Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గిరిపుత్రులు-5

[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘గిరిపుత్రులు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[దశరథరామయ్య అన్నపూర్ణకి తమ ప్రాంతపు చరిత్రను వివరిస్తారు. తండ్రి చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా రాస్తుంది అన్నపూర్ణ. సంస్థానాధీశులు, జమీందారులు పాలన – సాహిత్య పోషణ గురించి అన్నపూర్ణ రాస్తే, ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధిపత్యం, వారి పాలనలో స్థానికుల ఇబ్బందుల గురించి చలం రాస్తాడు. బ్రిటీషు వారికి, స్థానిక రాజులకు జరిగిన పోరాటాలను దశరథరామయ్య చెబుతుండగా, చలం రాస్తాడు. మధ్యలో చలానికి కలిగిన సందేహాలను ఆయన తీరుస్తారు, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, చౌదరి తేజేశ్వరరావు, పాణిగ్రాహి గురించి చెబుతారు. గిరిజనులు, భూస్వాముల మధ్య జరిగిన పోరాటం గురించి వివరిస్తారు. నక్సలైట్ ఉద్యమం ప్రారంభమవటం, పోలీసుల అణచివేత చర్యలు, ఎన్‍కౌంటర్ల గురించి ఆయన చెప్తారు. ఐటిడిఎ, గిరిజన కార్పోరేషన్ వంటివి ఏర్పాటవటంతో గిరిజనుల పరిస్థితులు కాస్త మెరుగయ్యాయని ఆయన అంటారు. అన్నపూర్ణ, చలం మధ్య సాన్నిహిత్యం పెరగటం సుభద్రమ్మ గమనిస్తుంది. వాళ్ళకి పెళ్ళి చేస్తే కలిసి పనిచేసుకుంటారేమో అనుకుంటుంది. చలపతిని తాను నడిపించాలనుకున్నది ముళ్ళబాట అని తెలిసీ తన కూతురితో ఎలా పెళ్ళి చేయడం అనే మీమాంస దశరథరామయ్యది. సరే, మంచి రోజు చూసి అతని పెద్దవాళ్ళతో మాట్లాడదామని అనుకుంటారు. ఆయన చెప్పిన వివరాలతో ఇద్దరూ ఒక్కోటి యాభై పేజీల చొప్పున పుస్తకాలుగా రాస్తే, వాటిని కాపీలు వేయించి, వారపత్రికగా పంచిపెడతారు దశరథరామయ్య. భూస్వాములు, దోపిడీదారులకు వ్యతిరేకంగా గిరిజనుల పోరును సవివరంగా తెలియజేస్తారాయన. ఇక చదవండి.]

అధ్యాయం-6:

న్యం ప్రాంతంలో ఒక చిన్న అలజడి ప్రారంభమైంది. వీరు చేస్తున్న పనులు నచ్చని ఒక వర్గం వీరిని ఎలాగైనా ఆపాలి అనుకుంది. ఎప్పటిలాగే దశరథరామయ్య ఆ రోజు రాసిన కాగితాలు పట్టుకొని మైదాన ప్రాంతంలోని గ్రామం చేరాడు. అక్కడి వారికి కార్బన్ కాపీలు చేయడానికి ఇచ్చేసి తిరిగి వస్తున్నాడు. చీకటి పడకుండా ఇంటికి చేరాలి అని ఉద్దేశంతో చేతి కర్ర సాయంతో గబగబా అడుగులు వేస్తున్నాడు.

సాధారణంగా కొండ ప్రాంతాలలో నిఘా వేసిన పోలీసు వర్గాలకు ఎవరు ఉద్యమకారులో ఎవరు మామూలువారో తెలుస్తుంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళూ, వీళ్ళ పని వీళ్ళూ చేసుకుంటూ వెళ్లిపోతారు. ఒకవేళ ఎదురుపడినా పక్కకి తిరిగి సన్నటి కాలిబాట నుంచి వెళ్ళిపోతారు. అంతేగాని ఘర్షణలకు దిగరు. అందులోనూ దశరథరామయ్యగారు అంటే ఆ చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల వారికి ఎంతో గౌరవాభిమానాలు.

బాటలో తుప్పల మధ్య ఏదో శబ్దం వినిపించింది. అతను ఆగి విన్నాడు. నిశ్శబ్దం. మళ్లీ నడక సాగించాడు. శబ్దం ప్రారంభమైంది. దశరథరామయ్యకు అర్థమైంది. తనను ఎవరో వెంబడిస్తున్నారని.

కను చీకటి పడే వేళ. ఎవరై ఉంటారా? అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి అతని ముఖంపై దట్టమైన తువ్వాలు పడింది. రెండు చేతులు అతని కంఠం చుట్టూ తాడుతో ముడివేసాయి.

దశరథరామయ్య ప్రతిఘటించలేదు. ఎవరై ఉంటారు? అని ఆలోచనలో పడ్డాడు.

తనను బంధించిన వారెవరో తెలియకుండా కళ్ళకు గంతలు కట్టి, స్థావరాలు మారుస్తున్నారు.

కొండలు ఎక్కి దిగటం తెలుస్తోంది. మైదాన ప్రాంతంలో ఉండే గిరిపుత్రులు కారు.

వీరు గిరిజనులకు సహాయం చేసే మిషతో భూస్వాములను దోచి, పేదలకు పంచడం అనే సిధ్ధాంతాన్ని నమ్మినవారు.

దశరథరామయ్యగారు కనిపించకుండా పోయి అప్పుడే రెండు రోజులైంది. సుభద్రమ్మ అన్నపూర్ణ విచార వదనాలతో తిరుగుతున్నారు. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. చలపతి కూడా రెండు రోజులు బట్టి అదే పని మీద ఉన్నాడు. ఎటు నుంచి ఊహకు అందడం లేదు.

సుభద్రమ్మ పెరట్లో మొక్కల కిందా, చెట్ల కిందా ఉన్న ఆకులన్నీ ఏరి కుప్ప పెడుతోంది. చీపురుతో తుడుస్తోంది. మొక్కలకు నీళ్లు పెడుతోంది.

విచారంగా ఉన్నప్పుడు కొందరికి కాళ్లు చేతులు ఆడవు. కానీ సుభద్రమ్మ స్వతహాగా ధైర్యస్థురాలు. అందుకే పనిలోనే తన వేదన మరచిపోయే ప్రయత్నం చేస్తోంది. వాళ్ళ ఇల్లు ముందుకి దడికట్టి పూల మొక్కలు వేశారు.

ఇల్లు చిన్నదే గాని పెరడు చాలా పెద్దది. ప్రహరీగోడ కూడా ఉంది. కొబ్బరిచెట్లు, మామిడిచెట్లు, బాదంచెట్లు, మునగ, సంపెంగ దూరంగా గోడ పక్కన నాగమల్లి చెట్టు కూడా ఉంది. నాగుపాములు వస్తాయని అందరూ భయపడతారు కానీ వీరికి ఏనాడు అవి కనపడలేదు.

మన మనుషులం ఏవిధంగా నాగదేవతకి దండం పెట్టుకుంటామో ‘మా కంట నువ్వు పడకు నీ కంట మేము పడము’ అని, అవి కూడా అలాగే అనుకుంటాయట. ‘నా కంట నరుడు పడకూడదు నరుడి కంట నేను పడకూడద’ని. అలా నెమ్మదిగా నడుస్తున్న సుభద్రమ్మగారికి ఒక రాయి కింద పెట్టిన కాగితం కనిపించింది. భయం భయంగా చుట్టూ చూసింది. ఎవరైనా తనని పరిశీలిస్తున్నారేమోనని నెమ్మదిగా దగ్గరకు వెళ్లి ఆ కాగితం తీసుకుని చీర కొంగులో దాచుకుని పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చింది.

అన్నపూర్ణ ఎక్కడ ఉందా అని చూసింది పశువుల పాకని శుభ్రపరుస్తోంది. పశువులకు దాణా కూడా పెట్టాలి. అప్పుడే రాదు అని నిర్ణయించుకుని గబగబా వంటింట్లోకి వెళ్లి బుడ్డిదీపపు చిరు వెలుగులో ఆ కాగితాన్ని విప్పింది. అది దశరథరామయ్య రాసిన ఉత్తరం అక్షరాలు వంకరటింకరగా ఉన్నాయి. తొందరలో రాసినట్లు ఉన్నారు.

“శుభా! నన్ను ఇక్కడ కొందరు బంధించారు. బాగానే చూస్తున్నారు. కానీ ఇప్పట్లో మనం కలవడం అవ్వకపోవచ్చును. ఇంకొక ముఖ్యవిషయం నాకు వీళ్ళ ద్వారానే తెలిసింది. మన పూర్ణా, చలం కొండమీద అమ్మోరి గుడి దగ్గర చేతిలో చేయి వేసి ప్రమాణాలు చేసుకున్నారట. వారిని విడదీయడం మంచి పని కాదు. అలాగని ఇప్పుడు మనం వీళ్లకు పెళ్లి చేసే పరిస్థితిలో కూడా లేము. కానీ చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. నా గురించి ఏ సమాచారం తెలియనట్లు ఉండు. ఉంటాను. మళ్ళీ ఎప్పుడైనా వీలుంటే రాస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు.” భర్త క్షేమంగా ఉన్నాడన్న వార్త చదవగానే ఆమె మొహంలో వెలుగు వచ్చింది.

సుభద్రమ్మగారి ముందు భవిష్యత్తు ఒక ఛాలెంజ్ విసిరినట్లు అయింది. ఎలా? పరిష్కారం ఏమిటి? వాళ్ళకి పెళ్లి చేయడం ప్రస్తుతం కాని పని. మరి చలం సహాయం తీసుకోకుండా ముందుకు అడుగు వేయలేని బలహీన స్థితి.

సుభద్రమ్మకి భర్త వేసే ప్రతి అడుగు పరిచయమే! గిరిజనులను వారి ప్రాంతాల నుండి అంటే ఝడి వలస కూలీల పేరుతో తరలించాలని కొందరు చేసే ప్రయత్నాలు ఆమెకు తెలుసు. కొండలు అంటే ఖనిజాల గనులని ఎరిగిన బడా వ్యాపారస్థులు ఆ గనులను సొంతం చేసుకోవాలంటే స్థానికులను తరలించక తప్పదని నోట్లకట్టలు విరజిమ్మి ప్రభుత్వ ఉత్తర్వులు తెచ్చుకుందికి ప్రయత్నించారు.

ఆ సమయంలో దశరథరామయ్య కొండ ప్రాంతాల ప్రజల పక్షాన నిలబడ్డారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే గిరిజనులు ఏక మాటగా నిలబడ్డారు.

“అడవితో పాటే ఇక్కడే పుట్టాము. వాటితోనే అంతరించిపోతాము. మమ్ములను ఇక్కడి నుంచి ఎక్కడికి తరలించవద్దు. ఒకవేళ బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే మా ప్రాణాలైనా తీసుకుంటాం కానీ ఈ కొండలను ఈ లోయలను వదిలి వెళ్ళేది లేదు.” అని నిక్కచ్చిగా చెప్పారు ఆ గిరిజనులు.

కొండలమీద అక్కడక్కడ విసిరేసినట్టున్న తండాల ప్రజలు ఏకీకృతమయ్యారు. కానీ వారి గోడు వినిపించుకునేవారుగాని వారి భాష అర్థం చేసుకునేవారు గానీ లేరు. వచ్చిన ప్రతి ఒక్కరితో ఆంగికాభినయంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

వీరి పక్షాన దశరథరామయ్యగారు ప్రభుత్వ ప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను కలిసి వారి గోడు వినిపించడం వలన వారందరి మద్దతు గిరిజనులకు లభించింది. కొండల తవ్వకం పర్యావరణ కాలుష్యానికి దారితీస్తుంది. అడవిని నమ్ముకున్న ప్రాణికోటి అనేక అటవీజంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని అనేక వ్యాసాలు రాసి రోజువారి అన్ని చోట్లకు పంపించేవారు.

తాము ఒక కొండను నిర్మించలేమని తెలిసీ ఈ అధికారులకు గనుల పేరుతో కొండలను నేలమట్టం చేసే అధికారం ఎవరిచ్చారు? ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన సహజ అడవులను నిర్మూలించి రేపటి భవితకు సమాధి కడతారా? గిరిజనుల హృదయఘోషను పలికించే స్వరం దశరథరామయ్యది. మొత్తానికి గిరిజనులే గెలిచారు. ఆ ఉత్తర్వులు రద్దు చేయబడ్డాయి.

కళ్ళముందు నిన్న మొన్న జరిగినట్టు ఉన్నాయి. అందుకే వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని, వారి జీవనాన్ని మొత్తం గ్రంథస్థం చేయాలన్న దశరథరామయ్యగారి ఆకాంక్షకు అవరోధం ఏర్పడింది. ఇప్పుడు దశరథరామయ్య క్షేమంగా ఉన్నాడని తెలిసినప్పటికీ ముందు ముందు ఏం జరుగుతుందన్నది ప్రశ్నార్థకం!

అధ్యాయం-7:

ఈ ఛాలెంజ్‌ని ఎలా ఎదుర్కోవాలా? అని పరి పరి విధాల ఆలోచించిన సుభద్రమ్మకు ఒకటి స్ఫురించింది. ఎందుకంటే సమస్య ఎక్కడుందో పరిష్కారం అక్కడే ఉంటుంది.

ఆరోజు సాయంత్రం చలం, అన్నపూర్ణ కొండమీదకి వెళ్లి గంగ దేవత అమ్మవారి దర్శనం చేసుకున్నారు. నేరేడు చెట్టు కింద చిన్న గుహలో గంగ దేవత నివాసము. పండగ రోజులలో ‘జన్ని’ ద్వారా బలి ఇచ్చిన తర్వాతే తలుపులు తెరవబడతాయి. మూడు ఇనుప ముక్కలుగా గంగాదేవతను పూజిస్తారు. వేపపువ్వు, పెద్దమ్మవారు మొదలగు అంటువ్యాధులు రాకుండా అమ్మవారి ప్రతిరూపంగా మూడు ఇనుప ముక్కలను కత్తి ఆకారంలో పూజిస్తారు. జన్ని ఆ ఇనపముక్కలను ఒక గంపలో ఉంచి నువ్వుల నూనె లేదా ఆముదం నూనె దీపం వెలిగిస్తారు. పూజారి ఆ గంపను మూపుపై పెట్టుకుని ముందుగా గ్రామపెద్ద ముఖియా ఇంటికి వెళతాడు. అతని భార్య స్నానం చేసి దేవునిపై తిలలు జల్లి, దీపం ప్రమిదలో వెలిగించి, దేవుని పూజిస్తారు. తర్వాత ఆ దేవతను బారిక వారి ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ కూడా ఇదే విధంగా బారిక భార్య పూజిస్తుంది. తర్వాత జన్ని ఆ దేవతను తన ఇంటికి తీసుకెళ్తాడు. తర్వాత రోజు జన్ని గ్రామంలోని ఇంటింటికి దేవతని ప్రమిద రూపంలో తిప్పుతాడు. మూడవరోజు గ్రామంలోని యువకులందరూ దేవత చుట్టూ నృత్యం చేస్తూ దేవతను పూర్వస్థానంలో ఉంచుతారు. జన్ని గొర్రెను బలి ఇస్తారు. గొర్రెను కొనడానికి అయ్యే ఖర్చును గ్రామంలోని కొండజాతి వారందరూ భరిస్తారు. అలాగే ఆ మాంసం కూడా సమానంగా పంచుతారు.

గ్రామంలోని యువతీ యువకులంతా తమ ఆనందాన్ని, సంతోషాన్ని థింసా నృత్యం చేస్తూ వ్యక్తపరుస్తారు. ఈ కార్యక్రమం అవుతున్నంతసేపూ వారి వాయిద్యాలయిన జోడు బూరలు, తుడుము, పాముబూర, కొమ్ము బూర, ఏక్తార, కిరిడి, సన్నాయి, డప్పు బాకా, పిన్నల గర్ర అనే సంగీత వాయిద్యాలు మోగుతూనే ఉంటాయి. ప్రతి కుటుంబం పూజారికి సామ, చోడి కొద్ది మొత్తంలో ఇస్తారు. అతనికి సంవత్సరమంతా అదే ఆధారం.

కోరిన కోర్కెలు తీర్చే గంగ దేవత సన్నిధిలో నేస్తం కట్టిన చలం, అన్నపూర్ణ తమను ఒకటిగా చేయమని ఆమెకు దండం పెట్టుకొని తిరిగి వస్తూ ఆ ఊరిలోని సామాజిక సమస్యలను గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ముందుగా అన్నపూర్ణ తను తండ్రి ద్వారా తెలుసుకున్న విషయాలను చలంకి చెప్పడం మొదలు పెట్టింది.

“కొండప్రాంతాలలోనూ, లోయలలోను నివసించే ప్రజలు మన భారత జాతిలో ఒక భాగం. వీరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయవలసిన అవసరం మనది. ముస్లింలు భారతదేశం మీద దండయాత్ర జరిపినప్పుడు సామాన్యప్రజలు చాలామంది వాళ్లతో పోరాడలేక అడవుల్లోకి పారిపోయారు. కొందరు ధైర్యం చేసి తమ తమ గ్రామాల్లోనే జీవించసాగారు. ముస్లింలు వాళ్లను తమకు బానిసలుగా చేసుకున్నారు. అందువలన మన జీవితాలు బానిస జీవితాలు అయినాయి.

ముస్లింల తర్వాత వచ్చిన ఆంగ్లేయులు కూడా హిందూ సమాజాన్ని విడగొట్టాలి అనే కుట్రతో అడవుల్లోకి పారిపోయిన వారిని షెడ్యూల్డ్ ట్రైబ్‌లని, ఆదివాసులని, ఎనిమిష్టులని రకరకాల పేర్లు పెట్టారు. ఆ విధంగా వారు భారతదేశంలోని మిగిలిన వారి కంటే భిన్నము అని వారికే అనిపించేటట్లుగా తయారు చేశారు.

జనాభా గణనలో కూడా వారిని ట్రైబల్స్ గానే పేర్కొన్నారు. నిజానికి ఇవాళ అందరూ కూడా హిందువులే. మన భారతీయులే. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా వీళ్లు ఎందుకు ఇలా భయం భయంగా బ్రతకాలి? ఎందుకు వీళ్లకు విద్యా, వైద్యం అన్నీ అందుబాటులో లేకపోవాలి?” ఆవేశంగా ప్రశ్నిస్తున్న అన్నపూర్ణని చూస్తూ చిరునవ్వు నవ్వాడు చలం.

“ఒక్కటే కారణం పూర్ణా! ‘విభజించి పాలించు’ అన్న సూత్రం బ్రిటిష్ వారు మొదలుపెట్టి భారతదేశం మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా మనలోని స్వార్ధపరులు రాజకీయ అధికారాన్ని చేతుల్లోకి తీసుకొని అదే సూత్రాన్ని ఇవాల్టి వరకు అమలు చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కక్కుర్తితో అధిక సంఖ్యాక వర్గం, అల్పసంఖ్యాక వర్గం అనే పదాల్ని తీసుకొచ్చి మన జాతినీ, జాతి సమైక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారు.

వాస్తవానికి ఆదివాసీలు ఎవరో తెలుసా? మన దేశరక్షణలో పాల్గొన్న క్షత్రియులు. గోండు తెగకు చెందిన ఎందరో ఆదివాసీలు దేశరక్షణకు ప్రాణాలు అర్పించి పోరాడారు. చరిత్ర ప్రసిద్ధిపొందిన రాణి దుర్గావతి గోండు తెగకు చెందినవారే! ‘నాగ’ తెగకు చెందిన ఆదివాసీలు కూడా చరిత్ర ప్రసిద్ధులే. ఖొటియా తెగకు చెందిన గిరిజనులు ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, విశాఖపట్నంజిల్లా అడవుల్లో నివసిస్తారు. వీరు మళ్ళీ నాలుగు వర్గాలుగా విభజించబడ్డారు. బోడోలు, సానోలు, పుటియాలు, ధులియాలు. కొన్ని ప్రాంతాలలో వీరిని ‘దొరలు’ అని కూడా పిలుస్తారు. వీరే కొండదొరలు.

కొండలలో కోనలలో ప్రకృతి ఒడిలో నిర్మలమైన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్న ఆదివాసీలు సుమారు 10 కోట్లు పైగా ఉన్నారు. వీరు తెగలను బట్టి బృందాలుగా నివసిస్తారు. తెగకు పెద్దగా ‘నాయక్’ అనేవాడు తెగకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నిర్ణయాలు, తీర్పులు చెప్పే అధికారాన్ని కలిగి ఉంటాడు.

వీరి దేవతలను పెద్దదేముడు, నందిదేముడు, శంకుదేముడు, గంగా దేవత మొదలైన పేర్లతో పూజిస్తారు. అంటువ్యాధులు రాకుండా, పంటలు బాగా పండడానికి అందరూ సుభిక్షంగా ఉండడానికి ఉత్సవాలు, జాతరలు జరుపుతారు. వీరు పంటలు కోతలు కోసేటప్పుడు ఆ పంట పేరుతో ‘కందికోత పండుగ’ అలాంటివి జరుపుతారు.

వీరికి వ్యవసాయం జీవనాధారం కనుక మైదాన భూమి లభించకపోవడం వలన కొండలలో పోడు వ్యవసాయం చేస్తారు. ఇంటి వెనకాతల వివిధ రకాల కూరగాయలను పండిస్తారు. అవి మొదటిసారిగా వండుకొని తినేటప్పుడు ‘సాగునోవా’ అంటూ ఒక పండుగను జరుపుకుంటారు.

భారతదేశమంతటా కూడా ఆధునిక విద్యా వైద్య సదుపాయాలు వచ్చినా గిరిజన ప్రాంతాల్లో మార్పు రావటం లేదు. అందులో ముఖ్యంగా పౌష్టికాహార లోపం వలన మహిళలలో చిన్నారులలో రక్తహీనత, వ్యాధినిరోధక శక్తి లేకపోవడం వీరి ఆహారంలో అవసరమైన మాంసకృత్తులు, కాల్షియం, విటమిన్లు తక్కువగా ఉండడం తాము పండించే పంటలను తాము తినకుండా, పిల్లలకు పెట్టకుండా సంతలలో అమ్మేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందువలన చిన్నపాటి జ్వరాలు కూడా వారికి ప్రాణాపాయాన్ని కలుగజేస్తున్నాయి. ఇవే కాకుండా పాముకాట్లు, కొండతేళ్లు మొదలైనవి కుట్టడం వీటికి సరియైన మందులు అందుబాటులో లేకపోవడం వలన ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

అవగాహన కల్పించడం చాలా ముఖ్యము. రహదారులు కూడా లేవు. వీరి భాష ఇతరులకు అర్థం కాదు. విద్య కూడా ఇదే పరిస్థితిలో ఉంది. వీరి ప్రాంతాలకు ఉపాధ్యాయులు రావడానికి రహదారులు లేవు. కొండలు ఎక్కి రావాలి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొండలలో వర్షం పడడం వలన జలాశయాలు ఏర్పడి, అవి దాటే మార్గం లేక ఉపాధ్యాయులు ఇంటికి వెళ్ళటానికి ఇబ్బందులు పడతారు. అదే విధంగా గిరిజన బాలబాలికలు మైదాన ప్రాంతాలలో పాఠశాలలకు వెళ్లి చదువుకోవడానికి కూడా ఇదే రకమైన పరిస్థితి. అందువలన వీరికి విద్య కూడా అందని పండే!” అన్నపూర్ణ రెప్పలార్పకుండా వింటూనే ఉంది.

“నాన్నగారు కూడా ఇవన్నీ చెప్పేవారు. కానీ అతని దగ్గర ఈ సమస్యకు పరిష్కారం లేకపోయింది. అందువలన మన గురించి బయట ప్రపంచానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ విషయాలన్నింటినీ గ్రంథస్థం చేయాలి అని అనుకున్నారు.”

“బయటి ప్రపంచానికి తెలిసినా చేయగలిగేది ఏమీ ఉంటుందని అనుకోను. మార్పు ఇక్కడినుండే రావాలి. అందుకు మనం మనకున్న అవగాహనతో ఈ సమస్యలను కొన్నైనా పరిష్కరించడానికి పూనుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఏమంటావు?”

ఆమె అవగాహనశక్తికి అబ్బురపడుతూ “అయితే మనం ఏం చేద్దాం అంటావు?” అని అడిగాడు.

“నువ్వే చెప్పావు కదా! వీరికి అవగాహన లేదని. ఆ అవగాహనను మనమే కల్పించుదాం. అందుకోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. వీరికి చదువు లేకపోవడం వలన సంతలో తమ వస్తువులకు సరైన ధర లేక మోసపోతున్నారు. అందువలన మనం కొంతమందిని వారికి నమ్మకం ఉన్నవారికి శిక్షణ ఇచ్చి మెరుగైన గిరి పుత్రుడుగా చేద్దాం.

రెండవది వీరికి గల అపూర్వ సంపద ఈ కొండలలో ఉన్న ఔషధ మొక్కలు. ఆ మొక్కల గురించి వారికి పూర్తి అవగాహన లేకపోవడం. అవగాహన ఉండి వైద్యం చేస్తున్న వారిని కూడా నాటు వైద్యం పేరుతో కొట్టి పారేయడం. వీరిలాగే వీరి విలువైన ఔషధ మొక్కలు కూడా మట్టిలో కలిసిపోతున్నాయి. వాటి విలువను వారికి తెలియచెప్పాలి.

అలాగే ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, ప్రతి ఔషధమొక్కను ఫోటోలు తీసి, వాటి గురించి వివరంగా రాసి, వాటికి పేటెంట్ హక్కులను పొందేమార్గాన్ని వారికి తెలియజేయడం. ఉదాహరణకు ‘అగ్నిముఖి’ విత్తనాల నుంచి వచ్చిన రసం కీళ్లనొప్పులు, కీళ్లవాపులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. చలి ప్రదేశాలలో చాలామందికి ఈ వ్యాధి వస్తుంది. అందువలన అంతటి విలువైన అగ్నిముఖి ఔషధ పంటను పండింప చేసి, దాని యొక్క ఫలితాన్ని విశ్వవ్యాప్తంగా అందరికీ అందించడం అనేది ఈ గిరిజనులందరిని సంపన్నులను చేస్తుంది అనడంలో సందేహం లేదు కదా!

వీరికి ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్పించడం ద్వారా ఆదాయాన్ని పొందే మార్గాలను వారికి తెలియచేయాలి. ఈ కార్యక్రమాన్ని మనము చిన్నచిన్న అడుగులతో ప్రారంభించినా మనలాంటి భావాలుగల కొందరు గిరిపుత్రులను మనము సహాయంగా తీసుకొని అభివృద్ధివైపు తొందరగా అడుగులు వేయగలము. అని నాకు అనిపిస్తోంది.

ముఖ్యంగా వీరికి, వీరి పిల్లలకు చదువు నేర్పడానికి అమ్మ వారిని ప్రేమతో చేరదీసి చదువు చెప్పగలదని భావిస్తున్నాను. ఈ విషయంలో మనం అమ్మ సలహాలు తీసుకోవడం కూడా మంచిదని నాకు అనిపిస్తుంది.”

ఆమె మాటలని అబ్బురంగా వింటున్న చలం వామనగుంటలు ఆడుతూ తనతో ఆటలో ఓడిపోయే అన్నపూర్ణ ఇంత వివేకంతో ఆలోచించగలదని ఊహించని చలం ఆశ్చర్యపోతూ “తప్పకుండా ఇప్పుడే మనమిద్దరం వెళ్లి అమ్మ దగ్గర ఆశీస్సులు తీసుకుని, ఆమె యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుని ముందుకు వెళదాం.” అంటూ లేచి, ఆమెకు చేయి అందించాడు.

(సశేషం)

Exit mobile version