Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గిరిపుత్రులు-10

[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘గిరిపుత్రులు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[విమలక్క నచ్చజెప్పి పంపేయడంతో, అన్యమనస్కంగానే ఇల్లు చేరుతుంది అన్నపూర్ణ. కూతురుని చూసిన సుభద్రమ్మ మనసు తేలికపడుతుంది. ఇంతలో నర్మద వచ్చి అన్నపూర్ణని పలకరించడంతో, వర్తమానంలోకి వస్తుంది. స్కూల్లో గిరికన్యకల పాట పాడినండుకు పాటల పోటీలో ప్రథమ బహుమతి వచ్చిందని చెబుతుంది నర్మద. అమ్మమ్మ అడిగితే ఆ పాటని పాడి వినిపిస్తుంది. ఈ సంవత్సరంతో ఈ స్కూల్లో చదువు అయిపోతుంది కదా, మరి ఆరో తరగతి ఎక్కడ చదవాలి అని నర్మద అడిగితే, ఏదో సర్దిచెప్తుంది అన్నపూర్ణ. అన్నపూర్ణ ఒక్కర్తే వెళ్ళి చలం తల్లిదండ్రులను కలుస్తుంది. సానుకూలంగా ఉండమని, ఏ అవసరం వచ్చినా, తాము సాయం చేస్తామని అంటారు మామగారు. వారిరువురికి ధైర్యం చెప్తుంది అన్నపూర్ణ. కూతురు భవిష్యత్తు కోసం, తల్లితో పాటుగా ఆ ఊరిని వదిలి బొబ్బిలి చేరుకుంటుంది. అక్కడ నర్మదను హైస్కూల్లో చేర్చి ఇరుగుపొరుగువారికి సాయం చేస్తూ సుభద్రమ్మగారి పెన్షన్‌తో కాలం గుట్టుగా గడుపుతారు. తల్లి అమ్మమ్మల పెంపకంతో నర్మద త్వర త్వరగా హైస్కూల్ చదువులు పూర్తి చేస్తుంది. ఇంద్రాణితో స్నేహం గట్టిపడుతుంది. పదో తరగతి పరీక్షలు పూర్తవగానే పోలీసాఫీసర్ అయిన ఇంద్రాణి తండ్రికి బదిలీ అవుతుంది. స్నేహితురాళ్ళిద్దరూ విడిపోవాల్సి వస్తుంది. మనం నేస్తం కడదామని ఇద్దరూ నిర్ణయించుకుని అన్నపూర్ణకి, సుభద్రమ్మకీ చెప్తారు. విడిపోతున్న సమయంలో నేస్తం కట్టడమేమిటని అన్నపూర్ణ అడిగితే, తాము తిరిగి కలుస్తామనీ, తన  బంధం కొనసాగుతుందన్న నమ్మకం ఉందని అంటారిద్దరూ. నర్మద తన సోదరి లాంటిదనీ, ఆమె కోసం తాను చేసే సాయాన్ని కాదనవద్దని ఇంద్రాణి అన్నపూర్ణని కోరుతుంది. ఇక చదవండి.]

అధ్యాయం-10 మూడవ భాగం:

ఇంద్రాణి తండ్రి పోలీస్ ఆఫీసర్. సూచనగా నర్మద తండ్రి గురించి వివరాలన్నీ తెలుసు. అన్యాయంగా నేరం మోపబడి జైల్లో మగ్గుతున్నాడని ఇప్పట్లో వస్తాడనే ఆశ లేదని ఇంట్లో అనుకోవడం విని తండ్రితో తమ స్నేహం గురించి చెప్పింది. అతను చెప్పిన మాటలను ఇప్పుడు అన్నపూర్ణ దగ్గర ధైర్యంగా వల్లె వేసింది.

స్నేహబంధమూ ఎంత మధురము/అది చెదిరిపోదు తరిగిపోదు జీవితాంతము/

పెదవులపై మెరిసిన చిరునవ్వులు/కనులలో విరిసిన జల పుష్పాలు

ఒకరి చేయి ఒకరు పట్టుకొని విడవలేక, చిరునామాలు మార్చుకొని, ఫోటోలు తీసుకుని బయలుదేరారు.

నిజమైన స్నేహలత పువ్వులు పూసి సుగందాలు విరజిమ్ముతూనే ఉంది నేటికీ.

ఇంద్రాణి మిగతా చదువంతా హైదరాబాద్‌లో పూర్తిచేసి లాయర్‌గా ప్రభుత్వ ప్రాక్టీషనర్‌గా నిలిచింది.

నర్మద బాపట్లలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదివి సివిల్స్ పరీక్షలు రాసింది.

ప్రస్తుతం ఇరువురి లక్ష్యము ఒకటే! నర్మద తండ్రి నిర్దోషిత్వాన్ని నిరూపించడం. తీగలాగితే డొంక కదిలినట్లు మైనింగ్ మాఫియాలు, ముఠాలు ఆ అమాయక గిరిజనులపై చేసే దాష్టీకాలు వాళ్లను ఆధునికత వైపు తిప్పే దశరథరామయ్య, చలం లాంటి వాళ్లకు దక్కే బహుమానాలు అజ్ఞాతవాసం, అనంతకాల కారాగారవాసం.

ఎందరి మీద ఎన్ని తప్పుడు కేసులు బనాయించారో? ఎన్ని కుటుంబాలు తమ వారిని కానక ఒంటరి జీవితాలు గడుపుతున్నాయో? ఇంద్రాణి నర్మద ఇద్దరు తమ తమ పరిధిలో నిశ్శబ్ద విప్లవాన్ని రచిస్తున్నారు.

బయటపడిన మరుక్షణం పెద్దలతో తలబడడం ప్రాణాంతకమని తెలుసు. అయినా సరే న్యాయం కోసమేగా తమ చదువులు, అవి అమలు జరగని నాడు వ్యర్థం కదా! కొండలను కొల్లగొట్టడం అంటే అందులోని వృక్షసంపద, జంతుసంపద, పక్షులు, కొలనులు, జలపాతాలు సమస్తము సర్వనాశనమే! అందుకే అమ్మాయిలు ఇద్దరూ పట్టిన పట్టు వీడలేదు. ఇంద్రాణి తండ్రి చక్రవర్తి కూడా ఈ ఇద్దరు అమ్మాయిల ప్రయత్నానికి తనవంతు సహాయం చేశారు.

‘యతో ధర్మస్తతో జయః’

ఎప్పటికైనా న్యాయం గెలిచే తీరుతుంది సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలనే పునాదుల పైన నిలబడినది భారతీయ న్యాయవ్యవస్థ. సత్ప్రవర్తనతోనూ, నేరారూపణ రుజువు కానందున కొందరు ఖైదీలపై పంద్రాగస్టు నాటికి స్వేచ్ఛావాయువులు పీల్చుకునేందుకు ప్రభుత్వం వారిచే విడుదల చేయబడ్డారు. వారిలో చలపతి కూడా ఉన్నాడు.

ఏ గడ్డపై తాను అవమాన భరితుడయ్యాడో అదే గడ్డపై కలెక్టర్ గారి సమక్షంలో విశిష్ట అతిథిగా పాల్గొనడానికి ‘ఉత్తమ రైతు సేవక్’ బిరుదు ప్రధానం జరుగుతుందని ఆనాటి సభకు ముఖ్య అతిథిగా ఇంద్రాణి వేంచేస్తారని డప్పు కొట్టి గిరిజన ప్రాంతాలలో దండోరా వేశారు.

చలపతిని కారులో తీసుకురావడానికి అన్నపూర్ణ, నర్మద వెళ్లారు. అతనికి వైద్య పరీక్షలు చేయించి, మంచి ఖద్దరు దుస్తులు కొని ఇంటికి తీసుకువచ్చారు.  తన కూతురు నర్మద ఇంత పెద్దదైందని ఆశ్చర్యపడ్డాడు. అందుకే పెద్దలు ఒక పద్యం చెప్తారు.

మహాభారతంలో అరణ్యపర్వంలో  ధర్మరాజు తన సోదరులతో ఈ విధంగా అంటారు

‘శతాయుషాం నరాణాం నిత్యం ప్రియా ప్రియే భవతః

తస్మాత్ సర్వేషు కాలేషు న సంతాపమవాప్నుయాత్

शतायुषां नराणां नित्यं प्रियाप्रिये भवतः।

तस्मात् सर्वेषु कालेषु न संतापमवाप्नुयात्॥

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం. వందలు, వేల సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గిన భారతీయులు స్వేచ్ఛను పొంది, స్వతంత్ర పౌరులుగా ఏర్పడిన రోజు. వీధి వీధిలో, వాడవాడలా, ఇళ్లపై, కార్యాలయములపై మువ్వన్నెల జెండా ఎగరడానికి సన్నాహాలు ముందు రోజు నుంచే.

వీధులన్నీ జెండా తోరణాలతో రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. ప్రతి ఒక్కరూ జెండాని ధరించారు. తాము పోగొట్టుకున్న పొలాలు, భూములు ఉన్న తమ పంట పొలాల వద్దకు గిరిజనులు అంతా చేరారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ అందరి మొహాల్లో ఆనందం.

చలం కుటుంబ సమేతంగా ఆ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అతడు బలహీనంగా ఉన్నప్పటికీ సత్యమేవ జయతే!  గెలిచినందుకు పరమానంద భరితుడై ఉన్నాడు. తనతో పాటు పొలాలలో పని చేసిన తన వారందరినీ కలుసుకుంటున్నందుకు ఆనందం.

వృద్ధురాలైన సుభద్రమ్మని కూడా ఈ పండుగ ఆనందాన్ని చూడడానికి తీసుకొని వచ్చారు.

అందరూ బారులు తీరి, ఉన్నారు. పిల్లలంతా కూర్చున్నారు.

ఇంతలో కలెక్టర్ గారు వస్తున్నారు వస్తున్నారు అని సైరన్ మోగింది. కారు వచ్చి ఆగింది.

అందులోంచి దిగుతున్న నర్మదను చూసిన చలం కళ్ళు విభ్రాంతితో రెప్పలార్పడం మరచిపోయాయి.

‘నిజమా! తన కూతురు ఇంత గొప్పదా? ఇది ఏనాటి పుణ్యమో కదా!’

ఇంతలో మరొక కారు వచ్చింది. అందులోంచి ఇంద్రాణి దిగింది. ఇరువురు తమ తమ పదవులను మరచి స్నేహ హస్తాలను చాపారు. అదే సమయానికి బిలబిలలాడుతూ గిరిజన మహిళలు వారిని చుట్టు ముట్టారు.

ఒకేసారి గిరిజన వాద్యాలు ఘోష మిన్నంటాయి.

గిరిపుత్రుల జయజయధ్వానాలు మధ్య చేయి చేయి కలుపుకుంటూ వేదిక వైపు నడిచారు. ఇరువురూ కలిసి పతాకావిష్కరణ చేశారు.

వృద్ధురాలైన సుభద్రమ్మ గారు జాతీయ గీతం పాడడానికి ముందుకు వచ్చారు. మిగిలిన వారంతా ఆమె గొంతుతో శ్రుతి కలిపారు.

వింటున్న కొండలు, కోనలు ప్రతిధ్వనించాయి.

గిరి పుత్రుల ఆనందం నింగినంటింది.

ధరణి మాత తన గిరిపుత్రుల విజయానికి పులకించింది.

(సమాప్తం)

Exit mobile version