడమ్, నా పేరు స్పందన. మీరు పెద్ద ప్రభుత్వాఫీసరు అయి ఉండీ దివ్యాంగుల సేవ కోసం అంకితమయారు. అప్పటినుండీ నేను మీ అభిమానినండీ. మీరెంత కష్టపడి ఉంటారో!” అని చెప్పుకుపోతున్న నన్ను ఆపి, “అదెప్పటి మాటో కదా! మరి ఇప్పుడు?” అని అడిగారు ఆవిడ.
నేను గతుక్కుమన్నాను. “క్షమించాలి మేడమ్. దిగేవరకూ లోతు తెలియదని ఊరికే అనరు కదా! మీరు ఉద్యోగం మానేసినా సరే, పరిస్థితులు గొప్పగా మెరుగుపడలేదు. మీ కేసులో తీర్పు తరువాత ప్రభుత్వాఫీసుల్లో తెగ ర్యాంప్‌లు వేయించేశారు. ఏవో కొన్ని వెస్ట్రన్ టాయ్లెట్లు కూడా కట్టారనుకోండి. అంతే! కోర్టు తీర్పుననుసరించి, వారి బాధ్యత పూర్తైందని చేతులు దులుపుకున్నట్టున్నారు ఈ జనాలు,” అన్నాను.
ఆవిడ ఇంకా అయోమయంగానే చూస్తుంటే, నేను అలంకరించే పోస్టు పేరు చెప్పి, ఆవిడతో, “నేను మీ అంత అవగాహన లేనిదాన్ని మేడమ్. అందుకేనేమో, దేవుడు నాకు తాత్కాలిక ఆవిటితనాన్ని ఇచ్చాడు. శరీరంలో ఒక భాగం సరిగ్గా పనిచేయకపోతే ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మేడమ్,” అన్నాను.
“అయ్యో, ఎలా జరిగిందమ్మా?” అని ఆవిడ కరుణరసం పొంగిపారుతున్నట్టు అడిగితే, నాకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టయ్యింది. వెంటనే విషయాన్ని వెళ్ళగక్కాను. “నేను ఈ ఊరొచ్చిన కొత్తలో ఒక గెస్ట్ హౌస్‌లో ఉండేదాన్ని. చూడడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. లోపల కూడా ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. తళతళా మెరిసిపోయే రంగుల గచ్చులు, వెలుతురు చిమ్మే రంగుల గోడలు, పగటిని తలపించే లైట్లు, విదేశాల్లో లాగ ఉష్ణోగ్రతను నియంత్రించే ఎయిర్ కండిషనర్ – ఇలా ఒకటేమిటి, విలాసం అంటే అదే, అనిపిస్తుంది.
ఒకరోజు నేను ఇంటికి, అదే గెస్ట్ హౌస్‌కు వచ్చేసరికి కరెంట్ పోయింది. అలసిపోయి ఉన్నానేమో, జనరేటర్ ఆన్ చేసేవరకూ ఆగడమెందుకని లోపలికి అడుగుపెట్టాను. పీచు మీద అడుగు తడబడింది. జరుగబోయే అనర్థానికి అది సూచన అని అప్పుడు నాకు తెలియదు కదా! అందుకే, అలవాటు ప్రకారం లోపలికి వెళ్ళి, బాత్రూమ్ లోకి దారి తీశాను – ముందు మొహం కడుక్కుంటే, కాస్త తాజాగా ఉంటుందని. గుమ్మం దగ్గర కొన్ని నీళ్ళు నిలిచిపోయాయి. వాటిమీద పడ్డ కాలు జారింది. ఇంక కొన్నడుగులపాటు జారిపోయాను. నీళ్ళ బకెట్ తగిలి ఆగిపోయాను. లేకపోతే కుళాయి నుదుటికి తగిలేది!
ఇక చూసుకోవాలి, నా అంతట నేను లేవలేక ఎంత కష్టపడ్డానో! నేను పెట్టిన కేకలు ఎవరికీ వినపడలేదు కాబోలు, ఎవరో ఊఁ అన్న పాపానపోలేదు. అంత బాధలోనూ బాత్రూమ్ బయటకు డేకి, మళ్ళీ కేకలు పెట్టాను. ఎయిర్ కండిషనర్ శబ్దం వల్ల నా మాటలు, కాదు కాదు కేకలు, నాకే వినపడలేదు, మరి బయటివాళ్ళకి ఎలా వినపడతాయి?
ముందు టేబుల్ వద్దకు డేకి, దాని మీదుండే తడి టిష్యూ తీసుకుని, చేతులు తుడుచుకుని, కాసిని మంచినీళ్ళు తాగి, గుమ్మందాకా డేకి, వేసిన అడ్డగడియను అతికష్టం మీద తీసి, మళ్ళీ మొర్రోమన్నాను,” అని వాపోయి, అసలు నేను ఆవిణ్ణి విసిగిస్తున్నానేమో అనిపించి, కాస్త ఆగాను.
నేననుకున్నది కరెక్టే! ఆవిడకు నేనేం చెప్తున్నానో, ఈ సంభాషణ ఎక్కడికి దారితీస్తోందో అర్థం అవలేదని ఆవిడ ముఖారవిందాన్ని చూసి తెలుసుకున్నాను. “సారీ మేడమ్, నా టి-11 ఎముక నొక్కుకుపోయిందట. దాన్ని కంప్రెషన్ ఫ్రాక్చర్ అంటారట. అసలు దీనికి కారణమేమిటని నేను ఆలోచిస్తే, బాత్రూమ్లో ఉన్న గచ్చు, అని అర్థం చేసుకున్నాను.
ఎంత వీఐపీ గెస్ట్ హౌస్ అయితే మాత్రం, నున్నని గచ్చులు ఎవరైనా వేసుకుంటారా? మ్యాట్ ఫినిష్‌తో ఉండే గచ్చులు జారడానికి ఎక్కువ ఆస్కారాన్ని ఇవ్వవట. కానీ, మా వాళ్ళు గ్రాండ్‌గా ఉండాలని అనుకున్నారు కాబోలు, గ్లాసీ ఫినిష్, అంటే మెరుస్తూ, నున్నగా ఉండే వాటిని పెట్టారు. నీళ్ళు నిలిచిపోతే కాస్త జారుడు ఎక్కువ అవుతుంది కదండీ! అదన్నమాట!” అని ముగించాను.
“అవునా, అయ్యో! నువ్వు నీ దురదృష్టాన్ని తిట్టుకోకుండా దివ్యాంగుల జీవితాలను మెరుగుపరచాలని అనుకున్నావు చూడు.. అప్పుడే నువ్వు విజేతవయ్యావు! భేష్!” అని ఆవిడ నన్ను మెచ్చుకుంటే ఎంత సంతోషం వేసిందో!
***
ఎర్ర కార్పెట్ మీద కిందకి చూస్తూ అడుగులు వేస్తున్నాను. కాళ్ళలో నిలకడ లేదుగా మరి! మా అందరికీ బిగ్ బాస్‌ను కలవాలంటే బెరుకుగా ఉంది. ఈ అవసరం ఇంతలా నెత్తిమీదికి రాకపోతే నేను ఆయన్ని నలుగురిలో నారాయణమ్మలాగ కలిసి ఉండేదాన్ని. ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా సాయం అర్థించనిదాన్ని ఇప్పుడు ఆయన సాయం అడుగబోతున్నాను.
కార్పెట్ చూడడానికి అందంగా ఉంటుంది. దానికింద ఎన్ని లోతులో, ఎన్ని గోతులో ఎవరికి తెలుసు? వెనుకటికి, మా దూరపు బంధువు ఒక పెద్దావిడ ఎవరింట్లోనో పెళ్ళికి వెళ్ళి, కార్పెట్ మీద తడబడి కిందపడిపోయి, కాలు విరగ్గొట్టుకున్నారట. ఈ విషయం గుర్తుకు రాగానే, నాకు ఒళ్ళు గగుర్పొడిచి తడబడ్డాను. కానీ క్రిందికి పడిపోకుండా మా జూనియర్, అవనికాంత్ నా చేయి పట్టుకున్నాడు. “మేడమ్, అసలు మీరు ఎందుకు ఈ సాహసాలు చేయడం? పిలిస్తే వచ్చేవాణ్ణి కదా!” అన్నాడు.
“నీ మానవత్వానికి థాంక్స్. ఒక అధికారికి ఉండవలసిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి, సంతోషం. నేను నా కాళ్ళపై నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను,” అన్నాను. ఈలోగా ఆ పెద్దాయన భోజనం చేస్తున్న టేబుల్ దగ్గరకు వచ్చాం. ఆయనతో పాటు చాలా సీనియర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వారికన్నీ సకాలంలో అందుతున్నాయో లేదో చూడడానికి మా బాస్ కూడా ఉన్నారు.
నేనెందుకు అక్కడికి వచ్చానో ఆయనకు తెలుసు. వెంటనే పెద్దాయనతో, “సర్, ఈమె స్పందన అని..” అని ఆయన చెప్పబోయేలోగా, “తెలుసు. ఈవిడకి ఫ్రాక్చర్ అయ్యింది. బదిలీ కోరింది- అంతేగా,” అన్నారాయన. అక్కడుండే పెద్దలందరినీ పలకరించిన నేను, “ఒక అభ్యర్థనతో మీ దగ్గరకు వచ్చానండీ!” అన్నాను.
ఆయన వెంటనే మొహాన్ని మొటమొటలాడిస్తూ, “ముందు కొన్నినెలలు సెలవు పెట్టారు. తరువాత మీరే బదిలీకి అర్జీ పెట్టుకున్నారు. కొంపదీసి మళ్ళీ ఈ పోస్టులోనే ఉంచమని కోరతారా ఏం?” అని వెటకారపు నవ్వొకటి విసిరారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీనియర్లు గొల్లుమని నవ్వారు.
నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పదవి-పవరు ఉన్నవాళ్ళు ఏమైనా అంటారు. వాళ్ళు ‘తానా’ అంటే, పక్కన ఉన్నవాళ్ళు ‘తందానా’ అంటారు. అది మానవ సహజం. దానికి నేను ఏడుపు మొహం పెడితే ఎలా? గుండె దిటవు చేసుకుని, “ఆ పోస్టులో కాదు సార్, నన్ను వీలైతే వైజాగ్ లోనే ఉంచమని కోరుతున్నాను సర్,” అన్నాను. ఆయన ఒక వికటాట్టహాసం చేసి, “ఎందుకో? అర్జీలో రాయలేని ఆ విషయమేమిటో?” అన్నారు.
నాకు వచ్చిన ఆ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని, “సర్, ఇప్పటికి మూడునెలలు సెలవు పెట్టాను. ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. కానీ, శారీరకంగా కోలుకోవడానికి ఇంకా నాకు నాలుగైదు నెలలు పడుతుంది. నేనిప్పుడున్న పోస్టులో అప్పుడప్పుడు దూరప్రయాణాలు చేయాలి. నా వల్ల కాదండీ! అందుకే అర్జీ పెట్టుకున్నాను. ఇప్పుడిప్పుడే మరోవిషయం అర్థం అవుతోంది – నా దెబ్బ నా మనోధైర్యానికి కనిపించని దెబ్బ కొట్టిందని. దానికి ఇక్కడ మంచి ఆదరువు దొరికింది. అందుకని అర్థిస్తున్నాను సర్,” అన్నాను వినయంగా.
భావప్రకటనలో పెద్ద మార్పు లేకుండా, “ఏమిటది?” అనడిగారాయన.
“‘బలం’లో పనిచేసే చేతన గారు,” అన్నాను. “ప్రభుత్వం మీద కోర్టులో కేసు నడిపించి, తర్వాత ఉద్యోగం మానేసింది, ఆవిడేనా?” అన్నారు ఆయన. ఆ మాటకు ఊఁ అంటే ఆవిణ్ణి ఒక పేచీకోరులా జమకట్టినట్టవుతుందని, నేను, “దివ్యాంగుల రాకపోకలకు వీలుగా ప్రభుత్వ కార్యాలయాలను చేయాలన్నదే ఆవిడ ఆశయం, సర్,” అన్నాను.
“ఊఁ,” అని పెద్దాయన, తన ముఖం తిప్పుకున్నారు. నాకు అర్థం కాక మా బాస్ కేసి చూస్తే, ఆయన నాపై కన్నెర్ర చేశారు. అంటే నేనేదో అనకూడని మాట అన్నానన్నమాట! అందరికీ నమస్కరించి, నేను పక్కకి వచ్చినప్పుడు, మా బాస్, “మనం ఒకళ్ళని అభిమానించినంత మాత్రాన ఊరంతా వాళ్ళని అభిమానించరు కదా!” అని అనేసి అక్కడితో ఆపేశారు.
నేను చేసిన తప్పేమిటో నాకు తెలిసొచ్చింది. కానీ అది నేను తప్పని అనుకోవడంలేదు కదా! ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ఆపాటి వాక్స్వాతంత్ర్యం ఉండదా, ఏం? కానీ, సర్కారీ బాబులకు అది ఉండదు కాబోలు!
(ఇంకా ఉంది)
డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి సాహితీ ప్రస్థానం 2015లో తెలుగు భాషలో మొదలయింది. 81కి పైగా రచనలు ప్రచురితమయ్యాయి; వాటిలో రెండు నవలలు కూడా ఉన్నాయి.
సమాజానికి ఉన్నత విలువలుండే సాహిత్యాన్ని అందివ్వడం కోసమే వీరు రచనలు చేస్తారు. ఆఖరికి హాస్య కథ వ్రాసినా సరే, దానిలో ఒక విలువ పొంచి ఉంటుంది. వీరి రచనలలో స్త్రీకి ఉన్నతమైన స్థానం, తనదంటూ ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటాయి. వీరి కథలు పలు ప్రింట్, వెబ్ పత్రికలలో ప్రచురింప బడ్డాయి.
మూస రచనలను చేయడానికి ఇష్టపడని సూర్య లక్ష్మి విభిన్న ఇతివృత్తాలు, విభిన్న కోణాల నుండి మానవ ప్రవర్తనని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు, అది ఫలితాన్ని ఇచ్చినా, ఇవ్వక పోయినా కూడా!
