Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాల పందిరి-184

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

నోటి పరిశుభ్రత – ఆరోగ్యానికి భద్రత

కప్పుడు అంటే వైద్యరంగం ఇంతగా విస్తరించడానికి ముందు, జిల్లా స్థాయి ఆసుపత్రులను పక్కన పెడితే తాలూకా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వ్యాధులకు ఒకే వైద్యుడు ఉండేవారు. ఎలాంటి సమస్యనైనా వారు పరిష్కరించేవారు. వారి పరిధి దాటిన పక్షంలో, జిల్లా స్థాయి ఆసుపత్రులకు, లేదా రాష్ట్ర స్థాయి ఆసుపత్రులకు పంపేవారు. అప్పటికి వైద్యంలో ఇన్ని విభాగాలు లేవు. అందువల్ల ప్రతి అంగాన్ని, అంగ విభాగాన్నీ ప్రత్యేకంగా చూసే అవకాశమూ వెసులుబాటు ఉండేది కాదు. అదుగో అలాంటి జాబితాలో నోరు కూడా వుంది. వ్యాధి నిర్ధారణలో వైద్యులు నాలుక చూపించమన్నప్పుడు తప్ప నోరు తెరిచి చూచే అవకాశమూ, ఏమైనా సమస్యలున్నా పట్టించుకోని పరిస్థితి ఉండేది. ఇక లోపల దంతాలు, చిగుళ్లు, సున్నితమైన బుగ్గల సంగతి చెప్పనవసరం లేదు. బాధను అనుభవించడమో, ఏదైనా గృహ వైద్యం చేసుకోవడమో తప్ప, సరైన సమయంలో అవసరమైన చికిత్సకు ఆస్కారముండేది కాదు!

అసలు నోటి పరిశుభ్రత అంటే ఏమిటి? నోరు పుక్కిలిస్తే సరిపోతుందా? నాలుక గీసుకుంటే సరిపోతుందా? దంతాలు రుద్దుకుంటే సరిపోతుందా? ఆహార నాళానికి ప్రధాన ద్వారం నోరు. అందుచేత నోటి పరిశుభ్రత ప్రధానమైనదన్నమాట! కనుక, నోటికుహరంతో పాటు, పళ్ళు (దంతాలు), నాలుక, పంటి చిగుళ్లు, లోపలి సున్నితమైన బుగ్గలు, గొంతు, పెదవులు, ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే, నిత్యమూ వీటి పరిశుభ్రత అవసరం.

మనం నిత్యం ఆరోగ్యంగా వుండి, బ్రతికి బట్టకట్టాలంటే దానికి సరైన పుష్టికరమైన ఆహారం తినాలి. తిన్న ఆహారం చక్కగా జీర్ణమై రక్తంగా మారడానికి, తిన్నఆహరం చక్కగా నమలబడాలి, అందుకు ఆరోగ్యవంతమైన దంతాలు ఉండాలి. అందుచేత మనం బ్రతికినంత కాలం ఆ దంతాలు ఆరోగ్యంగా ఉండాలి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే, నిత్యం వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అది జరిగేదెలా?

సాధారణ కుటుంబాలలో, అప్పట్లో పళ్ళు తోముకోవడానికి బ్రష్, టూత్ పేస్ట్‌లు కొనుక్కునే స్తోమత ఉండేది కాదు. స్తోమత వున్నా అవి విరివిగా అందుబాటులో ఉండేవి కావు.

అంతమాత్రమే కాదు, గ్రామీణ ప్రజలలో, టూత్ బ్రష్ – టూత్ పేస్ట్‌ల గురించిన అవగాహన ఉండేది కాదు. నోటి పరిశుభ్రతను, ముఖ్యంగా దంతసంరక్షణ విషయాన్ని అతి సాధారణ విషయంగా తీసుకునేవారు. దంత సంరక్షణకు, దంతధావనం అతి ముఖ్యమనీ, దాని పట్ల శ్రద్ధ వహించకపోతే, జరిగే అనారోగ్య పరిణామాల పట్ల వారికి సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా నోటి పరిశుభ్రతను చాలా తేలిగ్గా తీసుకునేవారు. అయినప్పటికీ ఆనాటి పూర్వికులు దంతధావనం (పళ్ళు తోముకోవడం) కోసం వాడిన పదార్థాలు, వృక్షసంబంధమైన పుల్లలు (పనుదోము పుల్లలు లేదా పండుం పుల్లలు) ఎక్కువ శాతం దంతాలను, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచే విషయంలో సహాయకారులుగానే ఉండేవి.

దంతధావనానికి పందుం పుల్లలు

ప్రజా జీవనంలో టూత్ బ్రష్ – టూత్ పేస్ట్‌లు ప్రవేశించక మునుపు, పళ్ళుతో ముకోవడానికి, కొంతమంది ‘కచ్చిక’ (ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చగా వచ్చిన పొడి), బొగ్గు, ఇటుక పొడి కూడా వాడేవారు. వీటితో దంతధావనం చేసుకోవడం వల్ల నోరు పరిశుభ్రం అయినా, పళ్ళు తెల్లగా వచ్చినా, పళ్ళు మాత్రం త్వరగా అరిగిపోయి, పళ్ళు ‘జివ్వు’మనే సమస్య తలెత్తేది.

తాటాకు ముక్కలతో నాలుక గీసుకోవడం మూలాన, నాలుక తరచుగా గాయపడుతుండేది. తర్వాత, వేప, గానుగ, ఈత పుల్లలు పళ్ళు తోముకోవడానికి ఉపయోగించేవారు. వీటిని టూత్ బ్రష్ లకు పునాది రాళ్లుగా చెప్పుకోవచ్చు. పుల్ల చివర మెత్తగా నమిలి దానితో పళ్ళు తోముకోవడం వల్ల పుల్లలలోని నూనె పదార్ధాలు చిగుళ్లపై ప్రభావం చూపించడం మూలాన చిగుళ్లు గట్టిపడి దంతాలను పటిష్టంగా ఉంచడంలో సహాయపడేవి. అయితే పంటి పుల్లలతో మృదువుగా పళ్ళు తోముకొనకుంటే మాత్రం పళ్ళు అరిగిపోయేవిగాని కదిలేవి కావు!

తర్వాత మెల్లగా టూత్ బ్రష్‌లు రంగంలోనికి ప్రవేశించినా వెంటనే టూత్ పేస్టులు వెలుగులోనికి రాలేదు. అప్పుడు పళ్ళపొడులు కొంతకాలం రాజ్యమేలాయి. గోపాల్ పళ్ళపొడి, కాల్గెట్ పళ్ళపొడి, ఫరూకీమంజన్ వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే! అయితే ఇప్పటికీ కొన్నిపొడులు వాడుకలో లేకపోలేదు.

ప్రాథమిక దశలోని పళ్ల పొడులు

కొంతమంది ఈ పొడులను ఉపయోగించి చేతి వేలితో తోముకుంటే, కొంతమంది బ్రష్‌ను ఉపయోగిస్తున్నారు. తర్వాత అనేక కంపెనీలు టూత్ బ్రష్‌ల తయారీలో ముందుకు వచ్చాయి. టూత్ పేస్ట్ రంగంలో ‘కాల్గెట్’ ప్రవేశించి, చాలాకాలం అగ్రగామిగా నిలిచింది. రేడియో శ్రీలంక ద్వారా ప్రకటన కోసం రూపొందించిన ‘బినాకా -గీత్ మాల’ అనే సినీమా పాటల కార్యక్రమం, ‘బినాకా టూత్ పేస్ట్’ అమ్మకాలను విపరీతంగా పెంచిందనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదని నా నమ్మకం!

దంతధావనానికి కాల్గెట్ ఉత్పత్తులు

ఇప్పుడు దంతసంరక్షణ కోసం మాత్రమే కాక, అరిగిపోయిన/కరిగిపోయిన పళ్ల కోసం చిగుళ్ళనుండి రక్తం కారకుండా చేసే ఔషధపరమైన టూత్ పేస్టులు కూడా అందుబాటులోనికి వచ్చాయి. నిత్యావసర వస్తువుగా టూత్ పేస్టును దృష్టిలో ఉంచుకుని, గుర్తుంచుకోలేనన్నీ కంపెనీలు, రకరకాల టూత్ పేస్టులు విపణిలో అందుబాటులోనికి వచ్చాయి. వినియోగదారుడు తనకు నచ్చిన పేస్ట్‌ను, బ్రష్‌ను కొనుక్కునే వెసులుబాటు ఇప్పుడు కలిగింది. ఇలా దంత సంరక్షణలో, నోటిపరిశుభ్రతలో అనేక రకాలైన టూత్ పేస్టులు, మౌత్ వాష్‌లు అందుబాటులోనికి వచ్చాయి. పిల్లల కోసం ప్రత్యేకమైన టూత్ పేస్టులు విపణిలో ప్రవేశించాయి. ఇదొక శుభ పరిణామం!

వృత్తిపరంగా నేను దంత వైద్య రంగంలో అడుగు పెడతానని ఎప్పుడూ అనుకోలేదు. దంతవైద్య విజ్ఞాన ప్రచారం కోసం నాలుగు పుస్తకాలు రాస్తాననీ (దంత సంరక్షణ, చిన్నపిల్లలు దంత సమస్యలు, దంతాలూ -ఆరోగ్యం, పిప్పిపన్ను – చికిత్స) అనుకోలేదు.

చిగుళ్లనుండి రక్తం రాకుండా కాపాడే స్టొలిన్-ఆర్, టూత్ పేస్ట్

నా బాల్యంలో, దంతధావనం కుంపటిలోని పిడక కచ్చికతోనే ప్రారంభం అయింది. అలాగే పళ్ళు తోముకోవాలి కాబోలు అనుకునేవాణ్ణి. తరువాత ఇంటాబయటా చూసి, మార్గం పనుదోము పుల్ల (పందుంపుల్ల) వైపు మళ్ళించాను. అందుబాటులోవుండే, ఈత, వేపపుల్లలు విరివిగా వాడకంలో ఉండేవి. స్వస్థలంలో ప్రాథమిక విద్య జరిగినంత కాలం ఇదే కొనసాగింది. ఇక హై స్కూల్ కోసం తాలూకా కేంద్రమైన రాజోలుకు వెళ్లడం, అక్కడ స్వర్గీయ గొల్ల చంద్రయ్య గారు నెలకొల్పిన వసతిగృహంలో వుండే అవకాశం వచ్చినందువల్ల, దంతధావనం కోసం పళ్ళపొడి వాడకం మొదలైంది

అప్పుడు కాగితం పొట్లాలలో ‘గోపాల్ పళ్ళపొడి’ అని దొరికేది. బ్రష్ లేకుండానే చేతిలో పొడి వేసుకుని, వేలితో తోముకోవడముండేది, నాలుక గీసుకోవడానికి ప్లాస్టిక్ టంగ్ క్లీనర్ ఉండేది. తర్వాత డబ్బాలలో లభించే ‘కాల్గెట్ పళ్ళపొడి’ అలవాటు అయింది.

చిగురు సమస్యలనుండి రక్షించే గమ్ టోన్ పొడి (పళ్ల పొడి కాదు)

పద్నాలుగు ఏళ్ళ వయసులో, పెద్దన్నయ్య సంరక్షణలో భాగ్యనగరానికి చేరుకున్నాక, నా జీవన శైలి పూర్తిగా మారిపోయింది. టూత్ బ్రష్, కాల్గెట్ టూత్ పేస్ట్ వాడకం మొదలైంది. వృత్తిపరంగా కూడా నాకు ఈ పేస్ట్ చాలా దగ్గర అయింది. కంపెనీ నుండి ‘ఫ్రీ శాంపిల్స్’ బాగా వచ్చేవి. నిన్న మొన్నటి వరకూ కాల్గెట్ తోనే నా దంతధావన ప్రక్రియ నడిచింది. వయసును బట్టి ఇప్పుడు పళ్ళు అరిగిపోవడంతో కొత్త సమస్య ‘పళ్ళు జివ్వు’  (సెన్సిటివిటి)మనడం మొదలయింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఔషధపరమైన టూత్ పేస్ట్ వాడక తప్పడం లేదు. ఈ పరిస్థితిని తట్టుకోవడానికి, సెన్క్వెల్-ఎఫ్, సెన్సోడెంట్-కె.ఎఫ్, కాల్గెట్ సెన్సిటివ్, సెన్సోడైన్ వంటి టూత్ పేస్టులు అందుబాటులో వున్నాయి. ఇంచుమించు ఇవన్నీ వాడిన నేను, ప్రస్తుతం ‘సెన్సోడైన్ టూత్ పేస్ట్’తో కలిసి జీవిస్తున్నాను.

దంత సమస్య నుండి రచయితని కాపాడుతూన్న టూత్ పేస్ట్ సెన్సోడైన్

మనిషి పుట్టుక నుండి, మరణించే వరకు, జీవితంలో, జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తాయి. వాటితో కలసి ముందుకు సాగిపోవడమే మనిషి పని! ఈ దంతధావన ప్రక్రియ కూడా అందులో ఒకటి అని భావించాలి. అంతమాత్రమే కాకుండా నోటి అపరిశుభ్రత వల్ల అనేక దంతసమస్యలు (పిప్పిపన్ను, నోటి దుర్వాసన వగైరా)తో పాటు, దంతవ్యాధులను సకాలంలో పరిష్కరించుకొనక పోవడం వల్ల, శరీరంలోని గుండె, మూత్రపిండాలు, వగైరా వ్యాధిగ్రస్థం అయ్యే ప్రమాదం కూడా వుంది. అందుచేత, నోటి పరిశుబ్రత కోసం ఏమి వాడారన్నది కాదు, ఎలా వాడుతున్నామన్నది సమీక్షించుకోవాలి.

‘ఆరోగ్యమైన దంతాలు – నమ్మకమైన నవ్వుకు సంకేతాలు’.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version