Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాల పందిరి-45

“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.

మరో పునర్జన్మ..!!

థల్లో, సినీమాల్లో, పునర్జన్మల గురించి చదువుతాం, వింటాం. అవి వూహించలేనివీ, ఊహకందనివీను. కథల్లో చదవడానికి, సినీమాల్లో చూడడానికీ ఆసక్తికరంగానే ఉంటాయి. నిజమా? అలా జరిగిందా అనుకుంటాం. అలా కూడా జరుగుతుందా? అని కూడా అనుకుంటాం. కొన్ని నమ్మేలా ఉంటాయి, కొన్ని తీసి పక్కన పెట్టేవిలా ఉంటాయి. ఇదంతా నిజమైన పునర్జన్మల గురించి. చనిపోవలసినవాడు, ఎవరి సహాయం వల్ల నయినా బ్రతికి బట్టకడితే, ఆ సహాయం చేసిన వ్యక్తిని పునర్జన్మ నిచ్చాడు అంటాం. అంటే, చనిపోయి తిరిగి పుట్టడం కాదన్న మాట. బ్రతికుండగానే, మరణం అంచుల వరకూ పోయి తిరిగి మామూలు మనుష్యులుగా మారిపోవడం. చాలా మంది జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కానీ, అందరూ వాటిని గుర్తు పెట్టుకోరు, ఆ సహాయం చేసిన వ్యక్తులను అసలే గుర్తు పెట్టుకోరు.

సమాజంలో ఇది మామూలుగా జరిగే తతంగమే! కానీ.. సున్నితమైన మనస్సు గలవారు మాత్రం, ఆ యా సంఘటనలను గానీ, సహాయం చేసిన వ్యక్తులను గానీ అసలు మర్చిపోరు. పైగా.. ఆ సహాయకులు బంధువులో, రక్త సంబంధీకులో అయితే ఇక చెప్పేది ఏముంటుంది. ఏదైనా మనుష్యుల మనస్తత్వాల మీద ఆధారపడివుంటుంది. పట్టించుకోని వాళ్లకు మాత్రం ఎవరైనా ఒకటే! ఈ నేపథ్యంలో నా పెద్దన్నయ్య శ్రీ కె. కె. మీనన్‌ను గుర్తు చేసుకోకుంటే, నేను బ్రతికి వుండి ప్రయోజనం లేనట్టే. ఎందుచేత నంటే నా జీవితంలో నేను రెండు సార్లు మరణ శయ్య మీదకు వెళ్ళినప్పుడు, నన్ను రక్షించి బయటకు లాగినవాడు నా పెద్దన్నయ్య, ప్రముఖ నవల/కథా రచయిత, కీ. శే. శ్రీ కె. కె. మీనన్. ఆ జ్ఞాపకాలను పంచుకోవడానికి ఈ ప్రస్తావన అంతా. మా పెద్దన్నయ్య గురించి చెప్పినా, చిన్నన్నయ్య గురించి, ఇద్దరు అక్కలు గురించి చెప్పినా, నేను గొప్పలు చెప్పుకుంటున్నాని కొందరు అనుకున్నా ఫరవాలేదు కానీ.. ఇక్కడ వాళ్ళను ప్రస్తావించకుండా ఉంటే, నన్ను నేను మోసం చేసుకున్నట్టే లెక్క. అందుకే ఈ చిన్ని ప్రయత్నం. నాకు మేలు చేసిన వారి గురించి గొప్పగా చెప్పుకునే సాహసం చేయడం. నాకు ఊహించని కొత్త జీవితం ప్రసాదించిన వారి గురించి అక్షరాల ద్వారా సింహావలోకనం చేసుకోవడం.

నా అన్నలు (కె. కె. మీనన్ & మధుసూదన్), నా అక్కయ్యలు (కె. మహానీయమ్మ & ఎం. భారతీ దేవి) నన్ను నా బాల్యంనుండీ ఎంతో అపురూపంగా చూసేవారు. మా కుటుంబంలో కనిష్ఠుడిగా నాకు ప్రత్యేకత ఉండేది. నన్ను ‘చంటీ /చంటోడా’ అని ముద్దుగా పిలిచేవారు. ఇలాంటి నేపథ్యంలో నా కుడికాలికి ’ఆస్టియో మేలైటిస్’ అనే వ్యాధి సంక్రమించడమూ, మూడు సంవత్సరాలు ఉస్మానియాలో వైద్యం చేయించే బాధ్యత పెద్దన్నయ్య తీసుకోవడమూ, తర్వాత ఉస్మానియా మెట్రిక్ పరీక్ష పాస్ అయి, నాగార్జున సాగర్‌లో పెద్ద అక్క దగ్గర వుండి, రెండు సంవత్సరాలూ ఇంటెర్మీడియేట్ చదివి, తిరిగి హైదరాబాద్‌లో ఒక సంవత్సరం బి.ఎస్సి చదవడమూ, ఆ తర్వాత బి.డి.ఎస్.లో సీట్ వచ్చి అది పూర్తి చేసిన తర్వాత, గురువుగారు ప్రొ. రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో, సింగరేణి కాలరీస్ ఏరియా హాస్పిటల్ (బెల్లంపల్లి)లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా ఉద్యోగం రావడం వరసగా జరిగిపోయాయి.

సింగరేణి-ఏరియా హాస్పిటల్( బెల్లంపల్లి) వైద్య మిత్రులతో….నేను(1982)

అక్కడి నుండి నా జీవితం మరో మలుపు తిరిగిందని చెప్పాలి. ఒంటరి జీవితమూ, స్వేచ్ఛా జీవితమూ, చాలా మంది అక్కడ నాకు తెలిసిన వాళ్ళు వుండడమూ, ఒక కొత్త వింత జీవితం మొదలైంది. అలాగే ఒక క్రమశిక్షణ గల జీవితమూ ప్రాప్తించింది. దీనితో పాటు కొన్ని లేని అలవాట్ల ప్రభంజనమూ మొదలైంది. బ్రహ్మచారి జీవితం, పెద్ద నివాస భవనం, అందులో సకల సదుపాయాలూనూ. నేను కొద్దీ రోజులు మాత్రమే సింగిల్‌గా క్వార్టర్స్‌లో వున్నాను. తర్వాత కొంతమంది మిత్రులం కలసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఒక వంటమనిషిని పెట్టుకుని ఇష్టమైన వంటలు చేయించుకునే వాళ్ళం. డా. సత్యానంద్, డా. రేణుకా ప్రసాద్, మాత్రమే రూమ్మేట్స్ గుర్తు వున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వున్నారో కూడా తెలియదు.

డా. కళాధర్ శ్రీమతి మా పెద్దక్క శిష్యురాలు కావడంతో తరచుగా వాళ్ళ ఇంటికి వెళుతుండేవాడిని. డా. వెంకట్రావ్ (ఆర్థోపెడిక్స్), డా. తిలక్ (పెథాలజిస్ట్) వంటి పెద్ద వారు, డా. రాజేశ్వరరావు దంపతులు చాలా కలిసి ఉండేవారు. బ్రహ్మచారులం చాలా మందిమి ఉండేవాళ్ళం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ప్రతివారం పెళ్ళైన వారు, పెళ్లికానివారికి పార్టీ ఇవ్వాలి. అది చాలా కాలంగా కొనసాగుతున్న నియమం అక్కడ. అందుచేత ప్రతి వారం ఒకరి ఇంట్లో పార్టీ ఉండేది. ఈ నేపథ్యంలో విస్కీ/బీర్ సేవనం తప్పని సరి అయింది (ఇది కొద్దిగా ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ప్రారంభం అయింది లెండి). నా ఆరునెలల సింగరేణి కాలరీస్ హాస్పిటల్ జీవితం గొప్ప ఆనందాన్నీ తృప్తినీ ఇచ్చినా, బరువు పెరిగి రంగు తేలాను. 1982 జూన్‌లో నాకు నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖలో ఉద్యోగం వచ్చింది. నాటి వరంగల్ జిల్లా మహబూబాబాద్ తాలూకా (ఇప్పుడు జిల్లా అయింది) ఆసుపత్రిలో పోస్టింగ్. 15వ తేదీన రిలీవ్ అయ్యి, అదే రోజు వరంగల్ జిల్లా వైద్య శాఖాధికారికి రిపోర్ట్ చేసి మహబూబాబాద్ వెళ్లి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. కొన్ని నెలలు అడ్జస్ట్ కావడానికి సరిపోయింది. మంచి ఇల్లు దొరికింది, మంచి స్నేహితులు దొరికారు. అందులో డా. జె. సురేందర్ రెడ్డి, డా. వై. ఆర్. అప్పారావు (ప్రభుత్వ వైద్యులు), డా. వి. నరసింహా రెడ్డి, డా. ప్రభాకర్ రావు, డా. జగన్ మోహన్ రావు, డా. జ్యోతీంద్ర నాధ్, డా. పండరి నాథ్ వంటి వారు ముఖ్యులు.

నేను మహబూబాబాద్ లో పని చే సినప్పుడు సహకరించిన మిత్రులు నారాయణ టీచర్(కుడి)తో…నేనూ మా పెద్దన్నయ్య స్వర్గీయ కె కె మీనన్

రోజులు చాలా ఆనందంగా గడిచిపోతున్న కొద్దీ నెలలకు ‘పచ్చ కామెర్లు’ (జాండీస్) వ్యాధి వచ్చింది. ఆకలి లేకపోవడం, నీరసించి పోవడం, నడవలేని పరిస్థితి. వళ్లంతా పసుపు రాసుకున్నట్టు  పసుపు తేలింది. పెద్దన్నయ్యకు సమాచారం అంది ఆఘమేఘాల మీద మానుకోట చేరుకున్నాడు. నా పరిస్థితి చూసి చాలా ఆందోళనకు గురి అయ్యారు ఆయన. హైదరాబాద్ తీసుకెళ్లడానికి సిద్దమయ్యాడు. మహబూబాబాద్ విడిచే ముందు ఆయన నాకు ఒక ప్రశ్న వేశారు. అది నా వైద్యం గురించిన ముఖ్యమైన విషయం. అదేమిటంటే – అల్లోపతి వైద్యం చేయించుకుంటావా? హోమియో/ఆయుర్వేద/యునానీ/నేచురోపతి ఎందులో వైద్యము చేయించుకుంటావన్నది నా చాయిస్ అడిగారు. అక్కడ కూడా నా అభిరుచికి ప్రాధాన్యత నీయడం ఆయన గొప్పతనం. అప్పుడు నిజంగా ఆయన ఏమి అడిగినా సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేను నేను. నీ ఇష్టం అన్నట్టు సైగ చేసాను. వెంటనే నన్నుఆయన హైదరాబాద్ తీసుకు వెళ్లారు. మరునాడు ఖైరతాబాద్ పబ్లిక్ లైబ్రరీ దగ్గర ఒక సందులో వున్న యునానీ వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆ డాక్టర్ గారు వయసులో చాలా పెద్దాయన. అప్పుడే నమాజ్ చేసుకుని వచ్చారు. నా ముఖం కళ్ళు చూసి పెథాలజిస్ట్ మాదిరిగా అన్నీ చెప్పేస్తుంటే ఇద్దరమూ ఆశ్చర్యపోయాము. ఆయన వారానికి సరిపడా మందులు పొట్లాలు కట్టి ఇచ్చారు. అన్నం తడిసేలా నెయ్యి వేసుకుని తినమన్నారు. అల్లోపతికి పూర్తిగా వ్యతిరేకంగా వుంది. అన్నం నెయ్యితో తినమన్నారు, కానీ అసలు మామూలు అన్నమే తినే స్థితిలో లేను. అంతా వెగటుగా వాంతి వచ్చినట్టు అనిపించేది అసలు ఆ..యునానీ మందు వాడాలా? వద్దా? అన్నది సందేహం. తెగించి చివరికి యునానీ మందు వాడడానికి నిర్ణయించుకున్నాను. అన్నయ్య కూడా ప్రోత్సహించారు.

పెద్దన్నయ్య కె. కె. మీనన్

డాక్టరు గారు ఇచ్చిన మందు ‘చేదు’ అంటే, ఇలా ఉంటుంది.. అనడానికి గొప్ప ఉదాహరణగా. ఒక గంట పాటు నోరంతా చేదుగా ఉండేది. అన్నం తినదానికి వచ్చేది కాదు. ఆయన అది గమనించి నాకు హెచ్చరిక చేశారు. అలా తినకపోతే జబ్బు తగ్గదని. మొత్తం మీద వారం రోజుల్లో నాకు ఆ మందుల వల్ల యాభై శాతం జబ్బు తగ్గిపోయి ఆకలి కావడం మొదలైంది. మరో పదిరోజుల్లో పూర్తి ఆరోగ్య పరిస్థితి ఏర్పడింది. నాకు ఇప్పటికీ ఆ యునానీ డాక్టర్ గారు గుర్తుకు వస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన అనుభవం, చికిత్సా ప్రక్రియ, సాహసం చాలా గొప్పవి. ఆయన చెప్పేవరకూ నేను తిరిగి డ్యూటీలో జాయిన్ కాలేదు. అప్పుడు ఇన్‍చార్జి డిప్యూటీ సివిల్ సర్జన్, డా. జె. సురేందర్ రెడ్డిగారు చేసిన సహాయం మరిచిపోలేనిది. నా విషయంలో ఆయనను ఇరుకున పెట్టాలని ఒక లేడీ డాక్టరూ, కొందరు ఆసుపత్రి సిబ్బంది విశ్వప్రయత్నం చేసినా, ఆయన నాకు అండగా నిలిచి వారి ప్రయత్నాలు కొనసాగ నివ్వలేదు. నా వల్ల ఆయనకు ఇబ్బందులు వస్తాయేమోనని నేను భయపడిన మాట వాస్తవం. నిజాయితీగానే వారి కుటిల ప్రయత్నాలకు, ఎదురు దెబ్బ తీసి, ఆయన జిల్లా ముఖ్య వైద్యాధికారిగా పదవీ విరమణ చేసి, హైదరాబాద్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఎందరో మహానుభావులు, అందులో ఆయన ఒకరు!

డా. జె. సురేందర్ రెడ్డి

ఈ విధంగా నా జీవితంలో, రెండు సార్లు పెద్దన్నయ్య కె. కె. మీనన్, మరణ శయ్యకు అతి దగ్గరగా పోయిన నాకు పునర్జన్మ ప్రసాదించాడు. నన్నూ నా పిల్లల్ని అధికంగా ప్రేమించాడు, వాళ్ళ అభివృద్ధి చూడకుండానే, కనిపించని లోకాలకు తరలిపోయాడు. మానవ రూపంలో వున్న దేవుడే.. ఆయన నాకు. నాకు రెండు సార్లు పునర్జన్మ ప్రసాదించిన పుణ్య పురుషుడు ఆయన! మా అన్నయ్యకి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం!!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version