Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాలు – వ్యాపకాలు – 5

డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు.

నా చిన్నతనంలో…

మాది కుగ్రామమైన చెన్నూరు. ప్రస్తుతం దగదర్తి మండలంలోని గ్రామం. నెల్లూరు జిల్లా. మాకు నెల్లూరు 30 కిలోమీటర్లు. మా ఊళ్లో 400 కుటుంబాలుంటాయి. మాది జమీందారీ గ్రామం. బుచ్చిరెడ్డిపాళెంలోని దొడ్ల కుటుంబీకులు జమీందార్లు. వాళ్ల తరపున అన్నదాత వెంకట సుబ్బయ్య గ్రామ కరణంగా శిస్తు వసూలు చేసేవారు. స్వాతంత్రం వచ్చే నాటికి మా ఊరికి బస్సు, కరెంటు, ఆసుపత్రి, తదితర సౌకర్యాలు లేవు. అన్ని కులాల వాళ్లు ఐకమత్యంగా పెద్ద చిన్నా గౌరవభావంతో అన్నా, అక్కా, బావా, మామా అని పలకరించుకునే వాళ్లు. వ్యవసాయాధార గ్రామం. చెరువు నిండితే వచ్చే నీటితో 200 ఎకరాల పొలం వ్యవసాయం చేసేవారు.

మా నాన్న రేవూరు లక్ష్మీకాంతరావు స్వయంగా వ్యవసాయం చేసేవారు. క్రమంగా కష్టపడి 10 ఎకరాలు పొలం సంపాదించి సొంత సేద్యం చేశారు. దాదాపు 50 సంవత్సరాలు శ్రమపడ్డారు. ఎద్దులు, ఆవులు, బర్రెలు, పాలెగాళ్లు, బండ్లు, తోటలు వుండేవి. నైష్ఠిక బ్రాహ్మణాచారాలను ఆయన పాటించారు. ఆయనకు నేను ఏకైక సంతానం. తిరువనంతపురంలోని అనంతపద్మనాభస్వామి వ్రత ఫలితంగా నేను జన్మించాను.

మా అమ్మ శారదాంబకు 14వ ఏట పెళ్లి అయింది. నాన్న వయస్సు 18. మూడు రోజుల ప్రసవ వేదన ఫలితంగా స్వాతంత్ర భానూదయ ప్రభాత వేళ 1947 సంవత్సరం జనవరి 20న రథసప్తమీ పర్వదినాన ఉదయం 6.40 నిమషాలకు నెల్లూరులోని St. Ann’s Hospital (కన్యకల ఆసుపత్రిగా ప్రసిద్ధి) లో నేను జన్మించాను. ఉదయమే పురిటి నొప్పులు వచ్చాయి. డా. అల్లాడి లక్ష్మికి నర్సులు ఫోన్ చేసి పిలిపించారు. తేలికగా కాన్పు చేశారు. నేను పుట్టిన ఏడున్నర నెలకు (ఏలినాటి శని) బ్రిటీషువారి శని తొలగి 1947 ఆగస్టు 15న దేశ స్వాతంత్రం వచ్చింది.

1947-1955:

ఈ సంవత్సరాలలో ఎనిమిదేళ్లు నేను చెన్నూరులోనే గడిపాను. ఆ తర్వాత గత 65 సంవత్సరాలలో అక్కడ గడిపే అవకాశం రాలేదు. మా నాన్న నాకు పొలం పనులలో భాగస్వామ్యం కల్పించారు. ఎద్దుల బండి తోలి చేలకు ఎరువు తోలాను. పశువులను పొలాలకు తోలుకపోయాను. పొలం గట్టున నిలబడి పని వాళ్లు పొలంలో కూలీ పనులు చేయడం అజమాయిషీ చేశాను. కుప్ప నూర్పిడిలో జరిగే వ్యవసాయ పనుల హడావిడి చూశాను. వడ్ల బస్తాల పైన కూచుని రాత్రి 8 గంటలకు సేద్యగాళ్లతో ఇంటికి వచ్చేవాళ్లం.  ఇది అతిశయోక్తిగా, కల్పనగా చెప్పడం లేదు.

ప్రాథమిక పాఠశాల:

మా ఊళ్లో ప్రాథమిక పాఠశాల నడిచేది. నాకు ఐద ఏడు రాగానే 1952లో నన్ను ఆ స్కూలులో ఒకటో తరగతిలో చేర్చారు. పాపయ్యగారు హెడ్మాష్టారు. 1,2,3 తరగతులకు రావినూతల గోపాలకృష్ణయ్య టీచరు. కొద్ది సంవత్సరాలకు పాపయ్య మేష్టారు వారు స్వంత వూరు వొలిపాడు స్కూలుకు బదిలీ అయి, జాన్ అయ్యవారు హెడ్ మాస్టార్‌గా వచ్చారు. ఆయనకు అధిక సంతానం. నాకు వార్షిక సమావేశంలో 100% హాజరుకుగా బహుమతి ఇచ్చారు. బుద్ధిమంతుడైన కుర్రవాడని పేరు. నాతో బాటు మా పెద్దతండ్రి కొడుకు హరనాధరావు కూడా అదే స్కూలులో నాలుగేళ్లు చదివాడు. ఆయన నా కంటే సరిగ్గా ఒక సంవత్సరం పెద్ద. 1946 రథసప్తమి రోజు పుట్టాడు.

మా ఊళ్లో మోతుబరి రైతులు పది మంది దాకా వుండేవారు. ఎక్కువ మంది రెడ్లు. వాళ్లలో ఎవరు హైస్కూలు చదువులు దాటి చదవలేదు. 1970లో తర్వాత గ్రామ వాతావరణం మారిపోయింది. రాజకీయాలు జొరబడ్డాయి. గ్రామ బీడు కోసం రెండు వర్గాల వారు హైకోర్టు దాకా వెళ్లి 10 సంవత్సరాలు వ్యాజ్యం నడిపారు. సబ్ కోర్టు నుండి హైకోర్టు దాకా కేసు నడిచింది. మా నాన్న ఏ ఒక్క వర్గాన్ని సపోర్టు చేయక తటస్థంగా ఉడిపోయారు. ఫలితంగా 1963లో మా నూతన గృహప్రవేశానికి ఇరు వర్గాల వారు రాలేదు. కాని ఆ సాయంకాలం అందరూ విడివిడిగా వచ్చి శుభాకాంక్షలు చెప్పారు.

పురాణశ్రవణం:

కరణంగా మా వూరికి వలస వచ్చిన అన్నదాత వెంకటసుబ్బయ్య దంపతులు మా అమ్మ, నాన్నలను ఎంతో ఆదరంగా చూశారు. ఆయనకు భారత భాగవత పురాణాలు చదవటం, ఇతరులకు తన ఇంటి ముందు చదివి వినిపించి వ్యాఖ్యానించడం అలవాటు. ఆయన వద్ద పద్యం నడకను మా నాన్న నేర్చుకున్నాడు. అప్పుడాయన వయస్సు 30 సంవత్సరాలు. కొద్ది సంవత్సరాల తర్వాత జమీందారీ రద్దు ఆయన తర్వాత అన్నదాత దంపతులు తమ స్వగ్రామం చిరమనకు వెళ్లి స్థిరపడ్డారు. వారికి పిల్లలు లేరు.

తదనంతరం మా నాన్న మా యింట్లో తాను భారత భాగవతాలు సాయంకాలాలు చదువుకంటూ, వాకిటి ముందు వచ్చిన వారికి ఆ పద్యాల భావం చెప్పేవారు. పద్యం రాగయుక్తంగా చదివేవారు. నేను గర్భస్థ శిశువుగా ఆ పురాణాలు ప్రహ్లాదుని వలె విన్నాను. అలా శ్రుత పాండిత్యం అబ్బింది. మా కుటుంబ పరంపరలో కవిత్వ పాండిత్య సాంప్రదాయం లేకపోయినా తర్వాతి కాలంలో నేను అష్టావధానిని కావడానికి అది బీజ ప్రాయమైంది. మా నాన్న ఆకాశవాణిలో వచ్చే హరికథలు రాత్రి 10 గంటల దాకా మేల్కొని వినేవారు. పద్యం వినగానే అది చంపకమాల లేదా మత్తేభమో చెప్పగలిగేవారు.

మా అమ్మ శారదాంబ తమిళనాడుకు చెందినది. ఆమె డి.కె. పట్టమ్మాల్ వంటి సంగీత విద్వాంసుల కచేరీలు చిన్నతనంలో వాళ్ల నాన్న పద్మనాభయ్యతో కలిసి వెళ్లి విన్నది. స్వరాలు నేర్చుకొంది. ఐదవ తరగతి దాకా చదివింది. సంగీతం వినికిడి జ్ఞానం. మా ఊరు దేవాలయం రామాలయంలో కల్యాణానంతరం, ఏకాంత సేవలో పాటలు పాడేది. నాదస్వర విద్యాంసులు పాడే పాట ఏ కీర్తనో చెప్పగలిగేది. ఐదుగురు అక్కచెల్లెళ్లు ఒక అన్నయ్య ఆమె బంధువర్గం. మా నాన్నా వాళ్లు పది మంది సంతానం.

ఆలయ సంపద:

మా వూరిలో ధ్వజస్తంభంగల ప్రాచీన శివాలయం వుంది. ఆలయం ముందు ఒక శాసనం కూడా చెడిపోయి వుంది. విశాల ప్రాంగణం. దాని పక్కనే హనుమ మందిరం. శివాలయం వాకిటి ముందు వీరభద్రాలయం. ఆలయం లోపల పెద్ద మారేడు చెట్టు. మా నాన్న ప్రతి శివరాత్రికి ఆ మారేడు దళాలు ఒక కూలీని పెట్టి కోయించి రెండు బస్తాలకు నింపి మా బాబాయికి కరవది శివాలయంలో అర్చనకు అల్లూరు రోడ్డు రైల్వేస్టేషన్‌కు బండిలో తీసుకొని వెళ్లి పార్సల్‌లో వేసి వచ్చేవారు. అలా 40 సంవత్సరాలు స్వయంగా పంపగలిగారు.

శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరిపేవారు. శివార్చకుడి పేరు శివయ్య. ఆయన మా నాన్నకు వరసకు మామ. ఇద్దరూ రోజూ కలిసి ఒకరి నొకరు సరసాల మాటలతో పలకరించుకొనేవారు. రోడ్డుకు ఇటువైపున రామ మందిరం. దానికి  ధ్వజస్తంభం లేదు. జూటూరు వెంకట సుబ్బయ్య 60 సంవత్సరాలు ఆ మందిర పూజారి. ఆయన మా వివాహం కూడా 1969 మే లోన బిట్రగుంటలో జరిపించారు. ఆయన తర్వాత ఆయన రెండో కొడుకు వేణుగోపాల్ ఆలయ పూజారిగా 30 ఏళ్లు  సేవలందించాడు. అతని అన్న వెంకటేశ్వర్లు, నేను కలిసి తిరుపతిలో 1965-66 చదువుకన్నాం. నేను ఏం.ఏ. తెలుగు, అతడు బి.ఇ.సివిల్ చదివాడు. ఇద్దరం కలిసి ఒక్క రూంలో ఉన్నాం.

పోలేరమ్మ గుడి, అంకమ్మ దేవాలయం పల్లె ప్రజలకు ఆలయ సంపద. పొంగళ్లు నైవేద్యంగా  సమర్పించేవారు. గణాచారి మధ్యలో వచ్చి ఏవో కోర్కెలు కోరేది. ఆమెను శాంత పరిచేవారు. ఏటా ఒక వ్యక్తి గణాచారి అవతార మెత్తి శివాలు చేసేది. గ్రామంలో వడ్రంగి కుటుంబాలు రెండు, కంసాలి కుటుంబాలు రెండు, నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఒకటి, ఐదారు చాకలి కుటుంబాలు గ్రామస్థులకు వివిధ సేవలందిచేవారు. సంవత్సరాంతంలో వారికి వార్షిక జీతాలిచ్చేవారు. ఏ విధమైన గొడవలు ఉండేవి కావు.

పశువులు పొలాలపై పడి పంట నష్టం చేస్తే బందెల దొడ్డికి తోలేవారు. జరిమానా చెల్లించి విడిపించుకొనేవారు. చెప్పులు కుట్టేవారు సంవత్సరానికొక జత తెచ్చి యిచ్చేవారు. ఏదైనా పశువు చనిపోతే దాని కళేబరం తీసకెళ్లి దహనం చేసేవారు. ఎవరైనా మరణిస్తే వల్లకాడు ఊరి చివరలో వుండేది. పక్కనే కోనేరు. వర్షాకాలంలో చెరువునిండి కాలువలు పారితే ఊరంతా కట్టగట్టుకొని వెళ్లి ఇసక బస్తాలు అడ్డుకట్ట వేసేవారు. కట్టమంచి రామలింగారెడ్డి వ్రాసిన పద్యకావ్యం ‘ముసలమ్మ మరణం’ ఈ సందర్భంలో గర్తుకు వస్తుంది. చెరువు కట్ట తెగిపోతే బసిరెడ్డి కోడలు ‘ముసలమ్మ’ తాను ఆ గండికి అడ్డంగా పడుకొని గ్రామం కొట్టుకొని పోకుండా త్యాగం చేసి ధన్యాత్మురాలైంది.

గ్రామంలో ఏదైనా పొరబాటు జరిగితే పెద్ద రెడ్డి పంచాయితీ చేసి శిక్ష విధించేవాడు. 1970 వరకు ఇది చెల్లుబాటులో వుంది. 1952లో ఎన్నికలు జరిగాయి. పంచాయితీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఆములూరు వెంకటసుబ్బయ్య ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్‌లు మారినా మా నాన్న 30 ఏళ్లు పంచాయితీ లెక్కల అకౌంటెంట్‌గా చేశారు. దస్త్రాలు మా యింట్లోనే వుండేవి.

అమ్మవొడి – అమ్మబడి:

మా అమ్మ శారదమ్మ ఊళ్లో చిన్నా పెద్దకు తలలో నాలుక. వాళ్ల కష్ట సుఖాలు ఆమెకొచ్చి చెప్పుకొనేవారు. ఆమె వారికి ఓదార్పు మాటలు చెప్పేది. శారదక్కా కాంతమామ అంటూ చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు వాకిట ముందు కూచుని కబుర్లు చెప్పేవారు. అమ్మ ఉదయమే స్నానం చేసి తులసి కోట ప్రదక్షిణం చేసి నెత్తిన నీళ్లు చల్లుకొని పనులు మొదలు పెట్టేది. మధ్యాహ్నంలోపు వంట కాగానే పూజ గదిలో నైవేద్యం పెట్టేది. మా పెదతల్లి సంతానం ముగ్గురు మాయింట్లోనే పెరిగారు. అందులో ఇద్దరు అక్క చెల్లెళ్లు. వారి వివాహలయ్యే వరకు ఆమె క్రమ శిక్షణలోనే పెరిగారు.

సాయంకాలం దీపాలు పెట్టగానే ఏడెనిది మంది రెడ్ల కూతుళ్లు మా అమ్మ బడిలో పాఠాలు చెప్పించుకొని చదువుకొనేవారు. వారికి వివాహాలయ్యేంత వరకు ఆమె మార్గదర్శకురాలు. ఎప్పుడైనా నేను చిరుతిండి కావాలని అడిగితే ఆమె పిల్లి నడిగి తెచ్చియిస్తానని చెప్పి తినుబండారాలు అందించేది. వ్యవసాయ పనులలో సేద్యగానికి, కూలీలకు పొద్దుట చద్దన్నం తప్పనిసరి. కోతలు, నాట్లు జరిగేటప్పుడు 30 మంది కూలీలకు వంటలు ఆమె ఆధ్వర్యంలో ఇంట్లనే జరిగేవి.

నా చదువు:

నేను నాలుగో తరగతి వరకు అంటే 1955 ఏప్రియల్ వరకు మా ఊరి స్కూలులో చదివాను. మా బాబాయి వెంకటప్పయ్య మా భవిష్యత్ తీర్చిదిద్దిన ప్రముఖ వ్యక్తి. ఆయన ఇంటర్ మీడియట్ చదువుతుండగా డబుల్ టైఫాయిడ్ వచ్చి చెవులు పాడయ్యాయి. రామకోటి పుస్తకాలు కోటిన్నర నామం వ్రాసి ధన్యుడయ్యాడు. గుంటూరు రామనామక్షేత్రానికి ఏటా చందాలు వసూలు చేసి డిసెంబరు నెలలో ఉత్సవాలకు వెళ్లి రాముని సేవించుకొనేవాడు.

మా బాబాయి బుచ్చిరెడ్డిపాళెం హై స్కూలులో  S.S.L.C. (11 class) చదివాడు. ఆయనకు అక్కడ అధ్యాపకులు పరిచితులు. అప్పట్లో డబుల్ ప్రమోషన్ వ్యవస్థ ఉండేది. 1955 మే లో నా చేత ఒక వ్రాత పరీక్ష రాయించి నాలుగో తరగతి నుంచి ఏడో తరగతిలో చేరే అవకాశం కల్పించాడు. అంటే నేను 5,6 తరగతులు చదవలేదు. మా సోదరుడు హరనాధ్ 5వ తరగతి ప్యాసయి అదే సంవత్సరం నాతో బాటు 7వ తరగతిలో చేరాడు, బుచ్చిరెడ్డిపాళెం హైస్కూలు అతి ప్రాచీనం.

1955 జూన్‌లో ఆ పాఠశాలను దొడ్ల లక్ష్మీనరసారెడ్డి దాతృత్వంలో నిర్మించిన నూతన భవనాలలోకి మార్చారు. డబుల్ ప్రమోషన్‌కు సరిపడేలా నా వయస్సు రిజిష్టర్‌లో రెండేళ్లు ఎక్కవ పడి నేను 1945 ఫిబ్రవరి 9న జన్మించనట్లు నమోదైంది. రెండేళ్ల ముందే 58 ఏళ్లకే రిటైరయ్యాను. అదొక అనుభూతి. ఏతా వాతా నా బల్యం సజావుగా మా ఊళ్లో కొనసాగింది.

Exit mobile version