Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాల పందిరి-52

“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.

నా మొదటి కథా సంపుటి ‘కె ఎల్వీ కథలు’

చనా వ్యాసంగంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ కథలు రాయడం. అది కథ కావచ్చు, కథానిక కావచ్చు, మినీ కథ కావచ్చు, గల్పిక కావచ్చు. ఏ రూపంలో రాసినా అది కథా ప్రక్రియ లోనికి వస్తుంది. అయితే నిడివి తగ్గే కొద్దీ కథా రచన క్లిష్ట తరమవుతుంది. ఇలాంటి చిన్ని రూపాలలో కథను చెప్పడం రచయితకు కత్తిమీద సామే! ఇక్కడే రచయిత/రచయిత్రి ప్రతిభ వ్యక్తపరిచే అవకాశం దక్కుతుంది. ఈ రోజుల్లో ప్రేమ కథలకు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. తరువాత ఎక్కువగా సంసారిక సమస్యలమీదనే ఎక్కువ ఆసక్తిని పాఠకులు చూపిస్తున్నట్టుగా భావించవచ్చును. కారణం కుటుంబ సమీకరణలలో సరైన నిర్ణయాలు అంచనా చేయలేకపోవడం, ఇరు పక్షాల ఆర్థికంగా పుష్టికరంగా ఉండడం, పాఠ్య పుస్తకాలను తప్ప నిజ జీవితాలను అంచనా వేయలేకపోవడం, అర్థం చేసుకోలేక పోవడం వంటి అంశాలు, కుటుంబ విచ్చిత్తికి కారణాలుగా ఇంచుమించు ప్రతి ఇంట కనిపిస్తుండడం వల్ల, రచయితలు/రచయిత్రులు ఇవే అంశాలను కథలకు వస్తువులుగా తీసుకుంటున్నారు. ఇక పౌరాణిక, చారిత్రక, జానపథ నేపధ్య కథలను రాసే రచయితలు తక్కువ అయిపోయినారు. వాటికి ఎక్కువగా చదవవలసి రావడం, పరిశోధనలు చేయవలసిన అవసరం ఉండడం వల్ల, ఆ కథల జోలికి ఇంచుమించు ఎవరూ పోవడం లేదనే చెప్పాలి.

ఒకప్పుడు పత్రికలకు సరిపడా రాసే రచయితలు ఎక్కువగా ఉండేవారు కాదు. తర్వాత పత్రికలూ పెరిగాయి, రచయితలు/రచయిత్రులూ పెరిగారు. ఒకానొక సమయంలో కేవలం రచయిత్రులు మాత్రమే పత్రికా ప్రపంచాన్ని ఏలినారని చెప్పవచ్చు. రచయితలు కూడా మహిళల పేర్లు పెట్టి కథలు రాసిన సందర్భాలు వున్నాయి. కాల మహిమతో ఒక్కోసారి ఒక్కో అంశం తెరకెక్కుతుంది. 2020 ప్రపంచమంతా గుర్తు పెట్టుకోవలసినదీ, మర్చిపోలేనిది, ఒక చారిత్రిక అంశంగా మిగిలిపోయిదీనూ! ఇది అందరికీ తెలిసినదే, ‘కరోనా’ మహమ్మారి చేసిన విలయతాండవం, తత్ఫలితంగా జరిగిన నిశ్శబ్ద మారణహోమం. దీనివల్ల అన్నింటిమీదా ప్రభావం పడినట్టే పత్రికా రంగం మీద కూడా పడింది. దానివల్ల తప్పని పరిస్థితిలో కొన్ని పత్రికలను మూసివేయక తప్పలేదు. అందులో ఆంధ్రభూమి, నవ్య, విపుల, చతుర, తెలుగు వెలుగు వంటి పత్రికలూ ఉండడం బాధాకరం. అయితే కొన్ని పత్రికలు మూత పడ్డ నేపథ్యంలో, కొత్తగా పుట్టుకొస్తున్న పత్రికలతో పాటు, మీ కోసం మేము ఉన్నాం అన్నట్టు అనేక అంతర్జాల పత్రికలు మనకు ఇప్పుడు అందుబాటులోనికి వచ్చాయి. రాసేవాళ్లకు, ఇప్పుడైనా ఎలాంటి ఆటంకాలూ లేవు. పైగా ‘సంచిక’ వంటి అంతర్జాల పత్రికలు, రచయితలకు మరీ ఎదురు వెళ్లి ప్రొత్సహిస్తున్నాయ్. ఇది ఆహ్వానించ దగ్గ విషయమే.

నేను సీరియస్‌గా కథలు రాస్తున్న సమయంలో, పత్రికా రంగంలో ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఏమీ లేవు. అందుచేత ఆ సమయాన్ని నేను బాగానే సద్వినియోగం చేసుకున్నానని చెప్పాలి. అలా నన్ను విశాలాంధ్ర (ఆదివారం), ఆంధ్రభూమి, ప్రజాశక్తి (ఆదివారం), కథాకేళి మాసపత్రిక, నవ్య వారపత్రిక, ప్రసారిక (ప్రాంతీయ పత్రిక), సాహితీ ప్రస్తానం, చినుకు మాస పత్రిక వంటి పత్రికలు, కథా రచనలో నన్ను ఎంతగానో ప్రోత్సహించాయి. వీటికి తోడు ఆకాశవాణి – వరంగల్ కేంద్రం వారు సహృదయంతో నా కథలు ప్రసారం చేశారు. ఈ సందర్భంగా, ఆకాశవాణి కి చెందిన పెద్దలు సర్వశ్రీ ఆర్. వెంకటేశ్వర్లు గారు, డా. పాలకుఁర్హి మధుసూదన్ గారు, చలపతి రావు గారు, శ్రీమతి సరోజా నిర్మల గారు, రాంబాబు గారు, శ్రీనివాస రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, అనీల్ ప్రసాద్ గారు, ఝాన్సీ. కె. వి.కుమారి గారు, సూర్యప్రకాష్ గారు ఇలా ఎందరెందరో ప్రోత్సహించారు/సహకరించారు. వారందరికీ నేను ఎంతగానో రుణపడి వుంటాను.

వివిధ పత్రికల్లో కథలు రావడం మొదలయ్యాక, మనసు కథా సంపుటి వైపు మళ్లింది. అసలు నేను రాసినవి కథల లెక్కలోకి వస్తాయా? అన్న అనుమానం మరోవైపు నుంచి గుచ్చడం మొదలు పెట్టింది. మనసు అయితే పుస్తకం వేయమని పదే పదే భుజం తడుతున్నా, ఆర్థిక వనరుల విషయంలో సందిగ్ధత చోటు చేసుకుంది. అయినా అందరిలానే కథా సంపుటిని తీసుకు రావాలనే నిర్ణయానికి వచ్చేసాను. మానసికంగా పుస్తకం కోసం డబ్బు ఖర్చుపెట్టడానికి సిద్దపడిపోయాను. ఇంట్లోవాళ్లకు కూడా నా కోరికను వెల్లడించి, నిర్ణయాన్ని వివరించాను. పుస్తకం ఎక్కడ పబ్లిష్ చేయాలన్నది ఆలోచిస్తుండగా, ‘చినుకు’ మాసపత్రికలో ఒక ప్రకటన నా కళ్లబడింది. ‘చినుకు పబ్లికేషన్స్’ పేరుతో సంపాదకుడు నండూరి రాజగోపాల్ తక్కువ ఖర్చుతో పుస్తకాలు ముద్రిస్తున్నట్టు ఆ ప్రకటన సారాంశం.

రాజగోపాల్ గారికి ఫోన్ చేసి నా కథా సంపుటి ప్రచురణ విషయం చెప్పాను. దానికి ఆయన వెంటనే స్పందించి కథల స్క్రిప్ట్ పంపమన్నారు. వెంటనే పంపాను. ముఖ చిత్రం ఏమి వేయాలన్నది తర్వాతి సమస్య. మాటల మధ్యలో మా అమ్మాయి తన స్నేహితుడు చిత్రకారుడు వున్నాడని, అతని చేత వేయిద్దామని అనడంతో, ఆ పని ఆయనకు అప్పగించాను. అతని పేరు క్రిమ్‌సన్. నేను రాసిన అక్షరాలనే పుస్తకం టైటిల్‌కు పెట్టి ఆయన బొమ్మ  వేసాడు. కథా సంపుటికి ‘కె ఎల్వీ కథలు’ అని పేరు పెట్టాము. సాహితీ మిత్రులు అంపశయ్య నవీన్, పుస్తకానికి ముందు మాట రాసి ఆశీర్వదించారు. ఇంకా బన్న ఐలయ్య గారూ, గిరిజామనోహర్ బాబు గారు, దక్షిణా మూర్తిగారు వంటి పెద్దలు తమ ఆశీస్సులు అందించారు. పుస్తకాన్ని నా శ్రీమతి అరుణకు అంకితం చేయడం చాలామందికి నచ్చింది. అనుకున్న సమయంలోనే పుస్తకం విజయవాడలో ముద్రణ జరిగిపోయింది.

పుస్తక ఆవిష్కరణ తేదీ సమయం కూడా మిత్రుల సలహా మేరకు నిర్ణయం జరిగిపోయింది. పది జులై శనివారం 2010, సాయంత్రం 6 గంటలకు, వందేళ్లు పైన చరిత్రగల రాజరాజనరేంద్ర భాషా నిలయంలో కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మిత్రులు నిర్ణయించారు, సహృదయ పెద్దలు ఎంతగానో సహకరించారు.

నా మొదటి కథల సంపుటి కెఎల్వీ కథలు.
ఆహ్వాన పత్రిక

సభకు గురుతుల్యులు, సహృదయ మిత్రులు, ప్రముఖ సాహితీవేత్త శ్రీ గన్నమరాజు గిరిజామనోహరాబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విజయవాడనుండి చినుకు మాసపత్రిక సంపాదకులు, నా పుస్తక ప్రచురణకర్త శ్రీ నండూరి రాజగోపాల్ గారు వచ్చారు. ఆత్మీయ అతిథులుగా శ్రీ అంపశయ్య నవీన్ గారూ, శ్రీ జయపాల్ రెడ్డి, హైదరాబాద్ నుండి సి. ఎస్. రాంబాబు, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ క్రిమ్‌సన్ వంటి పెద్దలు హాజరయ్యారు. పుస్తక సమీక్ష శ్రీ మెట్టు రవీంద్ర చేశారు. విశాఖపట్నం నుండి చిన్నన్నయ్య డా. మధుసూదన్ కూడా వచ్చినట్టు గుర్తు. ఒక పండుగ మాదిరిగా కార్యక్రమం నడిపించారు మిత్రులంతా. ఈ పుస్తకావిష్కరణలో అత్యంత సంబర దృశ్యం పుస్తకం నా శ్రీమతి అరుణకి అంకితం ఇవ్వడం. హైదరాబాద్ నుండి వచ్చిన నా సహాధ్యాయులు డా. జె. క్రాంతి, డా. అన్నే అరుణ కార్యక్రమం చూసి ఎంతగానో సంతోషించారు.

నా పుస్తకావిష్కరణలో నా శ్రీమతికి చిరు సన్మానం
నా సహాధ్యాయిని డా. క్రాంతికి సన్మానం

డా. క్రాంతి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించారు. నా మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు చాలామంది సభకు హాజరైనారు. అతిథుల సన్మానం ముగిసిన తరువాత, మిత్రులు అనేక మంది నన్నుసన్మానించడం, జీవితంలో నేను మరచిపోలేని మధుర ఘట్టం.

‘సహృదయ’ మిత్రులు నాకు సన్మానం చేస్తున్న దృశ్యం
మిత్రమండలి పక్షాన శ్రీ పొట్లపల్లి, వి.ఆర్. విద్యార్థి గార్లు సన్మానిస్తున్న దృశ్యం
ఆవిష్కరణకు హాజరైన ఆకాశవాణి మిత్రులు
శ్రీలేఖ సాహితి పక్షాన డా. శ్రీ రంగస్వామి సన్మానం
శ్రీ అంపశయ్య నవీన్ గారికి చిరు సన్మానం

ఆ విధంగా కథల పుస్తకం వేయాలన్న కోరిక తీరింది. కథా రచయితగా ఒక గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా పుస్తకం వేయమని ప్రోత్సహించిన మిత్ర శ్రేయోభిలాషులకు, పుస్తక ప్రచురణకర్త శ్రీ నండూరి రాజగోపాల్ గారికీ, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమమం దిగ్విజయం వెనుక వున్న సాహితీ మిత్రులకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. ఇప్పటివరకూ నేను చాలా పుస్తకాలు ప్రచురించినప్పటికీ నా ఈ మొదటి కథల పుస్తకం కాపీలన్నీ అమ్ముడయిపోయి, నేను ఖర్చు చేసిన సొమ్ము తిరిగి వచ్చింది.

ఈ నా మొదటి కథల పుస్తకం మరిన్నికథలు రాయడానికి, మరో రెండు కథా సంపుటాలు (అస్త్రం/హగ్ మీ క్విక్) తీసుకురావడానికి ప్రేరణ ఇచ్చిందని చెప్పక తప్పదు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version