Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఘటన

[అనుకృతి గారు రచించిన ‘ఘటన’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

అది 1950-60ల మధ్య కాలం, ఇంకా ఎడ్లబండ్లు రైతులు ఉపయోగిస్తున్న కాలం. పల్లెకి, పల్లెకీ మధ్య రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందని కాలం అది. ఆడపిల్లలని HSC వరకు చదివిస్తే గొప్ప అనుకునే కాలం.

ఆ రోజు బాల్య స్నేహితులూ, సన్నకారు యువరైతులైన గోపి, విరించి తమ పొలాల్లో పండిన మిరప, వేరుశెనగ పంటల్ని, బస్తాలకెత్తి ఎడ్ల బండ్లలో వేసుకుని తిమ్మాపురం నుండి బయలుదేరి సింగవరం వచ్చారు. సింగవరం, తిమ్మాపురం మధ్య బుడమేరు ప్రవహిస్తూ ఉంటుంది. అనుకోకుండా, కాని కాలంలో కురిసే వర్షాలకు, వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు బుడమేరు పొంగి రెండు వూళ్ళ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఆ సమయంలో అది ఎంత ఉదృతంగా ప్రవహిస్తుందంటే ఎడ్లబండ్లు కూడా కొట్టుకుపోయేంత వేగం ఉంటుంది. అప్పుడా బుడమేరుని దాటటం అంటే ఏటికి ఎదురీదినంత పని అవుతుంది. ఆ విధంగా బుడమేరు ప్రవాహానికి ఆ చుట్టుప్రక్కల అయిదారు ఊళ్ళకి తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోతాయి.

సింగవరం చిన్న టౌన్, సుబ్బారాయుడు స్వంతంగా ఊరిచివర నిర్మించుకున్న మార్కెట్ గొడౌన్స్‌కి వచ్చారు స్నేహితులిద్దరూ. సుబ్బారాయుడు నిఖార్సైన మనిషి, వ్యాపారం చేయటంలో ఉదారత చూపిస్తాడు. రైతులని మోసం చేయకుండా, స్వంతంగా కార్యక్రమమంతా నిర్వహిస్తుంటాడు.

ఆ చిన్న టౌన్ మధ్యలో సుబ్బారాయుడుకి విశాలమైన భవంతి వుంది, ప్రక్కన ఉన్న స్థలంలో పెద్ద షెడ్ వేయించాడు సుబ్బారాయుడు తాత. తాతగారి హయాం నుండి ఆ హాల్ ఉచితంగా ఓ వందమంది అతిథులతో చేసే పెళ్లిళ్లకు, చిన్నపాటి ఫంక్షన్స్‌కి ఉచితంగా ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది.

ఆ రోజు వూళ్ళో పెళ్లిళ్లకు ప్రక్క ఊళ్ళనుండి కొన్ని కుటుంబాలు హాజరయ్యాయి, అంతా ఎడ్లబండ్లలో, వచ్చిన వాళ్ళే. గోపి, విరించి తెచ్చిన బస్తాలని తమ వంతు వచ్చేవరకు వేచివుండి, తూకం వేయించి, రావలసిన సొమ్ము తీసుకుని తమ వూరికి బయలుదేరేసరికి ఏడు దాటింది, అప్పటికే చీకటి కమ్మేసింది. ఉరుములు, మెరుపులతో జోరున వర్షం పడసాగింది, అయినా ఇద్దరూ తమ బండ్లను పరుగులు తీయించి బుడమేరు వరకూ వెళ్లారు.

అది పై ఊళ్ళ నుండి వచ్చే నీరుతో ఉధృతంగా ప్రవహిస్తున్నది, ఆ చీకటిలో ఎడ్లను నీటిలోకి దింపితే అవి లాగలేకపోగా, ప్రవాహానికి కొట్టుకు పోయే ప్రమాదముంది. చేసేది లేక ఇద్దరూ బండ్లను వెనక్కి తిప్పారు, వెనక్కి తిరిగిన వాళ్లలో చాలామంది రైతులే, పెళ్ళికి వచ్చి, వెనక్కి పోలేక కొన్ని కుటుంబాల వాళ్ళు కూడా వెనక్కి తగ్గారు. ఆ సరికే సుబ్బారాయుడు షెడ్ వద్దకు చాలామంది చేరుకున్నారు.

సామాన్యంగా ఇటువంటి విపత్కర సమయాల్లో రైతులకి భోజన ఏర్పాట్లు సుబ్బారాయుడు భార్య మొదలుపెట్టేస్తుంది. మరో ఖాళీ స్థలంలో ఎడ్లను కట్టేయటానికి ఏర్పాటు చేసిన షెడ్స్‌లో కట్టేసి, స్నేహితులిద్దరూ హాల్ లోకి వెళ్లారు, దాదాపు వందమంది వరకు రైతులు, పెళ్లిళ్లకు వచ్చి చిక్కుపడిన కుటుంబాలవారూ వున్నారు. అంతమందికి కంచాలలో పెట్టటం అసాధ్యం కనుక నేలమీద పరిచిన చాపలమీద కూర్చున్న అతిథులకు అన్నం, ముద్దపప్పు, దప్పళం, ఆవకాయ, మజ్జిగతో భోజనం కల్పించారు పెట్రోమాక్ లైట్ల వెలుగులో అంతా ఆవురావుమని ఆ భోజనాన్ని తృప్తిగా తిన్నారు.

కొంచం రద్దీ తగ్గాక విరించి, గోపి భోజనం చేశారు, మిగిలిన వాళ్ళు కూడా భోజనాలు ముగించారు. హాల్ శుభ్రం చేసి పనివాళ్ళు హాల్లో, వరండా లో పెద్ద, పెద్ద జంపఖానాలు పరిచారు.

ఆ హాల్‌కి ముందు వైపు వృత్తాకారంలో పెద్ద వరండా వుంది, ఎంత వర్షం పడినా, జల్లు లోపలి పడకుండా పకడ్బందీగా నిర్మించిన వరండా అది. పెట్రోమాక్స్ లైట్‌ల స్థానంలో కోడిగుడ్డు దీపాలు వచ్చాయి. వరండా లోకి ఆఖర్న వచ్చిన విరించి, గోపికి అక్కడ కూడా చుక్కెదురయింది.

విరించి వరండాలోకి ప్రవేశించటానికి ఉన్న నాలుగు మెట్ల ప్రక్కన ఇద్దరు పది, పన్నెండేళ్ళ మగ పిల్లలు కనిపించారు.ఆ మగ పిల్లల ప్రక్కన చోటు చేసుకుని విపంచి పడుకుంటే. మెట్లకు అటువైపు ఎలాగో ఒక శాల్తీని పక్కకు జరిపి గోపి పడుకున్నాడు. ఉదయం నుండీ అలిసిపోయి ఉన్నారేమో ఇద్దరికీ, చల్లని గాలికి గాఢంగా నిద్ర పట్టేసింది.

***

తెలతెలవారుతుండగా అంతా లేచారు, హాల్‌లో పడుకున్న వాళ్ళు, వరండాలో పడుకున్నవాళ్ళు, కళ్లు తెరిచిన విపంచికి తన వైపు అంతా గుచ్చి, గుచ్చి చూస్తున్నట్టు అనిపించేసరికి గబుక్కున లేచి కూర్చున్నాడు. అతని ప్రక్కనే ఒక అమ్మాయి, దాదాపు అతనికి దగ్గరగా పడుకుని వుంది.

వాళ్ళ నాన్న కాబోలు ఆ అమ్మాయిని ఒక్క దెబ్బ వేసి “మంజీరా, లే” అంటూ అరిచాడు. ఉలిక్కిపడి లేచిన ఆ అమ్మాయి ఆ మసక వెలుగులో స్పష్టంగా కనిపించలేదు విరించికి. అంటే రాత్రంతా ఆ అమ్మాయీ, తానూ ప్రక్క, ప్రక్కనే పడుకున్నారా? ‘ఇదెలా సాధ్యం?’ అనుకున్నాడు విరించి అయోమయంగా.

అతను, గోపి కంగారుగా లేచి బయటకు వెళ్లబోతుంటే, ఆ అమ్మాయి తల్లి “వాడి ప్రక్కన పడుకున్నావేమిటే” అంటూ ఆగకుండా తిట్లు కురిపిస్తున్నది.

సుబ్బారాయుడి గుమస్తా వచ్చి, “మర్యాదగల కుటుంబమయ్యా వాళ్ళది, పోయి, పోయి వయసులోవున్న ఆడపిల్ల ప్రక్కన పడుకోవటమేమిటి?” అంటూ చిటపటలాడాడు.

విరించి అతనికి ఏదో చెప్పబోయినా అతను వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. నిర్ఘాంతపోయి నిలుచున్న విరించిని బయటకు లాక్కుపోయాడు గోపీ.

“నేను చూసినప్పుడు ఇద్దరు మగపిల్లలు వున్నారురా, చివర్లో, నిద్రకాగలేక పూర్తిగా మెట్టు వైపు పడుకున్నా, నేను సరే, పాపం ఆ అమ్మాయిని అంతా ఎగతాళిగా చూసారు, వాళ్ళ అమ్మ తిడుతూనే వున్నది, నేను ఏమీ చేయకున్నా జులాయి వెధవలా చూసారు” అన్నాడు బాధగా.

గోపికి కూడా చాలా బాధగా వుంది దాదాపు అయిదు ఊళ్ళ వాళ్ళు విరించినీ, ఆ అమ్మయికి మధ్య ఏదో జరగరాని ఘోరం జరిగిపోయినట్టుగా చూడటం అతనికీ చాలా కష్టం అనిపించింది.

ఇంటికి వేళ్ళాడేగానీ విరించి మనసు, మనసులో లేకుండా పోయింది, మధ్యాహ్నం ఇద్దరూ వెళ్లి బ్యాంకులో డబ్బు వేసి వచ్చారు. కానీ విరించి మనసులోని బాధ పంచుకునేందుకు తల్లీ, తండ్రీ లేరు. నాయనమ్మకెలా చెప్పాలో తెలియలేదు.

***

రెండు రోజులు అన్యమనస్కంగా ఉంటున్న మనవడిని గమనించిన వరమ్మ గోపిని పిలిచి విషయమేమిటో తెలుసుకుంది. గోపి ద్వారా ఆ అమ్మాయి ఎవరో, తండ్రి గురించి వివరాలు తెలుసుకుని ఏకంగా వాళ్ళ ఇంటికే గోపి తోడు రాగా బయలుదేరింది.

అమ్మాయి తండ్రి చలపతిరావు ఎవరో తెలియని పెద్దావిడ రిక్షా దిగుతుంటే “ఎవరు కావాలండీ” అంటూ మర్యాదగా అడిగాడు

“మీతోనే పనివుంది చలపతిరావుగారు, నేను లోపలి రావచ్చా” అడిగింది వరమ్మ.

జవాబుగా భార్యని “సుభద్రా’ అంటూ కేకేసి, “లోపలి రండమ్మా” అంటూ ఆహ్వానించాడు.

సుభద్ర తనకేసి ప్రశ్నర్థకంగా చూస్తుంటే, “నేను విరించి నాయనమ్మనమ్మా” అన్నది.

భార్యాభర్తలిద్దరూ మోహమొహాలు చూసుకున్నారు. గోపి నోరు విప్పి, “ఆ రోజు సుబ్బారాయుడిగారింట్లో” అంటూ అర్ధోక్తిలో ఆపేసాడు.

చలపతి రావు కోపంతో ఏదో అనేలోగానే, “ఒక్కసారి మీ ఇద్దరబ్బాయిలని పిలవండి” అన్నది.

పిల్లలు వచ్చాక, “బాబూ, ఆ రోజు మీ ఇద్దరూ ఎక్కడ పడుకున్నారు?” అని అడిగింది వరమ్మ.

పెద్దపిల్లవాడు, “అక్క తర్వాత నేను, తమ్మడూ పడుకున్నాము కానీ, చలి వేసి నేను అక్క, అమ్మ మధ్యలో దూరాను, తమ్ముడేమో అమ్మా, నాన్న మధ్య దూరాడు” అన్నాడు నవ్వుతూ. “మీరెళ్ళి ఆడుకోండి నాన్నా” అని వాళ్ళని పంపించేసి “అదండీ జరిగింది, ఇందులో నా మనవడు జులాయితనం ఏమీ లేదు”, అంటూ తన వివరాలన్నీ చెప్పి, “తల్లీ, తండ్రిలేని పిల్లవాడిని వాడి పదిహేనో ఏటనుండి పెంచాను, చదువు చాలించి వ్యవసాయంలోకి దిగాడు. ఈ గోపి, వాడు స్నేహితులు. మీరన్నట్టు వాడు జులాయి కాదండి, మీ అమ్మాయి టీచర్ ట్రైనింగ్ అయి, ఆర్డర్స్ కోసం ఎదురు చూస్టున్నదని తెలిసింది, మీకభ్యంతరం లేకపోతే శుక్రవారం రాములవారి గుళ్లో ఇద్దరూ మాట్లాడుకునేలా ఏర్పాటు చేద్దాము, వాళ్ళు చేయని తప్పుకు ఈ అపప్రధని నెత్తిన మోస్తున్నారు, బాగా అలోచించి కబురు చేయండి” అన్నది.

ఆవిడ మాటలన్నీ మంజీర లోపలినుండి విన్నది కానీ బయటకు రాలేదు.

వెళ్లేముందు “మాకు కట్నకానుకలు ఏమీ వద్దు, పెళ్లి కూడా మీ శక్తికి మించి చేయవద్దు” అన్నది వరమ్మ.

చలపతి రావు చాలా అలోచించి, కూతురి అభిప్రాయం అడిగాడు. మంజీర ఎటూ చెప్పలేదు, ఇద్దరు కూతుళ్ళ పెళ్లిళ్ళ తర్వాత ఆయన మరో పెళ్ళి చేయటానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. వెనుక ఇద్దరు మగపిల్లల బాధ్యత వున్నది, మంజీర అర్థం చేసుకుంది.

***

రామాలయంలో పెళ్లిచూపులు ఏర్పాటు చేసారు. గుళ్లో ఉన్న మంటపంలో నాలుగు స్తంభాలాట ఆడుతున్నారు మంజీర తమ్ముళ్లు, గుడికొచ్చిన మరో ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాళ్లకు దూరంగా మెట్ల ప్రక్కన గట్టు మీద కూర్చుని ఉన్న విరించిని పరీక్షగా చూసింది మంజీర, ఎత్తుగా, దృఢంగా అందంగా వున్నాడు విరించి. ‘చామన ఛాయ అయినా బావున్నాడు’ అనుకుంది మంజీర.

తెల్లగా, పొడవుగా చక్కని ముఖకవళికలతో ఉన్న మంజీరని ఈ రోజు స్పష్టంగా చూసాడు విరించి. తన వల్ల ఆమెకు కలిగిన అవమానానికి క్షమాపణ అడిగాడు విరించి.

“ఆ ఘటన కేవలం యాదృచ్ఛికం, దానిలో మనిద్దరి తప్పూ లేదు, అయినా అప్పుడా ఘటన జరగకపోతే” అర్ధోక్తిలో సిగ్గుపడి ఆపేసింది మంజీర.

ఆ మాటతో ఆమె మనసు అర్థమై, జవాబుగా విరించి కూడా సంతోషంగా నవ్వాడు.

(సమాప్తం)

Exit mobile version