[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి ‘గెలుపు పిలుపు వినిపిస్తుంది’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]
[పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేవరకూ వైజాగ్ లోనే ఉండాలని నిశ్చయించుకుంటుంది స్పందన. ఓ రోజు చేతన మేడమ్ దగ్గరకు వెళ్తుంది. మాటల సందర్భంలో స్పందన బాబ్ కట్ చేయించుకున్నట్టు గమనించి కారణం అడిగితే, తన ఎడమ చెయ్యి టైట్ అయిపోయిందని, జడ వేసుకోలేక, జుట్టు కత్తిరించుకున్నానని స్పందన చెబితే, ఆవిడకి ఒకప్పుడు తనకు జరిగిన అలాంటి సంఘటనలనే గుర్తు చేసుకుని స్పందనకి చెబుతారావిడ. వీలున్నప్పుడల్లా వచ్చి, అక్కడి వారికి ప్రేరణనివ్వమంటారు. స్పందన ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అరవింద్ ఓ అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకుని వస్తాడు. రిసెప్షన్ ఓ పెద్ద హోటల్లో ఏర్పాటు చేస్తారు. అమ్మానాన్నలతో కలసి వెడుతుంది స్పందన. తరుణ్ క్యాబ్‌లో వెళ్తారు. హాల్ వద్దకు వెళ్ళే లిఫ్ట్ వద్దకి వెళ్ళి చూస్తే, అక్కడ ర్యాంప్ ఉండదు. అక్కడున్న ఓ సన్నపాటి కుర్చీలో కూర్చుని, ఓ బటన్ నొక్కితే, కుర్చీ మెట్ల పైకి వెళ్ళే ఏర్పాటు ఉంటుంది. కానీ, స్పందన లావవడం వల్ల ఆ కుర్చీలో కూర్చోలేకపోతుంది. అందుకని వేరే దారి ఏదైనా ఉందా అని హోటల్ మేనేజర్ విశ్వాస్‌ని అడిగితే, ఆయన లాబీ నుంచి తీసుకువెళ్ళి, బార్ గుండా నడిపించి, కాస్త దూరాన ఉన్న లిప్ట్ దగ్గర వదిలిపెట్టి వెళ్తాడు. లిఫ్ట్ ఎక్కాకా బార్ లోంచి నడిపించినందుకు స్పందన నాన్న తిడతారు. తర్వాతి ఆదివారం ‘బలం’ కార్యాలయానికి వెళ్ళి తన అనుభవాలన్నీ చేతన మేడమ్‌కి చెబుతుంది స్పందన. ఆఫీసు పనుల కోసం స్పందన ఉపయోగించిన కారు తాలూకు బిల్లులు క్లియర్ చేయడం లేదంటూ కాంట్రాక్టర్ వచ్చి స్పందనకి చెప్తాడు. ఆ బిల్లు విషయం మాట్లాడానికి పై అధికారి దగ్గరకు వెళ్తే, ఆయన తేడాగా మాట్లాడుతాడు. ఖేదంతో బయటకు వచ్చేస్తుంది స్పందన. – ఇక చదవండి.]
నన్ను చూడాలని ఎవరో వచ్చారో స్టెనో చెప్తే, నేను ముందు ఆసక్తి చూపించలేదు. అసలే ఆ కాంట్రాక్టర్‌కు చేసిన పనికి డబ్బులు ఎలా ఇప్పించాలా, అని బుర్ర బాదుకునేడుస్తున్నాను. ‘మధ్యలో సుత్తికొట్టేందుకు వీళ్ళెందుకు దయచేశార్రా బాబూ,’ అని విసుక్కున్నాను. ప్రతీ యేడూ డిపాజిట్లకనీ, బీమా అనీ, మ్యూచువల్ ఫండ్ అనీ ఏదో ఒక బ్యాంక్ వాళ్ళు వచ్చి, నన్ను కలిసి, మా ఉద్యోగులను కలవడానికి ఒక మీటింగ్ పెట్టమని అడుగుతూ ఉంటారు. దానికోసం ఇవ్వాళే నేను వాళ్ళని కలవనక్కరలేదు. వాళ్ళ విజిటింగ్ కార్డు తీసుకుని, నాకు తీరికైనప్పుడు నేనే అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పమన్నాను.
***
ఊళ్ళో ఒక గొప్ప ఫిజియోథెరపిస్టు ఉన్నారని తెలిసింది. మరిన్నాళ్ళూ ఏమయ్యారు? అని అడిగితే, ఆయన ఏదో విద్యాలయంలో పీహెచ్డీ కోర్సు చేసి వచ్చారట. ఎక్కడో పీహెచ్డీ చేసి విశాఖ రావడమేమిటి? అని మళ్ళీ నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే, నా అనుభవం అటువంటిది కాబట్టి.
ఇంతవరకూ నాకు ఫిజియో అవసరం లేక కాదు. మంచివాళ్ళు దొరకక చేయలేదు. నా ఫ్రాక్చర్ జరిగిన మూడు నెలలకు అది బాగయ్యిందని నిర్ధారించి, మా ఆర్థో నన్ను ట్రాక్షన్ చేయించుకోమన్నారు. ఓహో నేను మళ్ళీ చురుకుగా తయారవుతానని ఆశపడ్డాను.
ఆ బెడ్ మీద పడుక్కోగానే నా నడుం విపరీతంగా నొప్పి పెట్టింది. ఆర్థో నా కాళ్ళను అటూ-ఇటూ కదిలించి, ఆ నొప్పిని మటుమాయం చేశారు. ఆ తరువాత చూడాలి, నాకో బెల్టును కట్టేసి ఒక మిషనును ఆన్ చేస్తే, ఒక బరువైన మూట కదిలి, నా నడుమును సాగగొట్టేది, మళ్ళీ మామూలు స్థితికి తెచ్చేది. అలా రోజుకు ఓ పది-పదిహేను సార్లు చేయించుకోవాలి.
లేచేటప్పుడు మరొక కష్టం – నడుం ఊడిపోయినట్టు అనిపించేది. మరే ఎక్సర్‌సైజూ నాచేత చేయించకపోవడం వల్ల నేను వారం రోజులకే చేతులెత్తి పారిపోయాను. డాక్టర్ దగ్గరకు వెళ్ళే బోలెడుమంది పేషెంట్లలో నేను ఒకతెను. ఆయనెందుకు నా గురించి పట్టించుకుంటారు?
నా శరీరం బిగుసుకుపోయినట్టు నాకే తేటతెల్లమవుతోంది. అందుకు ఆ కొత్త ఫిజియో దగ్గరకు వెళ్ళాను. ఆయన రోజుకు ఒక రకం చొప్పున శరీరంలోని భాగాలన్నింటినీ కదిలేటట్టు చేసేవారు. నా ఫ్రోజెన్ షోల్డర్‌కు మాత్రం కారు స్టీరింగ్ తిప్పినట్టు ఒక చక్రాన్ని తిప్పమనేవారు. అది నిలబెట్టిన తిరగలిలా అనిపించేది; కానీ, అది ఎత్తుగా ఉండడం వల్ల నా ఎడమచెయ్యి అంతెత్తు లేపడం కష్టమయ్యేది. అందుకని ఆయన దాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఓ వారంరోజులు ‘కొత్తొక వింత’న్న చందాన గడచిపోయాయి. ఇంటికి వెళ్ళాక, కాళ్ళూ-చేతులూ పక్కకు పోయిన ఫీలింగ్ కలుగుతూ ఉండేది. భవిష్యత్తులో నేను మామూలు మనిషినవుతానన్న ఆశతో ఈ కష్టాలన్నీ భరించాను.
***
ఆ వారాంతంలో మళ్ళీ ‘బలా’నికి వెళ్ళినప్పుడు, మేడమ్ నా పోస్టింగ్ ఉత్తర్వు గురించి అడిగారు. ఇంకా రాలేదని చెప్పాను. నా బదులు వచ్చిన అధికారి నన్ను రిలీవ్ చేశారని ఆవిడ స్థానిక వార్తల ద్వారా తెలుసుకున్నారట. నేను ఈ ఫిజియో గురించి, ఆ పై అధికారి వేసిన వేషాల గురించీ చెప్పాను.
“ఇప్పుడు నువ్వు లేవు కదా! అందుకని, మీ కాంట్రాక్టర్‌కు ఇక మీదట డబ్బులు ముడతాయిలే! కానీ, ఆ రెణ్ణెల్లో, మూడు నెలలో తాలూకు డబ్బు ఎలా అతనికి ఇప్పిస్తావు?” అని ఆవిడ అడిగారు.
“ఇచ్చేశాను మేడమ్,” అనగానే చేతన గారు నోరు వెళ్ళబెట్టారు. “మా నాన్నగారి నుండి అప్పుచేసి..” అని ఇంకా చెప్పబోతూ, చిన్నబుచ్చుకున్న ఆవిడ మొహాన్ని చూసి ఆగిపోయాను. “నీ బతుకు కూడా నాదానిలాగే ఉందేమిటి? నేను కూడా స్పోర్ట్స్ ఫిజియో కోసం మా నాన్నగారి దగ్గర..” అంటూ కళ్ళు తుడుచుకున్నారు.
నా మనసు కలవరపడింది. “ఊరుకోండి మేడమ్, మీదెంత సున్నితమైన మనస్సు! అప్పుడెప్పుడో మీ నాన్నగారి నుండి డబ్బులు తీసుకున్నారని ఇప్పుడు కూడా బాధపడుతున్నారు! మిమ్మల్ని చూసి నేను బుద్ధి తెచ్చుకోవాలి. డబ్బులడిగినప్పుడు అది నా హక్కన్నట్టు అడిగాను. నాన్న నాకు డబ్బులిచ్చారు. కాంట్రాక్టర్‌కు ఇచ్చే డబ్బులు గనుక నా అకౌంటు నుండి చెక్ ఇచ్చాను, మా మధ్య లాలూచీ ఏమీ లేదని నిరూపించడానికి. ఇంకా నయం. ఆ బిల్లు రెండు నెల్లది గనుక మా నాన్నగారు ఇవ్వగలిగారు. ఇంకా ఎక్కువైతే నా పీపీఎఫ్ లోంచి డబ్బు తీసి ఇవ్వవలసి ఉండేది,” అన్నాను.
అన్న వెంటనే ఆలోచనలో పడిపోయి, భృకుటి ముడిపెట్టి, “అన్నట్టు, నా దగ్గర ఈ పీపీఎఫ్ డబ్బులున్నప్పుడు మా నాన్నగారిని డబ్బులెందుకు అడిగాను? బుద్ధి లేకపోతే సరి!” అంటూ మనసులోని మాట ఆపుకోలేక నన్ను తిట్టుకున్నాను; బయటికి అనేశాను కాబట్టి ఆ మాట ఆవిడ చెవిని పడింది.
“వద్దమ్మా, నువ్వు డ్రా చేసి ఇచ్చినా, నాన్నగారు మెచ్చుకోరు. నెలవారీ ఖర్చులో సరిపోతే, దాన్ని అలాగే ఉండనీ,” అన్నారు ఆవిడ. పీపీఎఫ్ అంటే చక్రవడ్డీ సంపాదించేది కదా! అందుకనే ఆవిడ అలా అనుంటారని అర్థమయ్యింది. ఆవిడకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.
ఆవిడ, “ఇంతకీ, ఆ ఆఫీసర్ పేరేమిట” నడిగారు. “సుభాష్ గారు,” అని నేను చెప్పగానే ఆవిడ మొహంలో ‘ఈయనా?’ అనే నిరసన కనిపించింది. కానీ ఆ వివరాలు అడిగితే, అంగుష్ఠమాత్రురాలిని నాకేం హక్కుందని ఆవిడ అనుకుంటేనో? ఎందుకులెమ్మని ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాను.
***
నా ఫిజియో సెషన్లు వారానికి ఆరురోజుల చొప్పున కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిరోజులు గడిచాక నా చేతిలో శక్తి ఉందని భావించి, ఆ చక్రాన్ని మళ్ళీ ఇదివరకటి ఎత్తులో పెట్టారాయన. నాకు చుక్కలు కనిపించాయి. మిగిలిన అన్ని ఎక్సర్‌సైజులూ ఒక ఎత్తు- ఇదొక్కటీ మరొక ‘ఎత్తు’. ఇలా రెండు మూడు రోజులు గడిచాయి.
నా శరీరపు కదలికల్లో రోజూ వెరైటీ ఉన్నా, అవి పోనుపోను తీవ్రతరం అవడం గమనించాను. మరి అలాంటప్పుడు అవి చేసినప్పుడు నాలో కదలాడాల్సిన శక్తి చెయ్యూపుమేరలో లేదు. ఎందుకో తెలియదు. ఆరోజు మా ఫిజియో ఎత్తుగా ఉన్న ఆ చక్రాన్ని తిప్పమన్నారు. కుడిచేత్తో ముందూ-వెనుకా, రెండు పక్కలకూ బలంగా తిప్పేశాను. కానీ, ఎడమచేత్తో అసలు ఆ చక్రాన్ని ఒక అంగుళం మేరకు కూడా కదపలేకపోయాను.
***
మళ్ళీ ‘బలా’నికి వెళ్ళినప్పుడు మేడమ్ సుభాష్ గారి గురించి చెప్పారు. “నా ప్రమోషన్ వచ్చేలోపు నేనొక శిక్షణ పొందవలసి ఉండేది. ఆయేడు దాన్ని ఒక హెరిటేజ్ భవనంలో నిర్వహించాలని అనుకున్నారు. నేను కోర్సు డైరెక్టర్, అంటే సుభాష్ గారిని, నాబోటి వాళ్ళు చేరుకోగలిగే భవనానికి మార్చమని కోరాను. ఆయనేమన్నారో తెలుసా? ‘మాకు దృఢంగా ఉండే ఆఫీసర్లే కావాలి. క్లిష్టమైన పరిస్థితుల్లో ఉద్యోగం చేసి, త్వరితగతిని నిర్ణయాలు తీసుకోవాలంటే ఫిట్నెస్ తప్పనిసరి. పైగా, రోజుకు పదివేల అడుగులు నడుస్తే ఒంటికి మంచిదని ఈ కాలపు పరిశోధనలు చెప్తున్నాయి,’ అని.
‘అలా అయితే ఎలా సర్? ప్రభుత్వవిధానం ప్రకారం దివ్యాంగులను కూడా తీసుకుంటున్నారు కదా!’ అన్నాను నేను. ‘ఇప్పుడు శిక్షణ పొందబోయే బ్యాచ్‌లో మరెవ్వరూ నాకు ఫిర్యాదు చేయలేదు. మీరే ఫిర్యాదు చేశారు. మీరు రోజుకు పదివేల అడుగులు వేయగలరా? ఒక్కరికోసం మిగతా ఇరవై తొమ్మండుగురి ఫిట్నెస్ను త్యాగం చేయాలా?’ అని జవాబిచ్చారు ఆయన.
నాకు అరికాలిమంట నెత్తికెక్కింది. నన్ను నేను తమాయించుకునేలోపు నా నోటమ్మట, ‘సర్, ఈ శిక్షణ రాబోయే ఉన్నతపదవిలో ఎదుర్కోబోయే సవాళ్ళ గురించా, లేక ఇది ఫిట్నెస్ ట్రైనింగ్ మాత్రమేనా?’ అనే మాటలు అనాలోచితంగా, రిఫ్లెక్స్ యాక్షన్‌లా వచ్చేశాయి. అందుకే అంటారేమో ‘తన కోపమె తన శత్రు’వని.
అసలే కాళ్ళూ- చేతులూ పనిచేస్తున్న మనిషి – ఆయన ఊరుకుంటారా? ‘ఫిట్నెస్ ఎవరికి చేదు? మీరు మాత్రం, దివ్యాంగుల రిజర్వేషన్ తీసుకుని ఉద్యోగంలోకి వచ్చారా? మామూలు మనిషిలాగే పరీక్ష ప్యాసవలేదూ? ఇప్పుడు పెద్ద దివ్యాంగుల హక్కుల గురించి మాట్లాడుతున్నారు,’ అనేశారు కర్కశంగా.
నేను అసలు వదలకుండా, ‘నేను శిక్షణాసంస్థ డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడతాను. అందరినీ కలుపుకుపోవడం ఒక ప్రభుత్వవిధానం కదా!’ అన్నాను. ‘మీకా శ్రమ అక్కరలేదు. మీ విషయం చెప్పి, డీజీగారి చేత నేనే మాట్లాడిస్తాను,’ అనేసి ఫోన్ పెట్టేశారు.
ఆ మధ్యాహ్నం డీజీగారి నుండి ఫోన్ వచ్చింది. ఆయన నా ఇబ్బంది చెప్పమన్నారు. హమ్మయ్య, నా గోడు వినే నాథుడు దొరికారని నా బాధ చెప్పుకున్నాను. ‘ఈ శిక్షణ సగం నైపుణ్యం మీద, మరో సగం ఫిట్నెస్ మీద దృష్టి పెడుతుంది. మీరంతా ఉద్యోగాలలో చేరి ఒక ఆరేడు సంవత్సరాలు గడిచాయి కదా! మనలో కొంతమంది డెస్క్ జాబ్స్‌కే అంకితమైపోతారు కదా! ఫిట్నెస్ ఉంటేనే గురుతర బాధ్యతలు నిర్వర్తించగలం కదా! అందుకే రెంటికీ సరిపోయే వాళ్ళకే శిక్షణ. మీరు హాయిగా మీ ఊళ్లోనే ఉండచ్చు,’ అని నిక్కచ్చిగా చెప్పేశారు. ఆహాఁ, వీళ్ళు నాయకులు! నాయకులా, నాయకుడి స్థానంలో ఉన్న సానుభూతి రహితులా?
ఇలాంటివాళ్ళు నాతోనే అంతమొందారని, వాళ్ళలో కొత్త అవగాహన, స్పూర్తీ అంకురించుంటాయని ఆశపడి నిరాశకు లోనవుతున్నాను, అయ్యాను కూడా! ఆ డీజీగారెవరో తెలుసా? నీకు తెలిసిన వారే! నరేష్ గారు!” అన్నారు.
నేను అవాక్కయ్యాను. “నరేష్ గారంటే నా పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాల్సిన ఆయన! ఓ, ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నేను వైజాగు పోస్టింగ్ అడగడానికి కారణం మీరని చెప్తే, వెటకరించారు,” అన్నాను. “కాలం మారుతుంది గానీ మనుషులు మారరేమో! అందుకేనేమో, ‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పో’దంటారు,” అని మేడమ్ నిట్టూర్చారు.
***
‘మీలో శక్తి ఉంది మేడమ్, మీరు చేయగలరు,’ అని ఫిజియో నన్ను ప్రోత్సహించారు. నేనేదో తెగ కష్టపడిపోయినా, ఆ చక్రం మొరాయించింది. అప్పుడు వార్నింగ్ లేకుండా ఆయన నా ఎడమచేతిని గట్టిగా పట్టుకుని, దాని చేత ఆ చక్రాన్ని పదిసార్లు ఒక వైపుకూ, పదిసార్లు మరో వైపుకూ బలంగా తిప్పించారు.
అనుకోని ఈ పర్యవసానానికి నా భుజం నొప్పితో స్పందించింది. నేను ఆపమంటున్నా ఆయన వినలేదు. ఒక ఆఫీసర్‌ను కాబట్టి, గట్టిగా ఏడవకూడదని ఓపికపట్టాను. అంతే! ఆ రోజుతో ఆ ఫిజియోకు గుడ్‌బై కొట్టాను!
***
మా అరవింద్ భార్య, సోఫియాను, మన సాంప్రదాయక బంగారునగలను కొనుక్కోమని మా అంకుల్, ఆంటీలు కొన్ని లక్షలిచ్చారట. వాళ్ళిచ్చుకుంటే ఫర్వాలేదు గాని, తోడుగా వెళ్ళమని నన్ను పురమాయించారు. ఇదేదో సామెత చెప్పినట్టు, అరవింద్ పెళ్ళైతే నాకు హడావిడన్నట్టు నాకు అనిపించింది.
కానీ, ఏం చేస్తాం? స్నేహం కోసం కొన్ని త్యాగాలు చేయాలి. బట్, వాళ్ళు నేను త్యాగం చేసినట్టు కలలో కూడా అనుకోవడంలేదు. వాళ్ళ మాటలను బట్టి, నేనిప్పుడు సెలవులో ఉన్నాను కాబట్టి ఈగల్ని తోలుతూ ఉండుంటాను, దానికన్నా వాళ్ళు నాకు మంచిపనిని ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారని పసిగట్టాను.
ఇప్పుడు నేను చేయబోయే పనిలో ‘కళ్ళకు వేడుక-బుర్రకు వాడుక’ అవసరమయ్యే లక్షణాలున్నాయట! వాటిమీద నాకు ఆసక్తి ఉందా? అని మాత్రం ఎవరూ అడుగలేదు. దీన్నే ‘ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం’ అంటారేమోనని నాకు అనిపించింది. నా పిచ్చిగానీ, పులినోట్లో తల మనం పెట్టినా, మరొకరు దూర్పినా చావుకు భయపడకూడదని నాకు తెలియదా ఏం? ఏవో ఆలోచనలు నా దారి మళ్లిస్తూంటాయి గాని!
ముందు ఒక ప్రఖ్యాత వజ్రపునగల దుకాణానికి వెళ్ళాం. అక్కడ ర్యాంప్ లేదు. ఆరు మెట్లెక్కాల్సి వచ్చింది. కాళ్ళు పీకేశాయి. నాకు కొనే స్తోమతు లేకపోవచ్చు గానీ, నన్ను కొనుక్కోమంటే, నేను ధగద్ధగాయమానంగా, తళతళా, మిలమిలా మెరిసిపోయే కంఠాభరణాలను ఎంచుకుందును. సోఫియా పక్కా విదేశీ టేస్టుతో అతి సింపుల్ గా ఉన్న గొలుసులకు పెద్ద వజ్రపు లాకెట్ ఉండే డిజైన్లు చూపించమంది. మన దేశంలో మన టేస్టు బట్టి తయారు చేస్తారుగా! అందుకని, ఎక్కువ డిజైన్లు లేవు.
ఎక్కే గుమ్మం-దిగే గుమ్మం అయిపోయింది నా బతుకు. వింతేమిటంటే, అంతంత పెద్ద షాపుల్లో ఒక్కటంటే ఒక్క దుకాణానికి కూడా ర్యాంప్ లేదు. బహుశః దొంగలు సుళువుగా రాకూడదనేమో! ఏమో! అయినా వాళ్ళ చాదస్తం గానీ, సరిగ్గా నడవలేని వాళ్ళూ, వీల్‌చెయిర్‌లో కూర్చొనే వాళ్ళూ దొంగతనానికి ఎందుకు పాల్పడతారు? సపోస్, పర్ సపోస్, పాల్పడ్డారే అనుకుందాం, వాళ్ళకు పారిపోయేంత సీనుంటుందా?
ఈ దుకాణదారులకు పాలరాతి గచ్చులు వేయించేంత డబ్బులుంటాయి గానీ, ఎక్కువమంది వాళ్ళ షాపుకు వచ్చే వీలుగా ర్యాంప్ వేయించే ఆలోచన మాత్రం ఉండదు. దానికి కారణం కనిపెట్టడానికి నాకెక్కువ సమయం పట్టలేదు – ఒకప్పటి నాలాగే వాళ్ళు కూడా ఆలోచనారహితులు! ఏం చేస్తాం?
మొత్తానికి తన టేస్టుకు తగ్గట్టు కొన్ని వజ్రపు ఆభరణాలు ఎంచుకుంది సోఫియా. ఆమెకు మనలాగా బంగారం పిచ్చి లేనట్టుంది. అయినా, ఆంటీ కోసం తెలుగువారి కోడల్లా తయారవడానికి ఏం కావాలో నన్ను ఎంపిక చేయమంది. ఒక జత లోలకులు, చెంపస్వరాలు, ఒక్కోటి చొప్పున పాపిడి బిళ్ళ, నెక్లేస్, గొలుసు, కాసులపేరు, వడ్డాణం కూడా ఆమెచేత కొనిపించాను. ఆమె మేను పసిమిఛాయలో ఉంది. దాని ముందు బంగారం వెలవెలబోతోందని జాతిపచ్చలు, కెంపులు పొదిగినవి ఒక సెట్‌లా తీశాను. ఆమె సంతోషించింది. కాళ్ళు భలే నొప్పెడితే పెట్టాయి గాని వెళ్ళిన పని సక్రమంగా జరిగినందుకు నాకు సంతోషం కలిగింది.
***
“రామ్మా స్పందనా! ఒక కార్పొరేట్ వాళ్ళు సీఎస్ఆర్ నిధులనుండి మన ‘బలా’నికి ప్రోటీన్ డ్రింక్ ఇచ్చారు,” అన్నారు నవ్వుతూ చేతన మేడమ్. ఆ ప్రోటీన్ డ్రింక్ ఏ రూపంలో వచ్చి ఉంటుందో ఆలోచిస్తూ ఉండిపోతే, “ఇటు రా,” అని, బయటకు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద బస్సుంది. దాని మీద ‘అరిస్టాటిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారి సౌజన్యంతో,’ అని వ్రాసి ఉంది.
తన స్టాఫ్‌కు వివరిస్తూ చేతన మేడమ్, “అది మామూలు సిటీ బస్సులాంటిది కాదు. ఎయిర్పోర్ట్ బస్సులాంటిది. అంటే, అక్కడ మధ్యనే ఒక రిమోట్ కంట్రోల్ తలుపు ఉంటుంది. అది తెరుచుకున్నాక మామూలు మనుషులు చిన్నమెట్టును ఎక్కినట్టు ఎక్కితే, లోపల ముందుకో, వెనక్కో మరో మెట్టెక్కి సీట్లలో కూర్చోవచ్చు. ఇదిగో.. ఇలా..” అంటూ లోపలికి దారితీశారు.
“బస్సులో నిలబడేవాళ్ళకు పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉన్నాయి, ఇదిగో,” అని వేలెత్తి పైకి చూపించారు. “ఇక్కడ చూశారా, బస్సులో సగభాగానికి పైగా నిలబడే చోటే ఉందనుకున్నారా?” అని ఆవిడ అడిగితే, వాళ్ళ స్టాఫ్ తలూపారు.
“దానికో ప్రత్యేక కారణం ఉంది. లోపలికి వెళ్ళే దగ్గర ఫ్లోరింగ్‌లో ఇమిడి, అదిగో, అక్కడ, ఒక రేకు ఉంటుంది,” అని, దాన్ని బయటకు లాగమన్నారు మేడమ్. ఒకాయన దాన్ని తీసి, బయటకు వాలిస్తే, అది ర్యాంప్‌లా తయ్యారయ్యింది. “చూశారా, ఇది వీల్చెయిర్లు నిరాటంకంగా ఎక్కించడానికి ఉపయోగపడుతుంది,” అన్నారావిడ. “అరే, దీని మీద అవి భలే అలవోకగా ఎక్కిపోతాయి కదా!” అని ఉత్సాహంతో ఉన్న అతను, “మేడమ్, ఒక్క నిముషం ఉండండి,” అన్నాడు.
మరో అయిదు నిముషాల్లో, వీల్‌చెయిర్‌లో ఒక పిల్లాడిని తీసుకుని వచ్చి, తనన్న మాట నిజమో కాదో పరీక్షించుకున్నాడు. అతని మొహమూ, ఆ పిల్లాడి మొహమూ వెయ్యి వోల్ట్ల బల్బులా వెలిగిపోయాయి.
“మేడమ్, ఇక్కడిదాకా ఎక్కించాక, వాళ్ళని చుట్టుపక్కల సీట్లలో కూర్చోబెట్టడం చాలా సుళువు,” అన్నాడతను. “అదే కదా! ఇదివరకు మనం ఎక్కిన బస్సులలో రెండు మూలల్లోనూ ద్వారాలుండేవి. మన బలశాలులను ఎక్కించడం పెద్ద కష్టం కాదు కానీ, ఆ ఇరుకుచోటులో వాళ్ళను సీట్లో కూర్చోబెట్టడం, కూర్చోవడం మాకన్నా కూడా వాళ్ళకే కష్టంగా ఉండేది. ఇప్పుడు పాపం వాళ్ళకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు లెండి,” అన్నారాయన సంతోషంగా!
నేను ఏ రావిచెట్టు కిందో కూర్చోకపోయినా, నాకు జ్ఞానోదయమైన భావన కలిగింది. నేనూ విమానాలలో తిరిగాను, ఎయిర్ పోర్ట్ బస్సు ఎక్కాను. ఒక్కసారి కాదు, ఎన్నెన్నో సార్లు. అయినా ఒక్కసారైనా దాన్ని వల్ల మరొకరికి ఉపయోగం ఉంటుందా? అలా చేస్తే, వాళ్ళకి ఎంత సౌకర్యంగా ఉంటుంది – ఇలాంటి ఆలోచనలు అస్సలు రానేలేదు. అంటే నేనంత స్వార్థపరురాలినా?
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ప్యాసయ్యానని, నాకేదో చాలా విషయాలమీద అవగాహన ఉందనుకున్నాను గాని, నేను తెలుసుకోవలసినవీ, మెదడులో దులుపుకోవలసిన బూజులూ అవీ ఇంకా బోలెడున్నాయని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను.
***
ఆ తరువాత లోపలికి వెళ్ళినప్పుడు, నా నడుం నొప్పి, కాళ్ళనొప్పుల గురించి మేడమ్‌తో చెప్పి, సరైన ఫిజియో లేకపోవడం వలన నా కష్టాలు ఇంకా గట్టెక్కలేదని వాపోయాను. “ఇన్నాళ్ళూ నాతో ఎందుకు చెప్పలేదమ్మా? మన ‘బలం’లో ఒక మంచి ఫిజియో ఉందమ్మా! ఆమెను పిలుస్తానుండు,” అంటూ ఆమెను రమ్మని కబురుపెట్టారు.
ఒక పాతికేళ్ళ అమ్మాయి వచ్చి, రాగయుక్త స్వరంలో, “నమస్కారం మేడమ్, మీరు పిలిచారట,” అంది. “రా, వీణా, రా!” అని ఆప్యాయంగా పిలిచి, నాకేసి చూపించి, “ఈ మేడమ్ పేరు స్పందన. పెద్ద ఆఫీసర్. ఆవిడకు వెన్నుపూసలో కంప్రెషన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఫ్రోజెన్ షోల్డర్ కూడా ఉంది. కాస్త ఈవిణ్ణి రేపు ఆర్థో దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఆయన చెప్పిన ఎక్సర్సైజులు మంచిగా చేయించు తల్లీ!” అన్నారు. ఆమె నాకు చేతులు జోడించి, అదే రాగయుక్తమైన గొంతుతో, “మేడమ్, ఇవ్వాళ ఆర్థో సర్ సెలవు పెట్టారు. మీరు రేపు పదింటికి మీ మెడికల్ రికార్డు తీసుకుని రాగలరా?” అని మర్యాదగా అంది. నేను తలూపాను.
***
మరుసటిరోజు వీణ చెప్పినట్టు నేను నా ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ రిపోర్టులు, ఈఈజీ, స్కాన్ బ్యాగులు, వాడిన మందుల వివరాలు, చేయించుకున్న ఫిజియో తాలూకు వివరాలు అన్నీ తీసుకుని వెళ్ళాను. ఆవిడ అన్నీ చూసి, నన్ను ఆర్థో వద్దకు తీసుకుని వెళ్ళింది. ఆయన నన్ను పడుకోమని, నా కాళ్ళు – చేతులను కదిలించమని, వాటిలో ఉండే శక్తిని అంచనా వేశారు.
“మీ ఫ్రాక్చర్ బట్టి మీరు వెల్లకిలా పడి ఉంటారు. మరి, దానికీ, మీ ఫ్రోజెన్ షోల్డర్కూ సంబంధం ఉండకూడదు. మీకు అది ఎలా వచ్చింది? ఆ ఇబ్బంది ముందే ఉండేదా?” అని అడిగారు ఆ డాక్టర్ గారు. నాకు తెలియకుండానే నా పెదవులు చిరునవ్వుపువ్వుగా విరబూశాయి.
(ఇంకా ఉంది)
డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి సాహితీ ప్రస్థానం 2015లో తెలుగు భాషలో మొదలయింది. 81కి పైగా రచనలు ప్రచురితమయ్యాయి; వాటిలో రెండు నవలలు కూడా ఉన్నాయి.
సమాజానికి ఉన్నత విలువలుండే సాహిత్యాన్ని అందివ్వడం కోసమే వీరు రచనలు చేస్తారు. ఆఖరికి హాస్య కథ వ్రాసినా సరే, దానిలో ఒక విలువ పొంచి ఉంటుంది. వీరి రచనలలో స్త్రీకి ఉన్నతమైన స్థానం, తనదంటూ ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటాయి. వీరి కథలు పలు ప్రింట్, వెబ్ పత్రికలలో ప్రచురింప బడ్డాయి.
మూస రచనలను చేయడానికి ఇష్టపడని సూర్య లక్ష్మి విభిన్న ఇతివృత్తాలు, విభిన్న కోణాల నుండి మానవ ప్రవర్తనని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు, అది ఫలితాన్ని ఇచ్చినా, ఇవ్వక పోయినా కూడా!
