Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గిరిపుత్రులు-1

[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘గిరిపుత్రులు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం-1

మ్మాయిలంతా రంగు రంగుల దుస్తులలో మెరిసిపోతున్నారు. సీతాకోకచిలుకల్లాగా ఆకర్షణీయంగా ఎగురుతున్నారు. చూసేవాళ్ళకు అలా అనిపిస్తోంది.

అవును. కొత్త స్కూలు హైస్కూలు. ప్రాథమిక బడిలో ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి దాకా చదువుకున్న బాల బాలికలంతా ఆరవ తరగతికి రాగానే అబ్బాయిలంతా మగపిల్లల స్కూలుకీ, అమ్మాయిలంతా ఆడపిల్లల స్కూలుకీ చేరిపోయారు.

ఇవాళే పాఠశాలలు తెరిచిన మొదటి రోజు. నర్మద రెండు పుస్తకాలు చేతిలో పట్టుకుని గేటు దగ్గరే నిలబడిపోయింది, ఆ పాఠశాల బోర్డు వైపు చూస్తూ..

ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల. రిజిస్టర్ నెం.

బొబ్బిలి.. విశాఖపట్నం జిల్లా

ఇంతలో స్కూల్ బెల్ వినిపించింది. మైదానంలో అక్కడక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న వాళ్లంతా పరుగు పరుగున వచ్చి తరగతుల వారీగా నిలబడ్డారు. పదవ తరగతి తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు వేదికవద్ద మెట్టుపై నిల్చున్నారు. ప్రధానోపాధ్యాయురాలు వారి వెనుక నిల్చున్నారు. ఉపాధ్యాయులంతా ఆయా తరగతిలో పిల్లల వెనుక నిలబడ్డారు.

బెల్ ఠంగుమంటూ మళ్లీ మోగింది. ప్రార్థన ప్రారంభమైంది. నర్మదకు ఎంతో ఆనందంగా ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను హైస్కూల్లో అడుగుపెట్టగలిగింది. చాలా కష్టపడి చదివి హైస్కూలు చదువు కూడా పూర్తి చేయాలి. మనసులో దృఢ సంకల్పం చేసుకుంది.

ప్రార్థన కాగానే పిల్లలంతా వరుసలలో ఎవరి క్లాసులకు వాళ్ళు వెళుతూ ఉన్నారు. నర్మద కూడా అందరితో పాటు తరగతిలో అడుగు పెట్టింది. అందరూ గబగబా ముందే తమ స్నేహితురాళ్లకు జాగాలు ఉంచారు. నర్మద నెమ్మదిగా నడుచుకుంటూ ఆఖరి బెంచిలో కూర్చున్నది.

ఇంతలో అందరూ లేచి నిలుచున్నారు. తెల్లగా సన్నగా అందంగా ఉన్న టీచర్ గారు లోపలికి రాగానే అందరూ “గుడ్మార్నింగ్ టీచర్” అంటూ రాగయుక్తంగా పలికారు.

ఆమె చిరునవ్వుతో అందరిని చూస్తూ “కూర్చోండి” అన్నది. అటెండెన్స్ రిజిస్టర్ తీసి అందరి పేర్లూ వరుసగా పిలిచారు.

“నర్మదా! నర్మదా!” అని సన్నని గొంతుతో ఆమె పిలుస్తూ ఉంటే నర్మద లేచి నిలుచుంది. “నీ పేరు ఎవరిదో తెలుసా?” ఆమె ప్రశ్నకు నెమ్మదిగా తల ఊపింది.

“నర్మద ఒక నది పేరు” అని చెప్పింది. వింటున్న అందరూ పకపకా నవ్వారు.

“ఎందుకు నవ్వుతారు? కృష్ణవేణి పేరు కూడా ఒక నది పేరే కదా! పెన్నా, కావేరి, సింధు, యమునా ఇవన్నీ నదుల పేర్లే! నదులు సహనానికి ప్రతిరూపాలు. మనం త్రాగే నీటి నుంచి మనకు అవసరమైన విద్యుత్ శక్తిని అందించే వరకు అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. మీకు ఈ తరగతిలో నదులు – వాటి ఉపయోగాలు అనే పాఠం కూడా ఉంటుంది” అన్నారామె.

నర్మదకు ఆమె ఎంతో నచ్చారు. తర్వాత తెలిసింది ఆమె పేరు ‘అరుణ’, తెలుగు చెప్పే టీచరట. ఉదయం నాలుగు పీరియడ్లు ఎలా జరిగిపోయాయో తనకు తెలియనే లేదు. మధ్యాహ్నం బెల్లు కొట్టేసరికి చాలామంది పిల్లలు ఇళ్ళకు పరుగులు తీశారు. నర్మద కూడా. వాళ్ళ ఇల్లు దగ్గరే. ఇంటికి చేరగానే అమ్మమ్మ అడిగింది.

“నర్మదా! స్కూలు నచ్చిందా? ఇంతకు స్నేహితులు ఎవరైనా ఏర్పడ్డారా?”

“అబ్బబ్బ! ఆగు అమ్మమ్మా! నాకు ఆకలి వేస్తోంది. ఇంకా మొదటి రోజే కదా!”

“ఆకలిమాట దేవుడెరుగు! ముందు నీ స్కూలు బట్టలు బాత్రూంలో మార్చుకొని వేరే బట్టలు వేసుకొని రా! స్కూల్ బట్టలతో భోజనం నీకు పెట్టేది లేదు” అంటూ అమ్మమ్మ అటు తిరిగింది.

“ఊ.. అంటూ అమ్మ ఏది?” అంది.

“పెరట్లో బట్టలు ఆరవేస్తోంది. నువ్వు తొందరగా రా! నేను నీకు భోజనం పెట్టేసి కాసేపు నడుము వాలుస్తాను” అంటూ తొందర పెట్టింది. ‘అమ్మమ్మ మాటకి తిరుగే లేదు’ అనుకుంటూ నర్మద పుస్తకాలు బల్ల మీద పెట్టి బాత్రూం వైపు నడిచింది.

సాయంత్రం స్కూల్ నుండి రాగానే నర్మద వంటింట్లో ఉన్న తల్లి అన్నపూర్ణ దగ్గరకు వెళ్ళి, “అమ్మా! అమ్మా! నాకెందుకు ‘నర్మద’ అంటూ నది పేరు పెట్టావమ్మా! ఇవాళ క్లాసులో టీచర్ అందరినీ పేర్లు అడుగుతూ నా పేరు అడగ్గానే ‘నర్మద’ అని చెప్పగానే అందరూ కిసుక్కున నవ్వారు! నాకు చాలా ఏడుపొచ్చింది.”

“అయితే నువ్వు ఏడిచావా? నేను చెప్పింది మరిచిపోయావా?” తల్లి ప్రశ్నకు వెంటనే తల అడ్డంగా ఊపుతూ,

“లేదమ్మా! ఎప్పటికీ ఏడవనే ఏడవను. నువ్వు చెప్పావుగా! నవ్వుతూ ఉంటే నా చుట్టూ సుగంధ పరిమళాలు వీస్తాయని. దేవతలు నేను నడిచే బాటలో విరులు జల్లుతారని. అనుకున్నవన్నీ జరుగుతాయని.” ప్రవాహంలా చెప్పుకుంటున్న కూతురుని చిరునవ్వుతో చూస్తూ,

“అయితే స్కూల్లో ఏమైందో చెప్పూ!” అంటూ కూతురు నోటి వెంట అన్నీ విని నర్మద బుగ్గలపై ముద్దు పెట్టుకుంటూ, “మా బంగారు తల్లికి నేస్తం ఎవరు? ఆ అదృష్టం ఎవరిదీ?” తల్లి అడిగిన ప్రశ్నకు

“లేదమ్మా! ఎవరూ నాకు నచ్చలేదు.” అంది.

వింటున్న అన్నపూర్ణ ఉలికిపడింది. “సరే! నీ కోసం అన్నవరం ప్రసాదం, అరటికాయ బజ్జీలు చేసాను. పెరట్లో బాదాం చెట్టుకింద తిన్నెమీద కూచుని తిను. ఇంద.” అంటూ శుభ్రంగా కడిగి తుడిచిన బాదం ఆకులో అందించింది.

అమ్మ ఎందుకు అక్కడ తినమంటుందో నర్మదకు తెలుసు. అందుకే నోటికి వచ్చిన పాటను గట్టిగా పాడుకుంటూ, మువ్వలగజ్జెలు చిరు చిరు సవ్వడి చేస్తూండగా పెరట్లోకి పరుగుతీసింది.

అంతకు ముందే అక్కడ అమ్మమ్మ కూర్చోవడం చూసి, “అమ్మమ్మా! నాకు మంచి కబుర్లు చెప్పవూ!” అంటూ తను తెచ్చుకున్న ఫలహారం కొంచెం కొంచెం కాకులకు, చీమలకూ పెడుతూ తాను కొంచెం తింటూ అడిగింది.

“చెపుతానురా! తల్లీ! ముందు తినేసి చేతులు కడుక్కుని రా! లేకపోతే ఇవన్నీ పాడవుతాయి.” అంది. అమ్మమ్మ ఒళ్ళో ఇత్తడిపళ్ళెం చూసి ‘ఓహో! ఇవి దేముడి మడి వత్తులు. అమ్మమ్మ ఫాక్టరీలో తయారవుతున్నాయి.’ అనుకుంటూ ఆమె చెప్పినట్లు చేసి మళ్ళీ వచ్చి బుద్ధిగా కూర్చుంది.

“నర్మదా! ఇవాళ నీకు అపురూపమైన ఇద్దరు స్నేహితుల గురించి చెపుతాను. ఎవరంటే..”

“అమ్మమ్మా! అపురూపమైన స్నేహితులు అంటే నువ్వు నాకు చెప్పిన కృష్ణుడు, కుచేలుడు గురించి, కర్ణుడు దుర్యోధనుడు గురించి ఇంకా..”

“అవి పురాణాలలోనివి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వారు ఉన్న ఊరిలోనే మనమంతా ఉండేవాళ్ళం. చాలా రోజుల క్రితం నేను, తాతగారు, మీ అమ్మా, నాన్నా అందరం పర్లాకిమిడి దగ్గర గల పర్వతాలపేటలో ఉండేవాళ్ళం. అక్కడి ప్రజలంతా ఒక మహానుభావుని పేరు చెప్పుకునేవారు. అతనెవరో తెలుసా?

గిడుగు రామమూర్తి పంతులుగారు. అతను ఆగస్టు 29న 1863లో శ్రీముఖలింగం దగ్గర గల పర్వతాలపేటలో పుట్టారు. వారి అమ్మా, నాన్నా వీర్రాజు, వెంకాయమ్మగారు. ఉపాధ్యాయునిగా విజయనగరంలో ఇచ్చే 25 రూపాయలు కంటే పర్లాకిమిడిలో జీతం 5 రూపాయలు ఎక్కువ అని 30 రూపాయల జీతానికి ఇక్కడి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. కుటుంబం అందరినీ ఎడ్లబండిలో కూర్చోపెట్టి సామానుతో పాటు తీసుకొచ్చారు. ఇక్కడ పులుల భయము చాలా ఎక్కువ. ఇక్కడి కొండలలోని దోమలు కుడితే జ్వరం వచ్చి, చెముడు వస్తుందని తెలుసు. అయినా ఐదు రూపాయలు కోసం, కుటుంబ బాధ్యతల కోసం వచ్చారు.

మందస అనే ఊరి నుండి గుంప వరకు ఉన్న కొండలలో ‘సవరలు’ అనే కొండజాతివారుంటారు. వారానికి ఒకరోజు సంతలో తమ దగ్గర దొరికే చింతపండు, తేనె, పళ్ళులాంటివి తీసుకొచ్చి అమ్మి, తమకు కావలసిన వస్తువులు తీసుకుపోతారు. స్థానికులు వారిని మోసం చేస్తున్నారు అని భావించి, వీరికి విద్య లేకపోవడం వలన కదా! మోసపోతున్నారు. ఏం చేయడం? నేను సవర భాష నేర్చుకుంటాను. నాకు చాలా భాషలు వచ్చు. కానీ వీళ్ళ సవర భాషకు లిపి కూడా లేదు. ఎలాగా? అని ఆలోచించి ‘తవుడు’ అనే పేరు గల ఒక సవర బాలుడితో నేస్తం కడతారు.”

“నేస్తం అంటే?” వింటున్న నర్మదకు అర్థం కాలేదు.

“నేస్తం కట్టడమంటే స్నేహం చెయ్యడం. సవరలతో నేస్తం కట్టడమంటే దానికో పద్ధతి ఉంటుంది. ఒక మంచి రోజు చూసి ఎవరితో అయితే స్నేహం చేస్తున్నామో వారి ఇంటికి కుండెడు తేనె, అరటి పండ్లు గెల, పసుపు కొమ్ములు, నాలుగు కొండ చీపుళ్ళు, మండిగ నిండా జొన్నలు, అల్లం, పొగాకు, తెల్ల తలపాగా తీసుకుని వెళతారు. వారిని ఆదరంగా కుర్చీలో కూర్చోపెట్టి కానుకలను అందిస్తారు.

వారు ఆ కానుకలను అందుకుని ప్రతిగా ఒక ఎర్ర తలపాగనూ, రెండు ఫలాలనూ, తవ్వెడు బియ్యం, పసుపు కొమ్మూ, అల్లం ముక్క, పానకం, రెండు పొగాకు చుట్టలూ అందిస్తారు. తరువాత చీపురుపుల్లలు తీసుకుని ‘గడీ ఇషాన్, గడీనం’ అని మూడుసార్లు అనుకుని చీపురు పుల్లలు ఒకరి చేతినుండి మరొకరు మార్చుకుని రెండేసి ముక్కలు చేసి పారవేస్తారు.

సవర భాషలో ఆ మాటలకు అర్ధం, ‘నా స్నేహితుడా! నీ స్నేహితుడను.’ చీపురు పుల్లలు విరిచి పారెయ్యడం ప్రమాణం చేయడంతో సమానం. ఇద్దరూ చేయీ, చేయీకలిపి, ఒకరినొకరు ఆదరంగా దగ్గరకు తీసుకుని ఆనందంగా నవ్వుకుంటారు.

కొండదేవతల జాతరలు, అమ్మవారు పూనడము, పచ్చబొట్టు పొడిపించుకోవడం, సిరిమాను అధిరోహించడాలూ మాత్రమే కాక గిరిజనులకే ప్రత్యేకమైన వాద్యపరికరాలు తుడుము, మోరి, డోలు, కిరిడి, డప్పు, బాకా, జోడుకొమ్ములు, సన్నాయి, కొమ్ముబూర, పిన్నలగర్ర, మొదలగు వాయిద్యాలు అన్నీ వివరంగా సవరబాలుని దగ్గర తెలుసుకుంటారు. థింసా నాట్యం కూడా నేర్చుకుంటారు.

ఇద్దరు కలిసి పాడుకునేవారు.

“హోరి హోరి మోరోలో లారిలోహిరిలోరి

ఝూలోయ్ ఝంగాదోలి

మట్టి తిటి పొదం పాదోర్ చిట్టా కొండి

నెలాబీ బీజంత దుఃఖ దెలమొత్తా”

దీని అర్థం ‘విత్తనంలో దేవుడు ఉండి మనకు సుఖదుఃఖాలు కలుగచేస్తాడని’. ఈ విధంగా 40సంవత్సరాలు వాళ్ళిద్దరూ నేస్తం కట్టి ఆనందంగా ఉన్నారు. గిడుగువారు సవరభాష నేర్చుకోవడంతో పాటు సవరల కోసం ఒక పాఠశాల ప్రారంభించారు. సవరభాషతో పాటు వాళ్ల ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, అలవాట్లు, జీవనశైలి కూడా అధ్యయనం చేశారు. సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.

సవరభాషకు లిపి లేకపోవడం వలన అతను సేకరించిన కథలు, పాటలు తెలుగు లిపిలోనే రాసుకునేవారు. సవర వ్యాకరణం వ్రాసి ‘సవర వాగనుశాసనుడి’గా పేరుపొందారు.

ప్రభుత్వంవారి ప్రోత్సాహంతో ఇంగ్లీషు-సవర మరియు సవర-ఇంగ్లీష్ నిఘంటువుల్ని తయారుచేశారు. వారి కోసం, పాఠాలు నేర్పడానికి వాచకాలు రాశారు. వారు పాడుకొనే 32 పాటలను సేకరించారు. అంతేకాకుండా గూడేలకు తిరుగుతూ వారికోసం సవర భాషలో రెండు పాటలు రాశారు.

ఒకటి ఎల్ డా డుక్రి బోయి అనగా తెలుగులో ‘ముసలి రాకాసి’ అని అర్థం

రెండవది గు అరి నేబఞ జి అనగా తెలుగులో ‘చెట్లు రోదిస్తున్నాయి’ అని అర్థం.

‘ఉన్నఊరూ-కన్నతల్లీ’ అంటారు పెద్దలు. అటువంటిది 1936లో ఒరిస్సా రాష్ట్రము ఏర్పడినప్పుడు అనేక తెలుగు గ్రామాలు ఒరిస్సాలో చేరవలసి వచ్చినపుడు తెలుగు భాష కోసం అతను తను ఉంటున్న ఊరినీ, ఇంటినీ, 55 సంవత్సరాలు గడిపిన పర్వతాలపేటను తెలుగు భాష కోసం తృణప్రాయంగా వదిలేసి వచ్చేశారు. మద్రాసు నుండి ఆంగ్లేయ ప్రభుత్వం వారు కొందరు వారి కృషిని మెచ్చుకొని సహాయం చేశారు. ఎన్నో బిరుదులు ఇచ్చారు.

77 సంవత్సరాలు సవరజాతి కోసం, శాసనాల కోసం, వ్యవహార భాష కోసం, తెలుగు ఉనికి కోసం జీవితాన్ని వెచ్చించిన గిడుగు రామమూర్తిగారిని ప్రజలు ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా? ‘మా గిడుగు – పిడుగు’ అని పిలుచుకుంటారు.”

“అమ్మమ్మా! చాలా బాగుంది. మా టైం టేబుల్‌లో కథల కోసం ఒక పిరియడ్ ఉంది. అప్పుడు నేను ఈ కథ అందరికీ చెపుతాను.”

“నర్మదా! ఇదంతా దేనివలన జరిగింది?”

“స్నేహం వలన. గిడుగు వారూ, సవర బాలుడూ నేస్తం కట్టారు కనుక అంటే ఏదైనా సాధించాలంటే ఒక మంచి స్నేహితుడు ఉండాలి. కానీ.. నాకు మా క్లాసులో అందరూ స్నేహితులే! నేను ఇంకా గొప్ప!” అని కిలకిలా నవ్వుతూ ఇంట్లోకి పరుగుతీసింది.

(సశేషం)

Exit mobile version