[శ్రీమతి శారద (బ్రిస్బేన్) రచించిన ‘గోడలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“ఈ బ్రిస్బేన్ నగరంలో పెద్ద చలి వుండదంటారు కానీ, బాగా చల్లగా వుంది కదా?” పార్కులో తన పక్కనే బెంచీ పైన కూర్చొని వున్న చైనీస్ స్త్రీతో అన్నాడు మూర్తి. ఆమె ఎప్పట్లానే ఒక నవ్వు నవ్వింది.
‘ఈమెతో ఇదొక హాయి. మనం ఏ భాషలో మాట్లాడినా ఆమెకి అర్థం కాదు’, అనుకొని, చేతులు రెండూ దగ్గరికి లాక్కొని, “ఉహుహు..” అంటూ “కోల్డ్, కోల్డ్” అన్నాడు.
ఆమె మళ్ళీ నవ్వింది. తలతిప్పి అక్కడే ఆడుకుంటున్న పిల్లలవైపు చూస్తూ కూర్చుంది. ఆమెకి తెలుగే కాదు, ఇంగ్లీషూ రాదు. అందుకే మూర్తి ఆమెతో తెలుగే మాట్లాడతాడు.
అసలు మూర్తి పెద్దగా మాట్లాడడనీ, ముభావి అనీ అతని బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ పేరు. అటువంటిది అతనికి ఈ ఊరొచ్చిన నెల రోజుల్లోనూ అందరితోనూ మాట్లడాలనీ, అందరినీ నవ్వించాలనీ, తనూ అందరితోపాటు నవ్వాలనీ బాగా అనిపిస్తోంది, ఎందుకో మరి.
ఇక్కడికి కూతురు దగ్గర కొన్నాళ్ళుందామని వచ్చాడతను. వొచ్చిన దగ్గరినించీ కూతురు అతనితో పెద్దగా మాట్లాడడానికి కానీ, అతని మాటలు వినడానికి కానీ ఎటువంటి ఉత్సాహమూ చూపించడం లేదు. అతనికి ఇక్కడ ఉండాలనిపించడంలేదు. అలాగని తిరిగి హైదరాబాదు వెళ్ళాలనీ అనిపించడం లేదు.
చైనీస్ స్త్రీ అతని వైపు చూసి, నవ్వుతూ ఏదో చెప్పి లేచి నిలబడింది. వెళ్తున్నట్టు బై చెప్పి వెళ్ళిపోయింది. మూర్తి లేచి ఇంటి వైపు అడుగులేసాడు.
***
తాళం తెరిచి లోపలికెళ్ళాడు మూర్తి. ఫ్రిజ్ తెరచి తినడానికి ఏమైనా వున్నాయేమోనని చూసాడు. ఏమీ లేవు. టైమప్పుడే ఆరున్నర కావొస్తుంది. సుజన ఇంటికొచ్చే సమయం. ఆకలి మీదొస్తుందేమో, పాపం. టమాటాలూ, కరివేపాకు, పచ్చి మిరపకాయలూ తీసుకొని నెయ్యీ, జీడిపప్పులూ వేసి ఉప్మా చేసి హాట్ పాక్‌లో వేసి వుంచాడు.
సుజన పావుగంట తరవాత వచ్చింది. ముఖం కడుక్కొని, బట్టలు మార్చుకొని వొచ్చింది.
“నాన్నా, రాత్రికి వంటేం చేయమంటావ్?”
“నేనే చేసి పెట్టా. టమాటా బాత్! నువ్వెప్పుడంటే అప్పుడు తిందాం.”
“వుప్మానా?” నీరసంగా అంటూ హాట్ పాక్ మూత తెరిచింది సుజన.
“వుప్మా తినాలని లేదా సుజీ? త్వరగా అయిపోతుందని చేసా! పోని రెండు రొట్టెలో దోసలో వేసి తేనా?” ఆత్రంగా లేచాడు మూర్తి. నవ్వొచ్చింది సుజనకి.
“వొద్దులే నాన్నా. వుప్మా మంచి వాసనొస్తూ వుంది. రా, ఇద్దరమూ కలిసి తిందాం.” మంచి నీళ్ళు గ్లాసుల్లో పోస్తూ అంది. కూతుర్నించి ఆ మాత్రం సామరస్యానికే పొంగిపోయాడు మూర్తి. గబ గబా వంటింట్లోకి వెళ్ళి రెండు పళ్ళాలూ, ఫ్రిజ్ లోనుంచి పెరుగు డబ్బా, నిమ్మకాయ పచ్చడి సీసా తెచ్చి పెట్టాడు.
“వుప్మాలోకి నిమ్మకాయ ముక్క బాగుంటుంది, తిను,” అని కూతురి పళ్ళెంలో వేసాడు. మౌనంగా తలొంచుకొని ఫోన్‌లోకే చూస్తూ ఉప్మా తింటూ వున్న కూతురి వైపు కాసేపు చూసి నిట్టూర్చాడు మూర్తి.
“సుజీ, ఎప్పుడూ ఆ ఫోన్ పట్టుకోకపోతే కాసేపు నాతో మాట్లాడొచ్చుగా!” బాధగా అన్నాడు. ఒక్క క్షణం తండ్రి మొహంలోకి చూసి ఫోన్ పక్కన పెట్టేసింది సుజన.
“చెప్పు, అఫీసు విశేషాలేంటి?” ఉత్సాహంగా అడిగాడు.
“ఏముంటాయి నాన్నా? మామూలు పనే!” అంతే నిరుత్సాహంగా అంది సుజన.
“అవునూ, నీతో పని చేస్తాడే, ఆ అబ్బాయి, అతని పేరేమిటాబ్బా! ఆ, అదే, కుమార్! అతన్ని ఒకసారి మన ఇంటికి రమ్మనొచ్చుగా!”
“ఆ, రమ్మంటాలే. భార్యనీ పిల్లాడినీ తీసుకొచ్చి పరిచయం చేయమంటా, సరేనా” విసురుగా అంది. మూర్తి మొహం వెల వెలా పోయింది. అంతలోకే సుజనకి తండ్రి మీద పుట్టెడు జాలేసింది. ఆయన ఆత్రమేంటో, బాధేమిటో తనకి బాగానే తెలుస్తున్నాయి. పాపం, తండ్రి ప్రాణం.
చిన్నప్పుడు ఏమీ మాట్లడకుండా, గంభీరంగా వుండే తండ్రి ఇప్పుడు అ మౌనాన్ని తనే పగలగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ, తనకే ఇప్పుడాయనతో ఏమీ మాట్లాడాలనిపించడంలేదు.
తన పెళ్ళి చేసి ఆస్ట్రేలియా పంపినప్పుడు పైకేమీ చూపించలేదు కాని సంతోషపడ్డట్టే కనిపించాడు. చిన్నప్పణ్ణించీ ఆయనతో కంటే అమ్మతో మాట్లాడడమే తనకి అలవాటు. కానీ, యేడాది క్రితం అమ్మ పోయినదగ్గరినించీ, ఆయన తనకి అమ్మ లేని లోటు తెలియకుండా వుంచాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.
ఆరునెలల కింద తనూ వినయ్ విడాకులు తీసుకుంటున్నామని చెప్పగానే ఆయన విలవిలలాడిపోయారు. వెంటనే “నిన్ను చూడాలని వుంది సుజీ” అని రెండు రోజుల్లో విమానమెక్కి హైదరాబాదు నుంచి బ్రిస్బేన్ వచ్చారు. ఆయనకి తన విడాకుల గురించి మాట్లాడాలని వుంది, కానీ ఆ ప్రసక్తి ఎత్తాలంటే భయంగా కూడా వుంది. చిన్నప్పుడు తను ఆయన్ని చూసి భయపడితే, ఇప్పుడు ఆయన తనని చూసి భయపడుతున్నారు. నవ్వొచ్చినంది సుజనకి.
ఉప్మాలో పెరుగు వేసుకుంటూ అంది,
“నాన్నా, ఆస్ట్రేలియా అంతా తిరిగి చూడాలని అనుకున్నావుగా? చూసొస్తావా? పోనీ ముందుగా, రేపు బ్రిస్బేన్ చూసొస్తావా?” ఉత్సాహం తెచ్చిపెట్టుకుంది.
“రేపు శనివారం. నువ్వూ ఇంట్లోనే వుంటావు. నేనే సైట్ సీయింగుకీ వెళ్ళను. తరవాతెప్పుడైనా చూద్దాం లే!”
భర్తతో కూతురు హాయిగా కాపురం చేసుకుంటూ వున్న ఆస్ట్రేలియా చూడాలని అనిపించిన మాట నిజమే. కానీ, విడాకులతో తన కూతురి మనసు నొప్పించే ఆస్ట్రేలియా చూడాలన్న ఆసక్తి ఏమాత్రమూ లేదు తనకి. మూర్తి ఆలోచనల్లో వుండగానే, సుజన తినడం ముగించి, “నిద్రొస్తూంది నాన్నా” అంటూ గదిలోకెళ్ళి తలుపేసుకుంది.
***
“అవును సూరమ్మ గారు! సుజీ చిన్నప్పుడు నేను వాళ్ళిద్దరితో ఎక్కువగా మాట్లాడేవాణ్ణి కాదు. కానీ ఆ తప్పుకింకా శిక్ష వేయాలా నాకు చెప్పండి?”
మర్నాడు పార్కులో చైనీస్ స్త్రీతో అన్నాడు మూర్తి. ఆమెకి తన నానమ్మ సూరమ్మ గారి పేరు పెట్టుకున్నాడు మూర్తి. ఆవిడ ఎప్పట్లాగే నవ్వు ముఖంతో చూస్తూ కూర్చుంది.
“అసలు నేను సహజంగానే ఎక్కువగా మాట్లాడేవాణ్ణి కాదు. సుజన వాళ్ళమ్మ వసంత, మనిషి మంచిదే పాపం. కానీ, ఆమెకి నేనసలు ఏ మాత్రం నచ్చలేదు.
ఏదో బంధువుల పెళ్ళిలో నన్నూ, నా ఉద్యోగాన్నీ చూసి ముచ్చట పడి, కూతురితో పెళ్ళి ప్రస్తావన మా అమ్మ దగ్గరికి తెచ్చారు మా మామగారు. కనీసం తన కూతురి ఇష్టాయిష్టాలు కనుక్కోకుండా, మా అమ్మతో మాట్లాడి సంబంధం స్థిరపర్చారాయన. చిన్నప్పుడే నాన్న పోతే నన్నూ నా చెల్లినీ కష్టపడి పెంచింది అమ్మ. ఆమె మాట కాదనలేక వసంతని పెళ్ళి చేసుకున్నాను. వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబమైతే మా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వున్నారు. మా ఇద్దరి కుటుంబ నేపథ్యలూ, మనసులూ, అభిరుచులూ ఏవీ అసలే మాత్రం కలవలేదు. అది ఇద్దరికీ మొదట్లోనే అర్థమైపోయింది.
నేను తన అంతస్తుకి తగనన్న అతిశయం వసంతలో వుందేమోనన్న అపోహలో, నేను చేస్తున్న వుద్యోగం వదిలి వ్యాపారం మొదలుపెట్టాను. ఆ వ్యాపార ప్రపంచం నన్ను కాళ్ళూ చేతులూ కట్టేసి తన లోపలికి ఈడ్చుకెళ్ళింది. డబ్బుతో నాకూ వసంతకీ మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాననుకున్నాను. తరవాత ఆలోచిస్తే అనిపించింది. డబ్బుతో ఆమె గౌరవాన్ని సంపాదించడం కంటే, ప్రేమతో ఆమె మనసు గెలుచుకునే ప్రయత్నం చేసి వుండాల్సిందేమో.
తననించి తప్పించుకొని తిరగడానికే నేను డబ్బు సంపాదన అనే వ్యాపకం పెట్టుకున్నానని వసంత అర్థం చేసుకుంది. రెండు వేర్వేరు భాషల్లో మాట్లడుకునే అపరిచితుల్లా ఇరవై యేళ్ళు ముభావంగానే కాపురం చేసి ఒక పిల్లనీ కన్నాం. మా ఇద్దరి మౌనం, మనసులేని సంసారంలో మేం పెంచామో, అదే పెరిగిందో, పాపం.
చదువైతే బాగానే చదువుకుంది. నాలుగేళ్ళ కింద మంచి సంబంధమనుకోని వినయ్ కిచ్చి పెళ్ళి చేసాం. ఇద్దరూ ఇక్కడి కొచ్చారు. పిల్ల ఇక్కడికొచ్చేసింతరవాత మా ఇద్దరినీ భయంకరమైన ఒంటరితనం చుట్టుముట్టింది. ఇద్దరం కొంచెం మొహమాటంగా ఒకరి కొకరం దగ్గరవడానికి ప్రయత్నిస్తూ వుండగానే వసంత కేన్సర్ బారిన పడింది. పెద్దగా కష్టపడకుండా ఒక యేడాది క్రితం పోయింది. ఇన్నేళ్ళూ మనసుల చుట్టూ అర్థం లేని గోడలు కట్టుకోని బ్రతుకంతా వ్యర్థం చేసుకున్నాం అనిపించింది నాకు వసంత పోయాక.
తల్లి పోయినప్పుడు హైదరాబాదుకొచ్చిన సుజన, తనూ వినయ్ విడాకులు తీసుకుంటున్నట్టు చెప్పింది. మా ఇద్దరి నిస్సారమైన బ్రతుకులు చూసి సుజీకి ప్రేమ మీదా, పెళ్ళి మీదా నమ్మకం పోయిందేమో మరి.
కూతురింటికొచ్చి, మనవలూ, మనవరాళ్ళతో నా మనసులోని ఒంటరితనాన్ని పోగొట్టుకుందామనుకుంటే ఇలాగైంది. ఒంటరిగా దాని మనసెంత బాధ పడుతుందోనని, ఉండబట్టలేక ఈ వూరొచ్చా. వస్తే, పిల్ల ఒక్క మాటైనా మాట్లాడదండీ! దానికంటే మనిద్దరమే నయం! మనకి వొచ్చిన భాషలో యేదో మాట్లడేసుకుంటాం. అర్థమవనీ, కాకపోనీ.
ఇప్పుడు నేనేం చెప్పబోయినా నా వంక విచిత్రంగా, అపనమ్మకంగా చూస్తుంది. ఇద్దరికిద్దరమూ ఒంటరిగా, నేనెందుకిక్కడ వున్నానో నాకే తెలియదు. వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నాను.”
మూర్తి మాటలాపి నిట్టూర్చాడు. చైనీస్ స్త్రీకి అర్థమైందో కానీ, అతని చేతి మీద సానుభూతితో తట్టింది. మూర్తి సర్దుకొని లేచి నిలబడ్డాడు.
***
ఎంతకీ నిద్ర పట్టక, ఊరికే పక్క మీద దొర్లడం విసుగనిపించింది సుజనకి. లేచి షెల్ఫులోంచి ఒక పుస్తకం అందుకొని లైటేసుకొని కూర్చుంది. కళ్ళు ఏదో లైన్ల వెంట పరుగులు తీస్తున్నాయి కానీ, మనసులోకెమీ యెక్కుతున్నట్టు లేదు.
ఏదో అర్థం లేని ఆలోచనలూ, వాటి వెంట తెలియని ఆవేదనా కమ్ముకుంటున్నాయి ఆమెని. ఎప్పుడూ లేనిది తండ్రిని చూస్తే ఇవాళ ఆమెకి జాలి లాటిది కలిగింది.
***
సాయంత్రం ఏడింటికి తను ఎప్పట్లాగే అలసటగా ఇంట్లోకొచ్చింది. టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తున్న నాన్నని చూసి నవ్వింది తను. ఆయన ఎప్పట్లా నవ్వుతూ పలకరించలేదు.
తను గదిలోకెళ్ళి బట్టలు మార్చుకోని వంటింట్లోకి వెళ్ళి చూసింది. తండ్రి వంటేమీ చేసినట్టు కనిపించలేదు. ఆకలేస్తున్నట్టనిపించింది.
“నాన్నా! ఆకలేస్తోందా? వంటేం చేయను?” వంటింట్లోంచే అడిగింది.
“వంటా? ఏమొద్దులే అమ్మా! బ్రెడ్డూ టోస్టు చేసుకొని తినేద్దాం!” నిరాసక్తంగా అన్నాడాయన. ఆయనకి బ్రెడ్డంటే ఎంత అయిష్టమో తనకి తెలుసు.
“అబ్బా! బ్రెడ్డు బొర్ నాన్నా! నువ్వలా టీవీ చూస్తూ కూర్చో, అరగంటలో వంట చేసేస్తా”.
వంటింట్లో కెళ్ళి అరగంటలో నిమ్మకాయ పుళిహోరా, పెరుగన్నమూ, కొంచెం వెజెటెబుల్ సలాడ్ చేసి టేబుల్ పైన సర్దింది.
“నాన్నా! రా, అన్నం తిందాం. ఆకలేస్తుంది,” పిలిచింది. టీవీ కట్టేసి వొచ్చి కూర్చున్నాడు తండ్రి. గిన్నెల పైన మూత తెరిచి చూస్తూ,
“అరె, నిమ్మకాయ పుళిహోర! నాకిష్టమని భలే గుర్తు పెట్ట్కున్నావే సుజీ!”
తనూ ఆశ్చర్యపోయింది. నిజమే, నాన్నకి ఇష్టమైన వంట తనకి ఎక్కడో గుర్తుంది.
“నాన్నా, ఏమిటివాళ విశేషాలు? “
ఎప్పుడూ లేనిది ఆయన మౌనంగా భోజనం చేస్తూ వుండడంతో తనే మాట్లాడించింది.
“ఏముంటాయి? ఏమీ లేవు.”
“పార్కుకెళ్ళలే?”
“వెళ్ళాను కానీ, వర్షం పడేలా వుండడంతో తొందరగా వొచ్చేసాను.”
ఆయన మాట్లాడుతూవుంటే చిరాగ్గా అనిపించేది కానీ, ఆయన మౌనంగా వుంటే ఏదో అశాంతిగా వుంది.
“సుజీ! నేను పై శనివారం ఇంటికి వెళ్ళిపోతా నాన్నా. రేపు ఇంటర్‌నెట్‌లో నా టిక్కెట్టు బుక్ చేసుకుంటా.”
ఆశ్చర్యపోయింది తాను.
“అప్పుడేనా? ఇంకొన్ని రోజులుండు నాన్నా.”
“ఎందుకు? వొచ్చి అప్పుడే నెల రోజులైంది.”
“అదేంటి నాన్నా? ఆరునెలల వీసా అంటే, ఆరునెలలేనా? కనీసం యేడాది వుండాలనుంది నాకు, అన్నావు. నెల రోజులకే వెళ్తావా?”
“అనుకున్నా కానీ, వెళ్ళిపోతాలే. ఇక్కడ చలి బాగా వుంది. బోరు కొడుతోంది.” చిన్నపిల్లాడిలా అంటున్న ఆయనని చూసి నవ్వొచ్చింది.
“సరే, తరవాత ఆలోచిద్దాం లే,” మాట మార్చింది.
***
నిజమే, పాపం. తండ్రికి చాలా దిగులుగా, ఒంటరిగా అనిపిస్తూ వుందేమో. చిన్నప్పణ్ణించీ ఆయన తనతో కానీ, తల్లితో కానీ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కానీ ఆయన వుంటే ఏదో భరోసాగా వుండేది. ఆయనా అమ్మా చనువుగా, ప్రేమగా, హాస్యంగా మాట్లాడుకోవడం ఎప్పుడూ చూడలేదు తాను.
ప్రశాంతంగానే వున్నా, ఏదో మౌనం ఇల్లంతా బరువుగా వేలాడుతున్నట్టుండేది. అందరిళ్ళల్లో వున్నట్టు జోకులూ, నవ్వులూ, సరదాలూ, ఒకర్నొకరు వెక్కిరించుకోవడాలూ ఏదీ లేకుండా ఎక్కడికక్కడ గోడలు కట్టినట్టూ వుండేది తమ ఇల్లు. ఎందుకో అర్థం కాకపోయినా తనకి అలవాటైపోయి అదే సుఖంగా అనిపించడం మొదలైంది.
తను హైస్కూలు కొచ్చాక నాన్నకి ఏమనిపించిందో కానీ, తనతో మాట్లాడడమూ, తన అభిప్రాయాలు అడగడమూ మొదలు పెట్టాడు. కానీ, అప్పటికే తనకూ, తల్లికీ ఆయనతో చనువుగా మాట్లాడడమూ, ఆయన మాటలు వినడమూ అలవాటు తప్పిపోయాయి.
తన స్కూలు విశేషలూ, చదువు వివరాలూ అడుగుతూ వుంటే తనకేదో చిరాగ్గా వుండేది. అందుకే ఇంజినీరింగ్ చదువుకని వేరే నగరానికీ, ఆ తరవాత ఉద్యోగానికని బెంగుళూరుకీ వెళ్ళిపోయింది.
రెండేళ్ళ వుద్యోగం తరవాత, వినయ్‌ని చూపించి పెళ్ళి అన్నారు. వొద్దనడానికేమీ కారణం కనిపించక సరేనంది తను.
పెళ్ళై వినయ్‌తో కలిసి బ్రిస్బేన్ నగరానికొచ్చింది. కొన్నాళ్ళలోనే ఇద్దరికీ అర్థమైపోయింది, తామిద్దరికీ మనస్తత్వాలలోనూ, అభిరుచుల్లోనూ, అభిప్రాయాల్లోనూ ఎందులోనూ పొంతన లేదని. తనూ, వినయ్ కలిసి తమలాంటి ఇంకో కుటుంబాన్ని తయారు చేస్తామేమోనన్న భయం వేసింది. అందుకే సామరస్యంగానే విడిపోవాలనుకున్నారు.
విడాకుల ప్రోసెస్ నడుస్తూ వుండగానే అమ్మకి కేన్సర్ సోకింది. మొదటిసారి తండ్రి కళ్ళల్లో అమ్మ గురించిన ఆందోళననీ, అమ్మ తమనొదిలి వెళ్ళిపోతుందేమోనన్న భయమూ కనపడింది.
అమ్మ పోయినతరవాత తన విడాకుల సంగతి ఆయనకి చెప్పాలనిపించలేదు కానీ, చెప్పాల్సొచ్చింది. విన్న తరవాత ఆయన బాధ చూసి ఇంకా ఆశ్చర్యపోయింది.
ఈ విడాకులతో తన బ్రతుకేదో ఎడారిపాలయిందనీ, దానికి బాధ్యత తనదేననీ అనుకున్నారేమో, పాపం, వొచ్చిన దగ్గరినించీ తనకేదైనా సంబంధం కుదర్చాలనీ, అదీ తనకి తెలిసిన వారితోనే చేయలనీ ప్రయత్నం చేస్తూనే వున్నారు. తనే పెడసరం మాటలతో ఆయన్ని నిరుత్సాహ పరుస్తోంది.
చిన్నప్పుడు నాన్న తన మౌనంతో గోడ కట్టి, దానికవతలే తమని నిలబెడితే, తను ఇప్పుడు అదే గోడ కట్టి, ఆయన్ని గోడవతల నిలబెట్టింది. ఇప్పుడు ఆయన ఇండియా వెళ్ళిపోతే మళ్ళీ వొస్తారో రారో! ఇంత పెద్ద ప్రపంచంలో తామిద్దరే ఒకరికొకరు. నాన్న తప్ప తన బాగోగులూ పట్టించుకోవడానికింకో మనిషి లేదన్న ఆలోచనతో మనసు బరువెక్కింది.
నాన్నకీ అరవై దాటాయి. ఆయనకేదైనా జరిగితే, ఈ మౌనం, ఈ ఒంటరితనమూ తనని సమాధి చేస్తాయి. కనీసం తరవాత తలచుకోని సంతోషపడడానికి కాసిని మంచి జ్ఞాపకాలైనా లేకుండా, ఈ అడ్డుగోడ అవసరమా? తను ఆ గోడని కూల్చేయలేదా?
***
శుక్రవారం పొద్దున్న తండ్రికి కాఫీ ఇచ్చింది సుజన. ఆయన పక్కనే కూర్చుంది.
“నాన్నా, ఇవాళ ఆఫీసుకి సెలవు పెట్టా. ఇద్దరమూ కలిసి బ్రిస్బేన్ సిటీ అంతా తిరిగి చూసొద్దాం. “
“మరి రేపు నా టికెట్టు!”
తండ్రి మెడ చుట్టూ చేతులు వేసింది సుజన.
“వెళ్దువుగానిలే నాన్నా. తొందరేముంది, ఇంకో అయిదు నెల్లయ్యాక చూద్దాం. అన్నట్టు, కుమార్ కాదు కానీ, రవీ అనే మా కొలీగ్ రేపు రాత్రి మనింటికి భోజనానికి వొస్తాడు. వంట పనేం పెట్టుకోకు, బయటి నుంచి తెప్పించుకుందాం.”
తండ్రి మొహం నవ్వుతో వెలిగిపోయింది.
Disclaimer:
ఈ కథా నేపథ్యం గురించి నేను ప్రఖ్యాత ఆంగ్ల రచయిత్రి ‘యియుంగ్ లీ’ కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. “ఎక్కడో దూరాన వున్న తండ్రి, విదేశాల్లో వున్న కూతురి జీవితం గురించి ఆందోళన చెందుతూ వుండడం” అన్న సూత్రం ఆవిడ వ్రాసిన ‘A thousand years of good prayers’ అనే కథనుండి గ్రహించాను. అయితే ఆ ఆ ఒక్క ప్రెమిస్ తప్ప, మిగతా కథకూ, ఈ కథకూ సారూప్యమేమీ లేదు. – శారద