Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గిరిపుత్రులు-7

[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘గిరిపుత్రులు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తన దగ్గరకి వచ్చి ఆశీస్సులు కోరుతున్న అన్నపూర్ణ, చలాన్ని మార్చి మార్చి చూస్తుంది సుభద్రమ్మ. వాళ్ళిద్దరూ కలిసి దశరథరామయ్య ఆశయాల కోసం కృషి చేయడం మంచిదే అయినా, ఏ బంధం లేకుండా ప్రస్తుత పరిస్థితులు వారిరువురూ కలిసి తిరగడం మంచిది కాదని అంటుంది. పూర్ణ ఏదో చెప్పబోతుంటే ఆపి – వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం తనకీ, దశరథరామయ్యకీ తెలుసనని, చలం తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వివాహం చేసుకోమని చెబుతుంది. సరేనంటాడు చలం. ఇద్దరూ కలిసి చలం ఇంటికి వెళ్ళి అమ్మానాన్నల అనుమతి పొందుతారు. అయినా ఇతర కుటుంబ సభ్యులకి తెలియకుండా చెప్పకుండా పెళ్ళేంటి అంటే, తామిద్దరం గంగదేవత సాక్షిగా ప్రమాణాలు చేసుకున్నామని, జన్ని తమ మెడలో అమ్మవారి దండలు కూడా వేశాడనీ, మళ్ళీ వేరే పెళ్లి తతంగం అవసరం లేదని అంటాడు చలం. తల్లిదండ్రుల దగ్గర ఓ వారం రోజులుండి, అన్నపూర్ణతో బయలుదేరుతాడు చలం. కొండల దగ్గర తమకున్న ఒక ఎకరం బీడు భూమిని చలం పేరి మీద రాసిన పత్రాలను కొడుక్కిస్తాడు తండ్రి. తాము ఎంచుకున్న క్షేత్రానికి వెళ్ళి అక్కడ దాంపత్య జీవితం మొదలుపెడతారు పూర్ణ, చలం. గిరిజనులు వారికి సాంప్రదాయక నృత్యాలతో స్వాగతం పలుకుతారు. ఇక చదవండి.]

అధ్యాయం-9:

లం, అన్నపూర్ణ ఇరువైపులా పెద్దల అనుమతితో కొత్త సంసారాన్ని ప్రారంభించారు. మానసికంగా వారిరువురూ ‘ఒకరి కోసం ఒకరు’ అని గంగమ్మ తల్లి నిర్ణయం చేసింది. జన్ని రూపంలో ఆశీస్సులు కూడా అందించింది.

అనుకోని సంఘటన!

దశరథరామయ్యగారి నుండి మరల ఏ సందేశం రాలేదు. ఇంటి పెద్ద ఇంట్లో లేకపోవడం అందరికీ వేదనగానే ఉంది. పోలీసులనూ, ఇన్ఫార్మర్లను అడిగినా తెలియలేదు. దశరథరామయ్యకు ‘లైఫ్ థ్రెట్’ ఉందనే పేరుతో వారు స్థావరాలను మార్చుతూ పోయారు. వాళ్లకు కావలసింది ఈయన లాగా వాస్తవాలు చెప్పి, అన్యాయాలను విడమరిచి, వారికి అనుకూలమైన రాతలూ, పాటలూ రాసే వ్యక్తి. అతనికున్న పాండిత్యమే అతడిని కుటుంబానికి దూరం చేసింది.

రాసి రాసి అలసిపోయాడు. అతని మెదడు పనిచేయడం లేదు. చేతులు మొద్దు బారిపోయాయి. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీనమైన స్వరంతో “నన్ను నా కుటుంబానికి చేర్చండి.” అడుగుతున్న అతని మాటలు వినిపించుకోలేదు వారు. జవసత్వాలు ఉడిగిపోయిన దశరథరామయ్యగారు చాలా క్రోధం, ఉక్రోషం, ఆవేదన వ్యక్తపరుస్తూ వారిని దూషించడం మొదలుపెట్టారు.

“మీకు మంచి చేయాలనుకున్న వారిని మీరు రక్షించుకోలేరా? మీ కొండలనూ మీరు రక్షించుకోలేరు. మిమ్మల్నీ మీరు రక్షించుకోలేరు. ఎప్పటికీ బాగుపడతారో? నేను చూడగలనో లేనో?” అంటూ ఆవేదన వ్యక్తపరిచేవారు ఒకోసారి.

క్రమేపీ ఆ మాట కూడా స్పష్టత పోయింది. కళ్ళతోనే దీనంగా చూడసాగాడు. తీసుకొచ్చినప్పుడైతే ఆరోగ్యవంతుడు కనుక తెచ్చేసారు. కానీ చాలా దూరం తీసుకువచ్చాక తిరిగి ఇంటికి చేర్చడం కష్టమని తెలుసు.

కానీ ఇల్లు చేర్చకపోతే అతని ప్రాణం ఇక్కడే పోతే గురు ద్రోహం చేసిన దానికి పాపపుణ్యాలను వారు ఎరుగుదురు. అందుకే అతడిని పడుకోపెట్టి తేవడం కష్టం గనుక ఒక పెట్టెలో కూర్చోపెట్టి చుట్టూ కన్నాలు పెట్టి ఒక అర్ధరాత్రి తీసుకువచ్చి అతని ఇంటి ముందు పడుకోపెట్టి వెళ్ళిపోయారు.

తెల్లవారుజామున లేచిన సుభద్రమ్మ వీధి అరుగు మీద పడుకొని ఉన్న భర్తను చూసి గట్టిగా కేక పెట్టింది.

క్షణాల్లో ఊరంతా మూగింది. సరైన వైద్య సదుపాయం లేని ఆ ఊరి నుండి అతడిని పట్నానికి తరలించారు. వెంట ఊరంతా కదిలింది.

ఆసుపత్రిలో అందరికీ జాగా లేక రోడ్డు ప్రక్క, చెట్ల కింద, దగ్గరలో గల ఆలయ మండపం మీద కూర్చుని ఉన్నారందరూ.

డాక్టర్లు తమ ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చాలా మామూలు ఆసుపత్రి ఐసీయూలు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేవచట. దశరథరామయ్యకు తెలివి వచ్చింది. అనగానే అందరూ చేరారు.

కళ్ళు తెరవగానే పక్కపక్కనే నిలబడ్డ అన్నపూర్ణ చలం కనబడ్డారు. అతని చూపు వారిపై పడగానే చిన్న చిరునవ్వు మెరిసింది. బయట నుంచి గోల అధికమైంది. తనను చూడాలని ఆ గిరిజనుల ఆరాటం కళ్ళతోనే వారి బాధ్యతని ఆ ఇరువురికి అప్పగించేశారు.

పాదాల దగ్గర ఉన్న సుభద్రమ్మ దాకా దృష్టి సారించనే లేదు.

భూమిపై అతను వచ్చిన పనులు పూర్తి చేయకుండానే ప్రయాణం ముగిసింది. ఇలాంటి మహనీయులను ఎందరిని చూసిందో ఈ పుడమి తల్లి. అయినా వారి జీవన విధానంలో మార్పు రాదు.

కాలచక్రమనే గడియారంలో గంటల ముల్లు లాంటిది ఆ మార్పు. అంతేకాదు ఒకప్పుడు ఒక సెకను యుగంలా గడిస్తే ఒకప్పుడు ఒక యుగమే సెకనులా గడుస్తుంది.

దశరథరామయ్య గారి కోరిక మేరకు ఆ గిరిజనులకు వారి జీవితం పట్లా, అన్యాయాలకు గురి అవుతున్న వారి అవిద్య పట్లా అవగాహన కల్పించి ముందుకు నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు ఆ నవజంట.

కొండవాలు ప్రాంతం, లోయ ప్రాంతం క్షుణ్ణంగా పరిశీలించారు. తమకు బహుమతిగా అందించిన ఎకరం పొలం ఉన్న స్థలం కూడా పరిశీలించారు. అది పెద్దగా సారవంతమైనది కాకపోయినా వాళ్లు అన్నిటికీ సిద్ధపడే ప్రణాళికలు వేసుకుంటున్నారు.

ఏ ఏ భూమిని ఎవరెవరు సాగు చేస్తున్నారు? ఏ ఏ పంటలు పండిస్తున్నారు? దిగుబడి ఎంత? ఏ విధంగా మెరుగుపరచవచ్చు? అని తండా నాయకులతో కూడా కలిపి ఒక జట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ‘ఖచ్చితమైన ప్రణాళిక ఉంటే సగం పని పూర్తయినట్లే!’ అని పెద్దలు చెప్పిన రీతిలో గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేశారు.

ముందుగా తాము చేయబోయే నూతన వ్యవసాయ పద్ధతులను చేపట్టడానికి అంగీకరించిన రెండు వేల మంది రైతులతో ఒక సంఘాన్ని ‘గిరి పుత్రుల జట్టు’ పేరుతో ఏర్పాటు చేశారు. కొండవాలు ప్రాంతాలన్నింటిలో కాఫీ పంటలు వేశారు. ఎందుకంటే ఈ పంటకి నీరు కావాలి. మొక్కకి నీరు నిలువ ఉండకూడదు. అందుకని కొండవాలు ప్రాంతం అనువైనది. అదే విధంగా సేంద్రియ ఎరువులు తప్ప రసాయనక ఎరువులు వాడకూడదు అని ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టుకున్నారు.

చలం గిరిజనులతోనూ అన్నపూర్ణ మహిళలతోనూ మాట్లాడి “ఒక మూడు పంటల వరకు మనము చూద్దాం. అంతవరకు మీరు మా మాటని నమ్మండి” అని చెప్పేసరికి చదువుకున్న వాళ్ళు, కొత్తగా పెళ్లయిన నవజంట తమతో పాటు పొలం పని చేయడానికి సిద్ధపడటం వారికి అపురూపంగా అనిపించింది.

నమ్మకం అనేది బలమైన పునాది సహనం అనేది పటిష్టమైన కట్టడం.ఈ రెండు కూడితే ఎటువంటి కార్యము అయిన విజయవంతం అయ్యే తీరుతుంది.

పొలాలలో పంటలతో పాటు అన్నపూర్ణ కడుపుపంట కూడా పండింది. గిరి పుత్రికలు, తల్లి సుభద్రమ్మ, భర్త చలం అందరి ప్రేమానురాగాల మధ్య బిడ్డని మోస్తున్నట్లు, భారమే ఎరుగనట్లు నవ మాసాలు నిండి, పండంటి శిశువుని ప్రసవించింది అన్నపూర్ణ.

పుట్టిన వెంటనే అంత అందమైన ముఖకవళికలు, శారీరిక ఆకృతి కలిగిన వారు అరుదుగా ఉంటారు.

అన్నపూర్ణా, చలంల ఆనందానికి హద్దులు లేవు. తమ కలల పంట అందమైన పాప రూపంలో చేతులలో చూసుకుంటూ ఉంటే ఇది కలా? నిజమా? అనిపిస్తోంది.

చూసేందుకు సున్నితంగా, చురుకైన కళ్ళతో మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందమైన పాపని చూస్తూ, “అను మన పాప మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మన వ్యవసాయానికి అవసరమైనది నీరు. మన వివాహానికి ఆశీస్సులు అందించినది గంగమ్మ తల్లి. సృష్టిలోని సకల కల్మషాలను తొలగించి పవిత్రులను చేసే ఆ నదీమ తల్లి పేరు తప్ప మురిపెంగా పిలుచుకునేందుకు వేరే పేరేముంది? ‘నర్మద’ అనే పేరు మన పాపకు పెడదాం.” అన్నాడు చలపతి.

“అవునా! నర్మదా అంటే అర్థం ఏమిటి?”

“నర్మద శక్తికి పర్యాయపదం. అత్యంత శక్తివంతురాలు అని అర్థం. అయినా తన వ్యక్తిత్వంతో అందరినీ కలుపుకుంటూ సమతుల్యంగా ఉంటుంది. ఎంత వరదలు వచ్చినా ఇరు గట్లు ఒరుసుకుంటూ అందంగా ప్రవహించడమే తప్ప తను చాలా శక్తివంతురాలినని ముంచి వేయని స్వభావం కలిగిన, మన ఆశయాలకు దగ్గరగా ఉన్న నర్మద పేరు ఎంతో చక్కగా నప్పుతుంది. సరి అయిన విద్య నేర్పిస్తే పాప భవిష్యత్తు ఇంకా ఉన్నతంగా ఉంటుంది.”అన్నాడు చలపతి.

వీరు చేసే కార్యక్రమాలతో నష్టపోయేవారు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమంది.

రసాయనక ఎరువులను రైతులకు పంపిణీ చేసే సంస్థలకు ఏజెంట్లు ద్వారా పని అయిపోయేదానికి యజమానులు వచ్చి ప్రలోభాలు పెట్టినా జట్టు సభ్యులు లొంగలేదు.

కొందరు రైతుల చేత ఆవాలు, బార్లీ, గోధుమ వంటి పంటలు వేయించారు. కొన్ని రకాల భూములలో బొప్పాయి, అరటి, మిరియాలు, కొత్తిమీర వంటి పంటలు వేశారు.

ఆ కొండలలో చలంకి గల పరిమిత జ్ఞానంతో స్ట్రాబెర్రీ తన పొలంలో ముందుగా వేశాడు. ఆ పేరే ఎప్పుడూ వినని రైతులు ఆశ్చర్యంగా చూశారు.

చల్లని ఆ ప్రదేశాలలో చూస్తూ ఉండగానే పంట చేతికొచ్చి గులాబీ రంగు స్ట్రాబెర్రీలు వనమంతా విస్తరించాయి. వీటికి కావలసిన మదుపులు కూడా తక్కువేమీ కాదు.

మైదాన ప్రాంతాలైన నగరాలలో లాగా బంగారం, వెండి ఆభరణాలు గిరిజనుల దగ్గర ఉండవు. అవి ఒక అవసరానికి ఉపయోగపడతాయనే తెలియని అమాయకులు ఆ కొండజాతి ప్రజలు. ‘అదనుకి బంగారం ఆలికి సింగారం’ అంటూ తులాల లెక్కన, కేజీలు లెక్కన కొని దాచుకోవడం ఎరుగరు వారు. అందుకే ప్రతి పంట వేసినప్పుడు కొంత ఒత్తిడికి గురవుతారు. చలం మీద నమ్మకంతో వ్యయం తగ్గిస్తే ఆ మేరకు మనకు డబ్బు మిగిలినట్లే! ఆదాయం కిందే లెక్క, అంటూ ‘అదును చూసి పంట వేయి ఒడుపు చూసి కోతకోయి.’

మొదటి సంవత్సరం విరగ కాసిన స్ట్రాబెర్రీ కోత సమయానికి వచ్చేసరికి చాలా తక్కువ దిగుబడి వచ్చింది. కారణం అందరూ ఈ కొత్త పంటని పింకు గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆ పండ్లను రుచి చూడాలని ఆరాటపడిన వారే! గుత్తులు గుత్తులుగా కోసుకొని అందరూ రుచి చూసేసరికి తగ్గిపోయాయి.

అయితేనేం! చలం సామర్థ్యం మీద అందరికీ నమ్మకం ఏర్పడింది. ఈ పంట భూమిని వచ్చే సంవత్సరం 10 ఎకరాలకు విస్తరించాలని అనుకున్నారు. మారుమూల కొండవాలు క్రింద పండించే ఈ కొత్త రైతు ఎవరో? అని అందరికీ ఆశ్చర్యమే! రాత్రి పగలు చలంకి ఆలోచనలే! తక్కువ జాగాలో ఎక్కువ పండించడం ఎలా? వ్యయం తగ్గించడం ఎలా? వ్యవసాయాధికారులకు ఇవన్నీ తెలియజేయడం ఎలా? పేటెంట్ హక్కులు పొందాలంటే ఎవరిని కలవాలి? అని ఆలోచిస్తూ ఉండేవాడు.

నేల బలంగా ఉంచడానికి పోకచెట్లను నాటి, వాటికి మిరియం తీగలను లతలుగా అల్లించారు. తమిళనాడు, కేరళ వెళ్లి మంచి విత్తనాలు తెచ్చాడు. ఇక్కడ విత్తనాలు ఒక్కో గుత్తికి 60 నుండి 70 మిరియాలు కాస్తే, మేలైన విత్తనాలు వేసినపుడు 900 నుండి ఒక 1000 దాకా కాస్తాయి. కొండలలో హరిత విప్లవం ప్రారంభమైంది.

గిరిజన రైతుల పిల్లలను చూసుకోవడానికి చిన్న శిశువాటికా కేంద్రం ప్రారంభించి సుభద్రమ్మగారు వారిని చూసుకునేది. అందువలన ఆ సంవత్సరం భారీ ఎత్తులో నూతన పంటలను వేసారు. ఆడ, మగ పొలాలకు పరుగులు తీసేవారు. అందరిలో కొత్త ఉత్సాహం వెల్లువెత్తుతోంది.

(సశేషం)

Exit mobile version