Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గెలుపు పిలుపు వినిపిస్తుంది-3

[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి ‘గెలుపు పిలుపు వినిపిస్తుంది’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]

[రెండు నెలలు గడుస్తాయి. స్పందన వాడిన కారు కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ ఆమెను కలవాలనుకుంటున్నాడంటే, సాయంత్రం ఐదున్నరకి సమయం ఇస్తుంది. ఈలోపు వేరే ఆఫీసులో పని ఉంటే వెళ్ళి పూర్తి చేసుకుని వస్తుంది. వస్తుంటే చిన్న తుంపర పడుతుంది. లిఫ్ట్ పని చేస్తుందో చెయ్యదో అని భయపడుతుంది. ఆఫీసుకి చేరేసరికి అక్కడ వాన కురిసిన జాడ ఉండదు. లిఫ్ట్ కూడా పని చేస్తోందని తెలుసుకుంటుంది. అమ్మయ్య అనుకునే లోపు, ఆమె ముందు నడుస్తున్న ఆవిడ కాలు దేనికో కొట్టుకుని తూలిపడబోయి, రెయిలింగ్ మీదకి ఒరిగిపోయి నిలదొక్కుకుంటుంది. ఆ క్రమంలో ఆమె ముఖం రెయిలింగ్ మీద ఆరబెట్టిన మాప్ మీద పడ్తుంది. తన దగ్గరున్న తడి టిస్యూలు ఇచ్చి ఆమెను ముఖం తుడుచుకోమని చెప్పి, అసలామె కాలు తడబడడానికి కారణం ఏమిటా అని చూస్తే, ఒక చోట టైల్ విరిగి ఉంటుంది. దశాబ్దం క్రితం జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది. మర్నాడు సెలవు పెట్టి దివ్యాంగుల సమస్యలపై పోరాడుతున్న చేతన గారిని కలుస్తుంది. తను ఎందుకు వచ్చిందో చెప్పి, తన ఫ్రోజెన్ షోల్డర్ సమస్య, అందుకు కారణమైన, బాత్ రూమ్ లోని మ్యాట్ ఫినిష్ గచ్చు గురించి చెప్తుంది. ఇంత ఇబ్బంది ఉన్నా, దివ్యాంగుల కోసం ఏదైనా చేయాలని వచ్చినందుకు స్పందనని అభినందిస్తారామె. తన ఉద్యోగ విషయమై మాట్లాడేందుకు తన బాస్ నిర్వహిస్తున్న మీ లంచ్ మీటింగ్‌కి వెళ్ళి పై అధికారిని కలుస్తుంది స్పందన. బాస్ ఆమెను పరిచయం చేయబోతే, ‘తెలుసు, ఫ్రాక్చర్ అయింది బదిలీ కోరింది అంతేగా’ అని అంటాడాయన. ఓ అభ్యర్థనతో వచ్చానని స్పందన చెప్పగా, ఆయన వెటకారం చేస్తాడు. వీలైతే తనని వైజాగ్ లోనే ఉంచమని కోరుతుంది. మాటల సందర్భంలో చేతన గారి ప్రస్తావన తేవడంతో పై అధికారి బాస్ మీద కన్నెర్ర చేస్తాడు. బాస్ స్పందనని అక్కడ్నించి పంపించేస్తాడు. – ఇక చదవండి.]

పోస్టింగ్ ఆర్డర్లు వచ్చే వరకూ సెలవు పెట్టి వైజాగ్ లోనే ఉండిపోయాను. ఆరోజుల్లో చాలా సార్లు వెళ్ళి, చేతన మేడమ్‌ను కలవాలని నిశ్చయించుకున్నాను. ఒక రోజు..

నేను బాబ్ కట్ చేయించుకున్న విషయం ఆవిడ గమనించారు. అకస్మాత్తుగా ఎందుకిలా స్టైలిష్‌గా మారిపోయానో అభ్యంతరం లేకపోతే చెప్పమన్నారు. “నా ఎడమచెయ్యి టైట్ అయిపోయింది మేడమ్, సరిగ్గా జడ వేసుకోలేక..” అని చెప్తుంటే ఆవిడ పరధ్యానంగా ఓ చిరునవ్వు విసిరారు. ఏదో ఒక జ్ఞాపకాన్ని నా మాటలో, చేతలో గుర్తు చేశాయేమో!

“నీకైతే ఒకప్పుడు చేతులు పనిచేసేవి కనుక నువ్వు గ్రూమింగ్ గురించి, అందంగా కనబడాలని పాకులాడుతున్నావు. నాకు ఆ అవకాశమే లేకపోయింది- అంటే ఆ ఆలోచనలే రాలేదు. చిన్నప్పుడు, చదువుకున్నన్నాళ్ళూ అమ్మ జడ వేసేది. శిక్షణ పుచ్చుకొనేటప్పుడు అతికష్టం మీద పోనీటెయిల్ వేసుకుని, ఎక్కువ పిన్నీసులు పెట్టుకుని ఎలాగో కానిచ్చేశాను. పోస్టింగ్ అయిన తరువాత మా వంటావిడ చేత జడ వేయించుకునేదాన్ని.

ఒకసారి మా చుట్టాల ఇంట్లో పెళ్ళికి వెళ్ళాను. అక్కడ ఒకావిణ్ణి జడ వేయమని అడిగాను. ఆవిడ, ‘నేను రెడీ అయ్యాక వేస్తానులే,’ అన్నారు. ఆవిడ ఒకపట్టాన తెమల్లేదు సుమీ! కళ్యాణమండపానికి చుట్టాలను తరలిస్తున్న పెళ్ళివాళ్ళు కారులో ఖాళీ ఉంది కనుక నన్ను వెళ్ళమన్నారు. నా జడ ఇంకా పూర్తవలేదని వాళ్ళతో చెప్తే వాళ్ళు పెట్టుకున్న మొహానికి ఇప్పటికీ నాకు గగుర్పాటు వస్తుంది.

అప్పుడొక పెద్దాయన, ‘ఇలా నీ జడ నువ్వు వేసుకోలేనప్పుడు, సమయపాలన చేయలేనప్పుడు జుట్టు కత్తిరించుకుంటే తప్పేం లేదమ్మా!’ అన్నారు. అసలే అవమానభారంతో క్రుంగిపోతున్నదాన్ని! ఆయన మాటలకు మానసం పొడుచుకుని వచ్చింది,” అన్నారావిడ.

“అంటే మనోనిబ్బరమా, మేడమ్?” అని అడిగాను నేను. “కాదమ్మా! మగవాళ్ళకు వచ్చేది ‘పౌరుషం’, ఆడవాళ్ళకు వచ్చేది ‘మానసం’ అంటారని, చిన్నప్పుడు మా తాతయ్యగారు చెప్పేవారు. దాని దెబ్బతో ఆ పెద్దాయనతో, ‘ఎంతమందికి ఇంత ఒత్తూ-పొడవూ ఉండే జుట్టుంటుంది? దేవుడి నా చేతికి గ్రిప్ ఇవ్వనంత మాత్రాన నేను జుట్టు కత్తిరించుకుంటానా?’ అని, క్యాబ్ పిలుచుకుని, పెళ్ళికూతురు వెళ్ళిన బ్యూటీ పార్లర్‌కు వెళ్ళాను.

తమాషా ఏమిటంటే, నేను కట్టింగ్ కోసం వెళ్ళానని అనుకున్నారు వాళ్ళు. హెయిర్ స్టైల్ ఏమీ అక్కరలేదనీ, వాలుజడ వేస్తే చాలనీ చెప్తే వాళ్ళు అవాక్కైపోయారు. ‘మేకప్ వేయమంటారా?’ అని వాళ్ళు అడిగితే నేను వద్దన్నాను. దారిలో పూలు కొనుక్కుని, అటునుంచి అటే పెళ్ళికి వెళ్ళాను.

అది అప్పటి విషయం. ఆ రోజుల్లోనే, ఒక ఫ్రెండ్ నాతో వచ్చి కొన్నాళ్ళుంది. ఆ సమయంలో ఒకరోజు మా వంటావిడ సెలవు పెట్టింది. మండిపోతున్న ఆకలిని చల్లార్చేందుకు టిఫిన్ చేద్దామని బయటకు దారితీస్తున్న నన్ను ఆపింది నా ఫ్రెండ్. ‘ఆ పిచ్చికగూడు జుట్టు పెట్టుకుని హోటల్‌కు వెళ్తే వాళ్ళు బిచ్చగత్తె అనుకుంటారు. ఆగు!’ అని, నా తలదువ్వి, జడవేసింది.

“ఆ తరువాత, నాకు ఉచిత సలహాలు చెప్పే హక్కు సంపాదించుకున్నాననుకుందేమో, ‘నువ్వు, జుట్టు కట్ చేసుకున్నావంటే నీటుగా ఇలా ఓ క్లిప్ పెట్టుకుంటే సరిపోతుంది,’ అని తన పలుచటి పిలక జుట్టునూ, దానికి పెట్టిన ఒక చిన్న క్లిప్పునూ చూపింది. అసలే నాకు ఆకలి మండిపోతుంటే, కడుపుమంట రగిలించే ఈ మనిషి నా ఫ్రెండా? అని, మనసులో తిట్టుకున్నాను. కానీ ఈ పలుచ జుట్టు వాళ్ళతో నాకు పోటీయా? సిగ్గు, సిగ్గు అనుకోనూ మరి!

మరొకావిడైతే, తనంతట తనే, నాకు క్లిప్పు పెట్టుకోవడంలో శిక్షణనివ్వజూసింది. నా చేతికి గ్రిప్పు లేనప్పుడు ఏ క్లిప్పూ పనిచేయదని తెలియడానికి ఆవిడకు అరగంటకుపైగా పట్టింది!

ఇవన్నీ వదిలేయ్. పబ్లిక్ సర్విస్ కమిషన్ ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు మా అమ్మ టైట్‌గానే జడ వేశారు. కానీ అక్కడ వెయిటింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు, నా ఛాన్సు వస్తుందనగా, నా ఎదురుగా కూర్చున్న అబ్బాయి, ‘ఏమండీ! మీ దువ్వెన తీసుకుని పైపైన కాస్త దువ్వుకోండి,’ అని సలహా ఇచ్చాడు. నేను అవాక్కయ్యాను. స్వచ్ఛమైన మనసుంటే చాలుననే విలువలతో పెరిగిన మనిషికి ఇలాంటి సలహా ఇవ్వడం బెంగాలీ మనిషిని ‘రసగుల్లా తింటారా’ అని కాకుండా ‘కొరివి కారం తింటారా’ అన్నట్టుంటుంది.

నా దువ్వెన తెచ్చుకోలేదని చెప్పేసరికి, అతను జేబులోకి చెయ్యి పెట్టి, తన నాలుగంగుళాల దువ్వెననిచ్చి, జుట్టు దువ్వుకోమన్నాడు. అతికష్టం మీద కోపాన్ని కనపడకుండా ఆపుకుని, నవ్వుమొహంతో ఆ దువ్వెనను నిరాకరించాను. మా అమ్మ వాడితేనే దువ్వెనను వేడినీళ్ళతో కడుక్కునే నేను ఒక అపరిచితుడి దువ్వెనను ఎలా వాడతాను?

మామూలు రోజుల్లో పట్టులాంటి నా జుట్టుపై ఒకచేతికి పట్టులేకపోవడం వల్ల ఆ జుట్టులో సగభాగం భక్తియుక్తులకు జటాజూటంలాగో, సాధారణ ప్రజానీకానికి మొక్కజొన్నపీచులాగో, ఎలకలు పీకిన తాట్టెంకలాగో కనిపించవచ్చు. కానీ, ఆరోజు అక్కడక్కడ జుట్టు రేగిపోతే, దాన్ని దువ్వుకుంటానా? ఏం, హిప్పీ, ఫంకీ హెయిర్ స్టైళ్ళను తట్టుకోలేదా ఈ సమాజం?  దానిలోని ఒక వ్యక్తి ఈపాటి విషయానికే ఇంతగా స్పందిస్తే ఎలా? ఎలా? అనుకుని మథనపడ్డాను.

సరే, ఇవ్వాళ కేశపురాణం చెప్పినట్టున్నానే! ఇంకేం సంగతులు? చెప్పు,” అని ఆవిడ అభిమానంగా అడిగేసరికి నాకు ఏమనాలో తెలియలేదు. “మీతో మాట్లాడితే నాకు బోలెడంత మనోధైర్యం వస్తుంది. ఆ సంతోషం కోసం, నా స్వార్థం కోసం వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయవచ్చా, మేడమ్,” అని అడిగాను నేను.

“అదేమి మాటమ్మా! నువ్వు తప్పకుండా రా. వచ్చి మా బలశాలులకు మంచి బలాన్ని ఇవ్వు. ఎందుకంటే, చాలామంది దెబ్బలు తగిలి తాత్కాలిక దివ్యాంగులవుతారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ దురదృష్టాన్ని తిట్టుకోవడం గమనించాను.

అయితే, ‘ఈ కొద్దిరోజులకే నేనింత కష్టపడుతున్నానే, పాపం దివ్యాంగులు రోజూ ఈ బాధ భరిస్తున్నారు. నాబోటివాళ్ళు అనాలోచితం గానో, లేక గర్వాతిశయం వల్లనో అనే సూటి-పోటి మాటలకు అవమానభారం మోస్తున్నారు, దాన్ని మనం పోగొడదాం, లేకపోతే కనీసం తగ్గిద్దాం,’ అని ఎవరైనా అనుకుంటున్నారా? నువ్వు అనుకున్నావంటే నువ్వు నిజంగా పరుల శ్రేయోభిలాషివి అన్నమాట. ఈ విషయం నిన్ను మొదటిసారి కలిసినప్పుడే చెప్పాను కదా!

అందుకే నువ్వు రావాలి, మా వాళ్ళను చూసి, స్ఫూర్తిని పొంది, వాళ్ళకి కూడా బలాన్నివ్వాలి,” అని ఆవిడ అనేసరికి నా నొప్పీ, తద్వారా వచ్చిన మనోవ్యాకులత కొంతకాలంపాటు దూరం అయ్యాయి.

***

మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి, అరవింద్, అమెరికా అమ్మాయిని పెళ్ళిచేసుకుని దేశానికి తిరిగి వచ్చాడట. ఇష్టం ఉన్నా, లేకపోయినా అంకుల్, ఆంటీలు వాళ్ళని ఆశీర్వదించి, ఊళ్ళో పెద్ద హోటల్లో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నా ఆరోగ్యం కాస్త మెరుగుపడ్డాక మా ముత్తాతల ఊరు వెళ్ళిన మా అమ్మానాన్నలు ఇప్పుడు తిరిగివచ్చారు. తరుణ్ క్యాబ్‌ని పిలిచి, అక్కడకు వెళ్ళాం.

నెట్లో చూసి, ‘కళ్యాణ్’ వెడ్డింగ్ హాల్ మూడవ అంతస్తులో ఉందని తెలుసుకున్నాను. లిఫ్ట్‌కు దారి కనుక్కున్నాడు తరుణ్. ఆ హోటల్లో, మనుషులు వెళ్ళదలచుకున్న చోటుకు తిన్నగా వెళ్ళడానికి వేర్వేరు లిఫ్ట్‌లు ఉన్నాయట. ఈ హాల్ వద్దకు వెళ్ళే లిఫ్ట్ కాస్త ముందుందనీ, అక్కడకు వెళ్ళమనీ రిసెప్షన్ వాళ్ళు చెప్పారట. తమాషా ఏమిటంటే, మెయిన్ లాబీలోకి వెళ్ళడానికి ర్యాంప్ లేదు.

తీరా ముందుకు వెళ్ళి చూస్తే, లిఫ్ట్ హాఫ్ ఫ్లోర్‌లో (దీన్నే ‘మ్యాజినీన్ ఫ్లోర్’ అని కూడా అంటారు)  ఉంది. అక్కడకు వెళ్ళడానికి ర్యాంప్ లేదు! ఒక సన్నని, నున్నని సింగిల్ రెయిల్ లాంటి ఒక జారుడు పదార్థం చివర ఒక సన్నపాటి కుర్చీ ఉంది. అందులో కూర్చుని, బెల్ట్ పెట్టుకుని స్విచ్ వేస్తే కుర్చీ మెట్లపైకి వెళ్తుందన్నమాట! కానీ, అందులో నేను కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడే నాకర్థమయ్యింది నేను ఎంత లావయ్యానో! ‘లావొక్కింతయు లేద’న్నట్టు నేనెప్పుడూ లేను గాని, ఇలా సీటు సరిపోకపోతే తలెత్తుకోలేకపోయాను. తూర్పు మాండలికంలో చెప్పాలంటే ‘నా కొవ్వు నావైపోనాది’ కాబోలు!

ఆ మెట్లు చూస్తే ఓ పది ఉన్నాయి, మోకాలి మెట్లు కాదు గానీ, అడుగు మెట్లు! నన్నడిగితే, అసలు నాలుగు అంగుళాల కన్నా ఎత్తైన మెట్లు పెట్టించిన ఇంజనీరును తన డిగ్రీచ్యుతుణ్ణి గావించాలి. పెద్ద పెద్ద భవంతులు కోట్లు పోసి కడతారు గానీ, సిమెంటు, కంకర విషయాల్లో మెట్ల దగ్గర మాత్రం పీనాసితనం చూపిస్తారు. పైగా, వీళ్ళందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి వారసులనుకుని ఓ తెగ ఫీల్ అయిపోతూంటారు. ఆయన పై లోకాల నుండి చూస్తే మట్టుకు తప్పకుండా కన్నీటి పర్యంతమౌతారు – వీళ్ళా నా వారసులు, అని!

నేను ఎక్కకుండా ఆలోచనలో మునిగిపోయినప్పుడు, నాన్న నన్ను మెట్లెక్కమని ప్రోత్సహించారు. నేను ససేమిరా అన్నాను. క్యాబ్‌ని మళ్ళీ బ్యాక్ చేసుకుని, రెస్టారెంట్ దగ్గర ఉన్న ర్యాంప్ ఎక్కడానికి రెయిలింగ్ ఉన్నా, ధైర్యం విలోలంబయ్యి, తరుణ్ చేయి పట్టుకున్నాను. ర్యాంప్ పెట్టి దానిపై పలకలు పెడితే బ్యాలెన్స్ తప్పుతుందని ఆ పలకలు వేసినవాళ్ళకి తెలియదు మరి! అమ్మానాన్నలు వాటిని చూసి జడుసుకుని, రెయిలింగ్ పట్టుకుని మెట్లెక్కసాగారు.

మొత్తానికి అక్కడ చేరుకున్నప్పుడు, ఒక సుపరిచిత వదనం కంటపడింది. ఆయనే ఆ రెస్టారెంట్ మేనేజర్ విశ్వాస్ గారు. ఒక వారం రోజుల క్రితం ఇక్కడ ఒక అధికారిక లంచ్‌కు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇదే ఇబ్బంది పడ్డానని ఆయనకు తెలుసు. “క్షమించండి మేడమ్, వారం రోజుల్లో ఏమీ చేయలేం కదా!” అన్నారు బిక్కమొహం వేసి. “రాఘవరావు గారింటి పెళ్ళి రిసెప్షన్ కోసం వచ్చాము. “అదేమిటండీ, లిఫ్ట్ దగ్గరకు వెళ్ళడానికి పది మెట్లూ, ఓ సన్నపాటి కుర్చీ మాత్రమేనా?” ఆయన తెల్లమొహం చూసి, విషయం బోధపరిచాను. ఆయన సరేనని మిమ్మల్ని లాబీలోంచి తీసుకుని వెళ్తానని చెప్పారు. లాబీ దాటిన తరువాత సిగరెట్టు వాసన వచ్చే ఒక గదిలోకి తీసుకుని వెళ్ళారు. అది వాళ్ళ బార్.

అమ్మా, నేనూ సిగ్గుతో తలదించుకున్నాం. ఖర్మ! మధుశాలా దర్శనం కూడానా మా జీవితాలకు? నాన్నైతే, నిరాశ-నిస్పృహలతో కూడిన ఒక నిట్టూర్పును విడిచారు. దాని వెనుకనుండి బయటకు వస్తే, ఇందాక చూసిన ఆ పది మెట్ల అవతల ఉన్న ర్యాంప్ కనిపించింది. దానివద్ద మమ్మల్ని విడిచిపెట్టి, విశ్వాస్ గారు వెళ్ళిపోయారు. లిఫ్ట్‌లో మూడవ ఫ్లోర్ బటన్ నొక్కాక, మేం ముగ్గురమే ఉన్నామని గ్రహించిన మా నాన్న, “నీ పుణ్యమా అని పుట్టిన ఇన్నేళ్ళకు బారును కళ్ళారా చూసే యోగం కలిగిందమ్మా! నా జన్మ ధన్యమయిందిలే,” అన్నారు ఈసడింపుగా. ఆయన లెక్కలో నేను మెట్లెక్కితే సరిపోయేది, అంతే!

గండం గట్టెక్కిందనుకున్న నాకు నిరాశే ఎదురయ్యింది. భోజనాలు చేసే దగ్గర వరుసగా కుర్చీలు వేసి ఉన్నాయి, ఒక్క టేబుల్ కూడా లేదు. అందుకని ముందు అమ్మానాన్నలను భోంచేయమన్నాను. వారిది పూర్తయ్యాక నా ప్లేటు పట్టుకుని తినుబండారాలు వడ్డించుకోవడానికి వెళ్ళేటప్పుడు నాన్న సాయానికి వచ్చారు.

అక్కడ వడ్డన చేసే అబ్బాయి నా పరిస్థితి అర్థం చేసుకుని, వేలెత్తి చూపకుండా, తనే ప్లేటు పట్టుకుని, నేను కూర్చొనే చోటికి తెచ్చాడు. అమ్మ పట్టుకున్న ఆ ప్లేటులోంచి నేను తింటూ ఉంటే, అతను వెంటనే అమ్మను పక్క కుర్చీలోకి జరగమని, ఒక కుర్చీలో నాప్‌కిన్ వేసి, ప్లేటును పెట్టి, నన్ను తినమని, ఈలోగా మూతి తుడుచుకోవడానికి మరో నాప్కిన్ తెచ్చిచ్చాడు.

అంతేకాదు, మా ముగ్గురికీ రసమలై, క్యారెట్ హల్వా, తీపి కిళ్ళీ కూడా తెచ్చాడు. నాన్న అతనికి టిప్ ఇవ్వబోతే, అతను తీసుకోలేదు కూడా! ఇలాంటి మంచివాళ్ళుండబట్టి లోకంలో ఇంకా మంచి జరుగుతోందనుకున్నాను. వెంటనే, ఒక ఇబ్బందికరమైన ఆలోచన వచ్చి, మథనపడ్డాను.

***

ఆ తరువాత వచ్చిన ఆదివారం నాడు ‘బలం’ దగ్గరకు వెళ్ళాను. చేతన మేడమ్‌తో ఈ హోటల్ విషయం పంచుకున్నాను. “వ్యవస్థ మీద కాకుండా మనుషుల మంచితనం మీద ఎవరైనా ఆధార పడ్డారంటే, ఆ వ్యవస్థ బలహీనమైనదీ, బలహీనులకు న్యాయం చేయలేనిదీ అని నా అభిప్రాయం, మేడమ్. మీరేమంటారు?” అన్నాను.

“అంతే కాదమ్మా! ఆ పథకాలను అమలు చేసేవాళ్ళ చేతకానితనాన్ని కూడా సూచిస్తుంది,” అని ఆవిడ అంటే నా చెంప ఛెళ్ళుమన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఆవిడ ఇదేమీ గమనించకుండా, “నేను కూడా ‘లోకంలో మంచివాళ్ళుంటారు; వాళ్ళ వల్ల లోకం మెరుగవుతుంది,’ అనుకున్నంత కాలమూ నాకన్నీ కష్టాలే ఎదురయ్యాయి.

సిరాక్యూస్ వెళ్ళి వచ్చిన తరువాత వ్యవస్థాగత నిబంధనల వల్ల ఒకరి జాలి, దయ – ఇలాంటి వాటిపై ఆధారపడకుండా, దివ్యాంగులు మామూలు మనుషుల్లాగ హాయిగా, స్వతంత్రంగా బతకవచ్చని అర్థం చేసుకోగలిగాను. న్యూయార్క్ సబ్వేలో నేను ఆ దివ్యాంగురాలిని చూసిన తరువాత ఆమెను చూసి కూసింత అసూయపడ్డాను కూడా, అలాంటి దేశంలో ఉండడం వల్ల కదా ఈవిడ ఎవరిపైనా అధారపడకుండా స్వతంత్రంగా ఉండగలుగుతున్నారని!” అన్నారావిడ.

మా ఇద్దరి కళ్ళలోనూ నీళ్ళు తిరిగాయి – ఆ చక్కని అనుభూతిని గుర్తు తెచ్చుకున్నందుకు ఆవిడకు, ఆవిడలాంటి వీరవనిత చేసిన పోరాటం – త్యాగం తరువాత కూడా వ్యవస్థ మెరుగుపడనందుకు నాకు!

ఆవిణ్ణి ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక, ఆ సంభాషణ అక్కడితో ఆపేశాను.

***

మా కారు తాలూకు కాంట్రాక్టర్ మళ్ళీ వచ్చాడు, నన్ను కలవడానికి. అప్పుడెప్పుడో వచ్చినప్పుడు, కుశలప్రశ్నలు మాత్రమే వేశాడు. ఆయనతో నేను, “మనం స్నేహితులం కాము కదండీ. కర్టసీ కాల్స్ అవసరం లేదు. మా డిపార్ట్‌మెంట్ మీ కారును వాడకానికి తీసుకుంది. అగ్రిమెంటు ప్రకారం మేము మీకు పేమెంట్ చేస్తాము. ఏదైనా ఇబ్బంది ఉంటేనే, అపాయింట్మెంట్ తీసుకుని కలవండి,” అని నిష్కర్షగా చెప్పేశాను.

ఈమాటు ఏదో కష్టం వల్లనే నన్ను కలవడానికి వచ్చి ఉంటాడని గ్రహించి, ఎలాగూ తరువాతి అపాయింట్మెంట్‌కు  కాస్త టైమ్ ఉందని చూసుకుని, వెంటనే అతణ్ణి పిలిపించాను. ఆయన చెప్పిన విషయానికి ‘షాక్’ తిన్నాను అంటే, చాలా అల్పంగా ఉంటుంది. ‘నిర్ఘాంతపోయాను’ అంటే కాస్త బరువున్న పదమవుతుంది.

బిల్లును ఆమోదించవలసిన ఆఫీసర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వేలెత్తి చూపారట. నా స్థాయి అధికారులకు బొలేరో, మరాజో, స్కార్పియో, సియరా, ఇన్నోవా – ఇలాంటి మల్టీ యుటిలిటీ బళ్ళు పెట్టాలట. నా దెబ్బ తరువాత నేను ఎక్కువ ఎత్తులేని సెడాన్ కారును వాడుతున్నానుగా! అందుకని, నా బండి వాడకానికి డబ్బులివ్వడం కుదరదట! ఇదెక్కడి అన్యాయం?

ఈ విషయం ఆ సదరు పెద్దమనిషితో నేను మాట్లాడాకనే, ఎక్కువ ఎత్తు లేని బండి పెట్టమన్నాను. నేను వాడుకున్నాక డబ్బులివ్వాలి కదా! నేను అనుమతి కోరినప్పుడు, ‘రూల్సు ఎలా ఉన్నా, మీ పరిస్థితి గురించి అందరికీ తెలుసు. మేమూ మనుషులమేనండీ. మాలోనూ మానవత్వం పరిమళిస్తుంది,’ అని సినిమా లెవెల్లో డైలాగులు కొట్టారు ఆ సీనియర్ ఆఫీసర్. ఇప్పుడిలా మాటమార్చేస్తే ఎలా?

నాకు కాంట్రాక్టర్ స్నేహితుడు కాకపోయినా, నేను కాంట్రాక్టర్‌తో స్నేహం చేయనని భీష్మించుకున్నా, బిల్లు ఆమోదం నా చేతుల్లో లేకపోయినా, చేసిన పనికి అనుకున్న డబ్బులు ముట్టేటట్టు చేయడం నా వృత్తిధర్మం. అందుకనే ఆ బిల్లు విషయమై కలవడానికి ఆ సీనియర్ వద్దకు వెళ్ళాను.

ఆయన నవ్వుతూ మాట్లాడారు. పోయినమాటికీ, ఇప్పటికీ మాటతీరులో తేడా లేదు. పోయినసారి చేయించినట్టే, నాకిష్టమైన టీబాక్స్ చాయ్‌లో వయనాడ్ యాలకుల టీ ఇప్పించారు. ఇంతల్లా అతిథి మర్యాద చూపిన ఈయనేనా అసలు బిల్లుకు పుల్ల పెట్టింది? నా మనసు కకలావికలమయ్యింది. అనవసరమైన అపోహలతో వీరి దగ్గరకు వచ్చానేమో?

ఆ బిల్లు సంగతి ఎత్తగానే అసలు విషయం బయటపడింది, ఆయన తాలూకు ‘వంగతోటలో బావ’ బుద్ధి. “ఆ రోజు మీతో రూల్సు గురించి చెప్పాను కదండీ!” అని ప్లేటు ఫిరాయించేశారు గురువుగారు. నేను ఖంగు తిన్నాను. “అది కాదు సర్, మరేమో మీరు మనుషులు.. మానవత్వం.. అని అన్నారు కదండీ!” అన్నాను మర్యాదగా. ఆ రూల్సు నాకు తెలియవా ఏం, మరీ అతి కాకపోతే! కానీ, పెద్ద ఆఫీసర్లతో అలా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు కదా!

ఇంతలో నాకో అనుమానం వచ్చింది, ఈ మనిషేమైనా ఆమ్యామ్యా కోసం ఆశపడుతున్నారేమో అని. అయినా, ఇంత సీనియర్ అయివుండీ ఈ కక్కుర్తి ఏమిటి? అంతగా ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అనుకుని ఉంటే వారి తరంలోనే ప్రయివేటు ఉద్యోగాలు దండిగా ఉండేవిగా, పెద్దపెద్ద జీతాలతో? ఓహో, ఈయనకు పవరూ-పైకమూ రెండూ కావాలేమో?

 నన్ను ఈ ఆలోచనలు కాల్చుకు తింటూ ఉంటే, మళ్ళీ ఆయనే అన్నారు, “మాలో ఉన్న మానవత్వం, మంచితనం – ఇవన్నీ రూల్సు గీసిన గిరిని దాటి వెళ్ళలేవనే నిస్సహాయతను వ్యక్తం చేసుకున్నాను. అవునూ, మీరు అర్హత లేకుండా సెడాన్ వాడితే ఎలాగండీ? పాపం, ఆ ట్రావెల్సు కంపెనీ వాళ్ళు ఇబ్బంది పడిపోరూ?” అని.

నాకు ఒక్క క్షణం కళ్ళు బైర్లుకమ్మినట్టయ్యాయి. నాకు టోపీ వేసి నన్నే కిస్కా కొట్టించిన ఈ మహానుభావుడి తెలివితేటలకు ఈ పోస్టు సరిపోదు. ఏ విదేశాంగ శాఖలోనో పనిచేస్తే ఇతరదేశాల ఎత్తులకు పైయ్యెత్తులు వేసి దేశానికి మేలు చేయవచ్చును కదా! ఏ దేశానికో అంబాసిడరో, ఫియట్టో, సుజుకీనో కావచ్చు కూడా! అక్కటా! ఎంతటి దురదృష్టమో ఇది!

నా ఆలోచనలలోంచి బయటకు వచ్చి, “సర్, దీనికి ఆమోదం మీకన్నా పై ఆఫీసర్ చేయాలి కదా! మరి మీరు ప్రాసెస్ చేయించలేదా?” అని అడిగాను.

“అవన్నీ మీరు చూసుకోవాలి,” అని ఒక తీక్షణపు చూపుతో అనేశారు ఆయన నిష్కర్షగా. ఒక కాంట్రాక్టును చూసుకుంటుంటే, ‘నేను బిల్లులు మాత్రమే చూస్తాను,’ అని మొండికేసే ఇటువంటి మూడుకాళ్ళ కుందేళ్ళతో వాదించడం అనవసరం అనిపించింది.

అయినా ప్రభుత్వాన్ని నమ్మి, బండి పెట్టిన ఆ మనిషికి ఇబ్బంది కలిగించకూడదని మళ్ళీ మరో ప్రయత్నం చేశాను.

“పోనీ, ‘ఆమోదం లభించవలసిన ఖర్చు’ కింద ఆ బిల్లును పాస్ చేస్తారా సర్?” అని అడిగాను.

“మా ఆఫీసులో అలాంటివాటిని బంద్ చేసామండీ. అనవసరమైన పని. పైకం ముట్టాక ఎవరూ ఆమోదం కోసం ఆరాటపడరు. సంవత్సరం చివర్లో ఇవన్నీ నా తలకు చుట్టుకుంటాయి. లేనిపోని తలనొప్పిని కోరి తెచ్చుకోవడం ఎందుకు లెండి?” అని ఆయన ముగించాక, ఖేదంతో బయటకు వచ్చేశాను.

(ఇంకా ఉంది)

Exit mobile version