Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గోదారి గంగ

[శ్రీమతి మణి వడ్లమాని గారు రచించిన ‘గోదారి గంగ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రైలు గోదావరి నది వంతెన మీద నుంచి వెళ్తున్నప్పుడు, పార్వతమ్మ కింద చూసింది. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిని చూడగానే ఆమె మనసు ప్రశాంతంగా మారింది. ‘అమ్మా తల్లి, గోదావరి! నువ్వు ఎంత గొప్పదానివి! నువ్వు నా కలలను నెరవేరుస్తున్నావు’, అని ఆమె మనసులో అనుకుంది.

రైలు దిగిన తర్వాత, పార్వతమ్మ తన తోటి ప్రయాణికులతో కలిసి పుష్కర రేవు దగ్గరకు వెళ్ళింది. అక్కడ అద్భుతమైన వాతావరణం ఉంది. దీపాలు, భజనలు, భక్తుల సందడి, అన్నీ కలిసి ఆమెకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. “ప్రయాణం జీవితాన్ని అనుభవించడానికి ఒక గొప్ప మార్గం,” అని ఎప్పుడో చదివిన వాక్యాలు గుర్తుకొచ్చాయి.

ఈ ప్రయాణం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అప్పుడు ఆమెకు తెలియదు.

***

ఓవైపు గలగలా గోదారి, మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని గొడుగులు పాతినట్టుగా ఆకాశంలో పచ్చని కొబ్బరి చెట్లు.. మధ్య మధ్యలో అరటి చెట్లు, అల్లంత దూరాన సరిహద్దులుసైనికుల లా పొడవాటి తాడిచెట్లు, పచ్చని పొలాలకి పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూల మొక్కలూ, పళ్ళ చెట్లతో ఉన్న ఆ అగ్రహారంలో ఓ చిన్న పెంకుటిల్లు.

పార్వతమ్మ. ఆమె జీవితం మూడు వంతులు ఆ ఇంట్లోనే గడిచిపోయింది. భర్త చిన్నతనంలోనే చనిపోయినా, ఆయన జ్ఞాపకాలను, ఆయన మాటలను ఆమె హృదయంలో దాచుకుంది.

ఆయన ఎప్పుడూ గోదావరి పుష్కరాల గురించి గొప్పగా చెప్పేవారు. “పార్వతీ, ఈ మాటు పుష్కరాలకు వెళదాం. గోదావరిలో స్నానం చేసి వద్దాం. ఆ మహాత్మ్యం చాలా గొప్పది,”

అది విన్నప్పుడల్లా అతనితో వెళ్ళాలని ఉండేది కానీ, ఆయన మిగతా పురోహిత బృందంతో వెళ్ళడం వల్ల ఆమెకి కుదిరేది కాదు.

ఇంటికి ఆమెకి పుస్తె. ఇంట్లో అత్తగారు మావగారు, రోగిష్టి ఆడపడచుతో పాటుగా ముగ్గురు పిల్లలు.

అలా మూడువంతుల జీవితం గడిచి పోయింది ఆమె కోరిక నెరవేరకముందే భర్త కాలం చేశారు.

పిల్లలు పెరిగి పెద్దయి చదువులు పెళ్ళిళ్ళు ,చేసుకుని ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు. బుద్ధి పుట్టినప్పుడు వచ్చి తల్లిని చూసి రెండు రోజులు గడిపి వెళ్ళిపోతారు. పెద్దగ ఆస్తి అంటూ లేదు. ఒక్క ఈ ఇల్లు తప్ప.

ఆ జ్ఞాపకాలు పార్వతమ్మను వెంటాడుతున్నాయి. ఆమెకు గోదావరి నదిని చూడాలనే కోరిక తీవ్రంగా ఉంది. ఇక పుష్కరాల మాట వింటే మటుకు కళ్ళలో మాత్రం ఓ మెరుపు వచ్చేది.

ఆమెకి జబ్బు చేసినప్పుడు చివరి వాడయిన వేణు వచ్చి తల్లిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. పై వాళ్ళిద్దరూ వేరే దేశంలో ఉంటున్నారు. అప్పుడప్పుడు వీడియో ఫోన్లు చేస్తారు.

ఈ కొడుకు, కోడలుకి తను ఉన్నా కూడా లేనట్లే, మనవలు అస్సలు మాట్లాడరు. పంజరంలో పక్షి బతుకులా ఉంది. స్వేచ్ఛ లేదు. బాష రాదు. మాట్లాడటానికి ఎవరూ ఉండరు. ఎంత సేపు టీవీ చూడగలదు.

అలా ఓ రోజున యథాలాపంగా కొడుకు తెలుగు ఛానల్ పెట్టినప్పుడు చెవిలో పడింది, ఇంకో వారం రోజులలో పుష్కరాలు మొదలవుతున్నాయి, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చక్కటి ఏర్పాటు చేస్తున్నారు వగైరా.. వగైరా అంటూ వివరాలు చెబుతోంది.

అంతే, అప్పుడే పార్వతమ్మ మనసులో ఓ ఆలోచన రూపు దిద్దుకుంది.

ఒక రోజున పొద్దున్న ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక, తన బట్టలు ఒక బాగ్ లో పెట్టుకుని, అపుడెప్పుడో ఇద్దరూ కొడుకులు ఖర్చులకిచ్చిన డబ్బులు జాగ్రత్తగా చిన్న పర్సు లో పెట్టుకుని తాళం వేసి వాచ్‌మాన్‌కి ఇచ్చి, ఊరెళ్ళి పోయాను అని చెప్పమంది. వాడు అయోమయంగా తలూపాడు.

‘భగవంతుడు మన ఆశలను, ఆకాంక్షలను సృష్టిస్తాడు. మనమే వాటిని ఆచరణలోకి తీసుకురావాలి’, అనుకుంటూ తన ఆశ, పుష్కరాలకు వెళ్లడం. దానిని ఎలాగైనా నెరవేర్చుకోవాలని ఆమె నిర్ణయించుకుంది.

***

పుష్కర రేవు దగ్గర ఆమె గోదావరిలో స్నానం చేసింది. ఆ పవిత్రమైన జలాల్లో స్నానం చేసిన తర్వాత ఆమె మనసు చాలా తేలికగా, శాంతంగా అనిపించింది. భర్త కల నెరవేరినట్టు అనిపించింది. ఆమె నది ఒడ్డున కూర్చొని భక్తుల కోలాహలాన్ని, హడావిడిని ఆస్వాదిస్తోంది.

అంతలో, పక్కన ఉన్న ఒక యువకుడు, ఆమెను చూసి పలకరించాడు. “అమ్మగారూ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అలిసిపోయినట్టు ఉన్నారు. ఇక్కడ కూర్చోండి,” అని ఒక బెంచీని చూపించాడు.

తన పేరు రాము అని, ప్రసుతం రేవులో ఒక సేవా బృందంలో పనిచేస్తున్నాను అని చెప్పాడు. అతని ఆత్మీయ పలకరింపు పార్వతమ్మ హృదయాన్ని తాకింది.

“నేను ఒక పల్లెటూరి అగ్రహారం నుంచి వచ్చాను నాయనా,” నెమ్మదిగా చెప్పింది.

“మీరు ఒంటరిగా వచ్చారా? మీ వాళ్ళు ఎవరూ లేరా”

పార్వతమ్మ నుంచి జవాబు రాలేదు. ఆమె మౌనం అర్థం చేసుకుని, ఆమెకు కొంత ఆహారాన్ని, మంచినీటిని ఇచ్చాడు. “మామ్మగారు, మీరు ఆందోళన పడకండి. ఇక్కడ మీకు ఎలాంటి సహాయం కావాలన్నా, మేము ఉన్నాం,” అని భరోసా ఇచ్చాడు.

అప్పడే అక్కడున్న ఆశ్రమం గురించి చెప్పాడు.

మోక్షాన్ని కోరుకునే వారికి. అది పొందడం కోసం తమ జీవితపు చివరి రోజులను కాశీలో గడపాలని అనుకుంటారు కదా! అంతటిది కాకపోయినా ఈ గోదావరి తీరంలో ఒక మహానుభావుడు ఒక ఆరు గదుల ఇల్లుని ఇలాంటి వాళ్ళ కోసం నడుపుతున్నారు. అందరూ కాశీకి వెళ్లలేకపోవచ్చు కాబట్టి ఈ అఖండ గోదావరి తీరంలో కూడా అంతే మోక్షం లభిస్తుందనే భావంతో ఏర్పాటు చేసారని చెప్పాడు.

వారణాసిలో మరణించి, దహన సంస్కారాలు జరిపితే, కర్మ సిద్ధాంతం వల్ల కలిగే జనన, జీవిత, మరణ, పునర్జన్మ అనే ప్రాపంచిక చక్రం నుండి విముక్తి లభిస్తుందని అంటారు.

అయితే అంతకు మించినది ఈ పవిత్ర తీరం, రేవా నది తీరాన తపస్సు చేస్తే ముక్తి. గంగా తీరాన మరణిస్తే ముక్తి. కురుక్షేత్రంలో దానం చేస్తే ముక్తి. కానీ గోదావరిలో స్నానం చేస్తే ఈ మూడు పుణ్యాలు ఒకేసారి లభిస్తాయి అని అగ్రహారంలో గుడి పూజారి గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. పార్వతమ్మకు . అందుకే అక్కడ ఉంటూ తన చివరి రోజులు గడపాలని నిశ్చయం చేసుకుంది.

కొంత సేపటికి సరళ అనే ఓ మధ్య వయస్కురాలు వచ్చి పార్వతమ్మ పక్కన కూర్చుని గల గల మాట్లాడసాగింది, “బామ్మగారూ, నన్ను రాము పంపించాడు. అదే ఇందాక మీతో మాట్లాడాడు, ఆ అబ్బాయి., అయినా జీవితంలో ఒక్కసారైనా మనసులో దాచుకున్న కోరికలను నెరవేర్చుకోవాలి కదా. నన్ను చూడండి, నా భర్త నన్ను వదిలిపెట్టి తన మానాన వెళ్ళిపోయారు. అందుకు నేను ఏడుస్తూ కూర్చోలేదు, పెద్దగా చదువుకోలేదు కూడా, అయినా ఈ రాము లాంటి వాళ్ళని చూస్తే, ప్రపంచంలో మంచితనం ఇంకా ఉందనిపిస్తుంది. నేను కనకపోయినా అతన్ని చూస్తే నా కొడుకు లాగే అనిపిస్తాడు. వాళ్ళ సాయం తోనే రేవు దగ్గర చిన్న పలహారాల బండి పెట్టుకున్నాను.” అని చెప్పింది.

సరళ మాటలతో ఏదో ఉత్సాహం మనసును తాకింది.

‘జీవితం అంటే నిన్నటి కలలు, నేటి వాస్తవాలు, రేపటి ఆశలు,’ అక్కడ గోడ మీద రాసి ఉన్న వాక్యాలను చదివింది..

ఆమె జీవితం ఒక కలగా మొదలై, నేడు ఒక వాస్తవంగా మారింది. అయితే రేపటి గురించి ఆమెకు పెద్దగా ఆలోచన లేదు.

అగ్రహారానికి తిరిగి వెళ్లి ఆ ఒంటరి జీవితాన్ని గడపాలని ఆశ అస్సలు లేదు. ఆమె మనసులో కొత్త ఆలోచనలు, కొత్త ఆకాంక్షలు కలిగాయి. గోదావరి నది ఒడ్డున ఆమె ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంది.

అందుకు రాము, సరళలు ఆమెకు చాలా సహాయం చేశారు. ఆమెకు ఉండటానికి ఒక చిన్న గది ఏర్పాటు చేశాడు. సరళ ఆమెకు తోడుగా ఉంది. పార్వతమ్మ ఆ రోజు సాయంత్రం గోదావరి గట్టున నిలబడింది. అస్తమిస్తున్న సూర్యుడి కాంతులు గోదావరిలో అరుణ వర్ణంలో మెరిసిపోతున్నాయి. ఆమె కళ్ళలో కొత్త ఆనందం, కొత్త ఉత్సాహం కనిపించాయి.

‘ఈ గోదావరి నది, ఈ పుష్కరాలు నాకు ఒక కొత్త మార్గాన్ని చూపించాయి’ అనుకుంది. తన చివరి ప్రయాణం, మోక్షం వైపు అని అర్థమయింది.

***

నిండు పున్నమి, జలతారు వెన్నెల, ఆకాశమంతా పరుచుకుంది. గోదారి గంగమ్మ పరవళ్ళు తొక్కుతోంది.

ఆడ మగ తేడా లేకుండా పుష్కర యాత్రికులు నదిలో దీపాలు వదులుతున్నారు. అఖండ గోదావరి నిండా దీపాలు, ఒక దాని వెంట ఒకటి, మరి కొన్ని ఒకదాని పక్కన ఒకటిగా నీటి తరంగాల పైన తేలుతూ వెళుతున్నాయి. గోదారమ్మకి నక్షత్ర హారతి ఇస్తున్నట్లు నదిలో దీపాలు. ఆ తళుకులతో పాటు నింగి నుంచి ఆకాశ తారల మెరపులు కూడా పోటీ పడుతున్నాయి.

Exit mobile version